మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె Part 5

Spread the love

ఇది దేవుని ముచ్చట, దేవున్ని తయారు చేసుకున్న ముచ్చట ఏ మసీదూ కూలగొట్టకుండా, ఏ మనిషీ సావకుండా పుట్టిన దేవుని ముచ్చట, అన్నీ పోయిన మా ఊరితో పాటే కనుమరుగైన సమ్మక్క దేవి ముచ్చట. దేవుడంటే మనకు భయం గానీ కోట్ల రూపాయలు సంపాయిచ్చే శింగరేనోనికి భయమెందుకుంటది? ఊళ్లే అనుమాండ్ల గుడికే దిక్కులేకుంటే ఊరవతలి సమ్మక్క శెట్టు ఎవలకు లెక్క?

1997 సంవచ్చరంల ఓ తెల్లారి బొగ్గుపొయ్యిల పొగతోటే కిందవడ్డ శెట్టు లేశి నిలవడ్డదనే ముచ్చట కూడా ఊరంత కమ్ముకున్నది. పోయిన ఆనకాలంల గాల్దుమారానికి కిందవడ్డ దుర్శెన్ శెట్టు అమాంతం లేశి నిలవడ్డదాట అనే ముచ్చట నేను బడికివొయి అచ్చెటాళ్లకు… సమ్మక్క దేవత మా ఊళ్లెకు అచ్చిందని చెప్పుకునే దాక అచ్చింది. మగలిపల్లె, పెద్దం పేట ఊళ్లల్ల జనమంతా ఆడ మోపై బిందెలతోటి నీళ్లు, కొబ్బరికాయలు పట్టుకోని వచ్చుడు షురువైంది… రెండు రోజులల్ల శెట్టు ఇగురచ్చి చిన్న ఆకులు కూడ కనిపిచ్చినయ్. సత్తెంగల్ల తల్లి సమ్మక్క దేవి మంగలిపల్లెకచ్చిందని దేవుడచ్చిన మనుషులు కూడ తూలుకుంట చెప్పేటాళ్లకు మంది సూసుటానికి ఎగవడ్డరు.

“నీయవ్వ శెట్టు లేసుడేంది? అది దేవుడేంది? అని మా నానలెక్క ఒకలిద్దరు మాట్లాడినా” అందరూ నమ్మేకాడ ఇసోంటి ముచ్చట అనద్దని మా అమ్మసోంటోళ్లు గద్దిరిచ్చి ఊకుంచిండ్లు.

ఓనాడు మా దోస్తు బొందుగుల సది గాడూ నేనూ ఆయొక్క సమ్మక్క దేవీ దర్శనానికి బయిలెల్లినం. మా ఇంటికాన్నుంచి డాక్టర్ సత్తెన్న వాడ మీదికెల్లి మమతా బడి దాటి నడుసుకుంట వోతాంటే. “మొన్న నైటు ఒకాయినె సైకిలేస్కోని ఆ శెట్టుకాన్నుంచి అత్తాండాట శెట్టుకాడికి రాంగనే “, “ఓ బిడ్డా” అని పిల్శిందాట ఎనుకకు సూత్తే ఎవ్వలు కనవడలేదాట, అటూ ఇటు సూసి సైకిలు తొక్కుతే ఇంచు కూడ కదలలేదాట సైకిలు. కిందికి దిగి దొబ్బినా కలదుల్తలేదని పర్షానైతుంటే ఎవలో ఆడోళ్ళు నవ్వినట్టు ఇనిపిచ్చిందాట, గంతే ఆయినె ఏడ్సుకుంటా శెట్టుకు మొక్కి “సమ్మక్క తల్లీ నీకు బంగారం ఇచ్చుకుంటా నన్ను ఇడ్షిపెట్టు అని మొక్కిండాట, ఖతం ఇగ సైకిల్ దానికదే తొక్కకుంటనే ఊళ్లెదాక తెచ్చిందాట….” చెప్తున్నడు మా సదిగాడు. అయితే ఆ సైకిలాయినె ఎవలో, గంత అర్థరాత్రి సైకిలేస్కోని అటుదిక్కుకు ఎందుకు పోయిండో మాకు తెల్వది. మాకేంది, ఆ మనిషి ఎవలో మా ఊళ్లె ఎవ్వలకూ తెల్వదు. మెల్లగ మూడు నెలలు అయిపోయినయ్ సంకురాత్రి సెలువులు, మా ఆర్నెళ్ల పరిక్షలూ అయిపోయి ఫిబ్రవరిల సమ్మక్కల పున్నం దగ్గర వడ్డది. మేడారం జాతరకు పోయేటోళ్లలో సగం మంది, గోదార్ఖని మంచిరాల బిర్జికాడి జాతరకు పోయే సగం మంది… మా ఊరికే అచ్చుడు మొదలైంది. ఇంకేందిగ పెద్దంపేట మంగలి పల్లె పెద్దమనుషులంతా గూడి సమ్మక్కజాతర కమిటీ లెక్క తయారైండ్లు. శెట్టుదాక మంచి బాటవడ్డది. ఇంకో పది రోజులల్ల సమ్మకల పున్నం అనంగ మా నాన, అమ్మా నేనూ కొత్తగ పెండ్లైన మా కిట్టక్క, మా బావ అందరం కలిషి సమ్మక శెట్టు సూడవోయినం. అక్కడిదాంక వోంగనే మానాన “వోర్నీయవ్వ గాలికి ఏర్లకాడ మట్టిగడ్దతోని శెట్టు ఇర్సుక పడ్డది, మీది కొమ్మలు కొట్టేశిండ్లు. మట్టి బరువుకు మొట్టు నిలవడ్డది” అననే అన్నడు మానాన.

“ఇగో ఉత్తపచ్చి మాటలనకు నువ్వు, దేవునితోని పరాష్కమా?” అన్నది మా అమ్మ. కానీ నిజం నిజమే కదా. ఓపెన్ కాస్ట్‌ల గుట్క దెబ్బ ఏగినప్పుడల్లా(బ్లాస్టింగ్) మా ఊరు ఊరంతా భూకంపం అచ్చినట్టు అదురుతుండే. ఇండ్లన్నీ శిన్నగ ఊగుతుండే. ఆ అదుర్లకు పర్రెలువాయని గోడ ఉండేదికాదు ఊళ్లె. ఇవన్నీ కలిపి సూస్తే మానాన మాటే నిజమనిపిచ్చింది నాకు. కని, మా ఊళ్లే సమ్మక్క జాతర జరుగుతదనే సంబురం ఇంకా ఎక్కువ ఉండె కావట్కి, నేను మా నాన మాటలు పట్టిచ్చుకోలే. అమ్మా, కిట్టక్క, రమక్క (మా అమ్మ చెల్లె) కొబ్బరికాయలు గొట్టిండ్లు. అందరం దంఢం బెట్టుకున్నం. ఆ దాపుల అంతా కోడి బూరు, రాళ్ల పొయ్యిలూ కనిపిచ్చినయ్. అప్పటికే కొందరు మొక్కులు మొక్కి కోళ్ళను కోసుకుని పోయినట్టున్నరు.

అచ్చేటప్పుడు సంకకేసుకున్న బ్యాగులకెంచి కెమెరా తీశి ఫొటో గుంజిండు మా నాన. ఆ తర్వాత ఆయినె మళ్ళా ఆ శెట్టుకాడికి రాలే, జాతర మొకం కూడా సూడలే.

*** **** ****

“ఇన్నోల్లెవలో ఇననోల్లెవలో… మనూళ్లె సమ్మక్క జాతర అయితుంది, మంది మొత్తం ఆడికే రావాల్నని సర్పంచి సాబ్ చెప్పుమన్నడుల్లో” అని రెండ్రోజులు డప్పుకొట్టుకుంట తిరిగిండు మాదిగ వాడల ఉండే తోకల సాయిలు. ఊరికి మాటజెప్పుడు అయిపోయినంక మహెందర్ రెడ్డి ఇంటికాడ ఇంత గుడంబ తాగి ఇంటికి పోయేటిదాక పోరలమంత ఆయినెతోనే తిరిగినం.

జాతర మొదలైనంక మనిషిన్ని పైసలేస్కోని అన్ని సౌలతులు చేసిన పెద్ద మనుషులంతా జాతర కాడికి జేరిండ్లు. మాదిగోళ్లు డప్పులు గొట్టంగ ఎర్కలి ఇండ్లల్లనుంచి ఒక పందిగున్నను పట్టుకచ్చిండ్లు. గుడంబ దాగి రిమ్మమీద ఉన్న కోయపూజార్లు అచ్చిండ్లు. భూపాలపల్లిదిక్కు అడివిల నుంచి తీస్కచ్చిండ్లాట ఆళ్లను. పందిని కోశి, రౌతం పారిచ్చి, దాని తల్కాయ, ఒక కాలు ఆడ బొందవెట్టి డప్పులు మోగుతాంటే బండారు సల్లుకుంట, ఆగమాగం ఎగురుకుంట, శెట్టుకు అసుంట కొత్తగ కట్టిన సమ్మక్క దేవి, సారలమ్మ దేవి, పైడిద్దరాజు గద్దెల కాడికి ఉరికిండ్లు. శిన్నపోరగాండ్లమంతా భయంతోటి పక్కకు నిల్సున్నం.

జాతర నాడు మా అమ్మ, పెర్కోళ్లత్తమ్మ, కుమ్మరోళ్ళత్తమ్మ, ఏరువోళ్ల వదినే, మిట్టోళ్ళక్క అందరూ కొత్త శీరెలు గట్టుకోని తాంబాలాలల్ల పూలు, కొబ్బరికాయలు వట్టుకోని బైలెల్లినంక ఆళ్లందర్నీ సూసుకుంట నడుస్తున్నం.

“అవ్వబిడ్దలిద్దరు, రాజులమీదికి కొట్లాటకు వొయ్యిండ్లాట, మొగడు, కొడుకూ సచ్చిపోయినా ఆడిదాన్ని అనుకోకుంట ఆళ్లని అందర్ని సంపి బిడ్డతోని కలిశి కంకవనంల మాయమైందాట. మేడారం కాడ పేద్ద జాతర గాదు బిడ్డ. అప్పట్ల గుండ్లు గియ్య పోతుండ్రి మావోళ్లు. నా కొడుకుతోటి ఓపాలి పోయచ్చిన… ఎనుకట సూడావును బలిత్తురట” అని శెప్పుకుంట నడుస్తుంది మా అవ్వ గట్టమ్మ.

జాతర కాడికి పోయి, అక్కడ కొబ్బరి కుడుకలు, బెల్లం… బగ్గ తిని, పెద్ద జాతరల ఉన్నట్టే బొమ్మలమ్మెటోళ్ళు, గుత్తకు పాడుకున్న కొబ్బరికాయ, బెల్లం, బోల్ పేలాలు, శిల్కల దండల దుకాండ్లు పడ్దయ్. అవ్వన్ని సూసుకుంట మస్తు తిరిగినం. ఆ రెండ్రోజులూ జాతరంతా మామీదికెళ్ళే ఎల్లింది ఇగ. రాత్రి అయినంక ఆ ఎన్నెల ఎలుగుల అచ్చి పోయేటోళ్ళని సూసుకుంటా ఇంటికి అచ్చినం. మేడారం జాతర లెక్క మావూరు కూడా అయితదాట అని చెప్పుకున్నం.

*** **** ****

అట్లా రెండేండ్లకోసారి మూడుమాట్ల మంచిగనే జరిగింది జాతర. కని ఓసీపీ బాయి ఇంకా పెద్దగ తవ్వుకుంట అచ్చిండు శింగరేనోడు. ఆడ తవ్విన మొరం మట్టి మొత్తం సమ్మక్క శెట్టున్న దాపుల్లన్నే పోసుడు మొదలైంది. ఊళ్లె పెద్దమనుషులు జీయం ఆఫీసు సుట్టు తిరిగి, మా సమ్మక్క దేవిని కాపాడుమని బాయిదొరలకు మొక్కుకున్నరు. శెట్టు కాడా, గద్దెల కాడ కొంత జాగ ఇడ్శిపెట్టి తొవ్వబాట ఉంచి, బాజుపొంట సుట్టూరంగ మట్టివోశిండ్లు.

ఊరు కనబడని సమ్మక్క తల్లి బెంగటిల్లిందో యేమో. మెల్లగ మా సమ్మక్క శెట్టు ఎండిపోయింది. మొదలంటా ఈడుసక పడ్డ సమ్మక్క శెట్టు, కొమ్మలన్నీ నరికినా లేశి నిలవడి ఇగుర్లేశిన శెట్టు. సుట్టూ వచ్చిన మట్టిగుట్టలకు, బయ్యబయ్య సప్పుడు చేసే డంపర్ల మోతకు మొట్టులెక్క అయి ఎండి పోయింది. ఆ ఒక్క శెట్టే కాదు చుట్టుపక్కల చెట్లన్నీ ఎంత గోసపడ్డయోగనీ అన్నీ అట్లనే మోడులై నిల్సున్నయి. అట్లా ఓ అయిదేండ్లకు అంటే మూడు జాతరలు జరిగినంక ఓనాడు, తిరిగద్దాం అని అటుదిక్కు పోతే… ఎండిపోయిన సమ్మక్క చెట్టును చూసి కండ్లల్ల నీళ్లచ్చినయ్. నేనూ, నా దోస్తు సదిగాడూ శీకటయ్యేదాకా అక్కన్నే కూసున్నం. రాత్రైనంక బయిలెల్లే టప్పుడు “ఓ బిడ్డా” అని ఏవలన్న పిలుస్తరేమో అనుకున్న, నా సైకిలు కూడా కదలకుంట అయితే “బంగారం కొల్త సమ్మక్క తల్లీ అని మొక్కుదామనుకున్న” కానీ ఏ పిలుపూ ఇనవడలేదు… అందరూ ఇడిశిపెట్టిపోతున్న ఊళ్ళే తనకు మాత్రం ఏం పని ఉందనుకుందో యేమో… సమ్మక్క దేవి కూడా ఎల్లిపోయినట్టున్నది.

ఇప్పుడు మాఊరి జాతర జరుగుత లేదు… కనీసం ఆ మోడు అక్కన్నే ఉన్నదో శింగరేని మట్టికుప్పల్ల మునిగిపోయిందో తెల్వదు…

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *