మబ్బు పట్టి
ఒకటీ అరా చినుకులు రాలుతున్నప్పుడు
ఇంటి ముందు దడి మీద కొంగలు వాలినట్లు
చెట్లు పూత పట్టి ఉన్నాయి
లోకం ముసురుకౌగిల్లో మూసుకుపోయింది
నీ కోసం పాడే ఒక కోకిల
కొమ్మల నీడల్లో ముడుక్కున్నది
నోరు తెరిచి నేను నాలుగు పాదాల
పాట పాడబోతాను
పొదల్లో వేటాడబడిన తల్లి కోసం
కుందేలు పిల్ల వెతుకుతూ ఉంటుంది
పాము పొలంగెనం తోర్రలోంచి బయటికొచ్చి
వానగాలి పీలుస్తూ ఉంటుంది
చెరువు నీలల్లో చిటుకూ చిటుకూ దూకుతున్న
మోత వినిపిస్తూ ఉంటుంది
వాటిని చూస్తూ నాలుగు పాదాల పాట చెదిరిపోతుంది
నా దగ్గర నీకోసం పాడటానికి పాట లేక
కోకిల గొంతు కోసం చూస్తూ ఉంటాను
ఒంటరి కుందేలు పిల్ల దిగులు చూసి
పాము కుబుసం విడవడం చూసి
చెరువులో చినుకులుగా తన రాగాలను
పారబోస్తూ ఉంటుంది కోకిల
వసంతం మరింత పూత బడుతూ ఉంటుంది కోకిలకై.