కన్నీళ్ళు ఎక్కడ వుంటాయో ?
ఆనంద భాష్పాలు ఎక్కడ వుంటాయో ?
కన్నీళ్ళలో ముంచి తీసిన వాక్యాలు
తేటగా వుంటాయి.
సంతోషవిషాదాల జిగీషతో
జీవం తొణికిసలాడతాయి.
చూసే చూపులో
తలపులో తూగులో
యోచించి వేసే అడుగులో
సమస్తం దాగి వుంటాయి.
జీవితం
నిర్వచనాల వలలకనులకు అందక
జారిపోయే చేప.
ఒకరికొకరు జీవించాలనిపించడమే
ఒకరినొకరి జీవితానందమే
జీవన ప్రతిఫలం.
దుఃఖం మన గురువు.
సంతోషం మన సహచరి.
జగత్తుని
ఒక్క క్షణం వెలిగించి
తొలగిపోయేదే కదా మన జన్మ.