కొన్నిసార్లు కథ రాయటంకన్నా, చదవటమే భారంగా ఉంటుంది. అవును… కొన్ని కథలు జీవీతాల్లాగా ఉంటాయి. మరిచిపోయిన, కావాలనే మర్చిపోవాలనుకుంటున్న విషయాలని మళ్లీ గుర్తు చేస్తాయి. “నాగర్‌కోయిల్‌లో ఒక మంచి హత్య జరిగి చాలారోజులైంది” అని “తలఒగ్గనివాడు”తో టీకొట్టుదగ్గర మనిషి అన్నంత మామూలుగానే ఉంటుంది జీవితం కూడా. డబ్బున్నవాడికీ, లేనివాడికీ ఒకే కులంలో ఉన్నా అంతరం ఉంటుందనీ, ఇక కులం లేనివాడికి డబ్బున్నా పెద్ద తేడా ఉండదనీ తెలుస్తుంది.
ఈ భారతీయ సమాజంలో పితృస్వామ్య భావజాలం మలమూత్రాలతో సంగీతాన్ని, స్త్రీ ఆత్మగౌరవాన్ని ఎట్లా అభిషేకించిందో తెలుస్తుంది. (అమ్మవారి పాదం)
అవునూ… నెమ్మినీలం చాలా విషయాలని మళ్లీమళ్లీ ముళ్లులాగా గుచ్చిగుచ్చి గుర్తు చేస్తుంది. రాసేవాడి పీకమీద అచ్చువేసేవాడి కాలి ముద్రని స్పష్టంగా చూపిస్తుంది. (ధర్మం)
“పెద్ద జంతువుల మరణాల్లో ప్రతీ మూడింటిలో ఒకటి హత్యే, మనిషి చేసే హత్య” (ఏనుగు డాక్టర్) అడవులనీ, అడవి జంతువులనీ మనిషికోసం ఎంత నిర్థాక్షిణ్యంగా అంతరించిపోయే స్థాయిలో చంపుతున్నామో తెలిపే కథ. ఇషా వాళ్ల ఆశ్రమంకోసం “ఎలిఫెంట్‌కారిడార్ ధ్వంసం” అని పేపర్లో చదివేసి తరవాత వార్తకోసం వెతికినంత ఈజీగా బయటికి రాలేం.
“అఖిలన్‌కి ఙ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చారని కమర్షియల్ రచయితలు పండగ చేసుకోవడం, లాల్చీని జాతీయ వేశంగా ప్రకటించాలని జేబుదొంగలు కోరడం, ఈ రెంటికీ తేడా లేదని మనం అర్థం చేసుకోవాలి” అనే సుందరరామస్వామి మాటలు అతనికి గుర్తురావడం (రచయిత గుర్తు తెప్పించడం) ఊరకే అట్లా కథని పొడిగించటం కోసం కాకపోవచ్చు. ఇది కథకోసం కాదు, ఇది కేవలం పాఠకుడికోసం, రాబోయే రచయితలకోసం ప్రస్తావించారేమో అనిపిస్తుంది. నిజానికి ఈ “యాత్ర” కథలో సంభాషణలకోసమైనా మళ్లీమళ్లీ చదువుకోవచ్చు.
వంద కుర్చీలు, తాటాకు శిలువ లాంటి కథలు నిజంగా అవసరం, గ్రామీణ ప్రాంత కులవివక్షని, ఒకనాటి ప్రజల అతినమ్మకాలనీ మొహమ్మీద చరిచిమరీ చెప్పిన కథలు. మతం మారటం అంటే “ఒక బియ్యం బస్తా కి ఆశపడటం” అని గేలి చేస్తున్న సమాజాలకి ఆ బియ్యం బస్తా కూడా గతిలేని మతంలో ఎందుకు ఉండాలి? అనిపించదు. మతం మారటం వెనకాల “కేవలం” విశ్వాసం మాత్రమే కాదు అనేకరకాల వ్యధాపూర్తిత కారణాలుంటాయని గుర్తుచేసే కథ “తాటాకు శిలువ”. నిజానికి ఈ తరహా కథలు తెలుగు పాఠకులకు కొత్తేమీకాదు. కానీ జయమోహన్ కథనం ఆకట్టుకుంటుంది. సాదాసీదా మాటలు చెబుతున్నట్టుగానే మూలవిషయాన్ని మనసుకు చేరవేసే శైలి ప్రాణమైంది.
ఇన్నికథలూ నిజానికి చెప్పేది కొన్ని విషయలనే… ఈ దేశపు గమనాన్నే ఆపివేసే దారుణమైన విషయాలు, మనం విస్మరించిన ఆలోచనలు. జెండర్, కులం, వీటిని అనుసరించి ఉండే వివక్షా లాంటి విషయాలనే చర్చించాయి. అయితే కథలుగా వీటిని దిద్దిన తీరే పాఠకున్ని “ఆ ఎప్పుడూ వినే విషయాలే కదా” అనుకునే ఆలోచనని పక్కన పెట్టి చదివింపజేస్తుంది. భారత దేశ గ్రామీణ జీవితం అత్యద్బుతం అనే మాటని ఏమాత్రం కాదనకుండానే ఆ అద్బుతం అనే పొర వెనక ఉన్న అనేకానేక మచ్చలనీ గాయాలనీ చూపించటం ఈ కథల్లో సాధ్యపడింది.
తమిళ పేర్లు, తమిళనాడు ప్రాంతాలే ఉంటాయిగానీ ఇది తమిళ కథ అనిపించదు. అనువాదం అంటే అక్కడ ఉన్న లైన్‌ని మక్కీకిమక్కీ ఇక్కడ దింపేయటమే అన్నట్టుగా కాకుండా ప్రతీకథలోనూ సహజమైన అనుభూతి ప్రధానంగా తెలుగులోకి తీసుకురావటమే “నెమ్మినీలం” కథా సంపుటిని తెలుగుపాఠకులకు దగ్గర చేసింది.
తెలుగులో నెమ్మినీలం సాధించుకున్న ఆదరణకు మూలరచయిత జయమోహన్ ఎంత బాధ్యుడో, దానిని అనువాదం చేసిన అవినేని భాస్కర్ కూడా అంతే బాధ్యుడు.
For Copies – https://chaayabooks.com/product/nemmi-neelam/