అధ్యాయం-8
ఫిబ్రవరి విప్లవానికి ముందు యుద్ధరంగానికి నైరుతి దిశలో రిజర్వు కోసం ఉంచబడిన మొదటి బ్రిగేడ్ కి చెందిన ఒక పదాతి దళాన్ని; దానితో జోడించబడ్డ 27 వ డాన్ కొసాక్కు రెజిమెంటుని ఆ యుద్ధ భూమి నుండి వెనక్కి రమ్మని ఆజ్ఞ వచ్చింది. రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లను అణచడానికే వీరిని రమ్మని ఆజ్ఞ. ఆ బ్రిగేడ్ ని వెనక్కి రప్పించారు. వారికి ఆ చలికాలానికి నప్పే దుస్తులిచ్చారు,ఆ రోజు చక్కటి భోజనం పెట్టారు. తర్వాత వారిని రైళ్ళల్లో ఎక్కించి,మిన్స్క్ కి పంపించారు. కానీ కొన్ని ఘటనల వల్ల వారు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. వారు బయలుదేరే రోజు ఒక వదంతి షికారు చేసింది.అదేమిటంటే కమాండర్ -ఇన్-చీఫ్ కార్యాలయంలో చక్రవర్తి తన రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి సమ్మతి పలుకుతూ ఓ ఒప్పందంపై సంతకం చేశాడని.
సగం ప్రయాణమైనా చేయకముందే ఆ బ్రిగేడ్ వెనక్కి తిరగాల్సి వచ్చింది. రాజ్ గోన్ స్టేషన్ దగ్గర కొసాక్కులకు ఆగిపొమ్మని ఆజ్ఞ వచ్చింది. రైలు పట్టాలకు అడ్డంగా వ్యాన్లు పెట్టి ఉన్నాయి. తమ కోటుల మీద ఎర్ర రిబ్బన్లు ధరించి, భుజాలకు తుపాకీలు తగిలించుకుని రష్యా సైనికులు ప్లాట్ ఫారం మీద తిరుగుతూ ఉన్నారు. రైళ్ళ నుండి దిగిన కొసాక్కులను చూడగానే వారి ముఖాల్లో ఉద్విగ్నత చోటు చేసుకుంది.
ఆ రోజు ముసురు పట్టి ఉంది. ఆ స్టేషన్ భవనాల పై కప్పుల నుండి నీరు కారుతూ ఉంది; పట్టాల పక్కన నీటి మడుగుల్లో ఆకాశం ప్రతిబింబం మెరుస్తూ ఉంది. ఇంజన్ల కూతలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. కొసాక్కుల రెజిమెంటు గుర్రాలపై ఎక్కి, బ్రిగేడ్ కమాండర్ ని కలవడానికి వేర్ హౌస్ వెనక్కి వెళ్ళారు. గుర్రాల కాళ్ళు తడిసి ఉన్నాయి,కాకులు వెనుక నుండి అరుస్తూ ఉన్నాయి.
ఓ పొడుగైన నల్ల గుర్రం పైన బ్రిగేడ్ కమాండర్,కొసాక్కు రెజిమెంటు కమాండర్ తో కలిసి వచ్చాడు.అక్కడ ఉన్న దళాల్ని గమనిస్తూ,తత్తరపడుతూ,మాటల్లో వణుకుని కప్పి పుచ్చుతూ మాట్లాడసాగాడు.
‘కొసాక్కులారా! ప్రజల అభిష్టాన్ని గౌరవించి, ఇప్పటివరకు పాలించిన నికోలస్ చక్రవర్తి అధికారం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు డ్యూమా రాష్ట్రపు ప్రొవిజినల్ కమిటీ అధికారంలోకి వచ్చింది. సైన్యంలో భాగమైన మీరు ఈ వార్తను సంయమనంతో తీసుకోవాలి. బయటి దాడుల నుండి, అంటే బాహ్య శత్రువుల నుండి మాతృభూమిని రక్షించడమే కొసాక్కుల బాధ్యత. ఈ సందర్భంలో చెలరేగిన అస్థిరత్వం నుండి మనం విడిగా ఉంటూ,కొత్త ప్రభుత్వ విషయంలో నిర్ణయ స్వేచ్చను పౌరులకే వదిలేద్దాం. మనం వీటికి దూరంగా ఉండాలి!సైన్యం విషయానికి వస్తే, ‘యుద్ధం -రాజకీయం’ రెండు ఒకటే ఒరలో ఇమడలేవు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో మనం ఎంత దృఢంగా ఉండాలంటే….’ఎప్పుడూ ప్రసంగించడం అలవాటు లేని ఆ వృద్ధ జనరల్,ఆ పోలిక తట్టక చుట్టూ చూస్తూ ఉంటే, అతని కనుబొమ్మలు అదురుతూ,కోపంగా మారిపోయాయి. అక్కడ ఉన్నవారంతా మౌనంగా ఉన్నారు. ‘హా…ఉక్కంతా దృఢంగా ఉండాలి.కొసాక్కులుగా మీ అధికారుల ఆజ్ఞలను పాటించడం మీ బాధ్యత. మనం వీరోచితంగా ఇక్కడ శత్రువులతో ఎప్పటిలానే పోరాడదాం. ఇక అక్కడ డ్యూమాకే దేశ భవిష్యత్తును వదిలేద్దాం. ముందు మనం ఇక్కడ యుద్ధాన్ని పూర్తి చేసి, మన ఇళ్ళకు వెళ్ళిపోదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇళ్ళకు వెళ్ళలేము. మనం సైన్యాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేయకూడదు. సైన్యంలో రాజకీయాలకు తావు లేదు.’
అదే స్టేషన్ లో కొన్ని రోజుల తర్వాత కొసాక్కులు ప్రొవిజినల్ ప్రభుత్వానికి విధేయత ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు. సమావేశాలకు హాజరయ్యారు. తర్వాత తమ జిల్లాలకు చెందిన వారితో జట్లుగా ఏర్పడి, మిగిలినవారితో అంటీముట్టనట్టు ఉండేవారు. వారు విన్న ప్రసంగాలను గుర్తుకు తెచ్చుకుని,అందులో అనుమానాలని రేకెత్తించే వాటి గురించి గంటల తరబడి చర్చించుకునేవారు. చివరికి వారందరి మనసుల్లో స్వాతంత్ర్యం రావడమంటే యుద్ధం ముగిసిపోవడమే అన్న అభిప్రాయం బలపడిపోయింది. రష్యా కోసం చివరి వరకు యుద్ధం చేయడమే తమ కర్తవ్యంగా భావించే అధికారులకు ఈ అభిప్రాయం సవాలుగా మారింది.
జార్ పాలన ముగిసిపోవడంతో పై వర్గ అధికారుల్లో నెలకొని ఉన్న నిస్పృహ క్రింది స్థాయి వారిలో ప్రతిబింబించింది. ఆ విభాగపు ప్రధాన కార్యాలయమైతే అక్కడ ఒక బ్రిగేడ్ ఉందన్న స్పృహే లేకుండా పోయింది. అప్పటికే ఆ బ్రిగేడ్ సైనికులు తమకు పంపించిన రేషన్ అయిపోవడంతో, చుట్టుపక్కల గ్రామాలను,మార్కెట్లను దోచుకున్నారు.
ఈ బదిలీ వల్ల దినచర్య మారడంతో ,కొసాక్కులు అసహనంగా ఇంటికి వెళ్ళిపోయే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. వారు తమ గుర్రాలను కూడా పట్టించుకోవడం మానేసి, కూడలి దగ్గర ఉన్న మార్కెట్ దగ్గర తమకు యుద్ధంలో చిక్కిన వస్తువుల్లో అమ్మదగిన వాటిని అమ్ముకుంటున్నారు. జర్మన్ల దుప్పట్లు, బాకులు,కోట్లు,పొగాకు వాటిలో ఎక్కువగా ఉండేవి.
యుద్ధానికి తిరిగి రమ్మని వచ్చిన ఆజ్ఞను వారు బహిరంగంగానే వ్యతిరేకించారు. రెండవ దళం వారు యుద్దానికి వెళ్ళడానికి నిరాకరించి, రైలును కూడా కదలనివ్వలేదు. కానీ ఆ రెజిమెంటు కమాండర్ బెదిరింపులతో ఆ ప్రతిఘటన అక్కడితో ముగిసింది. మొత్తానికి రైళ్ళు యుద్ధ సరిహద్దులకు బయలుదేరాయి. ఆ ప్రయాణంలో సంభాషణలు ఇలా సాగాయి.
‘అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? స్వాతంత్య్రం వచ్చిందంటారు, కానీ యుద్ధం ఇంకా చేయాలంటారు, ఇంకా రక్తపాతం జరగాలంటారు?’
‘మళ్ళా మన నెత్తినే వేశారు ఈ బండను!’
‘అయితే ఇక జారును దింపి ప్రయోజనం ఏమిటి?’
‘ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లేనప్పుడు అలానే ఉంటాము.’
‘అవే దుస్తులు, కానీ రంగులు మారాయి అంతే.’
‘అవును, అంతే.’
‘ఇలా ఎంతకాలం?’
‘ఇంకో మూడేళ్ళ దాకా ఉండొచ్చు.’
ఆ తర్వాత కూడలి వద్ద కొసాక్కులు అధికారుల మాట లెక్కచేయకుండా బండి నుండి దిగేసి,రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక, అధికారులు వారిని తిరిగి బండిలోకి ఎక్కమని ప్రాధేయపడ్డారు. మూడవ దళానికి చెందిన ఒక సార్జంట్ ప్రసంగాన్ని కొసాక్కులు ఎంతో శ్రద్దగా విన్నారు. ఆ తర్వాత మాట్లాడాల్సింది పొట్టిగా ఉన్న కొసాక్కు, మాంజులోవ్. ఒక వైపుకి తిరిగి,తెల్లటి పెదాలతో ఉన్న అతని నోటి నుండి కోపోద్రిక్త మాటలు వెలువడ్డాయి.
‘కొసాక్కులారా! ఇది ఇలాగే సాగడానికి వీల్లేదు.మనల్ని మళ్ళీ రొచ్చులోకి లాగుతున్నారు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు విప్లవం వల్ల అందరికి స్వాతంత్య్రం వచ్చింది. వాళ్ళు ఇక్కడితో యుద్దాన్ని ముగించాలి ఎందుకంటే ఇక జనాలకు యుద్ధం అవసరం లేదు, అలాగే మనకి అవసరం లేదు. నేను సరిగ్గానే చెబుతున్నానా?’
‘నువ్వు చెప్పేది సరైనదే.’
‘అందరం యుద్ధంతో విసిగిపోయి ఉన్నాం.’
‘అసలు కదిలే ఓపికే లేకుండా పోయింది, ఇంకా యుద్ధం ఏం చేస్తాం?’
‘మాకు యుద్ధం వద్దు.’
‘ఇక ఇంటికి వెళ్ళిపోదాం.’
‘ఇక ఆ ఇంజన్ తీసెయ్యండి!ఫెడోట్, రా!’
కొసాక్కులారా!ఆగండి!సోదరులారా, ఒక్క నిమిషం ఆగండి! దయ్యాల్లారా,మీకు వినబడటం లేదా?’,ఆ వెయ్యి మంది గొంతుల్లో కలవకుండా ఉండేందుకు మంజులోవ్ గట్టిగా అరిచాడు.’ఆగండి!ఇంజన్ ని ముట్టుకోవద్దు!మనకు అది అవసరం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది జరిగిన మోసం గురించే…. రెజిమెంటు కమాండర్ ను పత్రం చూపించమని అడుగుదాము. మనల్ని నిజంగానే యుద్దానికి మళ్ళీ వెళ్ళమన్నారో లేకపోతే వీళ్ళ మోసమో తెలిసిపోతుంది.’
కమాండర్ వణుకుతున్న పెదవులతో ఆ విభాగపు కార్యాలయం నుండి వారిని యుద్దానికి రమ్మని వచ్చిన ఆజ్ఞను తెలిపే టెలిగ్రామ్ ను బయటకు గట్టిగా చదివి వినిపించేవరకు కూడా రెజిమెంటు బండి దగ్గరకు కదలలేదు.ఒక బోగిలో టాటర్ స్కై కి చెందిన ఆరుగురు ఉన్నారు, అందరూ 27 వ రెజిమెంటు వారే.వారిలో పెట్రో మెలఖోవ్, మైఖేల్ కొషివోయ్ బంధువైన నికోలాయ్ కొషివోయ్, అనికే, ఫెడోట్ బోడోవ్ స్కోవ్,రింగులు తిరిగిన నల్ల గడ్డంతో గోధుమ రంగు చిన్న కళ్ళతో జిప్సీ లా ఉన్న మెర్కులోవ్,కొర్షునోవ్ పొరుగువాడైన మాక్సిమ్ గ్రియాజ్ నోవ్ ఉన్నారు.యుద్దానికి వెళ్ళే ముందు ఊర్లో గుర్రాల దొంగగా పేరు పొందాడు మాక్సిమ్.’అసలు మెర్కులోవ్ చూడటానికి జిప్సీలా ఉంటాడు,అతను గుర్రాలను దొంగతనం చేయాలి, కానీ అతను ఏది దొంగిలించడు.కానీ మాక్సిమ్, నువ్వు మాత్రం గుర్రం తోక కనబడితే చాలు, దొంగతనానికి సిద్ధమైపోతావు!’అంటూ కొసాక్కులు అతన్ని చూసి పరిహాసలాడేవారు.’ఒక జిప్సీ మెర్కులోవ్ తల్లితో ఓ రాత్రి గడిపాడు. అది చూసి నా తల్లి యిర్ష్య పడి ఉంటుంది. లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు’, అంటూ దానికి అతను గట్టిగా బదులిచ్చేవాడు.
బండిలోకి చల్లటి గాలులు వీస్తున్నాయి. గుర్రాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆహార పాత్రల దగ్గర నిలబడి ఉన్నాయి. వాటి వీపుల మీద కంబళ్ళు ఉన్నాయి. ఏవో కట్టెలు బయట కాలుతూ ఉంటే ఆ పొగ తలుపు దగ్గర ఉన్న చిన్న రంద్రం నుండి లోపలికి వస్తూ ఉంది.కొసాక్కులు గుర్రపు జీన్ల పక్కన కూర్చుని,చలి మంట దగ్గర చెమట తేమతో ఉన్న సాక్స్ లు ఆరబెట్టుకుంటూ ఉన్నారు.ఫెడోట్ బోడోవస్కోవ్ తన కాళ్ళను ఆ మంట దగ్గరలో ఉంచి చలి కాచుకుంటున్నాడు.ఆ కాల్మక్ ముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు ఉంది. గ్రీజానోవ్ తన చిరిగిన బూటుని కుట్టుకుంటూ, ప్రత్యేకంగా ఎవర్ని ఉద్దేశించకుండా తనలో తానే గోణుక్కుంటున్నట్టు మాట్లాడాడు.
‘నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను స్టవ్ పక్కన ఉండే పడక మీద పడుకునేవాడిని. మా నాయనమ్మ (అప్పటికి ఆవిడ వయస్సు నూరేళ్ళ పైనే ఉండేది!) అప్పుడు నా తలలో పేలు చూస్తూ,’ఓ నా బుజ్జి బంగారమా! పూర్వకాలంలో ప్రజలకి ఇది నచ్చేది కాదు. వాళ్ళు ఎంతో క్రమబద్ధమైన జీవితం గడిపేవారు. వారికి ఏ ఇబ్బందులు ఉండేవి కావు.కానీ ఇప్పుడు చిన్నపిల్లవాడివిగా ఉన్న నువ్వు మాత్రం ఈ భూమి మొత్తం ఒక వైరుతో కట్టివేయబడి, ఇనుము లాంటి ముక్కులతో ఉండే పక్షులు పైన తిరుగుతూ, ఈ మనుషులను పొడుచుకుతినే రోజులు చూస్తావు. చావు, కరువు.. ఈ భూమి మీద విజృంభిస్తాయి. అన్నదమ్ములు కొట్టుకుంటారు, కొడుకు తండ్రికే ఎదురు తిరుగుతాడు…. కార్చిచ్చు తర్వాత గడ్డి ఏమి మిగలనట్టే మనుషులు కూడా ఉండకుండా పోతారు.” మాక్సిమ్ ఒక నిమిషం ఆగి, మళ్ళీ కొనసాగించాడు.’అదే సరిగ్గా జరిగింది. వాళ్ళు టెలిగ్రాఫ్ కనుగొన్నారు.ఇప్పుడు నీ కోసం వైరు వస్తుంది. ఇక ఆ ఇనుము ముక్కు పక్షులే విమానాలు. అవి మన పిల్లల్ని ఎందర్ని పొట్టన బెట్టుకోలేదు? అలాగే త్వరలో కరువు కూడా వస్తుంది. మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే మా వాళ్ళు సగం పంటే పండించగలుగుతున్నారు. దాదాపుగా రైతులందరిదీ అదే పరిస్థితి.ఇప్పుడు గ్రామాల్లో అసలైన మగవాళ్ళు లేరు ;ముసలివాళ్ళు,కుర్ర వాళ్ళు తప్ప. పంటలు పండకపోతే ‘కరువు’కూడా అనుభవంలోకి వస్తుంది.’
‘మరి సోదరులు ఒకరితో ఒకరు తగవు పడటం సంగతేమిటి. అది జరగలేదు కదా?’పెట్రో మెలఖోవ్ మంటలో చితుకులు వేస్తూ అన్నాడు.
‘అది కూడా జరుగుతుంది.’
‘వాళ్ళు ప్రభుత్వ విషయంలో ఏక నిర్ణయానికి రాలేరు. తర్వాత ఒకరితో ఒకరు గొడవ పడతారు’, ఫెడోట్ బోడోస్కోవ్ మధ్యలో వస్తూ అన్నాడు.
‘అయితే వారిని శాంతపరచాలి.’
‘అయితే నువ్వు ముందు జర్మన్లను శాంతపరిస్తే మంచిది’, కొషివోయ్ నవ్వుతూ అన్నాడు.
‘అది కూడా చేయొచ్చు అనుకో, కాకపోతే ఇంకొద్ది కాలం మనం యుద్ధం చేసే పరిస్థితిలోనే ఉన్నాము.’
అనికె ఎక్కడా రోమాలు లేకుండా అమ్మాయిలా సున్నితంగా ఉన్న తన ముఖాన్ని తడుముకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు, ‘కాళ్ళంతా జుట్టుతో ఉండే ఆ జారు భార్య నేతృత్వంలో మనం ఎంతకాలం యుద్ధం చేయగలం?’
‘నీ ముఖం మీద జుట్టు వచ్చేవరకు’, కొషివోయ్ నవ్వుతూ అన్నాడు.
అందరూ నవ్వారు. పెట్రో పొగ కాలుస్తూ, అనికె వైపే చూస్తూ ఉన్నాడు.
‘జుట్టు ఒక పనికిమాలిన విషయం. అది కొన్నిసార్లు ఎక్కడైతే పెరగకూడదో అక్కడే పెరుగుతుంది. నేనే నువ్వైతే అలా కాళ్ళు ఊపను, కొషివోయ్ ‘, అనికె అన్నాడు.
‘ఇక చాలు. మనం భరించాల్సిన దాని కన్నా ఎక్కువే భరించాము.ఇక్కడ మనం నరకం అనుభవిస్తూ ఉంటే అక్కడ మన కుటుంబాలు ఆకలితో ఉంటున్నాయి. ఇది ఎంత దుర్భరమైన పరిస్థితో తెలుసా? వాళ్ళను కోసినా రక్తం రాదు’, కోపంగా గ్రిజానోవ్ అడ్డుకుంటూ అన్నాడు.
‘ఇప్పుడు ఎందుకంత రెచ్చిపోతున్నావు ?’పెట్రో తన మీసాన్ని సవరించుకుంటూ అడిగాడు.
‘ఎందుకో అందరికి తెలుసు’, మెర్కులోవ్ గ్రిజానోవ్ బదులు సమాధానం అందుకుని,తన నవ్వుని తన జిప్సీ గడ్డం వెనుక దాచుకున్నాడు.’ప్రతి ఒక్కరికి తెలుసు, కొసాక్కులు యుద్ధంతో విసుగు చెందారని, ఇంటి మీద బెంగ పెట్టుకున్నారని… ఇది పశువుల కాపరి పశువులను మేపడానికి తీసుకువెళ్ళినట్టు ఉంది. సూర్యుడు ఆకాశంలో ఉన్నంత వరకు ఆ పశువులు పట్టించుకోవు, కానీ ఎప్పుడైతే సూర్యుడు మాయమవుతాడో, పురుగులు వాటిని కుడుతూ ఉంటాయో, అప్పుడే జరగాల్సింది జరుగుతుంది…’, మెర్కులోవ్ తన అనుచరుల వైపు, పెట్రో వైపు చూస్తూ కొనసాగించాడు.
‘అప్పుడు పశువులకు చిరాకొస్తుంది, సార్జెంట్ మేజర్!మీకు ఇదంతా తెలుసు. మీరేమి చేవ లేని వాళ్ళు కాదు.ఎన్నో ఎద్దుల పొగరు దించారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్క దూడ పిల్ల ఒక్క సారి అరిచి, అక్కడ నుండి దౌడు తీస్తుంది, అంతే మిగిలిన గుంపు అంతా దాన్నే అనుసరిస్తుంది. ఆ పశువుల కాపరి, వాటి వెంట బడి,’ఎక్కడికి వెళ్తున్నారు? ‘అని అడిగినా ఏం ప్రయోజనం? ఆ పశువుల పిచ్చి వేగాన్ని అతను అందుకోలేడు.’
‘ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?’
మెర్కులోవ్ ఒకేసారి బదులివ్వలేదు. నల్లగా ఉన్న తన గడ్డాన్ని వేళ్ళతో ముడి వేస్తూ, ప్రశాంతంగా అన్నాడు.
‘మనం ఇప్పటికే ఈ యుద్దాన్ని రెండేళ్ళ పైగా చేస్తూ ఉన్నాము. కందకాల్లో ఇది మనకు మూడో సంవత్సరం. ఎందుకో, ఎవరికీ తెలియదు.నేను చెప్పేదేమిటంటే గ్రిజ్ నోవ్ లేదా ఎవరో ఒక మెలకోవ్ ఇదే విసుగుతో ఇంటి వైపు పరుగులు తీస్తాడు, అతన్ని ముందు రెజిమెంటు తర్వాత సైన్యం కూడా అనుసరిస్తుంది… ఇప్పటి వరకు జరిగింది చాలు!’
‘అవును, అంతే!’
‘అదే నిజం! నేను గుడ్డివాడిని కాదు. గాలిలో దీపంలా ఉంది పరిస్థితి. ఊరికే ‘వెళ్ళిపోండి ‘అని అరిస్తే చాలు. అందరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. ఈ మూడవ యుద్ధ సంవత్సరంలో సూర్యుడు ఆకాశంలో చెట్ల వెనక్కి ఎప్పుడో వెళ్ళిపోయాడు.’
‘అంత ఆవేశపడకు!ఎంతైనా పెట్రో సార్జెంట్ మేజర్ అని తెలుసు కదా’, బోడోవస్కోవ్ సలహా ఇచ్చాడు.
‘నా సొంత వాళ్ళకు నేను ఎప్పుడూ హాని చేయలేదు’, పెట్రో కోపంగా అరిచాడు.
‘సరదాకి అన్నాను అంతే’, అన్నాడు సంజాయిషీగా బోడోవస్కోవ్.
ఒక మూల ఎండుగడ్డి ఉన్న వైపు ఒక కొసాక్కు బృందం కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో ఇద్దరు ఫాడెయవ్, కార్గిన్- కార్గిన్ స్కై గ్రామానికి చెందినవారు. మిగిలిన ఎనిమిది మంది ఇతర గ్రామాలకు, స్టానిట్సాల వాళ్ళు.
కాసేపయ్యాక వారు పాడటం మొదలుపెట్టారు. చిర్ నది ప్రాంతానికి చెందిన కొసాక్కు అయిన అలిమోవ్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. చక్కటి ఊపు వచ్చే పాట అతను అందుకోగానే, వెనుక నుండి ఒకరు గట్టిగా కొట్టి, అది కాదని అరిచారు.
‘ఓయ్!ఇక్కడ మంట దగ్గరకు రండి’, కొషివోయ్ వారిని పిలిచాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మంటలో కొన్ని చెక్క ముక్కలు వేస్తూ ఉత్సాహంగా పాటలు అందుకున్నారు.
చర్చి గేటు దగ్గర
ఒక యుద్ధ గుర్రం వేచి చూస్తూ ఉంది
ఒక ముసలి స్త్రీ మనవడి కోసం
ఒక పడచు స్త్రీ భర్త కోసం
విలపిస్తూ ఉన్నారు
అప్పుడే ఆ చర్చి తలుపు తెరుచుకుని
ఓ కొసాక్కు యుద్దానికి బయలుదేరుతున్నాడు
అతని భార్య పక్కన నిలబడి ఉంటే
మేనల్లుడు అతని కరవాలాన్ని పట్టుకుని ఉన్నాడు….
ఇంకో బండిలో కొందరు గుంపుగా నృత్యం చేస్తూ ఉన్నారు.ఎవరో ఒకరు బొంగురు గొంతుతో పాడుతూ ఉన్నాడు:
ఓ, ఎటువంటి బాధలు వచ్చి పడ్డాయి
జారుపాలనలో జీవితం దుర్భరమైంది
కొసాక్కుల మెడలు గాయాలతో నిండిపోయాయి
సజావుగా గాలి కూడా వారు పీల్చుకోలేకపోతున్నారు
పుగాచోవ్ డాన్ దేశం వైపుకి వచ్చాడు
పేదవాళ్ళను పిలిచాడు
‘అటామాన్ లారా , కొసాక్కులారా, రండి, నన్ను అనుసరించండి…’
ఈలోపు ఇంకో గొంతు ఇంకో పాట అందుకుంది:
విధేయత, విశ్వాసంతో జారుకి సేవ చేశాము
విరహంతో భార్యల కోసం తపించాము
పరాయి స్త్రీలను చూడమని ప్రతిజ్ఞ చేశాము
జారు మీద వేడి నూనె పోస్తాము
వేడి వేడి నూనె!
హో!హో!హో!
టాటార్ స్కై వాళ్ళు ఎప్పుడో తమ పాట ఆపేసి తర్వాతి బండిలో నుండి గట్టిగా వినిపిస్తున్న ఈ పాటను వింటూ తమలో తాము నవ్వుకుంటున్నారు. పెట్రో పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు.
‘వారి లోపల దెయ్యాలు ఉన్నాయి!’
గోధుమ రంగు కనుబొమ్మలతో, పచ్చగా ఉన్న కళ్ళతో మెర్కులోవ్ ముఖంలో సంతోషం తాండవించింది;అతను కూడా తన పాదాలను కదిలిస్తూ దానికి నృత్యం చేయసాగాడు. గుండ్రంగా చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ మధ్యలో కింద పడేలా ఉన్నా ఆపలేదు. అతన్ని చూసి మిగిలినవారు కూడా అందుకున్నారు. కాసేపట్లో అది బృందనృత్యంగా మారిపోయింది. తర్వాత కాసేపటికి ఆ పాట ఆగిపోయింది, దానికి బదులు వారి తిట్లు వినబడుతున్నాయి.
ఈ లోపు టాటార్ స్కై వాళ్ళు ఒకరికన్నా ఒకరు బాగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఆ ఊపులో అనికె హడావుడిలో మంట అంచులో పడిపోయాడు. నవ్వుతూనే అతన్ని పైకి లేపారు. అతని కొత్త ప్యాంటు కాళ్ళ దగ్గర వెనుక కాలిపోయింది. అలాగే అతని జాకెట్ పైన కూడా కాలి బొక్క పడింది.
‘నీ ప్యాంటు తీసేయ్ ‘, మెర్కులోవ్ జాలిగా అన్నాడు.
‘జిప్సీ, నీకేమైనా పిచ్చా? ఇది లేకపోతే నేను ఏం వేసుకోవాలి?’
మెర్కులోవ్ తన సామాన్ల సంచిలో అంతా వెతికి ఒక స్త్రీ పెట్టుకోటుని బయటకు తీసాడు. మరలా వాళ్ళు మంట వెలిగించారు. మెర్కులోవ్ ఆ పెట్టికోటు భుజాల దగ్గర ఉన్న పట్టీలను పట్టుకుని, నవ్వుతూ:
‘ఇదిగో నీ కొత్త ప్యాంటు!హా!హా!నేను ఒక స్టేషన్ కంచె దగ్గర దీన్ని తీసాను. నేను సాక్స్ ల బదులు ఇది వాడదాం అనుకున్నాను… ఇప్పుడు నేను దీన్ని చింపను… నువ్వు తీసుకో.. హా హా.’
వాళ్ళు అనికెని నవ్వుతూ అది వేసుకోమని బలవంతం చేస్తూ ఉంటే ఆ శబ్దాలకు పక్క బండి వారు కూతుహలంతో తలలు బయటకు పెట్టి చూస్తూ అడిగారు.
‘ఏం చేస్తున్నారు?’
‘దేని గురించి అరుస్తున్నారు?’
‘వాళ్ళకు ఓ కొత్త బొమ్మ దొరికినట్టుంది.’
తర్వాతి స్టేషన్ కు వచ్చేసరికి, మరలా ముందు బండిలో ఉన్న వారు ఉత్సాహంగా పాట అందుకున్నారు. మిగిలిన వాళ్ళు దానికి తగ్గ ఊపుతో డ్యాన్స్ చేశారు. వృత్తాకారంలో వారంతా ఉంటే ఒక మూల ఉండి, అనికె కూడా చేశాడు. ఆ తెల్ల పెట్టికోటుని తన కాళ్ళ చుట్టూ చుట్టుకున్నా, అది అతనికి పెద్దదయిపోయింది.అది ఊడిపోయేవరకు అతను వాళ్ళతో కలిసి గెంతుతూనే ఉన్నాడు.
రక్తంతో తడిసిన బైలోరష్యా వైపు ఆకాశంలోని నక్షత్రాలు దుఃఖంతో చూస్తున్నాయి. ఆ రాత్రి చీకటిలో కుళ్ళిన ఆకులతో కలిసిన మట్టి వాసన కలిసిపోయింది.
* * *
అధ్యాయం-9
ఇరవై నాలుగు గంటల సమయంలోనే రెజిమెంటు మరలా యుద్ధరంగాన్ని చేరడానికి సిద్ధమౌతోంది. సైన్యపు రైళ్ళు ఓ కూడలి దగ్గర ఆగాయి. సార్జెంట్ మేజర్ అందరినీ దిగమని ఆజ్ఞను జారీ చేశాడు. కంగారుగా కొసాక్కులు తమ గుర్రాలను కిందకి దింపి,వ్యానులో ఉన్న తమ వస్తువుల కోసం పరిగెత్తి, అక్కడ ఉన్న ఎండుగడ్డి కట్టల్ని కూడా కిందకి దింపారు.
ఆ రెజిమెంటు కమాండర్ దగ్గర ఉండే సహాయపు అధికారి పెట్రో మెలకోవును పిలిపించాడు.
‘స్టేషన్ కి వెళ్ళు, కమాండర్ నిన్ను చూడాలన్నారు.’
పెట్రో తన కోటు పైన ధరించిన బెల్టును సరిచేసుకుంటూ, నింపాదిగా బయలుదేరుతూ, అనికెకి తన గుర్రాన్ని చూస్తూ ఉండమని చెప్పాడు.
అనికె ఏం చెప్పలేదు.అతని ముఖంలో తోచనితనం, దిగులు కలిసిన భావం ప్రతిఫలించింది. పెట్రో బురద పట్టి ఉన్న తన బూట్ల వైపు చూస్తూ, ముందుకు నడుస్తూ, కమాండర్ తనని ఎందుకు కలవాలనుకుంటున్నాడో అన్నదాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. స్టేషన్ దగ్గర ఓ చిన్న గుంపు ఉంది. వారి మధ్యలో కొందరు వేడి నీటి పాత్రను పట్టుకుని ఉన్నారు. పెట్రో ఆలోచనలను ఆ సన్నివేశం మరల్చింది.అతను వారి దగ్గరకు నడిచి, అక్కడ వారి మాటలు వినడానికి ఆగాడు. ఎర్ర జుట్టుతో బలిష్టంగా ఉన్న ఓ కొసాక్కు చుట్టూ ఇరవై మంది గుమిగూడి ఉన్నారు. అతను ఆ పాత్రకి తన వీపు పెట్టి నిలుచుని ఉన్నాడు. పెట్రో అతన్ని చూడటానికి ముందుకు వంగాడు. పెద్ద గడ్డంతో ఉన్న ఆ కొసాక్కును ఎక్కడో చూసినట్టు అనిపించింది పెట్రోకి. అతను సార్జెంట్ కోటు ధరించాడు. భుజం దగ్గర ’52’సంఖ్య పట్టీ ఉంది. తను అంతకుముందు అతన్ని చూశానని నిర్ధారణకు వచ్చాడు పెట్రో.
‘ఏంటి ఇది? సార్జెంట్ దుస్తులు నీ ఒంటి మీద ఉన్నాయి!’అక్కడ ఉన్న ఒకడు కొసాక్కును పరిహాసంగా అడిగాడు.
‘ఇక్కడ ఏం జరుగుతోంది?’ తనకు దగ్గరలో నిలబడి ఉన్న ఓ వ్యక్తి భుజం మీద చేయి వేస్తూ అడిగాడు పెట్రో. ఆ వ్యక్తి పెట్రో వైపు తల తిప్పాడు.’ఎవడో పారిపోయి వచ్చినట్టున్నాడు. మీ కొసాక్కే’, అతను బదులిచ్చాడు.
బలిష్టంగా, పెద్ద గడ్డంతో, ఒత్తయిన కనుబొమ్మలతో ఉన్న అతన్ని ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకోవడానికి పెట్రో తన బుర్ర బద్ధలు కొట్టుకున్నాడు.పక్కన సహాయంగా నిలబడి ఉన్నవాడి మాటలు పట్టించుకోకుండా ఆ కొసాక్కు రాగి మగ్గులోని వేడి నీరు తాగి, అదే నీటిలో నల్లగా ఎండిపోయి ఉన్న బ్రెడ్డును ముంచుకుని తిన్నాడు.పెద్దగా ఉండి, సగం మూసుకుపోయి ఉన్నట్టు ఉన్న అతని కళ్ళు పక్కకు లేదా కిందకు మాత్రమే చూస్తున్నాయి. అతను నములుతున్నప్పుడు, మింగుతున్నప్పుడు అతని కనుబొమ్మలు కదులుతూ ఉన్నాయి. అతని పక్కనే పెద్ద వయసులో ఉన్న ఒక సైనికుడు తన తుపాకీతో, బాకుతో రక్షకుడిలా నిలబడి ఉన్నాడు. అతను ఆ మగ్గులో నీళ్ళను తాగేసి, అలసిపోయిన కళ్ళతో తన చుట్టూ ఉన్న సైనికుల వైపు చూశాడు. అతను గబగబా మింగేసి, పెదాలు తుడుచుకుని, ‘ఏంటి చూస్తున్నారు? కనీసం మనిషిని తిండి కూడా తిననివ్వరా? మీరెప్పుడూ మనిషిని చూడలేదా?’అంటూ గట్టిగా అరిచాడు.
వాళ్ళు పెట్రో ని చూసి నవ్వారు,అది వారికి మామూలే అన్నట్టు. అతని గొంతు వినగానే పెట్రో అతనెవరో గుర్తు తెచ్చుకున్నాడు. అతను యెలాన్ స్కాయా స్టానిట్సాలో ఉన్న రూబ్జిన్ గ్రామానికి చెందిన గార్డ్స్ మెన్ అతను.అతని పేరు ఫోమిన్. చాలా కాలం క్రితం, యుద్దానికి ముందు, యెలాన్ స్కాయా లో జరిగే వార్షిక పశువుల సంతలో పెట్రోతోనూ , అతని తండ్రి తోనూ ఒక మూడేళ్ళ ఎద్దు విషయంలో అతను గొడవపడ్డాడు.
‘ఫోమిన్! యాకోవ్!’ ఆ గుంపులో నుండి ముందుకు వెళ్తూ అరిచాడు పెట్రో.
ఆ గార్డ్స్ మాన్ ఆ మగ్గును పాత్రలో పెట్టేసి, ఇబ్బందికరంగా పెట్రో వైపు చూశాడు.
‘నేను నిన్ను గుర్తు పట్టలేదు.’
‘నువ్వు రుబ్జిన్ వాడివి కదా? “
‘అవును, నువ్వు కూడా అక్కడి వాడివేనా?’
‘నేను వ్యోషెన్ స్కాయా వాడిని. నాకు నువ్వు గుర్తున్నావు. ఐదేళ్ళ క్రితం మా నాన్న, నేను నీ నుండి ఒక ఎద్దును తీసుకున్నాము.’
అదే ఇబ్బంది పడుతూ, తప్పక నవ్వుతూ, అతను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.
‘ఏమో, అది నాకు గుర్తుకు రావడం లేదు’, అతను బదులిచ్చాడు.
‘నువ్వు 52 వ రేజిమెంటులో ఉన్నావా?’
‘అవును.’
‘అయితే నువ్వు పారిపోయి వచ్చావా? ఎందుకు?’
ఫోమిన్ తన టోపీ తీసి, అందులో చిరుగులతో ఉన్న చిన్న చేతి సంచి బయటకు తీశాడు. భుజాలు వంచుతూ, ఆ టోపీ చంకలో పెట్టుకుని, ఆ సంచిలోని సిగరెట్ కాగితాన్ని తీసి, సిగరెట్టు చుట్టుకుంటూ, పెట్రో వైపు చూస్తూ,’అక్కడ ఉండలేకపోయాను ‘, అని నెమ్మదిగా అన్నాడు.
ఆ చూపు పెట్రోని బలంగా తాకింది.
‘చాలు ఇంకా, మీ ఇద్దరు మాట్లాడుకోవడం అయిపోతే, ఇక వెళ్ళాలి మేము. లేకపోతే నేను చిక్కుల్లో పడతాను’, అతనికి రక్షణగా నిలబడ్డ సైనికుడు తన తుపాకీ పైకి ఎత్తి, ‘ఇక పద’, అన్నాడు అతనితో.
ఫోమిన్ వెంటనే ఆ మగ్గును తన సామాన్ల సంచిలో వేసుకుని ల, పెట్రోకి వీడ్కోలు చెప్పి, అతని వైపు చూడకుండా కమాండర్ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
పెట్రో స్టేషన్ దగ్గరకు వెళ్ళేసరికి రెజిమెంటు కమాండర్, దళాల కమాండర్లు ఒక బల్ల దగ్గర వంగి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
‘నువ్వు మమ్మల్ని చాలా సేపు వేచి చూసేలా చేశావు, మెలఖోవ్’, కల్నల్ అలసిపోయిన ముఖంతో చూస్తూ అన్నాడు.
ఆ విభాగపు ముఖ్యకార్యాలయం దగ్గర పెట్రో రెజిమెంటును ఉంచాల్సిందిగా,అలాగే కొసాక్కుల ప్రతి కదలిక పైన నిఘా ఉంచాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఆ దళపు కమాండర్ కు తెలియజేయాలని చెప్పారు. పెట్రో కల్నల్ ముఖంలోకి కళ్ళార్పకుండా చూస్తూ, శ్రద్ధతో వింటూ ఉన్నా,ఫోమిన్ అతని వైపు చూస్తూ,’అక్కడ ఉండలేకపోయాను’, అన్న మాటలు అతని మెదడులో నుండి పోలేదు.
అతను ఆ స్టేషన్ భవంతి నుండి బయటకు వచ్చి, దళం వైపు నడిచాడు. తన బండి దగ్గరకు వచ్చేసరికి పెట్రోకి కొందరు కొసాక్కులు, ఆ దళపు కంసాలి కనిపించారు. ఆ కంసాలిని చూడగానే పెట్రో మెదడులో నుండి ఫోమిన్ మాయమైపోయాడు, వెంటనే తన గుర్రపు బూట్లను బాగుంది చేయించాలన్న విషయం గుర్తుకు వచ్చింది. అతని మెదడు వెంటనే రోజువారి పనులు,ఆందోళనల వైపుకి మళ్ళింది. కానీ హఠాత్తుగా ఒక మూల నుండి ఒక స్త్రీ కనిపించింది.ఆమె ఒక అందమైన తెల్లటి మేలిముసుగు వేసుకుంది, ఆమె వస్త్రాధారణను బట్టి ఆమె ఆ ప్రాంతపు స్త్రీ కాదని తెలిసిపోతుంది. ఆమె శరీరపు రూపు రేఖలు పెట్రోకి ఆమె తనకు తెలిసిన వ్యక్తిలా అనిపించేలా చేశాయి. ఒక్కసారిగా ఆమె అతని వైపుకి తిరిగి, అటు నడిచింది.ఆమె ముఖం చూడకముందే ఆమె నడకను బట్టి తన భార్యను గుర్తించాడు. సంతోషంతో అతని మనసు ఉరకలు వేసింది. ఊహించకుండా ఆమె రావడం అతని సంతోషాన్ని అనేక రెట్లు చేసింది. ఆ సంతోషాన్ని తన దళం ముందు చూపించడం ఇష్టం లేక చాలా మాములుగా ఆమె వైపు నడిచాడు. ఎంతో హుందాగా భార్యను కౌగలించుకుని, మూడు సార్లు ముద్దు పెట్టి, ఆమెను ఏదో అడగాలనుకుని, అడగలేకపోయి, ఎలాగో చివరకు,’నువ్వు వస్తావని నేను అస్సలు ఊహించలేదు’, అన్నాడు.
‘ఓ నా ప్రియుడా! ఎంత మారిపోయావు నువ్వు!నాకు అపరిచితుడిలా అనిపిస్తున్నావు. చూడు,నేను నిన్ను చూడటానికి వచ్చాను. మన వాళ్ళు నన్ను రానివ్వలేదు. “నువ్వు అంత దూరం ఎలా వెళ్ళగలవు?”అని అడిగారు. కానీ నేను నా ప్రియమైన భర్తను ఎలాగైనా చూడాలనుకుని వచ్చేశాను’, ఆమె అతని కళ్ళలోకి చూస్తూ అన్నది.
గుంపుగా ఉన్న కొసాక్కులు కొందరూ పెట్రోని, అతని భార్యను చూసి వారిలో వారే ముసిముసిగా నవ్వుకున్నారు.
‘పెట్రో అదృష్టవంతుడు.’
‘నా పెళ్ళాం నా కోసం రానే రాదు. అది ఈపాటికి ఎవడో ఒకడితో ఉండే ఉంటుంది.’
‘ఒకడు లేకపోతే, పదిమంది ఉంటారు.’
‘మెలఖోవ్ ఈ రోజు అయినా చాలా సంతోషంగా ఉంటాడు. మన పరిస్థితి మాత్రం అదోలా ఉంది.’
‘రండ్రా, వెళదాం… ఆమె అతనితో ఉంటున్న తీరు చూస్తే నాకు యిర్ష్యగా ఉంది.’
ఆ క్షణంలో పెట్రో తన భార్యను శిక్షిద్దామని అనుకున్న సంగతి మర్చిపోయాడు. ఆమెను బహిరంగంగానే ముద్దు పెట్టుకుని,గట్టిగా కౌగలించుకున్నాడు.
దర్య కూడా రెండు రాత్రుల క్రితమే తాను రెజిమెంటు లో చేరడానికి బయలుదేరిన ఒక వైద్యుడితో పడుకున్న విషయం మర్చిపోయింది. అది రెండు రాత్రుల క్రిందటి విషయం… ఇప్పుడు ఆమె తన భర్తను చూస్తూ నిజాయితీగానే సంతోషం ప్రకటించింది.
* * *
అధ్యాయం-10
సెలవు పూర్తయిన తర్వాత మేజర్ యెవజిని లిస్ట్ నిట్ స్కీ ని 14 వ డాన్ కొసాక్కు రెజిమెంటుకి బదిలీ చేశారు. ఫిబ్రవరి విప్లవం తలెత్తకముందే అతను ముందు ఉన్న రెజిమెంటు నుండి బలవంతంగా పారిపోయే పరిస్థితులు ఏర్పడటంతో అతను సరాసరి ఆ విభాగపు ముఖ్య కార్యాలయానికి వెళ్ళాడు. డాన్ ప్రాంతపు వైభపు వర్గానికి చెందిన యువకుడే అక్కడ స్టాఫ్ చీఫ్ గా ఉన్నాడు. అతను వెంటనే ఆ బదిలీకి ఏర్పాటు చేశాడు.
‘మీరు మరలా మీ పూర్వపు వాతావరణంలో పని చేయడానికి ఇబ్బంది పడతారని నాకు తెలుసు,మేజర్’,అతను అంటూ యెవజినిని తన ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్ళాడు. కొసాక్కులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు,మీ పేరు వింటేనే మండిపడుతున్నారు. కనుక మీరు 14 వ రెజిమెంటుకు వెళ్ళడం తెలివైన పని. అందులోని అధికారులు ఎంతో మంచివారు,అలాగే ఆ రెజిమెంటులోని కొసాక్కులందరూ మన్ననా,మర్యాద తెలిసిన వారు. వారంతా దక్షిణ స్టానిట్సాలకు చెందిన ఉస్ట్ మెడ్వేదిత్సా జిల్లాకు చెందినవారు. మీకు అక్కడ బాగుంటుంది. మీరు నికోలాయ్ అలెక్సెయేవిచ్ లిస్ట్ నిట్ స్కీ గారి కొడుకు కదా?’అని ఆగి,దానికి యెవజిని అవునని బదులివ్వగానే మరలా తన సంభాషణను కొనసాగించాడు. ‘నా వరకు నేను మీ లాంటి గొప్ప అధికారులకు విలువ ఇస్తామన్న హామీ ఇవ్వగలను.ఇప్పుడు అధికారుల్లో కూడా ఎక్కువమంది ద్వంద్వ రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఒకరి నమ్మకాన్ని మార్చడం అంతా సులభమైన పని కూడా కాదు’, ఆ చీఫ్ కఠినంగా ఆ సంభాషణను ముగిస్తూ అన్నాడు.
లిస్ట్ నిట్ స్కీ సంతోషంగా ఆ బదిలీకి ఒప్పుకున్నాడు. అదే రోజు అతను 14 వ రెజిమెంటు ఉన్న ద్విన్స్క్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. 24 గంటలలోపు కల్నల్ బైకాడోరోవ్ కి రిపోర్ట్ చేశాడు,ఆ యువ అధికారి చెప్పింది నిజమే అయినందుకు లిస్ట్ నిట్ స్కీ సంతోషించాడు. అక్కడ ఉన్న అధికారుల్లో ఎక్కువమంది రాచరిక వ్యవస్థకు విధేయులు; అక్కడ మూడవ వంతు ఉన్న కొసాక్కులు పాత విశ్వాసాలకే కట్టుబడిన వారు. వారు ఉస్ట్ ఖోప్యోర్ స్కాయా, కుముల్జెన్ స్కాయా, గ్లాజునోవాస్కాయా,మరియు ఇతర స్టానిట్సాలకు చెందినవారు. వారికి విప్లవం పట్ల ఆసక్తి లేదు. వారి విధేయత ఇంకా రాచరిక వ్యవస్థ వైపే ఉంది. వారికి వారి చుట్టూ జరిగే విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. రెజిమెంట్లకు దాని కమిటీలకు నియమించబడినవారు వారి పనులకు మించి ఎక్కువ ఆలోచించనివారు. ఈ కొత్త వాతావరణంలో లిస్ట్ నిట్ స్కీ సంతోషంగా ఉన్నాడు.
అతను కలిసిన అధికారుల్లో ఇద్దరు అంతకుముందు అతనితో కలిసి అటామన్ రెజిమెంటులో పనిచేశారు. వారు అతనితో అంటీముట్టనట్టు ఉండేవారు. మిగిలిన వారు ఎంతో స్నేహంగా ఉండేవారు,బహిరంగంగానే రాచరిక వ్యవస్థ మరలా రావాలని ప్రకటించేవారు. ద్విన్స్క్ లో రెండు నెలలు గడిచేసరికి, రెజిమెంటు మొత్తం ఐకమత్యంగా తయారైంది. వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.ఈ రెజిమెంటుకి చెందిన కొన్ని పదాతి దళాలు మిలిటరీ విభాగాలతో కలిసి పని చేస్తున్నాయి. అవి ముందు రిగా నుండి ద్విన్స్క్ వరకు ఉన్న యుద్ధ సరిహద్దు ప్రాంతంలో గస్తీ తిరిగి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో కొసాక్కులు శిక్షణ తీసుకుంటున్నారు. వారి గుర్రాలను చూసుకుంటూ,శిక్షణలో భాగమవుతూ, బయటి ప్రభావాలకు దూరంగా ఉన్నారు.
అసలు ఆ రెజిమెంటుకి ఎందుకు శిక్షణ ఇస్తూ, సిద్ధం చేస్తున్నారో అన్న విషయం గురించి కొసాక్కులకు స్పష్టమైన అవగాహన లేదు,కానీ వారితో ఉన్న అధికారులు మాత్రం, ‘ఎంత కష్టపడినా చివరిలో ఏదో ఒకటి జరిగి,మొత్తం తిరగబడుతుంది ‘,అంటూ ఉండేవారు.
ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న యుద్ధ భూమిలో మాత్రం పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి.ఆయుధాల కొరత,సరైన తిండి కూడా లేదు.సైనికులు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శాంతి ఒప్పందం కోసం తపిస్తూ ఉన్నారు. తాత్కాలిక పాలన చేస్తూ ఉన్న కేర్నెస్కీ మీద సైన్యానికి మిశ్రమ అభిప్రాయాలు ఉన్నా, తప్పక యుద్ధంలో ముందుకు సాగుతూనే ఉన్నారు. వారి కోపం, విముఖత ఎడారిలో నీరులా ఇంకిపోతున్నాయి.
కానీ ద్విన్స్క్ లో మాత్రం కొసాక్కుల జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. వాళ్ళ గుర్రాలు చక్కటి పోషణతో ఉన్నాయి.క్రమక్రమంగా కొసాక్కులు యుద్ధంలో తాము అనుభవించిన కష్టాలను మర్చిపోసాగారు. అధికారులు వారి కోసం ఉన్న క్లబ్బులకు రోజూ వెళ్ళేవారు.వారు అక్కడ సుష్టుగా భోజనం చేసి, రష్యా భవిష్యత్తు గురించి గట్టిగా వాదులాడుకునేవారు.
జూలై వరకు అంతా ఇలానే కొనసాగింది. ఆ నెల మూడవ తారీఖున, ‘ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరండి యుద్ధానికి’,అన్న ఆజ్ఞ వచ్చింది. ఒక్కసారిగా ఆ దళం కోసం ఉన్న రైళ్ళు పెట్రోగ్రాడ్ వైపుకి దూసుకుపోయాయి. జూలై ఏడవ తారీఖున ఆ గుర్రపు డెక్కలు ఆ రాజధాని వీధుల్లో పరుగులు పెట్టాయి.
ఆ రెజిమెంటుకి నివాసం నేవ్స్కి అవెన్యూ దగ్గర ఇచ్చారు. లిస్ట్ నిట్ స్కీ దళం కోసం ఒక ఖాళీ భవంతిని ఇచ్చారు. కొసాక్కుల రాక కోసం వారు ఎదురుచూస్తున్నారన్న విషయం ఆ భవంతి విషయంలో వారు తీసుకున్న శ్రద్ధాసక్తులు చూస్తేనే తెలిసిపోతుంది. గోడలకు అప్పుడే సున్నాలు వేశారు, కింద గచ్చు అంతా శుభ్రం చేశారు,అది మెరుస్తూ ఉంది. కొత్తగా చేయించిన చెక్క పడకలు కూడా చూడముచ్చటగా ఉన్నాయి. కింద బేస్మెంట్ కూడా గజిబిజి లేకుండా ఉంది. తన కళ్ళద్దాల నుండి లిస్ట్ నిట్ స్కీ ఆ పరిసరాలను గమనిస్తున్నాడు. అతనికి ఎంతో సంతృప్తికరంగా అనిపించింది. అతను వాకిలి వైపుకి నడిచాడు. సిటీ కౌన్సిల్ పంపించిన ఒక అధికారి కూడా అతనితో ఉన్నాడు. అప్పుడే ఒక అసౌకర్యమైన ఘటన జరిగింది. అతను తలుపు హ్యాండిల్ పట్టుకున్నప్పుడు గోడ మీద ఒక పదునైన పరికరంతో ఒక బొమ్మ గీసినట్టు కనిపించింది. గుర్రుమంటున్న ఒక కుక్క తల,దాని నోటిలో ఒక చీపురు,ఆ బొమ్మ.ఆ భవంతిని అలకరించడానికి నియమించిన పనివాళ్ళలో ఎవరో ఒకరు అది చేసి ఉంటారని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది.
‘ఏంటి ఇది?’ కనుబొమ్మలు ముడి వేస్తూ,కోపంగా తనతో పాటు ఉన్న వ్యక్తిని అడిగాడు లిస్ట్ నిట్ స్కీ.
ఆ వ్యక్తి ఒక్కసారిగా తన ఎలుక లాంటి కళ్ళను ఆ బొమ్మ వైపు తిప్పాడు. అతని ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది,గంజి పెట్టి ఉన్న అతని చొక్కా కూడా ఒక్కసారిగా గులాబీ వర్ణాన్ని పులుముకుంది.
‘నన్ను క్షమించండి మేజర్ ,ఎవడో వెధవ చేసి ఉంటాడు …’
‘ఈ ఒపృంచ్నిక్ (ఒక కుక్క తల,చీపురు ,ఇవాన్ యొక్క భయంకరమైన అంగరక్షకుడైనఒపృంచ్నిక్ గుర్రపు జీనుకి కట్టి ఉండేవి. దాని అర్థం జారును,అతనికి సహకరిస్తున్న వారిని అంతం చేస్తాము అని చెప్పడం) చిహ్నం ఇక్కడ మీకు తెలియకుండానే ఎవరో గీశారని నేను అనుకుంటున్నాను.’
‘అవును!అదే నిజం. ఇదేదో బొల్షివిక్కుల పనిలా ఉంది. ఎవడో గుండా వెధవే ఈ పని చేసి ఉంటాడు. నేను ఇప్పుడే ఈ గోడను శుభ్రం చేయిస్తాను.దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది ఈ సంగతి. దయచేసి నన్ను క్షమించండి. ఎంత ఘోరమైన పని. ఈ పనికి నేను నిజంగా సిగ్గుపడుతున్నాను.’
లిస్ట్ నిట్ స్కీ కి అంత ఇబ్బంది పడుతూ క్షమాపణ చెప్తున్న అతన్ని చూస్తే జాలి కలిగింది. కొంత నెమ్మదిగా, కాస్త కఠినత్వం గొంతులో ఉట్టిపడేలా, ‘ ఈ బొమ్మ గీసిన కళాకారుడు ఒక్క విషయంలో సరిగ్గా అంచనా వేయలేదు. కొసాక్కులకు రష్యా చరిత్ర తెలియదు.అయినంతమాత్రాన ఇటువంటి చర్యలను మేము సహిస్తామని కాదు.’ ఆ వ్యక్తి తన చేతి వేళ్ళ గోర్లతో ఆ బొమ్మ మీద గట్టిగా గీశాడు,ఖరీదైన తన ఓవర్ కోటుతో దాని మీద రుద్దాడు.లిస్ట్ నిట్ స్కీ తన కళ్ళద్దాలను తుడుచుకుంటూ నవ్వుతూ నిలుచున్నాడు. కానీ అతని మనసులో ఓ మూల మాత్రం దీని గురించి అసంతృప్తి ఉంది.
‘అయితే ,ఈ రకంగా మాకు స్వాగతం పలుకుతారన్న మాట. ఇది మంచితనానికి ఇంకో వైపు అన్నమాట.రష్యాలో ఎవరూ మమ్మల్ని ఒపృంచ్నిక్ అనుచరులుగా భావించరు’, అని తనలో తాను అనుకుంటూ,వాకిట్లో నుండి గుర్రపు శాల వైపుకి నడుస్తూ,అన్యమనస్కంగా ఆ వ్యక్తి వెనుకే వస్తూ చెప్తున్న మాటలు విన్నాడు.
అక్కడ వాకిలి మధ్యలో ఉన్న బావిలోకి సూర్య కిరణాలు పడుతూ ఉన్నాయి. కొసాక్కులు తమ గుర్రాలను గుర్రపుశాలలో పెడుతుంటే చుట్టూ పక్కల ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కుతూహలంతో తమ కిటికీల నుండి చూడసాగారు.
‘నువ్వు లోపలికి వెళ్ళవచ్చు కదా?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘ఇంకా చాలా సమయం ఉంది,మేజర్.’
‘అవును చాలా సమయం ఉంది.’
‘అయితే ముందు గుర్రాల సంరక్షణ ఎలా ఉందో చూద్దాం.’
ఒకప్పుడు వేర్ హౌస్ గా ఉన్న దాన్ని గుర్రపుశాలగా మార్చారు. లిస్ట్ నిట్ స్కీ దాన్ని పరీక్షగా చూశాడు.
‘ఎవరిని కలిస్తే పని అవుతుందో వారిని కలిసి ఇక్కడ ఇంకో తలుపు ఉండేలా చూడు. 120 గుర్రాలను ఈ మూడు తలుపులు మాత్రమే ఉన్న చోట ఉంచలేము. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వాటిని బయటకు తీసుకురావడానికే అరగంట పైన పడుతుంది. ఇంతకుముందు వరకు ఈ విషయం గురించి ఆలోచించలేదు.నేను ఈ విషయాన్ని రెజిమెంటు కమాండర్ కు కూడా తెలియజేస్తాను.’
ఆ వ్యక్తి ఒకటి కాదు ఆ రోజే రెండు తలుపులు ఉండేలా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన తర్వాత లిస్ట్ నిట్ స్కీ అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అధికారులకి ఇచ్చిన క్వార్టర్స్ కి వెళ్ళాడు. అతను మెట్లు ఎక్కుతూ,చొక్క పై బొత్తాన్ని విప్పి, టోపీ కింద పట్టిన చెమట తుడుచుకుంటూ,చల్లగా ఉన్న ఆ ప్రదేశపు ఆహ్లాదాన్ని కాసేపు ఆస్వాదించాడు. ఆ గదిలో కెప్టెన్ అస్తార్చ్కోవ్ తప్ప ఎవరూ లేరు.
‘మిగిలిన వాళ్ళు ఎక్కడా?’లిస్ట్ నిట్ స్కీ అక్కడ ఉన్న పడక మీద కూలబడుతూ అడిగాడు.
‘పట్టణానికి వెళ్ళారు,పెట్రోగ్రాడ్ అందాలు చూడటానికి.’
‘నువ్వు ఎందుకు వెళ్ళలేదు?’
‘నాకు అది ఎందుకో అంత బాగా అనిపించదు, వచ్చీ రాగానే అలా హడావుడిగా పరుగులు పెట్టడం. ఈ సమయంలో ఈ మధ్య జరిగిన విషయాల గురించి చదివితే బాగుంటుందనిపించింది.’
లిస్ట్ నిట్ స్కీ ఆ చల్లటి గాలికి మేను వాల్చాడు. అతనికి పైకి లేచి స్నానం చేసి,బట్టలు ఉతుక్కోవాలన్నా బద్ధకంగా అనిపించింది. ప్రయాణపు బడలిక ఇంకా తగ్గలేదు. అతి కష్టం మీద లేచాడు . తన లోదుస్తులు మార్చుకుని,వాటిని ఉతుక్కుని, శుభ్రంగా స్నానం చేశాడు.
‘నువ్వు కూడా స్నానం చేయి. అలసట తగ్గుతుంది. బావుంటుంది. ఇంతకీ,ఏముంది పత్రికల్లో?’ లిస్ట్ నిట్ స్కీ అస్తార్చ్కోవ్ ని అడిగాడు.
‘కాసేపట్లో చేస్తాను. పత్రికల్లో ఏముందా? బొల్షివిక్కుల కార్యకలాపాల గురించి నివేదికలు,ప్రభుత్వ చర్యలు ……నువ్వు కూడా చదువు.’
స్నానం చేసి వచ్చిన లిస్ట్ నిట్ స్కీ పత్రికలు చదువుదామనుకునే లోపే రెజిమెంటు కమాండర్ ను కలవాల్సిందిగా పిలుపు వచ్చింది. దుస్తులు వేసుకుని,ఖడ్గం ధరించి,నేవ్స్కి కి బయలుదేరాడు. అతను ఆ వీధి దాటి, తమ క్వార్టర్స్ వైపుకి తిరిగి చూశాడు. బయటి నుండి చూస్తే,పక్కన ఉన్న భవంతుల్లో ఒకటిలానే కలిసిపోయింది. ఐదు అంతస్తులతో ,బూడిద రంగు రాళ్ళతో కట్టిన ఆ భవంతి ఆ వరుసలో ఒకదానిలా ఉంది. లిస్ట్ నిట్ స్కీ ఒక సిగరెట్టు వెలిగించుకుని,పేవుమెంటు మీద మెల్లగా వెళ్తూ చుట్టూ పరిసరాలను గమనిస్తున్నాడు. ఆడవాళ్ళ,మగవాళ్ళ టోపీలు అమ్ముతూ ఓ గుంపు అతన్ని దాటుకుంటూ వెళ్ళింది. సైన్యపు టోపీలు కూడా వాటి మధ్యలో చమక్కుమంటున్నాయి.
చల్లటి గాలి సముద్రం నుండి వీస్తూ, భవంతుల గోడల దగ్గర అడ్డుకోబడి,దారి మళ్ళీ ఎటు పడితే అటూ సాగిపోతూ ఉంది. ఆకాశంలో దక్షిణ దిశలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. పొగ,ఏవో వాయువుల వాసనలు కలిసిపోయి,ఆ పెద్ద పట్టణ వాతావరణాన్ని తనలో ఇముడ్చుకున్నట్టు ,ఆ గాలి తనతో కలుపుకుంటూ ముందుకు వీస్తోంది.
ఓ వైపు పొగ కాలుస్తూ,నింపాదిగా పేవుమెంటుకు కుడివైపున నడుస్తూ ఉంటే ,తనను దాటి వెళ్తున్నవారు గౌరవంగా తన వైపు చూస్తూ ఉండటం అతని దృష్టిలో పడింది. మొదట అతనికి మరకలతో ఉన్న తన చొక్కా,దుమ్ము పట్టిన టోపీ గుర్తుకు వచ్చి ఇబ్బందిగా అనిపించింది. కానీ వెంటనే అప్పుడే రైలు దిగి యుద్ధం చేయడానికి వచ్చిన సైనికుడు అయిన తను, చూడటానికి ఎలా ఉంటాడో అన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది.
ఆ పేవుమెంటుని ఆనుకుని ఉన్న షాపుల నీడల దాని మీద పడుతున్నాయి. అప్పటికే రాత్రి భోజనం సమయం దాటిపోయినా ఇంకా మనుషుల రద్దీ బాగానే ఉంది ఆ వీధుల్లో. యుద్ధంలో సంవత్సరాల తరబడి గడపటం వల్ల పట్టణ జీవితానికి దూరంగా ఉండిపోయిన లిస్ట్ నిట్ స్కీ ఆ హడావుడి వాతావరణంలో అరుపుల మధ్య ఓ మద్యం దుకాణంలో తాగడం గొప్ప తృప్తినిచ్చింది. అతనికి అక్కడ వాతావరణం తనకు చెందిందే అనిపించింది. చక్కటి దుస్తులతో,నిండిన కడుపులతో ,సంతోషంగా కనిపిస్తున్న వారిని చూస్తూ లిస్ట్ నిట్ స్కీ తనలో తానే, ‘మీరు అంతా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు? ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఎలా ఉన్నారు? ఇదే వీధుల్లోకి శత్రు సైన్యం వచ్చినప్పుడు మీ మనసుల్లో ఏముంది? నిజం చెప్పాలంటే,మిమ్మల్ని చూస్తూ ఉంటే సంతోషంగానూ,బాధగానూ కూడా ఉంది.ఎంతకాలం మీ ఈ సంతోషం ఇలానే ఉంటుందో నేను కూడా ఊహించలేను’,అనుకున్నాడు.
కాసేపు తను అలా ఆలోచించడానికి గల కారణాలను అతను విశ్లేషించుకున్నాడు.తను ఎక్కువకాలం యుద్ధం చేస్తూ ఉండటం,అక్కడి భీభత్స నేపథ్యం చూసి ఉండటమే ఇప్పటి తన ఆలోచనలకు కారణమని అతను నిర్ధారించుకున్నాడు.
‘అక్కడ లావుగా ,బొద్ధుగా ఉన్న ఆ కుర్రవాడు ఎందుకు యుద్ధంలో పాల్గొనలేదు?బహుశా అతను ఏ ధనవంతుడి కొడుకో లేకపోతే ఏ ఫ్యాక్టరీ యజమాని కొడుకో అయ్యి ఉంటాడు.అందుకే సైన్యంలో జేరకుండా తప్పించుకుని ఉంటాడు. ఆ వెధవకి అసలు దేశం గురించి పట్టింపే లేదు.వాడు అసలు ఈపాటికి దేశం కోసం యుద్ధం చేస్తూ ఉండాలి.కానీ వాడేమో ఇక్కడ బలుస్తూ,ప్రేమ లో మునిగి తేలుతున్నాడు’,ఎర్ర బుగ్గలతో లావుగా ఉన్న ఒక యువకుడిని చూసి లిస్ట్ నిట్ స్కీ అనుకున్నాడు.
‘మరి ఆపద సంభవిస్తే నువ్వు ఎవరితో ఉంటావు?’అతను తనను తానే నవ్వుకుంటూ ప్రశ్నించుకున్నాడు. ‘తప్పక వీరి పక్కనే ఉంటాను. వాళ్ళు నాలో ఒక భాగం,నేను వారిలో ఒక భాగం. వారిలో ఉన్న మంచి,చెడు నాలో కూడా కొంత వరకు ఉన్నాయి. అక్కడ ఉన్న ఆ బలిసిన వాడిలా నా చర్మం మందంగా ఉండకపోవడం వల్ల ,నేను ప్రతి దానిని చూసి ఎక్కువ స్పందిస్తూ,బాధ పడుతూ ఉన్నాను. అందువల్లే అనుకుంటా పోయిన చలికాలంలో చక్రవర్తి దుఃఖంతో పదవీభ్రష్టుడై తన కారులో వెళ్ళిపోతూ ఉంటే ,నేను మంచులో కింద కూలబడి చిన్నపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను. అవును,నేను ఎప్పటికీ విప్లవాన్ని ఒప్పుకొను,ఒప్పుకోలేను.నా మెదడు,మనసు రెండు కూడా దానికి వ్యతిరేకమే. పాత కాలపు రోజుల కోసం నేను ఏ ఆలోచనా లేకుండా నా ప్రాణాల్ని కూడా ఇవ్వగలను. కానీ నాలా ఉన్నవారు ఎంతమంది ఉంటారు?’
ఆ సమయంలో అతనికి ఫిబ్రవరిలో మొగిల్యోవ్ లో ఉన్న గవర్నర్ ఇంటి దగ్గర సైనికులు,అధికారులు ,పౌరులు గుంపుగా ఉండటం గుర్తుకు వచ్చింది. జారు బాధపడుతూ మోకాళ్ళ మీద కూలబడటం,కారులో కూర్చోవడం ,నిస్సహాయంగా ఉండటం అతని మదిలో నుండి పోవడం లేదు. ఈ జ్ఞాపకాల మధ్యనే అతను పరిగెత్తుకుంటూ తిరిగి తన క్వార్టర్స్ వైపు వెళ్ళాడు.
లిస్ట్ నిట్ స్కీ మెల్లగా ఆ భవంతి మెట్లు ఎక్కాడు.అతని పెదవులు వణుకుతూ ఉన్నాయి .కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. మొదటి అంతస్తుకి రాగానే అతను గబగబా రెండు సిగరెట్లు వెలిగించుకున్నాడు,తన కళ్ళు తుడుచుకుని ,వేగంగా మెట్లెక్కి పై అంతస్తులకు వెళ్ళాడు.
అ రెజిమెంటు కమాండర్ ఒక మ్యాపు మీద పెట్రోగ్రాడ్ జిల్లాలో ఎక్కడైతే లిస్ట్ నిట్ స్కీ దళం ప్రభుత్వ కార్యాలయాలకు పహరా కాయాలో వాటిని గుర్తు పెట్టి, ఒక నిమిషం పాటు ఏ సమయాల్లో సెంట్రీ డ్యూటీలకు వెళ్ళాలో చెప్పాడు.
ఆఖర్లో, ‘కేరెన్స్కి కోసం..’అన్నాడు.
‘నా దగ్గర అతని గురించి మాట్లాడొద్దు!’ఆ మాటలు అంటుంటే లిస్ట్ నిట్ స్కీ ముఖం పాలిపోయింది.
‘యెవజిని నికోలోయేవిచ్,కాస్త సంభాళించుకుని ఉండు.’
‘కల్నల్,దయ చేసి ..’
‘కానీ …’
‘మిమ్మల్ని వేడుకుంటున్నాను.’
‘నీ ఇష్టం ..’
‘అయితే పులిటోవ్ వీధులకు ఇప్పుడే పహారాకీ పంపించమంటారా?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘అవును,వెంటనే పంపించు,కానీ వారితో తప్పక ఆ దళ అధికారి కూడా ఉండాలి’,అన్నాడు ఆ కల్నల్.
పాత జ్ఞాపకాల బరువుతో భారంగా అక్కడి నుండి బయటకు వచ్చాడు లిస్ట్ నిట్ స్కీ. అతను తన క్వార్టర్స్ కు వచ్చేసరికి అదే పెట్రోగ్రాడ్ కు రప్పించిన 4 వ రెజిమెంటులోని ఒక కొసాక్కు అతనికి కనబడ్డాడు. ‘మన మాతృభూమి కోసం!’అంటూ అతను అరుస్తూ,తన వెనుకే వస్తున్న తన దళాన్ని పహరాకు ఉత్సాహపరిచాడు. లిస్ట్ నిట్ స్కీ వారిని చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు.
* * *
అధ్యాయం-11
నైరుతి దిశలో ఉన్న యుద్ధ సరిహద్దు విభాగాలకు జనరల్ కొర్నిలోవ్ ను కమాండర్-ఇన్-చీఫ్ గా నియమించడాన్ని 14 వ రెజిమెంటు అధికారులు హర్షంతో స్వాగతించారు. కొర్నిలోవ్ ప్రేమించదగినవాడని, ధృఢమైన వ్యక్తిత్వం కలవాడని, ప్రొవిజనల్ గవర్నమెంటు వచ్చిన ఈ సందర్భంలో దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుండి అతడు కాపాడగలడని వారు అనుకోసాగారు.
లిస్ట్ నిట్ స్కీ కి ఈ నియామకం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దళాలకు చెందిన జూనియర్ అధికారుల నుండి, తనకు తెలిసిన కొసాక్కుల నుండి ఈ విషయం పట్ల కొసాక్కుల స్పందన ఎలా ఉందో అతను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి వారి నుండి వచ్చిన సమాచారం పెద్ద ప్రోత్సాహకరంగా లేదు. కొసాక్కులు కొందరు మౌనంగా ఉంటే మరికొందరు నిర్లిప్తంగా స్పందించారు:
‘మనకి ఎవరూ వచ్చినా ఒకటే.’
‘ఇతను ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు!’
‘ఒకవేళ ఇతనైనా శాంతి కోసం ఏదైనా చేస్తే ,అప్పుడు…’
‘అతనికి ఈ పదోన్నతి రావడం వల్ల మన పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి.’
కొన్ని రోజుల తర్వాత సామాన్య జనంలోనూ, మిలిటరీ విభాగంతో సత్సంబంధాలు ఉన్న అధికారుల మధ్య ఒక పుకారు షికారు చేసింది.కొర్నిలోవ్ ప్రొవిజినల్ ప్రభుత్వాన్ని యుద్ధ ప్రాంతాల్లో మరణ శిక్షను అమలు చేయమని ఒత్తిడి తీసుకువస్తున్నాడని, దానితో పాటు ఇంకెన్నో చర్యలు తీసుకునేలా చేయడానికి అతను తొందర పెడుతున్నాడని.కెరెన్ స్కీ కి కొర్నోలోవ్ అంటే భయమని, ఏదో ఒకటి చేసి, కొంత చెప్పింది వినే అధికారిని అతని బదులు కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించే ప్రయత్నంలో ఉన్నాడని కూడా కొందరు అనుకోసాగారు. మిలిటరిలో అందరికీ తెలిసిన అనేక జనరల్స్ పేర్లు పరిగణనలో ఉన్నట్టు కూడా వదంతులు వ్యాపించాయి.
జూలై 19 న ప్రభుత్వం కొర్నిలోవ్ ను సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ గా నియమిస్తున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అస్తార్శ్చికోవ్ అనే కెప్టెన్ కు ముఖ్య అధికారుల అసోసియేషన్లతో ఉన్న సత్సంబంధాల వల్ల తెలుసుకున్న విషయాలను కూడా తనకు తెలిసిన వారి దగ్గర చెప్పాడు. కొర్నిలోవ్ ప్రొవిజినల్ ప్రభుత్వం అమలు చేయాల్సిన పనుల గురించి ఒక మెమరాండం తయారు చేశాడని; దేశం అంతా పౌరులకు, మిలిటరీ సిబ్బందికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఉదృతం చేయాలని, మరణ శిక్ష విదించే అధికారం కూడా సైన్యానికి ఉండాలని; మిలిటరీ అధికారులకు క్రమశిక్షణ చర్యల్లో కఠినంగా ఉండే అధికారం ఇవ్వాలని, సైనికులు-నావికులు కలిసి నిర్వహిస్తున్న సమావేశాల మీద నిఘా పెట్టాలని,ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పాడు అతను చెప్పాడు. ఆ సాయంత్రం లిస్ట్ నిట్ స్కీ తన దళ,పక్క దళ అధికారులతో ఆ పరిస్థితి గురించి చర్చించి, వారిని ఒకటే ప్రశ్న సూటిగా అడిగాడు, ‘మీరు ఎవరి వైపు ఉన్నారు?’
‘సోదరులారా!’తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ అతను మొదలుపెట్టాడు. ‘మనమంతా ఒకటే కుటుంబం. మనమందరం ఒకరికొకరం బాగా తెలుసు కానీ కొన్ని సందేహాలు ఇప్పుడే పటాపంచలైపోవాలి. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సుప్రీం కమాండర్ ,ప్రభుత్వం రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉన్నప్పుడూ,మనం ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. మనం ఎవరితో ఉండాలి?ఎవరికి మనం అండగా ఉండాలి? కనుక ఈ విషయం గురించి మిత్రుత్వంతో మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాము.’
కెప్టెన్ అస్తార్శ్చికోవ్ అందరికంటే ముందు తన అభిప్రాయం చెప్పాడు.
‘జనరల్ కొర్నిలోవ్ కోసం నేను నా రక్తాన్ని కూడా చిందిస్తాను,అవసరమైతే ఇంకొకరిది చిందించడానికి కూడా వెనుకాడను. అతను నిజాయితీ కలవాడు,అతనొక్కడే ఈ రష్యాను మరలా నిలబెట్టగలడు. అతను సైన్యంలో ఏం చేస్తున్నాడో చూడండి! ఈ రోజు సైన్యంలో కమాండర్స్ కి కొంత స్వేచ్చ ఉందంటే అది అతని వల్లే,దానికి మనం అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనల్ని అందరూ వేధించినవారే. ఇంకా ఇందులో ప్రశ్నేముంది? అందరం అతనికే అండగా నిలబడాలి.’
సన్నటి కాళ్ళతో,పీల శరీరంతో ఉన్న అస్తార్శ్చికోవ్ తన అభిప్రాయాన్ని దృఢంగా చెప్పాడు. చూస్తూ ఉంటే అతనికి ఈ విషయం వ్యక్తిగతమేమో అని కూడా అనిపించింది. అతను తను చెప్పాల్సింది చెప్పాక,సిగరెట్ పీకతో సిగరెట్ పెట్టెను కొడుతూ, బల్ల దగ్గర గుండ్రంగా కూర్చుని ఉన్న అధికారుల వైపు చూశాడు. అతని కుడి కన్నురెప్ప కింద ఒక గింజ పరిమాణంలో ఒక పుట్టుమచ్చ గోధుమరంగులో ఉంది.అందువల్ల అతను తన పై కనురెప్పను సరిగ్గా మూయలేడు. అందువల్ల అతను తమ వైపే చూస్తున్నాడని, చూసేవాళ్ళు అనుకుంటారు.
‘మేము బొల్షివిక్కులు, కెరెన్ స్కీ, కొర్నిలోవ్ ల మధ్య ఎన్నుకోవాల్సి వస్తే ,సహజంగానే కొర్నిలోవ్ వైపే ఉంటాము.’
‘అసలు కొర్నిలోవ్ కి ఏమి కావాలో తెలుసుకోవడం కష్టం. నిజంగా అతను రష్యాలో మామూలు పరిస్థితులు నెలకొల్పడానికే ఇదంతా చేస్తున్నాడా లేకపోతే అతని మనసులో ఇంకేమైనా ఉందా?’
‘అతని సిద్ధాంతాల గురించి ప్రశ్నలే అక్కర్లేదు.’
‘అవును.’
‘ఒకవేళ అదే సమాధానమైతే,అది తెలివైన జవాబు కాదు.’
‘లూయీటెంట్ మీరు దేనికి భయపడుతున్నారు?మరలా రాచరిక వ్యవస్థ వస్తుందనా?’
‘నాకు అదంటే భయం లేదు,నిజానికి నేను దాన్నే కోరుకుంటున్నాను.’
‘మరి సమస్య ఏమిటి?’
‘సోదరులారా!’ గతంలో సార్జెంట్ మేజర్ గా పని చేసి, తన సాహసాల వల్ల కార్నెట్ గా పదోన్నతి పొందిన దొల్గోవ్ ,కంచు లాంటి కంఠంతో మొదలుపెట్టాడు. ‘అసలు ఈ వాదన అంతా ఎందుకు? అసలు మన కొసాక్కులు అందరూ తల్లి కొంగు వదలని పిల్లల వలె కొర్నిలోవ్ నే అంటిపెట్టుకుని ఉండాలని సూటిగా చెప్పొచ్చు కదా!నేను దీన్ని డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్తున్నా. ఒకవేళ అతన్ని వదిలేస్తే మన పని అయిపోయినట్టే. రష్యా మనల్ని తరిమితరిమి కొడుతుంది.అతని వెంటే మనం కూడా,అంతే.’
‘ఇది మాట్లాడాల్సిన పద్ధతి.’
అస్తార్శ్చికోవ్ అతని భుజాన్ని తడుతూ, నవ్వుతూ లిస్ట్ నిట్ స్కీ వైపు చూశాడు. లిస్ట్ నిట్ స్కీ కోపాన్ని లోపాలే అణుచుకుంటూ పైకి నవ్వాడు.
‘సరే,సోదరులారా, మనం కార్నిలోవ్ తో ఉన్నట్టే కదా?’ అస్తార్శ్చికోవ్ గట్టిగా అడిగాడు.
‘అవును.’
‘అందరం అతనితోనే ఉన్నాము.’
‘మేము అతనితోనే ఉన్నాము.’
‘మన ప్రియమైన కొసాక్కు ,గొప్ప నాయకుడు అయిన లావ్ర్ జార్జియోవిచ్ కార్నిలోవ్ కోసం,హిప్ ,హిప్ ,హుర్రే!’
అక్కడ ఉన్న అధికారులందరూ టీ తాగుతూ,నవ్వుతూ,గ్లాసులతో శబ్దం చేస్తూ ఆమోదం తెలియజేశారు. అప్పటివరకూ ఉన్న ఉద్రిక్తత తొలగిపోవడంతో అందరూ రోజువారీ విషయాల గురించి మాట్లాడుకోసాగారు.
‘సరే,మనమందరం కూడా సుప్రీం కమాండర్ వైపే ఉన్నాము,కానీ కొసాక్కులు మాత్రం ఈ విషయంలో ఊగిసలాడుతున్నారు ‘,దొగ్లోవ్ సందేహిస్తూనే అన్నాడు.
‘ఊగిసలాడుతున్నారా?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘అవును,అందులో సందేహమే లేదు. వాళ్ళకు ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోవాలని ఉంది,భార్యలతో ఉండాలని ఉంది. ఇక్కడ ఉండాలంటే ఆ వెధవలకు ఇష్టంగా లేదు.’
‘కొసాక్కులను ఉత్సాహపరచడం మన బాధ్యత’, లూయీటెంట్ చెర్నోకుటొవ్ బల్ల మీద గట్టిగా గుద్దుతూ అన్నాడు. ‘అవును,అందుకే అధికారులుగా మనం ఉంది.’
‘కొసాక్కులకు ఓపికగా వారు ఎవరితో ఉండాలో వివరించాలి.’
లిస్ట్ నిట్ స్కీ ఒక చెంచాతో తన చేతిలో ఉన్న గ్లాసు మీద కొడుతూ అందరి దృష్టిని ఆకర్షించి,తను ఆ విషయం గురించి తను అనుకుంటున్నది చెప్పాడు. ‘సోదరులారా,అస్తార్శ్చికోవ్ చెప్పినట్టు కొసాక్కులకు ఓపికగా వివరించడం మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఆ సమావేశాల బంధాల నుండి వారిని విడిపించాలి. ఫిబ్రవరిలో జరిగిన తిరుగుబాటు వారిలో వచ్చిన మార్పుల వల్ల కూడా అని మనం లోతుగా గమనిస్తే అర్ధమవుతుంది. పూర్వపు రోజుల్లో అంటే 1916 లో అయితే నేను ఒక కొసాక్కు ముఖం మీద గట్టిగా గుద్ది కూడా యుద్ధంలో మళ్ళీ అతను నాకే రక్షణగా ఉండేలా చూసుకోగలను. కానీ ఫిబ్రవరి నుండి పరిస్థితులు మారిపోయాయి. నేను అలాగే ఇప్పుడు చేస్తే ఏ కందకాల్లోనో వాళ్ళు నన్ను హత్య చేసినా ఆశ్చర్యం లేదు. వారు అవకాశం కూడా ఎదురుచూడరు. ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. మనం కొసాక్కులతో సన్నిహితంగా మెలగాలి. దాని మీదే ప్రతిది ఆధారపడి ఉంటుంది. అసలు ఇప్పుడు మొదటి,నాలుగు రెజిమెంట్లలో ఏం జరుతుందో మీకు తెలుసా?’
‘దిగ్భ్రాంతి కలిగించేవే జరుగుతున్నాయి.’
‘అవును,అది దిగ్భ్రాంతి కలిగించేదే’, లిస్ట్ నిట్ స్కీ కొనసాగిస్తూ అన్నాడు. ‘అక్కడ ఉన్న అధికారులు కొసాక్కులను తమలో కలుపుకోకుండా దూరం పెట్టారు.దానితో అక్కడ కొసాక్కులందరూ బొల్షివిక్కుల ప్రభావంలో పడిపోయి,వారిలో తొంభై శాతం మంది బొల్షివిక్కులుగా మారిపోయారు. ఎన్నో ప్రమాదకరమైనవి జరగబోతున్నాయి అని చెప్పే హెచ్చరికలే జూలై 3,5 న జరిగినవి. భవిష్యత్తు బావుంటుంది అనుకునేవారికి వారికి అవి ప్రమాద సూచికలు.ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న విప్లవ దళాలతో మనం కొర్నిలోవ్ తో కలిసి యుద్ధం చేయాలి. లేకపోతే ఈ బొల్షివిక్కులు ఇంకా తమ బలాన్ని పెంచుకుని ఇంకో విప్లవాన్ని సృష్టిస్తారు. వాళ్ళు మనకి ఇప్పుడు కొంత సమయం ఇచ్చారు,ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే పరిస్థితులు చేజారిపోతాయి. అది జరగకుండా మనం చూసుకోవాలి.ఆ పరిస్థితుల్లో మనకు నమ్మదగిన కొసాక్కులు చాలా ఉపయోగపడతారు.’
‘కొసాక్కులు లేకుండా మనం పనికిరాము’, దొగ్లోవ్ గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు.
‘అది నిజం,లిస్ట్ నిట్ స్కీ.’
‘నిజమే.’
‘రష్యా పాదం ఒకటి శ్మశానంలోనే ఉంది.’
‘మాకు ఇదంతా తెలియదనుకుంటున్నావా? కానీ కొన్నిసార్లు ఏమి చేయలేకుండా ఉన్నాము. మొదటి ఆర్డర్ (విప్లవ దళాల ఒత్తిడి మీద పెట్రోగ్రాడ్ సోవియట్ రాచరిక వ్యవస్థ అధికారం మీద,ఆజ్ఞల మీద నిఘా పెట్టడానికి ఒక ఎన్నుకోబడిన సంస్థ ఉండటానికి అనుమతి ఇచ్చింది )వల్ల, ఒకోపాన్యా ప్రావ్డా (బొల్షివిక్కు వార్తాపత్రిక)వల్లా ఏమి చేయలేకుండా ఉన్నాము.’
‘వాటిని కాల్చి తగలబెట్టక నుంచుని పొగుడుతూ ఉన్నాము ‘, అస్తార్శ్చికోవ్ అరుస్తూ అన్నాడు.
‘వాటిని ఎవరూ మెచ్చుకోవడం లేదు.మనకి ఆ విషయంలో ఏ అధికారము లేదు.’
‘లేదు,కార్నెట్ !మనం చేతకాని వాళ్ళం అంతే.’
‘అది నిజం కాదు.’
‘అయితే నిరూపించండి.’
‘కాసేపు నిశ్శబ్దంగా ఉండండి.’
‘వాళ్ళు ప్రావ్డా కార్యాలయం ధ్వంసం చేశారు. ఆలస్యంగా స్పందించడంలో కేర్నెస్కీ సిద్ధహస్తుడు.’
‘ఆగండి …ఇదేమైనా మార్కెట్టా?అందరూ ఒకేసారి అరవకండి.’
ఆ అరుపులు మెల్లగా సద్దు మణిగాయి. అందులో ఒక కమాండర్ లిస్ట్ నిట్ స్కీ చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అతను కల్పించుకుని, ‘ మేజర్ లిస్ట్ నిట్ స్కీ చెప్పాలనుకున్నది పూర్తి చేయనివ్వండి’,అన్నాడు.
‘వినండి!వినండి!’
తన మోకాళ్ళను పిడికిళ్ళతో రుద్దుకుంటూ,లిస్ట్ నిట్ స్కీ కొనసాగించాడు. ‘రాబోయే యుద్ధాల్లో అంటే పౌరుల యుద్ధం అయితే అనివార్యమనే నాకు ఇప్పుడు అనిపిస్తుంది- నమ్మకస్తులైన కొసాక్కుల అవసరం మనకి ఎంతో ఉంది. బొల్షివిక్కులకు చెందిన సంస్థల ప్రభావంలో వారు ఉండకుండా ఉండేలా వాళ్ళని మనం మన వైపుకి తిప్పుకోవాలి. ఇది ఇప్పుడు మనకు అత్యవసరం! ఏదైనా ఇప్పుడు తిరుగుబాటు లాంటిది వస్తే మొదటి,నాలుగు రెజిమెంట్లలో కొసాక్కులు వారి కోసం తమ అధికారులను కాల్చినా ఆశ్చర్యం లేదు.’
‘అది స్పష్టమే.’
‘వాళ్ళు మన కోసం ఉండరు.’
‘మనం వాళ్ళ అనుభవాల నుండి నేర్చుకోవాలి కూడా. భవిష్యత్తులో ఆ రెజిమెంట్లలో ఉన్న ప్రతి ఇద్దరూ కొసాక్కులలో ఒకర్ని ఉరి తీయాలి. అవసరమైతే అందరినీ తీయాలి కూడా. పొలంలో ఉన్న కలుపు మొక్కల్ని తీసిపారేయ్యాలి.ఇది కూడా అంతే. కనుక మన కొసాక్కులు ఇప్పుడు చేసే తప్పుల వల్ల భవిష్యత్తులో అనుభవించబోయే ఫలితాల నుండి వారిని మనమే కాపాడాలి.’
లిస్ట్ నిట్ స్కీ తర్వాత ,అతను చెప్పింది ఎంతో శ్రద్ధతో విన్న అధికారి వంతు వచ్చింది. ఆ అధికారి తన రెజిమెంటులో తొమ్మిది ఏళ్ళు పని చేశాడు. యుద్ధంలో నాలుగు సార్లు గాయపడ్డాడు. పాత రోజుల్లో ఉన్న కష్టాల గురించి ఆయన మాట్లాడాడు. కొసాక్కు అధికారులను అందరికంటే తక్కువగా పరిగణించేవారని, వారికి పదోన్నతులు త్వరగా ఇచ్చేవారు కాదని, వారిలో లూయీటెంట్ జనరల్ పదవే పెద్దదిగా భావించేవారని,అందువల్ల కూడా వారిలో రాచరిక వ్యవస్థ మీద వ్యతిరేకత ఏర్పడి ఉండవచ్చని,కొర్నిలోవ్ కి తమ మద్ధతు ఇవ్వాలని, అతనికి సన్నిహితంగా ఉండాలని, కొసాక్కులతో కూడా లౌక్యంగా వ్యవహరించాలని చెప్పాడు.
‘కొర్నీలోవ్ ను నియంత అవ్వనివ్వండి. అదే కొసాక్కులకు మంచిది. జార్ కింద కన్నా అతని ఆధీనంలోనే మన బతుకులు బాగుపడొచ్చు.’
అప్పటికి అర్థరాత్రి దాటిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కిటికీలో నుండి చూస్తూ ఉంటే దీపాల్లో నగరం వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది.
ఆ అధికారులు ఉదయం వరకు మాట్లాడుకుంటే ఉన్నారు. కొసాక్కులతో వారానికి మూడు సార్లు సమావేశాలు పెట్టాలని నిర్ణయించబడింది.అలాగే వారు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు వారికి శిక్షణ ఇస్తూ తీరిక చిక్కకుండా చూడాలని కూడా అధికారులకు ఆజ్ఞ జారీచేయబడింది.
ఆ సమావేశం ముగిసే పోయే ముందు వారు డాన్ పాట ఒకటి పాడి,పదవ సారి టీ తాగారు. ఆ సమావేశం ముగిసిపోయేముందు అస్తార్శ్చికోవ్ గుసగుసగా తన పక్కన ఉన్న దొల్గోవ్ తో మంతనాలు జరిపి, ‘ఇప్పుడు మేము మీ కోసం ఒక పాత కొసాక్కు పాట పాడి వినిపిస్తాము.దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఆ కిటికీ తెరవండి ఇక్కడ పొగతో ఊపిరి ఆడటం లేదు’,అన్నాడు.
అస్తార్శ్చికోవ్,దొల్గోవ్ ఇద్దరూ కలిసి పాట అందుకున్నారు.
మా పితృభూమి డాన్ ఎంత ప్రశాంతంగా ఉండేది
ఎవరికి తల వంచలేదు,ఏ మాస్కో పద్ధతులు అరువు తెచ్చుకోలేదు
ఏ టర్కీ వాడిపైన కత్తి ఎత్తలేదు
కాలంతో పాటు మా తల్లి డాన్ దేశం
క్రైస్తవ పద్ధతుల నమ్మకాన్ని పాటిస్తూ
విముక్తి కోసం యుద్ధ భేరి మోగించింది.
అస్తార్శ్చికోవ్ తన మోకాళ్ళ మీద దరువు వేస్తూ ఆ పాటను గట్టిగా పాడుతున్నాడు. దొగ్లోవ్ కూడా అదే ఊపుతో పాడుతూనే ఉన్నాడు.పాట పూర్తయ్యే సరికి అస్తార్శ్చికోవ్ కళ్ళల్లో నుండి కన్నీరు రావడం లిస్ట్ నిట్ స్కీ గుర్తించాడు.
మిగిలిన అధికారులు,దళాలు వెళ్ళిపోయిన తర్వాత, అస్తార్శ్చికోవ్ లిస్ట్ నిట్ స్కీ పడకకు ఒక వైపు కూర్చున్నాడు. ‘యెవజిని…నీకు తెలుసు కదా…’అంటూ గుసగుసగా మొదలుపెట్టాడు. ‘నాకు డాన్ అంటే చచ్చేంత ఇష్టం.అక్కడ ఉండే పాత పద్ధతులన్నా,అక్కడి స్త్రీలన్నా కూడా చాలా ఇష్టం.అక్కడి పచ్చిక మైదానాల నుండి వచ్చే వాసన నాకు ఇంకా గుర్తుంది. వాన పడే సమయానికి వానతో తడిసిన పూలు,కూరగాయల వాసన……నాకు అవన్నీ అంటే ప్రాణం. నేను చెప్పేది నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొసాక్కులను నాశనమయ్యే మార్గంలోకి తీసుకువెళ్తున్నామా?నిజంగా ఈ పద్ధతి సరైనదేనా?’
‘అసలు నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావు?’ లిస్ట్ నిట్ స్కీ తన మాటలు గమనించుకుంటూ అడిగాడు.
‘ఇదేనా కొసాక్కులకు కావాల్సింది అని నాకు ఆశ్చర్యంగా ఉంది.’
‘మరి అయితే,వారికి ఏం కావాలి?’
‘ఏమో నాకు తెలియదు. …కానీ వాళ్ళు ఎందుకు మనకు దూరంగా ఉంటున్నారు? ఏదో విప్లవం జరిగినట్టు,దాని వల్ల మనం రెండు జట్లుగా విడిపోయినట్టు వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’
‘నీకు నేను అంతా వివరంగా చెప్తాను. జరుగుతున్న విషయాలను మనం చూసే విధానంలో ఉండే తేడా వల్లే ఇలా జరుగుతుంది. మనం వాళ్ళ కన్నా బాగా చదువుకున్న వాళ్ళం,కాబట్టి ఈ విషయాలన్నిటిలో నిజాలను మనం గుర్తించగలం.కానీ వాళ్ళు కొంత మొరటు వాళ్ళు,ఏది సరిగ్గా అర్థం చేసుకోలేరు. బొల్షివిక్కులు వారి మెదడుల్లోకి ఈ యుద్ధం ఆగిపోవాలనే పురుగును ప్రవేశపెట్టారు,అదే పచ్చన్న యుద్ధంగా మారింది. వాళ్ళు కొసాక్కులను మనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొసాక్కులు యుద్ధం వల్ల అలసిపోయి ఉండటం వల్ల వారిని ఇది త్వరగా ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు. అసలు వారి దృష్టిలో ‘మాతృభూమి’అంటే ఏమిటి? వారికి అదొక తెలియని బ్రహ్మ పదార్ధం. యుద్ధ ప్రాంతానికి డాన్ సైన్యం ఉండే ప్రాంతం ఎన్నో మైళ్ళ దూరంలో ఉందని,అందుకని జర్మన్లు ఇక్కడ వరకు రారని వారి వాదన. అదే అసలు సమస్య. వారికి సరిగ్గా అర్థం అయ్యేలా చెప్పకపోతే బయటి యుద్ధం కాస్త మనలో మనకి మధ్య యుద్ధంగా మారిపోతుంది. ‘
తను మాట్లాడుతున్నంతసేపు కూడా లిస్ట్ నిట్ స్కీ కి తన మాటలు అతని మెదడులోకి ఇంకడం లేదని తెలుస్తూనే ఉంది.
తర్వాత అస్తార్శ్చికోవ్ పైకి వినబడకుండా తనలో తానే ఏదో గొణుక్కుని,చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మనసులో ఏముందో లిస్ట్ నిట్ స్కీ అంచనా వేయలేకపోయాడు.
అస్తార్శ్చికోవ్ అతనికి శుభరాత్రి చెప్పి, ఇంకో మాట మాట్లాడకుండా లేచాడు. కాసేపు అతను ఏమైనా మాట్లాడతాడేమోనని లిస్ట్ నిట్ స్కీ చూశాడు కానీ ఆపాటికే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అతని మెదడులో ఏముందో తెలియకపోవడం లిస్ట్ నిట్ స్కీ కి వెలితిగా అనిపించింది. సిగరెట్టు వెలిగించుకుని,వెల్లకిలా పడుకుని,చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. అతనికి హఠాత్తుగా అక్సిన్యతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి.ఆ ఆలోచనలతోనే అతను నిద్రలోకి జారుకున్నాడు.
* * *
అధ్యాయం-12
లిస్ట్ నిట్ స్కీ దళంలో ఒక కొసాక్కు ఉన్నాడు. అతని పేరు ఇవాన్ లాగుటిన్, బుకానోవస్కాయా స్టానిట్సాకి చెందినవాడు. ఆ దళంలో సైన్య-విప్లవ కమిటీ కోసం జరిగిన ఎన్నికల్లో అతను సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ రెజిమెంటు పెట్రోగ్రాడ్ కు వచ్చేవరకు కూడా అతను తన వైపు దృష్టి మరలేలా ప్రత్యేకంగా ఏమి చేయలేదు.కానీ జూలై ఆఖరి రోజుల్లో ఆ దళపు అధికారి లిస్ట్ నిట్ స్కీ తో లాగుటిన్ పెట్రోగ్రాడ్ లో శ్రామికుల వర్గంతో కలిసి పని చేస్తున్న సైన్యవర్గ సభలకు వెళ్తున్నాడని,వారితో అతనికి సంబంధాలు ఉండిఉండవచ్చని అన్నాడు. అంతేకాకుండా తన దళంలోని కొసాక్కులతో అతను తరచూ మంతనాలు జరుపుతున్నాడని కూడా చెప్పాడు. వారి మీద ఆ ప్రభావం ఉండటం కూడా బహిరంగంగానే కనిపించింది. రెండుసార్లు సెంట్రీ డ్యూటీకి, పహరాకి వెళ్ళడానికి కొసాక్కులు నిరాకరించారు. ఆ దళపు అధికారి లాగుటిన్ ప్రభావమే కొసాక్కుల ఈ రకపు ఎదురుతిరిగే ధోరణికి కారణమని తేల్చేశాడు.
లిస్ట్ నిట్ స్కీ లాగుటిన్ గురించి తెలుసుకుని, అతనికి బుద్ధి చెబుదామనుకున్నాడు. కానీ కొసాక్కులతో ప్రత్యక్షంగా వ్యవహరించడం మూర్ఖత్వంగా తోచి,తగిన అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆ అవకాశం త్వరగానే వచ్చింది.జూలై ఆఖరి రోజుల్లో పులిటోవ్ వీధుల్లో పహరా కాసే పని మూడవ దళానిది.
‘నేను కూడా కొసాక్కులతో కలిసి వెళ్తాను,నా కోసం నల్ల గుర్రాన్ని సిద్ధం చేయండి’,ఆ దళపు అధికారితో లిస్ట్ నిట్ స్కీ ముందుగానే చెప్పాడు.
లిస్ట్ నిట్ స్కీ ఎప్పుడు బయటకు వెళ్ళినా, జాగ్రత్త చర్యగా ఇంకో గుర్రం కూడా తనతో తీసుకువెళ్ళేవాడు. ఆ రోజు పహరాకు సిద్ధమై వాకిట్లోకి వచ్చాడు. అప్పటికే దళమంతా గుర్రాలను అధిరోహించి సిద్ధంగా ఉంది. చిన్నపాటి దీపాల వెలుతురుతో ఉన్న అనేక వీధుల్లో వారు వెళ్తూ ఉన్నారు. లిస్ట్ నిట్ స్కీ కావాలనే వెనుకబడి, లాగుటిన్ ను తన పక్కకు పిలిచాడు. ఆ కొసాక్కు తన గుర్రాన్ని లిస్ట్ నిట్ స్కీ వైపుకి తిప్పి, అలసిపోయిన ముఖంతో అతని వైపు చూశాడు.
‘మీ కమిటీ విశేషాలేమిటి?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
‘కొత్తగా ఏమి లేవు.’
‘నీది ఏ స్టానిట్సా,లాగుటిన్?’
‘బుకానోవస్కాయా.’
‘ఏ గ్రామం?’
‘మిట్యాకిన్.’
వారి గుర్రాలు పక్కపక్కనే వెళ్తున్నాయి. ఆ వీధి దీపాల వెలుగుల్లో గడ్డంతో ఉన్న ఆ కొసాక్కు ముఖాన్ని చూశాడు లిస్ట్ నిట్ స్కీ. అతని టోపీ కిందగా ఉన్న జుట్టు వెనక్కి దువ్వి ఉంది. చిన్నగా వంకీలు తిరిగి పెరిగిన గడ్డం బొద్దుగా ఉన్న అతని బుగ్గల మీద ఓ పద్ధతి లేకుండా పెరిగి ఉంది. కళ్ళు మాత్రం తీక్షణంగా ఉన్నాయి.
‘చూడటానికి సాదాసీదాగా ఉన్నాడు కానీ అతని మనసులో ఏముండి ఉంటుంది? బహుశా పాత రెజిమెంటులో జరిగిన విషయాలతో అనుసంధానించుకుని,నన్ను ద్వేషిస్తున్నాడేమో’, లిస్ట్ నిట్ స్కీ తనలో తానే అనుకున్నాడు. ఎందుకో తెలియకపోయినా లిస్ట్ నిట్ స్కీ ఆ క్షణంలో లాగుటిన్ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనిపించింది.
‘నీకు కుటుంబం ఉందా?’
‘భార్యా,ఇద్దరు పిల్లలున్నారు.’
‘మీ పొలం ఎలాంటిది?’
‘దాన్ని పొలమంటారా?’ఓ రకమైన నిరాశ ధ్వనించింది అతని స్వరంలో. ‘అతికష్టం మీద రోజులు గడుస్తున్నాయి. ఎద్దు కొసాక్కు కోసం పని చేస్తే, కొసాక్కు ఎద్దు కోసం పని చేస్తాడు. మా జీవితమంతా కష్టపడుతూనే ఉన్నాము. మాది ఇసుక నేల’,కాసేపు ఆలోచించుకుని చెప్పాడు.
లిస్ట్ నిట్ స్కీ ఓ సారి సెబ్ర్యా కొవో స్టానిట్సాకు, బుకానోవాస్కాయా గుండా వెళ్ళాడు. ఆ సందర్భంలో అతను చూసిన ఆ ప్రాంతం మెదడులో దృశ్యంలా మెదిలింది. ముఖ్యరహదారికి పక్కగా, చుట్టూ ఉన్న మైదానాలతో,ఖోప్యోర్ నది ఒడ్డున ఉంది ఆ చిన్న స్టానిట్సా. యెలాన్ స్కాయాకు పైన ఉన్న కొండ మీద నుండి చూస్తే,దాదాపుగా 12 వెరస్టుల దూరంలో నుండి డొల్లలా ఉన్న ప్రాంతంలో పచ్చటి తెరలా తోటలు,వాటి మధ్యలో తెల్లటి ఎముకలా నిలబడి ఉన్న బెల్ టవర్ అతనికి గుర్తుకు వచ్చాయి.
‘అవును,మా భూమంతా ఇసుకే’, లాగుటిన్ నిట్టూరుస్తూ అన్నాడు.
‘నాకు తెలుసు నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదా?’
‘అవును మేజర్!ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఉంది. ఈ యుద్ధం వల్ల అక్కడి పరిస్థితులు ఏమి బాగా లేవు.’
‘నాకు తెలిసి అంత త్వరగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.’
‘లేదు నేను వెళ్తాను.’
‘ఇంకా యుద్ధం పూర్తవ్వలేదు కదా?’
‘ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుంది. ఇంకా ఎక్కువకాలం ఇది సాగదు,నేను తప్పక ఇంటికి వెళ్తాను’,లాగుటిన్ మొండిగా అన్నాడు.
‘అయినా మనవాళ్ళతో కూడా మనం యుద్ధం చేయాల్సి రావచ్చు.నువ్వు ఏమంటావు?’
తన దృష్టిని గుర్రపు జీను మీదకి కాసేపు మరల్చి, లాగుటిన్ కొద్దిసేపు ఆగి,’ఎవరితో యుద్ధం చేయాలి?’అని అడిగాడు.
‘చాలామంది ఉన్నారు …ఉదాహరణకు బొల్షివిక్కులు.’
కొద్ది క్షణాలు కునుకు తీస్తున్నవాడిలా లాగుటిన్ మౌనంగా ఉన్నాడు. ఓ మూడు నిమిషాల పాటు గుర్రపు డెక్కల శబ్దం తప్ప ఇంకే ధ్వనులు లేవు.
‘మాకు వారితో ఏ గొడవ లేదు’, లాగుటిన్ అన్నాడు.
‘మరి భూమి మాటేమిటి?’
‘అందరికి సరిపడా భూమి ఉంది.’
‘అసలు బొల్షివిక్కులు ఏం చేయాలనుకుంటున్నారో నీకు తెలుసా?’
‘అక్కడా,ఇక్కడా వింటూనే ఉన్నాను.’
‘సరే,ఒకవేళ బొల్షివిక్కులు మన భూముల కోసం దాడి చేసి, కొసాక్కులను బానిసలుగా చేస్తే మనమేం చేయాలి? నువ్వు ఇప్పటికే జర్మన్లతో యుద్ధం చేసి,రష్యాను కాపాడావు,అవునా?కాదా?’
‘జర్మన్లతో యుద్ధం వేరు.’
‘మరి బొల్షివిక్కుల మాటేమిటి?’
అప్పటికే ఏదో నిశ్చయించుకున్నవాడిలా,తన కళ్ళు పైకెత్తి,లిస్ట్ నిట్ స్కీ వైపు చూస్తూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘మేజర్, బొల్షివిక్కులు నా భూమిని మాత్రం లాక్కోరు. ఎందుకంటే ఒక కుటుంబం బతకడానికి సరిపోయే భూమి మాత్రమే నా దగ్గర ఉంది. కనుక వాళ్ళకు నా భూమి అవసరం లేదు. కానీ ఓ విషయం అడుగుతాను,ఏమనుకోవద్దు.మరి మీ నాన్నగారి విషయమేమిటి?ఆయనకు పాతికవేల ఎకరాలు ఉందికదా?’
‘పాతిక కాదు,పది మాత్రమే.’
‘రెండింటికి పెద తేడా ఏమి లేదు. అదేం తక్కువ భూమి కాదు కదా? ఇప్పుడు రష్యా మొత్తం చూస్తే మీ నాన్నలాంటి వారు ఎందరో ఉన్నారు. మీకు మీరే ఆలోచించుకోండి,మేజర్. ప్రతి మనిషికి తిండి దొరకాలి. మీరు ఎలా ఆహారం కావాలనుకుంటారో,అందరూ అలాగే అనుకుంటారు. కేవలం జీప్సీ మాత్రమే తన గుర్రానికి ఏమి తినకుండా కొన్ని రోజులు ఉండటం నేర్పిస్తాడు,ఎందుకంటే అతని జీవన విధానానికి అది అలవాటు పడటానికి. దాన్ని మిగిలిన జంతువులు అనుసరిస్తే,ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. జార్ పాలనలో వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోయింది. పేదవాళ్ళ పరిస్థితి మరి అధ్వాన్నమైపోయింది. వాళ్ళు మీ నాన్నకు పదివేల ఎకరాలు ఇచ్చారు,అదంతా ఆయన ఒక్కడే అనుభవించగలడా? మిగిలిన మనుషులు తినగలిగినంతే ఆయన తినగలడు. కాబట్టి జనాలు ఈ పాలనలో బాధలే పడ్డారు,దాన్ని మీరు ఏం చెప్పినా మార్చలేరు. కానీ మీరేమో ఇదంతా మార్చి సరైన దారిలో పెట్టబోతున్న బొల్షివిక్కులతో యుద్ధం గురించి మాట్లాడుతున్నారు.’
అతను చెప్పింది శ్రద్ధగా విన్నాడు లిస్ట్ నిట్ స్కీ.ఆ కొసాక్కు తన మాటలు ముగించే సమయానికి అతని మాటలకు ధీటుగా ఏ వాదన తన దగ్గర లేదని లిస్ట్ నిట్ స్కీ గ్రహించాడు. అంతకుముందు సూటిగా,తన తర్కంతో కొసాక్కులతో మాట్లాడటం వల్ల, వ్యవహరించడం వల్ల, సరైన అంచనా లేకుండా ఉన్న తన తీరు ఎలా కొసాక్కుల ఆగ్రహానికి కారణమైందో గుర్తుకురావడంతో,లోపలి నుండే కోపంతో దహించుకుపోయాడు.
‘అయితే నువ్వు బొల్షివిక్కువా?’
‘ఆ పేరు వల్ల పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ పేరు కాదు ముఖ్యం, ‘నిజం’తెలుసుకోవడం ముఖ్యం. జనానికి నిజం కావాలి.అది ఇన్నాళ్ళు వారికి కనబడకుండా దాచిపెట్టబడింది. కొందరైతే అది ఎప్పుడో చనిపోయిందని ,దాన్ని పాతేసారని కూడా అంటారు.’
‘అంటే ఈ విషయాలే ఈ సోవియట్ బొల్షివిక్కులు మీ మెదడుల్లో నింపుతున్నారన్నమాట.నువ్వు వారితో కలిసి నీ సమయాన్ని వృధా చేసుకోలేదు కదా?’
‘లేదు మేజర్. మా జీవితాలే మా మెదడుల్లో నింపాయి దీనిని. బొల్షివిక్కులు దానికి ఊతం ఇచ్చారు అంతే.’
‘అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది! మూర్ఖత్వానికి సమయం కాదిది’,లిస్ట్ నిట్ స్కీ కోపంగా అరిచాడు.
‘సరే నాకు దీనికి సమాధానం చెప్పు.నువ్వు మా నాన్న భూముల గురించి మాట్లాడావు కదా.కానీ అది వ్యక్తిగత ఆస్తి. నీకు రెండు చొక్కాలుండి,నాకు ఒకటే ఉంటే,నేను నీది తీసుకోవచ్చా?అదేనా నువ్వనేది?’లిస్ట్ నిట్ స్కీ లాగుటిన్ ముఖం చూడలేదు కానీ అతని స్వరంలో నవ్వు మాత్రం విన్నాడు.
‘నాకు అవసరం లేకుంటే తప్పక ఇచ్చేస్తాను. నేను ఆ పని ముందు చేశాను,యుద్ధంలోనూ చేశాను.నాకు ఉన్నదే ఇచ్చేసి,ఒట్టి కోటు ధరించిన రోజులు ఉన్నాయి.కానీ భూమి దగ్గరకు వచ్చేసరికి ఎవరికీ పంచుకోవాలనిపించదు.’
‘ఎందుకు?నీకు సరిపడా భూమి లేదా? నీకు కావలసింది భూమేనా?’లిస్ట్ నిట్ స్కీ స్వరం పెంచుతూ అడిగాడు.
లాగుటిన్ ముఖం పాలిపోయింది. వెంటనే గట్టిగా సమాధానమిచ్చాడు.
‘నేను కేవలం నా గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నానని అనుకుంటున్నారా? మేము పోలాండ్ లో ఉన్నాము కూడా. అక్కడి జనం ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? మీరు చూడలేదా? మన చుట్టూ ఉన్న సన్నకారు రైతుల జీవితం ఎలా ఉందో మీకు తెలియదా? వారిని నేను చూశాను! వారి గురించి తలచుకుంటేనే నా రక్తం సలసలా మరిగిపోతుంది. నాకు వారి మీద జాలి లేదనుకుంటున్నారా? వారికున్న భూములు పనికిరానివే,అందుకే వారంటే నాకు నిజంగా సానుభూతి ఉంది.’
లిస్ట్ నిట్ స్కీ దానికి వెటకారంగా బదులిద్దామనుకున్నాడు. కానీ ఈ లోపే, ‘వాడిని పట్టుకోండి!’ అనే పొలికేక ప్లుటోవ్ వీధుల్లో బూడిద రంగు భవనాల సమీపం నుండి వినిపించింది. ఒక్కసారిగా గుర్రాలు వేగమందుకున్నాయి,వాటి డెక్కల శబ్దం అక్కడ ప్రతిధ్వనించింది. లిస్ట్ నిట్ స్కీ పగ్గాలు అందుకుని,గుర్రాన్ని దౌడు తీయించాడు.
అతను,లాగుటిన్ దాదాపుగా ఒకేసారి బృందం దగ్గరకు చేరుకున్నారు. కొసాక్కులు ఒక కూడలి దగ్గర గుమిగూడి ఉన్నారు,కొందరు అప్పుడే గుర్రాల మీద నుండి దిగుతున్నారు. వాళ్ళు పట్టుకున్నవాడు పెనుగులాడుతున్నాడు.
‘ఏం జరుగుతోంది?’ లిస్ట్ నిట్ స్కీ ఆ గుంపు దగ్గరకు వెళ్తూ అడిగాడు.
‘ఈ వెధవ ఒక రాయి విసిరాడు.’
‘తర్వాత పారిపోబోయాడు.’
‘వాడికి ఒక్కటివ్వు, అర్జానోవ్!’
‘గుంటనక్కా! మా మీదే రాయి విసురుతావా?’
ఆ దళపు సార్జెంట్ అర్జానోవ్ తన గుర్రం నుండి దిగి, ఆ పొట్టివాడి దగ్గరకు వెళ్ళి మెడ దగ్గర చేతుల పట్టు బిగించాడు. ముగ్గురు కొసాక్కులు అతని చేతులు కట్టేస్తున్నారు.
‘ఎవరు నువ్వు?’లిస్ట్ నిట్ స్కీ అడిగాడు.
ఆ బందీ తల పైకెత్తాడు.ఆ పెదవులు కదిలాయి.
‘ఎవరు నువ్వు?’ లిస్ట్ నిట్ స్కీ మరలా అడిగాడు.
రాళ్ళు విసురుతావా ?అయితే నువ్వు మాట్లాడవన్నమాట.అర్జానోవ్!’
అర్జానోవ్ అతని మెడ వదిలేసి ముఖం మీద పిడి గుద్దులు గుద్దాడు.
‘వాడికి తగిన బుద్ధి చెప్పండి!’లిస్ట్ నిట్ స్కీ వారిని ఆజ్ఞాపించి,గుర్రమెక్కాడు.
ముగ్గురు,నలుగురు కొసాక్కులు ఆ కట్టేసి ఉన్న వాడిని నేల మీద పడేసి,కొరడాలతో బాదుతున్నారు. లాగుటిన్ తన గుర్రం మీద నుండి క్రిందకు దూకి, లిస్ట్ నిట్ స్కీ దగ్గరకు పరిగెత్తాడు.
‘మేజర్ …మీరు ఇది ఎలా చేయగలరు?ఒక మనిషికి అలా ఎలా చేయగలరు?దయచేసి అతన్ని వదిలేయండి’, అన్నాడు,వణుకుతున్న తన చేతి వేళ్ళతో లిస్ట్ నిట్ స్కీ మోకాల్ని నొక్కుతూ.
లిస్ట్ నిట్ స్కీ ఏం మాట్లాడకుండా గుర్రాన్ని ముందుకు దౌడు తీయించాడు. లాగుటిన్ కొసాక్కుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి,తన చేతులు అర్జానోవ్ చుట్టూ వేస్తూ,అతన్ని పక్కకు లాగే ప్రయత్నం చేశాడు.ఇంకొకడు లాగుటిన్ ను ఆపే ప్రయత్నం చేశాడు.
‘అంత కష్టపడొద్దు!అతను నిజంగా మన మీద రాళ్ళు వేసి తప్పించుకోగలననుకుంటాడా? అతన్ని వదిలేయ్,లేకపోతే నిన్ను వదలను’,అన్నాడు లాగుటిన్ అతనితో.
ఒక కొసాక్కు తన తుపాకితో ఆ గాయపడిన బందీని కొడుతూ ఉన్నాడు. ఒక నిమిషం తర్వాత ఆ బందీ హృదయవిదారకంగా ఏడ్చాడు.
* * *