కురిసే వానకనులతో ,
మబ్బుల్లో తడిసిన చీకటికేశాలు విరబోసుకుని
ఆమె నడుస్తూ వస్తుంది
ఆమె చుట్టూ అంతా చీకటితో
ఆమె చూపుల్లో రగులుతున్న నిప్పులు
ఆమె అడుగులు నేలని పిడుగులా కదిలిస్తున్నాయి.
ఆమెకి ఎదురుగా నిలబడటానికి ఎవరికీ ధైర్యం లేదు
వచ్చిన దారిలో వణుకుతున్న వనాలు ఆమె ఆగ్రహానికి సాక్ష్యంగా నిలబడ్డాయి
ప్రతి మెరుపు ఆమె శరీరాన్ని చీల్చుకుపోయే
బాధను వ్యక్తపరుస్తుంటే
ప్రతి ఉరుము ఆమె గుండెలో నుంచి ఎగిసే విప్లవాన్ని ఊహిస్తూ గర్జిస్తుంది
ప్రకృతి ఆమె నడుస్తున్న మార్గాన్ని దారి చూపించేలా
ఆమె వెనుక మేఘాలూ
ముందు వాన బారులు తీరింది
ఆమె తన శక్తితో
మరో పుడమిని రచించేందుకు
ఈ ప్రపంచాన్ని చీల్చి చెరిపేసేలా వెళ్తుంది
ఆమెకెదురు వెళ్ళకండి
ఆమె ప్రళయ వాన