వలసదారులు!

Spread the love

ఇది ఒక విషాదమైన కథ. మేకల్లో మేకలా జీవించి, మేకపాలు సేవించి ఆకలి తీర్చుకొని, మేకల కాపరిగా బతికి, తాను మనిషినన్న సంగతే మరిచిపోయిన ఒక నజీబ్ మహమ్మద్ కథ. లేలేత మీసాల నులియవ్వనాన్ని ఎడారి దేశానికి అంకితం చేసి అనంతమైన ఇసుకలో చిక్కుకుని రక్తం కక్కుకుని ఇసుకలో ఇసుకగా మారిన ఒక హకీమ్ కథ. ఎడారిలో శిలలా గడ్డకట్టుకుని బతుకు రోజు రోజుకూ శిథిలం అవుతున్నా కూడా హృదయం నిండా ప్రేమను భద్రంగా దాచుకొని తోటి స్నేహితుడిని గట్టెక్కించడానికి స్నేహహస్తం అందిస్తూ ఎడారి గుండెలో ఒయాసిస్సులా నిలిచి అదృశ్యమైపోయిన ఒక ఇబ్రహీం కథ. కరుడుగట్టిన గుండెలతో కరకు రాతి మనుషులున్న ఎడారిలో ‘ఇసుమున తైలం ఉండదా ఇంటికి పంపరా’ అని కళ్లనిండా ఆశలు పెట్టుకొని కన్నీళ్ళతో ఎదురు చూస్తున్న ఒక హమీద్ కథ. ఈ కథలు తెలుగు ప్రజానీకానికి కొత్తేమీ కాదు. ఎడారి వలసలు మొదలైంది మొదలు ఇలాంటి  విషాద కథలు ఇంటింటా ఉన్నవే. తెలంగాణలో, మరీ ఉత్తర తెలంగాణలో అయితే కంటినిండా కన్నవే.  అయినా అనంత కష్టాలు ఎదురొచ్చినా అన్ని దారులు మూసుకుపోయినా ప్రయత్నాలు విఫలం అయినా పిడికెడు ఆశను వదలని మనిషి జీవితంగా ఈ ‘మేక బతుకు’ నవల ఒక విశిష్టమైన రచన.

    తెలుగులో అదీ తెలంగాణలో వలస మీద చాలా సాహిత్యం వచ్చింది. గల్ఫ్ వలస సాహిత్యం మీద రెండు సిద్ధాంత గ్రంధాలు కూడా వచ్చాయి. చక్రవేణు కువైట్ సావిత్రమ్మ నుంచి కాలువ మల్లయ్య మస్కట్ మల్లయ్య, కేవీ నరేందర్ ఎడారి దీపాలు, పెద్దింటి అశోక్ కుమార్ జుమ్మేకి రాత్ మే కథల దాకా గల్ఫ్ వలస జీవితాల మీద, జరుగుతున్న మోసాల మీద కథలు బాగానే వచ్చాయి. తెలుగులో ఎడారి వలసల మీద ఎక్కువగా కథలు రాసింది పెద్దింటి అశోక్ కుమార్. ఇతను  గల్ఫ్ వలసల మీద మొదటిసారిగా ‘వలస బతుకులు’ అనే ఒక కథల సంకలనాన్ని ‘ఎడారి మంటలు’ అనే ఒక నవలను ‘ఎండ మావి’ అనే ఒక నాటకాన్ని రాసారు.

వలసలు ప్రపంచ వ్యాప్తంగా అనాదిగా ఉన్నవే. ఆపదకో, అధికారానికో, ఉనికికో, ఉన్నతికో అనాదిగా సాగుతున్నవే. ఆ వలసలు వేరు. కరవుతో వచ్చిన కష్టాలతో ఆకలి తీర్చుకోవడానికో, అప్పులు తీర్చుకోవడానికో సాగిన వలసలు వేరు. 1972లో దేశంలో పెద్ద కరువు వచ్చింది. షిప్ టు మౌత్ పరిస్థితి వచ్చింది. అప్పుడే ఎడారి దేశాల ఇసుక గనుల్లో చమురు నిధులు బయటపడ్డాయి. అంతవరకు బొగ్గుబాయి బొంబాయిలవైపు వలస పోతున్న ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఎడారివైపు చూసింది. ఎమర్జెన్సీ తర్వాత ఈ వలసలు మరింత వేగాన్ని అందుకున్నాయి.

    ఆకలి మనిషిని దేనికైనా తెగించేలా చేస్తుంది. పిల్లలకి పిడికెడు మెతుకులు పెట్టడానికి ఎర్రటి ఎండలో ఎడారి దేశంలో ఆకలిని కన్నీళ్ళతోనే ఆర్పుకుంటూ గంపెడు ఆశతో జీవితాన్ని గడుపుతున్న ఎందరో ఇప్పుడు ఎడారి దేశాల్లో ఉన్నారు. చేయని తప్పుకు ఏండ్లకేండ్లుగా ఎడారి జైళ్లలో మగ్గుతున్నవారూ ఉన్నారు. ఏజెంట్ చేతుల్లో మోసపోయి విజిట్ వీసా చేతిలో పట్టుకొని మూడు నెలల తర్వాత పతాకా లేకుండా కల్లివెల్లి అయి బతకలేకుండా రోడ్ల వెంట తిరుగుతూ చిన్న సహాయం కోసం ఎదురుచూస్తున్నవారూ ఉన్నారు.

   దేశంలో ఎడారి వలసలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. భర్తలను గల్ఫ్ జైళ్లలో నుండి విడిపించుకోవడానికి డబ్బులు కట్టడం కోసం తమ కిడ్నీలను అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు మెట్లెక్కిన మహిళలు ఉన్నారు. షరియత్ చట్టాలను అనుసరించి నేరస్తులుగా ముద్ర పడ్డ తమ భర్తలను కాపాడుకోడానికి ప్రాణం ఖరీదుగా 100 ఒంటెల భరణం కట్టడానికి అధికారుల వెంట, ఆపన్న హస్తాల వెంట కాళ్లావేళ్లా పట్టుకుని తిరుగుతున్న ఇల్లాళ్లు ఉన్నారు. కొత్త కొత్త ఊహలతో కొత్తగా పెళ్లి చేసుకొని నులివెచ్చని కౌగిళ్ళలో కరిగిపోవాల్సిన యవ్వనాన్ని ఎడారి ఎండలకు అంకితం చేస్తూ విరహపు వేడి గాలుల్ని ఇసుక తుఫానులుగా మార్చుకొని జీవితం మీద ఆశతో బాగుపడతామన్న భరోసాతో కన్నీళ్ళతో జీవితం గడుపుతున్న యువకులు ఉన్నారు.

 అప్పటికీ ఇప్పటికీ ఎడారి వలస ఒక విషాదమే. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో మూతి మీద మీసం మొలిచిన ప్రతి యువకుడి మదిలో మెదిలే ఏకైక కోరిక గల్ఫ్ వెళ్ళడమే. ఊరూరా వెలసిన ఏజెంట్లు వారిని ప్రోత్సహిస్తూ పాస్పోర్ట్ లు తీపిస్తూ బొంబాయి చుట్టూ తిప్పించిన కంపెనీలు ఉన్నాయి. ఊరిల ఎందరో కొందరు గల్ఫ్ లో బాగుపడి తిరిగి వస్తే ఆ మూడు నెలలు వారు ఊర్లలో చేసిన హంగామాను చూసి దీపం పురుగుల్లా ఆకర్షితులైన యువకులు కూడా ఎందరో ఉన్నారు. ఇలా చెప్పుకుంటే ఒడవని సుదీర్ఘ విషాద భారతం గల్ఫ్ జీవితం.

కొన్ని వాస్తవాలను మనం ఒప్పుకోవాల్సిందే. ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే మోయడానికి యువకులు లేక ట్రాక్టర్లలో శవాన్ని తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ పల్లెల మీద పెట్టిన పోలీసు ఉక్కుపాదం నక్సలైట్లుగా సింపతైజర్లుగా ముద్రవేసి వెంటాడిన తీరు, దొరలు భూస్వాముల ఆగడాలు ఇవన్నీ గల్ఫ్ వెళ్ళడానికి ద్వారాలు తెరిచాయి. కానీ ఒక నిజం మాత్రం ఒప్పుకోవాలి. కరువులో అయినా కాలంలో అయినా తెలంగాణను ఒకప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకున్న అంశాల్లో ఒకటి బీడీ పరిశ్రమ అయితే మరొకటి గల్ఫ్ వలస. ఇదొక జూదం లాంటిది. కొందరు బాగుపడ్డారు. కొందరు బాధపడ్డారు. కొందరు సంపాదించుకున్నారు కొందరు అప్పులపాలయ్యారు.

భార్య మీద కనీసం పుస్తెలు లేకుండా అమ్ముకొని, అడ్డగోలు మిత్తికి అందినకాడల్లా అప్పు తెచ్చి ఏండ్లకు ఏండ్లు అసలుకాదు మిత్తినే తీర్చడానికి, కల్లివెల్లయి ఇంటికి రావడానికి మొఖం చెల్లక ఎడారి దేశాల్లో మగ్గిన ఎందరో యువకులు ఉన్నారు. ఇక్కడ చెప్పిన పని ఒకటయి అక్కడ ఇచ్చిన పని ఒకటయి మోసపోయి ఎడారి గుడారాల్లో మగ్గుతున్న ఎందరో ఉన్నారు. వాళ్లందరి జీవితాల సమాహారమే ఈ నవల.

   నజీబ్ మహమ్మద్ ఒక పేద ముస్లిం యువకుడు. తన భార్యకి, పుట్టబోయే తన బిడ్డకి ఒక మెరుగైన జీవితం ఇవ్వాలని పిడికెడు మెతుకులు పెట్టాలని తన బంధువు ద్వారా ముప్పయి వెయిల రూపాయలు కట్టి గల్ఫ్ వెళ్ళాడు. వెంట నవ యువకుడు హకీమ్ కూడా వెళ్ళాడు. వెళ్లేటప్పుడు చెప్పిన పని వేరు కానీ అక్కడ కుదిరిన పని వేరు. ఇక్కడ బంధువు అబద్ధం చెప్పాడా లేక అక్కడ తను కిడ్నాప్ చేయబడ్డాడా అన్న అంశాలను పక్కన పెడితే మూడు సంవత్సరాల నాలుగు నెలల తొమ్మిది రోజులు ఇసుక ఎడారిలో మేకల్లో మేకగా ఒంటెల్లో ఒంటెగా కనీసం తాగడానికి సరయిన నీళ్లు లేక మలమూత్ర విసర్జనకు తావు లేక స్నానానికి దూరమై పెరిగిన జుట్టు, పెరిగిన గడ్డం చివరికి అద్దంలో తనను తాను చూసుకుని గుర్తుపట్టలేనంతగా మారిన ఒక విషాదమైన మానవ జీవితపు ఒక శకలం ఈ నవల.  మేకల కాపరిగా ఎడారిలో ఇరుక్కుని మేకలతోనే మాట్లాడుతూ పుట్టిన మేక పిల్లని కొడుకుగా భావించి పేరు పెట్టుకొని చివరికి యజమాని దాని పురుషత్వాన్ని తొలగిస్తుంటే తల్లడిల్లి తల్లడిల్లి తానూ పుంసత్వాన్ని కోల్పోయిన ఒక అమానవీయమైన కథ. మనం మనుషుల్లా మనుషుల మధ్య మనుషులను చూస్తూ జీవిస్తున్నాం కానీ ఒంటరి ఎడారిలో ఏండ్లకేండ్లు మనుషుల్ని చూడకుండా తాకకుండా గడిపి చివరికి ఒక కార్ డ్రైవర్ గా వచ్చిన మనిషిని చూసి తల్లడిల్లిన ఒక ఆనందం, సుగంధంగా భావించి ఆస్వాదించిన చెమట పరిమళపు పులకరింత, ఎడారిలో ఏండ్లకేండ్లు పచ్చని చెట్టును, నీటి చెమ్మను చూడని కళ్ళతో ఒయాసిస్సులాంటి ఒక ప్రాంతాన్ని చెమ్మతో వీస్తున్న ఒక మట్టి పరిమళాన్ని, ఉన్న కొద్దిపాటి నీటిని చూసినప్పటి పులకింతను చదివాక నిలువునిత్తారము మనసు కరిగిపోతుంది. ఎండలో, ఇసుకలో విషాదాలు, అమానవీయమైన అర్బాబ్ ల శిక్షలు, బతకడానికి పిడికెడు ఆశతో వెళితే జైలును, ఒంటరి జీవితాలను బహుమతిగా ఇచ్చిన ఇసుక ఎడారుల విషాద గీతాలు ఈ నవల నిండా మనకు కనిపిస్తాయి.

   స్వర్ణ కిలారి గారు నవలను, నవలలోని ఆత్మను, ప్రాణాన్ని, పట్టుకొని విషాద దుఖ్ఖాన్ని అక్షరాల్లోకి దించేశారు. అనువాదం అన్నది ఆశామాషి  పనేమీ కాదు. కథకుడికి ఒక హృదయం ఉంటే అనువాదకుడికి రెండు హృదయాలు ఉండాలి. ఒక హృదయంతో చదివిన భాషలో అర్థం చేసుకొని ఆత్మను పట్టుకోవాలి. దాన్ని అంతే పదిలంగా మరో హృదయంతో అనువదిస్తున్న భాషలోకి తెచ్చి రక్త మాంసాలనే కాదు ప్రాణాన్ని కూడా పోయాలి. అనువాదం అంటే లిప్తకాలం మాత్రమే  నీళ్లు లేకుండా బ్రతికే ఒక చేప పిల్లను కాలువలోంచి అతి జాగ్రత్తగా తీసి సముద్రంలో వేసినంత సున్నితంగా జరగాలి. ఈ అనువాదం కూడా అంత సున్నితంగా జరిగింది కాబట్టే చదవగానే ఒక నిట్టూర్పు విడుస్తాం. అంతేకాదు ఒక కన్నీటి చుక్కను రాలుస్తాం. అంతేకాదు మన చుట్టూ తిరిగాడుతున్న మనుషుల్లో నజీబ్ లు,  హామీద్ లు, ఇబ్రహీంలు, హకీమ్ లు, అర్బాబ్ లు ఉన్నారా అని చూస్తాం. అంతే కాదు భర్తలను ఎడారి ఇసుక దిబ్బలకు అంకితం చేసి బతుకంతా కళ్ళల్లో ఒయాసిస్సులను నింపుకొని గుండెను రాయి చేసుకుని పిల్లల కోసం పిడికెడు భవిష్యత్తు కోసం ఆశగా ఆకాశంలోంచి ఎగురుతున్న విమానాలవైపు చెమ్మగిల్లిన కళ్ళతో చూసే సైనులు ఉన్నారా అని చూస్తాం. ఎడారిలో కూడా నిండైన హృదయంతో తోటి స్నేహితులకు సహాయం చేసే కుంజిక్కలు ఉన్నారా అని చూస్తాం. కథ, కవిత్వం, నవల, నాటకం ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా సరే చదవగానే తనలోకి తాను చూసుకొనేలా, సమాజంలోకి చూసుకునేలా చూసేలా చదివిన పాత్రలకోసం మనుషుల్లో వెతికేలా చేసిందంటే  అది ఉన్నత సాహిత్యమే. ఈ నవల అనువాదం పరిపూర్ణంగా అనుకున్న ఫలితాన్ని సాధించింది. స్వర్ణ గారికి అభినందనలు.

పెద్దింటి అశోక్ కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *