అవునిది విస్మయం
వెనుకకు వాలి నిలిచిన ఏరు
నిలబడి అవతలి లోకాలకు
వంతెన కడుతూన్న దేహకాంతి
మేని వంపులోని జీవ నిప్పు...
ఉప్పుల వాన
ఆ ఒకే ఒక్క జడ
వొంటరి బక్క వాగు
దాని మెడ తల మీద..పూస్తున్న
పచ్చామంతి
బటానీ బంతిపువ్వు
అంగారక ధూళి రవ్వ
సగం నిద్రలోని గువ్వకన్ను
పొన్నమ్మా చిన్నీ... ఎటు కదలకు
అట్లనే వుండు
మెదలకుండా కదులు
చూడకుండా చూడు
నవ్వకుండా నవ్వు
నువ్వెవరో నాకు తెలియకుండా
తెగరాదు వూపిరి
పదం పురివిప్పగూడదు
కొప్పు తిప్పు
దాని గమకమెత్తి ఆడించు
జారిపోయే జిమ్మ
చేజిక్కుతుంది
నిన్ను చూసుకుంటూ
నా కాళ్ళకు నేనే మొక్కుకుంట
నా ఇతరతనంలో
చిక్కుకున్న నన్ను ముడివిప్పుకుంట
అజ్మీర్ షరీఫ్‌కూ
మా బండ మైసమ్మకూ ముడి కట్టుకుంట
పొన్నమ్మా. మాయమ్మా
కలతెర విప్పనీ
నీ జెడ చామంతి మీదుగా
మాయ సోకనీ
ఖండాలు ఏకం కానీ
నా చలాచల ఏకాంతం
చిరిగి మీద పడనీ...
కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.