డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 15

Spread the love

ఆ తర్వాత కొద్ది నిమిషాల నిశ్శబ్దం. తర్వాత అదే స్వరం బాధతో మూలుగుతూ, ఆ దెబ్బల మధ్య ‘జిత్తులమారి నక్కల్లారా! విప్లవ వ్యతిరేకుల్లారా!…నన్ను కొట్టండి!”అంటూ ధిక్కారంతో ధ్వనించింది.

ఫట్,ఫట్ మంటూ దెబ్బల శబ్దాలు.

  లాగుటిన్ లిస్ట్ నిట్ స్కీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతని మోకాలు పట్టుకుంటూ, ‘దయ చూపించండి’,అని వేడుకున్నాడు.

    ‘నువ్వు పక్కకి పో!’

     ‘మేజర్! ….లిస్ట్ నిట్ స్కీ! …మీకు ఆ ఏడుపు వినిపించడం లేదా?మీరు దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది!’

   ‘నాకు నువ్వు అంటే అసహ్యం!’ లిస్ట్ నిట్ స్కీ కోపంతో బుసలు కొడుతూ,అతన్ని దాటుకుంటూ గుర్రాన్ని పోనిచ్చాడు.

   ‘సోదరులారా! నేను రెజిమెంటు విప్లవ కమిటీ సభ్యుడిని. ఇతన్ని చావు నుండి కాపాడమని మిమ్మల్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు దీనికి బదులు చెప్పాల్సి వస్తుంది. అవును,ఇవి పాత రోజులు కావు!”అంటూ లాగుటిన్ అరుస్తూ పక్కకి నిలబడి ఉన్న కొసాక్కుల దగ్గరికి పరిగెత్తాడు.

     ఉన్మాదం,అకారణ ద్వేషం లిస్ట్ నిట్ స్కీ ని ఆవహించాయి. అతను తన గుర్రాన్ని వెనక్కి తిప్పి లాగుటిన్ వైపు దౌడు తీయించాడు. నూనె వాసన వస్తున్న తన నల్ల తుపాకీని సరాసరి లాగుటిన్ ముఖం మీద గురి పెడుతూ, ‘నోర్ముయ్యరా,ద్రోహి! నువ్వు ఒక బొల్షివిక్కువి! నిన్ను కాల్చి పారేస్తాను!’అని అరిచాడు.

       కొద్ది నిమిషాలకి తనను తాను నిగ్రహించుకుని, అతి కష్టం మీద ట్రిగ్గర్ మీద నుండి తన వేలిని తీసి,గుర్రాన్ని వెనక్కి తిప్పి,అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

              కొద్ది నిమిషాల తర్వాత ముగ్గురు కొసాక్కులు లిస్ట్ నిట్ స్కీ ని అనుసరించారు. రక్తంతో తడిచిన చొక్కాతో ఉన్న అతను అర్జానోవ్, లాపిన్ గుర్రాల మధ్య కుంటుతున్నట్టు నిలబడి ఉన్నాడు ,వాటి వేగంతో భూమిని రాసుకుంటూ కదులుతున్నాయి అతని పాదాలు.అతను ఆ వేగానికి కదలలేక ,ఈడ్చుకుపోతున్నట్టే వెళ్తున్నాడు. మూడవ కొసాక్కు కొద్ది దూరంలో ఆ ఇద్దరిని అనుసరిస్తున్నాడు.ఓ కూడలి దగ్గర రక్తసిక్తమైన ఆ వ్యక్తి ఓ టాక్సీని చూసి,పట్టు నుండి విడిపించుకుని, పక్కన ఉన్న పేవుమెంటు మీదకి దూకాడు. అతను ఆ సమయంలో ఏదో అన్నాడు కానీ అది పైకి వినబడలేదు. ఆ హడావుడిలో రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ఆ ఇద్దరి గుర్రాలకు సమీపంగా ఆ టాక్సీ వచ్చింది. ఆ తర్వాత వారు ఆ గాయపడిన వ్యక్తిని  పట్టుకునే ప్రయత్నం చేయలేదు.

      ఆ తర్వాత ఉదయం లిస్ట్ నిట్ స్కీ నిద్ర లేచేసరికి తాను ఏదో చేయకూడని,సరిదిద్దుకోలేని తప్పిదం చేసిన భావన కలిగింది. పెదవులు కోరుక్కుంటూ, ఆ ముందురోజు రాయి విసిరిన వాడిని కొట్టడం ,తనకు,లాగుటిన్ కి మధ్య వాగ్వివాదం జరగడం గుర్తు తెచ్చుకున్నాడు. అతని నుదురు ముడిపడింది. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతను స్నానాదికార్యక్రమాలు పూర్తి చేస్తూ , రెజిమెంటు కమిటీతో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి లాగుటిన్ విషయంలో కొంతకాలం మౌనంగా ఉండటమే మంచిదనుకున్నాడు. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న కొసాక్కులు కూడా జరిగింది మర్చిపోయేంతవరకు ఆగి,ఆ తర్వాత అతన్ని వదిలించుకోవాలనుకున్నాడు.

       ‘అయితే కొసాక్కులకు దగ్గరగా ఉండటం అంటే ఇలాగే’, అని తనలో తానే వ్యంగ్యంగా అనుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అతని మనసులో ఆ జరిగిన విషయం వల్ల కలిగిన కోపాన్ని పోగొట్టుకోలేకపోయాడు.

   ఆగస్టు మొదటి రోజుల్లో ఎండగా ఉన్న ఓ రోజున లిస్ట్ నిట్ స్కీ, అస్టారిస్చికోవ్ తో కలిసి పట్టణానికి వ్యాహళికి వెళ్ళాడు. ఆఫీసర్ల సమావేశం జరిగిన రోజు నుండి వారిద్దరి మధ్య దూరం అలానే ఉండిపోయింది. అస్టారిస్చికోవ్  తన ఆలోచనల్లో తాను మునిగిపోయి, వాటిని తన మనసులోనే దాచుకున్నాడు. లిస్ట్ నిట్ స్కీ అతన్ని మామూలుగా చేద్దామని ప్రయత్నించినా,అతను తన మనసులోది బయటపెట్టకుండా,వేరేలా ప్రవర్తించసాగాడు. ఓ మనిషికి బయట కనిపించే వ్యక్తిత్వం ఒకటి ఉంటే, బయటకు కనబడకుండా ఉండేది ఇంకోటి ఉంటుందని లిస్ట్ నిట్ స్కీ అభిప్రాయం. గట్టిగా ఉండే దాని బయటి పొరను తొలగిస్తే, ఆ దాగినది దానంతటదే  బయటపడుతుందని కూడా అతను అనుకుంటాడు. అందుకే లిస్ట్ నిట్ స్కీ కి తను కలిసిన వ్యక్తుల్లో ఆ ‘కనబడని మనిషి’ని కనుక్కోవాలన్న కుతూహలం ఉండేది. ఈ విషయంలో ఆ కుర్ర అధికారి విరుద్ధ భావాలను గురించి ఆలోచిస్తూ కొసాక్కులకు-బొల్షివిక్కులకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. ఈ అభిప్రాయం వల్ల అతనికి దగ్గరయ్యే ప్రయత్నాలు విడిచిపెట్టి, అంటీముట్టనట్టు ఉంటేనే మంచిదనిపించింది.

    మధ్యమధ్యలో ఒకటి రెండుసార్లు ఏవో మాట్లాడుకుంటూ, వారిద్దరూ నెవ్ స్కీ వైపు నడిచారు.

    ‘ఏమైనా తిందామా?’ ఓ రెస్టారెంటు వైపు కళ్ళతో చూపిస్తూ, అడిగాడు లిస్ట్ నిట్ స్కీ.

    ‘అవునా, ఏదైనా తిందాం’, రెండోవాడు ఒప్పుకున్నాడు.

       వారు లోపలికి వెళ్ళేసరికి ఎక్కడా కూర్చోవడానికి ఖాళీ లేకపోవడంతో ఆ గదిలో నిలబడాల్సి వచ్చింది.  అస్టారిస్చికోవ్ అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కిటికీ దగ్గర ఉన్న బల్ల వద్ద ఇద్దరు స్త్రీలతో, చక్కటి వేషధారణతో ఉన్న వ్యక్తి వీరిని వచ్చినప్పటి నుండి గమనిస్తూ ఉన్నాడు. అతను లేచి వారి వద్దకు వచ్చాడు.

     ‘మీరు మా బల్ల వద్ద కూర్చోవచ్చు. మేము ఇప్పుడు వెళ్తున్నాం’,అతను నవ్వుతూ అన్నాడు. ఎడంగా ఉండి, నికోటిన్ మరకలతో నిండి ఉన్న అతని పళ్ళు నవ్వుతూ వారికి దర్శనమిచ్చాయి. ‘ఓ అధికారికి సాయం చేయడం మాకు ఎంతో సంతోషం. మిమ్మల్ని చూయి మేము గర్విస్తున్నాము’,అన్నాడు.

       ఆ స్త్రీలు కూడా లేచి నిలబడ్డారు. వారిలో పొడుగ్గా ఉన్న స్త్రీ తన జుట్టును సర్దుకుంటూ ఉంటే,ఆమె కంటే చిన్నదైన రెండో అమ్మాయి , గొడుగుతో ఆడుకుంటూ ఉంది.

       ఆ ఇద్దరూ ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపి, కిటికీ వైపుకి నడిచారు. కిటికీ గుండా సూర్యకిరణాలు టేబుల్ క్లాత్ మీద పడుతున్నాయి. టేబుళ్ళ మీద ఉంచిన  పువ్వుల వాసన, ప్లేట్లలో ఉన్న తిండి వాసనతో కలిసిపోయింది ఆ గదంతా.

     లిస్ట్ నిట్ స్కీ ఓ సూప్ ఆర్డరిచ్చాడు. అది వచ్చేలోపు ఆ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ లో ఉన్న పూల రెక్కలు తెంపుతూ ఉన్నాడు.  అస్టారిస్చికోవ్ తన నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ,చుట్టూ ఉన్న టేబుళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు.

    వారు తమ సూపు ముగించకముందే, ఓ ఇద్దరు ఆఫీసర్లు గట్టిగా మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు.

  అందులో ఒకతను ఖాళీ టేబుల్ కోసం వెతుకుతూ ఉంటే ,ముఖమంతా మురికిపట్టి ఉన్న ఇంకొకతను లిస్ట్ నిట్ స్కీ వైపు చూశాడు. లిస్ట్ నిట్ స్కీ ని చూడగానే ఆ నల్లటి కళ్ళల్లో  మెరుపు మెరిసింది.

   ‘లిస్ట్ నిట్ స్కీ!నువ్వేనా?’అంటూ ఆ ఆఫీసర్,అరుస్తూ అటువైపు నడుచుకుంటూ వెళ్ళాడు.

   నల్లటి మీసాల కింద నుండి అతని తెల్లటి పళ్ళు మెరుస్తూ ఉన్నాయి. లిస్ట్ నిట్ స్కీ అతన్ని మేజర్ కాల్మికోవ్ గా గుర్తించాడు. అతని వెనుక ఉన్న అధికారి చుబోవ్. వారిద్దారూ ఆత్మీయంగా చేతులు కలిపారు. తన పూర్వపు రెజిమెంటు స్నేహితులను అస్టారిస్చికోవ్ కు పరిచయం చేసి, ‘మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?’అని అడిగాడు.

    కాల్మికోవ్ తన మీసాన్ని తిప్పుతూ, చుట్టూ పరికించి చూశాడు.

  ‘మేము ఒక పని మీద వచ్చాము. నీకది తర్వాత చెప్తాను. ముందు నీ గురించి చెప్పు . 14 వ రెజిమెంటులో నువ్వు ఎలా ఉన్నావు?’

    వారందరూ రెస్టారెంటు నుండి బయటకు వచ్చారు. కాల్మికోవ్, లిస్ట్ నిట్ స్కీ వెనుకే ఉండిపోయి, ఓ వీధి వెనుక నుండి వెళ్ళారు. ఓ అరగంట తర్వాత అట్టే జనం లేని ఓ వీధిలో నడుస్తూ , చిన్నగా మాట్లాడుకుంటూ, మధ్యలో చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉన్నారు.

     ‘మా మూడవ దళం రోమానియా సరిహద్దు దగ్గర రిజర్వుగా ఉంచబడింది. ఓ పదిరోజుల క్రితం రెజిమెంటు కమాండర్ నన్ను పిలిపించి,నా దళం బాధ్యతలు అప్పగించి, లూయీటెంట్ చుబోవ్ తో కలిసి విభాగపు ప్రధానకార్యాలయానికి వెళ్ళమని చెప్పారు. అద్భుతం కదా! నేను ఆ బాధ్యతలు అప్పగించి ప్రధానకార్యాలయానికి వచ్చాను. అక్కడ కార్యనిర్వహణ విభాగంలో అధికారిగా ఉన్న కల్నల్. ఎమ్ ,ఆయన నీకు కూడా బాగా తెలుసు -నాకు రహస్యంగా చెప్పారు,జనరల్ క్రిమోవ్ ని కలవమని. అంతే వెంటనే మేము ఆయన ఉన్న కార్యాలయానికి వెళ్ళాము. ఆయనను కలవడానికి ఎటువంటి అధికారులు వస్తారో ఆయనకు బాగా తెలుసు గనుక,ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించాడు. తరవాత సరాసరి అసలు విషయంలోకి వచ్చాడు. “ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే దేశాన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారో వారి చేతుల్లో ఉంది. ఇప్పుడు పాలనలో ఉన్న ప్రొవిజినల్ గవర్నమెంటును తప్పించి మిలటరీ నియంతపాలనను తీసుకురావాలి.”ఆయన దానికి కొర్నిలోవ్ సరైన వ్యక్తని చెప్పి నన్ను పెట్రోగ్రాడ్ వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ దానికి అనుకూలంగా ఉన్న అధికారుల కమిటీతో నన్ను కలిపారు. ఇప్పుడు ఇక్కడ పట్టణంలో మేము నమ్మదగిన అధికారులు వందల్లో ఉన్నారు. మా పని ఏంటో నీకు అర్థమైందా? కొసాక్కు సైన్యాల్లో ఉన్న మా కౌన్సిల్ తో ఈ ముఖ్య కమిటీ సున్నితంగా వ్యవహరిస్తుంది. రైల్వే కూడళ్ళ వద్ద  కొన్ని ప్రదేశాల పైన ఊహించని మెరుపుదాడులు చేస్తాము. సమీప భవిష్యత్తులో ప్రతిదీ మనకు అనుకూలంగానే మారుతుంది.’

     ‘అసలు దీని వల్ల ఏమవుతుందని అనుకుంటున్నావు?’

  ‘హా, నువ్వు నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు! నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా,నీకు ఇంకా పరిస్థితి అర్థం కాలేదా? తప్పక కూప్ జరిగి,కార్నిలోవ్ అధికారంలోకి వస్తాడు. సైన్యమంతా అతనికి అండగా ఉంది. ఇప్పుడు ప్రజలు కొర్నిలోవ్ ని, బొల్షివిక్కులని సమానమైన ప్రత్యర్ధులుగా చూస్తున్నారు. కేరెన్ స్కీ పరిస్థితి రెండు మంటల మధ్య చిక్కుబడినట్టు ఉంది. ఒకటి అంటుకోకపోతే, ఇంకొకటైనా అతన్ని కాల్చేస్తుంది. అప్పటివరకైనా అతన్ని హాయిగా ఉండని. అతను ఒకరోజు రాజు మాత్రమే.’కాల్మికోవ్ ఆగి, ఏదో ఆలోచించుకుని,మరలా కొనసాగించాడు. ‘నిజమేమిటంటే మనమందరం చదరంగంలో పావుల్లాంటి వాళ్ళం. పావులకు ఆటగాడు తమను ఎటూ కదుపుతాడో తెలియదు. ఉదాహరణకు ,ఇప్పుడు ప్రధానకార్యాలయ విభాగంలో ఏం జరుగుతుందో కూడా నేను  ఊహించలేను. జనరల్స్ అయిన కొర్నిలోవ్ ,లుకోమ్ స్కీ , రోమానోవ్ స్కీ,క్రిమోవ్ ,డెనికిన్,కాలేడిన్,ఎర్డేలి,ఇంకా ఎంతో మంది మధ్య ఏవో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని మాత్రం నేను చెప్పగలను.’

      ‘మరి సైన్యం మాటేమిటి? సైన్యమంతా కార్నిలోవ్ ను అనుసరిస్తుందా?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.

     ‘క్రింది స్థాయి వారు వ్యతిరేకిస్తారు.కానీ వారిని మార్చవచ్చు.’

      ‘నీకు తెలుసా,లెఫ్ట్ నుండి వచ్చిన వత్తిడి వల్ల కెరెన్ స్కీ ,సుప్రీం కమాండర్ ని మార్చాలనుకున్నాడని?’

   ‘అతను అంతా ధైర్యం చేయడు.ఆ మరుసటి రోజే అతను తన అధికారాన్ని కోల్పోతాడు, ఆ పని చేస్తే! అధికారుల కమిటీ ఆ విషయం అతనికి అర్థమయ్యేలా గట్టిగానే తెలియజేసింది.’

     ‘నిన్న కోసాక్కుల సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొందరు కొసాక్కులు అతన్ని కలవడానికి వెళ్ళారు.’లిస్ట్ నిట్ స్కీ నవ్వుతూ అన్నాడు.

   ‘కొసాక్కులు కొర్నిలోవ్ ను పదవీచ్యుతుడిని చేసే  చర్యను హర్షించరని తెగేసి చెప్పారు. దానికి ఆయన సమాధానం ఏమిటో తెలుసా?’

  ‘అది ఒక ఊహాగానం మాత్రమే. ప్రొవిజినల్ గవర్నమెంటు అటువంటి ఆలోచనలో లేదు’,అని.ఆయన ప్రజలకు ఊరటనిస్తూనే, సోవియట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వైపు వేశ్యలా ఓరగా కన్ను కొడుతూ ఉంటాడు.’

    కాల్మికోవ్ తన జేబులో ఉన్న చిన్న నోట్ పుస్తకాన్ని బయటకు లాగి, వారు నడుస్తూ ఉండగా, దానిలో ఉన్నది బిగ్గరగా బయటకు చదివి వినిపించాడు.

   ‘ప్రజల తరపున రష్యన్ సైనిక అత్యున్నత అధికారి అయిన మీకు మేము స్వాగతం పలుకుతున్నాము. మీ అధికారాన్ని ధిక్కరించే ఏ చర్య అయినా సైన్యంలో లేదా రష్యా మొత్తంలో ఎక్కడ జరిగినా అది శిక్షార్హమని,కొసాక్కుల తరపున మేము ప్రకటిస్తున్నాము. ఈ విపత్కర సమయంలో రష్యా మీ వైపు ఆశ,నమ్మకాలతో చూస్తూ ఉంది. ఈ సందర్భంగా గొప్ప సైన్యాన్ని నిర్మించడానికి, రష్యాని కాపాడటానికి మీకు దేవుడు సాయం చేయాలని కోరుకుంటున్నాము. ‘అంటే అంతా స్పష్టంగానే ఉంది కదా? కొర్నిలోవ్ ను తప్పించడమనేది జరిగే పని కాదు. సరేగాని,నిన్న నువ్వు అతని రాకను చూశావా?’

    ‘జార్కోస్కోయ్ నుండి నేను నిన్న రాత్రి వరకు తిరిగి రాలేదు.’

     కాల్మికోవ్ నవ్వాడు. అతని ఆరోగ్యకరమైన పళ్ళు బయటపడ్డాయి. పెద్దవైన అతని కళ్ళు,వాటి మూలల ఉన్న ముడతలు కూడా కనపడ్డాయి.

   ‘అది ఒక గొప్ప విశేషం! అతని అంగరక్షకులుగా ఓ దళం,కవచ సహితమైన కార్లు,మెషీన్ గన్లు….అందరూ కలిసి వింటర్ ప్యాలెస్ వైపుకి వచ్చారు.  గొప్ప పరోక్ష హెచ్చరిక చర్య కదా!’అతను నవ్వుతూనే కొనసాగించాడు. ‘పెద్ద టోపీలు పెట్టుకుని,కిందకి తలలు వాల్చేసిన వారి ముఖాలు చూడాలి. అది అసలు చూడాల్సిన దృశ్యం!అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’

   మాస్కోలోని నార్వా జిల్లా వైపు నడిచాక, ఆ ఇద్దరు అధికారులు విడిపోయారు.

  ‘మనం ఒకరితో ఒకరు ఎప్పటికీ కలిసే ఉండాలి యెవజిని.రాబోయేది గడ్డుకాలం. గట్టిగా నిలబడకపోతే పడిపోతాం’,విడిపోయేముందు కాల్మికోవ్ అన్నాడు.

  లిస్ట్ నిట్ స్కీ వెళ్ళిపోతూ ఉంటే, కాల్మికోవ్ వెనుక నుండి అరిచాడు.

    ‘ఓ,మర్చిపోయాను,నీకు చెప్పడం. నీకు మన ఆర్టిస్ట్ మెర్కులోవ్ గుర్తున్నాడా?’

   ‘అతనికి ఏమైంది?’

     ‘అతను ఈ మేలో చచ్చిపోయాడు.’

    ‘నిజంగానా!’

   ‘అది ప్రమాదవశాత్తూ జరిగింది. అంతకన్నా మూర్ఖమైన చావును నువ్వు ఊహించలేవు కూడా. అతని చేతిలో గ్రేనేడ్ పేలి నుజ్జునుజ్జై చచ్చిపోయాడు.’

   కాల్మికోవ్ ఇంకా ఏదో అరుస్తూ చెప్తున్నా,గాలిలో ఆ మాటలు కలిసిపోయాయి. లిస్ట్ నిట్ స్కీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

                         *   *  *

    ఆగస్టు 6వ తేదీన స్టాఫ్ కి సుప్రీం కమాండర్ చీఫ్ గా ఉన్న జనరల్ లుకోమ్ స్కీకి ఓ ఆజ్ఞ వచ్చింది. దాన్ని ప్రధాన కార్యాలయ విభాగానికి మొదటి క్వార్టర్ మాస్టర్ జనరల్ గా ఉన్న జనరల్ రోమానోవ్ స్కీ తెలియజేశాడు. మూడవ ఆశ్విక దళాన్ని, నెవెల్ ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని, దిశవ సోకోల్నికి, వెలికేలుకి ప్రాంతాలకి వెంటనే పంపించమనే ఆ ఆజ్ఞ.

  ‘వారిని ఎందుకు ఆ ప్రాంతానికే పంపించాలి? ఆ దళాలన్ని రొమానియా సరిహద్దు ప్రాంతంలో రిజర్వుగా ఉన్నాయి’, కొంత కలవరపాటుతో అడిగాడు లుకోమ్ స్కీ.

‘నాకు తెలియదు. సుప్రీం కమాండర్ ఆజ్ఞను మీకు తెలియజేసాను. అదే నా బాధ్యత.’

‘ఆ ఆజ్ఞ ఎప్పుడు జారీ చేయబడింది?’

  ‘సుప్రీం కమాండర్ నిన్న రాత్రి 11 గంటలకు నన్ను పిలిచి, మీకు ఈ సందేశాన్ని ఈ ఉదయం అందించమని ఆజ్ఞాపించారు.’

 రోమానోవ్ స్కీ ఆ గదిలో కిటికీ దగ్గర కొద్దిసేపు పచార్లు చేసి, తర్వాత లుకోమ్ స్కీ ఆఫీసులో ఓ గోడలో సగం భాగం దాకా ఆక్రమించిన వ్యూహ పటం దగ్గర ఆగాడు. లుకోమ్ స్కీ వైపు తన వీపును ఉంచి, ఆ పటాన్ని జాగ్రత్తగా చూస్తూ,’వెళ్ళి సరాసరి ఆయనతోనే మాట్లాడు. ఆయన ఈ సమయంలో ఆఫీసులోనే ఉంటారు’, అన్నాడు.

  లుకోమ్ స్కీ తన టేబుల్ పైన ఉన్న కాగితాల్ని తీసుకుని, తన కుర్చీ వెనక్కి తోసి, ఆ గది నుండి బయటకు నడిచాడు. అతని నడకలో పెరిగిన వయసు, బరువు సైన్యంలో పనిచేసే వారి నడకను ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టమవుతుంది. ఆ గది దాటుతూ, ‘అవును,నిజమే’అని తనలో తానే అనుకున్నాడు.

   లుకోమ్ స్కీ వెళ్ళేసరికి పొడుగ్గా,సన్నగా ఉన్న ఓ కల్నల్ అప్పుడే కొర్నిలోవ్ గది నుండి బయటకు వస్తున్నాడు. లుకోమ్ స్కీ ని చూసి అతను గౌరవప్రదంగా పక్కకు జరిగి, దారి ఇచ్చాడు. కుంటుతూ నడుస్తూ బయటకు వెళ్ళాడు అతను.

  కొర్నిలోవ్ తన చేతుల్ని ముందున్న బల్ల మీద ఆనించి,తన ఎదురుగా నిలబడి ఉన్న ఓ అధికార్తో మాట్లాడుతూ ఉన్నాడు.

   ‘…..అలా జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా?మీరు స్కోవ్ కి వెళ్ళిన వెంటనే నాకు తెలియజేయండి. ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు.’

   కొర్నిలోవ్ ఆ ఆధికారి బయటకు వెళ్ళి తలుపు మూసేవరకు మౌనంగా ఉన్నాడు. తర్వాత లుకోమ్ స్కీ కూర్చోవడానికి ఓ కుర్చీ జరుపుతూ,’రోమానోవ్ స్కీ ద్వారా నేను పంపిన ఆజ్ఞ నీకు అందిందా?’అని అడిగాడు.

     ‘అందింది.అందుకే దాని గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను.ఎందుకు సైన్యాన్ని ఆ ప్రాంతానికే పంపించాలని అనుకుంటున్నారు?’

    గోధుమ వర్ణంలో ఉన్న కొర్నిలోవ్ ముఖం వైపు లుకోమ్ స్కీ శ్రద్ధగా చూశాడు. ఆ ముఖంలో ఉన్న భావం అర్థం కాకుండా ఉంది. మోచేతిని బల్ల మీద ఆనించి,బుగ్గను ఇంకో చేతి మీద ఉంచి, తన మంగోలియా కళ్ళను పెద్దవి చేస్తూ అన్నాడు.

   ‘నేను ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆశ్విక దళాల మీదే శ్రద్ధ పెట్టాలని అనుకోవడం లేదు. అవసరమైతే అటు ఉత్తరం,ఇటు పశ్చిమ ప్రాంతాల్లోకి కూడా తేలిగ్గా వెళ్ళగల ప్రాంతంలో అలా ప్రత్యేక దళాలు ఉండేలా చూడాలనుకుంటున్నాను. నా దృష్టిలో నేను ఎంచుకున్న ప్రాంతం సరైనదే. నీకు దీని మీద వేరే అభిప్రాయం ఉందా?ఉంటే చెప్పు.’

    లుకోమ్ స్కీ భుజాలెగరేశాడు.

   ‘అసలు పశ్చిమ సరిహద్దు ప్రాంతం గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ స్కోవ్ ప్రాంతంలో  ఆశ్విక దళాల బలగం ఉంటే మంచిది.’

  ‘స్కోవా? లేదు.   ఆ ప్రాంతం అందుకు తగినది కాదు’, కొర్నిలోవ్ ముందుకు వంగి, తల అడ్డంగా ఊపుతూ అన్నాడు.

  లుకోమ్ స్కీ తన చేతులను కుర్చీ చేతుల మీద ఉంచుతూ, తన పదాలను జాగ్రత్తగా ఎంచుకుంటూ అన్నాడు.

  ‘లావ్ర్ జార్జియేవిచ్, మీరు చెప్పిన ఆజ్ఞ వెంటనే పాటిస్తాను. కానీ మీరు నా దగ్గరేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. పెట్రోగ్రాడ్ లేదా మాస్కోకు పంపే ఉద్దేశ్యం ఉంటే, మీరు ఎన్నుకున్న ప్రాంతం సరైనదిగా ఉంటుంది తప్ప ఉత్తర సరిహద్దు ప్రాంతానికి కాదు, ఎందుకంటే అక్కడ రవాణా సమస్య ఉంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్లయితే, నన్ను యుద్ధ ప్రాంతానికి తక్షణమే పంపించండి లేదంటే మీ మనసులో ఏముందో నాకు స్పష్టం చేయండి. తన కమాండర్ తనను నమ్మినంత కాలమే ఏ అధికారి అయినా తను హోదాలో కొనసాగగలడు.’

    కొర్నిలోవ్ అతని మాటలు శ్రద్దగా వింటూ, ఎర్ర రంగులోకి కందిపోయినట్టు మారిన ముఖాన్ని గమనించాడు. అతనికి బదులిచ్చే ముందు కొన్ని సెకండ్ల పాటు తనలో తానే ఆలోచించుకున్నాడు.

   ‘అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను నీకు చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి. దయచేసి వెంటనే ఈ దళపు బదిలీ గురించి ఆజ్ఞ ఇవ్వు. అలాగే మూడవ ఆశ్విక దళ కమాండర్ క్రిమోవ్ ని వెంటనే పిలిపించు. నేను పెట్రోగ్రాడ్ నుండి తిరిగి వచ్చాక, నువ్వు, నేను, వివరంగా మాట్లాడుకుందాము. అలెగ్జాండర్ సెర్జీయేవిచ్, నన్ను నమ్ము, నీ దగ్గర ఏదీ దాయాలన్న ఉద్దేశ్యం నాకు లేదు’, కొర్నిలోవ్ ఆఖరి వాక్యాలను ఒత్తి పలుకుతూ అని, తలుపు ఎవరో తట్టిన శబ్దం వినబడి, వేగంగా వెనక్కి తిరిగి,’లోపలికి రావొచ్చు’, అన్నాడు.

            ముఖ్య కార్యాలయంలో సహాయ అధికారిగా ఉన్న వన్ విజెన్,ఎత్తుగా ఉన్న ఓ జనరల్ లోపలికి వచ్చారు.లుకోమ్ స్కీ లేచి, బయటకు వెళ్తూ, వన్ విజెన్ ప్రశ్నకు గట్టిగా కొర్నిలోవ్ బదులివ్వడం వినిపించింది.

  ‘నాకు ఇప్పుడు జనరల్ మిల్లర్ గురించి పట్టించుకునేంత తీరిక లేదు. ఏంటీ… అవును, నేనిప్పుడు బయల్దేరుతున్నాను.’

  లుకోమ్ స్కీ తన కార్యాలయానికి తిరిగి వచ్చి, కిటికీలో నుండి బయటకు చూస్తూ నిలుచున్నాడు. తన గడ్డాన్ని సవరించుకుంటూ, గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మల వైపు చూస్తూ,ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.

  ఓ గంట తర్వాత మూడవ ఆశ్విక దళానికి సుప్రీం కమాండర్ అధికార వర్గం నుండి బయలుదేరమని ఆజ్ఞ వచ్చింది.

అదే రోజు జనరల్ క్రిమోవ్, ఎవరైతే గతంలో కొర్నిలోవ్ అభ్యర్ధన మేరకు 11వ సైన్య దళంతో సమావేశానికి నిరాకరించాడో, అతన్ని ఓ టెలిగ్రామ్ ద్వారా వెంటనే ముఖ్య కార్యాలయానికి రావలసిందిగా సందేశం పంపారు.

  ఆగస్టు 9న కొర్నిలోవ్ రక్షణా దళం వెంట రాగా, ప్రత్యేక రైలులో పెట్రోగ్రాడ్ కు బయలుదేరాడు.

ఆ తర్వాత రోజు ముఖ్యకార్యాలయమంతా సుప్రీం కమాండర్ ని పదవీచ్యుతుడిని చేశారని, అరెస్టు కూడా చేసి ఉంటారనే వదంతి వ్యాపించింది. కానీ 11 ఉదయానికి కొర్నిలోవ్ మోగిల్యోవ్ కి వచ్చాడు.అతను వచ్చిరాగానే లుకోమ్ స్కీ ని పిలిపించాడు. తనకు పంపిన టెలిగ్రాములు, మిగిలిన సందేశాలన్నీ చదివాడు. కొంత అసహనంగా ఉన్నాడు.

            ‘అంతకుముందు మధ్యలో ఆగిపోయిన చర్చను మనమిప్పుడు కొనసాగించవచ్చు’, అంటూ మొదలెట్టాడు.’మూడవ దళాన్ని పెట్రోగ్రాడ్ వైపు మళ్ళించడానికి నాకున్న కారణాలను నీకు చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, ఆగస్టు 3 న ఓ క్యాబినెట్ మీటింగ్ కోసం పెట్రోగ్రాడ్ వెళ్ళానని. అక్కడ కెరెన్ స్కీ, సవిన్ కోవ్ రక్షణ వ్యూహాలకు సంబంధించిన ఏ విషయాలను అక్కడ ప్రస్తావించవద్దని, అక్కడ కొందరు మంత్రులు నమ్మదగినవారు కాదని వారించారు. సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ గా ప్రభుత్వానికి ప్రణాళికల. నివేదికలను సమర్పించలేని స్థితిలో ఉన్నాను ఎందుకంటే అవి కొద్ది రోజుల్లోనే జర్మనీ హై కమాండ్ కు చేరవచ్చు కనుక. నువ్వు దీనిని ఓ ప్రభుత్వమనగలవా? ఇదంతా జరిగాక, ఈ ప్రభుత్వం దేశాన్ని కాపాడుతుందని నన్ను ఎలా నమ్మమంటావు?’కొర్నిలోవ్ వేగంగా తలుపు వైపుకి వెళ్ళి, తలుపు మూసి, అంతే వేగంగా వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ కోపంగా అన్నాడు.’అలాంటి విషపురుగులు ఈ దేశాన్ని పాలించాల్సి రావడం సిగ్గు పడాల్సిన విషయం. సరైన సంకల్పం, శీలం, సామర్థ్యం, దేశభక్తి లేని వాళ్ళు, దేశద్రోహానికి పాల్పడటానికి వెనుకాడని వారు-ఈ లక్షణాలతో ఉన్నవారే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రకమైన మనస్తత్వంతో ఉన్న చెర్నోవ్ లాంటి వాళ్ళ వల్ల, బొల్షివిక్కులు చాలా సులభంగా కెరెన్ స్కీ ని కూలదోయగలరు. అవును, అలెగ్జాండర్ సెర్జీయేవిచ్, ఇదే ఇప్పుడు రష్యా పరిస్థితి. నీవు నమ్మే సిద్ధాంతాలు, సూత్రాలతోనే నేను ఈ దేశానికి విపత్కర స్థితి నుండి రక్షించాలనుకుంటున్నాను. నేను మూడవ దళాన్ని ఆగస్టు ఆఖరి కళ్ళా పెట్రోగ్రాడ్ వైపుకి పంపించాలనుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఒకవేళ బొల్షివిక్కులు ఏవైనా దాడులకు పాల్పడితే, మాతృదేశ ద్రోహులకు పడాల్సిన శిక్ష వారు అనుభవించేలా  చేయడానికే.

            నేను జనరల్ క్రిమోవ్ ని ఈ వ్యూహదాడికి అధికారిగా ఉంచాను. అవసరమైతే మొత్తం సోవియట్ కార్మిక సైనికుల, వారి అధికారుల తల తీయడానికి కూడా అతను వెనుకాడడని నా నమ్మకం. ఇక ప్రొవిజినల్ ప్రభుత్వ విషయానికి వస్తే, నాకు ఏ రకమైన భరోసా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ త్యాగాలకు వెనుదిరగకుండా మనం రష్యాను కాపాడుకోవాలి!’

  కొర్నిలోవ్  లుకోమ్ స్కీ ముందు ఆగి, అడిగాడు.

  ‘ఈ దేశ భవిష్యత్తును ఇలాంటి చర్యలే కాపాడుతాయన్న నా అభిప్రాయం మీద నీకు నమ్మకం ఉందా?’

   లుకోమ్ స్కీ తన కుర్చీ నుండి సగం లేచి నిలబడి, కొర్నిలోవ్ చేతిని పట్టుకుంటూ,’మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను!మీతో చివరిదాకా నేను ఉంటాను. కానీ చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేసి ముందడుగు వేయాలి. నాకు ఈ పని అప్పగించండి, లావ్ర్ జార్జియేవిచ్’, అన్నాడు.

‘నేను ఇప్పటికే మంచి పథకం ఆలోచించాను. కల్నల్ లెబెదేవ్, మేజర్ రోజేన్ కో నీకు దాన్ని వివరిస్తారు.అలెగ్జాండర్ సెర్జీయేవిచ్, నీకు చాలా పని ఉంది. నా మీద నమ్మకం ఉంచు. మనం ప్రతి దాని గురించి వివరంగా మాట్లాడుకోవటానికి, ఏవైనా మార్పులు చేయడానికి సమయం కూడా ఉంది.’

            ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ముఖ్యకార్యాలయం అంతా కూడా హడావుడిగా ఉంది. మోగిల్యోవ్ లో ఉన్న గవర్నర్ భవనానికి ఎందరో స్వచ్చందంగా సేవలు అందించడానికి వచ్చారు.యుద్ధసరిహద్దు ప్రాంతం నుండి అలసిపోయి, బడలికతో ఉన్న సైనికులు, అధికారుల బృందం నుండి చూడటానికి చక్కగా ఉన్న ప్రతినిధులు, డాన్ ప్రాంతం నుండి సందేశకులు, డాన్ సైనిక ప్రాంతమైన కలేడిన్ నుండి అధికారులు కూడా వచ్చారు.పౌరులు కూడా వచ్చారు. ఫిబ్రవరిలో కూలిపోయిన రష్యా పాత వ్యవస్థను మరలా పునరుద్దరించాలన్న నిజాయితీ ఉన్నవారు వారిలో కొందరున్నారు.అలాగే రక్తపాతపు జాడల్ని పసి గట్టి, అది ఎలా జరగబోతుందో దాని గురించి తెలుసుకుని, దాని ద్వారా లబ్ది పొందడానికి వచ్చిన రాబందులు ఉన్నాయి. డొబ్రిన్ స్కీ, జవికో, అలాడిన్ సుప్రీం కమాండర్ కి సన్నిహితులన్న మాట వ్యాపించింది. ప్రధాన కార్యాలయంలోనూ, డాన్ సైన్య విభాగ కార్యాలయంలోనూ, కొర్నిలోవ్ గుడ్డిగా అందర్ని నమ్మడం దుస్సహాసమన్న గుసగుసలు మొదలయ్యాయి. అలాగే కొన్ని అధికార వర్గాల్లో కొర్నిలోవ్ మాత్రమే రష్యా పునర్జీవనానికి సరైన వాడన్న నమ్మకం కూడా బలపడింది. పూర్వ రష్యా కోరుకున్నవారికి అతనే తన ఆశాదీపం అనిపించింది.

            ఆగస్టు 13 న కొర్నిలోవ్ రాష్ట్ర సమావేశానికై  మాస్కో బయలుదేరాడు.

   ఆ రోజు కొంత ఉక్కపోత ఉన్నాఆకాశం మేఘావృతమై ఉంది.రైలులో నుండి చూస్తే పక్కనున్న పొలాల్లో, పక్కనున్న అడవుల్లో వాన పడుతూ ఉంది. మెడలో పతకాలతో, కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఉన్నాడు కొర్నిలోవ్.

                        *   *  *

    కొర్నిలోవ్ మాస్కోకి వచ్చే ఒక రోజు ముందే లిస్ట్ నిట్ స్కీ కొసాక్కు సైన్య కమిటీ నుండి ఒక ముఖ్య సందేశంతో అక్కడికి వచ్చాడు. అతను ఆ సందేశం మాస్కోలో ఉన్న కొసాక్కు రెజిమెంటు ముఖ్య కార్యాలయంలో అందజేసినప్పుడు అతనికి కొర్నిలోవ్ తర్వాతి రోజు అక్కడికి వస్తున్నాడని తెలిసింది.

     మధ్యాహ్నం కల్లా లిస్ట్ నిట్ స్కీ అలెగ్జాండ్రోవ్స్కీ స్టేషన్ దగ్గర ఉన్నాడు. విశ్రాంతి కోసం ఉన్న గదులు, భోజనశాలలు జనలతో నిండిపోయి ఉన్నాయి, వారిలో ఎక్కువమంది సైనికులే ఉన్నారు. ఎంతోమంది సైనికులు రక్షణ కోసం ప్లాట్ ఫారం మీదే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి రైలు వచ్చింది. దాని రాకతో మాటలన్నీ ఆగిపోయాయి.ఒక్కసారిగా ఆహ్వానం పలుకుతూ ఒక మేళం,జనాలు నృత్యం చేస్తూ దానికి జోడుగా మారారు. ఆ రద్దీలో లిస్ట్ నిట్ స్కీ పక్కకు తోయబడ్డాడు. అతను కొంతసేపటికి చూసేసరికి, అంగరక్షకుల బృందం మధ్య సుప్రీం కమాండర్ బండి ఆగి ఉంది. కొర్నీలోవ్ కాసేపటికి బండి దిగి అక్కడ ఉన్న అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించాడు. వారిలో సెయింట్ జార్జ్ పతకాలు పొందిన మిలిటరీ అధికారులు, కొసాక్కు సైన్య కమిటీలో ఉన్న అధికారులు ఉన్నారు.

    సుప్రీం కమాండర్ కు గౌరవ వందనం సమర్పించిన వారిలో డాన్ ప్రాంతపు అటామన్ కాలేడిన్ ను, జనరల్ జైంచ్ కోవిస్కీ లను లిస్ట్ నిట్ స్కీ గుర్తు పట్టాడు. మిగిలిన వారి పేర్లు అతని చుట్టూ ఉన్న అధికారుల నుండి విన్నాడు.

    ‘కిస్ల్యాకోవ్, కమ్యూనికేషన్స్ విభాగానికి ఉప మంత్రి.’

   ‘రుడ్నెవ్, మాస్కో మేయర్.’

   ‘ప్రిన్స్ తృబ్త్స్కోవ్ , ప్రధాన కార్యాలయంలో ఉన్న దౌత్య విభాగ అధికారి.’

    ‘ముసిన్ పుష్కిన్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు.’

    ‘కల్నల్ కేయట్,ఫ్రెంచ్ మిలిటరీ సహాయక అధికారి.’

    ‘ప్రిన్స్ గోలిత్సిన్.’

     ‘ప్రిన్స్ మాన్సిరెవ్ …’ ఆ పేర్లన్ని ఎంతో గౌరవంతో ఉచ్చరించబడుతున్నాయి.

      అందమైన వేషధారణతో ఒక బృందంగా కొందరు స్త్రీలు పుష్పగుచ్చాలతో కొర్నిలోవ్ ఉన్న ప్లాట్ ఫారం దగ్గరకు రావడం లిస్ట్ నిట్ స్కీ చూశాడు. గులాబీ రంగులో ఉన్న ఒక పువ్వు ఆయన భుజపు పట్టీ మీద చిక్కు బడి పోయింది ఆయన ఆ పుష్పాలు అందుకున్న సమయంలో. కొర్నిలోవ్ కొంత ఇబ్బంది పడుతూ,దాన్ని తీసేశాడు. ఉరల్స్ ప్రాంతానికి చెందిన ఒక అనుభవశాలి అయిన సైనిక అధికారి 12 కొసాక్కు సైనిక విభాగాల తరపున స్వాగత ఉపన్యాసం ఇచ్చాడు. లిస్ట్ నిట్ స్కీ ఆ పూర్తి ఉపన్యాసం వినే లోపే లిస్ట్ నిట్ స్కీ ని ఎవరో ఒక గోడ వైపుకి తోశారు. డ్యూమా రాష్ట్రపు సభ్యుడైన రోడ్చెవ్ ఉపన్యాసం తర్వాత కొర్నిలోవ్ తన చుట్టూ ఉన్న జనాలతో పాటు ముందుకు కదిలాడు. ఆయన చుట్టూ ఉన్న అధికారులు తమ చేతులను వలయాకారంలో ఆయన చుట్టూ చేసి,ఆయనకు రక్షణగా ఉండే పయత్నం చేసినా, చుట్టూ ఉన్న జనాల చేతులు అందులోకి చొచ్చుకుని లోపలికి వచ్చేశాయి. భారీకాయంతో, చింపిరి జుట్టుతో ఉన్న ఒక స్త్రీ ఆయన పక్కకు వచ్చి తన పెదాలను ఆయన చేతులకు ఆనించే ప్రయత్నం చేసింది. ఆ రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక ఆయన్ని భుజాల మీదకు ఎక్కించుకుని పైకి లేపారు,దానికి జనాల హర్షాతిశయం కూడా తోడయ్యింది. లిస్ట్ నిట్ స్కీ ఎలాగో తన పక్కన ఉన్న ఓ అధికారిని పక్కకు తోసి,కొర్నిలోవ్ బూటును ఎలాగో అందుకుని దాన్ని తన భుజం మీద ఉంచుకున్నాడు ఉద్వేగంతో కొద్ది సేపు. తర్వాత జనాల జయజయ ధ్వానాలతో అంతా హోరెత్తిపోయింది. ఆయన లిస్ట్ నిట్ స్కీ ని దాటుకుంటూ వెళ్ళిపోయినా అతను ఇంకా ఆ అనుభూతి నుండి తేరుకోలేదు. అప్పటికే ఎన్నో కెమెరాలు క్లిక్ మంటున్నాయి,ఎందరో అధికారులు ఆయనకు వందనం సమర్పిస్తూ ఉన్నారు. కానీ లిస్ట్ నిట్ స్కీ దృష్టిలో మాత్రం ఆయన బూటు కాలును తన భుజం మీద ఉంచుకున్న దృశ్యమే నిలిచిపోయింది.

  *   *  * 

   ఒక రోజు తర్వాత లిస్ట్ నిట్ స్కీ పెట్రోగ్రాడ్ కు బయలుదేరాడు. తన కోటుని పైన బెర్తు పైన పరుచుకుని, సిగరెట్టు కాల్చుకుంటూ, కొర్నిలోవ్ గురించి ఆలోచించసాగాడు.’ప్రిజన్ క్యాంపు నుండి ప్రాణాలకు తెగించి బయటపడ్డాడు. మాతృదేశం కోసం ఏదైనా చేస్తాడు. ఎటువంటి తేజస్సు గల ముఖమది!అతని వ్యక్తిత్వం కూడా ధృడమైనది. ఈపాటికే మంచి ప్రణాళిక రచించే ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు, మా అందరికీ గొప్ప నాయకుడిగా నిలబడతాడు.అసలు ఆయన ఎలాంటి వాడో నాకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. నియంతా?…. మేము దేన్నీ కోరుకుంటామో దాన్ని సాధించిపెట్టే వాడు ఆయనే!’

  అదే సమయంలో, మాస్కోలోని బోలషోయ్ థియేటర్ లో మాస్కో రాష్ట్ర సమావేశాలు జరుగుతున్నాయి.ఆ సమావేశాల మధ్య విరామ సమయంలో మంగోలియా ముఖ కవళికలతో ఉన్న ఒక జనరల్, బలిష్టంగా ఉన్న ఇంకో జనరల్ ఇద్దరూ కలిసి పచార్లు చేస్తూ గుసగుసలాడుకుంటున్నారు.

‘ఆ క్లాజులో సైన్య విభాగాల్లో సైనికుల కమిటీలను నిషేదించడం గురించి ఉందా?’

  ‘అవును.’

‘ఐకమత్యంగా అందరం శత్రువుకి వ్యతిరేకంగా పోరాడటం, విభేదాలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నేను సూచించిన విషయాలు అమల్లోకి వస్తే తప్ప అసలైన క్రమశిక్షణ అనేది ఉండదు. ఇప్పుడున్న సైన్యం నిజానికి యుద్దానికి పనికిరానిది. ఇలాంటి సైన్యం పెద్ద విజయాల గురించి పక్కన పెడితే, చిన్న యుద్దాలకే కూలిపోయేలా ఉంది. ప్రతి దళం కూడా బొల్షివిక్కు ల ప్రభావంలో ఉంది.

ఇక ఇక్కడ, సరిహద్దుల బయట పరిస్థితి ఏమిటి? ఇక్కడ శ్రామికులు ఎలా ప్రతి దానికి ఎదురుతిరుగుతున్నారో చూస్తూనే ఉన్నావు కదా. మాట అంటే సమ్మెలు. ఈ సమావేశానికి సభ్యులంతా కాలి నడకనే వచ్చారు.. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? మొత్తాన్ని సైన్య అధికారంలోకి తీసుకురావడం, కఠిన శిక్షలు ద్రోహులకు వేయడం, బొల్షివిక్కులను నిర్దాక్షిణ్యంగా అంతం చేయడం, ఇవే మనం ముందు చేయాల్సిన పనులు. అలెక్సీ మాక్సిమోవిచ్, నీ సహకారం ఈ విషయంలో నాకుంటుందని అనుకోవచ్చా?’

   ‘నేను మీతో తప్పక ఉంటాను.’

   ‘నాకు అది తెలుసు.నీకు కృతజ్ఞతలు.ఎప్పుడైతే గట్టి చర్యలు అవసరమవుతాయో, ప్రభుత్వం అన్యమనస్కంగా పేరుకి చేస్తూ ఉంటుంది. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. మనం ముందు చేసి తర్వాత మాట్లాడాలి. వాళ్ళు దానికి వ్యతిరేకంగా చేస్తారు. ఇలా నామమాత్రపు పనులు చేయడం వల్ల కలిగే నష్టాలను కూడా వారు త్వరలోనే చూస్తారు. నాకు ఇలాంటి నిజాయితీ లేని చర్యల్లో భాగం కావడం ఇష్టం లేదు. నేను ఏదైనా సూటిగానే చేస్తాను. చాటుగా చేయాల్సిన అవసరం నాకు లేదు.’

పొట్టిగా ఉన్న ఆ జనరల్ ఆగి, తన సహచరుడి కోటు బొత్తం మీద చేత్తో ఒత్తిడి పెడుతూ, కోపంగా అన్నాడు.

  ‘వాళ్ళు పగ్గాలు వదిలేసారు. ఇప్పుడు వారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక ప్రజాస్వామ్య ధోరణి వారినే భయపెడుతుంది.

వాళ్ళే నమ్మదగిన సైనిక దళాలను రాజధానికి తీసుకురమ్మని చెబుతున్నారు, ఇంకో వైపు ప్రజాస్వామ్యం గురించి సూక్తులు వల్లిస్తూ,ఏవైనా చర్యలు తీసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఒక అడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. అందరం ఏకం అయితే ఏదైనా చేయగలము. ఒకవేళ ఇది విఫలమైతే, అప్పుడు చూద్దాం. అప్పుడు నేను ఆయుధాలు లేకుండా యుద్దానికి వెళ్ళడానికి కూడా వెనుకాడను. జర్మన్లే వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయగలరు.’

            ‘నేను డుటోవ్ తో మాట్లాడాను. లావ్ర్ జార్జీయేవిచ్, కొసాక్కులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మనం భవిష్యత్తులో ఎలా కలిసి పని చేయగలము అన్న విషయం గురించి ఒక నిర్ణయానికి రావడం.’

  ‘ఈ సమావేశం అయిపోయాక

నేను నీ కోసం, ఇతరుల కోసం నా ఆఫీసులో ఉంటాను. ఇంతకీ డాన్ లో వాతావరణం ఎలా ఉంది?’

  రెండో జనరల్ తన బుగ్గను ఛాతికి అదుముకుంటూ, కిందకు దించిన కళ్ళు పైకి ఎత్తి చూశాడు. అతను మాట్లాడుతూ ఉంటే పెదవుల చివర్లు వణుకుతూ ఉన్నాయి.

   ‘నాకు ఇది వరకటి నమ్మకం ఇప్పుడు కొసాక్కుల మీద లేదు… ఏదీ ఏమైనా ఇప్పుడు వారి మనస్సులో ఏముందో చెప్పడం కష్టం. అవసరమైతే మనమే రాజీ పడాలి.బయటి వారి సహాయ సహకారాలు కావాలంటే కొసాక్కులు ఏదో ఒకటి త్యాగం చేసేందుకు సిద్ధపడాలి. ప్రస్తుతం ఆ దిశలోనే పని చేస్తున్నాము. కానీ విజయం గురించి భరోసా లేదు.ఇక్కడ కొసాక్కులకు, బయటి వారికి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఆలోచిస్తున్న భూముల విషయానికి వస్తే… ఇది ఇప్పుడు ఇరువైపులా ఉంది.’

‘అంతర్గ ఉపద్రవాలు సంభవిస్తే మనకు అండగా ఉండే కొన్ని నమ్మదగిన కొసాక్కు విభాగాలు ఇప్పుడు మనకు కావాలి. నేను ప్రధాన కార్యాలయానికి వెళ్ళిన తర్వాత లుకోమ్ స్కీ తో మాట్లాడి, యుద్ధ సరిహద్దు నుండి కొన్ని రెజిమెంటులను డాన్ కి పంపించే ఏర్పాటు చేస్తాను.’

 ‘నేను దానికి మీకు కృతజ్ఞుడునై ఉంటాను.’

‘ఈ రోజు మనం మన భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుకుందాము. మన వ్యూహాలు తప్పక విజయం సాధిస్తాయన్న నమ్మకం నాకు ఉంది. కానీ అదృష్టం ఎప్పుడు మోసపూరితంగానే ఉంటుంది. జనరల్, ఒకవేళ ఇంత చేసినా, ఏదైనా విఫలమైతే, నాకు డాన్ లో ఆశ్రయం దొరుకుతుందని ఆశించవచ్చునా?’

   ‘ఆశ్రయం మాత్రమే కాదు, రక్షణ కూడా. అనాది నుండి కొసాక్కులు అతిధి ధర్మానికి వాసికెక్కారు’, ఆ మొత్తం సంభాషణలో మొదటిసారి నవ్వుతూ అన్నాడు కలేడిన్.

ఒక గంట తర్వాత డాన్ ప్రాంత అటామాన్ కలేడిన్ ,పన్నెండు కొసాక్కు సైన్యాలకు చారిత్రక ప్రకటనను చదివి వినిపించాడు.అప్పటికే డాన్ ప్రాంతంలో ఉన్న కుబాన్ ,తెరెక్ ,ఉరల్ ,ఉస్సురి ,మొత్తం కొసాక్కు భూమి మీదుగా,అన్ని సరిహద్దుల్లో ,జిల్లాల్లో ,తెలియని కుట్ర రచనలు సాలెగూడులా అల్లుకుంటూ ఉన్నాయి.

 *   * 

  జూన్ లో జరిగిన యుద్ధ పేలుళ్ళ వల్ల  ధ్వంసమైన ఒక చిన్న పట్టణానికి ఒక వెరస్టు దూరంలో వంకర టింకర దారుల్లో అడవి లోపలికి పోయే దారిలో కందకాలు ఉన్నాయి. చెట్లకి దగ్గరగా ఉన్న సెక్టార్ లో కొసాక్కులు ఉన్నారు.

   దాని వెనుక, పచ్చటి వృక్షాల వెనుక నేలంతా చిత్తడిగా ఉంది. యుద్ధానికి ముందు అక్కడ తవ్వకాలు జరిపిన ఆనవాళ్ళు ఇంకా కనబడుతూనే ఉన్నాయి. అక్కడ పూచిన పుష్పాలు ఎర్రగా పొదల మీద మెరుస్తున్నాయి. దానికి కుడి వైపున అడవి చివరలో తుపాకీ తూటాలతో దద్దరిల్లిన ఒక రహదారి ఉంది. కొసాక్కులు ఇంకా ప్రయాణించాల్సిన అనేక దార్లకు అది సంకేతంగా ఉన్నట్టు ఉంది. ఆ అడవంతా తూటాలు దూసుకుపోయిన పొదలు,పిచ్చి మొక్కలు,అవి తాకి నల్లగా మారిన చెట్ల బెరడ్లతో ఉంది.వాటి పక్కన ఉన్న కంచె పక్కగా మిగిలిన కందకాలు ఉన్నాయి. ఆ రహదారి దగ్గర కొంత జీవమున్న దృశ్యం కనిపిస్తూ ఉన్నా, ఆ అడవిలో మాత్రం నిస్పృహ నిండిన దృశ్యమే అగుపిస్తుంది ఎవరికైనా.

   ఆ రోజు మొఖోవ్ మిల్లులో అంతక్రితం ఇంజిన్ మ్యాన్ గా పని చేసిన ఇవాన్ అలెక్సెయేవిచ్ కొట్లాయరెవ్,సహాయ సైనిక దళాన్ని ఏర్పాటు చేసిన పక్క పట్టణానికి వెళ్ళి,సాయంత్రం వరకు తిరిగి రాలేదు. తనుండే కందకానికి వెళ్తున్నప్పుడు అతనికి జాకర్ కొల్యోరోవ్ ఎదురయ్యాడు. అతను జాకర్ దగ్గరకు వస్తూ, తను మోస్తూ ఉన్న ఇసుక మూటను జాగ్రత్తగా తీసుకెళ్తూ, కళ్ళతోనే పలకరించాడు. ఇవాన్ అతను లోపలికి వెళ్ళడానికి అతనికి దారి ఇచ్చాడు.జాకర్ లోపలికి వెళ్ళే ముందు అతనితో గుసగుసగా, ‘నువ్వు ఇది విన్నావా? కుడి వైపున ఉన్న పదాతి దళం వెనక్కి వెళ్ళిపోతుందంట.బహుశా వారు యుద్ధం నుండి విరమించుకుంటున్నారనుకుంటా’,అన్నాడు.

   జాకర్ కళ్ళల్లో ఓ రకమైన క్రోధం వ్యక్తమవుతూ ఉంది.

   ‘యుద్ధం నుండి తప్పుకుంటున్నారా? ఎలా?’

   ‘నాకు ఎలానో తెలియదు,కానీ వార్తయితే వచ్చింది.’

  ‘బహుశా వారికి సెలవు ఇచ్చి ఉంటారు.పద వెళ్ళి మన దళపు అధికారిని అడుగుదాము.’

   జాకర్ ఆ ఇసుక మూటను అక్కడే వదిలేసి అధికారి కందకం వైపుకి దారి తీశాడు.

    ఒక గంట తర్వాత వారిని పట్టణానికి పంపించారు,వారి స్థానంలో పదాతి దళం అక్కడ ఉంచబడింది. తర్వాతి రోజు ఉదయం వారు గుర్రపుశాలలనుండి తమ గుర్రాలను తీసుకుని,ముందుకు సాగిపోయారు.

   వాన తుంపరులుగా పడుతూ ఉంది. చిన్న చెట్ల తలలు ఆ వానకు కిందకు వాలిపోతూ ఏదో విషాదాన్ని సూచిస్తున్నట్టు ఉన్నాయి. ఆ అడవిలో వెళ్తూ ఉంటే, వానతడికి వస్తున్న రాలిపడి ఉన్న చెట్ల ఆకుల మరియు మట్టి వాసనను పీలుస్తూ నిదానంగా ముందుకు కదులుతున్నాయి.ఒక్కసారిగా గాలి బలంగా వీయడంతో, చెట్ల చివర్ల నుండి వాన నీరు వాటి కిందగా గుర్రాల మీద వెళ్తూ ఉన్న సైనికుల టోపీల మీద,కోట్ల మీద రాలిపడ్డాయి. పొగాకు కూడా ఆ గాలిలో కలిసిపోయి ఆ ఆవిర్లు కూడా గిరికీలు కొడుతున్నాయి.

    ‘వాళ్ళు మనల్ని ఎక్కడికో పొమ్మని పంపిస్తున్నారు,ఎక్కడికి వెళ్తున్నామో ఆ దేవుడికే తెలియాలి.’

   ‘ఆ కందకాల్లో ఉన్నది నీకు సరిపోలేదా?’

     ‘బహుశా ఇంకో సెక్టార్ కి పంపిస్తున్నారేమో.’

    ‘చూస్తుంటే అలా లేదు.’

      ‘సరే ,ఒక దమ్ము కొట్టి ,ఆ బాధలు మర్చిపోదాము.’

   ‘నావి గుర్రపు జీను సంచీలో ఉన్నాయి.’

   ‘మేజర్ ,మమ్మల్ని ఒక పాట పాడుకోవడానికి అనుమతిస్తారా?’

     ‘ఆయన పాడుకోమన్నారు….అర్ఖిప్ ,ఇక ఎత్తుకో!’

     ఎవరో ఒకరు గొంతు సవరించుకుని అందుకున్నారు:

          భుజాల మీద హోదాల పట్టీలతో, గుండెల మీద పతకాలతో

         కొసాక్కు యాత్రికుడు,కొసాక్కు యాత్రికుడు ,ఇంటికి విశ్రాంతి కోసం పయనమయ్యాడు

       ఆ పాట అందుకున్న స్వరాలు నిరాశతో నిండిపోయి ఉత్సాహహీనంగా ఉన్నాయి. ఇవాన్ పక్కన  ఉన్న జాకర్ కోరోల్యోవ్, తన గుర్రం మీదగా నిలబడి, గట్టిగా అరిచాడు.

   ‘ఓయ్! ముసలి వాళ్ళైపోయారా? అలాగేనా పాట పాడేది? మీరు చర్చి బయట అడ్డుకోవడానికి సరిపోతారు.’

   ‘అయితే నువ్వే పాడు.’

    ‘అతని మెడ చిన్నగా ఉంటుంది, దానిలో గొంతు ఎక్కడ ఉంటుంది పాడటానికి?’

    ‘అంత డప్పులు కొట్టావు,మరి నువ్వు పాడతావా?’

    కొర్యోలోవ్ పేలు పట్టిన తన నల్లటి గడ్డాన్ని తన పిడికిలితో పట్టుకుని,కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని, పగ్గాలు అందుకుని, మొదటి వరుస అందుకున్నాడు:

        డాన్ కొసాక్కు ధైర్యానికి అభినందన  వేడుక చేయండి ….

       అది విన్న మిగిలిన వారు ఉత్సాహంగా గుంపుగా తర్వాతిది అందుకున్నారు.

             అదే గౌరవం,అదే విజయం !

      ఇక ఆ పాట ఆ అడవి అంతా మార్మోగిపోయింది.

      మేము శత్రువును ఎంత బాగా కాల్చామో

    అందరికీ తెలిసేలా చేయండి!

    క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధ రంగంలో  నిలబడతాము 

    ఆజ్ఞలు పాటిస్తాము

     మా అధికారుల నేతృత్వంలో

      మేము ఖడ్గం,డాలు,కత్తితో ప్రపంచాన్నే జయిస్తాము!

     నిస్పృహ నిండిన ఆ వాతావరణంలో ఆ పాట తెచ్చిన ఉత్సాహంతో వారు ముందుకు సాగారు. సాయంత్రానికి వారు రైళ్ళెక్కి స్కోవ్ వెళ్ళే దారిలో ఉన్నారు. ఆ దారిలో మూడు స్టేషన్లు దాటే సమయానికి,వారికి తాము మూడవ దళంతో కలిసి పెట్రోగ్రాడ్ లో తలెత్తిన అల్లర్లను అణచడానికి వెళ్తున్నామని తెలిసింది. ఆ తర్వాత వారంతా మౌనంగా ఉండిపోయారు.

   ‘సరాసరి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఉంది!’సన్నగా,పొడుగ్గా ఉన్న బొర్శ్చెవ్ అనే కొసాక్కు అందరి మనసుల్లో ఉన్న మాటనే పైకి అన్నాడు.

  దళపు కమిటీకి ఫిబ్రవరి నుండి ఛైర్మన్ గా ఉన్న ఇవాన్ కొట్ల్యరోవ్  మొదటి స్టేషన్ రాగానే దళపు కమాండర్ ను కలవడానికి వెళ్ళాడు.

   ‘కొసాక్కులు దిగులుతో ఉన్నారు,మేజర్!’

   ‘నాకే దిగులుగా ఉంది’, ఆ కమాండర్ ఇవాన్ బుగ్గ పై పడిన సొట్ట వైపు చూస్తూ, చిన్నగా నవ్వుతూ అన్నాడు.

    ‘మనల్ని ఎక్కడికి పంపిస్తున్నారు?’

   ‘పెట్రోగ్రాడ్ కి.’

    ‘అక్కడ అల్లర్లు అణచడానికా?’

    ‘నువ్వు ఏమనుకుంటున్నావు …వాటిని ప్రోత్సహించాలా?’

   ‘మాకు ఏది చేయాలని లేదు.’

   ‘ఇక్కడ ఎవరూ మనం ఏది చేయాలనుకుంటున్నామో అడగటం లేదు.’

   ‘కానీ కొసాక్కులు…’

   ‘కొసాక్కుల సంగతి ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. నాకు ఇది ఇష్టమై చేస్తున్నానని అనుకుంటున్నావా? ఇది తీసుకువెళ్ళి వాళ్ళకు చదివి వినిపించు. తర్వాతి స్టేషన్ లో నేనే స్వయంగా వారితో మాట్లాడతాను’, కోపంగా అతన్ని అడ్డుకుంటూ అన్నాడు.

   కమాండర్ ఒక టెలిగ్రామ్ ని అతనికి అందించి, ముఖం చిట్లించుకుంటూ, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

   చేతిలో కాలుతున్న బొగ్గుని పట్టుకున్నట్టు ఆ టెలిగ్రామ్ ని పట్టుకుని తన దళం దగ్గరకు వచ్చాడు ఇవాన్.

  ‘మిగతా బండ్లలో ఉన్న కొసాక్కులను కూడా పిలవండి.’

   ఆ బండ్లు  బయలుదేరే లోపు గుంపుగా కొసాక్కులు అక్కడికి చేరుకున్నారు. దాదాపుగా ముప్పై మంది దాకా చేరారు.

   ‘కమాండర్ కి ఒక టెలిగ్రామ్ వచ్చింది .అది ఇప్పుడే నేను చదివాను.’

   ‘అవునా?అందులో ఏముంది? మాకు కూడా చదివి వినిపించండి!’

   ‘అవును,చదవండి.’

   ‘అది శాంతి గురించా?’

   ‘నిశ్శబ్దం!’

  ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఇవాన్ సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ కొర్నీలోవ్ పంపిన ఆ టెలిగ్రామ్ ని బిగ్గరగా చదివాడు.తర్వాత ఆ టెలిగ్రామ్ ఒక చేతి నుండి ఇంకో చేతికి మారుతూ ఉంది.

  సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ అయిన కొర్నిలోవ్ గా నేను ఈ యావత్తు దేశానికి ప్రకటించేది ఏమిటంటే:

     ఒక సైనికుడిగా, నా మాతృదేశమైన రష్యా పట్ల బాధ్యత ఉన్న పౌరుడిగా, ఈ ప్రమాదకర పరిస్థితుల్లో దేశం కోసం ప్రొవిజినల్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి, సైన్య-నేవీలను సంపూర్ణ అధికారంలోకి తేవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నాను. నా ఈ నిర్ణయాన్ని అన్నీ యుద్ధ సరిహద్దుల కమాండర్ ఇన్ చీఫ్ లు ఆమోదించారు.నేను పదవీచ్యుతుడిని కావడం కంటే మరణాన్నే ప్రియంగా ఆహ్వానిస్తాను. రష్యా నిజమైన ముద్దుబిడ్డ ఎప్పుడూ తన పదవిలోనే తుది శ్వాస విడిచి,అమూల్యమైన తన ప్రాణాన్నే దేశం కోసం త్యాగం చేస్తాడు.

    ప్రమాదకర పరిస్థితిలో ఇప్పుడు దేశం ఉన్నది. రెండు రాజధానులు  శత్రువు రాకకై ఆహ్వానం పలుకుతున్నట్టు ఏ రక్షణా లేకుండా ఉన్నాయి. ప్రొవిజినల్ ప్రభుత్వం ఈ సందర్భంలో దేశ రక్షణ గురించి కాకుండా ఊహా జనితమైన విప్లవ భయాలతో సతమతమవుతూ,అధికార బలగాలను కూడా నిరుత్సాహపరుస్తూ,దేశాన్ని కష్టాల వైపుకి నెట్టేస్తూ ఉంది.

      మన దేశం కోసం తమ రక్తాన్ని ధారబోసిన మన పూర్వీకులకు,మనకు ఈ పరిస్థితి సమ్మతం కాదు. ఈ రోజు మన దేశ భవిష్యత్తు బలహీనుల చేతుల్లో ఉంది. లంచాల  లేదా ద్రోహ చర్యల ద్వారా  మన దేశపు వ్యవహారాల గురించి శత్రువు తెలుసుకుంటూనే ఉంటాడు.ఆ శత్రువు దేశ ప్రజల స్వేచ్చనే కాకుండా దేశ ఉనికికే ప్రశ్నార్థకంగా మారతాడు. ఓ నా ప్రియమైన రష్యా ప్రజలారా,కళ్ళు తెరవండి.అగాథంలోకి పడిపోతున్న మన దేశాన్ని చూడండి!

    ఈ అడ్డంకులను,అవమానాలను,అంతర్గత కలహాలను లెక్కచేయకుండా నేను ప్రజల తరపున ప్రొవిజినల్ ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే: రండి,వచ్చి నన్ను నా కార్యాలయంలో కలవండి. మీ స్వేచ్చ,భద్రతల బాధ్యత నాది. మన దేశ పునర్నిర్మాణ చర్యలో వచ్చి భాగమయ్యి, అద్భుత భవిష్యత్తును సృష్టించండి.

                                                                         -జనరల్ కొర్నిలోవ్

    తర్వాతి స్టేషన్ దగ్గర రైలు వెంటనే కదలలేదు. చాలా సేపు ఆగే ఉంది. ఆ సమయంలో కొసాక్కులు కిందకి దిగి గుంపులుగా ఏర్పడి, వాళ్ళ దళపు కమాండర్ చదివి వినిపించిన కొర్నిలోవ్ టెలిగ్రామ్ గురించి ,అలాగే కెరెన్ స్కీ నుండి వచ్చిన టెలిగ్రామ్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. విప్లవాన్ని వ్యతిరేకిస్తున్న కొర్నిలోవ్ వారి దృష్టిలో ద్రోహిగా కనిపించాడు. కొసాక్కులు అయోమయంలో పడ్డారు. అధికారులు కూడా సందిగ్దావస్థలో ఉన్నారు.

    ‘నా తల తిరిగిపోతుంది.అసలు ఎవరూ తప్పు చేస్తున్నారో నాకు తెలిస్తే బావుండు!’, మార్టిన్ షామిల్ ఫిర్యాదుపూర్వకంగా అన్నాడు.

  ‘వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు,దెబ్బలు మాత్రం మనకే తగులుతాయి.’

   ‘అసలు వాళ్ళ కొవ్వు వల్లే ఈ సమస్యలన్నీ కూడా.’

       ‘వాళ్ళంతా మన నెత్తి పైనే ఉండాలనుకుంటారు.’

       ‘అధికారం అటూయిటూ అయినా మన పరిస్థితులే తారుమారైపోతాయి.’

     ‘అసలు అంతా చేయిజారిపోతూ ఉంది. నిజంగానే మనం సమస్యలో చిక్కుకున్నాం!’

   కొందరు కొసాక్కులు గుంపుగా ఇవాన్ దగ్గరకు వెళ్ళారు.

  ‘పదండి వెళ్ళి కమాండర్ ని కలిసి ఏం జరుగుతుందో  కనుక్కుందాము.’

   వాళ్ళంతా కలిసి గుంపుగా వెళ్ళారు. ఇవాన్ వెళ్ళేసరికి కమాండర్ ఇంకొందరు అధికారులతో కలిసి తన బండిలో ఉన్నాడు.

  ‘కమాండర్, కొసాక్కులు మనం ఏం చేయబోతున్నామో  తెలుసుకోవాలని అనుకుంటున్నారు’,అన్నాడు ఇవాన్.

  ‘ఒక్క నిమిషంలో నేను కిందకి వస్తాను.’

   ఆ గుంపు అంతా వెనక్కి వెళ్ళి వేచి చూస్తూ ఉంది. కాసేపటికి కమాండర్ అక్కడికి  వచ్చాడు.

    ‘మనం కెరెన్ స్కీ కి విధేయులము కాదు.మనం సుప్రీం కమాండర్ కు,మన పై అధికారులకు మాత్రమే మన విధేయత ప్రకటించాలి. కనుక మనం ఏం ప్రశ్నించకుండా ఆజ్ఞలను అనుసరించి వెంటనే పెట్రోగ్రాడ్ కు వెళ్ళాలి. మనం ఆఖరి స్టేషన్ డ్నో దగ్గరకు వచ్చాక అక్కడ ఉండే మొదటి కొసాక్కు విభాగ కమాండర్ ను కలిసి అసలు విషయమేమిటో కనుక్కుందాము. ఆపాటికి అంతా స్పష్టంగా తెలిసిపోతుంది కూడా. కొసాక్కులారా, దిగులు పడకండి. మనం ఇప్పుడు కష్ట కాలంలో ఉన్నాము.’

    ఆ తర్వాత ఆయన మాతృభూమి,సైనికుని బాధ్యతలు, విప్లవం మొదలైన వాటి గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ వారిని మామూలుగా చేసే ప్రయత్నం చేశాడు. అతను తన ప్రయత్నంలో విజయం సాధించాడు కూడా. అతను మాట్లాడుతున్న సమయంలో వారికి తెలియకుండా ఇద్దరు అధికారులు రైలు నడిపే మనిషి తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి రైలు బయలుదేరేలా చేశారు. దానితో కొసాక్కులు  వెంటనే బండ్లలోకి ఎక్కారు.

   డ్నో చేరడానికి దాదాపుగా వారికి  ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది. రాత్రి సమయంలో ఉస్సురి కొసాక్కులను, డాగేస్తాన్ రెజిమెంటును తీసుకువెళ్తున్న రైళ్ళు వెళ్ళే వరకు ఆగడంతో కొంత ఆలస్యం అయ్యింది. వారూ వెళ్తూ పాడుతున్న పాటలు, గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు గాలిలో కలిసిపోయి, కొన్ని వినవచ్చాయి.

    మరలా ఆ దళం ఉన్న బండి అర్థరాత్రి కదిలింది. కదిలి మళ్ళీ కాసేపటికి ఆ బండి ఆగింది. డ్రైవర్ కిటికీలో నుండి బయటకు తల పెట్టి సిగరెట్టు వెలిగించుకున్నాడు,దేని కోసమో ఎదురుచూస్తున్నట్టు. ఇంజిన్ కి దగ్గరలో ఉన్న ఒక కొసాక్కు తన తల బయటకు పెట్టి, ‘ఓయ్,వెంటనే బండి పోనిచ్చు.లేకపోతే నీ బుర్ర పేలిపోద్ది’,అని అరిచాడు.

   ఆ డ్రైవరు కాసేపటికి సిగరెట్టు పీకను బయటకు విసిరేసి, దానినే కాసేపు చూసి, తర్వాత తన గొంతు సవరించుకుని,’నువ్వు అందరినీ కాల్చి పారెయ్యలేవు’,అన్నాడు.

  కొద్ది నిమిషాల తర్వాత శబ్దం చేస్తూ ఇంజిన్ కదిలింది,ఒక్కసారిగా కదలడంతో గుర్రాలు సంభాళించుకోవడానికి కదలడంతో వాటి డెక్కల శబ్దం కూడా గాలిలో కలిసింది. వాటర్ టవర్ నూ, దీపాలు వెలిగించి ఉన్న కొన్ని ఇళ్ళను,వృక్షాలను దాటింది. దాదాపుగా అందరూ కొసాక్కులు తమ గుర్రాలకు మేత పెట్టి  వచ్చి తమ స్థానాల్లో కూర్చున్నారు. కొందరు మాత్రం సగం తెరిచి ఉన్న తలుపుల  దగ్గర నిలబడి సిగరెట్టు వెలిగించుకుంటూ,ఆకాంశంలోకి చూస్తూ,తమ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు.

    ఇవాన్ కొర్యిలోవ్ పక్కన నిలబడి, సగం తెరిచి ఉన్న ద్వారంలోనుంచి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ ఉన్నాడు. అంతకుముందు రోజు అతను అన్నీ ఆలోచించుకుని ఏం చేసైనా సరే,తమ దళం పెట్రోగ్రాడ్ వైపు వెళ్ళకుండా చూడాలని అనుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయాన్ని కొసాక్కులు ఆమోదించేలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.

    కొర్నిలోవ్ ఆజ్ఞ రాక ముందే జనరల్ కొసాక్కులకు సుముఖంగా లేడని, జరగబోయే దాని వల్ల కేరెన్స్కి కి రక్షణ కూడా ఉండదని అతనికి బలంగా అనిపించింది. అందుకే అతను దాని గురించి ఆలోచించుకుని, నిర్ణయించుకున్నాడు. ‘అవును,నేను ఎలా అయినా సరే ఈ దళం పెట్రోగ్రాడ్ కు వెళ్ళకుండా ఆపాలి. ఒకవేళ దీని వల్ల ఎవరితోనైనా తలపడాల్సి వచ్చినా,ముఖ్యంగా అది కొర్నిలోవ్ తోనే అవ్వొచ్చు. అతను ఇది చేసేది కేరెన్ స్కీ కోసం,అతని ప్రభుత్వం కోసం మాత్రం కాదు, ఇంకొకరి కోసం.’ఇలా అతని ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. కేరెన్ స్కీ ప్రభుత్వంలోకి వస్తేనే తమ జీవితాలు బాగుంటాయని ఇవాన్ గట్టిగా నమ్ముతున్నాడు. ఆ వేసవి కాలంలో అతను పెట్రోగ్రాడ్ లో కార్యనిర్వాహ కమిటిలోని మిలటరీ విభాగంలో ఉన్నాడు. ఆ సమయంలో దళపు కమాండర్ తో తలెత్తిన గొడవ మీద సలహా కోసం అతన్ని పిలిపించారు. అక్కడ వాతావరణం గమనించాక, అక్కడున్న కొందరు బొల్షివిక్కులతో మాట్లాడాక,’శ్రామికుల ప్రాతినిధ్యం కూడా ఉంటేనే,నిజమైన అధికారం వచ్చినట్టు. దీని కోసం చావాల్సి వచ్చినా,లెక్క చేయకూడదు’, అని అతను ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాడు.

   ఆ రాత్రి అతను,తనకు తెలియని ప్రేమను తనకు పరిచయం చేసి,, ఇప్పుడు తనున్న మార్గానికి పునాది వేసిన వ్యక్తిని గుర్తు తెచ్చుకున్నాడు. కొసాక్కులకు తర్వాతి రోజు ఏం చెప్పాలో ఆలోచిస్తూనే ,స్టోక్ మాన్ కొసాక్కుల గురించి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని,వాటిని తన మనసులో మళ్ళీ వల్లె వేసుకున్నాడు. ‘కొసాక్కులు సాంప్రదాయ పద్ధతుల్లోనే ఆలోచిస్తారు. నువ్వు బొల్షివిక్కుల ఆలోచనల గురించి వారికి చెప్పే ముందు ఇది మనసులో పెట్టుకుని జాగ్రత్తగా పరిస్థితులకు అనుగుణంగా వారిని ఇందుకు సిద్ధం చెయ్యి. వారు మొదట్లో నువ్వు,మిష్కా కొషివోయ్ ఎలా అయితే నాకు సానుకూలంగా లేరో అలాగే వారు కూడా ఉంటారు ,కానీ దాని గురించి దిగులు పడకు. పట్టుదలతో వారిని ఒప్పించు,తప్పక మనమే గెలుస్తాము.

    కొర్నిలోవ్ కి వ్యతిరేకంగా కొసాక్కులతో మాట్లాడితే తప్పక వారి నుండి వ్యతిరేకత వస్తుందని ఇవాన్ ఊహించాడు.కానీ మరుసటి ఉదయం ఎప్పుడైతే అతను తన దళం యుద్ధ ప్రాంతంలోకి వెళ్ళాలే తప్ప తమ వారినే చంపడానికి పెట్రోగ్రాడ్ కి వెళ్ళకూడదని సూచించినప్పుడు మిగిలిన కొసాక్కులు వెంటనే దానికి ఒప్పుకున్నారు. జాకర్ కొర్యోలోవ్ ,చెర్నిశేస్వాస్కాయ స్టానిట్సా కు చెందిన టురిలిన్ ఇవాన్ కు సన్నిహితులుగా ఉన్నారు. ఆ రోజంతా వారు కొసాక్కులతో ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ సాయంత్రం ఎప్పుడైతే రైలు ఒక స్టేషన్ దగ్గర ఆగిందో అప్పుడు మూడవ దళపు సార్జెంట్ షెనీచ్నికోవ్ ఇవాన్ దగ్గరకు వచ్చాడు.

   ‘దళం తర్వాతి స్టాప్ దగ్గర దిగిపోతుంది! అసలు కొసాక్కులకు ఏం కావాలో తెలుసుకోలేని నువ్వు ఏ రకమైన కమిటీ ఛైర్మన్ వి? ఇప్పటికే మమ్మల్ని బాగానే వెధవల్ని చేశారు. ఇంకా మేము అలా కాదలచుకోలేదు. అక్కడ అధికారులు తెలివిగా మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకేనా నిన్ను ఎన్నుకుంది? ఏంటి,నవ్వుతున్నావు?’ అన్నాడు.

‘మొత్తానికి ఇప్పటికి మేలుకొన్నావన్నమాట’, ఇవాన్ నవ్వుతూ, అడిగాడు.

తర్వాత స్టేషన్ దగ్గర అతనే ముందు బండి నుండి కిందకి దిగాడు. టురిలిన్ తో కలిసి స్టేషన్ మాస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు.

 ‘ఇక రైలుని ముందుకు పంపించొద్దు. మేము ఇక్కడే దిగిపోతున్నాము’, అన్నాడు.

  ‘అది ఎలా కుదురుతుంది?మాకు ఆజ్ఞ ఉంది…’ అంటూ స్టేషన్ మాస్టర్ వ్యాకులతతో అన్నాడు.

‘ఆ ఆజ్ఞ నీ దగ్గరే ఉంచుకో!’ టురిలైన్ నవ్వుతూ అద్దుకున్నాడు.

  వాళ్ళు స్టేషన్ కమిటీ సభ్యులను పిలిపించి, దాని ఛైర్మన్ కి అంతా వివరించారు. కొద్ది నిమిషాల తర్వాత  ఆ రైలు నడిపే వాడు ఆ బండిని  ఆపేసాడు.

   కొసాక్కులు తమ గుర్రాలను కిందికి దింపారు. ఇంజన్ దగ్గర రెండు కళ్ళు ఎడంగా పెట్టుకుని, ముఖం పైన పట్టిన చెమటని తుడుచుకుంటూ నిలబడి ఉన్నాడు ఇవాన్.

పాలిపోయిన ముఖంతో ఆ దళపు కమాండర్ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

‘నువ్వు ఏం చేస్తున్నావు? నీకు తెలిసే చేస్తున్నావా…?’

  ‘అవును, నాకు తెలుసు! అరవకండి మేజర్!’ అన్నాడు ఇవాన్ కటువుగా.

   ‘నీ అరుపులు వినే రోజులు పోయాయి!ఇప్పుడు నువ్వు వినే రోజులు వచ్చాయి. ఇది ఇక ఇలాగే కొనసాగుతుంది’,ఇవాన్ హెచ్చరించాడు.

   ‘సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ కొర్నిలోవ్…’అంటూ ఆ మేజర్ మళ్ళీ మొదలుపెట్టాడు. కానీ ఇవాన్ అతని వైపు ఎగాదిగా చూస్తూ, చేత్తో ఆపమన్నట్టు సంకేతం ఇస్తూ,’ఆయన్ని ఆ సిలువకు బదులు నీ మెడకు ఉరి వెయ్యి, మాకు ఆయన అవసరం లేదు’, అన్నాడు.

   మేజర్ వెంటనే పరిగెత్తుకుంటూ తన బండి దగ్గరకు వెళ్ళిపోయాడు.

   ఒక గంట తర్వాత ఆ దళం ఒక్క అధికారి కూడా లేకుండా నైరుతి దిశ వైపుకి గుర్రాలను దౌడు తీయించారు. ఆ బృందానికి  నాయకత్వం వహించిన ఇవాన్,అతని కుడి భుజంలా ఉన్న టురిలిన్, ముందు వెళ్తున్నారు. వారిని ఆ బృందం అనుసరిస్తుంది.అంతకుముందు ఉన్న అధికారి దగ్గర ఉన్న పటం ఆధారంగా వారు గోరెలోవ్  గ్రామానికి చేరుకొని, ఆ రాత్రి అక్కడే బస చేశారు. వారందరూ ఎవరూ ఆపినా సరే లెక్క చేయకుండా యుద్ధభూమికి వెళ్ళి యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు.

   గుర్రాలకు మేత పెట్టి, కొందరు పహరా కాస్తూ ఉండగా మిగిలిన కొసాక్కులు నిద్ర పోతున్నారు. ఆ గ్రామంలో దీపాలు ఎక్కడా వెలిగించి లేవు. అక్కడ ఉన్న వారంతా నిస్పృహతో ఉన్నారు. అసలు సరదాగా మాటలు మాట్లాడుకునే వాళ్ళే కనిపించలేదు.చూస్తూ ఉంటే వారి ఆలోచనలను బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తుంది.

‘ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకుని, వాళ్ళకు వాళ్ళే లొంగిపోతే ఏమవుతుంది?’ ఇవాన్ తనలో తానే అనుకున్నాడు.

   ఇవాన్ ఆలోచనలు అర్థం చేసుకున్నట్టు, టురిలిన్ అతని దగ్గరకు వచ్చాడు.

 ‘ఇవాన్, ఇంకా నువ్వు నిద్ర పోలేదా?’

 ‘లేదు ఇంకా.’

  టురిలిన్ అతని పక్కనే కూర్చుని, సిగరెట్టు వెలిగించుకుని, గుసగుసగా అన్నాడు.’కొసాక్కులు దిగులుగా ఉన్నారు.ఆజ్ఞను ధిక్కరించినందుకు భయపడుతున్నారు. మనం కూడా ఆపదలో చిక్కుకున్నాం కదా. నువ్వు ఏమంటావు?’

  ‘ఎలా జరుగుతుందో చూద్దాం. నువ్వు భయపడటం లేదు కదా?’ ఇవాన్ అడిగాడు.

  టురిలిన్ టోపీ వెనుక గోక్కుంటూ,నవ్వుతూ అన్నాడు.

  ‘నిజం చెప్పాలంటే కొద్దిగా భయంగానే ఉంది. ఇంతకుముందు లేదు, ఇప్పుడే భయం ఆవరిస్తూ ఉంది.’

  ‘అంటే ఈ కష్ట కాలంలో నువ్వు గట్టిగా ఉండే రకం కాదన్నమాట.’

‘అలా కాదనుకో, నేను గట్టివాడినే, అది నీకు తెలుసు.’

వాళ్ళు కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ గ్రామంలో అక్కడక్కడా మినుకుమంటున్న దీపాలు కూడా ఆరిపోయాయి. ఎక్కడో దూరం నుండి అడవి బాతు అరుపులు వినిపిస్తున్నాయి.

  ‘పెద్ద బాతే’, తనలో తానే గొణుక్కుని, నిశ్శబ్దమైపోయాడు టురిలిన్.

ఆ గ్రామంలోని పచ్చిక మీదుగా చల్లటి గాలి వీస్తూ ఉంది. గడ్డి అంతా మంచుతో తడిసి ఉంది. ఆ గాలి మంచుతో తడిసిన గడ్డి, రాలిపడి కుళ్ళిన ఆకుల వాసనని కొసాక్కుల క్యాంపు దగ్గరకు మోసుకు వస్తూ ఉంది. మధ్యామధ్యలో గుర్రాలు అటూ ఇటూ కదులుతున్న శబ్దం, వాటి ఊపిరి,గురకల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ కాసేపటికే అంతా నిశ్శబ్దంగా మారిపోతూ ఉంది.

   ఆ దళం ఉదయాన్నే బయలుదేరింది. ఆ ఊరిలోని పిల్లలు పశువులను మేపుతూ, ఆ గ్రామంలోని స్త్రీలు ఇంటి బయటకు వచ్చి చూస్తూ ఉండగా ఆ దళం తర్వాతి రోజు ఉదయం బయలుదేరింది. టురిలిన్ వెనక్కి తిరిగి చూస్తూ, ఇవాన్ తో ‘వెనక్కి తిరిగి చూడు, ఎవరో వస్తున్నారు’, అన్నాడు.

చుట్టూ ధూళి రేగుతూ ఉండగా, ముగ్గురు గుర్రాల మీద, గ్రామం సరిహద్దులు దాటి వారి వైపే వస్తున్నారు.

  ‘బృంద సభ్యులారా! ఆగండి!’ ఇవాన్ ఆజ్ఞపించాడు.

  వేగంగా కొసాక్కులంతా కూడలి దగ్గర ఆగారు. ఒక అర వెరస్టు దూరంలో వారిని వెంబడిస్తున్న వారు వారు ఆగడం చూసి వేగం తగ్గించారు. వారిలో ఒకరైన ఒక కొసాక్కు అధికారి, తన చేతి రుమాలు ఎత్తి తన తల పైన ఊపాడు.వారిని కొసాక్కులు పరీక్షగా చూస్తున్నారు.యుద్ధ క్షేత్రంలో ధరించే దుస్తులతో ఉన్న ఒక అధికారి గుర్రాన్ని ముందుకు పోనిచ్చాడు.

మిగిలిన ఇద్దరు అధికారులు కొద్ది దూరంలో ఆగిపోయారు.

   ‘మీకు ఏం కావాలి?’వారి ముందుకు గుర్రాన్ని తీసుకువెళ్తూ అడిగాడు ఇవాన్.

   ‘మాట్లాడటానికి వచ్చాము. మీలో ఎవరు ఈ బృందానికి అధికారిగా వ్యవహరిస్తున్నారు?’, ఆ అధికారి అడిగాడు.

  ‘నేనే.’

 ‘మొదటి డాన్ సైన్య విభాగం నన్ను ఇక్కడికి ప్రతినిధిగా పంపించింది. వారు ఈ ప్రాంత సైన్య విభాగ ప్రతినిధులు’, వెనుక ఆగిన ఇద్దరు అధికారుల వైపు కళ్ళతోనే చూపిస్తూ, తన గుర్రం మెడ నిమురుతూ కొనసాగించాడు.’మీకు మాట్లాడే ఉద్దేశ్యం ఉంటే వెంటనే మీ దళాన్ని గుర్రాలు దిగమని చెప్పండి. ఈ విభాగ కమాండర్ జనరల్ గ్రేకోవ్ నుండి మీకు   ఓ ఆజ్ఞ ఉంది’, అన్నాడు.

  కొసాక్కులు, ప్రతినిధులు గుర్రాలు దిగారు. ఆ కొసాక్కుల దగ్గరకు ఆ ప్రతినిధులు వచ్చారు. అందరూ వలయాకారంలో నిలబడ్డారు.

  మొదట కొసాక్కు అధికారి మాట్లాడాడు.

  ‘కొసాక్కులారా!మీరు మీ మనసు మార్చుకుని, ఈ చర్య వల్ల సంభవించే   భయంకర పరిణామాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పడానికే మేము వచ్చాము. నిన్న ఈ విభాగ ప్రధానకార్యాలయంలో మీరు ఎవరో దేశద్రోహి ప్రేరణతో రైలు దిగి, ఇలా వచ్చేసారని తెలిసింది. ఈ రోజు మీరు వెంటనే తిరిగి డ్నో స్టేషన్  రావాలని కార్యాలయం నుండి ఆజ్ఞ వచ్చింది. నిన్న ఈ ప్రాంత సైన్యం విభాగం మిగిలిన పదాతి దళాలతో కలిసి పెట్రోగ్రాడ్ ను ఆక్రమించినట్టు టెలిగ్రామ్ ద్వారా సందేశం వచ్చింది. మన సైనిక దళాలు రాజధానిలోకి ప్రవేశించి,అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను, టెలిగ్రాఫ్ -టెలిఫోన్ ఎక్స్ చేంజ్ లను, మిగిలిన ముఖ్య ప్రాంతాలను స్వాదీనం చేసుకున్నాయి. ప్రొవిజినల్ ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది, అందులోని వారు పారిపోయారనే అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి కొసాక్కులారా!ఒకవేళ మీరు ఈ విభాగ కమాండర్ ఆజ్ఞను ధిక్కరిస్తే సాయుధ దళాలు మీ మీదకు పంపబడతాయి. మీ చర్యను దేశద్రోహం గాను, యుద్ధంలో క్రమశిక్షణా రాహిత్యంగానూ భావించబడతాయి. ఇప్పుడు ఈ ఆజ్ఞను ఉల్లoఘించకుండా ఉండటం వల్ల మాత్రమే మీరు ఈ ప్రమాదం నుండి బయటపడగలరు.’

ఆ వచ్చిన ప్రతినిధులను చూసిన ఇవాన్, అప్పటికే కొసాక్కుల మనఃస్థితి గురించి కొంత అంచనా ఉండటం వల్ల, ఈ రాయబారం లేకుండా చూసే అవకాశం లేదని గ్రహించాడు. మాట్లాడటానికి నిరాకరిస్తే పూర్తిగా విరుద్ద ఫలితాలు ఉంటాయని కూడా అతనికి తెలుసు. ఒక నిమిషం ఇవన్నీ ఆలోచించుకునే, అతను దళానికి దిగమని ఆజ్ఞ ఇచ్చి, టురిలిన్ కి సంజ్ఞ  చేసి, ప్రతినిధుల దగ్గరకు వెళ్ళాడు. ఆ ప్రతినిధి మాట్లాడుతున్నంతసేపు అతను కిందకు వంచి ఉన్న కొసాక్కుల ముఖాల వైపే చూస్తూ ఉన్నాడు. వారిలో కొందరు గుసగుసలాడుతూ ఉన్నారు. జాకర్ కొరోలియోవ్ నవ్వుతూ ఉన్నాడు;బోర్సచేవ్ కొరడాతో ఆడుకుంటూ పక్కకు చూస్తూ ఉన్నాడు ;షెన్ చెనికోవ్ నోరు తెరుచుకుని అధికారి వైపే చూస్తూ ఉన్నాడు;మార్టిన్ తన మురికి చేత్తో బుగ్గలు రుద్దుకుంటూ కన్ను కొడుతూ ఉన్నాడు;అతని వెనుకే శ్రద్దగా ఆ ప్రతినిధి వైపే చూస్తూ ఉన్న బాగ్రోవ్ , క్రాంసికొవ్  ఉన్నారు.టురిలిన్ ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు;ముఖం మీద మచ్చలతో ఉండే ఓబినిజోవ్ తన టోపీని తల వెనక్కి లాక్కుంటూ, తల అటూ ఇటూ ఊపుతూ ఉన్నాడు. రెండవ దళం అంతా కూడా దేవుడి ముందు ప్రార్థన చేస్తున్నట్టు తలలు వంచి;నిశ్శబ్దంగా ఉన్నారు, వారి ముఖాల్లో ఏ భావం స్పష్టం కావడం లేదు.

   ఎన్నాళ్ళ నుండో వేచి చూస్తున్న సమయం అప్పుడే ఆసన్నమైనట్టు ఇవాన్ కి అనిపించింది. ఇంకొద్ది నిమిషాలు వదిలేస్తే ఆ అధికారి తన మాటలతో కొసాక్కులను ఏమార్చగలడని ఇవాన్ కి తెలుసు. ఏం చేసి అయినా సరే,ఆ అధికారి మాటలు కొసాక్కుల్లో కలిగించే మార్పును, దాని వల్ల వారు తీసుకోబోయే నిర్ణయాన్ని అడ్డుకోవాలని అతను అనుకున్నాడు. అతను చెయ్యి ఎత్తి, వారి వైపు కళ్ళు పెద్దవి చూస్తూ,

‘సోదరులారా!ఒక్క నిమిషం ఆగండి!’అని అరుస్తూ, ఆ అధికారి వైపుకి తిరిగి,

‘ఆ టెలిగ్రామ్ మీరు తీసుకువచ్చారా?’అడిగాడు.

  ‘ఏ టెలిగ్రామ్?’ఆ అధికారి ఆశ్చర్యంతో అన్నాడు.

  ‘అదే పెట్రోగ్రాడ్ ను ఆక్రమణ గురించి  వచ్చిన టెలిగ్రామ్.’

  ‘టెలిగ్రామా? ఎందుకు? ఇప్పుడు దాని అవసరం ఏముంది?’

  ‘ఆహ!ఈయన అది తీసుకురాలేదు!’అనుకుంటూ ఆ దళం    ఓదార్పు పొందింది.

చాలా మంది తలలు పైకెత్తి ఇవాన్ వైపు నమ్మకంతో చూసారు.తన కీచు గొంతును పెంచి, అందరి దృష్టి ఆకర్షించేలా అరిచాడు.

  ‘అయితే అది తీసుకురాలేదనేగా మీరు చెప్పేది? మీ మాటను మేము నమ్ముతామని అనుకుంటున్నారా? మమ్మల్ని మాయ చేద్దామనుకుంటున్నారా ఆ మాటలతో?’

‘ఇవన్నీ మాయ మాటలు’, అని ఆ దళం అంతా మెల్లగా అనుకోసాగింది.

  ‘ఆ టెలిగ్రామ్ నాకు రాసింది కాదు, కొసాక్కులారా!’అన్నాడు ఆ అధికారి గుండె మీద చేయి వేసుకుంటూ.

కానీ అతని మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. దళమంతా తన వైపే తిరగడంతో, ఇవాన్ గాజు మీద పని చేస్తున్న వజ్రంలా పని చేయడం ప్రారంభించాడు.

  ‘అది నీ దగ్గర ఉన్నా సరే, మేము నువ్వు చెప్పినట్టు చేయము. మా వాళ్ళతో మేము యుద్ధం చేయలేము. వారికి వ్యతిరేకంగా వెళ్ళము కూడా. మీరు మమ్మల్ని వారికి వ్యతిరేకంగా చేద్దామనుకుంటున్నారు కదా? మేము, మిమ్మల్ని నమ్మము. అయినా ఇప్పుడు మీ మాయ మాటలు విని మోసపోయే మూర్ఖులు ఎవరూ లేరు. ఇంకా మీ అధికారుల అధికారానికి మేము తలలు వంచము. మీకు అర్ధమైంది అనుకుంటా!’

  ఒక్కసారిగా కొసాక్కులందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. జనం అంతా ముందుకు వచ్చి అరవసాగారు.

  ‘అదే మాట్లాడటం అంటే!’

  ‘అలాగే బుద్ధి చెప్పు!’

  ‘అదే సరైంది!’

  ‘వాళ్ళను వెనక్కి పంపించాలి.’

  ‘భలే బురిడీ కొట్టించాలనుకున్నారు!’

  ‘అయితే పెట్రోగ్రాడ్ లో ఉన్న మూడు కొసాక్కు రెజిమెంటుల సంగతి ఏమిటి? వాళ్ళు యుద్ధం చేయడానికి పెద్ద ఆసక్తి చూపనట్టు ఉంది.’

‘ఇటు చూడు, ఇవాన్!వాళ్ళని వదిలేయ్. వాళ్ళకు మాతో రమ్మని ఆజ్ఞ ఇవ్వు.’

 ఇవాన్ ఆ ప్రతినిధుల వైపు చూశాడు. ఆ కొసాక్కు అధికారి పళ్ళు కొరుక్కుంటూ ఓపికగా చూస్తున్నాడు;అతని వెనుకే ఓ కుర్ర అధికారి నిలుచుని కొసాక్కులనే చూస్తున్నాడు. ఇవాన్ ఏదో మాట్లాడబోతుంటే, ఆ అధికారి అతన్ని వారించి, ఆ కుర్ర అధికారితో గుసగుసలాడి, ‘డాన్ కొసాక్కులారా!ఈ ప్రాంతపు అధికారి మాట్లాడతారు ఇప్పుడు!’అన్నాడు.

  ఎవరి అనుమతి కోసం చూడకుండా, ఆ అధికారి, ఆ వలయాకారంలోకి అడుగుపెట్టి, తన బెల్టును సరిచేసుకుని మొదలుపెట్టాడు.

  ‘కొసాక్కు సోదరులారా!ఎందుకు ఇంత రగడ చేస్తున్నారు? మనం మిత్రుల్లా మాట్లాడుకుందాము. మీకు జనరల్ కొర్నిలోవ్ అవసరం లేదా? మీకు యుద్ధం అవసరం లేదా? సరే అయితే!మేము చేస్తాము మీతో యుద్ధం. మిమ్మల్ని ఈ రోజే అణచివేస్తాము. మా వెనుకే రెండు పెద్ద సైన్య సమూహాలు వస్తున్నాయి. ఇంకా గొడవ చేస్తారా? చెప్పండి’, మొదట మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టినా క్రమక్రమంగా అతని స్వరం హెచ్చుతూ చివరకు అరుపుగా మారింది.

  ‘మీరంతా బొల్షివిక్కు గా మారిన వాడి వల్ల తప్పుడు మార్గంలో ఉన్నారు. వాడిని అరెస్ట్ చేయిస్తాను ఇప్పుడే నేను! వాడిని పట్టుకోండి!’అన్నాడు.

అతను ధైర్యంగా ఇవాన్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, కోపంగా చూస్తూ ఉంటే;ఎర్రగా మారిన అతని ముఖం పైన చెమట చక్కిళ్ళ మీదకు జారుతూ ఉంది. అతని పక్కన ఉన్న అధికారి, నిశ్శబ్దంగా ఉన్నాడు. మరలా కొసాక్కుల్లో గందరగోళం మొదలైంది. ఇవాన్ సూటిగా ఆ కుర్ర అధికారి వైపే చూస్తూ ఉన్నడు, అసలు అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉన్నాడు ఇవాన్. ఆ సమయంలో ఆపన్నహస్తంలా వచ్చాడు టురిలిన్. అతను ఆ వలయం మధ్యలోకి దూకి, తన చొక్కా మధ్యలోకి చింపి, గట్టిగా అరిచాడు.

  ‘విషం కక్కే పాములు!.. దయ్యాలు!జిత్తులమారి నక్కలు!వాళ్ళు మిమ్మల్ని వెధవల్లా చూస్తూ ఉంటే అలాగే నిలబడి చూస్తారే? ఈ అధికారులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మీరేం చేస్తున్నారు? వాళ్ళని నరికి పారేయ్యకుండా పురాణం విన్నట్టు వింటున్నారు?… వాళ్ళ తలలు నరికి, రక్తం చిందించండి. మీరు వీరి మాటలు వింటూ కూర్చుంటే ఆయుధాలతో కాసేపట్లో సైన్యాలు దిగి తుపాకులు మీ తలలకు గురి పెడతాయి. తుపాకీలతో రాయబారాలు ఉండవు.

వాళ్ళు వచ్చేవరకు వీళ్ళు ఈ సోది చెప్తూ కాలయాపన చేస్తారు. ఇక మేలుకోండి కొసాక్కులారా!మీ కన్నా ముసలి అవ్వలు మేలు!’

  ‘గుర్రాలు అధిరోహించండి!’ఇవాన్ ఆజ్ఞ ఇచ్చాడు తన బృందానికి.

  ఆ ఆజ్ఞ ఆ బృందంలో తూటా పేలినట్టు పేలింది. వెంటనే కొసాక్కులంతా తమ గుర్రాలు అధిరోహించి నిమిషాల్లో సిద్ధమైపోయారు.

  ‘ఇటు చూడండి కొసాక్కులారా!’కొసాక్కు అధికారి అరిచాడు.

  ఇవాన్ తన తుపాకీని భుజం నుండి తీసి, ట్రిగ్గర్ మీద వేలు ఉంచి,’ఇక మాటలు అయిపోయాయి!ఈ సారి తుపాకీ మాట్లాడుతుంది ‘, అన్నాడు.

  కొసాక్కులు అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఆ ప్రతినిధులు కూడా హడావిడిగా గుర్రాలు ఎక్కి వెనక్కి పోవడం వారు చూసారు. వెళ్తూ ఆ కుర్ర అధికారి కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ తననే గమనించడం ఇవాన్ చూశాడు.

  తర్వాత కాసేపటికి మనుషులు కనుమరుగైపోయారు.బలంగా గాలులు వీస్తూ, వాతావరణం కూడా ఒక్కసారిగా అక్కడి పరిస్థితిలానే ఉద్రిక్తంగా మారిపోయింది.

     *   * 

   ఆగస్టు 29 కల్లా తాను క్రిమోవ్ నుండి అందుకుంటున్న టెలిగ్రాముల ద్వారా కొర్నిలోవ్ కు సైనిక దళాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వ్యూహం విఫలమైనట్టు స్పష్టమైపోయింది.

   మధ్యాహ్నం రెండు గంటలకు క్రిమోవ్ పంపించగా ఒక అధికారి ప్రధాన కార్యాలయ విభాగానికి వచ్చాడు. కొర్నిలోవ్ అతనితో అప్పటి పరిస్థితి గురించి చాలా సేపు చర్చించి, తర్వాత రొమానోవ్ స్కీ ని కూడా పిలిపించాడు. తన చేతిలో ఉన్న కాగితాన్ని ఉండగా నలుపుతూ, ‘మొత్తం అంతా నాశనం అయిపోయింది! మన ట్రంపు కార్డు కూడా తిరగబడింది. క్రిమోవ్ సమయానికి పెట్రోగ్రాడ్ కు సైన్యాన్ని తీసుకురాలేడు. అవి వచ్చేసరికి సమయం మించిపోతుంది కూడా. ఎంతో సులభంగా జరిగిపోతుందనుకున్నది కాస్త ఇప్పుడు అనేక అడ్డంకులతో నిండిపోయింది. అన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక్కసారి ఈ దళాల కదలికలను చూడు!’ రొమానోవ్ స్కీ కి క్రిమోవ్ ఆశ్విక దళాలు వెళ్ళే రైలు మార్గపు దారిని పటంలో చూపిస్తూ అన్నాడు. అసలే నిద్ర లేక అలసటతో ఉన్న ఆ ముఖంలో క్రోధపు ఛాయ కూడా కలిసిపోయింది. ‘అసలు ఆ రైల్వే వాళ్ళే మనల్ని బోల్తా కొట్టిస్తుంది. వాళ్ళకి దీని వల్ల వాళ్ళు అనుభవించబోయే శిక్ష ఏమిటో తెలియదు. ఒకవేళ ఇందులో మనం విజయం సాధిస్తే, వారిలో పదిమందిలో ఒకర్ని అక్కడికక్కడే ఉరి తీయిస్తాను. క్రిమోవ్ పంపించిన ఈ నివేదిక చదువు.’

    జిడ్డు పట్టిన తన ముఖాన్ని చేత్తో తుడుచుకుంటూ రోమాన్ స్కోవ్ ఆ ఉత్తరం చదువుతూ ఉంటే, కొర్నిలోవ్ వేగంగా ఒక ఉత్తరం రాశాడు.

       సైన్యపు అటామన్, అలెక్సి మాక్సిమోవిచ్ కాలేడిన్ ,నొవొచేరాస్క్ కు నేను రాసేది ఏమిటంటే:

     మీరు ప్రొవిజినల్ ప్రభుత్వానికి పంపించిన టెలిగ్రామ్ సారాంశం నాకు కూడా అందింది. దుర్మార్గుల కుయుక్తులతోనూ, దేశద్రోహుల వంచనలతోనూ వారి సహనం నశించిపోయింది. మాతృభూమికి ఏర్పడిన ఈ కష్టాల వలయంలో, కొసాక్కులు ఈ దేశం కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విపత్కర కాలంలో మేము జాగ్రత్తగా వ్యవహరిస్తాము. ఈ పరిస్థితిలో మీ కొసాక్కు ధర్మాన్ని అనుసరించి మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.

                                                                        -జనరల్ కొర్నిలోవ్

    ‘వెంటనే ఈ టెలిగ్రామ్ ని పంపించు’, తను రాయడం పూర్తయిన వెంటనే రోమనోవ్ స్కీ కి చెప్పాడు.

    ‘ ప్రిన్స్ బాగర్టిన్ కు సైన్యంతో ముందుకు కొనసాగమని సూచిస్తూ రెండో టెలిగ్రామ్ కూడా పంపించమంటారా?’

   ‘పంపించు.’

   రొమానోవ్ స్కీ ఒక నిమిషం ఆగి,జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అన్నాడు. ‘లావ్ర్ జార్జోవిచ్, నా దృష్టిలో మనం అప్పుడే నిరాశకు లోనవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మీరు జరగబోయేవి ఊహించడంలో కొంత లెక్క తప్పారని అనిపిస్తుంది.’

   తన తలపైన వలయాకారంలో తిరుగుతూ ఉన్న ఒక పచ్చ సీతాకోకచిలుకను పట్టుకోవడానికి కొర్నిలోవ్ తన చేతిని పైకి విదిలించాడు. తన పిడికిలి గట్టిగా బిగిస్తూ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే,అది కిటికీ వైపుకి తుర్రుమంది. ఎలాగో కొర్నిలోవ్ దాన్ని పట్టుకుని, ఏదో సాధించిన వాడిలా కుర్చీలో కూలబడ్డాడు.

   రొమానోవ్ స్కీ తన మాటలకు సమాధానాన్ని ఆశించాడు.కానీ కొర్నిలోవ్ మాత్రం చిరాకు,నిస్సహాయత కలిసిన చిరునవ్వు నవ్వాడు.

  ‘నాకు రాత్రి ఒక కల వచ్చింది’, అంటూ మొదలుపెట్టాడు. ‘నేను ఏం కలగన్నానంటే ఒక పదాతి దళానికి నేను బ్రిగేడ్ కమాండర్ గా ఉన్నాను. కార్పాతియా పర్వత శ్రేణుల దగ్గర మేము యుద్ధం చేస్తూ ఉన్నాము. మేము ఆ దారి గుండా వస్తూ ఒక పొలంలోకి వచ్చాము.మాకు ఓ వృద్ధుడైన రుతానియా వాడు ఎదురుపడ్డాడు. ఎంతో చక్కటి వస్త్రధారణతో ఉన్న అతను,మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. అతను నాకు తాగడానికి పాలు ఇచ్చాడు. తర్వాత తన జర్మనీ టోపిని తీసి, ‘తాగండి జనరల్. ఈ పాలలో ఔషద గుణాలు ఉన్నాయి’,అన్నాడు. నేను తాగాను. తర్వాత అతను నాకు తెలిసిన వాడివలె నా భుజం మీద తట్టాడు. ఆ తర్వాత మేము ఆ పర్వతాల్లో ప్రయాణం చేస్తూనే ఉన్నాము. కానీ అవి కార్పాతియా ప్రాంతంలో కాక ఏ అఫ్ఘనిస్తాన్ లోనో ఉన్నట్టు అనిపించాయి. అక్కడ దారంతా రాళ్ళతో నిండి ఉంది. మేము నడుస్తూ ఉంటే చిన్న చిన్న రాళ్ళు,కంకర కాళ్ళకు తగులుతూ ఉన్నాయి. కానీ అక్కడి ప్రకృతి మాత్రం సుందరంగా ఉంది …’

   గాలి బలంగా వీయడం వల్ల బల్ల మీద ఉన్న కాగితాలు కిటికీ గుండా బయటకు ఎగిరిపోయాయి. కొర్నిలోవ్ కిటికీ గుండా దగ్గరలో ఉన్న పచ్చికను చూశాడు.

   రొమానోవ్ స్కీ కూడా అతని దృష్టిని అనుసరించి  చూస్తూ,గట్టిగా నిట్టూర్చాడు.

   *   *   *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *