నేను ఇంజనీరింగ్ లో పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత, తెలుగు పుస్తకాలు కోసం వేతికేవాడిని. అప్పట్లో నాకు తెలిసిన ఒకేఒక్క పుస్తకం ‘అమరావతి కథలు’ .. ఆ పుస్తకం పట్టుకుని హాస్టల్లో చదువుతుంటే, మా తమిళ స్నేహితులు తమ పుస్తకాలు గురించి చెప్పేవారు.. వారు ఎక్కువగా చెప్పే పేర్లు మాత్రం తిరువళ్ళువార్ & కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్. కొన్ని ఏళ్ళ తర్వాత నేను తిరిగి పుస్తకాలు చదవడం మొదలుపెట్టినప్పుడు పొన్నియిన్ సెల్వన్ తెలుగులో చదివాను. అప్పుడే దానిని సినిమాగా తీసుకున్నారు అని చెప్పారు. నవలను సినిమాగా మార్చడానికి ‘జయమోహన్’ సహాయం చేస్తున్నారు అని తెలుసుకున్నాను. అలా ఆ పేరు మొదటి సారి విన్నాను. ఈ మధ్య కాలంలో ఛాయా వాళ్ళు జయమోహన్ గారు రాసిన కొన్ని కథలను అనువాదం చేసి పుస్తకం వేశారు అని తెలిసి తీసుకున్న పుస్తకమే అవినేని భాస్కర్ గారు అనువాదం చేసిన జయమోహన్ గారు రాసిన ‘నెమ్మి నీలం’ పుస్తకం.
పుస్తకంలోని కథల గురించి మాట్లాడుకొనే ముందు, అనువాదం గురించి మాట్లాడుకోవాలి. ఒక పూర్తి తెలుగు పుస్తకం చదువుతున్నాను అనే విధంగా అనువాదం ఉంది. ఎక్కడా కూడా చదివేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలానే ప్రస్తుతం వాడుకలో లేని కొన్ని తెలుగు పదాలను చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. అనువాదం కోసమైనా ఈ పుస్తకం చదవమని చెప్పాలి అని ఉంది.
ఇక కథల విషయానికి వొస్తే, ఈ పుస్తకంలో మొత్తం 12 కథలు ఉన్నాయి.. ఒక్కో కథ దాదాపు 30 పేజిలు ఉంటుంది. ఇంత పెద్ద కథలు చదవడం కూడా ఇదే మొదటి సారి. అయితే వీటిని కథలు అనడం కన్న కొంతమంది జీవితాలను పరిచయం చేశారు అని చెప్పడం సబబు ఏమో.. ఒక్కో కథా ఒక్కో జీవితాన్ని పరిచయం చేస్తూనే.. కథల్లో వైవిధ్యాన్ని చూపించారు.
‘ధర్మం’ కథలో ఒక రచయిత జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన చెప్తూ, అప్పట్లో ప్రచురణ సంస్థల నిర్వాకం గురించి చెప్పారు.అలానే ఈ కథలోనే ‘అఱం’ ప్రక్రియ గురించి తెలిసేలా చేశారు.
‘ఒగ్గనివాడు’ కథలో బ్రిటిష్ ఇండియా కాలంలో ఒక తక్కువ చెయ్యబడ్డ కులానికి చెందిన వ్యక్తి, ఇంగ్లీష్ చదువు వల్ల, ప్రభుత్వ ఉద్యోగి అయ్యి, ఆ ఊరు జమిందారునే ఎదురించిన తీరు గురించి చెప్పారు. ఇది చదివినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వారి అవసరాల కోసం చేసినా మనకి ఎలా మంచి జరిగిందో అర్థం చేసుకున్నాను.
‘అమ్మవారి పాదం’ నన్ను బాగా కదిలించిన కథ. పితృస్వామ్య వ్యవస్థ లో భర్త వల్ల ఎన్నో అవమానాలు పడడమే కాకుండా, తాను వచ్చిన కళను మర్చిపోయిన ఒక భార్య మనకి కనిపిస్తుంది. అమ్మవారి పాదం అనే ఉపమాణాన్ని అర్దం చేసుకుంటే కొన్ని రోజుల పాటు కథ మనలో ప్రయాణం చేస్తుంది.
ఇలా ప్రతి కథ గురించి చెప్పేస్తే, ఇంకా పుస్తకం చదివే అవసరం లేదంటారేమో.. అందుకే..
ఈ కథలు అన్నీ కూడా ఒక వ్యక్తి గురించి చెప్తున్నట్టు ఉన్న, ఆ వ్యక్తి ద్వారా తమిళనాడులో ఉండే మతాచారాలు, కుల వివక్ష, రాజకీయ సంఘటనలు ఇలా ఎన్నో విషయాలు చెప్పారు.
ఈ కథలు అంత త్వరగా పూర్తయ్యే కథలు కావు. అందుకు కథల నిడివి ముప్పై పేజీలు మించి ఉండటం ఒక కారణం అయితే, కథలోని పాత్రలు మరో కారణం.
ఈ కథల్లో నాకు బాగా నచ్చిన మరికొన్ని కథలు ‘ఏనుగు డాక్టర్’ , ‘వంద కుర్చీలు’, ‘నెమ్మి నీలం’, ‘పిచ్చమాలోకం’, ‘యాత్ర’.
పుస్తకం మొదట్లో ఉండే కథ పేజీ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కానీ, ఒక మంచి అనువాద పుస్తకం చదవాలి అనుకొనే వాళ్ళకి, తమిళ సాహిత్యం చదవడానికి ఈ ‘నెమ్మి నీలం’ ఒక మంచి ఎంపిక అవుతుంది.
ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది లేదా +91 79895 46568 కి మెసేజ్ చెయ్యచ్చు.
పుస్తకం ధర : 450/-
అమెజాన్ లింక్ : https://amzn.to/3XnF4Xx
ఆదిత్య అన్నవజ్జుల “ నెమ్మి నీలం “ జయమోహన్ కథల సంపుటి పరిచయం బాగుంది . జయమోహన్ నా favorite కథకులు .
I ordered a copy of “ నెమ్మి నీలం”