“మంచిది చెల్లీ .. కాస్త నన్ను కూడా లోపలికి రానివ్వు” ఈ పిలుపు ఇంటి బై టక్ నుంచి వినిపించింది . దాని వెంటే ఒక అమ్మాయి తన చున్నీ తో చేతులు తుడుచు కొంటూ హడావుడిగా గది లోకి వచ్చింది. తను కలవాలి అనుకున్నవారందరి కంటే ముందుగా మాలిక్ బేగమే వరుసలో కూర్చొంది. ఆమె ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ లో ఒక రోజు ఉండడం కోసం వచ్చింది. వీధి వీధంతా ఆమే రంజుగా చెప్పే యాత్రా కథలను వినడానికి వాకిట్లో సిధ్ధంగా ఉన్నారు .
“ ఇదిగో ఇంతే ఇక .. రావాలనుకుంటే ఇప్పుడే రండి . చెప్పి చెప్పి నా నోరు నొప్పుటేస్తుంది . ఇప్పటికే వందల సార్లయినా చెప్పి ఉంటాను . సరే మళ్ళీ చెబుతా వినండి . ఇక్కడినుంచి రైలెక్కి ఢిల్లీ చేరానా.. నా షోహర్ ఇక అక్కడ ఆయనకి కావలసిన స్టేషన్ మాస్టర్ దొరికిపోయాడు. ఇంకేంఉంది? నన్ను సామాన్ల దగ్గర వదిలేసి ఆయన స్నేహితుడితో అదృశ్యం అయిపోయాడు. ఇక నేను సామాన్ల మీద బురఖా కప్పుకుని కూర్చుండి పోయాను. ఇంకేం చేస్తాను? ఒక పక్క వెధవది ఈ బుర్ఖా.. మరపక్క చుట్టూ పరాయి పురుషులు. బిక్క సచ్చి పోయాననుకోండి. ఎంతైనా మగాళ్లు చెడ్డవాళ్లే ఉంటారు అవునా,. పైగా ఇలా నాలా వొంటరిగా., భయంగా కూర్చొన్న ఆడదాన్ని చూస్తే ఆమె చుట్టూ పిచ్చి వాళ్ళలా చక్కర్లు చేస్తూనే ఉంటారు. ఇక నా పరిస్థితి ఎట్లా ఉందంటే పాన్ తినే అవకాశం కూడా దొరకలేదు. ఒకడు దగ్గుతాడా., మరొకడు పిచ్చిగా ఏవో శబ్దాలు చేస్తూ తిరుగుతుంటాడు. నాకేమో భయంతో ప్రాణాలు బిక్క సచ్చిపోయాయి. ఇక ఆకలికి బెఛైన్ .,బెఛైన్ అయిపోతున్నానా ., ఓహ్హ్ కళ్ల ముందు ఆ అల్లాహ్ కనిపించాడనుకోండి . నిజం చాలా ఆకలేసింది . ఎప్పుడో పొద్దున్న తిన్న తిండాయే. ఇక ఢిల్లీ స్టేషన్ గురుంచి ఏం చెప్పమంటారు ? పెద్ద రాజభవనం కంటే విశాలంగా ఉంటుందనుకోండి. మన చూపు పోయినంత మేరా స్టేషన్ కనపడుతుంది. అలాగే పొడవైన రైలు పట్టాలు, ఇంజను,మాల్ తీసుకెళ్ళే రైలు బండ్లు. ఓహ్హ్ ఏం చెప్పాలి.. రెండు కళ్ళు చాలవనుకోండి. అన్నిటికన్నా నాకు ఆ నల్లటి మనుషులను చూస్తే చచ్చేంత భయం వేసింది. ఎవరంటారా.. అదే ఇంజనులో కూర్చుంటారే వాళ్ళు ! ఇంజనులో ఎవరుంటారెంటి ..? ఎవరో ఆమె మాటలను మధ్యలో త్రుంచి కుతూహలం ఉట్టి పడుతున్న గొంతుతో అడిగారు. ఎవరుంటారంటే ..ఎవరో తెలీదాత్తా ? నీలి రంగు బట్టలు వేసుకున్న గడ్డం మనిషి,లేదా స్టేషన్ న్ని, ఇంజనుని శుభ్రం చేసే వాడు కామోసు . రైలు ఎలా ఎక్కుతారనుకున్నారూ.. ఒక్క చేత్తో వేలాడుతూ ఇంజనులోకి దూరిపోతారు అది చూసే వాళ్ళ గుండెలు భయం తో వొణికి పోతాయంటే నమ్మండి. విదేశీ మేడమ్ లు , సార్లు స్టేషన్ లో ఎంత మంది ఉంటారంటే లెక్కపెట్టలేం తెలుసా ? చేతుల్లో చేతులేసుకుని పడుతూ.. లేస్తూ పోతుంటారు. మన హిందుస్థానీ పురుషులేమన్నా తక్కువున్నారా అంట.. కళ్ళు పేలి పోతాయాయేమో అన్నట్లు ఆడవాళ్లను చూస్తూ ఉంటారు. ఆ దరిద్రుల కళ్ళు పేలి పోకుండా ఎందుకున్నాయి అసలు ? మీకు తెలుసా .. ఒక దరిద్రుడు నాతో ఏమన్నాడో.. చెబుతా వినండి. “ కొంచెం నఖాబ్ తీసి ముఖమైనా చూపించ రాదా”? అన్నాడు. అవును నిజం అట్లానే అన్నాడు వాడు. “ అయితే నువ్వేం చూపించలేదేంటి మరి ”? అని ఎవరో ఆడ వాళ్ళ లోంచి వెక్కిరింతగా వెంటనే అనేశారు. “ అల్లాహ్ అంటే భయమే లేదా అత్తా నీకు ? నేనేమైనా ఈ వెధవలకి నా ముఖం చూపించడానికి పోయానేంటి? ఒక పక్క గుండె భయం తో వొణికి పోతుంటే? మల్లిక బేగం కోపంతో ముఖం ముడిచి.. “వినాలని ఉంటే మధ్యలో ఆపకుండా విను” అని అత్త ని కసిరింది. అక్కడ ఒక్కసారిగా నిశబ్దం అలుముకుంది. ఇటువంటి సరదా ముచ్చట్లు ఫరీదాబాద్ లో చాలా తక్కువగా వినిపిస్తాయి మరి. మల్లికా బేగం ముచ్చట్లు వినడానికి ఆడవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు . “అవునత్తా.. సరుకులమ్ముకునే వాళ్ళు మనదగ్గర ఉన్నట్లు ఉండరు తెలుసా ?శుభ్రమైన ఖాకీ బట్టలు లేదా తెల్లనివి వేసుకుంటారు. కానీ కొంతమంది వేసుకునే లుంగీలు మాత్రం బాగా మురికి పట్టి ఉంటాయి. తల మీద బుట్టల్లో పాన్,బీడీ, సిగరెట్, పెరుగు వడలమ్మా., వడలు, బొమ్మలమ్మా బొమ్మల., మిటాయిలండీ., మిటాయిలు అని అరుస్తూ తలుపులు మూసి ఉన్న రైలు కిటికీలెంబడి ఆయాసపడుతూ పరిగెడుతూ ఉన్నారు తెలుసా ?
ఇక ఇంతలో రైలు వచ్చేసింది. ఓహ్హ్,. స్టేషన్ అంతా హడావుడిగ మారిపోయిందంటే నమ్మండి. రైలు కూతతో చెవులు పగిలిపోయాయి… మనుషులు చేసే రణగొణ ధ్వనులతో.. స్టేషన్ నిండిపోయింది. ఇక్కడ కూలీ వాళ్ళ కేకలతో., మరోపక్క సరుకులమ్మేవాళ్ళ అరుపులతో చెవులు పగిలిపోయాయి. ప్రయాణికులు ఒకరి మీదొకరు పడుతూ , తప్పించుకుంటూ పోతూ స్టేషన్ విడిచి వెళ్లిపోతుంటే .. నేనేమో పిచ్చిదానిలాగా నా సామాన్ల మీద వొంటరి గా కూర్చుని ఉన్నాను. ప్రయాణీకుల్లో బహుశా వందల మందికి ఈ తొక్కిసలాటల్లో దెబ్బలు తగిలే ఉంటాయి. వస్తున్న కోపాన్ని దిగమింగుతూ ఢిల్లీకి శికారుకి తీసుకొచ్చి నన్ను అలా వొంటరి గా .. ఆకలితో వదిలేసి వెళ్ళిన నా షొ హర్ {భర్త } మీద ఆగ్రహంతో .. భయపడిపోతూ ఉండిపోయాను. దోస్తుతో ఎక్కడికెళ్ళి ఉంటాడో అంతు పట్టట్లేదు. నాకేమైనా అయితే ఎట్లా ? ఆలోచనలతో సతమతమవుతున్నాను. రైలు బయలు దేరిందో లేదో కూలీలు ప్రయాణీకుల గురించి బేర సారాల గొడవ మొదలైంది. “ఒక రూపాయి అవుతుంది సాబ్” , అని కూలీ అంటే “లేదు, రెండు అణాలు ఇస్తాను అంతే” అని ప్రయాణికుడు అంటాడు . ఇలా బహుశా ఒక గంట దాకా బేరసారాలు సాగాయి. స్టేషన్ కాస్తా ఖాళీ అయిపోయింది. మరో రెండు గంటలు నిరాశగా ఆకలితో అలమటించి పోతూ గడిపాక ఇక అప్పుడు ఒకాయన తన మీసాలు అద్ధుకుంటూ నా దగ్గరికొచ్చి నిలబడ్డాడు . అతడె వరనుకున్నారూ .. హుం నా షొహర్ ! “ ఆకలేస్తే చెప్పు .. పూరీలు గీరీలు తేనా ఏం .. తింటావా ? నేనైతే బయట నా దోస్తులతో తినేసి వచ్చాను”
నేను ఆయన వైపు వెర్రిగా చూశాను . ఏంటీ ఇన్ని గంటలు నన్నిక్కడ వదిలేసి ఈన తీరిగ్గా హోటల్లో తినేసి వచ్చాడా ? నాకెంత కోపం వచ్చిందో చెప్పలేను . “ఖుదా కోసమన్నా నన్ను నా ఇంటికి తీసుకెళ్లు . ఈ ఢిల్లీ యాత్ర ఏమో కానీ నేను విసిగి పోయాను. నీతో నేను కాదు కదా ఇక ఎవరూ స్వర్గానికి తీసుకెళతావన్నా రారు గాక రారు. భలే తెచ్చావులే ఢిల్లీ షహర్ చూపించడానికి. ఫరీదాబాద్ రైలు తయ్యారుగా ఉంది నన్ను అందులో కూర్చొబెట్టు ఢిల్లీ పోతా” అన్నాను అవమానంతో ముఖం తిప్పుకుంటూ . “నీ ఇష్టం.. ఢిల్లీ చూడక పోతే చూడకు”రైలు వైపుకి వీసా వీసా వెళ్లిపోతున్న నన్ను చూస్తూ అతను నిర్లక్ష్యంగా అన్నాడు . ఇక అంతే నేను ఫరీదా బాద్ వచ్చేశాను.” మల్లికా బేగం తెల్లబోయి నిర్ఘాంత పోయి చూస్తున్న ఆడవాళ్లను చూస్తూ.. “ఇంతే ఈ మగవాళ్ల కథ .. ఇక అయిపోయింది”. అంటూ లేచింది మల్లికా బేగం తన మొఖం లో రంగులు మారుతుంటే.
***
డా రాషీద్ జహాన్ ప్రముఖ ప్రగతిశీల ఉర్దూ రచయిత్రి. డా. రాషీద్ జహాన్ ఆగస్ట్ 25, 1905లో ఆలీఘర్ లో జన్మించారు. షేక్ అబ్దుల్లాకి, ఆయన భార్య బేగం వాహిద్ జహాన్ ఏడుగురు పిల్లల్లో కెల్లా పెద్దది . తండ్రి స్రీల కోసం ఇంగ్లీష్ భాష పునాదిగా మహిళా విద్య సంస్థలను నడిపించారు. రాషీద్ జహాన్ స్రీ వైద్య నిపుణురాలు.{gynaecologist } ప్రజాపక్ష మేధావి, కమ్యూనిస్ట్ నాయకురాలు. అభ్యుదయ కథా రచయత్రి. తొలి కమ్యూనిస్ట్ ముస్లిం డాక్టర్ & సర్జన్ గా ఎన్నో వైద్య సేవలు అందించారు . తన దగ్గరికి వచ్చిన స్రీ రోగులందరి వ్యధలను. మనో శారీరిక బాధలను ఆమె సాహిత్యంలో కథ .. నాటకాలుగా రాశారు. ఆమె రాసిన “పర్దే కె పీచే’ నాటకం లో అప్పటి ముస్లిం సమాజంలో అమలవుతున్న మతాచారాలు, స్రీల లైంగికత .. పునరుత్పత్తి హక్కులమీద అణిచివేత ,నిత్య గర్భాల ,గర్భ స్రావాల వలన ఆ స్రీలు పడే వేదనని అత్యంత శక్తి వంతంగా రాశారు . ఆ నాటికని అప్పటి యునైటెడ్ ప్రొవిన్స్ ప్రభుత్వం నిషేధించి క్షమాపణ అడిగమన్నా డా. రాషీద్ జహాన్ క్షమాపణ చెప్పలేదు. తరువాత జరిగిన పరిణామాలు అభ్యుదయ రచయతల ఉద్యమానికి దారి తీసాయి.
1905 లో జన్మించిన రాషీద్ జహాన్ 1953 లో మాస్కో లో అండాశయ కాన్సర్ కి చికిత్స తీసుకుంటూ మరణించారు మాస్కోలో ఆమె సమాధి మీద “కమ్యూనిస్ట్ వైద్యురాలు ,రచయత్రి అని చెక్కి ఉంటుంది. ఆమె బతికి ఉంటే ఎన్నో అభ్యుదయ రచనలు తనదైన మార్క్సిస్ట్ దృక్పథం తో రచించేది. డా. రాషీద్ జహాన్ .. పుట్టిన తేదీ ఆగస్ట్ 25 న . ఆమే 120 జయంతి ఉస్తవాలు జరుగుతున్నాయి . ఇదే సమయంలో ఉదయిని వెబ్ పత్రికలో ఆమె అనువాద కథలు వరుసగా ఇస్తున్నాము .
***
Baavundi
డాక్టర్ రషీద్ జహాన్ రాసిన ‘ఢిల్లీ కి షికారు’ చక్కగా వుంది. ఆరోజుల్లోనే స్వేచ్ఛగా భావాలను వెల్లడించే కథలు రాసిన రచయిత్రికి హ్యాట్సాఫ్. డాక్టర్ గీతాంజలి గారు సరళ అనువాదం బాగుంది.
కుమార్ కూనపరాజు