మనలోని పిల్లలని గుర్తు చేసే కురంగు పెడల్

Spread the love

పిల్లల సినిమా అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఇరాన్ సినిమాలే. అబ్బాస్ కియరోస్తమీ మరియు మాజిద్ మజిదీ పిల్లలే ప్రధాన పాత్రలుగా ఇరాన్ సినిమాల్లో ఒక ట్రెండ్‌ను ప్రారంభించారు. కియారోస్తమీ యొక్క ‘వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్?’, మజిద్ మజిదీ యొక్క ‘బదుక్’, ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’, ‘బరన్’ మరియు ‘సాంగ్స్ ఆఫ్ స్పారోస్’ లాంటి స్నిమాలు వచ్చాయి. నిజానికి ఈ సినిమాలన్నీ మత ఆధారిత ఆంక్షలు అనే బురదలోచి వచ్చిన తామరపూలలాంటివి.
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన గందరగోళం సమయంలో మత విశ్వాసాలకు, కట్టుబాట్లకూ చెడుచేస్తాయంటూ దాదాపు 180 సినిమాలను తగులబెట్టారు. ఇంగ్లీష్‌లో ఉన్న అనేక సినిమాలకు పేరు మార్చారు, విదేశీ సినిమాలను తమ దేశంలో ప్రదర్శించటం కూడా నిషేదించారు. ఆడవాళు డాన్స్ చేయటం, ఆడామగ పాత్రలు ఇంటిమేట్‌గా ఉండటం, గొడవలు, రక్తపాతం, సామాన్య ప్రజలు తిరగబడటం లంటి సన్నివేశాలు లేకుండా సినిమా తీయాలన్న నిబంధనల్లోంచి వచ్చిన పిల్లల సినిమాలు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాయి.
విప్లవం తర్వాత 40 సంవత్సరాలకు పైగా, ఇరాన్ సినిమా అంచనాలకు మించి సాధించింది, ఆస్కార్‌లు మరియు అంతర్జాతీయ ఉత్సవాల నుండి ఇతర ముఖ్యమైన అవార్డులను ఇరాన్ సినిమాలు సొంతం చేసుకున్నాయి. ఆ ఆంక్షలు సినిమాకి మంచి చేసినట్టా చెడు చేసినట్టా అనే చర్చ ఇప్పుడు అనవసరం కాబట్టి మనదేశంలో అరుదుగా జరిగే విషయం కాబట్టి ఈసారికి “కురంగు పెడల్” అనే సినిమా గురించి మాట్లాడుకుందాం.

1980ల ప్రాంతాలనాటి కథ ఇది. తమిళనాడులోని చిన్న ఊరు, మారియప్పన్, అంగరసు, సంగినరి, నిధి అనే నలుగురు పిల్లలు. అయిదో తరగతి పూర్తి చేసి ఆరోతరగతిలో చేరటానికి మధ్యలో వచ్చిన సెలవుల్లో సైకిల్ నేర్చుకోవాలి అనుకుంటారు. అయితే ఎవరి ఇళ్లలోనూ సకిళ్లు లేవు. మరి ఎలా? ఆ ఊళ్లోనే ఎప్పుడో మిలట్రీలో పనిచేసి వచ్చి సైకిల్ షాప్ నడుపుతున్న మిలట్రీ అన్న దగ్గర గంతకి యాభై పైసలకి సైకిల్ అద్దెకి తెచ్చుకోవాలి. దానికీ డబ్బులు కావాలి. 1980ల్లో యాభై పైసలంటే ఆ పిల్లలదగ్గర ఉండేంత మొత్తం కాదు.
ఈ అందరిలోనూ మారియప్పన్‌కి సైకిల్ నేర్చుకోవటం అనేది పెద్ద కల. ఎందుకంటే మారి నాన్న కందసామికి సైకిల్ తొక్కడం రాదని ఊరంతా అతన్ని “నడిచివెళ్లే కందసామి” అని వెక్కిరిస్తూ ఉంటుంది.
మిలట్రీ అన్న దగ్గర సైకిల్ అద్దెకు తెచ్చుకోవటానికి మారీ చేసే ప్రయత్నలు, చిన్న దొంగతనాలూ చేస్తూ ఆఖరికి సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. కురంగి పెడల్ (అడ్డ తొక్కుడు) నుంచి సీటుమీద కూర్చొని సైకిల్ తొక్కుతాడు. అయితే ఒకరోజు అనుకున్న సమయానికి సైకిల్ ఇవ్వలేడు దాంతో ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి కాబట్టి డబ్బులకోసం నాన తంటాలూ పడతాదు. ఒక పక్క సైకిల్ కి ఇవ్వాల్సిన అద్దె పెరిగిపోతూ ఉంటుంది. డబ్బులకోసం సైకిల్ తొక్కుకుంటూ అక్క ఊరికి వెళ్తాడు. అక్కడా డబ్బు పుట్తకపోగా ఆ రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే అక్కడే తన తండ్రి జీవితంలో ఏం జరిగిందో, ఎందుకని ఆయన “నడిచివెళ్లే కందసామి”గా మిగిలిపోయాడో తెలుస్తుంది.
రెండోరోజు నాన్నవచ్చి మారిని అక్క ఇంటినుంచి తీసుకుపోతాడు. ఆలోగా జరిగిన రకరకాల సంఘటనలవల్ల సైకిల్ షాపు మిలట్రీ అన్నకి 35 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ బాకీ తీర్చటానికి అక్కడే పనికి కుదురుతాడు.
ఇక్కడ తన స్నేహితులైన అంగరసు, సంగినరి, నిధిలతోపాటు ఊళ్లోనే ఉండే ఇంకో గర్విష్టి కుర్రాడితో కలిసి ఓ పందెం వేస్తాడు. మిలట్రీ అన్న పాతసైకిల్‌ని బాగుచేసి దాన్ని అమ్మకనికి పెట్టేలా సిద్దం చేసి నందుకు ఒకరోజు మొత్తం సైకిల్ వాడుకునే ఒప్పంద్సం మీద ఆ పందేనికి వెళ్లిన మారియప్పన్ ఏం చేశాడు? ఆ పిల్లలంతా ఎలా సైకిల్ నేర్చుకున్నారు? ఇంతకీ మారి వేసిన పందెం ఎలాంటిది? లాంటి చిన్న విషయాలతో హాయిగా గడిచిపోతుంది సినిమా.
సినిమా ముగింపు ఎప్పటికీ మర్చిపోలేని అద్బుతమైన ఫ్రేమ్‌తో ముగుస్తుంది. ఇది పిల్లలకు మాత్రమే కాదు. ఊళ్లో అద్దె సైకిల్ తెచ్చుకున్న ప్రతీ వ్యక్తికీ, అడ్డతొక్కుడుతో సైకిల్ తొక్కిన అనుభవం ఉన్న ప్రతీ మనిషికీ మళ్లీ బాల్యాన్ని గుర్తు చేసే సినిమా. ఇంతకీ కురంగి పెడల్ అంటే కోతి తొక్కుడు అని అర్థం. మనం అడ్డతొక్కుడు, కత్తెర తొక్కుడులాగా అదొక పోలిక అన్నమాట.
ప్రధానమైన పాత్రలను పోషించిన పిల్లలంతా తమ పాత్రలలో ఒదిగిపోయారు. పెద్దవాళ్లు కూడా ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా అనిపించదు. ఆ లొకేషన్స్, ఊరిని చూపించిన విధానం, పాత్రల అట్టైర్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలూ అన్నిటిలోనూ డెడికేషన్ కనిపిస్తుంది.
తమిళ హీరో శివకార్తికేయన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి ఈ సినిమాని నిర్మించాడు. మారియప్పన్‌గా కనిపించే సంతోష్ వేల్మురుగన్, మిలట్రీ అన్నగా ఎం.జ్ఞానశేఖర్‌లు ప్రత్యేకంగా కనిపించినా మిగతా నటుల పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడా కృత్రిమత్వం లేకుండా ఉంటుంది. సినిమటోగ్రఫీ విషయంలో సుమీ భాస్కరన్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్, మ్యూజిక్ మంచి ఫీల్‌తో ఉంటుంది. డైరెక్టర్ కమల కన్నన్ ఇండియన్ సినిమాకి ఇంకో పిల్లలతో చూడగ్గ, మనలో పిల్లలని చూసుకోదగ్గ సినిమాని ఇచ్చాడు.

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *