వాగుదూలం

Spread the love

మా ఊరు , బుగ్గవాగు ఈ రెండూ ఒకదానినొకటి పెనవేసుకుపోయాయి. రెంటినీ విడదీసి చూడలేం. 

వాగులోంచే కావిడ్లతో, మట్టి కుండలతో ఇంటి వాడకానికి నీళ్ళు రోజూ తెచ్చుకునేది. ఇసుకల చెలిమలు తీసి, కుండల మూతికి గుడ్డకట్టి కొబ్బరి చిప్పలతోనో, సొరకాయ బుర్రలతోనో నీళ్ళు చేది, బుంగలు నింపుకుని తెచ్చుకునేటోళ్ళం. బట్టలు ఉతకడం, తానాలు చెయ్యడం – అన్నీ వాగులోనే !

వాగులో ఇసుకమేటలు, వాగులో గంతులేసే కప్పలు, చేపలు,వాగుతొర్రల్లో కాళ్ళు బయటపెట్టే ఎండ్రకాయలు[ఎండ్రకిచ్చలు], మధ్యమధ్యలో బండలు, ముళ్ళ చెట్లు, తుంగ గుబురులు -ఒడ్డుమీదనుంచి వాగులోకి వొంగిన చెట్లు, చెట్లకు అల్లుకునే తీగెలు, వేలాడే పిట్టలగూళ్ళు, అక్కడక్కడా పుట్టలు, అటు ఇటు తిరిగే పాములు, తేళ్ళు, ముంగిసలు, ఉడుములు, ఎగిరే పిట్టలు -పుల్ల కోళ్ళు,కోయిలలు, గువ్వలు, పురేడు పిట్టలు, కంజులు, గుంపులుగా ఊరపిచుకలు, తెల్ల కొంగలు – వాగులో ఈతలు, పెద్దబండ మడుగులో బండమీంచి నీళ్ళలోకి దూకడం ; ఎండాకాలం మడుగుల్లోకి దూకి కింద ఉన్న చల్లటి మట్టిబురదలోకి దూరడం, నీళ్ళలో మునిగి ఊపిరినిలిచినంతసేపు ఉండటం – జ్ఞాపకంలోని నలగని నెమలీక.

ఎండాకాలంలో పగళ్ళు ఇసుక , నీళ్ళు కాలుతూ ఉండేవి. ఒకవైపున బర్రెలు, మరోవైపు పిల్లలు , పెద్దలు చెట్ల నీడపడుతున్న మడుగులదగ్గర ఉండేవాళ్ళం. రాత్రయ్యాక వాగు దగ్గర అదేమిటో కమ్మని నెయ్యివాసనలా వచ్చేది. అలా ఎందుకో ఇప్పటికీ అంతుపట్టదు. రాత్రి వాగుమీద నుంచి చల్లనిగాలి. ఊళ్ళో వాకిట్ల పడుకుంటే, చలికాలం చలిలా ఉండేది. పైన ఏదో ఒకటి కప్పుకునేదాకా ఆ చలిగాలి ఊరుకునేది కాదు.

ఒకసారి వాగు వచ్చినప్పుడు, నేను గూడ నా దోస్తు ఇరప రాములుతో కలిసి వాగుల కట్టెలు తీయడానికి పోయిన. ఊళ్ళో వాళ్ళు అక్కడక్కడ ఉన్నరు. కట్టెలకోసం దుమికి ఒడ్డుకు తెస్తున్నరు.అద్దలు పెడుతున్నరు. రాములు, నేను దూరంగా కొట్టుకొస్తున్న పెద్ద దూలాన్ని చూసినం. మేమిద్దరం దాన్ని ఎట్లైనా తీయాలని వాగు ఎగువకు ఉరికి,దూకినం. మాకప్పుడు 12 ఏండ్లే ! 

 తోలెమోళ్ళ మామిడి చెట్ల దగ్గర దూకినంక, దూలాన్ని పట్టుకున్నం. నీళ్ళ తాకిడి ఎక్కువగ ఉంది. పెద్దబండ దగ్గర రాములు కట్టె వదిలిపెట్టి, నీళ్ళు మింగిండు. ఎట్లనో ఒడ్డుకు చేరిండు. నేనేమో చినచిన్నగ దాన్ని ఒడ్డువైపుకు తోస్తున్న. నీళ్ళ ఒత్తిడికి అలిమికాలె. అసలు ఒడ్డు చేరాల్సింది పెద్దబండ దగ్గర్నే. అది దాటింది. ఇంకొంచెం ముందుకు పోయిన. అక్కడ ఒడ్డుకు చేరడం కష్టం. అది కూడా దాటింది.

ఒడ్డునున్న వాళ్ళు చూడనే చూసిన్రు. ఒకటే అరుపులు ‘యాకూబ్ కొట్టుకుపోతున్న’డని. ఆ సందడికి ఊళ్ళో వాళ్ళంతా వాగు ఒడ్డుకి జమైండ్రు. వొడ్డుమీద ఉరుకులు. అరుపులు. మా అమ్మ ఏడుపు. నేనేమో నీళ్ళలో ముందుకే పోతున్నా. నల్లవాగు మడుగు దాటిన. రైలుకట్ట బ్రిడ్జి మడుగు దాటిపోయిన. ఇరప వెంకటి, ఆరెం రాగోలు ఆడ వాగుల దున్కిన్రు. ఆడ తర్వాత వాగు వొంపు తిరుగుద్ది. ఆ వొంపుకాడ వొడ్డుకు చేరడానికి అలిమి ఆయ్యిద్ది. నీళ్ళల్ల ఎంత బలమున్నోడు కాని, కొద్దిసేపయినంక ఒంట్ల సత్తువ కరిగిపోద్ది. ఎట్లనో ఆ వొంపుల వొడ్డుకు దూలాన్ని చేర్చిన. చెట్టు వేరును ఒక చేత్తోపట్టుకున్న, దూలాన్ని కాళ్ళ మధ్యన ఒడిసిపట్టుకున్న. ఇంతల ఇరప వెంకటి, ఆరెం రాగోలు అందుకున్నరు. ముగ్గురం కలిసి వొడ్డుకు చేర్చినం.

వాగు తగ్గినంక ఆ దూలాన్ని ఇంటికి తేవడానికి ఎడ్లబండి అవసరమొచ్చింది. దానిమీదికి ఎక్కించడానికి ఎనిమిదిమంది అవసరమైన్రు. అంత పెద్ద దూలం మరి !

వొడ్డుకు చేరినంక మా అమ్మ ఒకటే ఏడుపు, శోకాలు. మా ఊరోల్లంత ఒకవైపు తిట్టుకుంటనే, మరోపక్క మెచ్చుకునుడు. ‘ఎట్ల తీసినవ్ రా యాకూబ్ ‘అని. కట్టెలు తీయడం సరదా అట్లా తీరింది. ఇప్పటికీ మా సోపతిగాల్లు ఆ ముచ్చట అపుడపుడు గుర్తుచేస్తరు. ఆ తర్వాత మా అబ్బా(నాన్న) ఆ దూలాన్ని వడ్లోల్ల దగ్గరికి రేగులగూడెం తీసుకపోయి, ఒక మంచం, ద్వారబంధం చేయించిండు. ఇప్పటికీ ఊళ్ళో అయి ఉన్నయి  నాకు ఆనాటి రోజును గుర్తుచేసుకుంట.!

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *