ఇకపై కూడా ఆ పిల్లిని అలా ఊరికినే వదిలెయ్యడం కుదరదు. అతడి గ్రామంలో పిల్లిని ఏ ఒక్కరూ ఎడమ చేతితో కూడా ముట్టుకోరు. పిల్లి ఒంటిపై నుండి ఎప్పుడూ దాని రోమం ఊడిపడుతూనే ఉంటుంది. ఒక మనిషి దాన్ని ముట్టుకుని ఒక వెంట్రుక ఊడిపడినాసరే అతడికది నరకం. ఆ నరకం నిశ్చయమైనాసరే, ఇక్కడ బొంబాయిలోని ఈ పిల్లి చచ్చేతీరాలి.
అతడు ఆ చర్చ్‌గేటును వదిలి ఈ బాంద్రాలోకి అడుగుపెట్టగానే అతడి సంతోషానికి అవధులులేవు. చర్చ్‌గేటులో పని మాత్రమే కాదు, పడుకోవడం కూడా ఆ టీ కొట్టులోనే. గోధుమ పిండి, శనగ పిండి, మరిగించిన పాత నూనె, ఉల్లిపాయల మూటతో పాటు అక్కడ మరో ఇద్దరి వ్యక్తులతో కళ్ళు మూసుకొని విశ్రమించాలి.
కేవలం నాలుగంటే నాలుగు గంటలే. ఈలోపు తెల్లారేసరికల్లా వార్తా పత్రికలు వేసే కుర్రోళ్ళు పత్రికలను కట్టలు కట్టుకుని వాలిపోతారు. బాంద్రాలో నాలుగు గంటలే నిద్రపోయినప్పటికీ, తనకంటూ ఒక గూడు వుంది. అది ఒక అపార్టుమెంటు డాబా మీద నీళ్ళ తొట్టెల మధ్య తగరపు రేకులతో నిర్మించబడ్డ షెడ్డు. పక్క మురికెత్తి పోయినప్పటికీ అక్కడ తానొక్కడే పడుకునేవాడు. అతని లోటా; అతని గుడ్డముక్కలు; అతని వంటగిన్నెలు; అతని వంట స్టౌవ్; భవనానికి నిప్పు అంటుకుంటే తప్పించుకునేందుకు అనువుగా నిర్మించిన ఇనుప నిచ్చెనమెట్లు, అతడు అర్ధరాత్రుల్లో ఎవరి తలుపులు బాదకుండా డాబాకు చేరుకోవడం కోసమే కట్టారు అన్నట్టుంటుంది.
ఒక పిల్లి అందులోకి తలుపు తట్టకుండానే లోపలికి దూరడం బాగా అలవరచుకుంది. అతడు రాత్రిళ్ళలో పడుకోబోయే ముందు మజ్జిగ తాగేందుకని, పెరుగు కోసం పాలు తోడు పెడతాడని ఎలాగో పసిగట్టింది. దానిని ఒక పెద్దగిన్నెతో బోర్లించి పెడతాడని కూడా పసిగట్టి, దానిని అక్కడ అటకపై నుండి పూర్తిగా కిందకు తోసి, తాగేసి అక్కడి నుండి మెల్లగా జారుకొనేది. అతడు క్రితం రోజు కూడా చీకట్లో తలుపు తెరవగానే చెప్పులకు, కాలికి పెరుగు అంటుకుంది. ఎంత బలంగా అదిమి తుడిచినప్పటికి నేలంతా కంపు కొట్టసాగింది.
టీ కొట్టు పనిలో సహించలేని విషయం ఏమిటంటే, మేజాని, నేలని తుడిచేటప్పుడు వచ్చే కంపు. ఆ కంపు ఇప్పుడు అతడి గదిలోనూ వస్తోంది. అతడు కిటికీ తలుపును మూశాడు. బహుశా, గతంలో కూడా ఆ పిల్లి ఈ కిటికీ గుండానే వచ్చి వుండాలి. కిటికీని ముయ్యడం మొదలెట్టిన రెండు రోజులు అంతా బాగానే నడిచింది. ఆ తరువాత మళ్ళీ ఎప్పటిలానే నేలను తుడిచాకనే పడుకోవాల్సి వచ్చేది. ఆ ప్రదేశపు పైకప్పు కూడా తగరపు రేకుతోనే నిర్మించబడింది. తలుపును ఆనుకొనున్న పైకప్పుకు తలుపు కొట్టుకోకుండా ఉండేందుకు తలుపుకు, పైకప్పుకు మధ్య ఒక చిన్న సందు ఉంది. ఆ పిల్లి దానిని కూడా పసిగట్టింది.
అతడు ఆ సందును మూసేందుకని ఒక అట్టను వేలాడదీశాడు. తలుపును మూసేటప్పుడు అట్టను ఎత్తిపట్టి వుంచి సందు కనబడేలా ఒక కర్రముక్కను అడ్డం పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లి లోపలికి వెళ్ళగలదు. అయితే, అది అలా లోపలికి రాగానే ఆ అట్ట వెంటనే మూసుకుపోతుంది. పిల్లి ఎంత గింజుకున్నా అక్కడి నుండి బయటకి తిరిగెళ్ళడం అసాధ్యం.
ఆ రోజంతా అంగట్లో రెండుసార్లు పకోడిని మాడబెట్టాడు. చక్కెర కింద ఒలికింది. బాకీ డబ్బుల చిల్లర ఇవ్వడంలోనూ తడబాటు. అతడి స్వాభావికమైన సాత్వికతకు, ఓర్పుకు ఒక పిల్లి భంగం కలిగిస్తోంది. ఈరోజుతో దాని పీడ విరగడవ్వనుంది.
పక్కన పోలీసోడు తెలిసినవాడే అయినప్పటికీ తన దారికి అడ్డుపడి ‘చేతిలో ఏంటి?” అని అడిగాడు.
“గరిట”
“ఏంటీ ఇంత పొడవాటిదా?”
“పాలు కాచే కడాయి, నూనె కడాయి వెడల్పుగానే ఉంటాయిగా?”
“అవును, నువ్వు ఇంతకీ కొట్టుకు వెళుతున్నావా? ఇంటికి వెళుతున్నావా?”
“ఇంటికే, గరిటెకు చిన్న పని పడింది.”
నిచ్చెన లాంటి ఆ ఇనుప మెట్లు చీకట్లో కంటికి సరిగ్గా కనిపించడం లేదు. అతడు తర్జనభర్జనలు పడుతూనే ఆ మూడు మేడలు ఎక్కాల్సి వచ్చింది. డాబా మీద పాలలాంటి తెల్లని వెన్నెల. ఆ విశాలమైన ప్రదేశంలో నీళ్ళతొట్టెలు యుద్దభూమిలోని గుడారాల్లా ఉన్నాయి.
అతడు షెడ్డు తలుపు దగ్గర చెవి ఆనించి వింటున్నాడు. గది ప్రశాంతంగా వుంది. గుమ్మం పైభాగాన తడిమి చూశాడు. కర్రముక్క కనిపించలేదు. పిల్లి లోపలికి వచ్చింది.
తలుపును కాస్తంత తెరిచి లోపలికి ప్రవేశించగానే తలుపును దగ్గరకి మూసేశాడు. అతడి చెప్పులు మళ్ళీ నేలకు అంటుకున్నాయి. అగ్గిపుల్లను గీశాడు. సగం తోడుకొన్న పెరుగు, సగం ఎండిపోయిన స్థితిలో కిందపడుంది.
మరో అగ్గిపుల్లను గీసి దీపం వెలిగించాడు. గరిటతో నేలపై గట్టిగా తట్టాడు. ఎక్కడో మూలన నక్కిన పిల్లి, అటక మీదకెక్కి దాక్కొంది. భయంతో అటూఇటూ కలియచూసింది.
అతను కోపంతో కసిగా అరిచాడు. గరిటను పైకెత్తాడు. పిల్లి అతడినే చూస్తోంది.
ఒక నీళ్ళతొట్టె కుళాయిని మూసేందుకు మరుసటిరోజు డాబా మీదకి వచ్చిన పోలీసు, తగరపు రేకుల షెడ్డు తలుపుకింద రక్తం ఉండడం చూసి, తలుపును ఒక గుద్దుతో తెరిచాడు. ఒక పిల్లి అక్కడి నుండి దూకి పరుగులు తీసింది. లోపలే పడున్న శవం చేతిలో పొడవాటి గరిట. మెడ నుండి, ముఖం నుండి చర్మం ఊడి, మాంసపు ముద్దలుగా వేలాడుతోంది. చుట్టూ చీమలు మూగి ఒక కన్ను మాత్రం విడిగా నేలపై పడుంది.
(1993).
అశోకమిత్రన్
అశోకమిత్రన్’ అని పిలువబడే ‘త్యాగరాజన్’ 1931 లో, సికింద్రాబాదులో జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన, తన తండ్రి మరణాంతరం తన 21 ఏట చెన్నైకు మకాం మార్చారు. 1951 నుండి రాయడం మొదలు పెట్టిన ఆయన 60 పుస్తకాలు రాశారు. అందులో 9 నవలలు, 3 నవలికలు, 242 కథలు ఉండటం గమనార్హం. 1996 సాహిత్య అకాడెమి అవార్డును అందుకున్న ఆయన 2017 లో మరణించారు.