“ఇంత విశాలమైన భూమి మీద నా తండ్రికి ఎక్కడకూడా ఒక అరచేయి వెడల్పు స్థలం కూడా లేదు” అని ప్రారంభమయ్యే ‘ఓ సంచారి అంతరంగం’ అన్న నవల, సంచార సముదాయానికి చెందిన ‘దొంబిదాసర్ల’ బ్రదుకులలోని ఆటలను, పాటలను, చావు పుటుకల నడుమగల బతుకును గూర్చి అరవైయారు కథలలో చెప్పిన పుస్తకం. తెలుగు మూలాలకు చెందిన తమ పూర్వీకులు, బ్రదుకు తెరువు కోసం ఆంధ్రప్రాంతం నుండి కర్ణాటకకు వెళ్ళి, ఆ భాషను నేర్చుకొని, కన్నడభాషలోనే కథలల్లి, గ్రామీణులకు కథలను చెప్పేవారని, బయలు నాటకాలు ఆడేవారని, చెప్తున్నకుప్పె నాగరాజుగారు, కన్నడభాషలో వ్రాసిన ‘అలె మారియ అంతరంగ’ అన్న రచనను శ్రీ రంగనాథ రామచంద్రరావు గారు చేసిన తెలుగు అనువాదం యీ కథా మాలిక!
ఎన్నో పురస్కారాలను, ప్రముఖుల ప్రశంసలను అందుకోవడమే గాక, కర్ణాటక సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా అందుకున్న యీ పుస్తకం, అక్కడి డిగ్రీ స్థాయి విద్యార్థులకు పాఠ్యపుస్తకం కూడా! భిక్షాటనే వృత్తిగా, బయలాటలు ప్రవృత్తిగా, ఎక్కడా స్థిరనివాసం లేకుండా సంచారజీవనం గావించే దొంబి దాసరులలో మొట్టమొదటగా చదువుకున్న కుప్పెనాగరాజు గారి విద్యాభ్యాసం, వారి ఉద్యమ నేపథ్యం, ప్రభుత్వం నుండి స్థిరవాసానికవసరమైన ఇళ్ల స్థలాలను పొందటం మున్నగు అంశాలతో బాటు, డెబ్భైవ దశకంలో కన్నడనాడులో చోటు చేసుకొన్న ఉద్యమాల ప్రస్తావనల వంటివి వారి జీవనవిధాన నేపథ్యం గా ఈ పుస్తకం వివరిస్తుంది. మూలకథల సౌందర్యం చెడకుండా, సంభాషణాల్లో మాత్రం నాగరాజు గారింట్లో ఇప్పటికీ మాట్లాడుతుండే తెలుగుభాషను వాడి, ఈ పుస్తకానికి సాంస్కృతిక విలువలతో బాటు, భాషా పరమైన విలువలను కూడా అద్దిన అనువాదరచయిత అభినందనీయులు.
తెలుగువారిలో ఉన్నంత సంచారజీవనులు మరే భాషలోను లేరు అనడం అతిశయోక్తి కాదు. ఒక్క కులాన్నే నమ్ముకున్న వాళ్ళు, బయలాటలు ఆడుతూ తిరిగేవాళ్ళు, గూఢచర్యం నెరపేవాళ్లు, వేటగాళ్ళు, మతప్రచారం నిమిత్తం తిరిగేవాళ్లు … యిలా నూర్లకొలది సంచారతెగలు, తెలుగు జాతిలో ఉన్నాయి. వారిలో దొంబిదాసర్లు వైష్ణవులు. అవసరమైతే మతంకోసం యితరమతాల వారితో, దొమ్మికి, అంటే పోరాడటానికి వెనుకాడనివారు. అందుకే వారికాపేరు వచ్చింది. ప్రస్తుతకాలంలో ఈ పోరాటాలు క్రమంగా తగ్గి, కళాకారులుగా మాత్రమే మిగిలినవారు. హరికతలు, బుర్రకతలు, జావళీలు, బయలాటలు, గంగిరెద్దుల ఆటలు వంటి జానపద కళలను ప్రదర్శిస్తూ తిరిగేవారు.
తన కుటుంబంగురించిన వివరాలతో ప్రారంభమయ్యే ఈ ఆత్మకథనం, నెమ్మదిగా కృతికర్త జీవిత పార్శ్వాలను పరిచయం చేస్తూ కొనసాగుతుంది. ఒక ఉపాధ్యాయుడు ఇల్లిల్లూ తిరుగుతూ, పిల్లల్ని బడికి వచ్చేలా చేసిన కారణంగా చదువుకోగలిగిన రచయిత, తన సముదాయపు జీవన సంస్కృతులను గురించి, తమ ప్రాంతపు అభివృద్ధిని గురించి తమ రాష్ట్రంలో రూపు దిద్దుకున్నసామాజిక ఉద్యమాలను గురించి…. ఇలా ఎన్నో విలువైన అంశాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు.
నుదుట విభూతి, తలకు పాగా, తెల్లటి అంగీ, తెల్లటి పంచె, ఎవరినుంచో పొందిన పాత కోటు, భుజానికి జోలె, చేతిలో తాంబూరాతో బయలుదేరే తన తండ్రి, బయలాటలలో వేసే కోడంగి… అంటే విదూషకుడి పాత్రవలన కోడంగయ్య గానే జనంలో గుర్తింపును పొందాడట! తనకు తెలిసిన రకరకాల మందుమొక్కలు, మూలికల నుండి ఔషధాలను తయారుచేసి, ఊరివాళ్ళ రోగాలను నయం చేస్తూ తిరిగే కోడంగయ్య పాడుతున్న పాటలు, తత్వాలు భారతీయ సంస్కృతిలోని ప్రముఖమైన భాగాలే! చెబుతున్న కథన గీతాలలో, లావణి లలో రామాయణ, మహాభారత, భాగవతాది మహాకావ్యాల ప్రసంగాలు, ప్రజానాయకుల జీవన చరిత్రలు, చోటు ఛేసికొనేవి. సమాజానికి అవసరమైన, నైతికత, ప్రజ్ఞ, సత్యం, ధర్మం, న్యాయం, నీతులతో కూడిన జీవన సత్యాలను గ్రామీణులకు అందించే దాసరుల బయలాటలు.. మన సంస్కృతిని పరిరక్షించడమే గాక, జీవితానికి అవసరమయ్యే మనో వికాశాన్ని కూడ కలిగించేవి. సహృదయుడైన ఊరి పటేలు,చైర్మన్ కూడ అయిన పుట్ట మల్లప్పగారి సౌజన్యంతో, మైసూరు, హుణనూరు ప్రధాన మార్గాలలోనున్న గడ్డి మైదానంలో, దాసర్లకు స్థిరనివాలు ఏర్పడ్డాయి …అని అంటుందీ పుస్తకం.
అయినా అనావృష్టికాలంలో ఆహారసంపాదనకోసం ఎన్నో మైళ్ళు గమించి, కొడగు కాఫీ తోటల్లో కూలీలుగా పనిచేసి, అలవాటు లేని పని కావడం వలన, పల్లంలో పడి అనారోగ్యం పాలైన తల్లితో మళ్ళీ మైదాన ప్రాంతం లోని తమ గుడిసెకు చేరుకోవడం వంటి….. వలస జీవన విధానంలోని కష్ట నష్టాలను వివరిస్తుంది.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, మరాఠీ, పార్శీ, తెలుగు, కొండకురుబ, జేనాకురుబ, కన్నడం వంటి భాషలను మాట్లాడే పిల్లలతో ఒక మినీ భారతంలా ఉండేది అంటున్న రచయిత, తనవారందరూ పాఠశాల నుండి పారిపోయి వచ్చేసినా, తాను మాత్రం తన తల్లి ఆశించినట్లు, తరగతి తరువాత తరగతి పాసవుతూ తమ కులంలోనే చదువుకున్న మొదటి కుర్రవాడిగా ఎదిగారు. చదువులో ముందుండటం చేత ఉపాధ్యాయుల మన్ననలను పొందడమే గాక, తరగతి లీడర్ స్థాయికి చేరుకున్న వీరు, పై తరగతుల్లో ధనవంతుడైన విద్యార్థి నిరసనకు గురి కావడం, ఆ స్థితిని దాటుకుని రావడం వంటి అంశాలు, రచయిత బాల్య ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
తమసముదాయం వెనుకబడిన తరగతులకో, షెడ్యూల్ తరగతులకో చెందినది గాక, సంచార, అర్థసంచార తెగకు చెందిన కారణంగా, ఎనిమిదవ తరగతిలో చేరినపుడు, హాస్టల్ సౌకర్యాన్ని పొందలేక పోయారు. కాని అన్నయ్య దైర్యం చెప్పి, బస్ పాస్ తీసిచ్చినందున, ఇంటినుండి రోజూ పాఠశాలకు వెళ్ళిన రచయిత, ఇంటికి వచ్చిన తరువాత లైబ్రరీనుండి తెచ్చుకున్న పుస్తకాలను చదవడం ప్రారంభించారు. సెలవు దినాలలో, అన్నతోబాటు, మేకలను అడవికి తోలుకెళుతూ, సంచిలో పుస్తకాలను కూడ తీసికెళ్తూ, అడవి ప్రకృతిమధ్య ఎంతమందో గొప్ప రచయితలను గురించి చదివారు. ఆ ఆరణ్యక సందర్యం మధ్య, తన అంతస్సౌందర్యాన్ని పెంచుకోవడమే గాక, పుస్తక పఠనం తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని కూడ చెప్పికొన్నారు.
తండ్రి ప్రదర్శిస్తున్న బయలాటలు, పాటిస్తున్న పారంపర్యంగా వస్తున్న భిక్షాటన, అమ్మ చేస్తున్న కూలిపనుల వలన ‘మా నలుగురు పిల్లల కడుపులు నిండేవి’ అని చెబుతున్నరచయిత, జానపద కళలు ప్రదర్శించే అవకాశంలేని సమయాలలో తన తండ్రి చేసే పనులను కూడ గ్రంథస్థం చేశారు. సంవత్సరమంతా సేకరించిన బూరుగు చెట్టు బెరడును రెండు, మూడు అంగుళాల పొడవున కత్తిరించి, మధ్యలోని గుజ్జును తీసేసి, ఎండబెట్టి పెట్టుకునే వారట! మట్టితో చిన్న చిన్న పూసల్లా చేసి, కాల్చి పెట్టుకునే వారట! తానే స్వయంగా చరఖా త్రిప్పి, దారపు ఉండాలను పేని, వాటినొక కర్రకు గ్రుచ్చుకొనే వారట! వేసవికాలానికి ముందు చుట్టుప్రక్కలనున్న పల్లెలలో తిరుగుతూ, చేపలు పట్టే వలల చిరుగులను బాగు చెయ్యడంలో నిపుణుడైన అతను, ఒక్కోసారి, ఏ నెలకో, అంతకు మించిన కాలానికో, ధాన్యం, ధనం తీసుకుని యింటికి వచ్చేవారట! అలా వెళ్లిన నాన్న దగ్గరికి అన్నతోబాటు వెళ్ళిన రచయిత, మరునాడు తండ్రిదగ్గరనుండి కొంత ధాన్యాన్ని, మూటలుగా తేవడం, తమ ఊరివైపు వెడుతున్న వారితో తన కొడుకులను తండ్రి జత చేసి పాపడం వంటివి రచయిత బాల్య జ్ఞాపకాలు మాత్రమే కాదు, వారి బ్రదుకు పద్ధతులను అద్దంపట్టి చూపే సాంస్కృతికాంశాలు కూడా!
ముగ్గురు నలుగురితో కలిసి సంచారం చేసే బాల్యంలో, తన తల్లి, గ్రామ శివార్లలో ఒక చెట్టుక్రింద మూడు రాళ్ళతో పొయ్యి పెట్టి, ఏరిన పుల్లలతో పొయ్యి రాజేసి, వంట చేసి పెట్టే జీవనం నుండి, తమకు గుడిసెలు ఏర్పడిన తరువాతే కొంతైనా సుఖపడిందని అంటారు రచయిత!
కుప్పెగ్రామం మొదలు తాము గావించిన సంచార జీవనంలో, ప్రకృతితో మమేకమవుతూ తాము గడిపిన బాల్యాన్ని, ఆ ప్రకృతి తనకు నేర్పిన జీవిత పాఠాలను ఎన్నింటినో గ్రంథస్థం చేస్తుంది యీ పుస్తకం! అడవి దారిగుండా, వెడుతూ తాను తిన్న మేడి పండ్లు, బలుస పండ్లు, మామిడి పండ్లు మున్నగు వాటిని గుర్తుకు తెచ్చుకోవడమే కాదు, అడవి తల్లి పిలుపును తాను గుర్తు పట్టగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పుకోవడమే కాదు, తమ ఊరి చెరువులో, బాల్యంలో తాము సాగించిన సామూహిక చేపలవేటను గురించి చెప్పే వీరు, పక్షులను పట్టడానికి వాడే, ‘పాజి’ అనే ప్రత్యేకమైన వలను కూడ గుర్తు చేసుకుంటారు.
హక్కిపక్కి తెగకు చెందిన సంచారజాతులు, ప్రభుత్వం తమకోసం కట్టిచ్చిన యిళ్లల్లో నివసించక, ప్రక్కనే గుడిసెలు వేసికొని ఉండేవారని, వారి పశుసంపద, మేకలు అన్నీ బయలులోనే ఉండేవని, పిల్లలు కూడ బడికి రాక తల్లిదండ్రులతోబాటు సంచార జీవనం గడుపుతూ, ఊరికి తిరిగి వచ్చినపుడు, తాము తెచ్చిన ధనాన్ని రెండు రోజుల్లో ఖాళీ చేసి, వస్తూ వస్తూ తాము పట్టుకొచ్చిన వాచీలు మొదలైన విలువైన వస్తువులను తక్కువ ధరలకు అమ్మి, ఆ డబ్బుతో జీవనం గడిపే వారని చెబుతుందీ పుస్తకం.
తమకులంలో చాలామంది గురుబోధ తీసికొని, గురుపుత్రులుగా మారే వారని, వారు తెగకు సంబంధించిన కార్యకలాపాలు వేటిలోనూ పాలు పంచుకొనే అవసరం లేదని చెబుతుంది యీ పుస్తకం. చుట్టుప్రక్కల గ్రామాలవాళ్ళకు జానపద నాటకాలను, పద్యాలను అభినయంతోబాటు నేర్పే దాసర్ల జీవితాలను, వారి ఆహార విధానాలను, జీవనోపాధికోసం వారేర్పరచుకున్న చేతిపనుల వివరాలను, వైద్య విధానాలను, కష్టాలనుండి నివారణకై వారిచ్చే రక్షరేకులను, గవ్వలు వేసి చూసి ఫలితాలను చెప్పగలిగిన విధాన్ని, వారి మత విశ్వాసాలను, వేరే తెగకు చెందిన వారిని వివాహం చేసుకుని వచ్చినపుడు పంచాయితీ జరిపి, అవతలి వారికి శుద్ది ఇచ్చి, తమ తెగలో కలుపుకొనే ఆచారాలను… ఇలా ఎన్నో వైవిధ్యాలను కూడ ఈ పుస్తకం అక్షరబద్ధం చేస్తుంది.
డిగ్రీ చదువుకున్న రచయిత, విద్యార్థి దశనుండే సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ, దాదాపు ఇరవై అయిదుకు పైగానున్న సంచార తెగలను సంఘటిత పరచి, రాష్ట్రస్థాయి సంఘాన్ని స్థాపించినవారు. తమ ప్రాథమికమైన హక్కులకోసం, చేసిన పోరాటంలో ప్రధాన పాత్రను పోషిస్తూ, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల విశ్వవిద్యాలయాలలో, ఆకాశవాణిలో,దూరదర్శన్ లో తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించడమే గాక, సంచార తెగలకు ఇళ్లను, ఇళ్లతోబాటు కరెంట్, నీళ్ళు మున్నగు ప్రాథమికమైన సౌకర్యాలను సాధించడంలోనే గాక, వారి పేర కొంత సొంతనేలను ఏర్పరచడంలోను భాగస్వామ్యాన్ని పొందాడు. తద్వారా, సంచారకులాల బ్రతుకుల్లో వెలుగులను నింపాడు.
తెలుగు మూలాలున్న ఒక రచయిత మరొక భాషలో వ్రాసిన తెలుగు బ్రదుకులను ఆ భాషనుండి అరువుతెచ్చుకుని చదువుకోవడం, కొంత వేదనను కలిగించే విషయమే అయినా, కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది అని కూడా తెలుస్తోంది. ఇంతకు ముందు తెలుగు సంతముచ్చుల జీవితాలను, ‘ఉచల్యా’ పేరిట మరాఠీ నుండి అనువదించుకున్నాం! తెలుగు వలసబతుకుల వెతలను తెలిపే జీవితాలను ‘గోపల్లె’ పేరిట తమిళ భాషనుండి అనువదించుకున్నాం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు బయటనున్న తెలుగును ఎనిమిది కోట్లకు పైబడిన తెలుగు వారిని గూర్చి కూడా పట్టించుకుని తీరాలని, ఈ రచనలు చెబుతున్న వాస్తవం దిశగా మన చూపులను సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ పుస్తకం గుర్తు చేస్తుంది.
డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.