కొనటమేనా? చదివేది ఉందా?

Spread the love

బజారుకెళ్లి ఇష్టమైన స్వీట్లు కొని తెస్తాం – తినటానికి.

ఖరీదు ఎక్కువైనా లేటెస్ట్ మోడల్ కారును అప్పు చేసి మరీ ఇంటి ముందు నిలిపి మురిసిపోతాం -సుఖంగా ట్రావెల్ చేయటానికి.

అభిమాన రచయిత లేటెస్ట్ పుస్తకం మార్కెట్ లో విడుదలయిన రోజే క్షణం ఆలస్యం చేయకుండా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం – ఆసాంతం చదివేందుకు.

స్వీట్లు కొని తెచ్చామంటే – అది మీరు తినటానికి కాకపోవచ్చు. మధుమేహం నిత్యం వెంటాడే వారికి స్వీటు మీద ఘాటు ప్రేమున్నా,దాన్ని చంపుకుని దూరం పెడతారు. వీకెండ్ లో వచ్చే బంధుమిత్రుల ఆతిథ్యం కోసం స్వీట్లను తెచ్చి ఉంటారు.

పలురకాల కార్లంటే క్రేజున్న పెద్ద మనిషి ఐదో కారును ప్రదర్శన వస్తువుగా స్టేటస్ సింబల్ గా గరాజ్ లో చేర్చవచ్చు. అయినా అలవాటు పడిన, కలిసొచ్చిన కారులోనే ప్రయాణాలు సాగించవచ్చు.

స్వీట్లకూ కార్లకూ వర్తించే ఈ మినహాయింపు వెసులుబాట్లు పుస్తకాల విషయంలో ఉండవని ఢంకా బజాయించి మరీ తీర్మానించేస్తాం.

పుస్తకం కొన్నామంటే చదవటం మినహా మరో ఛాయిస్ ఏముంటుంది? అరిటాకులో మనముందు వడ్డించిన భోజనం తినటానికేనని మరోమాట లేకుండా చెప్పినట్లే పుస్తకమూ చదవటానికేననీ టక్కున చెప్తా౦.

అయితే పుస్తకాలు చాలామంది కొనేది చదవటానికేనని అనుకుంటే మనం పొరబడినట్లే.

కొందరికి పుస్తకాలు సేకరించటం, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి పుస్తకమూ కొని తేవడం,ఇంట్లో ప్రత్యేకంగా విశాలమైన గదిలో అందమైన అద్దాల బీరువాల్లో అమర్చడం – హాబీ.

ఇది కాస్ట్ లీ హాబీ అని వేరే చెప్పనక్కర్లేదు. క్షణం తీరుబడి లేని వ్యాపకాల్లో మునిగి తేలే పెద్దమనిషికి ఈ పుస్తకాల పిచ్చేమిటని అనుమానం రావడం సహజం.

పుస్తకాలకు ఆదరణ అడుగంటిపోయిన ఈ కాలంలోనూ రచయితలకూ కవులకూ ఇప్పటికీ ఎంతో కొంత సమాజంలో ఒక స్టేటస్ అనేది కొనసాగుతోంది. రచయితలు, జర్నలిస్టులు మేధావులనే అభిప్రాయం జనసామాన్యంలో పాతుకుపోయి ఇప్పటికీ చెక్కుచెదరటం లేదు. తప్పుల్లేకుండా పది లైన్ల వార్త కూడా రాయలేని రిపోర్టరు కూడా పెద్దరాతగాడుగా చలామణి అవుతున్నాడు మరి.

      వ్యాపారాల్లో, రాజకీయాల్లో పీకల దాకా కూరుకుపోయిన పెద్దమనిషికీ ఒక స్టేటస్ కావాలి. మేధావి ముద్ర వేయించుకోవాలి. రచయితలో, జర్నలిస్టులో, ప్రొఫెసర్ లో తారసపడినప్పుడు తమకూ చాలా విషయాలు తెలుసునని నిరూపించుకోవాలి. అందుకోసం ఎంతో కొంత మార్కెట్ స్టడీ తప్పనిసరి. డబ్బులెటూ పుష్కలం గనుక పుస్తకాలు కొని పడేస్తే ఇంగువ కట్టిన గుడ్డ చందంగా రచయితల పేర్లు కొంత దృష్టికి వస్తాయి. ఆ రచనల గురించి లోతుగా కాకున్నా అరకొరగానైనా మాట కలపవచ్చు.

       ఒక్క పుస్తకం కూడా పూర్తిగా చదవకపోయినా కొంతమంది దగ్గరిదారులు వెతికి పట్టుకుంటారు. వీరిని మనం కవర్ పేజి ఇంటలెక్చువల్స్ గా ముద్దుగా పిలుచుకోవచ్చు. కొత్త పుస్తకాన్ని  లైబ్రరీలో శాశ్వతంగా నిద్రావస్థలో చేర్చటానికి ముందు పుస్తకం కవర్ల పైకి దృష్టిని సారిస్తారు. కవర్ పేజీ పైన పుస్తకం పేరు,రచయిత పేరు ఉంటుంది కనుక బుర్రలో రిజిస్టర్ చేసుకుంటారు. లోపలి పేజీలు తిప్పటం కూడా సమయం వృధా కనుక వెంటనే కవర్ వెనక్కి వచ్చేస్తారు. ఆ కవర్ పై రచయిత ఫోటో, అతడు/ఆమె పరిచయం,ఆ పుస్తకంలోని ముఖ్య విశేషాలు వగైరా క్షణాల్లో చదివేసి ఆకళించుకుంటారు.

     పేర్లు అనవసరం గానీ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఆ మధ్య తమ పఠనాభిలాష గురించి స్వయంగా చెప్పుకున్న విశేషాలతో అభిమానులను అబ్బురపరిచారు. చేతిలో పుస్తకం హస్తభూషణమే కాదు, ఇంటలెక్చువల్ ముద్రకు సోపానమనే సత్యం వీరు నరనరానా జీర్ణించుకున్నారని వేరే చెప్పనక్కర్లేదు. కవర్ పేజీ డిటెయిల్స్ తో అప్పటికి కథ నడిపించేస్తారు చాలామంది బడా బాబులు.

   డబ్బున్న ఆసాములైతే బోలెడు డబ్బు పోసి పుస్తకాలు కొనగలరు. డబ్బుకి కటకటలాడే మధ్యతరగతి మందహాసాల గతి ఏమిటి? పుస్తకాలు కొనాల్సిన పనేమీ లేదు. అదను చూసి చదివిస్తానని అరువు తీసుకుంటే సొంత లైబ్రరీ, వరద గోదారిలా ఉరకలెత్తదా?

    అరువిచ్చిన పుస్తకం రెక్కలొచ్చిన పక్షిలాంటిది అని ఆరుద్ర బహుశ స్వీయానుభవంతో చెప్పి ఉంటాడు. అరువు పుస్తకాలతో అభిరుచి తీర్చుకునేవారు మరికొందరు.

       తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ప్రముఖులు- నార్ల వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్య, సి.వి.ఎన్.ధన్ -వీరి దగ్గర మంచి పర్సనల్ లైబ్రరీలు ఉండేవని చెప్పుకునేవారు. ఈ కోవలోనే మరికొంతమంది ఉంటారు.

     గుంటూరులో రవి కాలేజీ వ్యవస్థాపకుడైన సి.వి.ఎన్.ధన్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. గుంటూరు అరండేల్ పేట ఐదో లైను మొదట్లో ఉండే నవోదయ బుక్ హౌస్ కు సి.వి.ఎన్ .ధన్ తరచూ వెళ్ళి లేటెస్ట్ పుస్తకాలను ఏదీ వదలకుండా కొని తెస్తుండేవారు. కాలేజీలోని లైబ్రరీలో వాటిని భద్రపరిచేవారు. ఆయన గదిలోని టేబుల్ పైనా గుట్టలుగా పుస్తకాలు కొలువుదీరి ఉండేవి. కేవలం ట్యూటోరియల్ కాలేజీ అధినేతగానే కాకుండా వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. వావిలాల గోపాల కృష్ణయ్య వంటి ప్రముఖులు సైతం ధన్ దగ్గరకొచ్చి కబుర్లు చెప్తుండేవారు. తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన కొత్తలో, ధన్ పేరు ఒక దశలో అభ్యర్ధిగా ప్రస్తావనకు వచ్చింది. క్షణం తీరుబడి లేని ధన్ తాను కొన్న పుస్తకాల్లో ఎన్ని పేజీలు తిప్పి ఉంటాడు,మరింకెన్ని పేరాలు చదివి ఉంటాడు? అని చెప్పడం కష్టమే. కానీ ధన్ గారి అభిరుచిని మెచ్చుకుని తీరాల్సిందే. విద్యాసంస్థ కనుక భావితరాల వారి కోసం పుస్తక భాండాగారాన్ని ఆయన నిర్మించి ఉంటారు. ఆయన తర్వాత ఆ పుస్తకాలను భద్రపరిచారో లేదో తెలీదు. ఇప్పుడు ఎంతమంది విద్యావేత్తల్లో ఇలాంటి అభిరుచి ఉంటుందో చెప్పండి?

         ఏ పుస్తకంలో ఏముందో తెలిసి ఉండటమూ జ్ఞానమే అంటారు ప్రసిద్ధ ఎడిటర్ ఎ.బి.కె.ప్రసాద్. మన అవసరం,సందర్భం బట్టి పుస్తకాలను మూడు రకాల పద్ధతుల్లో చదువుకోవచ్చు. ఆ పుస్తకం భవిష్యత్తులో రిఫరెన్సుకు పనికి వస్తుంది. ఇప్పటికిప్పుడు చదివే తీరుబడి లేదు. కానీ ఆ పుస్తకం ఏ సబ్జెక్టుకు సంబంధించింది? రాసింది ఎవరు? ఏయే అంశాలు పొందుపరిచారు? వంటి విషయాలు తెలిసి ఉంటే ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని ఉపయోగించుకోవచ్చు.

    ఇలాంటి సందర్భాల్లో పుస్తకాన్ని పైపైన తిరగేస్తూ చకచకా ముగించవచ్చు. ఒకప్పుడు రోజుకి రెండు మూడు డిటెక్టివ్ నవలలను చదివే పాఠకులు వర్ణనలు వగైరా వదిలేసి కథ మీద దృష్టి నిలిపి ముందుకు సాగేవారు. యాంగ్యులర్ రీడింగ్ అని దీనికి ఎ.బి.కె.ప్రసాద్ పేరు పెట్టారు. పేజీలోని ప్రతి పదాన్ని ప్రతి లైనును చదవకుండా పైపైన చదువుతూ పేజీలు తిప్పటమే  యాంగ్యులర్ రీడింగ్.

పరీక్ష కెళ్లే విద్యార్ధిలా అక్షరం వదలకుండా కొన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం కొందరికి ఏర్పడుతుంది. మీరు రచయిత అయితే ఆ సబ్జెక్టు మీద సరికొత్త పుస్తకం రాయాలని అనుకుని ఉండొచ్చు. మీకంటే ముందే వేరెవరో రాసిన పుస్తకంలో ఏం చెప్పారో తెలీకుండా మీరు ముందుకు సాగలేరు. కొన్నిసార్లు రిఫరెన్సు గా కోట్ చేయాల్సిన విషయాలూ ఉంటాయి. రచయితలనే కాదు పరిశోధక విద్యార్ధులకూ డీప్ స్టడీ అవసరం పడుతుంది.

 పగటి పని ఒత్తిళ్లల్లో అలసిసొలసినా కొందరికి నిద్ర మాత్రం కరుణించదు. ఇలాంటి వారికి పుస్తకాన్ని మించిన మందు మరొకటి ఉండదు. మంచం ఎక్కగానే చేతిలోకి పుస్తకం తీసుకుంటే,పిలవకుండానే పరుగుపరుగున నిద్ర ఒళ్ళోకి వచ్చి వాలుతుంది. పుస్తకం అందుకోగానే ఆవులింతలు మొదలవుతాయి. మరికొందరికి రెండో పేజీ తిప్పే అవసరం కూడా రాకపోవచ్చు. పడకటింటి పుస్తకంలోని కథకు ఏళ్లూ పూళ్లూ గడిచినా ఎన్నటికీ కంచికి చేరే భాగ్యం దక్కదు.

     ప్రతివారూ జీవితం పట్ల గాఢాభిరుచినీ గాఢానురుక్తిని పెంపొందించుకోవాలి. ప్రధాన వృత్తి వ్యాసంగాల మాట ఎలా ఉన్నా చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశీలిస్తూ ,వాటి కారణాలను విశ్లేషిస్తూ ఉంటే తెలీకుండానే అన్వేషణా నేత్రం తెరుచుకుంటుంది. కారణాలను తెలుసుకునే క్రమంలో మీ జ్ఞాన దాహర్తిని పుస్తకాలే తీరుస్తాయి. పత్రికలో వార్తలు, విశ్లేషణలైనా, పుస్తకాల్లోని విశేషాలైనా ఆసక్తితో ప్రేమతో ఆస్వాదించటం నేర్చుకోండి. మీ చుట్టూ గొప్ప ప్రపంచం ఉంది. గొప్ప మనుషులున్నారు. డబ్బుతో నిమిత్తం లేని అద్భుతాలు ఉన్నాయి. ఆ మంత్ర కవాటం తెరిచి చూస్తే అద్భుత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ఆ కవాటం తెరిచే ‘కీ’ పుస్తకమే మరీ.

గోవిందరాజు చక్రధర్‍

Spread the love

2 thoughts on “కొనటమేనా? చదివేది ఉందా?

  1. చాలా బాగా మనుషుల నైజము పరిశీలించి, వడపోత పోసి, పుస్తక పఠనం ప్రయోజనాలను చెప్పటం బాగుంది. జీజ్ఞాసవంతులు తెలుసుకోవలసిన విషయాలను పొందుపరిచి, చివరన గొప్ప రచయితలు, నాయకులు పుస్తకాలను చదవటం పట్ల వారి తీరును పొందు పరచటం పాఠకులకు ఉపయోగకరంగా వుంది. అందుకు మీకు కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *