మా కన్నడ దేశంలో చాయ్ కోసం ఏ నలుగురు కుర్రాళ్లు కలిసినా కువెంపు గురించో, పూర్ణచంద్ర తేజస్వీ గురించో, మరో సాహిత్యకారుని గురించో మాట్లాడుకుంటారు. సినిమాల మాట ఎత్తరు’ అన్నాడు కన్నడ రచయిత వసుధేంద్ర. ‘నా కథలు తెలుగులో అనువాదమై పుస్తకంగా వెలువడటం సంతోషంగా ఉంది. నా రచనలకు తమిళనాడులో, యూరప్‌లో, అమెరికాలో పాఠకుల క్లబ్‌లున్నాయి. వాటిని మొదలెట్టి నిర్వహిస్తున్నది ఒక తెలుగువాడు’ అన్నాడు తమిళ రచయిత జయమోహన్.
ఆగస్టు రెండోవారంలో బెంగళూరులో జరిగిన నాలుగు దక్షిణాది భాషల ‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’లో ఈ రచయితలిద్దరూ మాట్లాడిన మాటలు తెలుగు సమాజ స్వభావాన్ని పరోక్షంగా నిరూపిస్తున్నాయి. ఏమంటే మన దగ్గర ఏ నలుగురు కుర్రాళ్లు కలిసినా సినిమాలు మాట్లాడుకుంటారు. మన దగ్గర ఏ నలుగురు పాఠకులు కలిసినా పరభాషా ఆరాధనను వ్యక్తపరుస్తారు. కేరళీయులు చెప్పింది ఎందుకు వదిలిపెట్టాలి? ‘కరోనాలో ప్రభుత్వం అన్నీ బంద్ పెట్టి కేవలం మెడికల్ షాపులే తెరవడానికి అనుమతి ఇచ్చినా… అయ్యా సి.ఎం. గారూ! భౌతిక ఆరోగ్యం సరే… మానసిక ఆరోగ్యం కోసం పుస్తకాలు అక్కర్లేదా అని విన్నవిస్తే, ముఖ్యమంత్రి విజయన్ గారు వెంటనే స్పందించి వారంలో రెండు రోజులు వాటిని తెరువనిచ్చారు. అంతేనా? ఆ రోజుల్లో మేము స్విగ్గీలో కూడా పుస్తకాలు అమ్మాం’ అని ఫెస్టివల్‌కు హాజరైన కేరళ ప్రచురణకర్త చెప్తే ఆశ్చర్యపోవడం తెలుగు ప్రతినిధుల పనైంది. ఏమంటే కరోనాలో మలయాళీలు పుస్తకాలు చదువుతుంటే మనం ఓటీటీలలో మలయాళ సినిమాలన్నీ చూస్తూ గడిపాం.
మనం ఏంటనేది మనం మాత్రమే ఉన్నప్పుడు తెలియదు. దాటి వెళ్లినప్పుడే తెలుస్తుంది. గతంలో లేనట్టుగా దక్షిణాదికే ప్రాధాన్యం ఇస్తూ మొదటిసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యకారులు ‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’లో కలిసినప్పుడు రెండు రోజుల ఆ వేడుకలో తమిళ, కన్నడ, మలయాళం నుంచి ‘స్థాయి’తో తిరిగినవారు ఎందరు… తెలుగు నుంచి అలాంటి ‘స్థాయి’ కలిగినవారుగా నిలబడింది ఎందరు? ప్రారంభ వేడుకలో ఓల్గాకు స్థానం దక్కడం సంతోషమే అయినా పెరుమాళ్ మురుగన్, జయమోహన్, వివేక్ శాన్‌భాగ్ తదితర రచయితలు కనిపిస్తే తెలుగువారు ఆరాధనగా వెళ్లి పలకరించినట్టుగా తెలుగు రచయితలను ఆ భాషల పాఠకులు అంతే పలకరించారా? ఏం తక్కువ మనకు?
అక్కడకు హాజరైన వాడ్రేవు చినవీరభద్రుడు, మృణాళిని, చూపు కాత్యాయని ఉద్దండులు. ఆధునిక ఆవరణలోని స్త్రీవాద కథను ప్రతిబింబించిన కుప్పిలి పద్మ వంటి రచయిత ఇతర భాషల్లో ఎక్కడ? మహిళా రచయితలకు వేదిక కల్పించి రచన, కార్యాచరణ నిర్వహిస్తున్న కె.ఎన్.మల్లీశ్వరి వంటి రచయిత్రులు ఎందరు? సాక్షాత్తూ గార్డియన్ పత్రిక రివ్యూ రాసేంతటి గొప్ప కథలు రాసిన గోగు శ్యామల అక్కడే ఉన్నారే! వీరంతా గౌరవం పొందలేదని కాదు. పొందారు. సరిపోదు. కేవలం మనల్ని మనం పెంచుకోకపోవడం వల్ల, ఎదుటివారి కృషిని గౌరవించలేకపోవడం వల్ల, పరాయి భాషల్లో అనువాదమయ్యి ఘనత చాటుకోవడం రాకపోవడం వల్ల, ముఖ్యం– ఒకరు ఎదుగుతుంటే కిందకు పట్టిలాగే పీతల స్వభావం వల్ల బెంగళూరులో తెలుగువారు నలుగురిలో ఒకరిలా, ఇతర భాషల వారు నలుగురికి ఒకరిలా కనిపించారు.
నిజానికి బుక్ బ్రహ్మకు హాజరైన తెలుగు టీమ్ తెలుగు సాహిత్యం ఎంత వికాసవంతంగా ఉందో చూపింది. భిన్న సాహిత్యధోరణుల, వాదాల, శ్రేణుల ప్రతినిధులు ఉన్నారు. చిన్న వయసులో యువ సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన రమేష్ కార్తీక్ వంటి మన ఆదివాసీ రచయితా ఉన్నారు. ఇలాంటి టీమ్ ఇతర భాషల నుంచి హాజరు కాలేదు. గత యాభై ఏళ్ల తమిళ, మలయాళ, కన్నడ భాషల సాహిత్యంతో మన సాహిత్యాన్ని పోల్చినప్పుడు పురోగామి మెలకువను ప్రదర్శించడంలో మనల్ని మించినవారు లేరు. విప్లవ సాహిత్యంతో మొదలు మైనార్టీ సాహిత్యం వరకు జాజ్వల్యమైన కృషి సాగింది. గత పాతికేళ్లుగా సాగుతున్న ‘రైటర్స్ మీట్’ వంటి కృషి ఇతర భాషల్లో జరిగి ఉంటే ఎన్ని నోళ్లతో ఊదరగొట్టుకుని ఉండేవారో. ఇంత చేసినా తెలుగువారు తెల్లముఖం వేయకతప్పడం లేదు. కాత్యాయని విద్మహే అన్నట్టు వైరుధ్యాల చైతన్యంలో మన ముందంజ వాటి మధ్య అంగీకారం సాధించడంలో లేదు. వైరుధ్యం శత్రుత్వం కాదని గ్రహించని మొండితనం తెలుగు సాహిత్యానికి చేటుగా మారింది. అహం, అక్కసు ఏమేరకు నష్టం చేస్తున్నాయో ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ‘పిలిస్తే బాగుణ్ణు’ నుంచి ‘పిలిస్తే వస్తారో రారో’ అనుకునే ఎదుగుదలకు సరిపడా కృషే కదా ‘స్థాయి’ అంటే.
సాహిత్యం లోపల ఇలా ఉంటే సాహిత్యానికి బయటి సమాజం మరోలా ఉంది. రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, అధికారులు, డాక్టర్లు, లాయర్లు… వీరిలో తెలుగు పుస్తకాలు చదివేవారు ఎందరు? తెలుగు టీచర్లు, లెక్చరర్లు తెలుగు సాహిత్య సభలతో తమకు సంబంధమే లేనట్టుగా ఉండటం మనకే చెల్లింది. ఘనత వహించిన ఈ పౌరసమాజం నేడు గుర్తు పడుతున్నది పట్టగలుగుతున్నది ప్రవచనకారులను, ఒకటీ అరా అవధాన పండితులను తప్ప ఆధునిక సాహిత్యకారులను కాదు. కనుక– అటు సాహిత్య సమాజం, ఇటు పౌర సమాజం పరస్పరం ఒక గీతకు చేరనంత వరకు తెలుగు సాహిత్యం ఏ గీతకూ చేరదు.
‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ తెలుగు సాహిత్యానికి నేర్పిన పాఠం ఇదే.
మహమ్మద్ ఖదీర్‌బాబు
Mohammed Khadeer Babu is a Telugu short story writer, journalist and script writer for movies. His short story collections Dargamitta Kathalu and Polerammabanda Kathalu are known for their connection to their native identity and regional dialect. New Bombay Tailors, Beyond Coffee and Metro Kathalu are his other major works. He is primarily published by Kavali Prachuranalu.