దస్ర పండుగత్తాంది అంటే ఎవ్వలకైనా కొత్తబట్టలే యాదికొస్తయ్. నాకు మాత్రం గ్యాంగ్ లీడర్ అంగి యాదికొస్తది. మొదటిసారి నాన్న కండ్లల్ల నీళ్లు చూసిన రోజు యాదికొస్తది. ఇదంతా నా నాల్గోతరగతి ముచ్చట. అప్పటికి శిరంజీవి గ్యాంగ్ లీడర్ సీన్మచ్చి రెండేండ్లు అయిపోయిందిగానీ, టీవిల మాత్రం అప్పుడప్పుడే ఏశిండ్లు. ఆ బ్లాకండ్వైట్ టీవిల గ్యాంగ్ లీడర్ సూశినగానీ అండ్ల ఎప్పుడు ఏసుకున్నడో నాకు తెల్వది. మా బల్లె తాండ్ర విజయ్ గాడు ఏసుకచ్చి “అరేయ్ ఇది గ్యాంగ్ లీడర్ అంగి తెల్సా? చిరంజీవి గిదే ఏస్కున్నడు ఆ సీన్మల” అన్నప్పుడు మాత్రం నాకు మస్తు నచ్చింది ఆ అంగి.
రంగురంగుల డిజైన్లు ఉండే ఆ అంగి ఎట్లైనా నేనూ ఏసుకోవాలనుకున్న. కానీ ఇస్పెషల్‌గా పండుగకు బట్టలు కొనుడు అనేది మా ఇంట్ల ఎప్పుడూ లేదు. ఉన్న అంగీ చినిగి పోతున్నప్పుడో, ఎప్పుడైనా పైసలున్నప్పుడో ఇంత బట్ట కొనుక్కచ్చి మా నాననే కుట్టేటోడు. అప్పట్లో రెడీ మేడ్ బట్టలు ఇంకా మా ఊరిదాకా రాలేదు. ఎవ్వలైనా బట్ట కొనుక్కోని మిషిని సత్తెన్న దగ్గర కొల్తలిచ్చి కుట్టించ్చుకునేటోళ్లు. ఇగ నకైతే మా నాననే నా పర్సనల్ డ్రెస్ డిజైనర్ అన్నట్టు. విజయ్ గాడేస్కున్న గ్యాంగ్ లీడర్ అంగి బాగ మనసులవడ్డది. ఇంటికి పోయేటాల్లకు ఇగోరా నీకోసం గ్యాంగ్ లీడర్ అంగి తెచ్చిన అని మా నాన అంటే మంచిగుండు, ఇట్ల నడుసుకుంట పోతాంటే ఎవలన్న బట్టలాయినె సంచిలకెల్లి ఆ గుడ్డ జారి పడితే మంచిగుండు అని కలలు కనుకుంటా ఇంటికి వచ్చిన. కండ్లు తెర్శినా, మూశినా అదే అంగి, చిరంజీవి ఏస్కున్న అంగి… గ్యాంగ్ లీడర్ అంగి… “డ్యాన్…డ్యాన్..డ్యాన్… గ్యాంగ్ లీడర్….” అని పాడుకుంట చిరంజీవి లెక్కనే నడుస్తున్ననా లేదా అని నీడ సూస్కుంటా నడిశిన.
ఆ తెల్లారి నుంచే దస్ర సెలువులిచ్చిండ్లు. పది రోజులు ఇగ బడి ఉండది ఇర్గమర్గ ఆటలే ఇగ అనుకుంటా. ఉరికచ్చి బడిసంచి ఓ మూలకు ఇశిరేశి అంగి గళ్ల మొత్తం మీదికి లేపుకోని శిరంజీవిలెక్క నడుసుకుంట తిరిగిన. ఏదో సీన్మల గిట్లనే దునుకుతడు శిరంజీవి అనుకుంటా ఎగిరి దునుకుకుంట పోతాంటే… పెరుకోళ్ల ఇంటి ముంగట ఆడోళ్లందరు గుంపుగూడి కనవడ్డరు. ఏదో బేరం చేస్తున్నరు. అదేందో సూద్దామని మెల్లగ అక్కడికి పోయేటాళ్లకు మా అమ్మకూడా అక్కన్నే ఉన్నది. మెల్లగ వొయ్యి అమ్మ కొంగు వట్టుకోని నిలవడ్డ. నా అనుమానం నిజమే అందరు బట్టలు కొంటున్నరు. “ఇగో గిది మా రాజుగానికి మంచిగుంటదా?” “ఇగో ఇసోంటిదే మొన్న మా పెద్ద శెల్లె కొడుక్కు కొన్నం.”, “ఇదంత రంగు ఎలిశిపోయినట్టున్నది, గది.. గా ఎర్రది సూపెట్టు” అనుకుంటా బట్టలమ్మెటాయినెను సతాయిస్తున్నరు. అట్లనే నిలవడ్డనాకు ఆ బట్తల కుప్పల గ్యాంగ్ లీడర్ అంగి బట్ట కనవడ్డది. “అబ్బర బిడ్డ, దొర్కింది” అనుకున్న. మెల్లగ అమ్మ కొంగు గుంజుకుంట “అమ్మా, గది గ్యాంగ్ లీడర్ అంగే, నాకు కొనవా” అని అడిగిన. మా అమ్మ సమాధానం కంటే ముందే “అబ్బో ఈనికి కొత్తంగి కావాల్నాట, కొనిత్తవా అనసూర్యా” అని కారెడ్దమాడింది ఒక అత్తమ్మ. “మీరు గూడ కొంటరా?” అన్నట్టు అనిపిచ్చింది. అత్తమ్మ అట్లన్నందుకైనా ఆ అంగి కొనిపిచ్చుకోవాలె అనుకొని మళ్ల అడిగిన. “ఆ మీ అయ్య శింగరేణి నౌకర్ జేత్తాండు, నీకు బట్టలకే సాల్తలెవ్వు పైసలు” కొంచం కోపంగ అన్నది మా అమ్మ. “అయ్యో డెబ్బై రూపాలేనాట మీతర్ గుడ్డ సాల్తది కొనియ్యరాదు” ఇంకో అత్తమ్మ సాగదీసుకుంట అన్నది. అంతే చెట్టన సర్శింది మా అమ్మ, ఇంటికి నడువు… మోర్దోపోనివి తయారైనవ్ అనుకుంట ఇంకో రెండు కొట్టి ఇంటికి గుంజుకచ్చింది.
“నీయవ్వని, నేనేమడిగిన ఒక్క అంగి కొనియ్యవా” అని గట్టిగ ఒర్రిన. గంతే, పక్కపొంటి ఉన్న శీపిరికట్ట మర్లేశి ఇయ్యరమయ్యర సంపింది. ఎంత ఏడ్శినా ఊకోలే అక్కనుంచి ఉరికిన. అది కోపం కాదు, అన్ని పైసలు లేని తనమని, పక్కపొంటోళ్ల మాటలకు వచ్చిన కోపమని అప్పుడు తెల్వలేదు. ఏడ్సుకుంటనే మా అవ్వోళ్ల ఇంటికి (అమ్మమ్మ ఇల్లు) ఉరికిన. మెల్లగ పెరట్ల ఉన్న గడ్డికుప్పకాడ కూసున్న. సాయింత్రం దాకా అక్కన్నే కూసున్న. “ఎన్ని దెబ్బలైనా సరే, పడాలె, ఈ దస్రకు గ్యాంగ్ లీడర్ అంగి మాత్రం ఏస్కునుడే.” అనుకుంట మళ్ల ఇంటికి అచ్చిన. అచ్చ్టాళ్లకు మా నాన కూడా ఇంటికచ్చి ఉన్నడు. నేను గల్మల కాలువెట్టంగనే “ఏంది, సారుకు ఏమో కావాల్నాట? ఇప్పటిదాక ఏడవోయ్నవ్? నక్రాలైతున్నయా?” అనుకుంట ఇంకో రెండు బైరీల్ శెంపమీద కొట్టిండు. ఏడ్సుకుంట కూసున్న. ఒక్క అంగి… కొత్తది కుట్టి చాన రోజులైంది గదా. ఒక్కటి కొనిత్తె ఏమైతది అనుకుంట ఏడ్శిన. ఆ రాత్రి అన్నం తినలేదు. ఏడ్సుకుంట అట్లనే నిద్రవోయిన.
*** *** ***
తర్వాత రెండ్రోజులకు, “ఇగో పట్టు నీ గ్యాంగు లీడర్ అంగి, ఆగమాగం జేశినవ్ తీస్కో” అనుకుంట ముంగటేశింది. అంగిబట్ట… గ్యాంగ్ లీడర్ అంగిబట్ట… శిరంజీవి ఏస్కున్న రంగురంగుల డిజైన్ల అంగిబట్ట. దెబ్బల బాధ ఏన్నో పీకింది. మస్తు సంబురంగ సూసుకున్న, మంచిగ మడ్తవెట్టి మంచం మీద వెట్టిన. ఇగ ఎప్పుడెప్పుడు ఆ అంగి కుడ్తడా అని మా నాన పాణం దినుడు మొదలు వెట్టిన. “అరే… ఇంక పండుగ రాలేదురా, కుడ్త తీయ్. దెబ్బలవడకు” అని అంటున్నా పొద్దుమాపు తిరం బట్టనియ్యకుంట ఎంబడివడ్డ. అటీటు అనంగ ఓ సాయింత్రం పెద్ద అమ్మ, పెద్దక్క, శిన్నక్క సద్దుల బతుకమ్మ కోసానికి సత్తులు తయారు జేస్తుంటే టేపు, కత్తెర, మార్కర్ బిల్ల ముంగటేస్కొని “నానిగా ఇటురా” అని పిల్శిండు నాన. మెడల ఉన్న టేపుతోని కొల్తలు తీస్కుంట కాయిదం మీద రాసుకున్నడు, మార్కర్ బిళ్లతోని అంగిమీద గీతలు గీశి కత్తిరిస్తాంటే అక్కన్నే కూసున్న. రాత్రి పూట మిశినిమీద కూసోని అంగి కుట్టేటప్పుడు కూడ నిద్ర ఆపుకోని సూసుకుంటనే ఉన్న. గ్యాంగ్ లీడర్ అంగి… శిరంజీవి అంగి… రంగురంగుల డిజైన్ల అంగి…
అట్లనే కుర్శిలనే నిద్రపోయిన నన్ను ఎప్పుడు పక్కమీద పండేశిండో తెల్వదిగని, తెల్లారి లేవంగనే మిశినికాడికి ఉరికి సూసుకున్న ఇంకా ఖాజాలు, గుండీలు కుట్టలేదు. అది అమ్మ పని. “నీయవ్వ జెల్దిన కుట్టే” అని మనసుల్నే అనుకుంట అటు ఇటు సూశి ఒక్కసారి తొడుక్కొని సూశిన. ఎయ్… శిరంజీవి అయిపోయిన ఇగ, “డ్యాంగ్…డ్యాంగ్..డ్యాంగ్… గ్యాంగ్ లీడర్…ఏ డిశా, డిశా” అని శిరంజీవి గుండగాన్ని కొట్టినట్టు శేతులు ఊపి. మళ్ళా ఆ అంగి ఇప్పి ఎట్లున్నడట్ల వెట్టి. పోయి పండుకున్న. ఇగ మళ్ల ఇంకో లొల్లి “అమ్మా, గుండీలు, ఖాజాలు ఎప్పుడు గుడ్తవ్?” అని అమ్మెనుకవడ్డ. “ఏ…గోమారి వట్టినట్టు పట్టినవ్ గదరా, మనసునవట్టకుంట, బతుకమ్మ పేర్శినంక కుడ్త పోయి ఆడుకోపో గడెంత శేపు” అని అక్కలిద్దరు తెల్లారగట్ల తెచ్చిన తంగేడు పువ్వు సవరిచ్చుకుంట కూసున్నది. “నీయవ్వని” అని అనుకోని బయటికి అచ్చిన. గొళ్లోళ్ల సదిగానికి, పెరుకోళ్ల రాజుకు, ఇంటిముంగట ఔసులోళ్ల రమేషుకు “మానాన గ్యాంగ్ లీడర్ అంగి కుట్టిండు తెల్సా అని చెప్పిన” మనసంతా అదే అంగి… శిరంజీవి అంగి… గ్యాంగ్ లీడర్ అంగి…
*** *** ***
సద్దుల బతుకమ్మలు జల్లారం శెరువుల ఏశి వచ్చినంక, గుండీలు ఖాజాలు కుట్టిన అంగీని ఇస్త్రీ చేశిండు నాన. ఇగో మంచిగ తీస్కపోయి దాసుకో అనుకుంట ఇచ్చిండు. తీస్కపోయి అన్ని బట్టలు పెట్టేదగ్గర కాకుంట సపరేటుగా ఒక మూలకు స్టూలు ఏశి దానిమీద పెట్టిన. సద్దుల బతుకమ్మ అయినంక మూడో రోజు దస్ర. అబ్బ ఇంకొక్క రోజు ఆగుతే ఈ అంగి ఏసుకునుడే అనుకుంట నిద్రవోయిన. తెల్లారింది ఎవల పనిల ఆళ్లున్నరు. మొకం కడుక్కొని అమ్మ ఇచ్చిన పాలు తాగి, ఆడుకోదానికి పోవుకుంట స్టూలు దిక్కి చూస్తే అంగీ లేదు. “చి! మళ్ళ పాత బట్టలల్ల కలిపింది మా అమ్మ” అనుకుంటా కోపంగా పోయి… “అమ్మా అంగేడవెట్టినవ్?” అడిగిన.
“ఏ అంగి?”
“అదే కొత్తంగి…. మీ అయ్యకొడుకులే ఇస్త్రి చేసుకుంటిరిగదా నాకేమెర్క” పొయ్యి అంటిచ్చుకుంట అన్నది. మళ్ల లోపటికి ఉరికి సూశిన స్టూలు కింద లేదు, దండేం మీద లేదు… మొత్తం పక్కబట్టలన్ని తీశి సూశిన… లేదు. ఇంట్ల అందరం ఎనుకులాడుతనే ఉన్నం అంగీ కనవడ్తలేదు. బయటికి పోయిన నాన వచ్చినంక ఆయినె కూడా మొత్తం సూశిండు… ఉన్నట్టుండి మా కిట్టక్క “నానా… అగో సూరుపొంట సూడు అని గోడమీదికి సూపిచ్చింది. చిన్నగ ఒక ముక్క కనవడ్డది. ఠక్కన లేశి సూరులకు శెయ్యివెట్టి గుంజిండు. పీలికలు పీలికలైన అంగి… ఎలుకలు పొట్టుపొట్టుగా కొరికిన అంగి.. గ్యాంగ్ లీడర్ అంగి… రంగురంగుల డిజైన్ల శిరంజీవి అంగి….
“అయ్యో బిడ్డా…!” అని అట్లనే నిలవడ్డడు. మెల్లగా నాన దగ్గరికి పోయిన. నాన కండ్లల్ల నీళ్లు, అమ్మ ఏదో పనున్నట్టు బయటికి ఎల్లిపోయింది. కండ్లు తుడ్సుకున్న నానను పట్టుకోని పిచ్చివట్టినట్టు ఏడ్శిన… డెబ్బైరూపాల గుడ్డ ముక్క, వారం రోజుల ఆశ చూపులు… ఆ దస్రకు కూడా మళ్లా నాన అంగిని ఆల్ట్రేషన్ చేసి కుట్టిన బుషోటే ఏస్కున్న.
ఇప్పటికీ… ఎప్పుడన్నా… గ్యంగ్ లీడర్ అనే పాట ఇనవడితే ఆ గ్యాంగ్ లీడర్ అంగీ యాదికస్తది, మా నాన కండ్లల్ల నీళ్లు యాదికస్తయ్…