తన గురించి తాను

Spread the love

ప్రతి మనిషీ ఏదో ఓ రోజున పుడతాడు. ఎప్పుడో మరోరోజున పోతాడు. ప్రతివ్యక్తి జీవితంలోనూ రెండే ముఖ్యమైన తేదీలు పుట్టినతేదీ, రెండవది గిట్టిన తేదీ. నేను 1915 వ సంవత్సరంలో జూన్ 24వ తేదీన పుట్టానని చెప్పారు. ఆ రెండో ముఖ్యమైన తేదీ ఇంకా చేరుకోలేదు. ఆ తేదీ చేరుకున్న మరుసటి దినం నుంచి నా జీవితం చరిత్ర అవుతుంది. ఒకసారి ఈ జీవితం చాలించాక ఏ వ్యక్తీ తన చరిత్రతో జోక్యం పెట్టుకోలేడు. బ్రతికి ఉన్నంత కాలం తన నిజస్వరూపాన్ని కాస్త ముస్తాబుచేసి ఉన్నదానికంటె వేరే విధంగా చూపడానికి తాపత్రయపడతాడు. భవిష్యత్లో తనని ఊహించుకుని, వర్తమానంలో కూడా తన వ్యక్తిత్వానికి రంగురంగుల రూపకల్పన చేయడానికి పూనుకుంటాడు. బతికి ఉన్న మనిషికి విలువ కట్టేప్పుడు అంతవరకు అతను సాధించినదేకాక భవిష్యత్తులో అతను ఇంకా సాధించగల సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తాం. ఒకసారి ఈ ప్రాణం పోయాక మిగిలినదల్లా అతని గతమే. మిగిల్చిన ఆ గతాన్ని బట్టే అతన్ని బేరీజు వేస్తాం. ఆ వ్యక్తి అసలు విలువ అప్పుడే కట్టగలుగుతామేమో! నేను ఇంకా తిని తిరుగుతున్నాను కాబట్టి నేను వ్రాసుకునేది కాస్త అటూఇటూగా మీరు స్వీకరించవచ్చు.

1924వ సంవత్సరంలో మా తండ్రిగారు పోయినప్పుడు నేను చిన్నవాణ్ణి అవడం వల్ల ఆ కష్టం అంతగా తెలియలేదు. అప్పటినుంచీ నేను, మా అమ్మ, నా ముగ్గురు తమ్ముళ్ళు మా మాతామహుల ఇంట్లోనే ఉంటూ వచ్చాం. పశ్చిమగోదావరి జిల్లా, తిరుపతిపురం మా తాతగారి ఊరు. మా తాతగారు పెమ్మరాజు భానుమూర్తి గారు. ఆ ఊరికి పెద్ద. అక్కడికి మూడుమైళ్ళ దూరంలో ఉన్న అత్తిలిలో నా చదువు. నా ఈడు వాళ్ళే అయిదారుగురు పిల్లలం కలిసి రోజూ స్కూలుకు నడచి వెళ్ళివస్తూండేవాళ్ళం. అత్తిలి వెళ్ళడానికి బండిదారి కొంత చుట్టు. మేము అడ్డదారిని పంటచేల గట్టుమీద నడుచుకొంటూ, పంటకాలువల మీద అడ్డంగా వేసిన తాటిపట్టీలు దాటుకుంటూ తాటితోపుల మధ్యనుంచి స్కూలుకి వెళ్ళేవాళ్ళం. రోజుకు రానూపోనూ ఆరుమైళ్ళ నడక. కాని ఆ శ్రమ తెలిసినట్టు ఉండేదికాదు. ఇంకా వానాకాలం వస్తే ఉండేది తమాషా. ఒండ్రుమట్టి కాళ్ళతో నడిచిన తాటిపట్టీల మీద రేగడిమట్టి చేరుకుని జర్రుజర్రని జారుతుండేది. స్కూలు పుస్తకాలు ఓ చేత్తోను, అన్నం మూట మరో చేత్తోను పట్టుకుని సర్కసు ఫీట్ గా ఆ తాటిపట్టీల మీదనడిచి కాలవలు దాటుతుండేవాళ్ళం. కాస్త కాలు జారిందంటే కాలవలోనే! ఎప్పుడూ కాలుజారి కాలవలో పడ్డట్టు గుర్తులేదు. ఇంక వేసవి వచ్చిందంటే ఆ నల్లరేగడిమట్టి ఎండిపోయి సూదుల్లా కాళ్ళకి గుచ్చుకునేది. మాకెవళ్ళకీ అప్పుడు కాలికి చెప్పులుండేవి కావు. కాని, ఆనల్లరేగడి అంటే నాకు వెర్రి ఇష్టం. ఆ నల్లరేగడిలో ఏదో బలం, నిండుతనం, శుభ్రత ఉన్నట్టు అనిపించేది. రేగడిమట్టితో గుండ్రంగా ఉండలు చేసి ఎండబెడితే ఇనుపగుళ్ళలా తయారయేవి. పంగలకర్రతో ఈ మట్టి ఉండలతో చెట్ల మీద కాయలను గురిచూసి ఒక్కదెబ్బతో కిందపడేసే ప్రావీణ్యం మాలో కొందరికి ఉండేది.

‘మృత్యువు’ అంటే నాకు చెప్పలేని ఆకర్షణ. నాలో అణువణువూ ఉద్వేగంతో ఊగిపోయేది – మృత్యువుకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని చూస్తుంటే. నేను ఎక్కువ మరణాలు చూశానని కాదు కాని, మృత్యువుతో నా మొదటి అనుభవం దీనికి కారణం కావచ్చు. 1927వ సంవత్సరంలో మా తాతగారి మరణం నామీద చెరగని ముద్రవేసింది. ఆ రాత్రి పిల్లలందరినీ వేరే దూరంగా ఉన్న చిన్న ఇంట్లో పడుకోబెట్టారు. అర్థరాత్రి నిద్రపట్టక లేచి చప్పుడుకాకుండా పెద్ద ఇంట్లో మండువాలోకి తొంగిచూశాను. చైతన్యంలేని మా తాతగారి శరీరం మంచంమీద పడుకుని ఉంది. చివరికి ధైర్యం చేసి మంచం దగ్గరగా వెళ్ళి క్రింద కూర్చున్నాను. మంచం చుట్టూ కనిపెట్టుకు కూర్చున్నవాళ్ళు అలసిపోయి నిద్రతో జోగుతున్నారు. మాతాతగారి శరీరం ఒక్కసారి కదిలింది. గొంతుకలో ఏదో గరగర. దేన్నించో విముక్తికోసం పెనుగులాడుతున్నట్టు ఒక్కసారి ఆపాదమస్తకం తీవ్రంగా కంపించింది. మరుక్షణంలో మరి కదలిక లేదు. ఆ చివరిఘడియలు చూసింది నేనే! ఏదో ఒక వెలుగు ఆయనలోంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టనిపించింది. అది నా ఊహే కావచ్చు. కాని ఈనాటి వరకు మృత్యుసమీపంలో ఉన్న ఏవ్యక్తిని చూసినా, నా కాళ్ళు అక్కడనించి కదలిరావు – ఆ వెలుగు ఏదో దూరమైనదాకా. నేను ఉద్వేగంగా చెప్పిన మొదటి కవిత మా తాతగారి మరణం మీదే. ఛందోబద్ధమైన పద్య కవిత్వం అది. సాంప్రదాయసిద్ధంగా ఆనాటి కవిత్వంలో దొర్లేమామూలు పడికట్టు రాళ్ళన్నీ ఆ పద్యాల్లో ఉన్నాయి.

నాకు చిన్నతనం నుంచీ పద్యం అల్లటంలో నేర్పు ఉండేది. మా తెలుగు మేస్టారుకి నేనంటే ఇష్టం. ‘పద్యం’ కట్టడంలో మెళకువలు, ఛందస్సు, రచనా  వైచిత్రి ఆయనవల్లే నాకబ్బింది. ప్రతి సందర్భానికీ పద్యాలు వ్రాసి చదువుతుండేవాణ్ణి. స్కూలు తనిఖీ చేయడానికి వచ్చిన డి.ఇ.ఓ.ల మీద, డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ల మీద, బదిలీ అయిన ఉపాధ్యాయుల మీద, పాఠశాల వార్షికోత్సవాలకు నాపద్యపఠనా కార్యక్రమం విధిగా ఉండేది.

నా అనేక రచనల్లో మృత్యువు దర్శనమిస్తుంటుంది. మా తాతగారి మరణం నాలో నాటుకుపోయిన అనుభవం. దాని తాలూకు రకరకాల భావాలు నా కథల్లో చోటుచేసుకుంటూ వచ్చాయి. (‘బాల్యం’, ‘వియ్యన్నతాతమరణం’, ‘గాలివాన’, మొదలై కథల్లో). చలాకీగా కలకల నవ్వుతూ తిరిగే మా పెదతల్లిగారి అమ్మాయి నాల్గవ ఏటనే హఠాత్తుగా మరణించింది. ఆ పాపమీద వ్రాసిన పద్యాలు ‘కృష్ణాపత్రిక’లో అచ్చయ్యాయి. అపుడు నాకు పదహారు ఏళ్ళు. నా అచ్చయిన మొదటి కవిత అదే. మృత్యువు అంటే నాకు భయంలేదు కాని, బాధ చూడలేను. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాను ఇప్పటికి కూడా!

తిరపతిపురం గురించి నాకు స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మా తండ్రిగారు బ్రతికి ఉన్నప్పుడు కూడా ప్రతి సెలవుల రాజమండ్రి నుంచి తిరుపతిపురం వెళ్ళేవాళ్ళం. మా తండ్రిగారు రాజమండ్రిలో వీరేశలింగం హైస్కూల్లో  ఉపాధ్యాయుడిగా ఉండేవారు. రాజమండ్రిలో మధ్యాహ్నం పడవ ఎక్కేవాళ్ళం. గోదావరి దాటి విజ్జేశ్వరం వచ్చేప్పటికి సాయంకాలం అయేది. విజ్జేశ్వరం దగ్గర లాకు చూస్తే నాకు భయం వేసేది. లాకు దాటి నిడదవోలు కాలువలో రాత్రి అంతా పడవ ప్రయాణం. ఎక్కువభాగం రాత్రిలోనే గడిచినా, ఆ పడవ ప్రయాణాలన్నీ స్ఫుటంగా నా మనసులో నిలిచిపోయాయి.

తిరుపతిపురంలో మా తాతగారిది పెద్ద మండువా లోగిలి. ఏడెనిమిది ఎకరాల భూమిలో ఎత్తయిన ప్రదేశంలో విశాలంగా పరచుకొని ఉండేది. ఆ ఇల్లు. పెద్ద ఇంటికి కొంచెం దూరంలో అటూఇటూ రెండు చిన్న ఇళ్ళు పెద్దవీథి సావిడి. రెండోది చిన్న వీథి సావిడి. ఇంటికెదురుగా ఖాళీ స్థలంలో బారులుతీర్చి ఆ చివరినుంచి ఈ చివరి దాకా ధాన్యపుగాదులు. నా కళ్ళ ఎదటే ఆ పెద్ద గృహం క్రమక్రమేణా శిథిలం అయిపోవడం చూశాను. ఆ గ్రామంలోని జనం అంతా ఏదో మహాకావ్యంలోని పాత్రలుగా దూరంగా, ఎత్తుగా కనిపిస్తారు. ఎంతో చనువుగానూ, సన్నిహితులుగానూ కూడా అనిపిస్తారు నాకు. నేను ఎక్కువ కథలు వాళ్ళ గురించే వ్రాశాను. నా ఊహల్లో వాళ్ళు బ్రతికి నాతో బాటు ఎదుగుతూ వచ్చారు. కొంత నా ఊహల్లోనూ, కొంత వాస్తవంలోనూ మారుతూ వచ్చారో ఏమో! కొన్ని కథల్లో వాళ్ళు పేర్లు యథాతథంగా ఉంచేశాను. పెద్దలు, పుల్చి, దర్జీ వెంకటేశ్వర్లు ఇవన్నీ అసలైన పేర్లే. ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా దర్జీ వెంకటేశ్వర్లు దగ్గరకు పోయి బట్టలు కుట్టడం నేర్చుకునేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు కుట్టుమిషన్ మీదనుంచి అతన్ని దిగమని నేనే కుట్టేవాణ్ణి అతను ఒప్పుకున్న పనులన్నీ! నేను అత్తిలిలో చదువుతూ ఉండేవాణ్ణి కదా! అత్తిలి తిరుపతిపురం కంటే చిన్నపట్నంలో లెక్క. అక్కడ చూసిన కటింగులు వెంకటేశ్వర్లుకి కాగితం మీద కట్ చేసి చూపించేవాణ్ణి. శని, ఆదివారాలు వచ్చాయంటే ఎదురుచూస్తుండేవాడు వేంకటేశ్వర్లు. “అబ్బాయగారూ! కొత్త కటింగులు ఏమి పట్టుకొచ్చారండి?” అని అడిగేవాడు.

మా తాతగారు పోయాక మేము ఇంకో పల్లెటూరికి మకాం మార్చవలసివచ్చింది. అది మా పెదతండ్రిగారి ఊరు రాయకుదురు. మా పెదతండ్రి చిట్టిపంతులుగారు కాంగ్రెస్ వాది.  ఎన్నోసార్లు జైలుకి వెళ్ళివచ్చారు. హరిజనోద్యమానికి, పశ్చిమగోదావరి జిల్లాకు – ఆయన ప్రతినిధి. ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. హిందువుల నుంచి క్రైస్తవులుగా మారినవారిని ఆయన తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టారు కానీ, అందులో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన క్రైస్తవుల్ని తిన్నగా బ్రాహ్మణ కులానికే మార్చేసేవారు. వాళ్ళకి యజ్ఞోపవీతం వేసేవారు. వాళ్ళచేత సంధ్యావందనం చెప్పించేవారు. ఆయనవాదం ఏమిటంటే -” క్రైస్తవ మతం నుంచి హిందూమతంలోకి వచ్చేవాడు – తిరిగి హిందూమతంలో అట్టడుగున ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడు? ఆ మార్చేదేదో పెద్దకులంలోకి మార్చేస్తే – ఈ కులాల బెడద కొంతకాలానికైనా పోతుందిగా! ” అని. ఆ ఊరి బ్రాహ్మణ్యం ఆయనని వెలివేసింది. కాని, ఆయన ఏమీ ఖాతరు చేయలేదు. మా పెదతండ్రిగారి ప్రభావం నా మీద చాలా పడింది. మా తాతగారంటే నాకు భయభక్తులుండేవి. మా పెదతండ్రిగారంటే నాకు అమితమైన చనువు, సాన్నిహిత్యం ఉండేవి. తిరుపతిపురం గ్రామం ప్రాచీన ఔన్నత్యానికీ, సనాతన ధర్మానికీ ప్రతీకగా నా స్మృతిసీమలో నిలిచిపోయింది. తిరుపతిపురం వెనుకటి యుగానికి చెందిన గ్రామంలా అనిపించేది. మారుతున్న దేశకాల పరిస్థితులలో చైతన్యంతో ముందుకు సాగిపోయే గ్రామంలా రాయకుదురు ఉండేది. దానికి కారణం – స్వాతంత్రోద్యమంలోనూ, హరిజనోద్యమంలోనూ, ఇతర సాంఘికోద్యమాలలోను పాల్గొనే అనేకమంది కార్యకర్తలు మా పెదతండ్రిగారి కోసం రాయకుదురు వస్తుండేవారు. అందులో రకరకాల వ్యక్తులుండేవారు. ఉద్యమాలలో చేరి పైకి రాదలచుకున్నవాళ్ళు, కాంగ్రెస్ బురఖా తగిలించుకున్న భూస్వాములు, వ్యాపారస్థులు – ముందూ వెనకా, ఆలోచన  లేకుండా వెర్రి ఆవేశంతో సర్వస్వం తగలబెట్టుకున్న ఆదర్శవాదులూ, పరిస్థితులను సొంతంగా అనుకూలంగా మార్చుకునే అవకాశవాదులూ, దూకమంటే నిప్పుల్లోకి దూకే ఆవేశపరులూ – ఇలాంటి వాళ్ళంతా నా చిన్నతనంలో నాకు తారసపడ్డారు.అలనాటి ఆనవాళ్ళు నా మనసులో అలా నిలిచిపోయాయి. నా కథలకి అది తరగని పామగ్రి.

తర్వాత కొవ్వూరు హైస్కూల్లో చదువుకొనేవాణ్ణి. గోదావరి దాటితే మహాపట్నం రాణ్మహేంద్రవరం. అప్పుడు నాకు నా వయసువాడే అయిన ఒక సహాధ్యాయితో గాఢమైన స్నేహం ఏర్పడింది. అతని పేరు చాగంటి కామేశ్వరరావు. అతనూ పద్యాలు వ్రాసేవాడు. అప్పటి మా కోరిక ఏమిటంటే శతావధానం చేయాలనీ, తిరుపతి వెంకట కవులంత ప్రసిద్ధులు కావాలనీ ! గోదావరి గట్టంట రైల్వే బ్రిడ్జిదాకా నడుచుకుంటూ కనిపించిన ప్రతివస్తువు మీద ఆశువుగా చెరో పద్యం చెప్పుకుంటూ పోయేవాళ్ళం. పద్మరాజులో ‘రాజు’ – కామేశ్వరరావులో ‘ఈశ్వరుడు’ తీసుకుని ‘రాజేశ్వరులు’ అనే – జంట కవుల పేర్లుతో చాలా పద్యాలు వ్రాశాం. అందులో కొన్ని ఆనాటి ‘కృష్ణాపత్రిక’లో అచ్చయ్యాయి. హఠాత్తుగా తన ఇరవైవ ఏటనే సహాధ్యాయి, గాఢమిత్రుడూ కామేశ్వరరావు అకాల మృత్యువు పాలయ్యాడు. నా మనస్సు ఎంతో గాయపడింది. అప్పటితో నా కవితావ్యాసంగం ఇంచుమించు ఆగిపోయింది.

పెద్దవానలు కురిసిన ఏ కొద్దిరోజుల్లోనో తప్ప మిగతా సంవత్సరం పొడుగునా గోదావరి గట్టంట సాయంకాలాలు గడపడం నిత్యజీవితంలో భాగం అయిపోయింది. గోదావరి – వరదల్లో దాల్చే బీభత్సరూపం, ఆ భయానక దృశ్యాలు నా మనస్సులో ఓ మూలనక్కి కూర్చుని రెండు, మూడు కథల్లో దర్శనమిచ్చాయి.

నాలో చిన్నతనంనుంచీ పరస్పర విరుద్ధమైన రెండు లక్షణాలు ఉండేవి. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన బ్రహ్మచారికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండేవి – పిలకా, యజ్ఞోపవీతం, నుదుటిమీద బొట్టుతో సహా. ‘పురాణాలు’ మతసంబంధమైన ఉద్గ్రంథాలు, ఉపనిషత్తులు, వాటి వ్యాఖ్యలు, నీతిశతకాలు, – ఇవన్నీ భక్తితో చదివేవాణ్ణి. ఒక్క ముక్కకూడా అర్థం అయేదికాదు. కాని, వాటిలో గొప్పవిషయాలు ఉన్నాయని నా నమ్మకం. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను సమర్థిస్తూ తారాస్థాయిలో వాదించేవాణ్ణి. పాతది అయిన ప్రతిదాంట్లోనూ మనకి తెలియని నిగూఢమైన రహస్యం ఏదో ఉందని నమ్మేవాణ్ణి. ఇతరులు మెచ్చుకునేలా నా ప్రవర్తన ఉండాలనీ, గుణవంతుడనీ అందరూ అనుకోవాలని ఉండేది.

మరో ప్రక్క కొంతదారి తప్పి నడిచే వ్యక్తులు, సభ్య సమాజం దూరంగా అట్టేపెట్టే వ్యక్తులు, రాత్రివేళ తప్పతాగి తూలుకుంటూ పదాలు పాడుతూ పోయే వ్యక్తులు – వీళ్ళంటే విపరీతమైన ఆకర్షణ ఉండేది. వాళ్ల ప్రపంచం ఏదో ఉందనీ, అదేదో తెలుసుకోవాలనీ ఉత్సకత ఉండేది. ఇంట్లో తెలియకుండా ఇల్లాంటివాళ్ళతో స్నేహం కట్టడం, ఇల్లాంటివాళ్ళ మీద పెద్దలు రహస్యంగా చెప్పుకుంటున్న మాటలు దొంగచాటుగా వినడం, తలుపు కన్నాల్లోంచి చూడటం – ఇలాంటి ఘనకార్యాలన్నీ చేసేవాణ్ణి. చిన్న వయసునుంచీ ఈ రకం మనుష్యులమీద నేను సేకరించిన జ్ఞానం కథా రచయితగా నాకు ఎంతో ఉపకరిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజుల్లో నా ఆశయమల్లా గొప్ప కవిని కావాలనే! వచనం అంటే తక్కువ చూపు కూడా ఉండేది. కాని, అన్ని రకాల మనుషుల గురించి తెలుసుకోవాలనే తపన మాత్రం ఉండేది. క్రమంగా తర్వాత అవగాహనలోకి వచ్చింది. కవిని అయే లక్షణాలు నాలోలేవని. ప్రతి విషయాన్నీ విడదీసి, విభజించిచూసే తార్కికతత్వం నాది. హేతువాదంతో సంబంధం లేకుండా ఉద్వేగంతో, ఉద్రేకంతో ఊగిపోయే హృదయం కావాలి కవికి. చిన్నతనంలో కవిత్వంపై నాకున్న మోజు తాత్కాలికమైనదే. గత వైభవం, ప్రేమ – విరహం, వియోగం, ఆఖరికి నాకు సున్నితమైన వస్తువు ‘మృత్యువు’ – ఇవేవీ కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, నా హృదయాన్ని ద్రవింపజేసి కవితావాహినిగా మార్చలేదు. అందరూ వాడే అందమైన మాటలు, అందమైన భావాలు అంటే నాకు చిరాకు. విరివిగా వచ్చే జీవంలేని అందమైన కవిత్వం అంటే నాకు విసుగ్గా ఉండేది. నేను వ్రాసిన నా చిన్నతనపు కవిత్వంలో కూడా ఆత్మపరమైన (సబ్జెక్టివ్) వస్తువు ఉండేది కాదు. విభజించి విడివిడిగా తూకంకట్టి, సూటిగా చెప్పే వచన లక్షణం ఏదో ఆనాటి నా కవిత్వానికుండేది.

నేను కాశీ విశ్వవిద్యాలయంలో, రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడు నా దృక్పథంలో పెద్ద మార్పు వచ్చింది. ఆ రోజుల్లో సైన్సు, ఆధునిక పాశ్చాత్య సాహిత్యం, పాశ్చాత్య తత్వశాస్త్రం ఎంతో చదివాను. ఇదికూడా హృదయంతో చదివిందేకాని, సునిశితమైన మనస్సుతో చదివింది కాదు. ఫలితం ఆధునికమైన ప్రతి అభిప్రాయానికీ లొంగిపోయాను. ఇంతవరకూ ప్రాచీనమైన ప్రతివిషయాన్నీ ఎంత తీవ్రంగా సమర్ధించేవాణ్ణి, ఇప్పుడు ఆధునికమైన ప్రతిదాన్నీ అంత తీవ్రంగా సమర్థిస్తున్నానన్నమాట. తర్వాత కొంతకాలానికి తెలిసొచ్చింది. – ఉద్వేగానికి, ఉద్రేకానికీ లొంగిపోతే అది శాస్త్రీయదృక్పథం కాదని.

కథా రచయితగా నా జీవితకాలంలో నాకు ఇష్టమైన అభిప్రాయాల్ని, అభిమానమైన సూత్రాల్ని ఏ ఒక్క కథ ద్వారా కూడా నిరూపించలేకపోయాను. నా అభిమాన సూత్రాలకి ప్రాచుర్యం ఇస్తూ, వాటిని ఉగ్గడిస్తూ రాయాలని ఉండేది. కాని, తీరా రాయడానికి కూర్చునేసరికి కథ ఏ పాత్రమీదనో, లేక ఏం సంఘటన మీదనో రాయవలసి వచ్చేది. అప్పుడు కథ తనంత తానే నడిపించుకుపోయేది – నా అభిమాన సూత్రాల పరిధిలోకి రాకుండా. ఇది నాకు అంత తృప్తిగా ఉండేది కాదు. దీనికి కారణం నా అభిమాన సూత్రాలకి అనుగుణంగా ఉండేపాత్రలు స్ఫుటంగా రూపుదిద్దుకొనేవి కావు. ఒకవేళ అలాంటి పాత్రలు సృష్టిస్తే అవి నా ఊహల్లో పుట్టిన పాత్రలే అవుతాయి గాని, నిత్య జీవితంలో రక్తమాంసాలతో పుష్టిగా, స్పష్టంగా దొరికే పాత్రలు ఎలా అవుతాయి. ఇలాంటి పాత్రలే నా కథల్లో చోటుచేసుకున్నాయి. నా ఊహల్లో నా అభిమాన సూత్రాలకి, సిద్ధాంతాలకి (పెట్ థియరీస్) అనుగుణంగా, అసహజంగా, అస్పష్టంగా, బలహీనంగా రూపుదాల్చిన పాత్రలకి మాత్రం నా కథలదాకా వచ్చే ఓపిక లేదు. నేను నా కథలలో సృష్టించిన ప్రతిపాత్రకీ ఒక మాతృక ఉంది.

చిన్నతనం నుంచి నా మనోవీథిలో నిలిచిపోయిన వ్యక్తులు, సంఘటనలు తరగని గనిలాంటివి. దారిద్య్రం గురించీ, పీడిత ప్రజానీకం గురించి సామాజిక అన్యాయాల గురించి వ్రాయాలని కోరిక అయితే మాత్రం లేకపోలేదు. తీరా కథ మొదలు పెట్టేసరికి ఆ పీడించే ఆసామి భూస్వామో, లేక వడ్డీవ్యాపారో – నాకు అంతఘోరంగా కనిపించేవాడు కాదు. అతనిలోనూ చిత్రంగా ఆకట్టుకొనే లక్షణాలు ఏవో తొంగిచూసేవి. ఆ పీడింపబడే వ్యక్తి కూడా నాకు సత్యహరిశ్చంద్రుడిలా, ముమ్మూర్తులా నీతిమంతుడుగానూ కనిపించేవాడు కాదు. ఈ పీడిత ప్రజానీకం క్రింద జమకట్టబడే వర్గంలోనూ ఎంతోమంది దగాకోర్లు, మోసగాళ్ళూ తగులుతూనే ఉంటారు. ఈ ప్రజానీకాన్ని అంతనీ రెండు భాగాల క్రింద విడగొట్టేసి వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని రెండు మూటలు కట్టేసి పడేయడం నాకు చేతనయేదికాదు.

పేదరికం, దారిద్ర్యం – వీటిమీద నా సానుభూతి సూత్రప్రాయమైనదే. ఆ లోపానికి కొంత బాధపడేవాణ్ణి కూడా. కాని, తర్వాత తెలిసొచ్చింది అది లోపం కాదని, నాలోని కథకుడు – నాలోని సూత్రకారుడి కంటే బలమైనవాడు. సమాజం తీరు తెన్నులపై నిర్వచించే సూత్రాలన్నీ కూడా ప్రజానీకంలో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సూత్రాలన్నీ కూడా ‘సామాన్యమానవుడు ఒకడు ఉన్నాడు’ అనే మూల సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి ఈ సామాన్య మానవుడు అంత స్పష్టంగా కనిపించడు రచయిత దృష్టిలో. ప్రతి మనిషీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అందరు వ్యక్తులూ ఒకే నిర్వచనంలో ఇమిడిపోరు. ఈ తరం కథకులంతా భవిష్యత్తులో వచ్చే సూత్రకారుడికి బోలెడంత సామాగ్రి తయారుచేసి పెడుతున్నారు. ఇవన్నీ చదివాక భవిష్యత్తులో సూత్రకారుడు – మనిషినీ, మానవ స్వభావాన్నీ సంపూర్ణంగా సూత్రబద్ధం చేయగలడేమో చూడాలి.

నిత్యజీవితంలో – చెడ్డవాళ్ళనీ, మోసగాళ్ళనీ, దగాకోరుల్నీ, అవినీతిపరుల్నీ పూర్తిగా దూరంగా ఉంచడం జరుగదు. ఒక్కోక్కప్పుడు వాళ్ళని సహిస్తాం, క్షమిస్తాం. కొంతమందంటే ఇష్టం కూడా పెంచుకొంటాం – ఆ వ్యక్తిని బట్టీ, సందర్భాన్ని బట్టీ. ‘బాల్స్ ఆఫ్ షాట్’ అనే మొపాసా కథలో పడుపువృత్తిలో ఉన్న ఓ లావాటి యువతి ఆ కథలో వచ్చే పతివ్రతలందరి కంటే నీతిమంతురాలిగా కనిపిస్తుంది. ఆస్కార్వైల్డ్ అన్నట్టు – నీతిగ్రంథాలు – అవినీతి గ్రంథాలు అనిలేవు. బాగా వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి – అంతే. రచయిత ప్రతిభ అంతా పాత్రకి సంపూర్ణరూపం ఇవ్వగలగడం, దానికి దోహదపడే సన్నివేశాలని ఎన్నుకోవడంలో ఉంది. నా వయస్సు ఇరవై ముప్ఫై ఏళ్ళమధ్య నా మనస్సంతా రకరకాల అభిప్రాయాలతో నిండిపోయి, చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపంచాన్ని స్పష్టంగా చూడనిచ్చేదికాదు. నా బుర్రలో హకీలు, మార్క్సు, ఇలియట్, జోయస్ – వీళ్ళు విహారం చేస్తుండేవారు. అప్పుడు కొంత కవిత్వం వ్రాశాను. నేను ఎన్నుకున్న వస్తువు వైరూప్యమైనది. స్నేహితులు వాటిని శాస్త్రీయ పద్యాలు (సైంటిఫిక్ పోయమ్స్) అనేవారు. అది పొగడ్త కిందే జమకట్టుకునేవాణ్ణి. ఒక్కసారి ఛందస్సుకీ, వృత్తానికీ విడాకులిచ్చేశాను. వచన కవితలోకి దిగాను. చీకటి, వెలుతురు – ఇలాంటి వస్తువు తీసుకొని ఏవోరూపాలు చిత్రించాను. నేను వ్రాసిన ‘పురిటిపాట’ నా ఉత్తమమైన కవిత అని నా నమ్మకం.

నేను కాకినాడ పి.ఆర్. కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచి స్నేహాలు దొరికాయి. స్వభావ సిద్ధంగా నాలో ఉద్రేకం ఎక్కువే. కాని, నేను రొమాంటిక్ కాదు. నాకు ప్రణయజీవితానుభవం ఏదీ లేదు. ప్రణయం మీద, విరహం మీద అందమైన మాటలు గుబ్బెత్తేసి కాగితాలపై ఒలకబోసే కవిత్వం అంటే నాకు చిరాకు. ప్రేమకీ, ప్రణయానికీ వివాహంతో సంబంధంలేదు. వివాహం కేవలం గృహానికి సంబంధించిన వ్యవహారం. పైగా 45 రూపాయలు జీతం – అదైనా సంవత్సరంలో 9 నెలలు ఉద్యోగం. దీనిమీద ఆధారపడిన ముగ్గురు తమ్ముళ్ళు, తల్లి, భార్య, ఈ పరిస్థితులలో ప్రణయం భయపడి దూరంగా ఉంటుంది. ఆ రోజుల్లో పి. ఆర్. కాలేజీలో సగంమంది ఉద్యోగాలు తాత్కాలికమైనవే… సంవత్సరంలో 9 నెలలే జీతం.

సారస్వత సమావేశాల్లో కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు కవితలు, మునిమాణిక్యం వచనం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సభలూ, సమావేశాలూ నన్ను కొంతవరకు తీర్చిదిద్దాయి. ఎం.ఎన్.రాయ్ సాంగత్యం వల్ల నాలో కొత్త మార్పు వచ్చింది.

1944 ప్రాంతంలో ‘పెద్దరైతు’ (ది బిగ్ పెజెంట్) అనే దీర్ఘమైన కవిత వ్రాశాను.

ఏదైనా చెప్పుకోదగిన నా ఆఖరి కవిత అదే అనుకుంటా.

ఈ రోజుల్లోనే నేను కథా రచయితగా స్థిరపడడం మొదలైంది. నేను పెరిగిన రెండు గ్రామాల జీవితం గురించే నేను విశేషంగా వ్రాశాను. ఆ రెండు గ్రామాలు నా మనసులో స్పష్టం. తర్వాత కాకినాడలో ఉన్నా, అక్కడి జీవితం గురించి ఒకటి రెండు కథలు తప్ప ఎక్కువ వ్రాయలేదు.

నేను భీమవరంలో డబ్ల్యు.జి.బి. కాలేజీలో రసాయనశాస్త్ర శాఖకు ప్రధాన ఉపన్యాసకుడిగా వెళ్ళినప్పటికి కథా రచయితగా కొంత పేరు అప్పటికే వచ్చింది. పైగా నేను చిన్నతనం గడిపిన రాయకుదురు అక్కడికి 12 మైళ్ళ దూరంలో ఉంది. నా చిన్నతనపు జ్ఞాపకాలు తిరిగి బలంగా రావడం మొదలైంది. నా మనస్సులో మగతగా పడి ఉన్న ఎన్నో సంఘటనలు ఒకసారి నిద్రలేచి కూర్చున్నాయి. ఎన్నో నాటికలు, నాటకాలు అప్పుడే వ్రాశాను. ప్రధాన కారణం ఆ కాలేజీ విద్యార్థులే. ఏ సందర్భం వచ్చినా కొత్త నాటకమో, నాటితో వ్రాయించి అది ఆడేవారు. ఆలిండియా రేడియోకి చాలానాటకాలు వ్రాశాను అప్పుడే. కాని నాకు ఇష్టమైన సాహిత్యరూపం – కథానికే.

నా మొదటి కథ ‘సుబ్బి’ ఇంగ్లీషులో వ్రాశాను. 1938వ సంవత్సరంలో ‘త్రివేణి’ పత్రికలో అది అచ్చయింది. పెళ్ళి చేసుకోకుండా పిల్లను గన్న ఒక పనిపిల్ల పట్ల ఆ ఇంటియజమానుల ప్రవర్తన ఇతివృత్తంగా ఆ కథ వ్రాశాను. చిలవలు పలవలు లేకుండా సాదాగా చెప్పిన కథ అది. అప్పటి ఆ పత్రిక సంపాదకులు బుర్రా సుబ్రహ్మణ్యంగారికి ఆ కథ నచ్చింది. నన్ను తెలుగులో వ్రాయమని మొదట ప్రోత్సహించినది ఆయనే. ఆ కథ మొదట తెలుగులోనే వ్రాసి ‘భారతి’కి పంపితే వాళ్ళు నిరాకరించారని ఆయనతో చెప్పలేదు. ‘త్రివేణి’లో నా కథ వచ్చాక ‘భారతి’ సంపాదకుడు ఆ కథను తిరిగి పంపమని కోరడం జరిగింది. నేను ఆ కథ పంపకుండా వేరే కథ పంపినట్టు గుర్తు.

ఆ రోజుల్లోనే మనో విశ్లేషణ గురించి బాగా చదివాను. కొత్తగా సంపాదించిన ఈ జ్ఞానాన్ని కథల్లో చొప్పించేద్దామని తహతహ ఉండేది. కాని, ఆ బలహీనతకు లోను గాలేదు. సంయమనం అలవరుచుకొన్నాను. రచనా విధానంలో కథకీ, కథకీ మార్పులు వస్తూ వచ్చాయి.

చెడ్డవాళ్ళుగా పరిగణింపబడేవాళ్ళంటే నాకు ఒక రకమైన ఆకర్షణ ఉండేది. వాళ్ళతో దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేవాణ్ణి. మామూలుగా పదిమందిలో అస్పష్టంగా కలిసిపోయే వ్యక్తులు కాక, విలక్షణమైన వ్యక్తుల్ని చూసే దృష్టి అలవడింది. రకరకాల పార్టీలకు హాజరవుతుండేవాణ్ణి. మనుషుల్ని దగ్గరనుంచి చూడటం, కాస్త మద్యం సేవించిన మీదట రకరకాల ప్రవృత్తులు పరదాలు దాటి బయటికి ఎలా వస్తాయో – ఇవన్నీ ఓ మూల కూర్చుని గమనించేవాణ్ణి.

ఈ నాటికి కూడా నా చిన్నతనంలో సంఘటనలూ, వ్యక్తులూ రంగురంగుల ప్రపంచంలో మూర్తుల్లా నన్ను వెంటాడుతుంటాయి – “నన్ను గురించి కథ వ్రాయవూ?” అంటూ. అలాంటప్పుడు ఏదో కథ వచ్చి తీరుతుంది. నా జ్ఞాపకాల తెరల చాటున ఎన్నెన్నో సంఘటనలు, ఎందరెందరో వ్యక్తులు అస్పష్టంగా ఉన్నా, క్రమేణా తెర తొలగించుకుని దగ్గరవుతూ వస్తారు నేను కథ రాసే సమయానికి.

నేను పదిమందిని ఆకర్షించే మనిషిని కాను. నాలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నమ్మేటంత అహంకారమూ లేదు. అందుచేత నా కథల్లో వేటిలోనూ నేను కథానాయకుణ్ణి కాదు. ఎవరికీ దొరకని అపూర్వ అనుభవం నాకేమీ కలగలేదు. అందుకని నా గురించి కథల్లో వ్రాసుకోలేదు. కాని, ఒక భయంకరమైన అనుభవానికి ఒకసారి లోనైనాను. ఆ అనుభవం మాత్రం ఒకకథలో చోటుచేసుకుంది. అదే నాకు అంతర్జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన ‘గాలివాన’. ‘గాలివాన’ కథలో భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్న ఒక వక్తి క్షోభను చిత్రించాను. ఇక్కడ ఒక పరిస్థితిలో పరస్పర విరుద్ధమైన రెండు పాత్రల ప్రవర్తన చూపించాను. సాఫీగా స్థిరమైన బాటను జీవితం గడుపుతున్న రావు, మరుక్షణం ఎలా గడుస్తుందో తెలియని ఒక బిచ్చగత్తె ఈ కథలో పాత్రలు. 1948వ సంవత్సరంలో అర్థరాత్రి సంభవించిన తుఫాన్లో – నేను ‘గాలివాన’ కథలో రావు అనుభవించిన క్షోభ అంతా అనుభవించాను. మా ఇల్లు కూలిపోయింది. ఆ కూలిన ఇంటిక్రింద నా భార్య చిక్కుకుపోయి మూడు గంటలు నిస్సహాయంగా పడి ఉంది. ఆ రాత్రి అంతా భయానకం, బీభత్సం. కాని కథలో రావుని మాత్రం నేను కాదు – ఒకే పరిస్థితిలో మేమిద్దరం చిక్కుకున్నాం.

ఇంక సినిమా ప్రపంచంలో కథా రచయితగా నేను చెప్పుకోవలసింది ఏమీ లేదు. నా స్వతంత్ర రచనా వ్యాసంగానికి మాత్రం భంగం కలిగించింది – నా సినిమా జీవితం. ఈ రంగంలో ప్రవేశించక పూర్వం నేను ఏ కథ వ్రాసినా, “ఇది మామూలు మనిషికి నచ్చుతుందా, లేదా?” అనే ప్రశ్న ఎప్పుడూ ఎదురవలేదు. సినిమాకి వ్రాయడంతో అడుగడుగుకీ ఎదురయే ప్రశ్నే అది. మరో విషయం – తారలచుట్టూ కథ అల్లవలసి వచ్చేసరికి పాత్ర పోషణ అంతా ఒకే మూసలో పోసినట్టు తయారయేది. పటుత్వం ఉన్న కథలను యథాతథంగా మంచి చిత్రాలుగా తీసే రోజులు దగ్గరలో లేవు  తెలుగుదేశంలో.

ఏదో చెయ్యాలనీ, నా రచనా విధానం కొత్తమార్గాలు తొక్కాలనీ, ఏవో మార్పులు రావాలని నా ఆకాంక్ష. మొదట్లో చెప్పినట్లు నేను ఇంకా తిని తిరుగుతున్నాను కాబట్టి, నా ఖాతా ఇంకా మూసెయ్యలేదు కాబట్టి నేను అనుకున్నది  సాధించగలనేమో!

  *    *   *

పాలగుమ్మి పద్మరాజు

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.  తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు, నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివానపడవ ప్రయాణంఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *