ఓ మంచి సినిమా’ఏ జర్నీ టు కాశీ’

Spread the love

2023లో విడుదలైన తెలుగు సినిమా. వారణాసి క్రియేషన్స్‌ బ్యానర్‌పై దొరడ్ల బాలాజీ, శ్రీధర్‌ వారణాసి నిర్మించిన ఈ సినిమాకు మునికృష్ణ దర్శకత్వం వహించారు. చైతన్యరావు, అలెగ్జాండర్‌ సాల్నికోవ్‌, ప్రియా పాల్వాయి, క్యాథ‌లిన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు.

నేను ఈ సినిమా పేరు చూసి ఇంగ్లీషు సినిమా యేమో అనుకున్నా . రాణీ శివ శంకర శర్మ గారు ఫేస్ బుక్ లో రాసినది చదివి  తెలుగు సినిమానే అని తెలుసుకున్నా.
ఎలా వుంటుందో చూద్దామని మొదలు పెట్టా సినిమా అయిపోయే వరకూ ఆపకుండా,తల తిప్పకుండా చూశా.
మంచి సినిమాకు వుండవలసిన మొదటి లక్షణం అదీ, కథలో సబ్జక్ట్ ఎలాంటిదయినప్పటికీ తల తిప్పనివ్వకుండా సినిమా చూసేట్టు చెయ్యడం.

సినిమా లో మొదటి సీన్లోనే ఒక వేశ్య పాత్రని చూపడం జరుగుతుంది.ఆమె పేరు శ్వేత.ఒకతనికి కాంట్రాక్ట్ దక్కడానికి ఆమె సాయం చేస్తుంది.అందులో అతనికి దక్కే లాభం ఇరవైలక్షలయితే ఆమె కు దొరికే సొమ్ము ఇరవైవేలు .”అదేమిటీ” అని అడిగితే “నీ కట్ ఇంతే” అంటాడతను. అక్కడే ఈ సమాజంలో స్థాయిల వారీగా  దోపిడీ యెలా జరుగుతుందో ఇండైరెక్ట్ గా చెప్పినట్టనిపించింది.ఆ డబ్బయినా ఆమెకు దక్కుతుందా అంటే  అదీలేదు ఆరాత్రికి ఆమెను కిరాయికి మాట్లాడుకున్న కుర్రాళ్లు అన్ని రకాలుగా ఆమెను హింసించి ,ఆమె డబ్బులాక్కుని ఆమెని కొట్టి పారిపోబోతారు(ఇక్కడ తన కోసం వచ్చిన టీనేజ్ కుర్రాడితో ఆమె మాట్లాడిన మాటలు చాలా సహజంగా,ఆ కేరెక్టర్ కి తగినట్టుగా  వుండి పడికట్టు సినిమా డైలాగుల్లాగా అనిపించక పోవడం విశేషం)

ఈ లోగా ఒక ఫారినర్  ఆ కుర్రవాళ్లను తరిమేసి ఆమెను కాపాడతాడు .అతని శుశ్రూషతో కోలుకున్న ఆమె మొదట అతని పర్స్ కొట్టేసి పారిపోదామనుకుంటుంది కానీ గాయపడి పడిపోయిన తనని అతను యెలా కాపాడాడో గుర్తు చేసుకుని ఆ ప్రయత్నం విరమిస్తుంది.
ఆమెను కాపాడిన ఆ ఫారినర్ ఒక అమెరికన్ ,పేరు జాక్  వెబ్బర్ . విస్కాన్సిన్ యూనివర్సిటీలో తెలుగు చదువుకుని,తత్త్వ శాస్త్రంలో “అద్వైతం” గురించి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేస్తూ ,తన ఆధ్యాత్మిక గురువును వెతుక్కుంటూ ఇండియా వస్తాడు.అమెరికన్ అయినా ధారాళంగా తెలుగు మాట్లాడుతూ వుంటాడు.

ఆత్మ పరమాత్మ వేరు కాదు అని చెబుతున్న అతన్ని”మెట్ట వేదాంతమా?” అని పరిహాసం చేస్తుంది ఆమె.”ఈ సన్యాసులందరూ దొంగలే ,గంజాయి దమ్ముకి అలవాటు పడి బాధ్యత లేకుండా భార్యా పిల్లలని గాలికొదిలేసి సన్యాసుల్లో కలిసిన వాళ్లే “అని వెటకారం చేస్తుంది.
తన గురువు అలాంటి వాడు కాదనీ అయిదేళ్ల క్రితం అతన్ని హిమాలయాల్లో కలిశాననీ చెబుతాడతను.ఈ లోపు అతని పర్స్ లో వున్న స్వామీజీ ఫోటో చూస్తుందామె.
ఆమె ఆ ఫోటో చూసి షాక్ తింటుంది”నువ్వు వెతుకున్నది ఒక బండ రాయిని ,నీ ప్రయత్నం వృథా “అని వెళ్లి పోతుంది.

ఫ్లాష్ బాక్ లో ఒక కుటుంబం గురించిన కథ మొదలవుతుంది పారలల్ గా.రాయలసీమలో ఒక ముచ్చటయిన కుటుంబం.శివానంద అనే యువకుడూ,అతని భార్య యశోద,అతని కూతురు యెనిమిదేళ్ల బుజ్జి,అతని తండ్రీ ఇదే ఆ కుటుంబం.శివానంద తండ్రి వయసులో వున్నప్పుడు విలాసాలకు అలవాటు పడి ఆస్తి హారతి కర్పూరంలా కరిగించేస్తాడు.శివానంద ఎమ్ .ఏ. సంస్కృతం చదువుకుని ఒక రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తూ వుంటాడు.అతనికి కూతురంటే అమితమైన ప్రేమ,భార్యం టే ఇష్టం .
కోడలికీ,మామకీ అప్పుడు కీచులాటలు వస్తుంటే కొడుకు శివానంద సర్దుతూ వుంటాడు.
తండ్రి కాశీకి పోదామంటాడు.

ప్రస్తుత కథలోకి వస్తే జాక్ వెబ్బర్ ,తన గురువును వెదుకుతూ  కాశీకి పోవాలనుకుంటాడు.తోడుగా తనకి పరిచయమైన శ్వేతని రమ్మంటాడు.ఆమె”నీది భక్తి మార్గం,నాది రక్తి మార్గం ఇద్దరికీ కుదరదు” అంటూనే రోజుకి రెండువేలు తన ఫీజు అని చెబుతుంది .అతను ఒప్పుకుంటాడు.అలా వారి కాశీప్రయాణం మొదలవుతుంది.

ఫ్లాష్ బాక్ లోని కథలో మొదట కాశీ ప్రయాణానికి అడ్డు చెప్పిన శివానంద.భార్యా,తండ్రీ ఇద్దరి కోరికా కాదన లేక చిన్నపిల్ల బుజ్జితో కలిసి మొత్తం కుటుంబాన్నంతా కాశీకి బయలుదేరతీస్తాడు.
కాశీకి చేరి గంగలో మునిగిన తర్వాత శివానందలో విపరీతమైన సంచలనం కలుగుతుంది .ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.ఆ మహాశివుడే రమ్మంటున్నట్టు పదే పదే పిలుపులు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి.ఒక సాధువు ప్రసాదం అని ఇచ్చిన గంజాయి దమ్ముతో అతని తల తిరిగిపోతుంది.ఈ సంఘర్షణంతా తట్టుకోలేక ఊరికి పోదాం రమ్మంటాడు .తండ్రీ ,భార్యా “అప్పుడే యేం తొందర? కుంభమేళా చూసిపోదాం” అని వారిస్తారు.”మీ ఖర్మ” అని వుండిపోతాడు. చివరికి తనలో వినపడే పిలుపులకు లొంగి పోయి తన కోసం వెతకవద్దని ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోతాడు శివానంద.
ఎంతో అన్యోన్యంగా వుండే భర్త  హఠాత్తుగా మాయమవ్వడం అతని భార్య జీర్ణించుకోలేక పోతుంది.తండ్రి కూడా కొడుకు వియోగం తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు.ఎంతో ప్రేమించే తండ్రి దూరమయ్యాడని చిన్నపిల్ల బుజ్జి బెంగపడిపోతుంది. అతను దొరికే వరకూ అక్కడే వుండి  వెదుకుదామనుకుంటారు. ఎన్నాళ్లు వెదికినా అతని జాడ తెలియక చివరికి నాగసాధువుల్లో కలిసి పోయుంటాడని అనుకుని దొరికిన రైలెక్కి సికింద్రాబాద్ చేరుకుంటుందా కుటుంబం.
పెద్దాయన సాంబయ్య ATM సెంటర్  దగ్గర వాచ్ మేన్ గా పనిచేస్తుంటే,యశోద సంగీత పాఠాలు చెప్పుకుంటూ బతుకుతూ వుంటారు..ఒక సంవత్సరం తర్వాత ముసలాయనా ,యశోదా బస్ యాక్సిడెంట్లో చనిపోతారు.
బుజ్జి అనే ఆ చిన్నపిల్ల రామకృష్ణ సేవా సమితి వారి స్కూల్లో చేరి చదువుకుంటుంది.కొన్నాళ్లు యేదో ఉద్యోగం చేస్తుంది కానీ అదీ నిలవదు,ఒంటరి జీవితంలో పరిస్థితుల ప్రాబల్యంతో విధిలేక వేశ్యగా మారుతుంది.
ఆమే శ్వేత .

జాక్ వెబ్బర్ తో కాశీకి బయలుదేరిన శ్వేత ప్రయాణం అంచెలంచెలుగా సాగుతూ వుంటుంది.ఎన్నోచోట్ల తన గురువుకోసం గాలిస్తూ వుంటాడతను.మధ్యలో అమెరికాలో వున్న తన భార్యతో విడాకుల గురించి గొడవ పడుతూ వుంటాడు.
రెండు మూడు సార్లు శ్వేతా,అతనూ కూడా తగాదా పడి విడిపోయి మళ్లీ కలుస్తారు.వారిద్దరి మధ్యా ఒక విచిత్రమైన బంధం యేర్పడుతుంది.
చివరికి కాశీ చేరుకుంటారు.జాక్ వెబ్బర్ వెతుకుతున్న గురువు కూడా కనపడతాడు.అతను తన తండ్రేనని శ్వేత గుర్తిస్తుంది.
సినిమా మొత్తానికీ ఈ సన్నివేశం హైలైట్

శిష్యులడిగే ప్రశ్నలకు ఆ స్వామీజీ  ఇలా సమాధానాలు చెబుతూ వుంటాడు.
స్వామీ సత్యం అంటే ఏమిటీ?
“సత్యం అనేదే లేదు.ఉన్నవన్నీ పాక్షిక సత్యాలూ,అసత్యాలూ మాత్రమే సత్యం మానవ నిర్మితం”

స్వామీ కాలం అంటే?

“కాలము అనేదే లేదు,అదికూడా మానవ నిర్మితమే”
“ఆత్మ పరమాత్మ వేరుకాదు.గడ్ది పరకలోనూ,నీలోనూ,నాలోనూ,ఈ ప్రకృతి లోనూ వున్నదంతా పరమాత్మే”

స్వామీ ధర్మం అంటే యేమిటీ?

“నీకేం చేయాలి అనిపిస్తే అదే ధర్మం,ఏం చేయాలనిపించలేదో అదే అధర్మం.సృష్టి వేరూ ,సృష్టి కర్త వేరూ కాదు”

ఇవన్నీ వింటున్న శ్వేత అతన్ని నిలదీస్తుంది “సత్యంకోసం ఇంటినీ పెళ్లాం ,బిడ్డలనీ వదిలేసే వాళ్లూ,సంపాదన కోసంసంసారాన్ని వదిలేసే వాళ్లూ,యుధ్ధాలు చేసేవాళ్లూ అందరూ పురుషులేనా? బాధలు పడవలసిందీ,సంసార భారాన్ని మొయ్యవలసిందీ స్త్రీలేనా?”అనడుగుతుంది.
దానికి అతనిచ్చే సమాధానం—-“స్త్రీ ప్రకృతి,పురుషుడు వికృతి.బలహీనుడైన పురుషుడు ఐడెంటిటీ క్రయిసిస్ తో యుధ్ధాలు చెయ్యాలి,రాజ్యాలు జయించాలి,పేరు సంపాదించాలి,ధనం సంపాదించాలి.స్త్రీ ,పురుషులిద్దరూ బాధితులే”
ఇంకా ఆమె “ఒక్క క్షణంలో మమ్మల్నందరినీ వదిలేస్తే  బుజ్జిగా నిన్ను ప్రేమించాలా?శ్వేతగా నిన్ను ద్వేషించాలా?.తండ్రి లేకుండా,అండ లేకుండా అమ్మా,నేనూ,తాతా యెన్ని కష్టాలు,అవమానాలూ  పడ్డామో తెలుసా?
సత్యాన్వేషణకు ,బుధ్ధుడయినా,రామానుజుడైనా,నువ్వయినా అర్థరాత్రి దొంగలాగా ఇల్లు వదలాలా? అని అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం తో తల తిరిగిపోతుంది.

“మీ నాన్న శివానంద కాశీలో మరణించి వుంటే నువ్వు ద్వేషించే దానవా?చావును అర్థం చేసుకుని,గుండె రాయి చేసుకుని శవదహనం కానిచ్చి వుండే దానివి.మీ నాన్న శివానంద పారిపోలేదు .జన్మజన్మల బంధాలనీ వుంచుకోలేక ,తెంచుకోలేక సునామీ లాంటి సంఘర్షణలో చిక్కుకుని భౌతికంగా బతికే వున్నా ఆధ్యాత్మికంగా వేరొక జన్మ యెత్తాడు.గొంగళిపురుగు సీతాకోక చిలుక అయింది.అంతా ఒకటే రెండోది లేదు.మీ నాన్న మరణించి ఇంకో జన్మ తీసుకున్నాడు ” అంటాడు.

జాక్ వెబ్బర్ ని చూసి “మీరో గొప్ప జ్ఞానాన్వేషి.మీ అవసరం బయట ప్రపంచానికే వుంది.బయట వెతకవద్దు,లోపల వెతకండి.శంభో శంకర” అంటూ వెళ్లి పోతాడు. సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా చూశాక యేమనిపించిందంటే ఒక వేశ్యగా శ్వేత చేసిన ప్రయాణం తక్కువదీ కాదు,ఒక సన్యాసిగా శివానంద చేసిన ప్రయాణం ఎక్కువదీ కాదు రెండూ ఒకటే.
జీవితం ఒక్కొక్కరినీ ఒక్కో మార్గంలో నడిపిస్తుంది.
జీవితం గురించి ఆమె ప్రశ్నలు ఆమె కు వుంటే అతని సమాధానాలు అతనికి వున్నాయి.
ఎవరి మార్గంలో వారు కరెక్టే
ఒకరు చేసింది తప్పూ ,ఇంకొకరు చేసింది ఒప్పూ అని నిర్ణయించలేము.

ఎంతో ఉన్నత స్థాయిలో ఆలోచించి తీసిన సినిమా అనిపించింది.కోట్లకు కోట్లు గుమ్మరించి తీసిన సినిమాలని ఓపికగా చూసే సినీ అభిమానులు, చిన్న బడ్జెట్ తో ఆలోచనాత్మకంగా తీసిన ఇలాంటి సినిమాలని కూడా ఆదరించాలి.ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి ఈ దర్శకుడు యెంత శ్రమ పడి వుంటాడో ! సుమారు ఐదు సంవత్సరాలు పట్టిందని దర్శకుడు మునికిష్ణ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పగా విన్నాను.ఈ సినిమాకి రచనా,దర్శకత్వం రెండూ మునికిష్ణ గారే.ఆయన ప్రతిభ ప్రతి ఫ్రేము లోనూ తెలుస్తోంది ముఖ్యంగా పల్లెదృశ్యాలలో మరీనూ.

సంభాషణలు సూటిగా,పదునుగా,పాత్రోచితంగా వున్నాయి.
పచ్చి పసుపు కొమ్ము లాంటి రాయలసీమ మాండలికం అత్యంత సహజంగా పలికించారు.అలాగే శ్వేత పాత్రలో తెలంగాణా యాస కూడా.
సినిమటోగ్రఫీ కళ్లకు హాయిగా వుంది.పురాతన నగరమైన కాశీని చాలా వరకూ వున్నదున్నట్టుగా చిత్రీకరించారు.
గంగా హారతి దృశ్యాలు మనోహరంగా వున్నాయి.

శివానందగా చైతన్యారావు చక్కగా నటించాడు
యశోధగా ప్రియా పాలువాయి,శ్వేతగా కేటలిన్ గౌడ్ ,జాక్ వెబ్బర్ గా రష్యన్ నటుడు అలెగ్జాండర్ సాల్నికోవ్  తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫణి కల్యాణ్  సంగీత దర్శకత్వం సన్ని వేశాలను పరిపుష్టం చేసింది.
ఇంకో విశేషం ఎక్కడా ఎప్పుడూ వినని ఒక జోలపాట ఈ సినిమాలో వుంది ….

“శుధ్ధోసి బుధ్ధోసి నిరంజనోసి
సంసార మాయా పరిత్యజోసి
సంసార స్వప్న త్యజమోహనిద్ర”

అంటూ సాగే ఈ జోలపాట మార్కండేయ పురాణంలో వుందట!
మహా తత్త్వవేత్త అయిన రాణీ మదాలస తన బిడ్డలకు పాడిన జోలపాటట. ఈ దేహము నీవు కాదు,ఈ సంసారం మాయ ,ఇదంతా ఒక కల ,ఈ మోహనిద్రనుండీ మేలుకో అనే అర్థం వచ్చే ఈ పాట లో అద్వైత  సిధ్ధాంత మంతా నిబిడీ కృతమై వుంది అని భావిస్తారట.అర్థం తెలుసుకున్నాక నాకు ఇది జోలపాట కాదు మేలుకొలుపు అనిపించింది.

ఈ పాట సినిమాలో ముఖ్యమైన మలుపు కు కూడా కారణమయ్యింది అనిపించింది.తన భార్య పాడుతున్న ఈ జోలపాట ,శివానంద లో ఆధ్యాత్మిక భావనలను తట్టి లేపి,భవిష్యత్తులో అతను గడపబోయే సన్యాస జీవితానికి బీజం వేసి వుండవచ్చు అనిపించింది.
ఎంతో పరిశోధించి ఈ పాటని సినిమాలో కూర్చిన దర్శకుడు మునికిష్ణ గారూ,పాటకు చక్కటి ట్యూన్ సమకూర్చిన సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్ గారూ అభినందనీయులు.

భారీ సెట్టింగులూ ,విదేశీ విహారాలూ,అరకొర బట్టలతో ఐటెం డాన్సులూ,హత్యలూ,నరుక్కోవడాలూ,రక్తం యేరులై పారడాలూ,రొడ్డ కొట్టుడు సినిమా డైలాగులూ లేకుండా నీట్ గా తీసిన మన తెలుగు సినిమా ఇది.
ఇప్పటికే జాతీయ,అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో తొమ్మిది అవార్డులు కైవసం చేసుకున్న చిత్రం.
మంచి సినిమాని అభిమానించే సినీ ప్రేక్షకులు తప్పకుండా చూడవలసిన సినిమా.

  • భార్గవి

Spread the love

One thought on “ఓ మంచి సినిమా’ఏ జర్నీ టు కాశీ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *