తొలిప్రేమ గురుతులు…

Spread the love

చాలా మంది చెప్పినట్లు , తొలిప్రేమ ప్రభావం దాదాపు అందరిపైనా చాలా గట్టిగా ఉంటుంది.
ఏ వయసులో, ఎవరితో ప్రేమలో పడతామో అనేదానితో సంబంధం లేకుండా ఆ తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు , గాయాలు అలా మనసు పొరల్లో నిక్షిప్తమైపోయి ఉంటాయి.

ప్రేమలో సఫలమయిన వాళ్ళు , అందులోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ బతికేస్తుంటారు.
విఫలమైన వాళ్ళు ఆ విరహం లేదా బాధ తాలూకు భారాన్ని మోయ్యడానికి ఇష్టపడుతూ , తమకు మాత్రమే చెందిన ఒక అపురూపమైన ఆస్తిగా దాన్ని దాచిపెట్టుకుంటారు.

మొహమ్మద్ గౌస్ రాసిన 826 KM అనే నవల కూడా ఈ కోవకు చెందినదే.

చాలా మంది చెప్పలేకపోయిన భావాలను చెప్పేందుకు చేసిన ప్రయత్నంలా మనకి 826KM నవల అనిపిస్తుంది.

ఇందులోని కథాంశం మనల్ని పెద్దగా ఆశ్చర్యపరచదు. అన్ని ప్రేమకథల్లాగే , మొదలు, మధ్య ముగింపు ఇందులోనూ ఉంటాయి. చాలా ఐటీ కంపెనీలలో మొదలైన ప్రేమకథల్లాంటిదే ఈ నవల కూడా. కానీ 826 కిమీ ఎందుకు ప్రత్యేకం అనిపిస్తుందంటే, ఈ నవలను గౌస్ రాసిన తీరు.

పాత్రల వ్యక్తిత్వాలు , ప్రవర్తనలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే గౌస్, ఈ 826 KM లోనూ అదే పని చేశాడు. ఇంట్రావర్ట్ అయిన ఒక అబ్బాయి జీవితంలోకి ప్రవేశించిన ఒక ఎక్స్ట్రావర్ట్ అమ్మాయి,
ఆ అమ్మాయి అభిరుచులకు తగ్గట్టుగా నడుచుకుంటూ బతికిన అబ్బాయి, తనకు నచ్చినట్లే బతికినా ఆ అబ్బాయి ఇష్టాలకూ విలువిచ్చిన అమ్మాయి, ఈ కాలం ప్రేమలలో అక్కడక్కడా కనిపిస్తున్న, చాలా ప్రేమకథల్లో లోపిస్తున్న అంశాలనే గౌస్ టచ్ చేశాడు .

నవల పూర్తయ్యాక ఎక్కువగా మాట్లాడిన, మాట్లాడించిన మధుతో గాక , మితభాషి అయిన హరి తో మనం ప్రేమలో పడతాం. చాలా తక్కువ మాటల్తో ఎక్కువ భావాలను వ్యక్త పరచే హరి పాత్రను గౌస్ చాలా బాగా రాశాడు.

కాకపోతే చివరకు వచ్చేసరికి శారీరకంగానూ, మానసికంగానూ ఎక్కువ అలసిపోయిన పాత్రలోకి కథా నాయకుడ్ని నేట్టేయడమే కాస్త రుచించదు ( నాకు రుచించలేదు). ఇద్దరి మధ్య దూరం పెంచడానికి కూడా ఇంకాస్త బలమైన కారణముంటే బావుంటుందేమో అనిపించిన మాట వాస్తవం. అయితే ఇవేవీ పాఠకుడికి నవల చదివేటప్పుడు గుర్తుకు రావు. మనతో చక చకా చదివించేస్తుందీ నవల.

తెలుగులో ప్రేమను ప్రధానాంశంగా తీసుకుని రాస్తున్న నవలలు కొరవడ్డాయి అనే భ్రమను ఈ నవల తొలగించేస్తుంది.

ఇప్పటికే గాజుల సంచి, జీరో నెంబర్ 1లతో విశేష పాఠకాదరణ పొందిన మొహమ్మద్ గౌస్ , ఈ 826KMతో ఇంకా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ప్రతులకు : ఆన్వీక్షికి పబ్లిషర్స్.

సుదర్శన్ బూదూరి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *