నేను మెడికల్ కాలేజ్ లో అడుగుపెట్టిన రోజుల్లోనే ఆంధ్రజ్యోతి వారపత్రికలో సింగిల్ పేజీ కథల్లాగా మొదలయినవి “అమరావతి కథలు”. చిన్న మంచు బిందువు రకరకాల రంగులు వెలార్చినట్టు ఈ చిన్న కథలలో కనపడే రంగులెన్నో.గై.డి. మపాసా చిన్న కథలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.ఆ కోవలోనివే మన అమరావతి కథలు కూడా.
ఇవి మన తెలుగు కథలు,ఇందులో కనపడేది మన తెలుగు వారి జీవితం.ఇందులో వినపడేది జీవమున్న మన తెలుగు భాష.ఇవి ఒక వర్గానికో,ఒక వర్ణానికో చెందిన కథలు కాదు,ఇవి అందరి కథలూ,మనందరి కథలూ. అందుకే వీటిని గర్వంగా అచ్చమయిన మా తెలుగు కథలు అని ప్రపంచమంతా చాటి చెప్పుకోవచ్చు.
“అమరావతి కథలు” రాసిన వారు శంకరమంచి.సత్యం గారు.
ఆయన పుస్తకానికి రాసుకున్న ముందు మాటలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు తనను “అమరావతి కథలు” రాయమని ప్రేరేపించినట్టు చెప్పారు.
అంతకు పన్నెండేళ్లముందే జయపురంలో వుండగా ఇలా కథలు రాద్దామని నోట్సు రాసుకున్నారట ఆయన, అయితే శర్మగారు అడిగిందే తడవుగా నాలుగు కథలు ఆశువుగా వెలువడ్డాయట ఆయన నోటినుండీ.
1975–1977 ప్రాంతాలలో సుమారు రెండున్నర సంవత్సరాలపాటు “అమరావతి కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రతి వారం పాఠకులనలరించాయి. తెలుగు పాఠక లోకం వాటిని తమ గుండెలకు హత్తుకుంది,నెత్తిన పెట్టుకుని ఊరేగింది.

1979లో వాటికి సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ ఈ కథలలో కొన్నిటిని తీసుకుని హిందీలో సీరియల్ గా రూపొందించారు. అవి జాతీయ దూరదర్శన్ లో 1994–1995 ప్రాంతాలలో ప్రసారమయ్యాయి.
వీటిని మంచి అభిరుచితో ముళ్లపూడి వెంకటరమణ గారి ముందుమాటతో,బాపు బొమ్మలతో ప్రచురించినది నవోదయ పబ్లిషర్స్ విజయవాడ వారు.ఈ పుస్తకం పదవ ముద్రణ 2016 లో వెలువడింది.
ఎందుకు చదవాలీ పుస్తకాన్ని? ఈ కథల గొప్పతనమేమిటీ? అంటే.ఒక తరం తెలుగువారి జీవన విధానాన్నీ,వారి భాషనీ,వారి రాగ ద్వేషాలనీ తెలుసుకోవటానికి ఈ కథలు చదవాలి.ఇక ఈ కథల గొప్పతనమేమంటే జీవితంలోని రంగూ,రుచీ ,వాసనా తెలియ జెప్పటం.జీవితేఛ్ఛను రగిలిస్తూ,ఒక ఆశావహ దృక్పథాన్ని కలగ జేయటం వీటి గొప్పదనం.ఇవి కేవలం ఒక వర్గానికే చెందిన కథలు కాకపోవడం వీటికొక సార్వజనీనతను కలగజేస్తోంది.ఈ కథలలో అన్ని వర్ణాలవారూ,అన్ని వర్గాల వారూ వున్నారు.మహరాజులూ,జమీందారులే కాదు నిరుపేదలూ,పూజారులూ,కూలీలూ ,స్వాములార్లూ,దొంగలూ,దోపిడీ దారులూ,అతి సామాన్యులూ అందరూ తమతమ సహజ గుణాలతో దర్శన మిస్తారీ కథలలో.
నిజం చెప్పాలంటే ప్రతి కథా ఒక ఆణి ముత్యమే కానీ అన్ని కథలగురించీ చెప్పుకోలేము అందుకే నాకు బాగా నచ్చిన కొన్ని కథల గురించి చెబుతాను.
“ఒక రోజెళ్లి పోయింది”—- పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదు.మరణం అనివార్యం.జీవితంలో ఎన్నెన్నో విజయాలను సాధించి,దేశ విదేశాలలో తమ కీర్తిపతాకలను ఎగురవేసిన వారైనా,అత్యంత సామాన్యంగా జీవితం గడిపిన వారైనా మరణం ముందు తలవంచాలిసిందే.వారు మరణించిన మరుక్షణమే మరుగున పడిపోతారు
ఈ కాలప్రవాహం ఆగదు ఒక రోజు తర్వాత మరొక రోజు వస్తూనే వుంటుంది.ఈ జీవిత సత్యాన్ని తెలిపేదే “ఒక రోజెళ్లి పోయింది” కథ.ఈ కథ పిచ్చయ్యగారనే అతి సామాన్యుని జీవితం ,ఆయన యేమీ చెయ్యకుండా,యే విజయమూ సాధించకుండా పువ్వులో పువ్వుగా,మొగ్గలో మొగ్గగా ,నీటిలో చేపగా ప్రకృతిలో కలిసిపోయి బతికిన వాడు.పొద్దున్నే లేవడం,కొన్ని పువ్వులు కోసుకుని ఆలయంలో ఇవ్వడం,బడికి పోయే పిల్లలను పలకరించి నవ్వడం,ఆలయం మండపంలో కూర్చుని ధ్వజస్తంభం గంటలు గాలికి కదులుతూ చేసే చప్పుడు వినడం,పావురాల కువకువలు గమనించడం.సాయంత్రం ఆడుకునే పిల్లలకు పప్పు బెల్లాలో,రేగిపళ్లో కొని పంచడం .ఇంటికొచ్చి భోజనం చేసి పడుకోవడం ఇంతే ఆయన గడిపిన జీవితం.ఇలా బతికే ఆయన ఓ రోజు వెళ్లిపోయారు.”ఇంతకాలం నా యెదురుగా వున్నారు .ఇప్పుడు నాలోనే వున్నారు” అనుకుంది ఆయన భార్య.ఈ కథకి రచయిత పలికిన ముగింపు వాక్యాలు చూడండి
“పిచ్చయ్య గారు ఏమీ సాధించలేదు.కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు .అది చాలదా? చాలడం లేదు చాలామందికి”
ప్రతి కథకీ ఆయన రాసే ముగింపు వాక్యాలు ఇలాగే పట్టు చీర చివర మెరిసే జరీ అంచులా మెరుస్తాయి!
కథ యెంత సింపుల్గా వుంటుందో దానికి బాపు వేసిన బొమ్మ అంతే సింపుల్గా వుంటుంది.మూడే మూడు అడ్డ గీతలు నదీప్రవాహాన్ని సూచిస్తూ ఆపైన సూర్యబింబం అంతకంటే పైన ఎగిరిపోయే పక్షి అంతే!
“లేగ దూడ చదువు”—ఈ కథ చదువుతుంటే మా చిన్నప్పుడు మా ఊళ్లలో ప్రతి ఉదయమూ ,సాయంత్రమూ దాదాపు ప్రతి ఇంటి లోనూ జరిగిన కథే ఇది అనిపిస్తుంది.
పొద్దున్నే పిల్లలందరూ చద్దన్నాలు తిని,పలకా,బలపం,పుస్తకాలూ ఒక సంచిలో వేసుకుని బడికి వెళ్లే వేళా,పశువులన్నింటినీ కట్టుగొయ్యల నుండీ విప్పదీసి పాలేళ్లో,యజమానులో కాలవలో కడిగి మేపుకు రావడానికి వీథుల్లోకి మందలుగా తోలుకొచ్చే వేళా ఒకటి గానే వుండేది.ఆ సమయంలో బజారులన్నీ బడికెళ్లే పిల్లలతోనూ,పశువుల తోనూ సందడి సందడి గా వుండేవి.
అలా బడికెళ్లే అన్నా అక్కలతో కలిసి తను కూడా తయారవుతుంది ఇంకా బడిలో వెయ్యని నాలుగేళ్ల చిట్టి.
అయితే చిట్టికి ఆత్మీయ నేస్తం దొడ్లో చెంగనాలు పెట్టి ఆడుకునే లేగదూడ.
చిట్టి అన్నా,అక్కలతో బడి కెళితే,లేగ దూడ అమ్మ తో కలిసి మేతకి బయలు దేరింది.
లేగదూడని వీథిలో చూడగానే చిట్టి బడిలోంచీ తన పలకతో పరిగెత్తుకొచ్చి ,పలక మీద తను గీసిన పిచ్చి గీతలు చూపించి “ఇది నీబొమ్మ అది నా బొమ్మ ఇది అమ్మ బొమ్మ సాయంత్రం తొరగా రా” అంటూ కబుర్లు చెప్పింది.పలకకి అటుపక్కా ఇటుపక్కా సర్ మని నాలుకతో నాకేసి చెంగున తల్లిని కలుసుకోవడానికి పరిగెట్టింది లేగదూడ.
“బళ్లో వెయ్యని పసిపాపకంటే,నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం .కానీ…..” అని ఆపేస్తారు కథని రచయిత
అవును నిజం ఆనాడు మనుషులూ,పశువులూ,ప్రకృతీ వీటన్నిటి మధ్యా ఒక విడదీయరాని అనుబంధం వుండేది.
మరి ఈనాడో? ఇది ఎవరికి వారే తేల్చుకోవాలిసిన ప్రశ్న
“లంకల్ల పుట్టింది లచ్చి తల్లి”—- తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేముంటది అనేది ఒక పాప్యులర్ సినిమా డైలాగ్ కానీ ఈ కథ మనుషులు గొడ్లని తమతో సమానంగా యెలా ప్రేమిస్తారో ,అవి కూడా తిరిగి వారినెలా ప్రేమిస్తాయో తెలియజెపుతుంది
.మేతకోసం కృష్ణానది లోని లంకల్లోకి వెళ్లిన పాడి ఆవు అక్కడే ఈనమోపింది అంటే ఈనడానికి సిధ్ధమయింది.మేతకి తోలుకొచ్చిన పాలేరు దానికి కావలసిన పరిచర్యలన్నీ చేశాడు .ఆవు ఈనేసింది.దూడనీ ఆవునీ ఇల్లు చేర్చాలని ఆందోళన పడుతున్నాడు పాలేరు రాములు కృష్ణకి అవతలొడ్డున.ఇవతలొడ్డున కర్రావు ఈనేసి వుంటుందనే అనుమానంతో మడ్డికూడు వండించి,నాలుగు లాంతర్లతో నలుగురయిదుగురు మనుషులతో కంగారుగా ఎదురు చూస్తున్నాడు కర్రావుని కన్నకూతుర్లా సాకుతున్న పున్నయ్య.
చివరికి ఎలాగో ఒక పడవ సరంగుని బతిమాలి ఆవునీ దూడనీ ఇవతలొడ్డు చేర్చాడు పాలేరు.
ఒడ్డుకి రాగానే “మాఅమ్మే!మా అమ్మే!” అంటూ లేగదూడనెత్తుకున్నాడు పున్నయ్య.కర్రావు దూడనీ,పున్నయ్యనీ మార్చి మార్చి నాకింది.సంబరంతో రంకెలు పెట్టింది.
కొట్టంలోకి తీసుకెళ్లి వేణ్ణీళ్లతో స్వయంగా ఆవునీ దూడనీ కడుగుతున్న పున్నయ్యకి వ్యాజ్యంలో గెలుపొందాడనే కబురుతెలుస్తుంది.”గొడ్డొచ్చిన వేళ….” అంది పున్నయ్య భార్య ఆనందంగా.
పున్నయ్య గుండె పొంగి పోయి లేగదూడని గట్టిగా ముద్దెట్టుకున్నాడు.అదండీ కథ చదువుతుంటే మనకీ గుండె పొంగుతుంది.
“ముద్దేలనయ్యా- మనసు నీదైయుండ”—-చాలా కథల పేర్లు ,కథ చదివేశాక కూడా వెంటాడుతూనే వుంటాయి .అలా నన్ను వెంటాడుతూ వుంటుంది ఈ కథ పేరు.
మనకు చాలా ఇష్టాలుంటాయి .వాటిలో కొన్ని బయటకు వ్యక్తపరచలేక,మనసులో పదిలంగా దాచుకునేవి అయివుంటాయి.అలా అపురూపంగా తమ మదిలో దాచుకున్న ఇద్దరి ఇష్టాల కథే ఇది.
ఊరు ఊరంతా గుమ్మయిపోయే అందగత్తె కనకాంగిని దగ్గరకు తీసిన వాడు రాయుడు.అతని కుటుంబం అతని కుంది అయినా ఈమెను ఏడు మల్లెపువ్వుల ఎత్తుగా చూసుకుంటూ వుంటాడు.కోరిన పట్టుచీరలూ,కోరిన నగలూ నిమిషాల్లో కంటిముందుంచుతాడు. కానీ అప్పుడప్పుడూ అధికారంతో జులుం చూపిస్తాడు అప్పుడామె మనస్సు చివుక్కుమంటూ వుంటుంది.
కొంతకాలానికి కనకాంగికి పట్టుచీరలన్నా,నగలన్నా ఇష్టం పోయి మొహం మొత్తుతుంది..ఏదో వెలితి .అదే సమయంలో బట్టలు లెక్కచూసుకోడానికి చాకలి సంగని ఎదురుగా కూచోవలసి వస్తుంది.అతని కళ్లల్లో ఆరాధన ,పలుకులో మెత్తదనం ఆమెకు సాంత్వన నిస్తాయి.రోజంతా ఆ అయిదు నిమిషాల కోసం ఎదురు చూసేది,రోజంతా ఆ అయిదు నిమిషాల కోసమే బతికేవాడు సంగడు.ఎంత దగ్గరగా వచ్చే అవకాశం కలిగినా
ఏనాడూ ఒకరినొకరు తాకలేదు ,ఒక ముద్దయినా పెట్టుకోలేదు.కొన్ని బంధాలంతే
“నా వెనక ఎవరో”—– ఈ కథ నాకు చాలా ఇష్టం .అన్ని కథల్లోకి మకుటాయమానమైన కథ.ప్రతి మనిషి వెనకా నడిచే జ్ఞాపకాలుంటాయి,అనుభూతులుంటాయి.పుట్టిపెరిగిన చోటులో గాలి పలకరిస్తుంది,నేల ముద్దాడుతుంది,నీళ్లు మేను తాకి కథలు చెబుతాయి.కొన్ని పరిసరాలూ,కొన్ని పరిమళాలూ పురా జ్ఞాపకాలను పునరుజ్జీవితం చేస్తాయి.అలా రచయిత తన గతస్మృతులను నెమరు వేసుకుంటూ తన వెనక ఎవరో వెన్నంటి నడుస్తున్నట్టు అనుభూతి చెందడమే ఈ కథ.”ఈ కథ చదివాంతర్వాత,ఈ కథ మీ వెన్నంటి నడిస్తే ఈ కథ ఉన్నట్లు…..ఓ సన్నజాజి పూచినట్టు “అని రాసిన వాక్యం ఈ కథకి హైలైట్ .
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథ గురించీ రాయాలనిపిస్తుంది.”వరద,తృప్తి,భోజన చక్రవర్తి,కానుక, పక్కవీథి జన్మంత దూరం”ఇంకా యెన్నో,ఇంకా అన్నీ రుచికరమైన కథలే .మళ్లీ మళ్లీ చదువుకునే కథలే.
అందుకే ఈ పుస్తకం సదా నా చేతికి అందే దూరంలోనే వుంటుంది.
రచయిత వ్యక్తిగత వివరాలకొస్తే శంకరమంచి సత్యం గారు గుంటూరు జిల్లా అమరావతి లోనే 1937 సంవత్సరం మార్చినెల మూడవతేదీన జన్మించారు. తల్లిదండ్రులు శేషమ్మా, కుటుంబరావు చిన్ననాడే దూరమయ్యారు. సీతమ్మ, పెదపున్నయ్య గారలు పెంచి పెద్దజేశారు.
ఏలూరులో బి.ఏ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ చేశారు. ఆకాశవాణిలో ప్రయోక్తగా ఉద్యోగం చేశారు.

“రేపటిదారి, సీతస్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు” ఆయన రాసిన నవలలు. “హరహర మహాదేవ” ఆయన రాసిన నాటకం ఆరోజుల్లో రేడియోలో ప్రసారమయి అనేక మంది మన్ననలు పొందింది.
షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్ , సాయిరాం అనే కలం పేరులతో దిన, వార పత్రికలలో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలు వస్తూ వుండేవి.
1987 మేనెల 21 వ తేదీ ఆయన తుది శ్వాస విడిచారు అయితేనేం “అమరావతి కథలు” ద్వారా ఆయన తెలుగుపాఠకుల గుండెల్లో జీవించే వుంటారు.
