గుండె పగిలిపోతుందిరా చిన్నోడా .
యాభయ్యేళ్ళ ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్రుళ్లు ఫోన్‌చేసి “లవ్ యూ రా బంగారు కొండా”అంటే సంస్కారపు జబ్బు మదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి, “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?’ అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా!
సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీ గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు, కళ్లు తిరిగి ఒళ్లు తిరిగి … ఒరేయ్, ఇంతకుముందు ఇక్కడో నయగారా ఉండాలి, సింకులో నీళ్లాపేసిన బాస్టర్డ్ ఎవడ్రా? కాగితాలున్నయ్ కాబట్టి సరిపోయింది మాటలు కక్కడానికి.
పత్రికలో పడిన నీ ఒకేఒక్క కథ, ఆపైన నీ ఉత్తరాలు చూసి మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నేను ఊహించినట్టే ఉన్నావ్. ఐనా ఏం ఊహించాను నేను? తెలివి, మొండితనం, వయసులో ఉండే పట్టుదలా, అదే నాకు తెలిసిన నువ్వు, నాకెప్పటికీ దొరకని నాలాంటి నువ్వ. ఆ సాయంత్రం అంతసేపూ తాగుడూ వాగుడూ నాదే అయ్యాక “అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా?” అని నేను దేవుణ్ణీ, నిన్నూ ఒకేసారి అనుమానిస్తే “తాగినవాళ్లని ఇంతదగ్గరగా ఎప్పుడూ చూళ్ళేదు మాస్టారూ” అన్పెప్పి “కేవలం మీ కోసమే ఇంతసేపూ …” అన్న ముక్కని చెప్పకుండా అభిమానంగా నవ్వినప్పుడు; అప్పుడు గ్లాసు దించి మరోసారి నీ మొహంలోకి చూస్తే, ఎందుకో … ఎందుకో శివాని గుర్తొచ్చింది.
పెళ్ళాం, బెటరాఫ్ – ఇలా ఎలా రిఫర్ చేసినా చిరాకు పడేది శివాని. ఆ పేరు చూసే ప్రేమించుంటాను. సృష్టిలో ఎక్కువైపోయిన ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శివమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా శివుడు ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! ఎలాగో నిభాయించాడు, తట్టుకు నిలబడ్డాడు. మాటలా అది! నాలాంటోడివల్ల కాలేదు. ఇందాకన్నాగా “మా ఆవిడ’ అని తన గురించెవరికైనా చెబ్తే ‘నేను నువ్వే అవుతాను కానీ, నీకు మరేదో ఎలా అవుతాను?” అని పెళ్లిలో చదవని మంత్రాల్నేవో కొత్తగా నేర్పలేక మళ్లీ వెంటనే మూగగా అయిపోయేది.
మూడేళ్ల కొడుకుపోయినపుడు ఎన్ని నెలలకీ మనిషి కాలేదు. శరీరం కోసం తప్ప ఓదార్చడానికి ముట్టుకోడం రాని మగాణ్జే అప్పటికి. తన ఏడుపు నన్ను అస్తమానమూ డిఫెన్స్‌లో ఎందుకు పడెసేదో ఎప్పుడాలోచించినా అర్థం కాదు. సొంతసొత్తులా తప్పు సాటి మనిషిలా చూడలేనని తెలిశాక కూడా, ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరక కోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్లు నా దగ్గర వెతుకుతూనే ఉండేది. ఇప్పుడు నాకు పగులుతున్నట్టుగానే తనకీ గుండె ఎన్నిసార్లు పగిలి ఉంటుందో! ఒకరోజు నిజంగానే నా శక్తినంతా లాక్కుని జీవితాన్ని మనుషుల్ని దేబిరించకుండా హుందాగా తనకి నప్పుతుందేమో అన్న ఆశతో మరే లోకానికో వెళ్లిపోయాక, వెళ్లిపోయి రెండు పుష్కరాలు దాటాక నువ్వు …
ఇప్పుడిదో కొత్త పిచ్చి – “పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు” అని నేనంటే “నెరుడాని మీవాదం కోసం వాడేసుకుంటారు – స్పానిష్ మీ బలహీనత” అని నువ్వు ఎడ్మెరింగ్‌గా నవ్వేవాడివి. “నువ్వు గత జన్మలో రష్యా వోడివిరా” అని నేనన్నప్పుడు కృతజ్ఞతతో నవ్వినట్లు …
“కథొకటుంది మాస్తారూ. మూడు ముక్కల్లో చెప్పొచ్చు. పెళ్లాన్ని దారుణంగా చంపేసి రేప్పాద్దున ఉరికంబం ఎక్కబోతున్న హంతకుడీ గురించి ఇద్దరు సెంట్రీలు మాట్లాడుకుని, నైట్ డ్యూటీలను బూతులు తిట్టుకుని ఒక దమ్ములాగి సెల్స్‌లో రౌండుల కెళ్లటం మొదటి భాగం.
చనిపోయిన భార్యప్రియుడు, ఈ గొడవల్లో తను ఏ రకంగానూ ఇరుక్కోకుండా ఇన్‌ఫ్లయెన్స్‌తోఎలా నెట్టుకొచ్చాడో, చిత్తుగా తాగి బార్లో ఫ్రెండ్స్ దగ్గర కోతలు కొయ్యడం రెండోది. ఖైదీ కొడుకు అనాధాశ్రమంలో భయంగా ముడుచుకు పడుకుని తను స్కూలుకెళ్లి వచ్చేలోపు అమ్మా నాన్నా ఇద్దరూ కనపడకుండా పోవడమేంటో అర్ధంకాక ఎక్కిళ్ళు బయటికి వినపడకుండా నోరుమూసుకుని, కాసేపటికి కళ్ల తుడుచుకోకుండానే నిద్రపోవడం-ముగింపు: అంతే కథ. మొత్తం కథలో ఆ హంతకుడిని నేరుగా చూపించకుండా పొగమంచు కప్పెయ్యాలన్నమాట, రాయొచ్చంటారా? అని మొహమాటంగా సలహా అడిగినప్పుడు –
“నా అనుభవంలోంచి చూస్తే అంత గొప్పకథ కాదు గానీ, నీ వయసుకి గ్రాండ్ గానే ఉంటుందిలే, కానియ్” అని ఉడికిస్తే “ఒక్కసారైనా అన్‌కండిషనల్‌గా మెచ్చుకోరుగా మీరు” అంటూ నువ్వు ఉక్రోషపడితే, ‘నాకేవవుతాడ్రా వీడు? నిండా పాతికేళ్లు లేవు. నా కొడుకే బతికుంటే వీడంతై, ఇలా లోలోపల దావానలంతో దహించుకుంటూ ఉండేవాడా?’ అనొక విపరీతపు ఆలోచన సెంటిమెంట్‌తో సతమతం చేస్తుండేది.
“ఐనా పెద్దాయనా! మనమీకాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ, ఈ స్థలం, కాలం,ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్ధం, అసంబద్ధం అయిన మరోచోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం” అని నువ్వూగిపోతుంటే పాతిక క్రితపు నా ఆవేశమూ, దాన్లోంచి పుట్టి ఇప్పటికీ ఆగని నా అన్వేషణా గుర్తొచ్చేవి.
ఏమన్నావు? స్థలం, కాలం – ఎన్ని స్థలాల్లో తిరిగాను, ఏ కాలాల్లో బతికాను. పిచ్చి పట్టినవాడిలా ఏ రైల్లోక్కడ ఎక్కానో, అదెక్కడికెళ్తుందో తెలీకుండానే. నిద్ర లేచినప్పుడు ఏ స్టేషనొస్తే అదే నా ఊరు. పడమటి కనుమల్లో ఏదో పల్లెటూరి హోటల్లో ‘టీ కప్పులు కడగటంలో మొదటిసారి మెడిటేషన్ దొరికినప్పుడు; గోవాబీబ్ లగ్జరీ రిసార్టుల్లో టాయిలెట్ల సఫాయీలో నాలుగు డబ్బులు పోగవగ్గానే సింబాలిజం, ప్యూచరిజం, ఫిలాసఫీ అని ఇష్టమొచ్చిన పుస్తకాల కోసం ఖర్చు పెట్టేసినప్పుడు; నేనొదిలేసొచ్చిన ఎకౌంట్స్ మేనేజర్ పోస్ట్‌లో గోతికాడ నక్కలా దూరి వారానికార్రోజులు సగం టీలు, సగం గాసిపింగూతో గడిపేసే శివప్రసాద్‌కి ఫోన్ చేసి ‘నిజంగానే నేను గొప్పగా బతుకుతున్నాన్రా పూల్’ అని పగలబడి నవ్వాలనిపించేది.
అజంతా గుహల్లో గైడుగా వెలగబెట్టినప్పుడు చరిత్రని పొయెటిగ్లా చెబుతుంటే ఆ కాసేపట్లోనే శిల్పి హృదయ రహస్యాల్ని కళ్లతో కొనేసుకోవాలని తపించి, కళలోని అందాన్ని తప్ప ఆత్మని పట్టుకోలేక అల్లాడే యాత్రీకుల అలసటని, ఫోటోల్ని తప్ప జ్ఞాపకాల్ని దాచుకోలేని యాంత్రికతనీ చూసి జాలిగా ఓదార్చాలనిపించేది.
ఇంకా ఎన్నెన్ని స్థలాలు, ఎలాంటి అనుభవాలు!
దారంతెగి గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు, వివస్త్రంగా ఉబ్బి వరదల్లో కొట్టుకొచ్చే దిక్కులేని శవాలు, ఇసుక తుఫానులు చెరిపేసిన ఎడారి ఒంటెల ప్రయాణపు గుర్తులు, అసంతృప్తి ఆగ్రహాలు నిండిన సముద్రపు సుడుల్లో అలవాటుపడ్డ మొండి ధైర్యంతో సాగిపోయే ఓడలు చేరని తీరాలు.
ఏ స్థలాల్లోని, ఏ కాలానివి ఈ జ్ఞాపకాలన్నీ?
తనలోని స సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట – ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహం మొత్తుళ్లు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివిపూలు – ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ద యానిమల్ ఇన్‌స్టింక్ట్స్.
యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వరప్రేమ హౌరా నదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు; బసంతీ! నా చెవిలో ఏదో అన్నావ్? ఆర్ట్ సినిమాలో నటన మర్చిపోయిన హీరోయిన్లాగా.
మనసుతో శరీరాన్ని కోరుకోవడం మర్చిపోయిన చాలా ఏళ్లకి, పరిచయం పాతబడి వెళ్లిపోతుంటే – నేనిచ్చిన డబ్బులు చనువుగా నా జేబులో తిరిగి పెట్టేస్తూ ఏమిటి బసంతీ అన్నావ్ నా కెప్పుడూ అర్థంకాని మరో లోకపు భాషలో! ఎప్పుడో శివాని కోసం పిచ్చెక్కిపోయిన మొదట్లో భావుకత్వమంతా కళల్లో వెలిగించుకుని నుదుటిమీద ఆర్తితో పెట్టిన ముద్దు – కామంతో కాదు, రిచువల్‌గా, అలవాటుగా కాదు .. ‘ఐ కేర్ ఫర్ యూ” అని అంత సున్నితంగా చెప్పడం మళ్లీ నీ దగ్గరే. ఒకసారెళ్లిన చోటకీ, వదిలేసొచ్చిన మనుషుల దరిదాపులకీ వెళ్లే అలవాటు లేదు నాకు. ఎక్కడున్నావో, ఎప్పుడైనా తలచుకున్నావో లేదో. అప్పటికి కష్టంగా అనిపించినా తప్పలేదు. నాకు తెలుసు నీతో నేనుండలేను. అసలెవరితోనూ, ఎక్కడా ఉండిపోలేను శాశ్వతంగా. పదిహేనేళ్లవలేదూ? ‘బై బై బసంతీ’ అని కూడా చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా లేటైపోతున్న ఏ రైలు కోసమో అన్నట్టు త్వరత్వరగా నడుచుకుని వచ్చేసి …
ఎక్కడి చట్టం, సమాజం, నైతికత, నైతికాతీతత! నిజంగానే నువ్వు రాయగలవురా చిన్నోడా; నేనాగిపోయిన చోటునుంచి ముందుకు కాకుండా పైపైకి వెళ్లి, నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డకట్టిన ఇంక్ పెన్నుని గట్టిగా విదిలించి కొట్టి …నీకా దమ్ముంది.
“ప్రయోగాల మీద అంత తపన ఉన్నవాడివి, ఈ మూడుముక్కల కథలెందుకు నీకు?” అనడిగితే “లేద్సార్, ఈ ఒక్కసారికీ రాధికకి మాటిచ్చాను. తను పనిచేసే వీక్లీలో స్టోరీ సెక్షన్‌కి మారింది. మీకెప్పుడూ చెప్పలేదు కదా తను చాలా ఇంటలిజెంట్ అండ్ సెన్సిబుల్‌గా అనిపిస్తుంది” అని మురిసిపోయినోడివి – ఇన్ని నెల్ల తర్వాత మళ్లీ మొన్ననగా ఫోన్ చేసి “మనకి నచ్చేది లోకంలో నిజంగా ఉందని తెలిసీ, అందుబాటులో ఉండీ, మనది కానప్పుడు, ఎలాగండీ తట్టుకునేది?” అని ఏదో గొప్ప ఆశాభంగాన్ని మగాడివి కాబట్టి ఏడవకుండా మానిప్యూలేట్ చేస్తుంటే – ఏంట్రా ఇంత ముదురుగా మాట్లాడావ్! ఒకవేళ తాగి ఉన్నావా అని అనుమానమేసి పట్టరాని కోపమొచ్చింది.
—————————————
అప్పటిదాకా ఎక్కింది దిగుతూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో – ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవలసిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీదాన్ని కేర్లెస్‌గా చూసుకుంటూ …
అదే మొదటిసారి పనిగట్టుకుని ఫలానా చోటకని అనుకుని ఎవర్నయినా చూడ్డానికి రావడం.
“మీ పుస్తకాన్ని ప్రచురిస్తాం” అని ఎవరైనా అడిగితే “చేసుకోండి, నాకెందుకు చెప్పడం?”
“మరి రాయల్టీలు?”
“ఊల్లో నా తమ్ముడున్నాడు, వాడికిచ్చెయ్యండి. నా తాగుడుకి డబ్బులు చాలక ఉత్తరం రాస్తే వాడే పంపుతాడు.”
అంత నిర్లక్ష్యం, అంత పొగరుబోతు దిలాసా. అలాంటిది నిన్న రాత్రి నువ్వు ఫోన్లో “దాని దుంప తెగ, ఎంత దౌర్భాగ్యపు జీవితమండీ” అనగానే ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన లేకుండా నువ్వు పుస్తకాలు కొరియర్ పంపిన కవరు వెనక అడ్రెస్ పట్టుకుని, ఇందాకా వస్తే…
గది తలుపు తోసుకుని “నేనెవరో చెప్పుకోరా ఇడియట్?” అని నీ ఆశ్చర్యం చూద్దామనుకుంటే …
నీలాగే నీ గది కూడా నేననుకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్ మీద ఒలికిపోయిన ఇంకు మరకలు, కానీ ఒంటిమీద స్పృహేదీ? పక్కన సూయిసైడ్ నోటేదీ? డస్ట్ బిన్‌లో చింపిపారేసిన డైరీ కాగితాల మధ్యలో ఉన్న రెస్టిల్ షీట్లు ఏ వివరాలూ చెప్పవు. అసలెవరైనా “నా చావుకెవరూ కారణం కాదు’ అని రాశారంటే ఆ కారణమైన వాళ్లని కాపాడ్డానికే అని అర్ధం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?
పెద్ద పనిమంతుడిలా కథల్రాయడమే కానీ నిద్రమాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, ఆ రాసేముందు ఇంటిగోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చిపూలచెట్టునో గుర్తుతెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకధికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలురాళ్ల మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధాంతరంగా “ఆగిపోకూడదనే, ఇలా చేసిన నీ తలపొగరుకి శిక్షగా ‘లవ్‌యూరా బంగారుకొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ.
ఈ మాత్రం ఊహించలేనివాడివా నువ్వు అని తలచుకున్నకొద్దీ …
గుండె పగిలిపోతుందిరా చిన్నోడా!
* * *
స్వాతికుమారి బండ్లమూడి
స్వాతి కుమారి బండ్లమూడి వృత్తిరీత్యా కొంతకాలం ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసారు. తర్వాత తొమ్మిదేళ్లుగా రిషి వాలీ లో టీచర్ గా ఉన్నారు. 2010 లో మొదటి కథ "శిశిరానికి చోటీయకు" రాశారు. ఆ తర్వాత మరొక తొమ్మిది కథలు రాశారు. "అతడే ఒక సముద్రం " అనే అనువాద నవలతో పాటు "పదహారు గడ్డిపోచలు", "ఆవిరి" "కోనేటి మెట్లు" మొదలైన కవిత్వ సంకలనాలు ప్రచురించారు.