ఆమెని తొలిసారి నేను ఒక దవాఖానాలో కలిసాను. ఆమె కూడా నా లాగే మందులు తీసుకోడానికి వచ్చింది అక్కడికి. ఆమెను చూస్తూనే అక్కడి ఆడవాళ్ళు చీదరగా చూస్తూ పక్కకి తప్పుకోసాగారు. డాక్టర్ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుని తన అయిష్టతని ముఖం మీదే వ్యక్త పరిచింది. నాక్కూడా ఆమె అంటే అసహ్యం వేసింది కానీ.. దానినాలాగే మనసులో అణుచుకుంటూ ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వానో లేదో ఆమె కూడా నవ్వింది. కనీసం నవ్వడానికి ప్రయత్నం చేసింది. ఆమె మొఖం లో ముక్కు ఉండాల్సిన చోట రెండు ఎర్రని చిన్న రంధ్రాలున్నాయి . కళ్ళు కూడా గాయపడి ఉన్నట్లున్నాయి ఒక కన్ను పూర్తిగా దెబ్బ తింది. మరో కన్నుతో పాపం మెడ లేపి కానీ చూడలేకపోతున్నది.
కొద్ది సేపయ్యాక దవాఖాన కిటికీ దగ్గర ఆమె నేను ఎదురు బదురు అయ్యాము . ఆమె అప్పుడు “మీరు ఎక్కడినుంచి వచ్చారు” ? అని మెల్లిగా గుసగుస లాడినట్లే అడిగింది. నేను ఆమెకి నేనెక్కడ ఉంటానో చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది. కానీ అక్కడే ఉన్న కాంపౌండర్ నేనడక్కుండానే ఆమెను గురించి చెప్పసాగాడు. “ఇది మంచి ఆడది కాదు.. ఇదొక వేశ్య.. పచ్చి వేశ్య! రోగాలతో కుళ్ళికుళ్ళి చస్తున్నది. ఇప్పుడు మందులు వాడడం షురూ చేసింది. డాక్టర్ కూడా ముందు ఈ నీచురాలిని బయటకు పంపు అంటూ ఏవో మందులు చీటీ మీద రాసి పంపేస్తుంది” అన్నాడు మొఖమంతా ఆమె పట్ల ఉన్న అసహ్యాన్ని నింపుకుని .
నేనొక ఆడపిల్లల బడిలో టీచర్ గా పనిచేస్తాను. అప్పుడే కొత్తగా కాలేజీ చదువు ముగించుకుని బయటకొచ్చాను. లోకం నా పాదాల చెంత ఉన్నట్లే ఉంది. నా ముందు అంతా అందమైన తోటలాంటి భవిష్యత్తు ఎదురుచూస్తున్నది. ఆ తోటలో అన్నీ గులాబీలు.. చామంతులు తమవైన పరిమళాలతో గుబాళిస్తున్నాయి. నాకు లోకమంతా ఒక వెన్నెల రేయిలాగా., ప్రవహించే నదిలా ఒకసారి మెల్లిగా మెత్తగా ., మరోసారి ఒక ఉధృతమైన ప్రవాహంగా అనిపిస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను. అసలు జీవితంలో కష్టం, బాధ అంటే ఏంటో నాకు తెలీనే తెలీదు . నేను చేసే ఉద్యోగం కూడా ఏమీ తోచక ఖాళీ సమయాన్ని గడపడానికి మాత్రమే చేస్తున్నాను. నా అస్తిత్వం.. నడత అంతా ఆ కాలంలో నేను దేని కోసమో చేసే నిరీక్షణ లా ఉండేది. సరే ., ఒక రోజు ఏమైందంటే నేను కాలేజీ ఆఫీసు లో ఉన్నాను. ఒక్కసారిగా పరదా తొలగించుకుని ఆమె., దవాఖానాలో కనిపించిన ఆమె ఆఫీసు లోకి వచ్చేస్తూ కనపడింది. నేను ఖంగారుపడ్డప్పటికీ నాదైన ధోరణిలో “రండి,. కూర్చోండి” అనేశాను. మొదట సంకోచించినా మెల్లిగా అక్కడి కుర్చీలో కూర్చొంది. ఆమె చేతిలో ఒక మల్లెపూల మాల ఉంది దాన్ని నా ముందు మెల్లిగా పెట్టింది. నాకు ఆ మల్లెల మాలను చూస్తూనే ఒక రకమైన వెగటుతనం కలిగినప్పటికీ ., ఆ భావాన్ని అణుచుకుంటూ దాన్ని తీసుకుని జడలో పెట్టుకున్నాను. ఏదో సంతృప్తి నిండిన మొఖంతో ఆమె నా వైపు చూస్తూ మెల్లిగా లేచి అక్కడినుంచి వెళ్ళిపోయింది .
ఇక ఇది రోజూ జరిగే వ్యవహారంలా మారిపోయింది. మధ్యాహ్నవిరామ సమయంలో ఆమె పరదా తొలగించుకుని రావడం., నేను కూర్చోమని చెప్పడం, ఏదో ఒక పువ్వు ఆమె నా టేబుల్ మీద పెట్టటం మామూలు అయిపోయింది. నా తోటి టీచర్లు నన్ను ఆట పట్టించడం మొదలు పెట్టారు. ఆమె కూర్చునే కుర్చీలో ఎవరూ కూర్చోక పోయేది. ఆమె ఆకారం., ఆమె మొఖమే అలా భయం కలిగించేవిగా ఉన్నాయి మరి ! అంతెందుకు నేను కూడా ఆ కుర్చీని కనీసం తాకను కూడా తాకను మరి. ఇక ముసలి ప్యూన్ నసీబన్ బువా అయితే.. . “ ఈ కొత్త టీచరమ్మ పనేమీ బాగోలేదు రోజూ ఈ మురికి దరిద్రాన్నివెంట పెట్టుకుని వస్తే .. ఆమె కూర్చొన్న కుర్చీని నేను ఎందుకు శుభ్రం చేయాలి”? అని రోజూ ఆమె వెళ్లిపోయాక గొణుగుతూనే ఉండేది. ఆఖరికి ప్రిన్సిపాల్ కూడా ముక్కు విరుస్తూ “ఆమెనసలు ఎందుకు రోజూ రానిస్తున్నావు? అలాంటి దిగజారిన స్రీ కాలేజీకి వస్తుందంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఊరుకుంటారా” ? అనేది. ఆ మరుసటి రోజు రానే వచ్చేది చేతుల్లో పూలతో ఆమె కూడా వచ్చేసేది. నేను ఎప్పటిలాగే “రండి కూర్చోండి” అనేదాన్ని. ఇదిలానే జరిగిపోతూ ఉండేది. ఇక ఇప్పుడు ఆమె మరింత ఎక్కువసేపు కూర్చోవడం మొదలు పెట్టింది. విచిత్రంగా మా మధ్య ఏ సంభాషణా జరిగేది కాదు. బహుశా నాకు తను ఏంటో .. ఎవరో తెలియదనుకుంటుందా .. ఏమో? నేను పిల్లలకు పాఠాలు తయారు చేసుకుంటూ ఉంటే ఆమే మో నన్ను తన గాయపడ్డ వొంటి కన్నుతో, ముక్కు లేని మొఖం తో చూస్తూ ఉండేది. ఒక్కో సారి పొద్దు పొద్దున్నే ఆమె కన్నీళ్లతో నిండిన దిగులు మొఖం ప్రత్యక్షమయ్యేది. ఆమె కథ తెలుసుకోవాలని మహా ఆసక్తిగా ఉండేది. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలిసేది కాదు. ఆమె రాగానే టీచర్లు అందరూ లేచిపోయి “ మహా పతివ్రత వచ్చిందండి .,పదండి ముందిక్కడి నుంచి లైబ్రరికి వెళ్ళిపోదాం .. ఆ మొఖం చూడండెలా ఉందో” అని ఒకరంటే .,మరొకరు “అబ్బా ఈమె మొఖం చూస్తుంటే అన్నం కూడా తినబుధ్ధి కావట్లేదు వాంతికొస్తుంది” అనే వారు వికారంగా .
“కానీ ఈవిడ గారి దోస్తు ఎన్నిక కూడా భలే ఉందిలే .. నెంబర్ వన్ దగుల్బాజీని తెచ్చుకుంది”
“ఈ నీచురాలొస్తే మనం పరదా వేసుకోవాలి కాబోలు” అంటూ మామూలుగా అత్యంత వినయంతో ఉండే ముసలి టీచర్ కూడా విసుక్కునేది .
నా పనేదో నేను చేసుకుంటూ ఉండేదాన్ని ఆమేమో నన్నే చూస్తూ కూర్చునేది. నాకేమో ఎందుకలా చూస్తుంది అని ఖంగారేసేది. అసలు నన్ను చూస్తూ ఏం ఆలోచిస్తుంటుంది .. ఈమె కూడా ఒకప్పుడు నాలా ఉండేదా ఏంటీ ., ఈ ఆలోచనలతో నా చర్మం మీద రోమాలు భయంతో నిక్క బొడుచుకునేవి. ఈమె అసలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నది ? ఈమెని చూస్తే ఇక్కడి జనం ఎంత అసహ్యించుకుంటున్నారో అర్థం కాదా ఆమెకు ? ఆమె ముక్కు నుంచి ఎర్రని ద్రవమేదో కారుతూ ఉంటే వాళ్ళు మరింత అసహ్యించుకునే వాళ్ళు ఇదామెకి తెలీదా అని? ఆమెని ఇక రావద్దని రోజూ చెబుదామనుకుంటాను. ప్రిన్సిపల్ మేడమ్ కూడా నిజమే చెప్పింది ఆమె రాక ఆడపిల్లల కాలేజీకి మంచిది కాదని .. ఇక విద్యార్థినులు కూడా ఆమెని వింతగా చూడడం మొదలు పెట్టారు. టీచర్లది చెప్పేదేమి ఉంది చెప్పండి ., ఆమెని చూస్తేనే వికారంగా మొఖం పెట్టుకుని పోతున్నారు. ఇంత అవుతున్నా ఆమె మరుసటి రోజు రావడం, నేను యథాతధంగా కుర్చీ చూపిస్తూ కూర్చోమని చెప్పడం జరిగిపోతూనే ఉంది. అసలేమవుతోంది ? తనెంత వికారంగా ఉందో తెలుసుకోవడానికి ఆమె దగ్గర అద్దమే లేదా., పోనీ ఈ జీవితం తను గతంలో చేసిన పాపాల ఫలితమనైనా ఆమె గ్రహించి ఉండదంటారా కనీసం ? ఈ విషయం ఆమెకి ఎవరూ ఎందుకు చెప్పరు ? అసలామెకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ? ఈమె ఎక్కడినుంచి వస్తుంది .. అసలెక్కడ ఉంటుంది? బహుశా నేనొక్కదాన్నే ఆమెని అర్థం చేసుకుని ఆమె వ్యాధిని తగ్గించగలనన్న నమ్మకంతో, ఆశతో నా దగ్గరికి వస్తోందా ఏంటీ ?
మా కాలేజీ అంతా ఈమె ఒక తమాషా అయిపోయింది. తమాషా కూడా కాదు ఒక అవమానం కలిగించే విషయం గా మారిపోయింది . అయినా., అయినా చూడండి .. ఆమె రావడం, పువ్వులు ఇవ్వడం ,నేను తలలో పెట్టుకోవడం ప్రతిగా ఆమె నావైపో భయంకరమైన నవ్వు విసిరి వెళ్ళిపోవడం జరిగి పోతూనే ఉంది . ఈమె నాలో ఏం చూస్తుంది .. అసలీమే ఎవరు ., ఇలా కాక మునుపు ఎలా ఉండేది ? ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ? నా దగ్గరకొచ్చే ఈమెకు ఏం దొరుకుతున్నది మనశ్శాంతా లేక అశాంతా ., ఏది ? జవాబు దొరకని ప్రశ్నలు . అసలు నేనెందుకు ఆమె రావడాన్ని ఆపలేకపోతున్నా అదీ అర్థం కాలేదు నాకు .
సరే ఇదిలా ఉండగా ఒక రోజు ఊహించనిది జరిగిపోయింది . ఆమె వచ్చింది పూలిచ్చింది . . ఎప్పట్లానే తలలో పెట్టుకున్నాను. ఆమె వెళ్లిపోతూ వెళ్లిపోతూ పెద్దగా తుమ్మింది అంతే., ఆమె ముక్కు చీమిడి అంతా గోడ మీద పడింది. అంతే పక్కనే చిన్నపిల్లల దిండు గలీబులని ముల్తానీ మట్టితో రుద్దిరుద్ది శుభ్రం చేస్తున్న నసీబన్ బువా వొక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లే లేచింది. ఆమె అంటే ఎన్నాళ్లుగానో ద్వేషం పెంచుకుని ఉందేమో.. తన చేతిలో ఉన్న దిండుతో ఆమె నడుము మీద బలంగా కొట్టింది . ఊహించని విధంగా జరిగిన దానికి ఆమె భయపడిపోయింది. నసీబన్ బువా తన ఇరవై ఏళ్ల బడిలో చేసిన నౌఖరిలో నేర్చుకున్న మర్యాద, సంస్కారం .. తరువాత తాను పిల్లలకి నేరిపిన మంచి చెడు పాఠాలు అన్నీ మర్చిపోయి వట్టి వీధిలో కొట్టుకునే వాళ్ళలో ఒకదానిలా చేసింది. “బుద్ధి లేని దానా .. పెద్ద బయలుదేరి వచ్చింది కుర్చీల్లో కూర్చోవడానికి. నిన్నటిదాకా వీధుల్లో కూర్చొన్న దానివి కాదూ ? ఈ రోజు వొంటి మీద పుండ్లు రసి కారిపోతుంటే .. బేగం రాణీ కావాలని వచ్చావా ఇక్కడికి .. కుర్చీల్లో కూర్చోడానికి”? అంటూ పెద్దగా అరుస్తూ ఆమెని కాలితో ఒక్క తన్ను ., మరో తన్ను .. ఇంకా కోపం తగ్గక మొఖంపై బలంగా గుద్దింది. నేను దిగ్భ్రాంతిగా ఆమె వైపుకి పరిగెత్తాను “ఏం చేస్తున్నావు బువా ఆపు” అంటూ నసీబన్ బువాని ఆపబోయాను. ఈ గొడవకి పిల్లలూ, టీచర్లు అంతా పరిగెత్తుకు వస్తూనే ఉన్నారు మా వైపుకి. నసీబన్ బువా ఆగ్రహంతో ఊగిపోతున్నది స్పృహలో లేనట్లే మాట్లాడుతున్నది. “నువ్వే ఈమెని నెత్తికెక్కించుకున్నది ఇరవై ఏళ్ల నుంచీ ఇక్కడ పని చేస్తున్నా ఒక వేశ్య ఇలా బడిలో జొరబడ్డం నేనెన్నడూ ఎరుగను. మొన్నబడి నాలా మీద పొతూ కూడా ఇలాగే ఖరాబు చేసి పడేసింది. నేనిక ఇక్కడ పని చేయను గాక చేయను. ఇంకో మనిషిని పెట్టుకోండి” అని అరుస్తూనే మళ్ళీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లే ఆమె వైపుకు దూకబోతుంటే టీచర్లు నసీబన్ బువాని పట్టేసుకుని ఆపేశారు.
నేను వెంటనే ఆమెను పట్టుకొని పైకి లేపి ఫాటఖ్ {గేట్} వైపుకి తీసుకెళ్లసాగాను ఆమె చెవిలోంచి రక్తం కారుతోంది. బువా తిట్లు వింటూ ఆమె కుళ్ళికుళ్ళి ఏడవసాగింది. ఒక్కసారిగా ఆమె ఏడుపు ఆపి “నేనెవరో ఇప్పుడు మీకు తెలిసి పోయింది కదా” అన్నది నిస్సహాయంగా నన్ను చూస్తూ. ఆమె వొంటి కన్నులో ఏదో తెలియని భయం. నేను మాట పడిపోయినదానిలాగా ఆమె వైపు చూస్తుండిపోయాను. ఆమె ఎందుకు ఏడుస్తున్నది? నాకు ఆమె ఒక వేశ్య అని తెలిసిపోయినందుకా ., ఆ తెలిసిపోయిన తరువాత నేను ఆమెని వాళ్ళందరిలా అసహ్యించుకుంటాననా .. మరిక స్నేహంగా ఉండనేమో అని అబద్రతకు లోనయిందా ., ఎందుకు ఏడిచింది ఆమె ? నసీబన్ బువా దెబ్బలకా ? లేక..
***