నోరుగల్లది

Spread the love

నీకు గత్తర్రాను

నీ పీన్గెల్లా

నువ్వు బొగ్గుబండ కిందవడ

మర్నాగి మొహపోడా

శనివారంనాడు ‘కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అంటూ రేడియోలో వస్తున్న స్తోత్రం ఓవైపు, ఈ తిట్లు ఇంకో వైపు ఇనొస్తున్నయి.

పెద్దేప చెట్టు కింద నవ్వారు మంచం మీద పండుకోని పండు ఏప్పండ్ల వాసన ముక్కులనిండ పీల్చుకుంట కళ్ళు నలుముకుంట పక్కింటికేసి చూసిన.

హైమావతి ఆంటీ.

లొట్టి మీది కాకిలా వొర్లుతుంటది అని, పొద్దునలేస్తే బక్కపీసు మొగడిని తిట్టందే పొద్దుబోదు ఆమెకు అనంటరు సుట్టుపట్టోళ్ళు.

మనిషి నాలుగడుగుల రెండు అంగుళాలు ఉండొచ్చు. శాయ నలుపు. మా సింగరేణి నల్లబొగ్గులాంటి రింగు రింగుల నెత్తి తోటి ఉంటది.

ఆమె నవ్వంగా చూసినోళ్లు చాలా తక్కువమంది.

పక్కనే ఉండడం వల్ల అమాసకో పున్నానికో నవ్వే నిండు జాబిలిలాంటి ఆమె నవ్వు మా ఇంట్ల అందరికీ ఎర్కే.

అమ్మెప్పుడూ అనేది మాలక్ష్మిలాగ కళగుంటది హైమ అని.

ఆ ఇంటిగలాయన పేరు రాంబాబు. ఐదు అడుగుల ఎత్తు బక్కపల్సని పానంతో, దవడలు లోపటికి గుంజకపోయి రేపో మాపో అన్నట్టు ఉంటడు.

నెత్తి మీదున్న బరువైన బొగ్గుపెళ్ళ తట్టను కిందకి ఇసిరేసినట్టు నోటికొచ్చినట్లు మాటలు యిసురుతనే ఉంటది ఆమె.

మహానుభావుడు ఎన్నడూ నోరు తెరవడు.

ఆయనకు ఏదో మునిశాపం ఉన్నదో పాడో అనిపిస్తది మూగిలెక్క ఉండుడు చూస్తే.

ఇద్దరు ఆడివిల్లలు వాళ్లకు.

వాళ్లు గూడ పానం లేనట్టే మొహం ఈడ్స్కపోయి గాలొస్తే ఎగిరిపోతరా అన్నట్టు ఉంటరు.

పెద్ద పోరికి పదమూడు ఏండ్లు వచ్చినా ఇంకా పెద్దది గాలేదేమే అని బుగ్గలు నొక్కుకుంట అన్నది ఓసారి మా ఎదురింటి ఎంకాయమ్మ.

ఈమెకు భర్త లేడు. పిల్లలు గాలే. ఒంటికాయ సొంటికొమ్ము లెక్క ఒక్కతే ఉంటది. ఆయన ఏదో జబ్బు చేసి రెండేళ్ల క్రితమే జరిగిపోయిండు.

“అయింది.” మూతి ముప్పై తిప్పుకుంట అన్నది హైమాంటీ.

ఇచ్చంత్రం పాడుగాను. మరి దావత్ చెయ్యలే.

ఏదో హక్కులాగ అడిగింది.

హైమావతి ఆంటీ ఊకుంటదా.

“ఆ ఏం చేస్తం వదిన. వచ్చినోళ్ళు ఏమైనా సక్కగా తిని పోతరా? దాల్చాలో కారం తక్కువైంది, బగారన్నంల ఉప్పు తక్కువయింది, మటన్ ల ముక్కుడుక లేదు అని ముప్పై తీర్ల వంకలు పెడతరు.

మందితోటి ఈ మాటలుబడుడు నాకు అవసరమా వదినే. ఆ దావత్ పైసలు ఏవో పిల్ల పేర్ల బ్యాంకుల యేషిన. దాని కాలేజీ సదువుకి అక్కెరకు వస్తయి.

వెంకాయమ్మకు ఆమె సమాధానం సవ్వగ అనిపించినట్టుంది. ముక్కు, మూతి ఆడిచ్చుకుంట ఈ ముచ్చట అర్జెంటుగ ఎవరికైనా చెప్పాలనుకుని చేతులు తిప్పుకుంట ఆడికెల్లి పోయింది.

ఆ సాయంత్రం కాలరీ నల్ల దగ్గర ఆడోళ్ళందరూ స్టీలు, ఇత్తడి బిందెలు పట్టుకొని లైన్ల నిలబడ్డరు.

ఆరోజు నల్లకాడికి రానామె గురించి ముచ్చట పెట్టుకునుడు అలవాటు వాళ్ళకి.

ఇక ఆరోజు హాట్ టాపిక్ హైమావతి ఆంటీ బిడ్డ గురించి.

“ఇప్పటిదాంక మన కాలనీల ఏ ఆడవిల్ల పుష్పవతి అయినా దావత్ చేయకుండా లేము. ఫస్ట్ టైం చూస్తున్న ఈమెను. అదేంది అని అడిగితే ఎడ్డం అంటే తెడ్డం అంటుంది.”

ఎంకాయమ్మ వదలదల్సుకోలే.

దావత్ చేయకపోతే పిల్లకే అరిష్టమట.

ఎనికింటామే అందుకుంది.

మొగుడి నోట్ల నాలుక లేదు.

“సరైన బట్ట కట్టుకోదు, పిల్లలకు కూడ మంచి బట్టలేయడం ఎప్పుడు సూడలే.” అయిపోయిన నూనె ప్యాకీట్ల నీళ్ళు బోసి కిందకు మీదకు తిప్పి దాంతోటే ముక్కల పులుసు చేసే వీరమ్మ.

“ఇక వంట అంటవా, గంత పీనాసిదాన్ని నేను ఏడ సూడలే.” ఈ మాటన్న జయమ్మ పక్కింట్లో, యెనకింట్లో కూర అడుక్కోని రోజు లేదు.

“మొగని జీతమే కాదు రెండు బర్లు ఉన్నయి కదా, వాటి పాలు అమ్మితే కూడా మస్తు పైసలు వస్తయి.

కనీసం పిల్లలకు గిలాసడు పాలు కూడా పొయ్యదట.’ ఈ మాట అన్న శాంతమ్మ అన్నం వూడ్చినంక దబరా గిన్నెలో నీళ్ళు పోసి చేత్తో గట్టిగ పిండి, ఆ అన్నంలో సల్లబొట్టు పోసుకోని తింటది.

గిట్ల ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కథలు అల్లుకొని లేని హైమావతి ఆంటీ గురించి సొల్లు చెప్పుకుంటున్న సమయంలో  మొక్కజొన్నిత్తుల్లాంటి పొడుగు పళ్ళతో నవ్వుకుంట బిందె తీసుకొని వచ్చింది ఆమె పెద్ద బిడ్డ.

అందరి నోర్లు మూతపడ్డయి.

***

ఇట్లా వాడకట్టోలందరూ హైమాంటి గురించి ఎప్పుడు ఏదేదో చెవులు కొరుక్కుంటనే ఉంటరు.

ఇచిత్రం ఏందంటే మా అమ్మ తోటి మంచిగ ఉంటది ఆంటీ. అమ్మ కూడ ఏం చేసినా పిల్లలకు పెట్టు అని మా ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న సిమెంట్ గోడ మీద నుండి కోపులల్ల పెట్టి ఇస్తుండే.

నాన్న రాత్రి బజిలీ చేసి పొద్దుగాల వచ్చేటప్పుడు లేత గులాబీ రంగులో ఉండే అడవి గులాబీ మొగ్గలను తెచ్చేటోడు. ఇవి వానాకాలంలనే ఎక్కువ పూస్తుండే.

ఆరు గంటలకి గోళంల ఏస్తే మేము బడికి వెళ్లే యాలకి నోరుదెరిచి మంచిగ ఇచ్చుకుంటుండే.

తెస్తే ఒకేసారి చిన్న బుట్టడు తెస్తడు.

లేదంటే అసలు తేకపోతుండే.

రెండు రోజులు ఇల్లంతా సన్నటి మంచి వాసన పర్సుకోని ఉండేటిది.

నేను చెల్లె పెట్టుకున్నంక, హైమాంటి బిడ్డలు రమ, ఉమకి కూడ కొన్ని ఇచ్చి, మిగిలినయి బడిలో దోస్తులకు ఇద్దమని తీసుకుపోతుండే.

ఒకనాడు ముసురు పడతాందని ఏదైనా వేడివేడిగ తినాలని మేము చేసిన గోల తట్టుకోలేక చిక్కటి బర్రెపాలతోటి పాల పాయసం చేసింది అమ్మ.

ఇత్తడి కోపుల పోసుకొని కింద బండల మీద బాసింపట్లేసుకోని చెంచ తోటి ఊదుకుంట, కమ్మటి నెయ్యి, ఇలాచి వాసన పీల్చుకుంట ఈ లోకంలో నేనే అదృష్టవంతురాలని అన్నట్టు కొంచెం కొంచెం తింటున్న.

ఇంతల్నె ఒక పొడుగు స్టీల్ క్యాన్ ల పాయసం పోసి పక్కింట్ల ఇచ్చి రమ్మని చెప్పింది అమ్మ.

నోట్లేసుకుంటే కరిగిపోయే మలై పాయసం నాలుక మీద ఎక్కువసేపు ఉంటలేదు.

“ అమ్మ జెర్రసేపు ఆగినాక ఇస్తనే.” మొఖం ఇంకొంచెం గిన్నెలోకి వొంచి అన్న.

“వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలే కదనే, వేడివేడిగ తింటరు నా బంగారు తల్లివి కదా. ఒక్క నిమిషంల ఇచ్చొచ్చి తిను.” బతిమిలాడింది అమ్మ.

అమ్మకు ఎదురుచెప్పడం, మళ్లీమళ్లీ చెప్పించుకోవడం ఇష్టం లేని నేను బల్మికి అమ్మ చేతిలో పాయసం క్యాను అందుకొని ఊరుక్కుంట పోయిన.

“వేడిగుంది బిడ్డ, జర నిమ్మలంగ పో.”

 వెనుకనుంచి అమ్మ అరుపు.

హైమాంటి వాళ్ళ చెక్కగేటు తీసుకొని లోపలికి పోయి తలుపు దబదబ కొట్టిన.

తలుపు తీయలే.

మల్ల కొట్టిన.

ఏం చేయాలో పాలుబోక ఇంటిపక్క సందులకెల్లి ఎనక తలుపు దగ్గరికి పోయిన.

నేల మీద అడ్డంగా పడుకున్న హైమాంటిని కాల్తోటి ఇయ్యర బయ్యర తంతుండు రాంబాబు అంకుల్.

ఆమె నల్లటి రింగుల జుట్టును ఆయన గుప్పిట్లబట్టి మెలికలు తిప్పుతాండు.

నీకు దండం పెడతా, నన్ను ఇడ్షిపెట్టు అని బాదంతా పంటి బిగువున పెట్టుకొని మోకాళ్లు పొట్ట వరకు మడుసుకొని దీనంగ అడుగుతాంది.

ఇట్లాంటి సీన్ ఎప్పుడూ చూడని నేను భయంతోటి ఏం చేయాలో తెల్వక పాయసం క్యాన్ అట్లనే పట్టుకొని ఇంట్ల పడ్డందాకా ఎనక్కి తిరిగి సూడకుండ ఉరికిన.

చేతుల క్యాన్ తో తిరిగొచ్చిన నన్ను చూసి, “ఏమైందే ఇయ్యకుండా వచ్చినవ్. ఆంటోళ్లు లేరా?” అని అడిగింది అమ్మ.

క్యాన్ గూట్ల పెట్టి పూసగుచ్చినట్టు నేను చూసింది చెప్పిన.

ఈ ఆడోళ్ళ గోస ఎప్పటికీ తీరేటిది కాదు అనుకుంట పెరట్ల చెట్లకు నీళ్లు పోయనీకి చేతిల బకెట్ తీసుకుంది అమ్మ.

మిగిలిన పాయసం కతం చేద్దామని గిన్నె దగ్గర కూసున్న.

కండ్ల ముందట నొప్పితోటి మెలికలు తిరుగుతూ , ఒంటిమీద చీర, జుట్టు సరిగ్గ లేని హైమాంటి బాగ యాదికొస్తుంది.

ఆయన నోట్ల కెళ్ళి మాట రాదని, నోరులెవ్వదని అంటరు. మరి ఆయన కాలు, చేయి ఎందుకు  లేస్తున్నయి?

ఎవరిని అడగాలే?

కానీ ఎందుకో ఇందాకటంత రుశి లేదు పాశం.

***

తర్వాత రోజు సాయంత్రం బడి నుండి ఇంటికి తొందరగ వచ్చిన.

అమ్మ ఇంట్ల లేదు.

తలుపుకి బేడం కూడ పెట్టలేదు.

దగ్గరికి వేసి ఉన్నయి తలుపులు.

పక్కింటికి మాకు చిన్న గోడ మాత్రమే అడ్డం ఉంటది.

పిల్లలం అప్పుడప్పుడు ఆ గోడ ఎక్కి కూసునుటోళ్ళం.

గోడ మీదకెక్కి పక్కింట్లకి తొంగిచూసిన.

“ఎదల కుంపటి ఎల్లవోస్తే జర అల్కనైతది.” అమ్మ మాటలినొస్తున్నయి.

హైమాంటి ఎక్కిళ్ళు కూడ.

అటో కాలు ఇటో కాలేసి గోడ మీదనే గట్టిగ కూసున్న.

పిల్లలు పెద్దగ అయితున్నరు.

“వాళ్ల ముందు ఇట్లాంటి పంచాయితీలు అవసరమా?” మందలింపుతో అంటాంది అమ్మ.

అప్పుడు నోరిప్పింది.

“ నా అరుపులు నా ఏడుపులు నా గోల ఇదే వినపడ్తాంది మీ అందరికీ.”

ఆయన ఏం చేసిండో తెలుసా అక్క.

బాయికాడి నుంచి రోజిడిసి రోజు తిప్పనపల్లి బోయి వస్తుండు.

ఇట్ల కొన్ని ఏళ్ళ సంధి జరుగుతాంది.

నిన్న మా చిన్నమ్మ కొడుకు ఈనని తిప్పనపల్లిలో ఒక పిల్లతోటి చూశిండట.

బావకు ఇక్కడెం పని అని ఆరా తీస్తే మొత్తం విషయం బయటపడింది.

ఆ పిల్లకి ఇంకా పెళ్లి గాలేదట.

నాగ్గూడ కాలే, నిన్నే జేసుకుంట అని నమ్మిచ్చుకుంట వస్తుండట.

“మరి ఆ పిల్లకు ఎన్క ముందు ఎవరు లేరా?”

మా తమ్ముడు అప్పటికప్పుడే ఆ పిల్ల ఇంటికిపోయి మొత్తం జెప్పిండట.

ఇన్నాళ్లు ఆయన చెప్పినయన్నీ అబద్ధాలు, మోసాలు అని తెలిసి ఆయన మీద మనసుపడ్డ ఆ పిల్ల తట్టుకోలేక పురుగుల మందు తాగిందట.

ఇప్పుడు కంపెనీ హాస్పిటల్ ల చావు బతుకుల మధ్య కొట్టుకుంటాంది.

అదేమని నిలదీసినందుకు నన్ను గొడ్డును కొట్టినట్టు కొట్టిండు.

అమ్మ నిలువుగుడ్లు ఏసుకొని చూస్తాంది.

జీతం కూడా మొత్తం చేతికియ్యడక్కా

చూస్తనే ఉన్నవు కదా, ఇద్దరు ఆడవిల్లలు మానులెక్క ఎట్ల పెరుగుతున్నరో.

బరిగొడ్లను పెట్టుకొని పాలు అమ్ముకుంట కొన్ని పైసలు పక్కకువెట్టి చిట్టి ఏస్తున్న.

పోయిన నెల చిట్టి పైసలు రాంగనే ఇంట్ల పెట్టిన. పిల్ల కాలేజి ఫీజుకి అక్కరకు వస్తయని.

ఏం చేసిండో తెలుసా, ఏడాదికింద ఐదు రూపాయల మిత్తీకి లక్ష రూపాయలు కటికాయన దగ్గర తీసుకుండట. నిన్న ఆయన ఇంటికి వచ్చిండు.

సప్పుడు జేయక గుడ్ల నీరు కుక్కుకుంట ఆయన చేతిల పోసిన.

ఇంట్లకి సామాన్లు కూడ సరిగ తీస్కరాడు.

ఓపిక ఉన్న రోజు ఇంత ఉడకేసి పిల్లలకు పెడుతున్న.

ఒక్కదాన్ని ఎన్ని సక్కబెట్టాలె.

నా మంచి చెడు ఆలోచించే నీగ్గూడ నా మొగడి గురించి చెబితే పల్సన అయిపోతడేమోనని చెప్పలేదక్క.

ఎక్కిళ్ళు పడుతుంది.

నా బుర్రల యిన్ని టెన్షన్లు పెట్టుకొని ఏం చేయాలో తెలవక పొద్దీకి నోరేసుకుని అరుస్తనే ఉంటనక్క

అదుపులేకుండ, అలుపులేకుండ ఊటబాయి లెక్క ఆమె నోట్లకెల్లి మాటలు, కండ్లండ్ల నీళ్లు ఊర్తనే ఉన్నయి.


Spread the love

5 thoughts on “నోరుగల్లది

  1. ‘నోరు గల్లది’ కథ చాలా బాగుంది. సింగరేణి మాండలికంలో కథ అత్యంత సహజంగా ఉంది. రచయిత్రి ‘స్వర్ణ కిలారి’ గారికి అభినందనలు 👏👏👏

  2. కథ జీవితాన్ని ఆవిష్కరించడం లో సఫలం అయ్యింది. మాండలికం తో పాటు బతుకు పుస్తకం కూడా వాస్తవికంగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *