ఐకాంతిక

Spread the love

            లోకేశ్ వెదుక్కుంటున్నాడు ఆమె కోసం.

ఆ సాయంత్రం రంగనాయకుల గుడి భక్తులతో క్రిక్కిరిసిపోతూ ఉంటే,అడ్డొచ్చిన పురుష ముఖాలను పక్కకు తొలగించి స్త్రీ ముఖాల్లో వెదుక్కుంటున్నాడు ఆమెకోసం – పాలపుంతలో చెయ్యిపెట్టి నక్షత్రం కోసం గాలించినట్లు!

ఇంతకూ ఆమె ఎవరు?

చూస్తే చూపుల్లోకి ఇంకిపోతుంది.

నడిస్తే అడుగుల్లోకి చేరిపోతుంది.

మాట్లాడితే మౌనంలోకి ఆవిరై

వింటే ఏకనాదమై విన్పించి

తాకితే స్పర్శ దీక్ష దయ చేస్తుంది.

చూసిన మొదటిసారే ఎప్పుడో చూసిన మనిషి మాదిరి కన్పించింది. ఔను, అదీ ఆమె అంటే!!

అది పురాతనమైన గుడి. అంతకంటే పురాతనమైన పెన్నానది గట్టున. సముద్రంలోకి నదులూ, భగవంతుని చెంతకు భక్తులూ అనుశృతంగానే ప్రవహిస్తుంటారు. మరి తనమాటేమిటి? ఆమె కోసం గుండె కొట్టుకుంటూ, ఆమె కోసం చూపులు ప్రసరిస్తూ, ఆమె కోసం కాళ్ళు నడుస్తూ, ఆమె కోసమే తన ఊపిరి ఇట్లా లోనికీ బైటికీ తిరగ్గొట్టబడుతూ తను సాగిపోతున్న ది కూడా ఆ భగవత్ స్వరూపం వైపేనా?

ఆమె కాలావధుల్ని అధిగమించిన తటిల్లత. ఇంద్రియాల అడ్డుగోడల్ని తోసిరాజని తన ఉనికిని బట్టబయలుగా వికశింపజేసిన మనోహరి! నక్షత్ర దేవత!!

ఆమె సన్నగా ఎత్తుగా, తేనెలో కలిసిన కుంకుమరంగు మేనితో ఉంటుందని – ఇట్లా భౌతికంగా వర్ణించవచ్చు. కానీ అట్ల వర్ణించగలిగిన వాళ్ళు ఆమె సౌందర్యాత్మ దరిదాపులకు కూడా వెళ్ళలేరు. ఆమె వదనాన్ని చందమామతోనూ, నాసికను సంపెంగ పువ్వుతోనూ వర్ణించవచ్చుగానీ, ఆమె కళ్ళలోని లోతైన ఆకర్షణ ఏ భౌతిక వర్ణనా సామగ్రికి లొంగుతుంది?

శ్రీరంగనాయకుని దర్శించుకున్న భక్తులు బైటకొచ్చి కాసేపు కూర్చుని, లేచి వెళ్ళిపోతున్నారు. గుడి ఆవరణలో నిండిన పూజాద్రవ్యాల పరిమళాల మధ్య పెన్నేటి చెమ్మగాలులు తమ ఉనికిని గుర్తు చేస్తూనే ఉన్నాయి.

నెలకిందట ఆమె ఈ గుళ్ళోనే కన్పించింది. ఆరోజు ప్రసాదూ, మూర్తి ఇద్దరూ తనతోపాటే ఉన్నారు. తను గవర్నమెంటు కాలేజిలో బిఎడ్ చేస్తుంటే, వాళ్ళు యస్ వి ఆర్ లో  బికామ్ ఫైనల్ చదువుతున్నారు. తాము ముగ్గురూ రూమ్మేట్లు.

ఆ రోజు తమకు కొంచెం దూరంలో నల్లని యువతి. తాను అప్పటికే చేష్టలుడిగి చూస్తున్న నక్షత్ర దేవతకు నిలువెత్తు నీడమాదిరి నిలబడిందామె. ఇద్దరు రూమ్మేట్లూ తలలు దగ్గరగా చేర్చి, చూపులు ఆ నల్లపిల్లవైపే గురి పెట్టి గుసగుసా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లోనే ఆ బికామ్ స్టూడెంట్లు ఇద్దరూ తనను తనకే వదిలేసి వాళ్ళు పరస్పరం కలిసిపోతుంటారు. తనకూ వాళ్ళకూ మధ్య ఆరేళ్ళ వయసు తారతమ్యం వల్లనో, లేదా ఆలోచన్ల మధ్య వేవ్ లెంగ్త్ కుదరకపోవడం వల్లనో సార్ అని సంబోధిస్తూ కొంచెం దూరంగానే మసలుకుంటూ ఉంటారు.

‘టైమెంతండీ?’

తను ఉలిక్కిపడి పక్కకు చూస్తే కఠినమైన చెంపల్ని సాగదీస్తూ నవ్వుతున్న నల్లని యువతి. ఉదాసీనంగా చూసి టైం చెప్పి కలలో నడిచినట్లు కదిలి పోతున్నాడు తను నక్షత్ర దేవతవైపు. అప్పటికే నల్ల పిల్ల చిలిపి చూపులు తమాషా సంకేతాల్ని ఇట్లా అర్థం చేసుకుని అట్లా అల్లుకుపోయి ఉన్నారు తన రూమ్మేట్లు.

మూర్తి గబగబ దగ్గరికొచ్చి- ‘సార్! పిల్ల పడింది వస్తారా?’ అని అడుగుతున్నాడు. తను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటే ‘మేమిద్దరం మీరు కూడా వస్తారేమో అడగమంటూ ఉంది’ అన్నాడు ముసిముసిగా నవ్వి. అతనివైపు భావాతీతంగా చూసి, అదే చూపును నక్షత్రదేవతవైపు మళ్ళించి నాడు తను.

దృశ్యాలు మారినా ముఖకవళికలు మారని ఏకత్వం చూపులో! ఆ ఏకత్వంలో తాను పాతుకుపోయి ఉండగా- ‘సరే మీ ఇష్టం’ అని ఆత్రంగా నవ్వి వెళ్ళిపోతున్న మూర్తి.

ఇంతకూ వీరిద్దరూ నక్షత్ర దేవతను గమనించినారా? లేదా? గమనించి ఉంటే ఇట్లా ఆ నల్లపిల్ల వెంటబడి పోయేవాళ్ళ? అన్న ఆలోచన తన మెదడులోకి చొరబడుతుండగా, ఆమేమో గుడి బైటికొచ్చి నడిచిపోతూ ఉంది. ఆమె ముందూ, తను వెనకల.

ఆమె నడిచినంతమేరా వెన్నెల చార. ఆమె సమస్త శరీరం నుంచీ వెలుపలికి వ్యాపిస్తున్న కాంతి ఆకారం. ఆమె పాదాల్లో పద్మరాగం. ఆమె అడుగులు మట్టిలో పడకుండా, తన అరచేతుల్తో దోసిళ్ళు పేర్చాలని ఉంది.

ఆమె శివాలయం వీధిలోకి మలుపు తిరిగి, హరిహరుని గుడి దగ్గరగా జూకా మల్లెతీగ అల్లుకున్న డాబా ఇంటికింది వాటాలోకి అంతర్థానమైంది.

అవునూ అయిదేండ్ల కిందట డిగ్రీ పాసై తిరుమలకు పోతే, ఆనాడు కొండమీద కన్పించింది ఈ నక్షత్ర దేవత కాదా? కాదులే! ఇరువురి రంగూ రూపమూ వేరువేరు. కానీ చిత్రం, కళ్ళలోకి చూస్తే మాత్రం ఇద్దరూ ఒక్కరే అనిపిస్తుంది.

భక్తులు భగవంతుని కళ్ళనీ, చిరునవ్వునీ, ఎత్తైన భుజాల్నీ వర్ణిస్తారు గానీ, ఆ భక్తి తమ హృదయాల్లో ఏ రసాయనిక చర్య జరిపిందో విశ్లేషించరు. భక్తి నుంచీ తప్ప, విశ్లేషణ నుంచీ ఆ అనుభవం రాదని వారికి తెలుసు కాబోలు.

కొండమీద ఆనాటి అనుభవం తను ఎప్పటికీ మరిచిపోలేడు.

తిరుమలేశుని ధూపస్తంభం దగ్గర కన్పించిందొక యువతి. ఆమె ఒక కుటుంబసభ్యుల సమూహం మధ్య ఉంది. కానీ ఆ యువతి తమ మధ్య ఉందన్న స్పృహ ఆ కుటుంబానికి లేదు.

తాను కర్పూర పరిమళాల మధ్య భక్తి ఉత్సాహంలో మునిగి ఉండి, యధాలాపంగా ఆమె వైపు చూపు తిప్పి ఉలిక్కిపడినాడు. ఎప్పటినుంచో తాను ఆమెకు తెలుసన్నట్లు తనవైపే ఎప్పటినుంచో చూస్తున్నట్లుగా ఉంది. ఆలోచన్లని మింగి, వాటికి ఆధారమైన ఉనికిని మాత్రం నగ్నంగా మిగిల్చే ప్రక్రియలో ఆమె చూపుల ఆకర్షణకు ఏ మంత్రజపమూ సాటిరాదు. ఆమె కళ్ళలో క్రిష్ణబిలం!

వచ్చీపోయే జనానికి దారిస్తూ తలెత్తి చూస్తే ఆమె లేదు. ఆ కుటుంబం మాత్రం అక్కడే ఉంది.

ఇంతలో ఏదో జరిగిపోయింది. తనలో ఏదో విడుదల పొందింది. నల్లమబ్బుకు హఠాత్ ప్రసవమైనట్లు తనలోకి ఎగిరి దూకిన పదహారు కళల చంద్రుడు. చుట్టూ పరిసరాలను వెలిగించే వింత కాంతి. ఆ కాంతిలో నీడలైపోతున్న మనుషులు. చూసుకుంటే తన భుజం మీద ధ్యాన పావురం.

నడుస్తున్నాడు.

అడుగులు దూదిపింజలయినాయి.

చూస్తున్నాడు.

చూపులు ఏకవచనంలోకి పేనబడినాయి.

వింటున్నాడు.

నీటిలో పుట్టి నీటిలో లయించే నీటి బుడగల మాదిరి రోడ్డు మీది శబ్దాలన్నీ తమకు జన్మనిచ్చిన మహామౌనంలోకే తిరిగి ఉపసంహరించుకుంటున్నాయి.

ఏకాంతపు నవ్యానుభవం! ఏకాంతంలో ఉన్నది ఏకత్వమే తప్ప ఒంటరితనంకాదని తెలిసొచ్చిన ఘడియలు.

భుజంమీద పావురం వాలకముందు తాను దృశ్యాన్ని చూసేవాడు. ప్రస్తుతం తన చూపు పడినచోటే దృశ్యం మొలకెత్తుతూ ఉంది.

ఇంతకూ ఏకాంతం అంటే ఏమిటి?

ఒకటితో అంతమయ్యేది!

రెండవది లేనిది!!

ఎంత కోరుకున్నా ఈ అయిదేండ్లలో పావురం మళ్ళీ తన భుజం మీద వాలలేదు. జ్ఞాపకం మాత్రం మిగిలి ఉంది.

అనుభవానికి జ్ఞాపకం ఏమవుతుంది.

రెండవది!

అనుభవం జ్ఞాపకంలోకి మారిపోయే విషాదమే రెండవదిగా తనను వెంటాడుతూ ఉంది.

ఆ మరుసటిరోజు ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్, సైకాలజీ, మెథడాలజి అట్లా ఒకటొకటిగా జరిగిపోతున్న క్లాసుల మధ్య గుడిలో కన్పించిన నక్షత్ర దేవత గుర్తొచ్చి ఆమెను సాయంత్రం ఎప్పుడెప్పుడు చూస్తానా అని కలలు కంటుండగా అప్పకు పక్షవాతం సోకినట్లుగా అందిన కబురు అనంతపురం నుంచీ! తమ్ముని నుంచీ!!

అప్ప చికిత్సకోసం నెల దినాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉండవలసి వచ్చింది అనంతపురంలో. ఈ రోజు నెల్లూరు రాగానే ఇట్లా గుడికొచ్చి వెదుక్కుంటున్నాడు ఆమె కోసం!

ఆమె మొదటిసారి కన్పించిన ధ్వజస్తంభం దగ్గర నిలబడి చూస్తుంటే ఎవరో పక్కకు వచ్చి నిలబడినట్లయింది.

‘బాగున్నారా? నెల అయింది మళ్ళీ కన్పించక’

ఆ తటిల్లతే! ఆ నక్షత్ర దేవతే!!

‘గుర్తు పెట్టుకున్నారన్నమాట’

‘మరిచిపోతే కదా గుర్తుపెట్టుకోవడానికి’ ఏదో ఆశతో తన గుండె తియ్యగా  కంపించింది.

‘మీపేరు?” అడిగిందామె. అట్లా అడుగుతుండగా ఆమె నవ్వులోని కాంతిని ఆమె కళ్ళే చేదుకుంటున్నట్లు మిలమిలా మెరిసినాయి.

‘లోకేశ్. మరి మీ పేరూ?’

‘ఐకాంతిక’

ఐకాంతిక…..!

మళ్ళీ ఆమెనే ప్రశ్నించింది–

“ఏమి ఇట్లా వచ్చినారు’

 ‘వెతుక్కునేదానికి. మరి మీరూ?’

 ‘నిరీక్షించేదానికి’

‘ఎవరి కోసమో’

‘వెతుక్కునేవారి కోసం’

తన నరాల్లో సంగీతం!

‘ఎప్పుడు వీలవుతుంది.’ తన గుండె వణికింది సంతోషంతో.

‘రేపు ఇదే సమయానికి! మా యింటికి!! ఎవరూ లేకుండా రండి’

తన రక్తంలో చంద్రోదయం!!

నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంది. ఆమె దూరందూరం అయిపోతుంటే అంత దూరానికీ అతని రక్తనాడులు మిఠాయి తీగల మాదిరి సాగుతున్నాయి. అతని అవయవాల్లో పాము పడగ విప్పుకున్న కదలిక! ఉన్నట్లుండి గుర్తించినాడు తను. ఆమె చర్మం నుంచీ అంగుళం బైటికి వ్యాపించిన కాంతి ఆకారం ఇప్పుడు ఆమెను పరివేష్టించి లేదు. లేక తన కళ్ళకే ఏమైనా అడ్డం పడుతూ ఉందా?

ఆకాశాన్ని కిటికీకి పరిమితం చేసినట్లు, ప్రేమను కోర్కెలోకి కుదించుకుంటే ఆమెను సంపూర్ణంగా దర్శించలేడు.

సాయంత్రం కాలేజి నుంచి రూముకొచ్చి, స్నానంచేసి బట్టలు మార్చుకున్నాడు. బైటపడి నడుస్తుంటే అడుగులు వాటికవే గబగబా పడుతున్నాయి. ‘రేపు ఇదే సమయానికి! మా ఇంటికి’– ఆమె పిలుపే తన ఎదలో ఉచ్ఛాటనమవుతూ ఉంది. కోర్కె కోర్కెగా ఊపిరి మరీ చిన్న చిన్న ముక్కలుగా తెగి పోతుండగా ఆమె ఇంటివైపు మలుపు తిరిగినాడు. శివాలయం వీధిలో హరిహరుని గుడి దగ్గర ఆగినాడు.

జూకా మల్లెతీగ అల్లుకున్న అదే డాబా ఇల్లు!

మేడకింది వాటాకు కొంచెం వారగా మూసిన తలుపులు. సైడు కాలవ మీదుగా ఇంట్లోకి పోవడానికి కట్టిన నల్లబండల మెట్లెక్కి తలుపు తట్టినాడు.

‘వస్తున్నా!’

గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఊపిరి పీల్చేది మరచినట్లు న్నాడు. కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. నాలుకతో పెదాలు తడుపుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు. చేతులు పిసుక్కుం టూ చూస్తున్నాడు.

వారగా వేసిన తలుపులు బార్లా తెరిచి ఎదురుగా నిలబడిందామె.

మాటల్లేవు. పోనీ, పక్కకు తప్పుకుని లోనికి దారిస్తుందేమో అని చూసినాడు. అదీ జరగలేదు. గుటకలు మింగుతూ నిలబడినాడు.

ఆమె నవ్వింది. పగడపు పెదవుల వెనక ముత్యాల పలువరుస తళుక్కుమంది.

‘ఎవరూ లేకుండా రమ్మన్నానా?’

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.

‘ఎవరూ లేకుండానే వచ్చినానుకదా!’

‘అదుగో మీ అప్ప! మీ భుజం మీద చెయ్యి మోపి వేలాడుతూ!’

 దారినిండా ఒలకబోసుకుంటూ వచ్చిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి.

ఐకాంతిక ఇంటికి వస్తూ ఉంటే సంతపేట సందులో మోగిన సెల్ ఫోను  తమ్ముడు అనంతపురం నుంచీ!

కేరళలోని కోటక్కల్ కు  తీసుకుపోతే ఆ ఆయుర్వేద వైద్యానికి అప్ప పక్షవాతం బాగుకావచ్చునంట. దానికి ముప్ఫైవేలు అవసరం. అంత డబ్బు ఎట్ల? ఏం చేద్దామంటూ అడుగుతున్నాడు తమ్ముడు. డబ్బులేని ప్రేమతో అప్పను కాపాడుకోగలడా? దుఃఖం.

అనంతపురం దగ్గర పెన్నహోబిలంలో ఫారెస్ట్ బంగ్లా వాచ్ మన్  అప్ప! తమ్మునికి మూడేళ్ళప్పుడు అమ్మ ఖాయిలాపడి చనిపోతే తమ ఇద్దరి ఆలనాపాలనా చూసుకుంటూ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.

అప్పకు అమ్మంటే వల్లమాలిన ప్రేమ. ఊరికి దూరంగా విసిరేసినట్లుండే ఫారెస్ట్ బంగ్లాకు కొంచెం ఎడంగా ఉండే పెంకుల కొట్టంలో అప్ప అమ్మ అన్యోన్యతని చూసిన అయిదేళ్ళ జ్ఞాపకం తనలో ఇంకా పచ్చగానే ఉంది.

బంగ్లాలో ఆఫీసర్లు అడపాదడపా మందు పార్టీలు చేసుకునే వాళ్లు. సరిగ్గా ఆ రోజే అప్పకు అమ్మ దగ్గర పాటలొచ్చేవి. అమ్మ తల మీదుగా కొంగు కప్పుకుని అప్ప ముఖంలోకి మురిపెంగా చూస్తూ కూర్చునేది. అమ్మ చనిపోయినంక కూడా అప్పుడప్పుడు అప్పకు పాటలొచ్చేవి కానీ, నీలిమేఘాలలో పాట పాడినప్పుడు మాత్రం అతని కళ్ళలో నీళ్ళు దొర్లేవి. జనసంచారంలేని ఆ అడవిలో కీచురాళ్ళ చీకటి శబ్దాల మధ్య తనని ఈవైపూ, తమ్మున్ని బొజ్జమీదా పడుకోబెట్టుకుని అమ్మ సంగతులు చెబుతుండేవాడు. ‘నువ్వు బాగా సదువుకోవల్ల అప్పా!’ అనే మాటతో ముగించేవాడు ప్రతిసారి.

తన జీవితంలో అప్ప ఒకే ఒకసారి కొట్టినాడు ఆయనకు చెప్పకుండా ఈత నేర్చుకునేదానికి బావిలోకి దిగినాడన్న ఆగ్రహంతో అదే దినం రాత్రి మెలకువొచ్చి చూస్తే, బైట అరుపులు. కిటికీలోంచీ వారగా చూస్తే- ఝయ్యిమని వీచే విసురుగాలికి అతని అంగీ, అడ్డపంచె రపరపా కొట్టుకుంటూ ఉండగా ఆకాశంలోకి చూస్తూ అరుస్తున్నాడు –

‘ఒసే రాములూ! నీ పెద్ద కొడుకును కొట్టినానే! సెమించుకోవే! నన్ను సెమించుకో?’

ఔను, బాత్రూముకు పోవాలని అప్ప తన భుజం మీద చెయ్యిమోపి నిలబడినప్పుడు ఆయన ఎడమ చెయ్యీ, ఎడమ కాలూ నిర్జీవంగా కిందికి వేలాడుతూ ఉండేవి. ఇప్పుడు ఆయన జ్ఞాపకం కూడా తన భుజం మీద చెయ్యేసి కుంటుతూ వచ్చింది తనతోపాటు  ఐకాంతిక ఇంటికి.

తాను సర్ది చెప్పజూసినాడు- ‘మా అప్పేగానీ ఎవరో కాదుగదా’

‘అయినప్పటికున్నూ, నున్నూ… నీకు రెండవ వాడే కదా?’

తను తమాషాగా నవ్వుతుండగా కిర్రుమంటూ మూసుకుపోయిన తలుపులు. మరురోజు సాయంత్రం మూర్తి, ప్రసాదుల నుండి తనను విడదీసుకుని ఒక్కడూ బయల్దేరినాడు ఆమె కోసం.

ఇనుమూ అయస్కాంతంల ఆకర్షణ స్పందిస్తూ ఉంది తనలో. రోడ్డు పక్కన తడి గోనెసంచులు పరిచి రాశులుగా పోసుకుని అమ్ముతున్న మల్లెమొగ్గల చెమ్మ వాసనలు. తనలో పిల్లనగోవి పాడుతూ ఉంది వీణ కోసం విరహంతో, జాబిలి పాడే వెన్నెల గీతం నిండా దినకరుని యవ్వన తాపమే!

శివాలయం వీధిలో హరిహరుని గుడి దగ్గర ఆగినాడు. జూకామల్లె తీగ అల్లుకున్న అదే డాబా ఇల్లు. తలుపు తట్టినాడు. బైటికి చేతులు చాచి ఇంట్లోకి ఆహ్వానించిన  తలుపులు.

ఆమె నవ్వింది. ఎర్రగులాబి మల్లెమొగ్గలతో అర్చించినట్లు నవ్వింది.

 ‘ఈసారి కూడా ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చినట్లున్నారే?”

‘ఎవరు?’

‘అడుగో మీ డాక్టరు స్నేహితుడు మస్తాన్ సాబ్?’

‘ఔనా?’ అంటూ తడుముకున్నాడు. నిజమే! ఐకాంతికను చేరడానికి వస్తుంటే నెహ్రూ చౌక్ లో మోగిన సెల్ ఫోను . తమ్ముడు అనంతపురంనించీ !

‘అన్నా! మస్తాన్ డాక్టరు చనిపోయినాడన్నా!’

గుండె గుభేల్మంది.

ఉరవకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యావాలంటీరుగా పనిచేసినప్పటినుంచీ తనకు మస్తాన్ సాబ్ తో  స్నేహం.

ఫోన్లో తమ్ముని వివరణ కూడా తాను ఊర్లోలేడనీ, ఈ దినమే శవం ఖననం తరువాతగానీ అతని మరణవార్త తెలిసిరాలేదనీ!

అయ్యో మస్తాన్ ఫిలాసఫర్ కడ దర్శనమైనా దక్కింది కాదా తనకు!

ఒకసారి కాలికి తగిలిన గాయానికి బ్యాండేజ్ వేయించుకోవడానికి పోతే మస్తాన్ సాహెబ్ ఆర్ఎమ్పి టేబిల్ మీద స్టెతస్కోపుతో పాటు కన్పించిన పుస్తకాలు చూసి ఆసక్తిగా మొదలైన స్నేహం.

భగవాన్ శ్రీ రమణ మహర్షి, ఆచార్య రజనీశ్, జిడ్డు క్రిష్ణమూర్తి, జిల్లేళ్ళమూడి అమ్మ, అక్కల్ కోట మహరాజ్, నిసర్గ దత్త, మాస్టర్ సి.వి.వి… ఎందరెందరివో పుస్తకాలు అతడు చదివి తనకిచ్చి, తను చదివింతరువాత వారి అనుభవాల స్మరణలో మైమరిచి చర్చించి… అట్లా మూడేండ్లు తను వెతుక్కోవలసిన ‘వస్తువు’ను గుర్తు చేస్తూ వచ్చిన సత్సంగం మస్తాన్ డాక్టరు!

విజయనగర కాలం నాటి అహోబిలమూ, పాము పడగ వంటి కొండ ఉరగకొండ ఉరవకొండగా మారడమూ, బూదగవి కొండ గుహలోని ఏ ఆదిమ హస్తానిదో నెత్తుటి ముద్రా, కొనకళ్ళ జైనుల గుట్ట మీద చెక్కిన జంబూద్వీప రాతిపటమూ… అన్నిటి చరిత్రలనూ పేర్చి పేర్చి అవి ఒక ఎత్తుకు చేరిన తరువాత హిస్టరీ ఈజ్ డెడ్ అని వాటి నిర్మాణాన్ని చెరిపి పారేసి చెంగుమని లేచిపోయినప్పుడు మరొక తాత్విక గూఢతను దర్శింప చేయగలిగిన మస్తాన్ గురుత్వం ఇంక తనకు లేదు.

అద్వైతమంటే రెండవది లేనిది అనీ, ఐన్ స్టీన్  సాపేక్ష సిద్ధాంతాన్ని దాటిపోవడమంటే ఆ ‘రెండవదాన్ని’ వదిలించుకోవడమేననీ- ఇట్లాంటి భిన్నశాస్త్రాల తులనాత్మక విచారణల్ని ఇంక ఎవరి దగ్గర వినగలడు తను.

నిన్నగాక మొన్న చూసిన మస్తాన్ సాహెబ్ ఈరోజు అయిదారు అడుగు ల గోతిలో పూడ్చిపెట్టబడి, ఆ మన్ను బరువు కింద కదలకుండా అదిమి పెట్టబడి ఉండటం తనకు ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంది.

ఊపిరి ఆగిపోయి గుడ్లు బైటకొస్తున్న తన వైపు ఐకాంతిక దీక్షగా చూసింది.

చప్పున తనకు ఊపిరాడి హమ్మయ్య అంటూ కదిలి ఆమె వైపు చూసినాడు.

ఆమె రెండు కళ్ళూ చూపు ఏకత్వాన్నే భజిస్తున్నాయి.

తాను మెల్లగా గొణిగినాడు- ‘చాలా ఉత్తముడైన స్నేహితుడు’

‘శాస్త్రం శాస్త్రమే! రెండవది రెండవదే!!’

ఆమె తమాషాగా నవ్వుతుండగా ఆహ్వానించిన చేతులు ముడుచుకు పోయినట్లు తన ముఖం మీదే మెల్లగా మూసుకుపోయిన తలుపులు.

ఆ తరువాత వచ్చిన రెండు సాయంత్రాలూ అంతే!

బ్లాక్ బోర్డు టీచింగులో పిల్లల కోసం పాటలు పాడి, టాగూరుగారి కథలు చెప్పి పిల్లల ప్రేమకూ, ఇన్ సర్వీసు టీచర్ల అసూయకూ పాత్రుడైన ఆ సాయంత్రం పోయి తలుపు తడితే-

‘మీ క్లాసు పిల్లలతోనూ, టీచింగ్ స్టాఫుతోనూ గ్రూపు ఫొటో దిగినారన్న మాట’ అని నవ్వింది.

ఇంకొక రోజు సాయంత్రం బండి కింద పడిన కుక్కకు, కాలు కట్టు కట్టించి ధార్మికోత్సాహంతో వెళ్ళి తలుపు తడితే –

‘చంకలో కుక్క పిల్లను వెంట పెట్టుకుని వచ్చినారా?’ అంటూ పగలబడి నవ్వింది.

రెండవది అంటూ ఉన్నప్పుడే కదా ధర్మాధర్మాలూ, న్యాయా న్యాయాలూ అనే విలువలన్నీ!

తల్లీ తండ్రీ, మిత్రుడూ, శత్రువూ అంటూ ఎన్ని సామాజిక అస్తిత్వాలు తనవి! కులమూ, మతమూ, భాషా, ప్రాంతమూ అంటూ ఎన్ని సామూహిక అస్తిత్వాలు తనవి! ఆకాశానికీ భూమికీ మధ్య సృష్టి సముద్రాన్ని తిరగ్గొడితే ఉబికి లేచిన ఒక ప్రాణపు బుడగలోని నగ్నమైన ఉనికికి రెండవదే కదా ఆ అరువు అస్తిత్వాల మొత్తమంతా!

తను తనుగా శేషిస్తే తప్ప ఐకాంతిక దొరకదు. రెండవదాన్ని వదిలించు కోవడానికి ఇంక ఒకటే దారి ఉంది ధ్యానం!

ఆరోజు ఆదివారం. మైపాడుకు పోయి ఘూర్జిల్లే సముద్రం ఎదురుగా బాసింపట్టు వేసుకు కూర్చున్నాడు.

కళ్ళు మూసుకున్నాడు.

ధ్యానులు కళ్ళను పిడికిళ్ళుగా బిగించి దేనినో బలప్రయోగం చేయబోతు న్నట్లుంటారు, ఎందుకో? దృశ్యం తనను ఎగరేసుకుపోతుందని భయమా?

ఏదో గుర్తుకొచ్చి కళ్ళు తెరిచినాడు. చేతికి వాచి లేదు. టైం చూసుకోవడానికి షర్టు జేబు నుంచీ సెల్ బైటికి తీసి పక్కన పెట్టుకున్నాడు.. తను ఎంతసేపు ధ్యానం చేసినాడో తనకే తెలిస్తే ఎంత గర్వం! ఎంత సంతృప్తి!!

ధ్యాన వస్తువుకు కాలం లేదు. ధ్యానికి మాత్రమే కాలముంది.

కళ్ళు మూసుకున్నాడు. ఏదో గుర్తొచ్చి కళ్ళు తెరిచినాడు. ఔను ఇంతకూ ఏం మంత్రం చేద్దాం? రాజరాజేశ్వరి మంత్రమా? పాండిచ్చేరి మదర్రా? లేక బాలాత్రిపురసుందరిదా?

ఎన్నుకున్నాడు! ఔనుగానీ ఆ ఎన్నుకున్నవాడెవడు?

కళ్ళు మూసుకున్నాడు. ఏదో గుర్తుకొచ్చి కళ్ళు తెరిచినాడు. ధ్యానం ఏ టెక్నిక్కులో చేద్దాం? దృష్టిని కేంద్రీకరించేది శిరస్సుపైనా? భృకుటి మీదా? రొమ్ముకు కుడివైపా?

ఎన్నుకున్నాడు!

ఎన్నుకునే ప్రక్రియలో రెండవది లేకుండా ఉండదు. రెండులేని చోట ఎన్నిక ప్రసక్తే లేదు.

సముద్రపు ఉపరితలం మీద పొంగుకొస్తున్న అలల మాదిరి అతని మస్తిష్కంలో తలపులై ఉబుకుతున్న ఐకాంతిక జ్ఞాపకం. ఐకాంతిక, ఐకాంతిక జ్ఞాపకమూ రెండూ ఒకటికాదు. జ్ఞాపకం ఆమెకు నీడ మాత్రమే! నీడ ‘వస్తువు’కు రెండవది. తను ఆమెను పొందాలనుకున్నది నీడగా మాత్రమేనా?

ఆమెను ఆమె రక్తమాంసాలతో, చర్మంతో, తన ఊపిరి ఊయలతో ఢీకొట్టే ఆమె ఊపిరి ఊయలను ఎదుర్కోవడంతోసహా పొందాలనుకున్నా డుగాని!

ఆమె జ్ఞాపకాన్ని హృద్గుహలోకి తోసేసినాడు. ఇట్లా తోసేసిన వెంటనే అట్లా మరో పిలక మొలకెత్తే ఆమె జ్ఞాపకాన్ని మళ్ళీమళ్ళీ తోసేస్తుంటే, ఆమె ఇంటిముందు సైడుకాలవలోని పంది పిల్ల గుర్తొచ్చి దాన్నీ ఆమెతో పాటు హృద్గుహలోకి తోసేసినాడు.

ప్రియురాలైనా, పందిపిల్లైనా జ్ఞాపక వ్యవస్థలో సమాన ధర్మం కలిగి ఉన్నవే కదా!

ఆలోచన్లలోచన్లు ఆలోచించేవాడు ఆలోచించబడేది. తాను ఉన్నాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు. ‘ఉన్నాడు’కు ఆలోచన రెండవది. రెండవది దేనికో ఒక దానికి అనువాదమే తప్ప మాత్రుక కాదు.

ఆలోచన్లను హృద్గుహకే ఆహుతిస్తున్నాడు.

నెమలి భామ ఆటవై, మీరాబాయి పాటవై… ధ్యానంలో మోసులెత్తే కవిత్వం ఐకాంతిక పట్ల!

భావాలు లేని సౌందర్యాన్ని సమీపించనైనా సమీపించగలదా కవిత్వం?

తనను ధ్యానంలోంచీ కళ్ళు తెరవమని ఒత్తిడి చేస్తూ ఉంది ఏదో? కన్నుల దృశ్య దాహపు పాడు అలవాటు!

ఓరగా కళ్ళు తెరిచి చూసినాడు. రెండు గంటల నియమిత కాలానికి రెండు నిమిషాల టైముంది.

కాలం లేని సత్యాన్ని కాలంతో సమీపించగలడా?

రెండు నిమిషాలతో తప్ప పూర్తికాని నియమిత కాలపు పూర్ణ సంఖ్య కోసం మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

చివరి నిమిషం మరీ బరువెక్కుతుందెందుకు విచిత్రం కాకపోతే!

ధ్యానం వెనక చీకట్లో దృశ్యాల బలవన్మరణంలో తన్నుకులాడే తన కన్రెప్పల్ని మెల్లగా పైకెత్తినాడు.

ఇప్పుడు తన చూపుతో సముద్రాన్ని నాటగలడా?

దృక్కుకు దృశ్యం రెండవది మాత్రమే!

దృశ్యమే ప్రాథమికమైనట్లు సముద్రాన్ని ఆబగా చూస్తూ నిలబడినాడు.

ఎవరో టూరిస్టు దగ్గరికొచ్చి బకింగ్ హామ్ కెనాల్ గురించి అడగబోతుంటే ముఖం తిప్పుకుని వెళ్ళిపోయినాడు.

మాటలాడితే మౌనం ఒలికిపోతుంది సుమా!

అవ్వ కోసం బస్సు సీటు త్యాగం చేసిన తనని ఆ అవ్వే నెర్లుగా పలక రిస్తుంటే చెక్క ముఖం వేసుకుని చూస్తున్నాడు.

మాటలాడితే మౌనం ఒలికిపోతుంది సుమా!

మూర్తీ ప్రసాదూ గాంధీబొమ్మ దగ్గర తన కోసం కూత వేస్తుంటే వినపడనట్లు తప్పించుకుపోతున్నాడు.

మాటలాడితే మౌనం ఒలికిపోతుంది సుమా!

జూకా మల్లెతీగ అల్లుకున్న అదే డాబా ఇల్లు.

తడితే తెరుచుకుంది కింది వాటా తలుపు.

నోటిని దబ్బలంతో కుట్టేసుకు వచ్చిన తనవైపు చూసి ఫక్కున నవ్వింది ఐకాంతిక.

కష్టం మీద నవ్వును నిగ్రహించుకొని జాలిగా అడిగింది-

‘మౌనం శబ్దానికి వ్యతిరేకమా?’

ఒకచోట మునిగి మరొకచోట తేలే సముద్రపు అలల మాదిరి అతని పెదవులను కుట్టేస్తూ కన్పించే తెల్ల దారాన్ని మెల్లగా ఊడదీసుకున్నాడు. ఆ తరువాత కళ్ళని సగం మూసి అరమోడ్పు కళ్ళతో చూడటానికి ప్రయత్నిస్తూ అడిగినాడు- ‘ఇప్పుడూ? ఇప్పుడు సరేనా?’

ఆమె చురుగ్గా చూసింది- ‘మీ పక్కన వాడెవడు?’

తన పక్కన చూసుకున్నాడొకసారి. ఔను, తన పక్కన వీడెవడు?

మంత్రాలూ, గడియారాలూ, టెక్నిక్కులూ అతని ఒంటినిండా క్లిప్పుల మాదిరి వేలాడుతున్నాయి.

‘ధ్యానం చేసినవాన్ని కూడా మీతో వెంటబెట్టుకు వచ్చినారు’

తన ముఖం వివర్ణమవుతూ ఉంది. సముద్రం శీర్షాసనం వేస్తే చూసే కళ్ళు తలక్రిందులైన వైనం!

మూసుకున్న తలుపుల మధ్య నిలువు గీతగా మారిపోయిన శూన్యం ఈసారి కూడా తనను వెక్కిరించింది.

మరునాడు ఉదయం ప్రపంచంలోకి మేలుకునే ముందు ‘ఉన్నాను’ అనే ఉనికిలోకి మొదటగా మేల్కొన్నాడు.

అస్తిత్వానికి ప్రపంచం రెండవది.

దృశ్య ప్రపంచంలోకి కళ్ళు తెరిచినాడు.

గదినిండా ఏదో నిశ్శబ్ద సుగంధం అలముకుని ఉంది. ఎవరో స్త్రీ వెళ్ళబోతూ తన శరీర పరిమళాన్ని అక్కడే వదిలి వెళ్ళినట్టుంది.

రాత్రి గదిలో ఏదో జరిగినట్లుంది. కాదు, కల వచ్చినట్లుంది. గుర్తు తెచ్చుకోవడానికి కాసేపు కళ్ళు మూసుకుని పెనగులాడి లాభం లేదని లేచి నిలబడినాడు. మూర్తి, ప్రసాదు ఆ రాత్రి రెండవ సినిమా చూసి అట్నుంచి అటే స్నేహితులు గదికి వెళ్ళిపోతామని చెప్పి పోయినారు. రాత్రి పది దాటితే కాంపౌండు గేటుకు తాళం వేసేస్తుంది ఇంటి ఓనరు.

ప్లాస్టిక్ బకెట్టూ, మగ్గూ పట్టుకుని భుజం మీద టవల్తో కామన్ బాతురూము వైపు నడిచిపోతుంటే, కాంపౌండులో ఇతర పోర్షన్లలో అద్దెకున్నవాళ్ళు తనవైపే చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు.

తనవైపు చూసి తన గురించి మాట్లాడుతున్నారా? లేక ఏదో మాట్లాడుకుంటూ యథాలాపంగా తనను చూస్తున్నారా?

స్నానం ముగించి తడిబట్టలు పిండి భుజంమీద వేసుకుని గదికొస్తుంటే ఈ లోపల ఎప్పుడు వచ్చినా రో… ఏదో విషయం ఇంటి ఓనరుతో గుసగుసా మాట్లాడుతున్న మూర్తి, ప్రసాదు. ఇద్దరూ పెదాలకు మర్యాద నవ్వు పూసుకుని అట్ల కాదన్నట్లు తలలు అడ్డంగా ఊపుతున్నారు సానుభూతి కళ్ళతో.

తను బట్టలు మార్చుకుని చెప్పులు వేసుకోబోతుంటే, ఇద్దరూ లోనికొచ్చి మెల్లగా తలుపు మూసినారు.

‘సార్ మీతో ఎవరో ఆడమనిషి ఉన్నారంటనే రాత్రి?’

అయోమయంగా చూస్తుండిపోయాడు- ‘లేదే!’

‘ఓనర్ ఆంటీ కిటికీలోంచీ చూస్తే కన్పించిందంట’

‘లేదే!’

పదినిమిషాలు తరువాత మూర్తి అన్నాడు- ‘ఓనరు అబద్ధం చెప్పే మనిషి కాదు. మన సారుకు అట్లాంటి అలవాట్లు లేవని మనకు తెలుసు. ఇప్పుడేం చేసేది?’

ప్రసాదు కలగజేసుకున్నాడు- ‘సరే! ఏది ఏమైనా గదిని ఖాళీ చెయ్యక తప్పదని భీష్మించుకుంది కదా ఓనర్ ఆంటి’

ఆ రోజు సాయంత్రానికి గది మారినాడు.

అది తన క్లాసుమేట్ల గదే! తను ఒక్కడే వచ్చి ఉంటే ఇబ్బంది లేదు అన్నారు వాళ్ళు. ప్రసాదు, మూర్తి ఆ కాంపౌండు గదిలోనే ఆగిపోవలసి వచ్చింది. పైగా ఓనర్ ఆంటీకి వారిద్దరి పట్ల సదభిప్రాయమే ఉంది.

ఆ రాత్రి చాపలు పరచుకుని పక్కపక్కనే పడుకుని నిద్రపోతున్నారు కొత్త రూమ్మేట్లు.

ఎల్లారావు గురకపెడుతున్నాడు. పుల్లారావుకు నిద్రాభంగమై ఎల్లారావు ను లేపి కూర్చోబెట్టి తాను నిద్రపోయినాడు. ఈసారి పుల్లారావుకు గురకొచ్చింది. అప్పుడు ఎల్లారావుకు నిద్రాభంగమై పుల్లారావును లేపి కూర్చోబెట్టి తాను నిద్రకు పూనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ గుర్రు కొడుతూ ఉరుము లూ పిడుగులూ సైతం భగ్నం చేయజాలని నిదురసమాధిలోకి వెళ్ళి పోయినారు.

పక్క చాప మీద పడుకుని జరిగేదంతా చూస్తూ నిద్రకు ఒప్పగించుకో బోయాడు తను.

నిద్రలో తానుంటాడు. కానీ ప్రపంచం ఉండదు. ఇది కదా ఏకాంతం! ఐకాంతిక కోరుకునే ఏకమాత్రపు అస్తిత్వం!!

మెలకువ- లోకం = ఐకాంతిక,

తన డైరీ పేజీలోని ఆరేడు రోజులు ఆమె గురించిన కవిత్వంతోనే మడుగు  కట్టినాయి.

ఇంతకూ ఏకాంతం తెచ్చుకునేదా? తారసిల్లేదా??

పడుకున్న వాడు లేచి కూర్చున్నాడు.

డైరీ రాయాలనిపించి డైరీలో ఆ దినం పేజి తెరిచి ఉలిక్కిపడినాడు.

తన డైరీలో తనదికాని దస్తూరి!

డియర్ లోకా! అని సంబోధనతో మొదలైన ముత్యాలవంటి అక్షరాలు.

అదే నిశ్శబ్దం సుగంధం చుట్టుముట్టింది తనని.

ఆమె నగ్న పాదాలతో నడయాడిన వెలుగు ముద్రలు కూడా గది నేల గచ్చుమీద లీలగా కన్పించినట్లు గుర్తు.

ఆత్రంగా చదివినాడు-

రాత్రి మీ గదికి వచ్చినాను. నిద్దట్లో ప్రపంచాన్ని విప్పి గోడకున్న కొక్కీ కి తగిలించి పడుకుని ఉన్నారు మీరు. మిమ్మల్ని ఒడిలోకి చేర్చి లాలించి నాను. కానీ మీకే ఎరుకలేదు. నిద్రలో మీరు విస్మృతులు. మెలకువ గీతం పాడుదామందునా? మీతోపాటు మీలో ఆ రెండవదీ మేల్కొంటుంది కదా!

అతనికి చప్పున రాత్రి వచ్చిన కల జ్ఞాపకమొచ్చింది.

తాను, ఐకాంతిక ఎదురెదురుగా ఉన్నారు. తనలోనూ, ఐకాంతికలోనూ రెండవది లేని ‘నేను తనమే’ నిండి ఉంది. ఒకరివైపు ఒకరు చూసుకునే వారి వరస్పరతలో కూడా రెండు సంఖ్య ఉనికి కోల్పోయింది.

పొద్దున్నే పరుగెత్తినట్లు నడుస్తున్నాడు.

జూకామల్లె తీగ అల్లుకున్న అదే డాబా ఇల్లు.

ఆత్రంగా తలుపు తడుతున్నాడు.

పాలపుంతను ఉట్టి కొట్టి కాంతి జలపాతం కింద తనను అభిషిక్తున్ని చేసిన ఐకాంతిక కలే జ్ఞాపకమై తన వీపునెక్కి కూర్చుంది.

రెండవది మోయకుండా ఉండలేని ఏ వ్యక్తి అయినా తన ప్రాథమిక అస్తిత్వానికి తనే రెండవ వాడు అవుతాడు.

ఈ రెండవ వాడే తనకు దయ్యమై పట్టినాడు.

అందుకే-

లోకా ఉంటే ఐకాంతిక ఉండదు.

ఐకాంతిక ఉంటే లోకా ఉండడు.

అదేదో ‘గ్రహం’ మాదిరి పట్టుకున్న ఈ లోకేశాన్ని ఎట్లా పోగొట్టు కోవటం?

తలుపు తడుతూ ఉండగానే డాబా మెట్లపైనుంచీ కిందికి నడిచి వచ్చిం దొక  యువతి!

తలెత్తి చూసినాడు.

ఐకాంతిక కాదు గదా? వెర్రి!

‘ఎవరు కావాలండీ?’ ఆమె తనవైపే చోద్యంగా చూస్తూ అడిగింది.

తనకు ఎవరు కాబడితే ఈమెకెందుకు? ఈమె పని ఈమె చూసుకుని పోగూడదా?

తలుపు తడుతున్నాడు.

‘ఎవరు కావాలండీ మీకూ?’ ఈసారి రెట్టించింది.

తననట్లా గద్దించడానికి ఎవరీమె? లోకం!! లోకంలోని మనుషులు ఒకటి, రెండూ, మూడుగా ఉండరు. ఒకటి ఒకటి ఒకటిగానే ఉండి జీవిస్తుంటారు.

సృష్టిలోని ప్రతి జీవి తనకు తానై ఉన్న ఉనికి క్రమాన్ని మరిచిపోయి, మనుషులందర్నీ టోకు దృష్టితో కలిపి రూపొందించుకున్న లోకానికి ప్రత్యేక మైన ఒక ప్రాణమూ, శ్వాసా, ఉనికి ఉన్నవా? విసుక్కుంటూ చెప్పినాడు-

‘ఐకాంతిక గారండీ!’

రెండు అనే ద్వంద్వం లేకుండా లోకం లేదు.

దానికి ఐకాంతిక గురించి ఎంత చెప్తే ఏం అర్థమవుతుంది?

యువతి వైపు ఒకసారి నిరసనగా చూసి మళ్ళీ తలుపు తడుతున్నాడు.

ఈసారి ఆ యువతి మొర పెట్టుకున్నట్టు అరిచింది-

“అయ్యా! బాబూ! ఆ తలుపులకున్న తాళం కప్పనయినా ఒకసారి చూడండి.”

నిజమే రెండు తలుపులనూ బిగించిన గడియకు పాతకాలంనాటి తాళం కప్ప ఒకటి బరువుగా వేలాడుతూ కన్పించింది.

‘నిన్నటివరకూ ఈ ఇంట్లోనే…’

ఆ యువతి తనను అనుమానంగా చూసింది.

‘అది ఇల్లు కాదు, చీకటి కొట్టు. తాళం పడి ముప్ఫై సంవత్సరాలు దాటింది.’

ఐకాంతిక అబద్ధం. ఆమె ఈ ఇంట్లో కన్పించడం తన భ్రమ! కాదు, కాదు. ఐకాంతిక సత్యం. ఆమె తన డైరీ పేజీలో రాసిపోయిన అక్షరాలు అక్షరాలా నిజం!

అతని మెదడు స్కేలై సత్యాన్ని కొలుస్తూ ఉంది.

నీటిని లీటర్లతో కొలవ్వచ్చు. దూరాన్ని మీటర్లతో కొలవ్వచ్చు. వస్తువుకు కొలత రెండవది మాత్రమే అవుతుంది. అయితే రెండవది లేని ఏకత్వాన్ని రెండవది అయిన కొలతతో కొలవ బూనుకోవడం ఎంత అసంగతమైన విషయం!

బండి నారాయణస్వామి

అగ్రశ్రేణి తెలుగు నవలా రచయితలలో ఒకరు. వీరగల్లు, చమ్కీదండ కథలు, మొదలైన కథా సంపుటాలు  వెలువరించారు. రెండు కలల  దేశం, మీరాజ్యం మీరేలండి, గద్దలాడతండాయి,  శప్తభూమి, అర్ధనారి, ఆకాశ గానం  వంటి నవలలు రాశారు. శప్తభూమి నవలకు కేంద్రసాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు. కొన్ని నవలలకు తానా, ఆటా బహుమతులు వచ్చాయి. ఉపాధ్యాయుడిగా పదవీవిరమణ చేశారు. రాయలసీమ వెనుకబాటుతనంపై అనేక వ్యాసాలు రాశారు.  అనంతపుర నివాసి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *