షికారు మానేసి నా కథకి వస్తాను. వెయ్యి పడగల్లో దాచుకున్న పది రూపాయలు జేబులో పెట్టుకున్నాను. బాపు రాసిన ఉత్తరాల పుస్తకాలు, వుడ్ హౌస్, కాసిని తెల్లకాయితాలు – చెగోడీలూ – వేప్పుల్లా తాటాకు బద్దలూ మా బావకెవరో యిచ్చిన గైడర్ పెన్నూ (రాజమండ్రి-రత్నం కంపెనీది. ఇంగ్లీషు పార్కర్ తో సమానం) ఒక గుడ్డ సంచిలో వేసుకుని ఇంట్లో హర్బరుకని చెప్పి కదిలాను – తిన్నగా వాల్తేరు స్టేషనుకు పరిగెత్తాను. మెయిలు ఒకటిన్నరకి.
“మెడ్రాసుకి ఎంతండి” అన్నాను. టిక్కెట్ మాస్టరు నా అర గుండు వాలకం గమనించాడు. “ఇంట్లో చెప్పి వచ్చావా?” అన్నాడు అదోలా చూసి.
నేను రోషంగా కాలి మునివేళ్ళమీద లేచాను.
“అ యామ్ నైన్ టీన్ – అ యావే జాబ్ ఇన్ మెడ్రాస్” అన్నాను.
“జేబులో ఎంత ఉంది?” అన్నాడు – పదిరూపాయలు తీసి చూపించాను – అప్పుడు పది రూపాయల నోటు ఇప్పటి వంద నోటంత ఉండేది.
“అంతేనా” అన్నాడు –
“యస్” అన్నాను దీనంగా.
“సరే. ఎనిమిది రూపాయలకి టిక్కెట్టు ఎక్కడిదాకా వస్తే అక్కడిదాకా ఇస్తాను – రెండ్రూపాయలు తిండికి దాచుకో” అంటూ టిక్కెట్టు కొట్టి ఇచ్చాడు – ఏలూరుదాకా. అది తీసుకుని రైలెక్కాను – టిక్కెట్టు మరోసారి చూశాను. అట్టమీద ఏలూరు చూడగానే త్రిల్లయి పోయాను.
దేవుడు మంచాడే – నాకు తట్టనేలేదు – నేను ఖాళీ జేబుల్తో మెడ్రాసు వెళ్ళడం కన్నా ఏలూరు మజిలీ మంచిదే అనుకున్నాను.
ఏలూరులో వెంకట్రామా అండ్ కో హెడ్డాఫీసు ఉంది. ప్రొప్రయిటరు ఈదర వెంకట్రావు పంతులుగారు. మా కజిన్ బ్రదర్స్ కి బాగా తెలుసు. మాదొడ్డమ్మ పెద్ద కొడుకు శ్రీపతి వెంకట్రావు సినిమా పోస్టర్లూ, బ్యానర్లూ రాసే పెయింటర్. చిన్నన్నయ్య నరసింహారావు బియ్యే – అతనిది ప్రవాసి అనే నవల పంతులుగారు అచ్చువేశారు. అది స్కూళ్ళలో నాన్ డిటెయిల్డ్ కూడా. అంచేత నా కథలు అచ్చువేస్తే వందో వెయ్యో వస్తుందని ఆశ.
అంతేకాదు – మేము చాటపర్రులో హాండే మేడ్ పేపరిండస్ట్రీ నడిపినప్పుడు – వారం వారం మూడు రీములు ఖద్దరు పేపరు తీసకెళ్ళి పంతులుగారి ప్రెస్సులో అమ్మేవాళ్ళం. అప్పుడప్పుడు పంతులుగారు కనిపిస్తే దండం పెట్టేవాళ్ళం. ఆయన మా అమ్మనీ దొడ్డమ్మనీ (పెయింటరు వెంకటరావు తల్లి) పలకరించేవారు బాగున్నారా అని.
పంతులుగారు చాలా మంచివారు. గొప్పదాత. నేను రాజమండ్రిలో సెకండు, తర్డు ఫారాలు చదువుతున్నప్పుడు క్లాసు పుస్తకాలు ఊరికే ఇచ్చారు.
ఆ రోజుల్లో “ఈ కుర్రాడు పేదవాడు” అని క్లాసు టీచరు చీటీ యిస్తే అలాటివాళ్ళకు టెక్స్ట్ బుక్సూ, కొన్ని నోటు బుక్సూ ఊరికే ఇచ్చేవారు – వెంకట్రామా అండ్ కో వారు. అప్పుడు రాజమండ్రిలో రౌతు చంద్రయ్య, కొండపల్లి వీరవెంకయ్య, మాజేటి, రామా అండ్ కో – ఇలా ఎన్నో. అన్నిటిలో ఇదే గొప్పది.
నా టిక్కెట్టు ఏలూరుదాకా సరిపోవడం దేవుడిచ్చిన మంచి శకునం అనుకున్నాను. ఏలూరులో దిగేసరికి సాయంత్రం ఆరయింది. పవర్ పేటలో దిగాను. రైల్వే కుళాయి దగ్గర మొహం తొల్చుకుని జుట్టు తడిపి దువ్వుకోబోయాను. కుచ్చుటోపీ !
వెంకట్రామా ప్రెస్సుకేసి వెళ్ళాను. పంతులుగారు అప్పుడే ప్రెస్సునించి ఇంటికి వెళ్తున్నారు. ఇల్లు దగ్గరే నడిచే వెళ్తారు. లక్షాధికారి అయినా ఆయన సామాన్యుడిలాగానే ఉంటారు. వెళ్ళి దండం పెట్టాను.
“ఎవరు?” అన్నారు.
“నా పేరు ముళ్ళపూడి వెంకట్రావండి” అన్నాను.
“అంటే చిన్న వెంకట్రావా” అన్నారు. మా పెయింటరు అన్నయ్య శ్రీపతి వెంకట్రావు వాళ్ళ కంపెనీకి పెయింటింగు పనులు చేస్తూ ఉండేవాడు… రామనవమి పందిళ్ళలో గజ్జె కట్టి భజనలు చేసేవాడు. అతనంటే నాకు చిన్నప్పటినుంచీ గ్లామరు. నా అసలు పేరు వెంకటరమణ అయినా – ఏడ్చి గోల పెట్టి వెంకట్రావు అని మార్పించుకున్నాను. చిన్నప్పుడే అతనితో రాజమండ్రి వెళ్ళేవాడిని. సైను బోర్డులు సోడా నీళ్ళతో కడగటం, పోస్టర్లకి రంగులు అందించటం చేసే వాడిని. అలాగ పంతులుగారు నాలుగైదుసార్లు చూశారు. నన్ను చిన్న వెంకట్రావు అంటూ వుండేవారు.
“ఏమిటి సంగతి” అనడిగారు నడుస్తూనే.
“మెడ్రాసు వెళ్తున్నానండి ఉజ్జోగానికి”
“ఏం చదివావు?”
“స్కూలు ఫైనలండి”
“అక్కడ ఏం చేస్తావు?”
“కథలు రాస్తానండి – ఏదేనా పత్రికలో చేరతాను” అన్నాను.
“కవిగారివన్నమాట”
ఇల్లు చేరాం.
“సామానేది?” అనడిగారు.
చేతిలో గుడ్డసంచి చూపించాను.
“ఇంట్లో చెప్పి వచ్చావా?” అన్నారు గుమ్మం దగ్గర ఆగి.
“సరస్పత్తోడండి” అన్నాను నెత్తిన చెయ్యి పెట్టుకుని.
ఆయన పకాలున నవ్వారు.
“అదేమిటి – స్కూలు ఫైనలంటావు – కవిగారినంటావు – సరస్పతి అనవచ్చునా – సరస్వతి అనాలిగదా” అన్నారు.
“సరస్పతి అంటే అమాయకంగా ఉంటుంది. ఒట్టేస్తే నమ్ముతారు” అన్నాను ఆలోచించకుండా. “అబ్బో ఘటికుడివే – మరి సరస్వతి అంటూ నీ నెత్తిమీద చెయ్యి పెట్టుకుంటావేం?”
“సరస్వతి ఉండేది ఇక్కడే గదండీ”
పంతులుగారు నాకేసి దీర్ఘంగా చూశారు.
అప్పటికే ఇంటి ఇల్లాలు – సుబ్బలక్ష్మమ్మగారు మెట్ల దగ్గర నించున్నారు. పంతులుగారికి కాళ్ళకడుగు నీళ్ళందించడానికి – పంతులుగారు తలపాగా గొడుగు పనిమనిషి చేతికిచ్చి ఇల్లాలి చేతినించి చెంబు అందుకుని కాళ్ళు కడుక్కుని మిగతా నీళ్ళతో మొహం తొల్చుకున్నారు. అమ్మగారు తువ్వాలు అందించారు.
“చిన వెంకట్రావు. మన పెయింటర్ శ్రీపతి వెంకట్రావు తమ్ముడు – మెడ్రాసు వెళ్తూ నన్ను చూడవచ్చాడు- నాల్రోజులుంటాడు” అన్నారు.
నేను ఆవిడకి దండం పెట్టాను – ఆవిడ మహాలక్ష్మిలాగా ఉన్నారు. దయగా చూశారు.
“కాళ్ళు కడుక్కుని లోపలికి రా నాయనా” అంటూ పంతులుగారి వెంట లోపలికి వెళ్ళారు.
గడప దగ్గరే చిన్న గంగాళం చెంబూ ఉన్నాయి – పనిమనిషి నీళ్ళు అందించింది – నేను వంగి కాళ్ళ మీద నీళు పోసుకున్నాను.
“అదేంటి – జోళ్ళిడవండి- అయి తడపక్కర్లేదు” అంటూ ఆగిపోయింది. నా కాళ్ళకి జోళ్ళు లేవు. ఏలూరు దుమ్మూ. అంతకు ముందున్న మట్టీ జోళ్ళలాగే ఉన్నాయి. కడగటానికి రెండు చెంబుల నీళ్ళు పట్టాయి. పనిమనిషి ముఖం తిప్పుకుని నవ్వాపుకోడం చూశాను.
“ఇంకో చెంబెడునీళ్ళు తీసుకుంటాను – మొహం కడుక్కోడానికి. ఒకటి చాల్లే అమ్మా” అన్నాను సందేహిస్తూ.
“అదేటలాగంటారు – రెండు సెంబులుకాదు – నాలుగు సెంబులు నీళ్ళు తీసుకోండి – నీళ్ళేగా” అందా అమ్మాయి –
లోపల నడవలో కూర్చున్నారు పంతులుగారు. ఆ వెనక పెరట్లో తులసికోటలో దీపం. ఎందుకేనా మంచిదని అక్కడినించే దీపానికి దండం పెట్టాను. అటు చూశాక నిజంగానే దండం పెట్టబుద్దేసింది. ఇది నాటకం కాదు – నిజం.
పంతులుగారు ఓవల్ టిన్ తాగుతూ నాకూ ఇప్పించారు.
“ఇలా చేస్తే తప్పు కాదూ” అన్నారు.
నేను ఇంట్లో చెప్పకుండా వచ్చానని నేను చెప్పకపోయినా ఆయనకి తెలిసిపోయింది. నేనింక బుకాయించలేదు.
“నీ గురించి మీ వెంకట్రావు చెప్పాడు. బతికి చెడ్డ కుటుంబం… ఇలా చెప్పకుండా వస్తే మీ అమ్మావాళ్ళూ భయపడరా – ఏడవరా” అన్నారు.
“చెప్పితే ఒప్పుకోరండి – నన్ను హార్బరులో కూలీగా పెట్టారు. నాకిష్టంలేదు. నాకు మెడ్రాసులో వుజ్జోగం వస్తుంది” అంటూ నా పరిస్థితీ, నా కోరికా చెప్పాను.
ఆయన ఓ కార్డు తెప్పించారు. “దీని మీద కులాసాగా ఉన్నానని మీ అమ్మగారికి రాయి. ఎడ్రసు సరిగ్గా రాసి నాకివ్వు – మాది స్కూలు పుస్తకాల కంపెనీ – నీలాటివాళ్ళకి లాయకీ కాదు. అయినా నీ కథలు రాసి చూపించు – నాలుగురోజులు ఇక్కడే వుండి రాయి – మేడమీద చోటు చూపిస్తారు” అన్నారు.
పంతులుగారి యింట భోజనశాల చాలా పెద్దది. ఇరవై అడుగుల వెడల్పూ, యాభై అడుగుల పొడుగును. నిత్యం ముప్ఫయి నలభైమంది ఆయన పంక్తిని కూర్చుంటారు. వరసగా పీటలు వేసి ఉంటాయి. అన్నిటికీ వెండి అమర్చి ఉంటాయి. కంచు చెంబులూ, రాగి పంచపాత్రలూ, ఉద్దరిణలూ… ఇలాటి భోజనశాల మెడ్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారింట్లో (శ్రీబాగ్) చూశాను. ఇలాటి ఇళ్లలో ఇంటివారూ చుట్టాలూ, స్నేహితులూ మాత్రమే కాదు, పేదవారూ, వారాలవారూ (వారంలో ఒక్కో రోజు ఒక్కో ఇంటి చొప్పున భోజనం చేసి చదువుకునే విద్యార్థులు) వుంటారు. అది సంప్రదాయం – మర్యాద.
చక్కటి రుచికరమైన భోజనం. నేయి చెంచాలతో కాకుండా కొమ్ముచెంబుతో ధారాళంగా చాలనేదాకా వడ్డిస్తారు. కాళిదాసు అన్నట్టు – మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధిః – పండు వెన్నెల్లా తెల్లగా ఉన్న గడ్డ పెరుగు (గేదెపాలతో), వంటవాళ్ళు తనకి మారు వడ్డించబోతే “ముందు ఆ చివర్నించి అడిగి వడ్డించండి – వాళ్ళు తింటేనే దేవుడు ఆరగించినట్టు, అందరికీ సమానంగా పెట్టండి” అనేవారు పంతులుగారు. అటువంటి తెలుగు భోజనం – అంత కన్నుల పండగ్గా నేను ఎప్పుడూ తినలేదు – తినడమే కాదు – కనలేదు… అన్నదాతా సుఖీభవ అనుకున్నాను మనసులో.
నా దగ్గరున్న అరదస్తా కాయితాలమీద నాలుగు రోజుల్లో నాకు తోచినవి పది చిన్న కథలు రాసేశాను. నాలుగోరోజు సాయంత్రం పంతులుగారికి చూపించాలి – కథలు చదువుకున్నాను – బాగున్నాయి. సంతోషం వేసింది. పంతులుగారు రావటానికి ఇంకా టైముంది. హఠాత్తుగా సిగరెట్టుమీదకి మనసుపోయింది. చాలా రోజులయింది సిగరెట్టు కాల్చి -బయటకు వెళ్ళాను. పవర్ పేట రైలు స్టేషనులో కొట్టు వుంది.
“వాచిగాని పాసింగ్ షోగాని ఉన్నాయా” అన్నాను పరాగ్గా.
“అవి తాతలకాలం నాటివి. ఇప్పుడు సిజర్సు, బర్కి, ఒక్కోటి అర్థణా” అన్నాడు.
“అరువిస్తావా” అన్నాను.
“రేపు రా” అన్నాడు.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా సంచిలో ఓ గుడ్డలో పావలా కాసు ముడుపులా వుంటుంది. ఎమర్జెన్సీ కోసమని. అది తెచ్చిచ్చి సిగరెట్టు కొందామని మళ్ళీ ఇంటికి పరిగెత్తాను.
మేడమీద పాతసామానులు ఉన్న ఒక గదిలో నాకు చోటిచ్చారు. అక్కడే ఓ మడత మంచం, దిండూ, దుప్పటి, తువ్వాలూ ఇచ్చారు. ఒక గుళ్ళీ చెంబుతో నీళ్ళు. నా కథలూ పుస్తకాలూ వున్న సంచిలోంచి పావలా తీద్దామని చూస్తే – వంకెకు తగిలించిన సంచీ గల్లంతు! అక్కడ లేదు. గది అంతా వెతికాను. పక్కన హాలు, వసారా అన్నీ వెతికాను – సంచి లేదు!
ఏడుపు తన్నుకొస్తోంది. ప్రెస్సు ఆఫీసుకి పరిగెత్తాను – ఏడుస్తూనే పంతులుగారికి చెప్పాను. ఇలా సంచి పోయిందనీ, సంచిలో కథలు కూడా పోయాయనీ… ఆయన నావంక రెండు క్షణాలు తేరిపార చూశారు. మా ఇంట్లో దొంగలేమిటని ఆశ్చర్యంలేదు – చిరాకులేదు – శాంతం.
“ఇది దేవుడి పనే… దేవుడు ఏం చేసినా మంచికే – నువ్వు మంచి కథలు రాస్తావు – రాయగలవు – సరస్పత్తోడు” అంటూ తలపైన చెయ్యి పెట్టుకున్నారు… అంత ఏడుపులోనూ నాకు నవ్వు వచ్చింది. ఆయనా నవ్వారు.
“అద్గదీ అలా నవ్వుతూ వుండు” అంటూ సొరుగు లోంచి ఓ కవరు తీశారు. “ఇవ్వాళ నీకివ్వాలని ఇందాకనే తీసిపెట్టాను. నూట పదహార్లు – ఇంకో గంటలో మెడ్రాసు మెయిలు – సంచి గించీ ఎలాగూ లేదు కాబట్టి పరిగెట్టికెళ్ళి రైలెక్కెయ్” అంటూ కవరు చేతికిచ్చారు.
నేను చేతులు జోడించాను. మాట రాలేదు. గుటకలు మింగాను.
‘మెడ్రాసులో కూడా కష్టాలుంటాయి – నాకైనా నీకైనా ఎవరికైనా తప్పదు – చూడూ – కష్టాల్లోనే ధైర్యంగా వుండు, సుఖాలొస్తే భయపడుతూ వుండు – జాగర్త. నేను మెడ్రాసొస్తే మీ అన్నయింట్లోనే (2/27, రాయపేట హైరోడ్డు) దిగుతాను…. ఉద్యోగిపై కనిపించు” అన్నారు.
(ఆయన లక్షాధికారి, కన్నెమెరా, ఉర్లాండ్స్ హెూటల్లో దిగగలరు. కాని పూజ, మడి, ఆచారం, నిష్ఠ, అందుకని అన్నయ్య వున్న గదిన్నర వాటాలోనే దిగేవారు ఆయన మంత్రి పాలంకయ్యగారితో…)
పరిగెట్టుకుని ఇంటికెళ్ళి అమ్మగారి కాళ్ళకి మొక్కాను. “ఏమిట్రా” అంటుంటే జవాబు చెప్పకుండా పరిగెత్తాను. పవరుపేట స్టేషనుకెళ్ళాను. మెయిలు కదుల్తోంది. ఓ పెట్లోకి ఎగిరి దూకాను…
ఆనాడు పంతులుగారిచ్చిన దన్నూ ధైర్యాలే మెడ్రాసులో నన్ను ముందుకు నడిపాయి. నాకు వచ్చిన విజయాలూ జరిగిన మంచీ ప్రాప్తించిన సౌభాగ్యం వారి చలవేనని ఎన్నటికీ మరిచిపోను. సుమారు యాభై ఏళ్ళ తర్వాత 1999లో ఏలూరులో శ్రీ గుప్తా ఫౌండేషన్ వారు నన్నూ బాపునీ సత్కరించి లక్షన్నర బహుమతి ఇచ్చినపుడు – నేను సంతోషంతో పొంగిపోయాను. కంటనీరు తిరిగింది – శ్రీ మోహన్ గుప్తా గారు నాకు చేసిన సన్మానం – నన్ను ముందుకు నడిపిన శ్రీ ఈదర వేంకటరావు గారికి పుష్పాంజలిగా స్వీకరించాను.
* * *