బ్రిలియంట్ మేకింగ్ – బ్లింక్

Spread the love

టైమ్‌ట్రావెల్ థీమ్‌తో వచ్చే సినిమాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. అయితే అర్థంకాకపోతే చెత్తగా కూడా అనిపించొచ్చు. క్రిస్టఫర్ నోలన్ ఇంటర్‌స్టెల్లర్, టెనెట్, టోనీ స్కాట్ డెజావు, తమిళ్‌లో విక్రమ్ కుమార్ 24 ఇలా చాలా సినిమాలే కనిపిస్తాయి.

తెలుగులో ఇలాంటి థీమ్‌తో వచ్చిన ఆదిత్య 369 తప్ప ఈ తరహా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ మధ్య కన్నడలో వచ్చిన బ్లింక్ మంచి టాక్‌నే తెచ్చుకుంది.

చదువు సరిగ్గా సాగక, ఇంటిదగ్గర అమ్మకి సిటీలో జాబ్ చేస్తున్నాని చెప్పి పర్ట్‌టైం జాబ్ చేసుకుంటూనే, నాటకాలమీద ఇంట్రస్ట్ ఉన్న కుర్రాడు అపూర్వ అనే కుర్రాడి కథ. (దీక్షిత్‌శెట్టి తెలుగులో దసరా సినిమాతో మనకు తెలిసినవాడే.) నాటకాలు, రోజువారీ డబ్బుల ఇబ్బందులు, ఓ గాళ్‌ఫ్రెండు ఇలా సాధారణంగా సాగిపోతున్న జీవితం ఓ అరవయ్యేళ్ల మనిషిరాకతో అతలాకుతలం అవుతుంది.
తనలాంటి మనిషే రకరకాల సంధర్బాలలో ఎదురుపడుతుంటాడు. తనలాగే తన మిత్రులదగ్గరా, ఆఖరికి తన గాళ్‌ఫ్రెండ్‌తో కూడా తిరుగుతుంటాడు. దీనంతటికీ కారణం తన దగ్గరికి వచ్చిన ఆ అరవయ్యేళ్ల ముసలాయనే అని అర్థమవుతుంది. కానీ ఎలా? ఒకరోజు ఆ ముసలాడే ఇతన్ని కలుస్తాడు. అతను చేయాల్సిన పనిని చెప్తాడు. ఓ మందు ఏదో కంటిలో వేసుకుని కాలంలోకి ఎలా ప్రయాణం చేయాలో నేర్పిస్తాడు.

ఈ అబ్బాయి తండ్రి ఎలా చనిపోయాడో ఒక మిస్టరీగా ఉందనీ, దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించమనీ ముప్పయ్యేళ్ల వెనక్కి అతన్ని పంపిస్తాడు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది… గతంలోకి వెళ్లాక కంటిరెప్ప వెయ్యకూడదు ఎప్పుడైతే కళ్లని బ్లింక్ చేస్తామో మళ్లీ వెనక్కి వచ్చేస్తామన్నమాట. ఆ ప్రయోగం మొదలు పెట్టాక భయంకరమైన నిజాలు తెలుస్తాయి. తానూ, తన గాళ్‌ఫ్రెండ్‌కి కూడా ఆ గతంతోనే సంబంధం ఉందని తెలుస్తుంది.

తన తండ్రి హఠాత్తుగా కనిపించకుండా పోవటానికి కారణం ఏమిటా అని ప్రయోగం మొదలు పెట్టిన అపూర్వ భయంకరమైన నిజాలు తెలుసుకుంటాడు. భవిశ్యత్తు, వర్తమానం, గతం అనే ఒక లూప్‌లో ఇరుక్కున్నట్టు అర్థమవుతుంది. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే తనతండ్రి అనుకుంటున్న మనిషి నిజంగా అతని తండ్రికాదు, ఇప్పుడు తాను అనుకుంటున్న ఆమె తన తల్లికాదు.
ఈ విషయాలన్నిటికన్నా…. మరో ఘోరమైన విషయం కూడా అర్థమవుతుంది. ఎక్కడా ఏ మనిషికీ జరగని తప్పు అతని జీవితంలో జరిగింది. ఇప్పుడు దాన్ని సరి చేయాలంటే అపూర్వ చనిపోవాలి, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని కూడా ఆమె పుట్టకముందే ఉన్న కాలంలో పుట్టకుండా ఆపెయ్యాలి. ఇప్పుడు అపూర్వ ఏం చేస్తాడు??? ఊహించని మలుపులతో చూస్తున్నంత సేపూ ఉత్కంఠతో కట్టిపడేసే సినిమా ఇది. 1996, 2001, 2021, 2035 కాలాన్ని చూపిస్తూ మొత్తం నాలుగు టైమ్ పీరియ‌డ్స్ నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది.

కన్నడ సినిమా ఈ మధ్యన కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాల వైపు దృష్టి పెట్టింది. ఈ ఏడాది మార్చ్‌లో మొదట కేవలం 8 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తర్వాత మౌత్‌టాక్‌తోనే ఇండియ‌న్ ఫ‌స్ట్ మ్యూజిక‌ల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్‌గా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. నిజానికి టైమ్‌ట్రావేల్ థీమ్ అంటేనే విపరీతమైన కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అర్థం చేసుకోవటానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ బ్లింక్ మాత్రం ఆ సమస్యలని దాటి చాలా క్లియర్‌గా తెరమీదకి తెచ్చారు.


శ్రీనిధి బెంగుళూరు అనే నటుడు రాసుకున్న కథ, దర్శకత్వం కూడా అతనే. చాలా హాలీవుడ్, కొరియన్ ప్రేరణలు కనపుడుతున్నా , సినిమాలో బలమైన ఎమోషన్ మనల్ని కట్టిపడేస్తుంది. సినిమాని ఇడీపస్ కాంప్లెక్స్ అనే మానసిక స్థితిని ప్రతిబింబిస్తూ, ఆ ఇడీపస్ కథతోనే సినిమాని మొదలు పెట్టడం ఒక బ్రిలియంట్ ఆలోచన. ఇండియన్ సినిమాలో ఇలాంటి థీమ్‌ని ఎంచుకోవటమే ఒక సాహసం అయితే టైమ్‌ట్రావెల్ స్టోరీని స్క్రీన్‌మీద ఇంత బాగా తీయగలగటం ఒక సక్సెస్ అని చెప్పాలి. సినిమా మొత్తానికి స్క్రీన్‌ప్లే ప్రధానమైన ప్లస్. మిగతా నటుల సంగతి ఎలా ఉన్నా… దీక్షిత్ శెట్టి, గతంలో “అరివు”గా చేసిన సురేష్ అనగలి, ప్రస్తుతంలో కనిపించే “అరివు”గా వజ్రధీర్ జైన్‌లు ఆ పాత్రలని అద్బుతంగా పోషించారు.

సినిమా… తెలుగులో కావాలనుకున్నవాళ్లకి అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *