బ్రతకాలంటే చావుకు ఎదురు నిలిచే తెగింపు కావాలి

Spread the love

చరిత్ర కెయిన్, ఆబెల్ అన్నదమ్ముల పోరాటంతో మొదలయ్యింది. ‘పోరాటం’ మనం సజీవంగానే ఉన్నాం అనేందుకు ప్రతీకగా నిలుస్తోంది. చరిత్ర ఉనికి పోరాటాలతోనే నిక్షిప్తమైంది. చావు అనేది సృష్టిలో అన్ని జీవరాశులకు సహజమే అయినప్పటికీ, అస్తిత్వం కోసం సలిపే పోరాటమన్నది మనిషి ఉనికిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మనిషి బానిసత్వపు సంకెళ్ళ నుండి స్వేచ్ఛను ఈ పోరాటం ద్వారానే సాధించుకుంటాడు. అభివృద్ధి అనేది దరిదాపుగా పోరాటం నుంచే ఉద్భవిస్తోంది.

మనిషికి తిండి, నిద్ర, మైథునం వీటన్నింటినీ మించి మరొక విషయం అవసరమవుతుంది. అది అస్తిత్వం. అది మానవ మనుగడను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తోంది. బలహీనులపై బలవంతులు చెయ్యి సాధించడంలోనే బహుశా బానిసత్వం దాగుందేమో. విద్య, జ్ఞానం, అధికారం, డబ్బు వంటి విషయాలు ద్వారా ఒక వర్గం బలవంతులు అయితే, వారికి దాసోహం కావడం ఈ బలహీన వర్గాల వంతు అవుతుంది. బానిసత్వం అన్నది ఈ తారతమ్యాల ఆధారంగానే రూపుదిద్దుకొంటుంది. ఈ విద్య ద్వారా సంపాదించిన జ్ఞానంతో వారు వీటన్నిటిని సాధించుకునే దిశగా ముందుకు సాగుతారు. వీటి నుండి ఇంకో వర్గం వాటన్నింటిని కట్టడి చెయ్యడంలోనే అసలు కిటుకు దాగుంది. సమానత్వం అనేది కంటితుడుపు చర్య మాత్రమే. ఈ తారతమ్యాలను చెరిపేసినపుడే సమానత్వం పుట్టుకొస్తుంది.   

ఇప్పుడు ఈ  ఉపోద్ఘాతం అంత ఎందుకంటే తంగలాన్ కథ బంగారం నిధి వేట కథ అయినప్పటికీ, దర్శకుడు రంజిత్ కథలో పేర్చిన లేయర్స్ ఇవే కనుక.

కథ విషయానికి వస్తే ఈ కథ 1850 లలో వేప్పూరులో జరుగుతుంది. తంగలాన్ (విక్రమ్) తన భార్య గెంగమ్మ (పార్వతి మీనన్) తన పిల్లలతో జీవనం సాగిస్తుంటాడు. ఊరి జమీందారు కింద తనతో పాటు ఆ ఊరి జనంతో పొలం పనులకు కూలికి వెళుతుంటారు. తన తాతల తరంలోని బంగారం వనరుల గురించిన కథను పిల్లలకి చెబుతుంటాడు. అందులోని ఆరతి (మాళవిక మీనన్) అనే ఒక దుష్ట పాత్ర అతడిని కలలో పదే పదే వెంటాడుతోంది.

అదే సమయం లార్డ్ క్లెమెంట్ (డేనియల్ కాల్ టాగిరొన్) కి ఆ ప్రాంతంలో బంగారం వనరులు లభిస్తున్నాయనే విషయం తెలియవస్తోంది. అయితే అక్కడ దుష్ట ఆత్మలు ఉన్నాయని అక్కడ బ్రతకడం కష్టం. అది బంగారం కాదు, బంగారం పేరుతో మృత్యువును చేరే మార్గం అని ఆ చోటుని నిషేధించినట్లు ఆ సంస్థాన రాజు దానికి సంబంధించిన పూర్వాపరాలు చెబుతాడు. దానితో గతంలో ఆ బంగారం తీసేందుకు దోహదం చేసినవారి సంతతి ఆచూకీ వెదుక్కుంటూ లార్డ్ క్లెమెంట్ అక్కడికి పయనమవుతాడు. ఈలోగా అక్కడ తంగలాన్ పర్యవేక్షణలోని జమీందారు  పంట యావత్తు తగలబడి బూడిద పాలు కావడంతో అతడు దానికి జరిమానా విధిస్తాడు. దానికి తనతో పాటు అతడి సంతతి కూడా అక్కడే పని చెయ్యాల్సి వస్తోంది అని చెబుతాడు. అప్పుడు తను మాత్రమే కాకుండా తన సంతతి కూడా ఊడిగం చెయ్యాల్సిన దుస్థితిని తలుచుకొని కుమిలిపోతుంటే అదే సమయంలో అక్కడకు చేరుకొని లార్డ్ క్లెమెంట్ బంగారు నిధిని కనుక్కోవడంలో తంగలాన్ వంశస్థుల సహాయం కోరతాడు, దానికి తగిన మూల్యం కూడా బహుమతిగా ఇస్తామని ఆశ చూపుతాడు. ఆ వచ్చిన బహుమానంతో అయినా తను ఆ జమీందారు గుప్పెట నుండి బయటపడాలి అనుకుంటాడు. అయితే తంగలాన్ భార్య గెంగమ్మ అందుకు నిరాకరిస్తోంది. అక్కడ దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని, అక్కడకి వెళ్లినవారెవరు మళ్లీ ప్రాణాలతో బయటపడలేదని, అతడిని వెళ్ళొద్దని వారిస్తోంది.

అయితే తంగలానుకు ఎటు పాలుపోని పరిస్థితి. ఒకవైపు తన సంతతి యావత్తు కూడా జీవితపర్యంతం జమీందారుల కింద బానిసలుగా ఊడిగం చెయ్యడం, మరోవైపు మృత్యువుతో పోరాటం. బానిసత్వమా, మృత్యువుతో చెలగాటమా అంటే అతడు మృత్యువుతో చెలగాటన్నే ఎన్నుకుంటాడు. బానిసత్వం కంటే మరణముతోనైనా వచ్చే స్వేచ్ఛనే మేలని, దానినే కోరుకుంటాడు తంగలాన్. దానితో అక్కడ నుండి లార్డ్ క్లెమెంటుతో తన పరివారాన్ని వెంటేసుకొని బంగారం కనుగొనేందుకు పయనమవుతాడు. బంగారాన్ని కనుగొనే ప్రయత్నంలో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి ఆ బంగారాన్ని కనుక్కోగలిగారా లేదా, ఆ ప్రయత్నంలో వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా, అక్కడ ఆరతి ఆత్మ వారిని ఎలా నిరోధించింది అన్నదే మిగిలిన కథ.

సినిమా ఎలా ఉందంటే తంగలాన్ తన తన పూర్వీకుల కథతో మొదలు పెట్టి, అటు నుంచి బానిసత్వమా , మృత్యువుతో చెలగాటమా అనే పాయింట్ వరకు బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఏనుగు కొండ దగ్గరకు విక్రమ్ అతని పరివారం, లార్డ్ క్లెమెంటుతో  చేరుకునే క్రమంలో వారికి ఎదురైన విపత్తులతో ముడిపడింది. సెకాండాఫ్ ఆ ప్రదేశాన్ని కనుగొన్న తరువాత అతడు తన గ్రామ ప్రజలతో అక్కడికి వెళ్ళి లార్డ్ క్లెమెంటుకు ఆ బంగారాన్ని వెదికి తీసేచ్చే పనిలో నిమగ్నమవ్వగానే అందులో  వారికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే కథ. ఫస్ట్ ఆఫ్ చాలా ఎంగేజింగ్ సాగిన కథ కాస్తా సెకండాఫులో అంత సజావుగా అయితే సాగలేదు. కథ ఎటు నుండి ఎటువైపుకో మలుపులు తీసుకున్న ఫీలింగ్ కలుగుతోంది. సెకాండాఫులో కథను conflict  నుండి ముందుకు నడిపించే story stakes ను రూపొందించడంలో కాస్తంత తడబాటు కనిపించింది. దానితో ఆసక్తికరంగా మొదలైన బంగారం వేట చివరిలో పర్వాలేదు మంచి సినిమానేలే అనిపిస్తోంది అంతే.

కథ ఆరంభంలో వేప్పూరు లోని ప్రజలు, వారి జీవనశైలి, బంగారం వేటలో ప్రాతినిధ్యం వహించిన తాతయ్య కథను తంగలాన్ చెప్పడంతో దానినే సెకండాఫులో కలుపుతారు అని అనిపించింది. అయితే ఇంటర్వెల్ తర్వాత తన గ్రామం అంతటితో అక్కడికి చేరుకున్న తంగలాన్, ఆ ఊరి ప్రజలు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొన్నారు వంటి విషయాలను తెరకెక్కించడంలో అంత గాఢత లేదనిపించింది.

ఎంతసేపు అక్కడకు పాములు రావడం, ఆ కొండల్లో ఆరతి ఆత్మ కనిపించడం, వారిని భయపెట్టడం అంటూసాగిందే తప్ప అంతా ఎఫెక్టివుగా అయితే లేదు అనిపించింది.

ఈ కథ దర్శకుడు బాలా తీసిన ‘పరదేశి’ సినిమాను ఎంతోకొంత సెకండాఫులో గుర్తు చెయ్యకమానదు. అదే విధంగా ఇందులో అంతర్లీనంగా వచ్చే  దురాశ దుఃఖానికి చేటు అనే పాయింట్ కాస్త తుంబడును గుర్తు చేస్తోంది కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. హాలీవుడ్ లోని కొన్ని స్లేవరి సినిమాలను కూడా అక్కడక్కడ గుర్తు చెయ్యక మానదు. అదే రకంగా అండర్ కరెంటుగా ఈ సినిమా స్టోరీ స్కెలిటన్ ‘దేర్ విల్ బి బ్లడ్’ కి సంబంధించిన ఏదో ఫీల్ కలిగించింది.

లైన్ గా నిజానికి స్ట్రెయిట్ నేరేషన్లో సాగే లైన్. దానిని గాఢంగా చెప్పడంలో ఏదో లోపం అయితే కనిపించింది. దర్శకుడు సెకండాఫులో వారి వెతలను తెరపై చూపడంలో ఏదో లోపం కనిపిస్తోంది.

కథలో బలమైన conflict అనేది ఒకటి సెట్ చేశాక స్టోరీ లోని stakes నే కథలో కీలక పాత్ర వహిస్తాయి.

అదే రకంగా climax విషయంలో ఏదో హడావిడిగా, సింపుల్ గా ముగించిన ఫీల్ అయితే కలుగక మానదు. ఆ క్లయిమాక్స్ కూడా రీసెంటుగా వచ్చిన ఒక హిందీ సినిమాలోని క్లయిమాక్స్ ను తలపిస్తోంది.

సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు విక్రమ్ నటన. ఎప్పటిలానే ఇందులోనూ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను విక్రమ్ అందించాడనే చెప్పాలి. ఆ తరువాత మాళవిక మీనన్ కూడా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్రను ఇంకాస్త క్లారీటీగా మలిచి ఉంటే బాగుంటుంది అనిపించింది. మిగిలిన పాత్రలు వాటి పరిధిమేరకు నటించాయి. సినిమాలో కీలక పాత్ర పోషించినవి సంగీతం, సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. జి. వి. అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు అనే చెప్పాలి.

ఇక నచ్చని అంశాలు అంటే సెంకడాఫులో రైటింగులో కాస్త తడబాటు ఉంది. మరీ ముఖ్యముగా వారి వెతలకు బదులు దర్శకుడు ఎక్కువగా బానిసత్వం, అండర్ కరెంటులో బుద్ధుడు, అణచివేత, మన వనరులను కాపాడుకోవాలి అంటూ కథ ఎటు ఎటో వెళుతున్న ఫీలింగ్ అయితే కలుగక మానదు. దర్శకుడు కథతో పాటు తనవైన భావాలను అందులో చొప్పించాలి అనుకోవడం కథను కాస్త ఇరకాటంలో పడేసినట్టు అనిపించింది. మరీ ముఖ్యంగా బంగారంలో వాటా ఇచ్చే సీన్ అంత నమ్మబుద్దికాదు. అలాగే విక్రమ్, మాళవిక మీనన్ పాత్రల తరువాత మిగతా పాత్రలు పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తాయి కానీ కథలో అంత ఇంపాక్ట్ అయితే చూపించవు. కథ క్లయిమాక్స్ కు దారి తీసే మలుపు సగటు ప్రేక్షకులకు అంత తేలికగా మింగుడు పడదు.

పైగా ఇందులో దర్శకుడు  కొన్ని సీన్స్ లలో ఫాంటసీ, మ్యాజికల్ రియలిజం లాంటి అంశాలను చొప్పించడం  అప్పటికది బాగున్నట్టే అనిపించినా, అర్ధంకాక కాస్తంత గంధారగోళానికి అయితే గురి చేస్తోంది.

తంగలాన్ ఒక గొప్ప సినిమా అయ్యేందుకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకో సెకండాఫులోని కాస్తంత రైటింగులోని తడబాటు వలన థియేటర్ నుండి బయటకు వచ్చేసరికి పర్వాలేదు బాగానే ఉంది అనే ఫీలింగుతో మాత్రమే బయటకొస్తాం.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *