ఇది ఒక అట్టర్ ఫ్లాప్ స్టోరీ

Spread the love

చదువంటే కొందరికి మంచి డిగ్రీలు సాధించి పెట్టి మంచి ఉపాధికి దారి చూపే మార్గం. డొనేషన్లు గుమ్మరించి మరీ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేసి డాక్టర్లుగా తెల్లకోట్లు వేసుకుని, భారీగా కట్నంతో పెళ్లి చేసుకుని, కొండొకచో మామగారి అండతో ఆస్పత్రి కట్టేసి రోగుల దోపిడీకి తెరతీస్తారు. ఈ చదువుల దురాశను డాక్టర్‍గిరీలకే పరిమితం చేయనక్కర్లేదు. ఇక్కడ బీటెక్ చేసేసి అమెరికాలో ఎమ్మెస్ కొనసాగించి అక్కడే ఉద్యోగంలో స్థిరపడి, గ్రీన్ కార్డు, ఆపైన సిటిజెన్ షిప్‍లు సంపాదించేసి డాలర్ డ్రీమ్స్‌లో మునిగితేలే వారూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి నాలుగు తెలుగు కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబానికైనా అమెరికా కనక్షన్ ఉంది. మన ఆవకాయలు గోంగూరలు అమెరికాలోని పిల్లలకు చేరవేయటానికి అడుగడుక్కీ కొరియర్ సర్వీసులు గుమ్మంలోకొచ్చి మరీ క్యూకడుతున్నాయి.

చదువంటే ఉద్యోగ సాధనే కనుక ఆ చదువు పూర్తయ్యాక ఇక కాలేజీ పుస్తకాల జోలికెళ్లని వారు కోకొల్లలు. తమ సబ్జెక్టుల్లో అప్‍డేషన్ అవసరం పడటం వల్ల అదనపు అర్హతల పేరిట కొన్ని సర్టిఫికెట్ కోర్సులూ చేస్తుంటారు. ఈ చదువు కూడా మరిన్ని డబ్బులు సంపాదించే ఆరాటంలో భాగమే. అసలు మనమిప్పుడు ముచ్చటించుకోవలసింది వీళ్ల గురించి కాదు. కాలేజీ చదువుల క్రమంలో కొందరు ‘పెడదారి’ పడతారు. ఏదో ఒక విద్యార్ధి సంఘంలో చేరతారు. అక్కడ చురుగ్గా పని చేస్తుంటారు. ఆయా పార్టీల పెద్దల సహచర్యమూ, వారి ఉపన్యాసాలు వెరశి విషయాలను మరింత విశాలంగా అర్థం చేసుకునే జ్ఞానమూ అబ్బుతుంది. పనిలో పనిగా సాహిత్య అభిరుచీ అలవడుతుంది. కొందరైతే సాహిత్యమే సమస్తంగా లోతుగా కూరుకుపోతారు. కాలేజి చదువులకు సమాంతరంగా సాహిత్య పుస్తకాల పురుగులూ అవుతారు. ఈ చదువు ఊరికే వారిని కూచోనివ్వదు. ఏదో ఒకటి రాయాలన్న దురదా పుడుతుంది. ఈ తరహా యూత్ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అలా ఉండబట్టే తెలుగులో నాటి నుంచీ నేటి వరకూ సరికొత్త కవులూ రచయితలూ పుట్టుకొస్తూనే ఉన్నారు. పాత రచయితలు కొందరు అస్త్రసన్యాసం చేసి తెరమరుగైపోగా మరికొందరు మాత్రం పాత రచనలతోనే శాశ్వతంగా ప్రకాశిస్తూ చిరంజీవులుగా మనగలుగుతున్నారు.

అభిరుచి ఏర్పడటం ఒక ఎత్తయితే, ఆ అభిరుచికి నారూనీరూ పోసి కొనసాగించగలగటం మరొక ఎత్తు. కాలక్రమంలో పుస్తకాలను పక్కన పెట్టేస్తారు. ఉద్యోగాల్లో సంసారాల్లో మునిగి తేలడంతో ఆ చదువూ అటకెక్కేస్తుంది.

సాహిత్యమో మరో సిద్ధాంత గ్రంథమో అసలు చదవాలా? చదివితే ఏం వస్తుంది? చదవకపోతే కోల్పోయేదేమిటి? చదివి పొందే దేమిటి? లోకాన్ని ఉద్ధరించేదేమిటి? చాలా ప్రశ్నలు. పుస్తకాలు చదవటం వల్ల వెయ్యినొక్క లాభాలనీ ఏకరువు పెట్టుకోవచ్చు. మనోపరిధి వికసిస్తుందని, లోకాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని, పాఠకుడిగా వేయి జన్మల అనుభవాలని సొంతం చేసుకోవచ్చని  ఇలా చాలా చాలా చెప్తూపోవచ్చు.

అయితే బతుకు వెంపర్లాటలో క్షణం తీరుబడి లేని కాలం వచ్చేసింది. రోజు మొత్తంలో రిలాక్స్‌డ్‍గా కూచుని పుస్తకం చదివే భాగ్యం కొద్దిమందికే ఉంటుంది. సగటు జీవికి దొరికే ఆ కాస్త విరామ సమయమూ స్మార్ట్ ఫోన్ హైజాక్ చేసేస్తోంది. స్మార్ట్ ఫోన్‍లో పలురకాల వేదికల ద్వారా వరదఉధృతిలా వచ్చి పడుతున్న వీడియోలు, షార్ట్‌లు, వాట్సాప్‍లూ, మేటాలు, బ్లాగులు ఊపిరి సలపనివ్వటం లేదు. ఒకసారి అరణ్యంలో అడుగు పెడితే ఎటు పోతున్నామో ఎక్కడ తేలతామో, మరింకెక్కడ మునుగుతామో పాలుపోని పరిస్థితి.

స్మార్ట్ ఫోన్ దెబ్బకి పుస్తకాలు ఎప్పుడో అటకెక్కేశాయి. ఆ చదువుతున్న కొద్దిమందికి కాలక్షేపానికి మించిన పర్పస్ ఉంది. తాము నమ్మిన సిద్ధాంతం పట్ల ఆపేక్ష,అభిమానం వారిని ఇంకా క్రియాశీలంగానే ఉంచుతోంది. పలురకాల పుస్తకాలు చదవటం, వాటిపై చర్చోపచర్చల్లో పాల్గొనటం కొందరికి ఇష్టమైన వ్యాపకం.

అయితే ప్రభుత్వాల ఉచిత పథకాలకు అలవాటు పడినట్లే అభిరుచి గల ఈ పాఠకుల్లో కూడా చాలామంది ఉచిత పిడి ఎఫ్ పుస్తకాల కోసం అర్రులు చాస్తున్నారు. పుస్తకమనేది కొని చదవాల్సినదనే స్పృహ కొందరిలో కనిపించడం లేదు. స్మార్ట్ ఫోన్ లో వీడియోలు, సినిమాల నుంచి అన్నీ ఉచితంగా చూడగలుగుతున్నప్పుడు పుస్తకాలకు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకనే భావనలో కొందరున్నారు. అలా అని అందరినీ ఒకే గాటన కట్టేయలేం. అందుబాటులో లేని పుస్తకాలకు పిడి యఫ్ ల పై ఆధారపడి , మార్కెట్ లో దొరికే వాటిని విధిగా కొని చదివే వారు ఉన్నారు.అయితే ఒకసారి  చదివేసిన పుస్తకాన్ని ఏంచేయాలి? పుస్తకాలను భద్రపరచుకోవటానికి ఒక గది అందులో షెల్ఫ్‌లు వగైరా ఏర్పాట్లు, చెదలు పట్టకుండా చూసుకోగల ముందు జాగ్రత్తలు – చాలా కథ ఉంది.

రానురాను పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణంలోనూ పుస్తకాభిరుచిని, సాహిత్య అభిరుచిని పెంచటానికి వ్యక్తిగత స్థాయిలో చిత్తశుద్ధితో పాటు పడుతున్న వారూ ఉండటం అబ్బురపరుస్తుంది. గుంటూరుకు చెందిన కాపు శ్రీనివాస్ పుస్తకాలను ప్రజలకు పరిచయం చేయడానికి వారి ముందుకు తేవడానికి మన మంచి పుస్తకం పేరిట వాట్సాప్ గ్రూపులను,యూట్యూబ్ ఛానల్ ను వ్యయప్రయాసలకు ఓర్చి నిర్వహిస్తున్నారు.దీంతో పాటు ఎంపిక చేసిన కొన్ని పుస్తకాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నారు. అలాగే ఉదయిని వెబ్ జర్నల్ నిర్వహణను భుజానికెత్తుకున్న కూనపరాజు కుమార్ రాజు కూడా ఈ కోవలోకే వస్తారు. కాపు శ్రీనివాస్ అయినా, కుమార్ అయినా తమ సమయాన్ని, డబ్బుని మరేరకంగానైనా  వెచ్చించవచ్చు. కానీ వారలా అనుకోకపోవడమే విశేషం. స్వార్థమే పరమార్థమైన ఈ కాలంలోనూ ఇలాంటి వారు ఉంటారా? అని ఆశ్చర్యపడాల్సి వస్తుంది. పుస్తకాలకు సంబంధించి ఇద్దరు సాహితీవేత్తలు చెప్పిన రెండు విషయాలు స్ఫురణకు వస్తుంటాయి. ప్రతి ఇంట్లో వంటగది ఉన్నట్లే పుస్తకాలకు కూడా ప్రత్యేకంగా ఒక గది ఉండాలని గుంటూరు శేషేంద్ర శర్మ అభిలషించారు. అలాగే ఏ పుస్తకం చదవాలి, ఎలా ఎంచుకోవాలన్న సందేహాలు పెట్టుకోకుండా, చేతికి వచ్చిన పుస్తకమల్లా చదివేస్తూ పోవాలి. కొంత ముందుకు సాగాక ఏ పుస్తకాలు చదవాలో, వేటిని పక్కన పెట్టాలో మనకు మనమే  నిర్ణయించుకోగలుగుతామని కొడవటిగంటి కుటుంబరావు పేర్కొన్నారు.

ఇక పుస్తకాలు చదివేవారు తగ్గిపోతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా రాసేవారు రాస్తూనే ఉన్నారు. ఏటికి ఎదురీదుతున్నారు. ప్రింట్ ఆన్ డిమాండ్‍లో యాభై వంద కాపీలు మాత్రమే అచ్చేసుకునే పరిస్థితి వున్నా ఉత్సాహంగా  రాయగలగటం వెనుక ఏదో బలమైన మానసిక కారణం ఉండి ఉండాలి.

పఠనంలో ఉన్న ఆనందమే రాయటంలోనూ తప్పనిసరిగా ఉంటుంది. మనసులోని భావాలను కాగితంపై పెట్టి పదుగురితో పంచుకోవటం ద్వారా రాతగాడు ఆనందం పొందుతాడు. నిజానికి రాసేటప్పుడే ఒక మానసిక ఆనందమూ, యోగముద్రదాల్చడమూ ఉంటుంది. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల పట్ల బాధ, స్పృహ కూడా రచయితను ఊరకే ఉండనివ్వవు. రాయటం ద్వారా కలిగే మానసిక ఆనందమూ పొందే గుర్తింపుతో పాటు ఏదో ఒక భావసారూప్యత గల రచయితల బృందంలో చేరగలగటమూ చోదకశక్తిగా పనిచేస్తుంది.

ఇంతకీ చదవటమూ రాయటమూ – ఈ రెండూ ఈ కాలంలో నిష్ఫల యోగాలేనా?

గోవిందరాజు చక్రధర్‍

Spread the love

2 thoughts on “ఇది ఒక అట్టర్ ఫ్లాప్ స్టోరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *