చిక్కులా పడి ఉన్న ముంగురులను వెనక్కి తోసి, ఆ ఆహరపు పాత్రలను ఒక చెక్క బంకు దగ్గర పెట్టి, ఉర్యుపిన్ వైపు చూసాడు.
‘ఆ సూప్ దుర్వాసన వస్తుంది, చూడు!’
కర్లీ తన ఆహార పాత్ర వైపుకి వంగి, వాసన చూస్తూ, ముఖం చిట్లించాడు. అసంకల్పితంగా అతన్ని అనుసరిస్తూ కొషివోయ్ కూడా అదే చేశాడు.
‘వాసన వస్తుంది సూప్ కాదు, మాంసం’, కర్లీ నిర్ధారిస్తున్నట్టు అన్నాడు.
అతను ఆ పాత్రను ఓ పక్కన పడేసి, గ్రెగరి వైపు చూశాడు. గ్రెగరి తన బంకు దగ్గర నుండి ముందుకు వచ్చి, తన పొడుగాటి ముక్కుని ముందుకి సూప్ మీదుగా వంచి, వెంటనే అడుగు వెనక్కి వేసి, ఒక కాలితో ఆ సూప్ ఉన్న పాత్రను తన్నాడు.
‘ఇప్పుడు ఎందుకలా చేసావు?’ కర్లీ అనుమానంగా అడిగాడు.
‘ఎందుకో నీకు తెలియడం లేదా? చూడు. నీకు కళ్ళు కనబడటం లేదా? అటు చూడు’, గ్రెగరి తన కాళ్ళ వైపుకి వస్తున్న ద్రవాన్ని చూపిస్తూ అన్నాడు.
‘దేవుడా..పురుగులు!ఇప్పటివరకు నేను చూడనే లేదు. ఇదే రాత్రి భోజనం మనకి! ఇది క్యాబేజ్ సూప్ కాదు, పురుగులతో చేసిన నూడుల్స్!’
తెల్లటి పురుగులు ఎర్రటి మాంసపు కొవ్వు చుట్టూ పడి ఉన్నాయి ఆ నేల మీద.
‘ఒకటి,రెండు,మూడు,నాలుగు …’కొషివోయ్ గుసగుసగా వాటిని లెక్కబెడుతూ ఉన్నాడు.
ఒక నిమిషం పాటు అక్కడున్న ఎవరూ ఏం మాట్లాడలేదు. గ్రెగరి కోపంతో నేల మీద ఉమ్మి వేశాడు. కొషివోయ్ తన ఖడ్గాన్ని బయటకు తీస్తూ, ‘ఈ సూప్ ను ఖైదు చేసి,వెంటనే మన దళపు కమాండర్ దగ్గరకు తీసుకువెళ్దాము’,అన్నాడు.
‘అది మంచి ఆలోచన’, కర్లీ ఆమోదించాడు.
వెంటనే అతను తన బాకుని పిడి నుండి బయటకు తీశాడు.
‘మేము ఈ సూపును తీసుకువస్తాము ,మాతో పాటు గ్రీషా, నువ్వు కూడా వచ్చి,జరిగింది మన దళపు అధికారికి ఫిర్యాదు చేయాలి.’
ఉర్యుపిన్,కొషివోయ్ తమ ఖడ్గాలను బయటకు తీసి, ఆ సూపు పాత్రను బాకు మీద పెట్టుకుని బయల్దేరారు. గ్రెగరి వారిని అనుసరించాడు,కొసాక్కుల బృందం వారి వెనుకే అస్తవ్యస్తంగా ఉన్న ఆ కందకాల మధ్య ఉన్న దారుల్లో నడిచింది.
‘ఏమైంది?’
‘ఎవరైనా అలారం మోగించారా?’
‘బహుశా శాంతి కోసమేమో?’
‘శాంతి కావాలా?ఇంకేమైనానా?’
‘వాళ్ళు ఏదో పురుగుల సూపును ఖైదీ చేసి తీసుకువచ్చారు.’
ఉర్యుపిన్,కొషివోయ్ ఆ అధికారి డగౌట్ దగ్గర ఆగారు. ముందుకి వంగి,తన టోపిని ఎడమ చేత్తో పట్టుకుంటూ, గ్రెగరి లోపలికి అడుగు పెట్టాడు.
‘వెనక్కి పో!’ వెనక నుండి ముందుకు తోసుకు వస్తున్న ఒక కొసాక్కును చూసి గట్టిగా అరిచాడు కర్లీ.
ఆ దళపు అధికారి తన కోటు బొత్తాలు పెట్టుకుంటూ, ఆశ్చర్యంతో అప్పుడే బయటకు వచ్చిన గ్రెగరి వంక చూస్తూ, బయటకు వచ్చాడు.
‘ఏమైంది అబ్బాయిలు?’ అక్కడ ఉన్న కొసాక్కుల వైపు చూస్తూ అడిగాడు.
అందరూ మౌనంగా ఉన్నారు. గ్రెగరి ముందుకు వచ్చి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు.
‘మేము ఒక ఖైదీని తీసుకువచ్చాము.’
‘ఎవరా ఖైదీ?’
‘ఇదిగో ఇక్కడ ఉన్నాడు’, కర్లీ పాదాల వద్ద ఉన్న సూప్ పాత్రను చూపిస్తూ, ‘అతనే ఆ ఖైదీ… కొసాక్కులకు ఎటువంటి భోజనం పెడుతున్నారో ఒక్కసారి వాసన చూడండి’, అన్నాడు.
గ్రెగరి కనుబొమ్మలు కోపంతో త్రిభుజాకారంలోకి ముడుచుకుని, మరలా మాములుగా అయ్యాయి. ఆ అధికారి గ్రెగరి ముఖకవళికలు గమనించి, సూప్ వైపు చూశాడు.
‘మాకు కుళ్ళిపోయిన మాంసాన్ని భోజనంగా పెడుతున్నారు!’ మిష్కా కొషివోయ్ కోపంతో గట్టిగా అరిచాడు.
‘క్వార్టర్ మాస్టర్ (సైన్యంలో కావల్సిన సరుకులు, ఆయుధాల బాధ్యత తీసుకునే అధికారి)ను మార్చండి.’
‘వాడొక దగుల్బాజీ.’
‘అత్యాశపరుడు.’
‘వాడు సుబ్బరంగా ఎద్దు మాంసపు సూప్ తాగుతాడు.’
‘మాకు మాత్రం పురుగులతో చేసి పంపిస్తాడు.’
ఆ అధికారి అక్కడ వారి అరుపులు,పెడబొబ్బలు ఆగిపోయేవరకు మౌనంగా వేచి చూశాడు.ఆ తర్వాత, ‘నిశ్శబ్దంగా ఉండండి! జరిగింది చాలు. ఈ రోజే క్వార్టర్ మాస్టర్ ను మార్చడం జరుగుతుంది అతని పనుల మీద విచారణ చేయడానికి ఒక కమిటీని కూడా నియమిస్తాను. ఇక నుండి నాణ్యత ఉన్న మాంసం రాకపోతే ….’
‘వాడిని కోర్ట్ మార్షల్ చేయండి!’ వెనుక నుండి అనేక స్వరాలు గుంపుగా అన్నాయి.
మరలా మొదలైన ఈ కొత్త గొంతుల గోలలో ఆ అధికారి మాటలు గాలిలో కలిసిపోయాయి.
ఆ తర్వాత మార్చింగ్ మొదలయ్యేలోపు క్వార్టర్ మాస్టర్ ను మార్చడానికి నిర్ణయం జరిగిపోయింది.
తిరుగుబాటు చేసిన ఆ కొసాక్కులు సూపును ఖైదు చేసి,అధికారి దగ్గరకు తీసుకువెళ్ళిన కొన్ని గంటల తర్వాత 12 వ రెజిమెంటు ముఖ్య కార్యాలయానికి వెంటనే కందకాలను వీడి రొమానియా సరిహద్దు దగ్గరకు ఒక ప్రత్యేక మార్గం ద్వారా వెళ్ళమని ఆజ్ఞ వచ్చింది. ఆ రాత్రికి కొసాక్కుల స్థానంలోకి సైబీయాకు చెందిన పదాతి దళం వచ్చింది. రిన్విచి పట్టణం దగ్గరలో ఆ రెజిమెంటు గుర్రాలను తీసుకుని, తర్వాతి ఉదయం రొమానియా వైపు మార్చింగ్ చేశారు.
ఒక దాని తర్వాత ఒకటి వరుసగా ఓటములతో నష్టపోతూ ఉన్న రోమానియావాసులకు భారీ సంఖ్యలో బలగాలను తరలించారు. ఆ సాయంత్రం అధికారులు సైనికుల కోసం నివాసం కోసం వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగివచ్చారు. ముందు చెప్పిన గ్రామంలో నివాసం అప్పటికే రొమానియా దిశగా చేరుకున్న ఇంకో దళానికి ఇవ్వబడింది. దీనిని బట్టే భారీ బలగాలు అక్కడకు వెళ్తున్నట్టు స్పష్టం అయ్యింది. ఆ రాత్రి నివాసం ఉండటానికి ఆ దళం ఇంకో ఎనిమిది వెరస్టుల దూరం మార్చింగ్ చేయాల్సి వచ్చింది.
తర్వాత వాళ్ళు పదిహేడు రోజుల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అప్పటికే గుర్రాలు సగం ఆకలితో ఉన్నాయి. అప్పటికే యుద్ధం వల్ల ధ్వంసమై ఉన్న ఆ సరిహద్దు సమీపపు ప్రాంతంలో పశువులకు గ్రాసమే లేదు. అక్కడ ఉండే ప్రజలు అప్పటికే రష్యా లోతట్టు ప్రాంతాలకు లేదా అడవులకు వెళ్ళి దాక్కున్నారు. ఖాళీగా ఉన్న ఆ ఇళ్ళన్ని నల్లబడిన గోడలతో వారికి స్వాగతం చెప్పాయి.ఎప్పుడో ఓసారి అరుదుగా కొసాక్కులకు ఎవరైనా ఒకరు ఆ ప్రాంతంలో ఉండే మనుషులు కనిపించినా,వారు కూడా సాయుధులై ఉన్న సైనికులను చూడగానే భయంతో అక్కడి నుండి వేగంగా తప్పుకునేవారు. అప్పటికే నిరంతరాయంగా చేస్తున్న మార్చింగ్ తో చలికి గజగజలాడుతూ,తమకు,తమ గుర్రాలకు వచ్చిన పరిస్థితికి కోపంతో ఏం చేయాలో తోచక,అక్కడ ఉన్న ఇళ్ళ తాటాకు పైకప్పులను చీలుస్తూ,యుద్ధాన్ని తట్టుకుని నిలబడ్డ గ్రామాల్లో బలవంతంగా చొరబడి ఆహార ధాన్యాలు లాక్కున్నారు,కొన్ని చోట్ల దొంగతనము చేశారు. ఏ అధికారి ఆజ్ఞలు కూడా వారిని అలా చేయకుండా అడ్డుకోలేకపోయాయి.
రొమానియా సరిహద్దుకి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో కర్లీ ఒక ధాన్యపు కొట్టం నుండి బార్లీ గింజలు దొంగతనం చేశాడు. కానీ యజమాని అతన్ని పట్టుకున్నాడు. కర్లీ ఆ వృద్ధుడిని గట్టిగా తన్ని,తన గుర్రం కోసం బార్లీ తీసుకుని పరిగెత్తాడు. ఆ దళపు అధికారి చూసే సమయానికి కర్లీ ఒక కంచె దగ్గర తన గుర్రాన్ని కట్టేసి మేపుతూ ఉన్నాడు. కర్లీ తన గుర్రానికి గింజలు అందిస్తూ,దాని వెనుక నిమురుతూ,అది తోటి మనిషి అయినట్టు దాని కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్నాడు.
‘ఉర్యుపిన్!మర్యాదగా ఆ బార్లీ తిరిగి వెనక్కి ఇచ్చేయి. లేకపోతే ఈ దిక్కుమాలిన పనికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది!’
కర్లీ తలెత్తి ఆ అధికారి వైపు చూసి ,తన టోపీని తీసి,రెజిమెంటులో చేరిన అన్నేళ్లలో మొదటిసారి ఉన్మాదంతో అరిచాడు.
‘నాకు కోర్టు మార్షల్ విధించండి! నన్ను కాల్ఛండి లేదా ఇప్పుడే చంపండి! నేను మాత్రం బార్లీ తిరిగి ఇవ్వను. అసలు నా గుర్రం ఎందుకు ఆకలితో చచ్చిపోవాలి? నేను తిరిగి ఇవ్వను. ఒక గింజ కూడా ఇవ్వను!’
ఆకలితో ఆత్రంగా తింటున్న ఆ గుర్రపు తలను,మెడను ఇంకోసారి నిమిరి,తన ఖడ్గం బయటకు తీశాడు.
ఆ అధికారి మౌనంగా లోపలికి పోయిన డొక్కలతో ఉన్న ఆ గుర్రం వైపు చూస్తూ,చిన్నగా తల ఊపుతూ, ‘రొప్పుతూ ఉన్న గుర్రానికి అదెందుకు పెట్టావు?’అని అడిగాడు.
‘ఇప్పుడు మామూలుగా అయిపోయింది’, కింద పడిపోయిన గింజలను ఎత్తి ఆ గుర్రానికి పెడుతూ,ఉర్యుపిన్ గుసగుసగా అన్నాడు.
* * *
నవంబర్ మొదలయ్యేసరికి రెజిమెంటు తమ కొత్త స్థానాల్లో స్థిరపడింది. ట్రాన్సిలేవ్ నియా కొండల మీదుగా గాలులు బలంగా వీస్తూ, లోయల దగ్గరకు వచ్చేసరికి మంచు గడ్డ కడుతూ ఉంటే, ఆ మంచుతో నిండిన పైన్ చెట్ల సుగంధం, అక్కడ వ్యాపిస్తూ ఉంది. మొదటి మంచు కురిసే సమయానికి అక్కడ ఉన్నవారికి తోడేళ్ల, అడవి మేకల, ఇంకా ఎన్నో అడవి జంతువుల పాదముద్రలు కనిపించాయి. వాటిని చూసి భయపడి అక్కడి నుండి వెనుక భాగపు ప్రాంతానికి వెళ్ళిపోయారు.
నవంబర్ 7 న 12 వ రెజిమెంటు ‘320వ కొండ’ వైపు దాడికి సన్నద్ధమైంది. అంతకు ముందు రోజు,శత్రువుల కందకాల్లో ఆస్ట్రియా సైనికులు ఉన్నా, తర్వాతి ఉదయానికి ఫ్రెంచ్ సరిహద్దు నుండి వచ్చిన సాక్సన్ బృందాలు అక్కడికి బదిలీ చేయబడ్డాయి, ఆస్ట్రియా సైనికులకు యుద్ధం నుండి విరామం లభించింది.
కొసాక్కుల పదాతి దళం రాళ్ళ గుట్టలతో, మంచుతో నిండిన ఏటవాలు దారి గుండా ముందుకు వెళ్ళారు. గడ్డ కట్టుకుపోయి ఉన్న కంకర రాళ్ళు వారి పాదాలకు తగులుతూ ఉంటే, వాటి చుట్టూ ఉన్న మంచు ముక్కలై చుట్టూ పడుతూ ఉంది. గ్రెగరి ఉర్యుపిన్ పక్కన మార్చింగ్ చేస్తూ ఉన్నాడు, అతని ముఖంలో అపరాధ భావం తో పాటు,ఇబ్బంది పడుతూ నవ్వుతున్న నవ్వు కూడా ఉంది.
‘ఈ రోజు నాకెందుకో ఇదే నేను మొదటిసారి చేస్తున్న దాడిలా భయంగా ఉంది.’
‘ఏంటి అలా అంటున్నావు?’ కర్లీ ఆశ్చర్యపోతూ అడిగాడు.విరిగిపోయి ఉన్న తుపాకీ ఇంకా భుజాల మీదే వేలాడుతూ ఉంటే,కర్లీ మీసం మీదుగా పడుతున్న మంచు బిందువులను పీలుస్తూ ఉన్నాడు.
గజిబిజిగా ఉన్న దారుల్లో, కొసాక్కులు ముందుకు వెళ్తూ ఉన్నారు. శత్రువుల కందకాల దగ్గర నిశ్శబ్దంగా ఉంది.జర్మన్ల స్థావరం వెనుక నిలబడి ఉన్న ఒక సాక్సన్ లూయిటెంట్ ముఖం బలంగా వీస్తూ ఉన్న గాలుల వల్ల ఎర్రగా కంది ఉంది, ముక్కు ముందుకు పొడుచుకువచ్చినట్టు ఉంది.అతను నవ్వుతూ తన బృందాన్ని ఉత్సాహపరుస్తూ జర్మనీ భాషలో అరిచాడు.
‘మిత్రులారా!ఇప్పటివరకు మనం ఎన్నో నీలం కోట్లను తరిమికొట్టాము.మళ్ళీ ఇంకోసారి మన సత్తా ఏమిటో చూపించాల్సిన సమయం వచ్చింది. అందరూ సిద్ధం ఉండండి!కాల్పులు జరుపడానికి సంసిద్ధులు కండి!’
కొసాక్కులు దాడి చేయడానికి ముందుకి వేగంగా కదిలారు.వారి కాళ్ళ కింద ఉన్న బండలు, రాళ్ళు కూడా అటూఇటూ కదిలాయి. గ్రెగరి మురికి పట్టి ఉన్న తన కోటుని గట్టిగా పట్టుకుని, కంగారుగా నవ్వాడు.కొక్కెo లా ఉన్న ముక్కు, లోపలికి పీక్కు పోయిన బుగ్గలని క్షవరం చేయని అతని గడ్డం కప్పేస్తూ ఉంటే, మంచు బిందువులతో తడిసిన కనుబొమ్మలు వింతగా మెరుస్తూ ఉన్నాయి.అతని సహజసిద్ధమైన నింపాదితనం ఆ సమయంలో అతన్ని ఒంటరిని చేసింది. ఆ కందకాలను గమనిస్తూ, ఊహించని పద్ధతిలో చుట్టుముడుతున్న భయంతో పోరాడుతూ, అతను ఉర్యుపిన్ తో అన్నాడు.
‘వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మనల్ని సమీపంగా రానిస్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది. ఇది చెప్పడానికి నాకు సిగ్గుగా లేదు. వెనక్కి వెళ్ళిపోదామా?’
‘ఈ రోజు నీకేమైంది? ఇది పేకాట లాంటిది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే, తప్పక ఓడిపోతావు. నీ మొహమంతా పాలిపోయింది గ్రీషా.. ఇలా ఉంటే నువ్వు జబ్బు పడతావు లేకపోతే చచ్చిపోతావు. హే, అటు చూశావా? అటు చూడు?’ అన్నాడు ఉర్యుపిన్.
పొట్టిగా ఉండి, హెల్మెట్ ధరించి ఉన్న ఒక జర్మను కందకాల పై నుండి ఒక్కసారి ఎగిరి చూసి, వెంటనే మాయమైపోయాడు.
గ్రెగరికి ఎడమ వైపున యెలాన్ స్కాయాకి చెంది, లేత గోధుమ రంగులో ఉన్న జుట్టుతో, అందంగా ఉన్న ఒక కొసాక్కు తన కుడి చేతి పై ఉన్న గ్లవ్ ని తీసి వేస్తూ, మరలా తొడుక్కుంటూ ముందుకు నడుస్తున్నాడు. చూస్తే ఉంటే అతనికి మోకాళ్ళు వంచడానికి ఇబ్బందిగా ఉంది. అతను మధ్యమధ్యలో గట్టిగా దగ్గుతున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే గ్రెగరికి చీకట్లో నడుస్తున్న వ్యక్తి తనను తాను ఉత్సాహపరచుకోవడానికి దగ్గుతున్న వాడిలా ఉన్నట్టు అనిపించాడు.
ఈ కొసాక్కు వెనుక బుగ్గల మీద స్పోటకం మచ్చలతో ఉన్న సార్జెంట్ మాక్సెయేవ్, అతని వెనుక తన తుపాకీని, బాకును గట్టిగా పట్టుకుని ఉన్న యెమేల్యాన్ గ్రెగరికి కనిపించారు.కొద్ది రోజుల క్రితం ఒక రొమానియా వాడు తన అల్మరాలో దాచుకున్న ఒక సంచి జొన్నలను తన బాకుతో తెరిచి ఈ యెమేల్యాన్ దొంగతనం చేయడం గ్రెగరికి గుర్తొచ్చింది. మాక్సెయేవ్ కి కొద్ది దూరంలోనే మిష్కా కొషివోయ్ ఉన్నాడు.మిష్కా పొగాకు కాలుస్తూ, మధ్యలో తన కోటుతో ముక్కు చీదుకుంటూ ఉన్నాడు.
‘నాకు దాహంగా ఉంది’, మాక్సెయేవ్ అన్నాడు.
‘నా బూట్లు కాళ్ళు కొరుకుతున్నాయి, యెమేల్యాన్,ఇక నేను నడవలేను ‘మిష్కా కొషివోయ్ ఫిర్యాదు చేస్తూ అన్నాడు.
అతన్ని కరుగ్గా మధ్యలో అడ్డుకున్నాడు గ్రోషెవ్.
‘నీ బూట్ల గురించి ఏం దిగులుపడకు. కొద్ది సేపట్లో జర్మన్లు వాళ్ళ మెషిన్ గన్స్ తో అసలు బూట్లే లేకుండా చేస్తారు.’
మొదటి సారి జర్మన్లు కాల్పులు జరిపినప్పుడు ఒక తూటా మీదకు దూసుకుపోయి, కింద పడ్డాడు. వెంటనే ప్రథమ చికిత్సకు అవసరమైనవి ఉండే తన సంచిలో ఉండే బ్యాండెజ్ పట్టి తీసుకుందామనుకున్నాడు. కానీ గాయపడిన చేతి నుండి రక్తం కారుతూ అతని శక్తి మొత్తాన్ని హరించుకుపోయేలా చేసింది.తన తల కిందకు పెట్టి, ఒక రాయి వెనక్కి జరిగి,అక్కడ ఉన్న మంచు బిందువులను నాలుకతో నాకాడు.వణుకుతున్న పెదాలతో అక్కడ చుట్టుపక్కల ఉన్న మంచును నోట్లో వేసుకుని, భయంతో కాల్పుల శబ్దాన్ని వింటూ ఉన్నాడు.
అతను మరలా తల ఎత్తి చూసే సమయానికి, తన దళానికి చెందిన కొసాక్కులు ఏటవాలు మార్గం గుండా పరిగెడుతూ, పడుతూ,లేస్తూ,ఆపసవ్యంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఏదో తెలియని భయంతో గ్రెగరి ఒక్క ఉదుటున లేచి, ఏటావలు దారి గుండా, పైన్ అడవిలోకి,ఎక్కడైతే రెజిమెంటు దాడిని మొదలుపెట్టిందో అక్కడికి పరుగు తీసాడు. గాయపడిన లూయిటెంట్ ను లాక్కుంటూ తీసుకు వెళ్తున్న యెమేల్యేన్ ను దాటుకుంటూ పరిగెత్తాడు.ఆ లూయిటెంట్ కాళ్ళు కొన్నిసార్లు నేలను రాసుకుంటూ, మధ్య మధ్యలో అతను గ్రోషెవ్ భుజం మీదకు వాలిపోతూ,రక్తం కక్కుతూ ఉన్నాడు.
దళాలన్ని అడవి వైపు హిమపాతంలా దొర్లుకుంటూ, చనిపోయిన వారి కళేబరాలను ఎక్కడిక్కడే వదిలిపెట్టి, కదిలిపోయాయి.గాయపడిన వారికి సాయమందించే వారు లేకపోవడంతో వెనుక నుండి కాల్పులు వారిని వెంబడిస్తూ ఉన్నా, అలాగే పాక్కుంటూ వెళ్ళారు.
కాల్పులు నిరంతరాయంగా సాగుతూ ఉంటే, ఆ ప్రాంతం అంతా ఆ శబ్దాలతో దద్దరిల్లిపోయింది.
కాసేపటికి సత్తువ కోల్పోయిన గ్రెగరి మిష్కా కొషివోయ్ భుజం ఆసరాతో అడవికి చేరుకోగాలిగాడు.ఒక జర్మనీ మెషిన్ గన్ నుండి ఆపకుండా ఎడమ వైపుకి దూసుకువస్తున్న తూటాలు ఆ ఏటవాలు మార్గంలోకి ఎవరో గురి పెట్టి విసురుతున్న రాళ్ళలా వస్తూ మంచును చీలుస్తున్నాయి.
‘ఈ సారి వాళ్ళు మనల్ని చిత్తుచిత్తుగా ఓడించారు’, ఉర్యుపిన్ దాని పట్ల సంతోషంగా ఉన్నవాడివలె అరిచాడు. ఒక పైన్ చెట్టు బెరడుకి ఆనుకుని, ఒక కందకం నుండి ఇంకో దానివైపుకి వెళ్తున్న జర్మన్ల మీద కాల్పులు జరుపుతూ అతను అరుస్తూ ఉన్నాడు.
‘మూర్ఖులకు ఒక పాఠం నేర్పించాలి!ఒక మంచి గుణపాఠం!’గ్రెగరిని అక్కడ కూర్చోపెట్టి,కోషివొయ్ అరిచాడు.
‘వాళ్ళు ఒట్టి గుంపు మాత్రమే. ఈ సారి వాళ్ళు ఎందుకు ఎలా ఓడిపోయారో తెలియకముందే చచ్చిపోతారు.’
‘ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?’కర్లీ ముఖం చిట్లిస్తూ అడిగాడు.
‘ఇంగీతజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అయినా ఒక మూర్ఖుడితో చెప్పి ఏం ప్రయోజనం?అలాంటి వాడికి అర్ధమయ్యేలా ఎవరూ చెప్పలేరు కూడా!’
‘మరి నీ ప్రతిజ్ఞ సంగతి ఏమిటి?విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేసావు కదా?’ కర్లీ వదిలిపెట్టకుండా అడిగాడు.
దానికి ఏ సమాధానం ఇవ్వకుండా కోషివొయ్ తన మోకాళ్ళ మీద కూలబడి, వణుకుతున్న చేతులతో కింద ఉన్న మంచును నోట్లోకి కుక్కున్నాడు, వణుకుని, దగ్గుని లెక్క చేయకుండా.
* * *
అధ్యాయం-5
టాటార్ స్కై గ్రామానికి దూరంగా ఒకవైపు శరధృతువు సూర్యుడు లేత బూడిద రంగు మేఘాలతో నిండిన ఆకాశంలోకి సాగిపోతున్నాడు. ఎత్తులో, చల్లటి గాలి మేఘాల మీదగా వీస్తూ, వాటిని పశ్చిమ దిశకు మళ్ళడానికి సాయం చేస్తూ ఉంది. కానీ గ్రామంలో మాత్రం డాన్ పచ్చటి బీడుల మీదగా, అడవుల గుండా, గాలి బలంగా వీస్తూ, విల్లో, పొప్లార్ చెట్ల తలలు బలంగా వంచుతూ,డాన్ ప్రాంతంలోనో చెట్లను కూడా వాలిపోయేలా చేయడంతో ఆ ఆకులతో వీధుల్లో చెల్లాచెదురుగా రాలిపోయాయి.ఖ్రిస్టోన్య ధాన్యపు కొట్టంలో ఆకులతో ఉన్న గోధుమ ధాన్యంలో ఉన్న ఒక ఆకును గాలి బలంగా తాకడంతో అది అక్కడి నుండి ఎగిరి, వీధి గుండా స్టీఫెన్ అష్టకోవు ఇంటి పైకప్పు మీదకు ఎగిరింది. ఖ్రిస్టోన్య భార్య కాళ్ళకు ఏమి వేసుకోకుండా వాకిట్లోకి పరిగెత్తి, మోకాళ్ళ మధ్య తన గౌనును పట్టుకుని, గాలిని గమనించి, తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయింది.
యుద్ధం మొదలైన మూడు సంవత్సరాల తర్వాత గ్రామంలో చాలా మార్పులు వచ్చాయి. గ్రామంలో మగవాళ్ళు తగ్గిపోయేసరికి, పొలాలు, పశువులశాలలు అన్ని కూడా కళను కోల్పోయి, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఖ్రిస్టోన్య భార్య తన తొమ్మిదేళ్ళ కొడుకుతో పొలాన్ని చూసుకుంటూ ఉంది. అనికే పొలం గురించి పట్టించుకోవడం మానేసి తన గురించి మాత్రమే శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టింది. భర్తకు దూరంగా ఉండటం తప్పదని అర్ధమైన ఆమె అందంగా అలంకరించుకుని యువకులను ఆకర్షించే ప్రయత్నం చేసేది. ఆమె గేటు మీద పడ్డ ముద్రలు అనేక కథలకు, వదంతులకు సాక్షిగా ఉన్నాయి. స్టీఫెన్ అష్టకోవ్ ఇల్లు మాత్రం ఖాళీగా ఉంది.తను యుద్దానికి వెళ్ళేముందు ఆ యజమాని, ఇంటి కిటికీలను చెక్కతో మూసేసి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టం చేశాడు.పైకప్పు కొంత పాడైపోయి, దాని మీదగా ఉమ్మెత్త చెట్టు అంతా పాకుతూ ఉంది, తలుపు మీద ఉన్న తాళం తుప్పు పట్టిపోయింది. గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి. వాకిలి అంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వీధుల్లో తిరుగుతూ ఉండే పశువులు ఎండ, వాన నుండి రక్షణ కోసం ఆ వాకిలిలోనే తల దాచుకునేవి.ఇవాన్ టోమిలిన్ ఇంటి గోడకు బీటలు పడి దాదాపుగా కూలిపోయే దశకు వచ్చింది ;దాని పక్కనే ఉన్న పెద్ద చెట్టు కొమ్మ దాన్ని కాపడుతూ ఉంది. ఆయుధశాఖలో ఉంటూ, ఎన్నో జర్మన్ల ఇళ్ళను ధ్వంసం చేసినందుకు విధి ప్రతీకారం తీర్చుకుంటుందనుకుంటా!
ఇలాంటి కథలు ఆ గ్రామంలోని ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి ఉన్నాయి.ఆ గ్రామపు దిగువ భాగంలో ఉన్న పాంటెలి పొలం మాత్రమే పోషణతో చక్కగా ఉంది. కానీ అక్కడ కూడా అంతా సవ్యంగా లేదు.ధాన్యపు కొట్టం పైన ఉన్న తగరపు కోడిపుంజుల బొమ్మలు పాడయిపోయాయి;ఆ కొట్టం మొత్తం కూడా కిందకు వాలిపోతూ ఉంది.అనుభవం ఉన్న కంటికి అక్కడ పశువులను కూడా సరిగ్గా చూసుకునేవారు లేరని అర్ధమైపోతుంది. ఆ వృద్ధుడు అన్నింటిని సంభాళిoచలేకపోతున్నాడు.మిగిలినవి పక్కన పెడితే తను వేసే పంటల సంఖ్య కూడా తగ్గించాడు.కేవలం మెలఖోవుల కుటుంబం మాత్రమే అంతో ఇంతో బావుంది.యుద్ధం వల్ల పెట్రో, గ్రెగరి లేని లోటు నటాల్య పోయిన వసంతకాలంలో కవలలకు జన్మనివ్వడం వల్ల కొంతమేరకు భర్తీ అయ్యింది. కవలల్లో ఒకరు ఆడ, ఇంకొకకరు మగ కావడం వల్ల ఆమె అత్తామామలు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.ఆమె ప్రసవం కష్టమైంది;కాళ్ళ దగ్గర భరించలేని నొప్పి వల్ల ఆమె కొన్ని రోజులు అసలు నడవలేకపోయింది.ఆమె నొప్పిని పంటిబిగువున భరిస్తూ,కాళ్ళను దాదాపుగా లాగుతున్నట్టే నడుస్తూ ఉన్నా, ఎల్లప్పుడూ సంతోషకరమైన ముఖంతోనే కనిపించేది.నొప్పి భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆమె నుదురు మీదకు జారిపడే చెమట బిందువులను చూసినప్పుడే ఇలినిచ్న కు ఆమె పడే బాధ తెలిసేది.
‘పిచ్చిపిల్లా!వెళ్ళి పడుకో, ఎందుకలా నిన్ను నువ్వు హింసించుకుంటావు?’ అని ఆమె కోప్పడితే తప్ప ఆ కోడలు విశ్రమించేది కాదు.
సెప్టెంబర్ లో ఒక రోజున శరీర సంకేతాలను గమనించిన నటాల్య ఇంటి నుండి బయటకు నడిచింది.
‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అత్త అడిగింది.
‘పచ్చిక బీడు దగ్గరకి. ఆవులను వెళ్ళి చూడాలి’, అంది.
నటాల్య తన పొట్టను చేతితో తడుముతూ, నొప్పిని ఓర్చుకుంటూ,ఆ గ్రామం నుండి వేగంగా బయటకు నడిచి, దగ్గరలో ఉన్న ఒక ముళ్ళ పొద వెనుకకు వెళ్ళి అక్కడ పడుకుంది. ఆమె వెనుక వీధుల గుండా ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. ఆమె తనతో పాటు తెచ్చిన కోటులో కవలలను ఉంచింది.
‘పిచ్చి పిల్లా!ఇలా ఎలా చేశావు? ఎక్కడికి వెళ్ళావు?’ ఇలినిచ్న బాధ పడుతూ అడిగింది.
‘నాకు సిగ్గేసింది…. నేను మావయ్యకి చెప్పలేకపోయాను. నేను శుభ్రంగానే ఉన్నాను, అత్తయ్యా… నేను పిల్లలను కూడా శుభ్రం చేశాను…చూడండి’, పాలిపోయిన ముఖంతో క్షమాపణ అడుగుతున్నట్టు చెప్పింది నటాల్య.దున్యక్ష వెంటనే మంత్రసాని కోసం పరుగు పెట్టింది.దర్య జల్లెడ మీద దుప్పటి పరచడం గురించి పట్టు బట్టింది. ఇలినిచ్న దాని గురించి నవ్వుతూ,’దర్యా!ఆ జల్లెడ పక్కన పెట్టెయ్. వాళ్ళేమైనా పిల్లి కూనలు అనుకుంటున్నావా? దేవుడా, ఇద్దరు పిల్లలు!అందులో ఒకడు మగపిల్లవాడు కూడా ఉన్నాడు!నా ప్రియమైన నటాల్య!… అరే, తనకు పడక ఏర్పాటు చేయండి!’ అంది.
పాంటెలి వాకిట్లో ఉన్నప్పుడు, అతనికి తన కోడలు కవలలకు జన్మనిచ్చిందని చెప్పినప్పుడు, సంతోషంగా తన చేతులు చాపి, ఆనందభాష్పాలు కార్చాడు.అప్పుడే లోపలికి అడుగుపెట్టి, హడావుడిగా వెళ్తున్న మంత్రసానిని బలంగా వెనక్కి లాగాడు ఏ కారణం లేకుండానే.ఆమె ముక్కు ముందు తన పొడుగైన వేలు పెడుతూ,’ముసలిదానా!నువ్వు అబద్దం చెప్పావు! ఈ మెలఖోవుల జాతి అప్పుడే అంతరించదు!ఒక కొసాక్కు, ఒక అమ్మాయి. అది నా కోడలు ఈ కుటుంబానికి ఇచ్చింది. అంత మంచి కోడలు ఉంది నాకు. అంత గొప్ప ఉపకారం చేసిన తనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పగలను!’ అన్నాడు.
ఆ సంవత్సరం అంతా ఫలాదాయకంగా గడిచింది. ఆ పశువులశాలలోని ఆవుకి కూడా కవలలు పుట్టాయి, అలాగే ‘సెయింట్ మైఖేల్ డే’ నాడు గొర్రెలు, మేకలు కూడా కవలలనే కన్నాయి.
‘ఈ సంవత్సరం అదృష్టం తెచ్చిపెట్టింది. సమృద్ధిగా ఉండేలా చేసింది. ప్రతిది జంటలుగానే వస్తున్నాయి. ప్రతిది గుణించబడుతుంది!’ జరుగుతుంది చూస్తూ, సంతోషంగా తనలో తానే అనుకున్నాడు పాంటెలి.
నటాల్య బిడ్డలకు సంవత్సరం వచ్చే వరకు తన స్థన్యమే ఇచ్చింది. సెప్టెంబర్ లో వారికి తన పాలు మానిపించింది. దాదాపుగా వసంతం దాటిపోయాకే ఆమె పూర్వపు రూపులోకి వచ్చింది. ఆ బక్క పలుచని ముఖంలో పళ్ళు తెల్లగా మెరిసేవి, ఆమె సన్నని శరీర తత్త్వం వల్ల అవి పెద్దగా కనిపించేవి. ఆమె తన గురించి పట్టించుకోకుండా, తన సమయాన్ని, జీవితాన్ని పిల్లలకే అంకితం చేసింది. ఇంటి పనులు పూర్తయ్యాక ప్రతి నిమిషం వారితోనే గడిపేది.
వారి కోసం ఏదో ఒకటి కుడుతూ, వారిని ఉయ్యాలలో నుండి తీసి, వదులుగా ఉన్న తన జాకెట్టులో నుండి తన పెద్ద స్థనాలను వారికి ఒకేసారి తాపేది.
‘ఇప్పటికే వాళ్ళ వల్ల ఎండిపోయావు. నువ్వు పిల్లలకు ఎక్కువ పాలు పట్టిస్తున్నావు!’ ఇలినిచ్న పిల్లల చిన్న పాదాలను తడుతూ అనేది కోడలితో.
‘వాళ్ళకు బాగా పాలు పట్టు. ఆ విషయంలో ఏం కక్కుర్తి అవసరం లేదు. నువ్వేమి ఆ పాలతో వెన్న చేయాల్సిన అవసరం లేదు’, అందుకునేవాడు పాంటెలి భార్యకు ధీటుగా.
వరదల తర్వాత ఉదృతి తగ్గిన డాన్ లా ఉన్నాయి ఆ సంవత్సరాలు.పనుల హడావుడితో, చిన్న చిన్న సంతోషాలతో,దూరంగా యుద్ధంలో ఉన్న వారి గురించి భయాలతో రోజులు ఒక దాని తర్వాత ఒకటి గడిచిపోతున్నాయి.పెట్రో, గ్రెగరి నుండి అప్పుడప్పుడు ఉత్తరాలు వస్తూ ఉండేవి. పెట్రోల్ తరచూ ఉత్తరాలు రాసేవాడు.దర్యాకు రాసే ఉత్తరాల్లో పెట్రో ఆమె మగవారితో కొనసాగిస్తున్న వ్యవహారాలను మానెయ్యమనే బెదిరింపులు, వేడుకోళ్ళు ఉండేవి. తన భార్య గురించి వ్యాపిస్తున్న వదంతులు అప్పటికే అతన్ని చేరాయి. గ్రెగరి తన ఉత్తరాలతో పాటు సైన్యంలో జీతంతో పాటు, అతనికి బహుకరించిన పతకాలకు ఇచ్చే గౌరవపారితోషకం కూడా పంపేవాడు. సెలవు రోజుల్లో ఇంటికి వస్తానని రాసిన అతను ఏదో కారణం వల్ల రాలేకపోయాడు. ఆ ఇద్దరు సోదరులు విభిన్న మార్గాల్లో పయనిస్తున్నారు. గ్రెగరి శక్తిని యుద్ధం లాగేస్తూ ఉంది. అతను పీక్కుపోయాడు. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నాడు.పెట్రో మాత్రం పదోన్నతి దిశలో వేగంగా ఎదుగుతున్నాడు. 1916 వసంతకాలంలో అతను సార్జెంట్ మేజర్ కావడమే కాకుండా ఆ దళపు అధికారికి అనుకూలంగా ఉంటూ రెండు పతకాలు కూడా పొందాడు.తన ఉత్తరాల్లో తను త్వరలోనే ‘సైన్యపు అధికారుల శిక్షణ’కు వెళ్ళబోతున్నానని రాసేవాడు. ఆ వేసవి కాలంలో సెలవు మీద ఇంటికి వెళ్ళిన అనికేకి ఇచ్చి ఒక జర్మనీ హెల్మెట్, ఒక పెద్ద కోటు, తన ఫోటో పంపించాడు.వయసు పైబడిన ఆ ముఖంలో ఏదో సంతృప్తి ఆ నలచదరపు కాగితంలో నుండి కనిపిస్తూ ఉంది, అతని మీసాలు నిటారుగా ఉన్నాయి,అతని చిన్న ముక్కు కింద ఉన్న పళ్ళపై ఆ కుటుంబానికి తెలిసిన నవ్వు ఉంది. జీవితమే పెట్రోని చూసి నవ్వుతూ ఉంది, యుద్ధం అతని జీవితంలో ఎన్నో అవకాశాలకు తలుపులు తెరవడం వల్ల అతను యుద్దాన్ని ఆస్వాదించే స్థితికి చేరుకున్నాడు. బాల్యం నుండి పొలం తప్ప ఏమి తెలియని వాడిగా పెరిగిన ఒక మామూలు కొసాక్కు అయిన తను ఇంత గొప్ప అధికారిగా ఎదిగి, జీవితంలో అన్నిటిని అనుభవించగలనని కలలోనైనా అనుకున్నాడా? అని అనుకుంటూ ఉండేవాడు. యుద్ధం భీభత్స స్థాయిలో ఉన్నా అతను మాత్రం దాని వల్ల లభించే ఫలితాలతో వెలిగిపోతున్నాడు. కానీ పెట్రో జీవితంలో ఒక్క విషయం మాత్రమే బాధ కలిగిస్తూ ఉంది. అతని భార్య గురించి అప్పటికే గ్రామమంతా వదంతులు పాకిపోయాయి. ఆ వసంతంలో సెలవు మీద వెళ్ళిన స్టీఫెన్ అష్టకోవు తిరిగి వచ్చాక రెజిమెంటు మొత్తానికి పెట్రో భార్యతో తను గడిపిన సమయం గురించి కథలుకథలుగా చెప్పాడు. తన మిత్రుల నుండి అవి విన్న పెట్రో వాటిని ఒప్పుకోవడానికి తిరస్కరించినా, అతని ముఖం మాత్రం ఆ మాటలు వినగానే నల్లబడింది.’స్టీఫెన్ అవన్నీ కల్పించి చెప్తున్నాడు. గ్రెగరి తనకు చేసిన దానికి ఈ విధంగా బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నాడు’, అని నవ్వుతూ వారితో అన్నాడు.
ఒకరోజు కావాలని చేసాడో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ డగౌట్ నుండి బయటకు వెళ్తున్న సమయంలో ఒక చేతి రుమాలు కింద వదిలేశాడు స్టీఫెన్. అతని వెనుకే ఉన్న పెట్రో దాన్ని తీసి, దాని మీద ఉన్న భార్య చేతికుట్టు పని గమనించాడు. అంతే ఒక్కసారిగా ఆ ఇద్దరి మధ్య శత్రుత్వం భగ్గుమంది. దొరికితే స్టీఫెన్ పుర్రె పగలగొట్టాలన్నంత కోపంతో ఉన్నాడు పెట్రో. కానీ ఒక జర్మనీ యుద్ధ స్థావరం మీద దాడి చేయడానికి వెళ్ళిన స్టీఫెన్ తిరిగి రాలేదు. అతనితో కలిసి వెళ్ళిన కొసాక్కులు జరిగింది చెప్పారు.
వాళ్ళు ముళ్ళ కంచెలు తొలగిస్తున్న సమయంలో ఆ చప్పుడికి లేచిన ఒక సెంట్రీ గ్రేనేడ్ విసిరాడు. అప్పుడు అందరూ పారిపోయారు, కానీ స్టీఫెన్ మాత్రం ఆ సెంట్రీ మీదకు దూకి అతన్ని గట్టిగా తన పిడికిలితో గుద్దాడు. అదే సమయంలో ఇంకో సెంట్రీ స్టీఫెన్ ను కాల్చడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కొసాక్కులు ఆ రెండో సెంట్రీని పొడిచి, స్టీఫెన్ దెబ్బతో స్పృహ కోల్పోయిన ఇంకొకడిని పక్కకు లాగి పడేసారు. కానీ స్టీఫెన్ బరువు ఎక్కువ ఉండటం వల్ల అతన్ని మోసుకు రాలేక అక్కడే వదిలేసారు.’సోదరులారా!నన్ను ఇలా చావుకి వదిలేయకండి!మీరు అలా ఎలా చేయగలరు?’అని ప్రాధేయపడ్డాడు. కానీ అప్పటికే మెషిన్ గన్ల మోతలు వినబడటంతో ఆ కొసాక్కులు అతన్ని అక్కడే వదిలేసి వచ్చారు. గుండెను మెలిపెట్టేలా ఏడ్చిన అతని ఏడుపు వారిని వెంటాడింది, కానీ ఎవరికైనా తమ ప్రాణాలే విలువైనవి కదా!
ఆ వార్త వినగానే పెట్రోకి గాయం మీద వెన్న పెట్టినట్టు ఉపశమనంగా అనిపించింది.’నేను సెలవులో ఇంటికి వెళ్ళినప్పుడు, దర్య రక్తం కళ్ళజూస్తాను. నేను స్టీఫెన్ ను కాదు. నేను ఊరికే దాన్ని వదిలేయను’, అని తనకు తానే చెప్పుకున్నాడు. ఆమెను చంపేద్దామని అనుకున్నా, వెంటనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు.’ఆ పాముని చంపితే నా జీవితం అంతా నాశనమైపోతుంది. జైల్లో మగ్గాల్సి వస్తుంది. నేను సాధించింది అంతా వ్యర్థమై పోతుంది’, అనుకుని, ఆమె జీవితంలో అలాంటి పనులు మళ్ళీ చేయకుండా ఉండేలా గట్టిగా తగిలిద్దామని అనుకున్నాడు.’ఆ విషపు పాము కన్ను పీకి పడేస్తాను, అప్పుడు దాని వైపు ఎవడు చూస్తాడో చూస్తాను’, ఆ కందకాల పైన ఉన్న ఏటవాలు మార్గం దగ్గరలో ఉన్న పశ్చిమ ద్విన నది ఒడ్డున కూర్చుని నిర్ణయించుకున్నాడు పెట్రో.
వసంతకాలంలో మంచు చెట్లను, గడ్డిని కప్పేసింది. భూమి చల్లగా మారింది, రాత్రులు పెద్దగా మారాయి. కొసాక్కులు ఆ కందకాల్లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ,శత్రువుల మీద అప్పుడప్పుడు కాల్పులు జరుపుతూ, సార్జెంట్ మేజర్ తో మంచిగా ఉంటూ, ఆకలిగా ఉన్నప్పుడు దొరికింది తింటూ కాలం గడుపుతున్నారు. వారిలో ఒకరు కూడా ఈ పరాయి భూమికి ఎంతో దూరంలో ఉన్న డాన్ గురించి తలచుకోవడం మాత్రం మానలేదు.
ఆ వసంతంలో దర్య తన భర్త లేని సమయాన్ని తనకు నచ్చినట్టు గడుపుతూ ఉంది.ఒకరోజు పాంటెలి ఎప్పటిలానే అందరికంటే ముందే నిద్ర లేచి, వాకిట్లోకి వచ్చేసరికి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎవరిదో చేయి గేటు తలుపు తెరిచింది. అది ఎంతో అవమానకరమైన విషయం. అల్పాహార సమయంలో ఆ వృద్ధుడు దర్యను వేసవి కాలంలో వంట చేసే గదిలోకి పిలిచాడు.అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ కొన్ని నిమిషాల తర్వాత దున్యక్ష చూసినప్పుడు దర్య ఆ గది నుండి బయటకు వస్తూ ఉంటే, ఆమె తల మీద ఉన్న రుమాలు భుజం మీదకు జారిపోయి, ఆమె జుట్టంతా పాయలుగా ముఖం మీద పడుతూ ఉంటే, ఆమె బుగ్గల మీదకు కన్నీరు కారుతూ ఉంది. ఆమె దున్యక్షను దాటుతూ, భుజాలు ఎగరేసి, కళ్ళు పెద్దవి చేసి కోపంతో,’చూస్తూ ఉండరా ముసలి నక్కా!నువ్వు జీవితంలో మర్చిపోలేనిది చేస్తాను!’అని బుసలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
దర్య జాకెట్టు వెనుక చిరిగిపోయి ఉంది, ఆమె తెల్లటి వీపు కందిపోయి ఉంది. ఆమె గబగబా మెట్లు దిగి, వాకిలి వైపుకి వెళ్ళి మాయమైపోయింది. ఆ గది నుండి పాంటెలి కోపంగా గుర్రపు పగ్గాలు అందుకుని బయటకు వచ్చాడు.
‘నీకు ఇంత కన్నా ఎక్కువే జరగాలి. పనికిమాలిన దానా!’ తన తండ్రి గొణుక్కుంటూ అన్న మాటలు దున్యక్ష చెవిలో పడ్డాయి.
మరలా ఇంట్లో అంత మాములైపోయింది. కొన్ని రోజుల పాటు దర్య బుద్దిగా ఉంది.అందరికంటే ముందే నిద్ర పోవడానికి వెళ్ళిపోయేది. నటాల్య జాలి చూపులకు బదులుగా నవ్వుతూ,భుజాలు ఎగరేస్తూ, ‘తర్వాత జరగబోయేది చూడు’, అంటూ చూసేది.
నాలుగవ రోజున ఒక సంఘటన జరిగింది. అది దర్యకు, పాంటెలికి తప్ప ఎవరికీ తెలియదు. దాని తర్వాత ఒక వారం పాటు దర్య మొహం మీద విజయగర్వంతో కూడిన దరహాసం తాండవిస్తే, ఆ వృద్ధుడు మాత్రం ఇబ్బంది పడుతూ, ఏదో తప్పు చేసిన వాడిలా తిరగసాగాడు. అతను తన భార్యకు ఆ సంఘటన గురించి ఏమి చెప్పలేదు. చర్చిలో ఫాదర్ విస్సారియన్ దగ్గర కూడా ఆ సంఘటనను, తన పాప పూరిత ఆలోచనలను రహస్యంగా ఉంచాడు.
అది ఇలా జరిగింది. పాంటెలి దర్యను మార్చానన్న భావనతో ఉండి, ఇలినిచ్న తో,’దర్యతో మెత్తగా ఉండకు!ఆమె చేయగలిగిన దాని కన్నా ఎక్కువ పనే పురమాయించు!ఎక్కువ పనిలో మునిగిపోతే ఆ జులాయి తిరుగుళ్ళకు సమయమే ఉండదు.కుర్ర గిత్తలా ఎప్పుడు పరుగులు పెట్టే చంచల తను’, అన్నాడు.
ఇది మనసులో పెట్టుకునే ధాన్యపు కొట్టం శుభ్రం చేయడం, వెనుక పెరడులో వంట చెరుకు కొట్టడం,పశువుల శాలలో ధాన్యపుపొట్టు శుభ్రం చేయడం వంటి పనులు చేయించాడు ఆ రోజు. ఆ రోజు సాయంత్రం పశువులశాలలో ఉన్న ధాన్యపు పొట్టు శుభ్రం చేసే పనిముట్టుని ధాన్యపు కొట్టంలోకి తీసుకువెళ్ళాలనుకుని ‘దర్యా!’అని కోడలిని పిలిచాడు.
‘ఏంటి మావయ్యా?’ పశువులశాలలో ఓ వైపు నుండి అడిగింది ఆమె.
‘వచ్చి ఈ పొట్టు తొలగించే పనిముట్టు ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి నాకు సాయం చేయి.’అన్నాడు.
దర్య తన జాకెట్టు లోపల పడిన పొట్టును దులుపుకుంటూ, తన చేతి రుమాలును సరిచేసుకుంటూ,అక్కడికి వచ్చింది. వదులైన జాకెట్టు,కొద్దిగా చిరుగులతో ఉన్న పాంటు వేసుకున్న పాంటెలి కుంటుతూ ఆమె కన్నా ముందు నడిచాడు. అక్కడ అంతా ఖాళీగా ఉంది,ఎవరూ లేరు. దున్యక్ష,ఆమె తల్లి నూలు వుడుకుతూ ఉన్నారు,నటాల్య భోజన ఏర్పాట్లలో ఉంది. అప్పటికే సూర్యుడు పడమర దిశకు వాలిపోతూ ఉంటే, చర్చ్ బెల్స్ దూరం నుండి వినబడుతూ ఉన్నాయి.ముదురు బూడిద రంగులో ఉన్న ఒక మేఘం ఆకాశంలో ముందుకు సాగుతూ ఉంటే, డాన్ దగ్గరలో ఉన్న పోప్లార్ చెట్ల దగ్గర కాకులు వాలి,ఆ ఆకుల్ని నల్లారంగులోకి మారిపోయేలా చేశాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో ప్రతి ధ్వని స్పష్టంగా వినిపిస్తూ ఉంది. పశువుల శాల నుండి పెంట ,ఎండు గడ్డి వాసన కలిసిపోయి వస్తూ ఉంది. ఆయాసపడుతూ ,పాంటెలి దర్య సాయంతో ఆ పనిముట్టుని ఆ పశువులశాలలోని ఒక మూల ఉంచి బయటకు రావడానికి వెనక్కి తిరిగాడు.
‘మావయ్యా!’ దర్య గుసగుసగా పిలిచింది.
ఏ అనుమానం రాలేదు అతనికి. ‘ఏంటి విషయం?’అని అడిగాడు ఆమె వైపుకి తిరుగుతూ.
దర్య ఇప్పుడు అతనికి ఎదురుగా నిలుచుని ఉంది. ఆమె జాకెట్టు తెరిచి ఉంది,ఆమె చేతులు జుట్టును సరిచేసుకుంటున్నాయి. సాయంత్రపు సూర్యకాంతి అరుణిమ ఆమె ముఖంలో వింత కాంతితో మెరుస్తూ ఉంది.
‘మావయ్యా …ఇటు రండి ….ఇక్కడ ఏదో ఉంది …వచ్చి చూడండి’, ఆమె ఓ పక్కకు వంగి,ఆ వృద్ధుడి భుజాల మీదుగా ఆ పాక తలుపు వైపుకి చూస్తూ అంది.
ఆ వృద్ధుడు ఏముందోనని ఆదుర్దాతో ఆమె దగ్గరకు వెళ్ళాడు,వెంటనే దర్య తన రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి, తన దగ్గరకు లాక్కుంటూ, గుసగుసగా,’ఇక్కడ మావయ్యా! ఇక్కడ చాలా బావుంటుంది’,అంది.
‘ఏం చేస్తున్నావు నువ్వు?’ పాంటెలి రొప్పుతూ అన్నాడు.
అతను దర్య పట్టు నుండి తన మెడను విడిపించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆమె అతని ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా ఇంకా గట్టిగా లాగి, అతని గడ్డం దగ్గర తన నోటితో ముద్దు పెట్టి, నవ్వుతూ ఉంది.
‘నన్ను వదలవే వేశ్యా!’ తన కోడలి పొట్ట ఒత్తిడి తన మీద పడుతూ ఉంటే పాంటెలి వదిలించుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు.
ఆమె అతన్ని వదిలిపెట్టకుండా పట్టు బిగించి ,అతన్ని ఇంకా దగ్గరకు లాక్కుంది.
‘దయ్యమా !నీకేమైనా పిచ్చి పట్టిందా …నన్ను వదులు!’
‘నీకు అది వద్దా? నీకు అవసరం లేదా? లేక ఆ సామర్ధ్యం నీకు తగ్గిపోయిందా?’ అయితే సరే ,నా మీద తీర్పులు వెలువరించకు అయితే!’అంటూ అతని చుట్టూ తన చేతుల పట్టు వదిలేసింది.
వెంటనే తన గౌను కిందకు లాక్కుంటూ, తన వెనుక ఉన్న గోధుమ పొట్టు దులుపుకుంటూ,దిగ్భ్రాంతి చెందిన పాంటెలి ముఖంలోకి చూస్తూ అరిచింది.
‘ఆ రోజు అసలు నన్ను ఎందుకు కొట్టావు?నన్నేమైనా ముసలి దానినని అనుకుంటున్నావా? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు ఇలా లేవు కదా?నా భర్తకు దూరంగా ఉంటూ ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. నేను నా కోరికలు కుక్కతో తీర్చుకోవాలా అయితే? నువ్వు నన్ను ఆపలేవు కుంటోడా!’
దర్య అమర్యాదకరమైన ఒక సంజ్ఞ చేసి అక్కడి నుండి తలుపు దగ్గరకు వెళ్ళిపోయింది. తలుపు దగ్గరకు వచ్చాక ఆమె మరలా జాగ్రత్తగా తనను తాను చూసుకుంటూ, తన బ్లౌజు దగ్గర,చేతి రుమాలులో ఉన్న పొట్టు దులుపుకుంటూ,తన మావయ్య కళ్ళల్లోకి చూడకుండా అంది, ‘నేను అలా కోరికలు తీరకుండా ఉండలేను.నాకు ఒక మగాడు కావాలి. నీకు అవసరం లేదంటే,నేను ఇంకొకడిని చూసుకుంటాను. నువ్వు ఈ విషయంలో మౌనంగా ఉంటే మంచిది’,అంది.
ఆ మాటలు అని ఆమె వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాంటెలి అక్కడ ఒక మూల నిలబడి,గడ్డం తడుముకుంటూ, ఆ పశువులశాల చుట్టూ చూస్తూ, ‘ఆమె చెప్పింది కూడా సరైనదేనా? బహుశా నేను ఆమెతో కలిసి ఆ తప్పు చేసి ఉండాల్సిందేమో?’జరిగిన దాని గురించి ఆలోచిస్తూ తనలో తాను అనుకున్నాడు.
* * *
అధ్యాయం-6
నవంబర్ నెలలో మంచు దట్టంగా పడింది. మంచుపాతం ఎప్పటికన్నా ముందే మొదలైంది. గ్రామపు ఎగువ భాగాన ఉన్న మలుపు దగ్గర డాన్ ప్రాంతమంతా దాదాపుగా గడ్డ కట్టుకుపోయింది. జనాలు అప్పుడప్పుడు తొడుగులా ఉన్న ఆ మంచు మీద నుండే సాగిపోతూ ఉండేవారు. కానీ దిగువ ప్రాంతపు గ్రామాల్లో మాత్రం అక్కడ పలుచటి పొరలుగా మాత్రమే మంచు గడ్డ కట్టింది ,అదేమీ అక్కడ ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారలేదు. సాధారణంగా మంచు ఎక్కువగా కురిసే సమయంలోనే డాన్ నదిలోని విలువైన చేపలు వలకు పడతాయి. డాన్ ప్రజలు కూడా వాటి కోసం ఎదురుచూస్తున్నారు.
నవంబరు నెలలో మెలఖోవులకు గ్రెగరి నుండి ఒక ఉత్తరం వచ్చింది. రోమానియాలోని కువిన్ స్కీ నుండి అతను ఆ ఉత్తరం రాశాడు. యుద్ధంలో తూటా గాయం వల్ల తన ఎడమ చేతిలోని ఒక ఎముక విరిగిపోయిందని, తమ సొంత జిల్లా కామెన్ స్కాయాలో ఉన్న ఆసుపత్రికే వైద్యానికి పంపారని అందులో అతను రాశాడు. ఆ ఉత్తరం వచ్చేసరికి మెలఖోవుల ఇంట్లో ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. సంవత్సరంన్నర క్రితం డబ్బు అవసరంలో ఉన్నప్పుడూ పాంటెలి సెర్జీ ప్లాటోనోవిచ్ నుండి వంద రూబుళ్ళు అప్పు తీసుకుని ,దానికి ఒక ప్రామిసరీ నోటు కూడా ఇచ్చాడు. ఆ వేసవి కాలంలో ఆ వృద్ధుడిని ప్లాటోనోవిచ్ కొట్టు దగ్గరకు పిలిపించారు. అక్కడ ఉన్న అట్యోపిన్ బంగారు రంగులో ఉన్న తన కళ్లద్దాల నుండి మెలఖోవు గడ్డం వైపు చూస్తూ,’సరే, పాంటెలి ప్రొకోఫోవోచ్, నువ్వు ఇంతకు తీసుకున్న అప్పు కడతావా లేదా?’ అని అడిగాడు.
పాంటెలి అక్కడ ఖాళీగా ఉన్న కొట్టులో అరలు , కౌంటర్ నుండి అసౌకర్యంగా తన పాదాల వైపుకి తన దృష్టిని మరల్చాడు.
‘కాసేపు ఆగండి , ఎమెల్యేన్ కొన్ స్టాంటినోవిచ్. నాకు కొంత సమయం ఇవ్వండి,ఇప్పుడు ఉన్న సమస్యలను చక్కబెట్టి తప్పక అప్పు తీర్చేస్తాను’, అన్నాడు పాంటెలి.
ఆ తర్వాత ఆ విషయం అక్కడితే వదిలేసారు. ఆ తర్వాత సమస్యలు పాంటెలి చక్కబెట్టలేకపోయాడు. గొప్ప పంట రాలేదు;అమ్మడానికి కాస్త బలిష్టంగా ఉన్న పశువులు లేవు.కానీ ఊహించని రీతిలో కోర్టు బంట్రోతు గ్రామానికి వచ్చి, పాంటెలిని పిలిపించి, గొంతు మీద కత్తి పెట్టినట్టు ఆ డబ్బు కట్టమని ఒత్తిడి చేశాడు.
పాంటెలి కనీసం ఏదైనా బదులు చెప్పే వీలు లేకుండా అతను తన ముందు బల్ల మీద పరిచి ఉన్న మందమైన దళసరి కాగితంలో ఉన్నది చదివి వినిపించాడు.
న్యాయస్థాన ఆజ్ఞ
1916,అక్టోబర్ 27 న చక్రవర్తి గారి ఆజ్ఞ మేరకు, డొనేస్క్ జిల్లాకు చెందిన ఏడవ విభాగానికి చెందిన న్యాయాధికారి, సెర్జి ప్లేటోనోవిచ్ అనే వ్యాపారి వంద రూబుళ్ళ అప్పు తీసుకుని ప్రామిసరి నోటు రాసిచ్చి, ఇంకా తీర్చలేదన్న విషయం మీద పాంటెలి మెలఖోవుకి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును విన్నారు.81,100,129,133 మరియు 145 ఆర్టికల్స్ ప్రకారం,నేను జారీ చేస్తున్న ఉత్తరువు ఏమిటంటే:
సెర్జెంట్ పాంటెలి ప్రోకోఫోవిచ్ మెలఖోవ్ వ్యాపారి అయిన సెర్జీ ప్లాటోనోవిచ్ మొఖోవుకి 21 జూన్,1915 న ప్రామిసరీ నోటులో పేర్కొన్నట్టు వంద రూబుళ్ళతో పాటు,దానికి వడ్డీగా అదనంగా ఇంకో మూడు రూబుళ్ళు కూడా చెల్లించాలి. న్యాయస్థానం జారీ చేసే ఉత్తరువుకి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యం ఉంటే దానిని సమర్పించవచ్చు.
సివిల్ కోడులోని 156 ఆర్టికల్ లోని మూడవ క్లాజు ప్రకారం ఈ నిర్ణయానికి చట్టబద్ధత ఉంది,కనుక దీనిని వెంటనే అమలు పరచాలి. చక్రవర్తి గారి ఆజ్ఞ మేరకు, డొనేస్క్ జిల్లాకు చెందిన ఏడవ విభాగానికి చెందిన న్యాయాధికారి ఆజ్ఞాపించేది ఏమిటంటే:
ఈ నిర్ణయాన్ని దీనికి సంబంధించిన న్యాయ పరిధిలో ఉన్న సంస్థలు వెంటనే అమలు జరిగేలా చూడాలి. న్యాయస్థాన నిర్ణయాన్ని అమలు పరచడానికి నియమించబడిన అధికారి తన కర్తవ్యాన్ని ఆ ప్రాంత పరిధిలో ఉన్న పోలీస్ మరియు మిలిటరీ యంత్రాంగ సాయంతో సత్వరం జరిగేలా చూడాలి.
న్యాయస్థానం నుండి జారీ చేయబడిన ఆ పత్రం చదివి వినిపించగానే,పాంటెలి అదే రోజు తిరిగి వచ్చి ఆ డబ్బు కట్టేస్తానని మాట ఇచ్చి, ఇంటికి వెళ్ళడానికి అనుమతి అడిగాడు. కానీ అతను ఇంటికి వెళ్ళడానికి బదులుగా తన కొడుకు మావగారు అయిన మిరోన్ కొర్షునోవ్ ఇంటికి వెళ్ళాడు. ఆ దారిలో ఒంటి చేయి అలెక్సి షామిలి ఎదురొచ్చాడు.
‘అంతా బాగానే ఉందా?’ షామిలి అతన్ని పలకరిస్తూ అడిగాడు.
‘బాగానే ఉంది.’
‘ఎక్కడికి వెళ్తున్నారు?’
‘నా వియ్యంకుడి దగ్గరకు. ఓ విషయం మీద మాట్లాడాలి.’
‘అవునా!ఈ రోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీకు తెలియదా? ఈ రోజు మిరోన్ కొడుకు మిట్కా యుద్ధం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు.’
‘నిజంగానా?’
‘నేను విన్నదైతే అదే’, కన్ను కొడుతూ షామిలి అంటూ,తన జేబులో ఉన్న చేతి సంచి బయటకు తీస్తూ, ‘రండి! పొగ కాల్చుకుందాం. పొగాకు కాగితం నాది,పొగాకు మీది’, అన్నాడు పాంటెలికి సమీపంగా వస్తూ.
ఆ సిగరెట్టు వెలిగించుకుంటూ, పాంటెలి తను కొర్షునోవుల వద్దకు వెళ్ళాలా వద్దా అని తర్జనభర్జన పడ్డాడు. చివరకు వెళ్ళాలనే నిర్ణయించుకుని,షామిలికి వెళ్ళొస్తానని చెప్పి,కుంటుతూ ఆ దారి వెంట వెళ్ళాడు.
‘మిట్కా కూడా ఇప్పుడు ఒక పతకం సాధించాడు! అతను నీ కొడుకులతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు గ్రామంలో వాలే పిచ్చుకలలా పతకాలు ఎందరో సాధిస్తున్నారు!’అలెక్సి వెనుక నుండి అరుస్తూ అన్నాడు.
పాంటెలి చాలా సమయం తీసుకుని గ్రామానికి చివరలో ఉన్న కొర్షునోవుల ఇంటి గేటుకి చేరుకుని,కిటికీల వైపు చూశాడు. ఆ ఇంటి యజమానే స్వయంగా తలుపు తీసి బయటకు వచ్చాడు. ముఖమంతా మచ్చలతో ఉన్న ఆ వృద్ధ కొర్షునోవు ముఖంలో సంతోషం తాండవిస్తూ ఉంది;ఆ సంతోషంలో అతని మచ్చలు తగ్గి,ఇంకా శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు.
‘మీరు ఈ శుభవార్త విన్నారా?’ మిరోన్ పాంటెలి కి షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు.
‘ఇక్కడకు వస్తున్న దారిలో అలెక్సి షామిలి నుండి ఆ వార్త విన్నాను. ఓ వియ్యకుండా,నేను ఇంకో విషయం మీద ఇక్కడకు వచ్చాను.’
‘అది తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. వచ్చి మా వీర సైనికుడిని పలకరించండి. మేము ఈ సంతోష సమయంలో మద్యం తీసుకోబోతున్నాము. నా భార్య ఈ సందర్భం కోసం ఎప్పుడో ఖరీదైన మందు సిద్ధంగా ఉంచింది.’
‘అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు,చాలా దూరం నుండే నేను ఆ వాసనను పసిగట్టాను’,అన్నాడు పాంటెలి ముక్కు పుటాలతో ఆ వాసనను పీలుస్తూ.
అప్పటి వరకు గుమ్మంలోనే నిలబడి మాట్లాడుతున్న మిరోన్ తను వెనక్కి తప్పుకుని ఆ అతిథిని లోపలికి ఆహ్వానించాడు. పాంటెలి గుమ్మం దాటి లోపలికి వచ్చేసరికి అతనికి ఎదురుగానే ఒక బల్ల మీద కూర్చుని ఉన్న మిట్కా కనిపించాడు.
‘చూడండి,మా వీరుడు ఇక్కడ ఉన్నాడు’,అంటూ వృద్ధ గ్రీషాకా తన తలను మిట్కా భుజాల మీద కాసేపు ఉంచి,ఆనంద భాష్పాలు రాలుస్తూ,ఆ బల్ల మీద నుండి లేస్తూ అన్నాడు.
‘ఏంటి చూస్తూ ఉన్నారు?’ మిట్కా నవ్వుతూ పాంటెలిని అడిగాడు.
‘చూస్తూ ఉంటే ఇదంతా ఒక అద్భుతంలా అనిపిస్తూ ఉంది. నిన్ను,గ్రెగరిని మేము సైన్యంలో చేర్పించినప్పుడు మీరు బాలుల్లానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిజమైన కొసాక్కు పురుషుల్లా ఎదిగారు. అటామాన్ రక్షకులుగా ఉండేంత ధృఢంగా ఉన్నారు’,అన్నాడు.
మిట్కా వైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ,అతని తల్లి ఒక గ్లాసు నిండుగా వోడ్కా పోసింది,అది గ్లాసు నిండిపోయి కొంత కిందకు ఒలికిపోయింది.
‘పనికిమాలిన దానా! అంత చక్కటి సరుకు నెలపాలు చేస్తావా?’ అంటూ మిరోన్ ఆమె మీద అరిచాడు.
‘అందరికీ అభినందనలు! మిట్రీ మిరోనోవిచ్ ,నీ సంతోష ఆగమన సందర్భంలో ఇదంతా!’అన్నాడు మిరోన్.
పాంటెలి తన కనుగుడ్లను తిప్పుతూ,ఒకేసారి గ్లాసు మొత్తం తాగేశాడు.నెమ్మదిగా తన పెదాలను,మీసాన్ని చేత్తో తుడుచుకుంటూ,ఆ గ్లాసులోపలికి చూస్తూ, తల వెనక్కి ఎగరేస్తూ, అందులో మిగిలి ఉన్న ఆకరి బొట్టు కూడా తాగి,గట్టిగా ఊపిరి పీలుస్తూ, పక్కనే ఉన్న ఒక దోస ముక్క కొరికాడు. లుకినిచ్న అతనికి ఇంకో గ్లాసు తెచ్చి అందించింది. ఆ వృద్ధుడు వేగంగా దాన్ని కూడా తాగేశాడు. మిట్కా నవ్వుతూ అతన్నే చూస్తూ ఉన్నాడు. గత కొద్ది సంవత్సరాల్లోనే అసలు గుర్తు పట్టడానికి వీలు లేకుండా మారిపోయాడు మిట్కా. పెద్ద నల్ల గడ్డంతో ఉన్న ఈ కొసాక్కులో,మూడేళ్ళ క్రితం బారు సైన్యానికి పంపించిన బక్క పలుచగా ఉన్న మిట్కా ఛాయాలేమి కనిపించడం లేదు. ఈ కాలంలో అతను ఎత్తు కూడా పెరిగాడు,భుజాలు బలిష్టంగా మారాయి,కొంత వంగాయి కూడా. అతను తప్పక మంచి పెద్ద పరిమాణంలో ఉన్న 14రాళ్ళ బరువు ఉంటాడు. అతని ముఖం,స్వరం కాస్త మోటుగా మారాయి,వయసుకు మించి ఉంది అతని రూపము.అస్థిరంగా,అసహనంగా ఉన్న అతని కళ్ళు మాత్రమే మారలేదు. కొన్ని సార్లు ఏడుస్తూ,మరికొన్ని సార్లు నవ్వుతూ,కొడుకు ముంగురుల్లోకి చేతులు పోనిస్తూ అతని తల్లి అతని గురించి గొప్పలు చెప్పేది.
‘అయితే ఈ సారి ఓ పతకం సాధించి ఇంటికి వచ్చావన్నమాట?’ పాంటెలి నవ్వుతూ అడిగాడు.
‘కొసాక్కుల్లో ఎవరూ సాధించలేదని?”నుదురు చిట్లిస్తూ, ‘క్రిచ్ కోవుకి ప్రధానకార్యాలయంలో ఏ పని లేకుండా కూర్చున్నందుకే మూడు ఇచ్చారు’,అన్నాడు.
‘మా పిల్లవాడు గర్వించదగినవాడు. నా తర్వాత నా పరువు నిలబెట్టిన వాడు. ఎవరి ముందు తల వంచడు’,అన్నాడు వృద్ధ గ్రీషాకా .
‘వాళ్ళు పతకాలు అందుకోసమని ఇవ్వరు,తెలుసా’, పాంటెలి గొణుగుతూ అన్నాడు.ఈ లోపు మిరోన్ అతన్ని ముందు గదిలోకి తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న పెట్టె మీద కూర్చోబెట్టి,అడిగాడు. ‘నటాల్య,పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? దేవుడి దయ! మీరు ఏదో పని మీద వచ్చానని చెప్పారు కదా? ఏమిటది? మళ్ళీ తాగితే నిగ్రహం కోల్పోతావు,ఆ విషయం ఏదో ఇప్పుడే చెప్పు.’
‘నాకు కొంత డబ్బు కావాలి. నన్ను ఈ కష్టం నుండి బయట పడెయ్యి లేకపోతే చిక్కుల్లో పడతాను’,పాంటెలి దీనంగా అభ్యర్ధిస్తూ ఉంటే మిరోన్ అతన్ని అడ్డుకున్నాడు.
‘ఎంత?’
‘ఒక వంద.’
‘వంద ఏంటి ?’
‘ఒక వంద రూబుళ్ళు.’
‘అది,అలా చెప్పు.’
మిరోన్ ఆ పెట్టె అంతా వెతికి,ఒక చేతి రుమాలు చుట్టి ఉన్న సంచి బయటకు తీసి,పైన ఉన్న రుమాలు తీసి.పది రూబుళ్ళ నోట్లు పది లెక్కబెట్టి పాంటెలికి ఇచ్చాడు.
‘ఓ వియ్యకుండా, నీకు నేను ఋణపడి ఉన్నాను.నువ్వు నన్ను పెద్ద సమస్య నుండి బయట పడవేశావు.’
‘అయినా బంధువుల మధ్య ఈ కృతజ్ఞతలు ఎందుకు?మనం ఒకరి కోసం ఒకరం ఉండాలి.’
మిట్కా ఇంటి దగ్గర ఐదు రోజులు ఉన్నాడు. శారీరక అవసరాల రీత్యా రాత్రుళ్ళు అనికె భార్యతో గడిపేవాడు.పగలు చుట్టాలు, స్నేహితుల దగ్గరకు అంటూ గ్రామంలో తిరుగుతూ గడిపేవాడు. పొడుగైన ఆకారంతో దట్టమైన జాకెట్టు వేసుకుని, టోపీని ఒక వైపుకి తిప్పి పెట్టుకుని,వీధుల్లో జాలీగా తిరిగేవాడు. ఒక సాయంత్రం అతను మెలఖోవుల ఇంటికి వెళ్ళాడు.కాసేపు కూర్చుని గ్రామం గురించి, యుద్ధం గురించి మాట్లాడాడు. మాట్లాడుతున్నంత సేపు దర్య మీదే దృష్టి నిలిపాడు.అతను వచ్చినప్పటి నుండి కళ్ళార్పకుండా చూస్తూ ఉన్న దర్య, మిట్కా వెళ్తూ తన వెనుకే తలుపుని తట్టినప్పుడు, లేచి అతని వెనుకే వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ ఈలోపే ఇలినిచ్న మధ్యలో అడ్డుపడింది.
‘ఎక్కడికి వెళ్తున్నావు దర్యా?’
‘నేను బయటకు వెళ్ళాలి.’
‘అయితే నేను కూడా వస్తాను.’
పాంటెలి తన ఛాతీ మీదకు తల వాల్చ, ఏమి విననట్టు ఉండిపోయాడు. దర్య ఒక రకమైన మోహపు నవ్వుతో అతని ముందు నుండే తలుపు దగ్గరకు నడిచి వెళ్ళింది.ఆమె అత్త ఆమెను వెంబడిస్తూ, కాళ్ళిడిస్తూ వెళ్ళింది. మిట్కా బూట్లను నేల కేసి కొడుతూ, చేతిలో సిగరెట్టుతో గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. తలుపు శబ్దం కావడంతో అతను వాకిలి లోపలికి వచ్చాడు.
‘మిట్కా, అది నువ్వేనా? మా వాకిట్లో దారి తప్పిపోయావా? వెళ్ళేటప్పుడు గేటు వేసి వెళ్ళు. గాలి ఎలా వీస్తుందో చూసావుగా, లేకపోతే రాత్రంతా అది కొట్టుకుంటూనే ఉంటుంది’, ఇలినిచ్న ఘాటుగా అంది.
‘లేదు, నేనేమి తప్పిపోలేదు. నేను గేటు వేసే వెళ్తాను’, మిట్కా కొద్ది సేపు ఆగి, గొంతు సవరించుకుని చిరాగ్గా అని, అక్కడి నుండి సరాసరి అనికె ఇంటికి వెళ్ళాడు.
మిట్కా ఆలోచనారహితంగా పక్షి లాంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు, రేపు ఉంటాడో లేదో తెలియదు.భయం లేనితనం అతని నరాల్లో ప్రవహిస్తూ ఉన్నా, తన ప్రత్యేకతను ఎప్పుడూ నిలుపుకునే ప్రయత్నం చేయలేదు.ఎక్కువ శ్రమ తీసుకునేవాడు కాదు. అతని ఆర్మీ రికార్డు కూడా బాగాలేదు. రష్యాలో పుట్టి,పోలాండ్ లో స్థిరపడిన ఓ స్త్రీపై అత్యాచారం చేసినందుకు అతనికి శిక్ష పడింది;అలాగే దొంగతనాలు కూడా చేసేవాడు. మూడేళ్ళ యుద్ధ కాలంలో అతను ఎన్నో శిక్షలకు గురయ్యాడు. కోర్టు మార్షల్ చేసిన ఒక సందర్భంలో అతన్ని కాల్చి చంపమని ఆజ్ఞ కూడా వచ్చింది. కానీ ఎలాంటి ఆపదలో నుండి అయినా తప్పించుకునే నేర్పు మిట్కాకు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉంటూ, పాటలు పాడుతూ,స్నేహంగా ఉంటూ, సాధారణంగా ఉండే అతనంటే కొసాక్కులకు మాత్రం అతనంటే ఇష్టం. అధికారులు అతని ధైర్యాన్ని ఇష్టపడేవారు. మిట్కా నవ్వుతూ,తోడేలులా నడిచేవాడు,నిజానికి అతనిలో తోడేలు లక్షణాలే ఎక్కువ ఉండేవి. తోడేలులానే మామూలు మనుషుల కన్నా వేగంగా ఉండే నడకతో, కనుబొమ్మల కింద నుండి చూస్తూ, ఆఖరికి వెనక్కి తిరిగి చూడాలన్నా ఎప్పుడూ మెడ ఒక్కటే తిప్పి చూసేవాడు కాదు,దాని కోసం మొత్తం శరీరమంతా వెనక్కి తిప్పేవాడు. గట్టి కండరాలతో,బలిష్టమైన శరీరంతో, చాలా చులాగ్గా కదిలేవాడు. ఆరోగ్యంగా,ఆనందంగా ఉండేవాడు. మిట్కా దృష్టిలో జీవితమంటే చాలా సరళంగా,క్లిష్టంగా లేకుండా ఉండటమే. దున్నుతున్న సమయంలో నాగలి దూసుకుపోయినట్టు,అతను కూడా జీవితం వెంటపడి పరిగెట్టేవాడు. అతని ఆలోచనలు కూడా మొరటుగా,సూటిగా ఉండేవి. అతనికి ఆకలిగా ఉంటే అతను దొంగతనం చేయగలడు, తప్పక చేస్తాడు కూడా. అది స్నేహితుడి దగ్గరైనా సరే అతను వెనుకాడడు. ఒకవేళ అతని బూట్లు పనికి రాకుండా పోతే ఎలాగో ఒక జర్మనీ ఖైదీవి లాక్కునేవాడు. ఏదైనా తప్పు చేస్తూ దొరికిపోతే తన చాకచక్యంతో తప్పించుకునేవాడు,ఆ చాకచక్యంలో భాగంగానే అతను పహరాకు వెళ్ళినప్పుడు జర్మనీ సెంట్రీలను పట్టుకుని వారిని ఓడించి తీసుకువచ్చేవాడు. అలాంటి సాహసానికి పాల్పడినప్పుడు ఓ సారి 1915 లో అతన్ని ఖైదు చేశారు. అతన్ని పగలు కొట్టి చిత్రవధ చేశారు.కానీ ఆ రాత్రి అతను ఆ నివాస పైకప్పుకి రంధ్రం పెట్టి ఎలాగో తప్పించుకున్నాడు. ఇలాంటి దుస్సహాసాల వల్లే మిట్కా అనేక తప్పుల నుండి బయటపడగలిగాడు.
ఆరవ రోజు మిరోన్ తన కొడుకుని మిల్లెరోవో స్టేషన్ కు తీసుకువెళ్ళి రైలు ఎక్కించాడు.తన కళ్ళముందే కదిలిపోయిన ఆ రైలునే చాలా సేపు చూస్తూ ఉండిపోయాడు మిరోన్. లుకినిచ్న కొడుకు కోసం ఏడ్చింది,వృద్ధ గ్రీషా తన గదిలో ముక్కు చీదుకుంటూ, దాన్ని తన కోటుకి రుద్దాడు. మిట్కా బలిష్టమైన శరీరాన్ని తలచుకుంటూ అనికె భార్య కూడా విలపించింది.
రోజులు గడిచిపోతూ ఉన్నాయి. క్రిస్మస్ ముందు రోజు మంచు కరిగిపోయింది, రోజంతా వాన పడుతూనే ఉంది,నీరు డాన్ వైపు పర్వతాల్లో వేగంగా ప్రవహిస్తున్నాయి. ఆ ఋతువులో ఉండే ఆఖరి గడ్డి మరలా పచ్చగా మారింది. బీడు పడిన చోట భూమి మంచి వాసనలు వెదజల్లింది. హెట్మెన్ రహదారి దగ్గర నీరు ఏరులుగా పారింది. గ్రామాల్లో కంచెల పక్కగా నీళ్ళ గుంటలు ఏర్పడ్డాయి. ధాన్యపు కొట్టాల్లో ధాన్యం తడిసి వచ్చే వాసన గ్రామస్థుల నాసికలను తాకుతూ ఉంది.
క్రిస్మస్ రెండవ రోజున డాన్ లో గడ్డ కట్టిన మంచు పగిలింది.మంచు ముక్కలు నదిలో తేలుతూ ఉన్నాయి. డాన్ కు అవతల వైపు పోప్లార్ చెట్లు గాలికి ఉత్సాహంగా ముందుకు తలలు ఊపుతూ ఉన్నాయి. ఆ చెట్లు ఊగుతున్న శబ్దాలు నదిలో నీటి ప్రవాహపు శబ్దంతో పాటు వినవస్తున్నాయి.
రాత్రి అయ్యే సమయానికి కూడలి వద్ద కాకులు గుంపుగా వాలేవి. ఖ్రిస్టోన్య పంది మెలఖోవుల ఇంటి ముందు నుండి వెళ్తూ అక్కడ ఉన్న ఎండు గడ్డి నోట్లో పెట్టుకుని దాటింది. పాంటెలి మరలా మంచు పగలడం అనేది మరలా జరుగుతుందని అనుకున్నాడు. ఆ రాత్రి తూర్పు నుండి గాలులు వీచాయి, నీటి గుంటల్లో ఉన్న నీళ్ళు కాస్త ఉదయానికి మంచుగా మారిపోయాయి. ఉదయానికి ఇంకా బలంగా వీస్తున్న గాలుల వల్ల ఆ మంచు ఇంకా గట్టిపడింది.
క్రిస్మస్ అయిన తర్వాత స్టానిట్సాలో జరిగిన ఒక సమావేశానికి వెళ్ళిన పాంటెలికి అక్కడ ఉన్న గుమాస్తా, తను కామెన్ స్కాయాలో గ్రెగరిని చూసానని, అతను త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పమన్నాడని చెప్పాడు.
* * *
అధ్యాయం-7
సెర్జీ ప్లాటోనోవిచ్ మొఖోవ్ కు ,వెనుక ఒత్తుగా ఉన్న రోమాలతో ఉన్న తన చిన్న గోధుమ రంగు చేతులతో, జీవితాన్ని అన్ని వైపులా నుండి స్పర్శిస్తూ,అనుభూతించే అలవాటు ఉంది. అతని స్పర్శకు కొన్నిసార్లు జీవితం సంతోషంగా స్పందిస్తే,కొన్ని సార్లు మాత్రం అతని మెడకు ఓ గుదిబండ తగిలించి నీళ్ళల్లోకి లాగుతున్నట్టు ఉక్కిరిబిక్కిరి చేసేది. సెర్జీ ప్లాటోనోవిచ్ తన జీవితంలో ఎన్నో చూశాడు, క్లిష్ట సమయాలకు సాక్షిగా కూడా ఉన్నాడు. చాలా కాలం క్రితం అతను ఎప్పుడైతే ధాన్యం నిలువ వ్యాపారంలో ఉన్నప్పుడూ,కొసాక్కుల నుండి ధాన్యం తెచ్చాడు. చివరకు వేల పూడ్ల (రష్యాలో ధాన్యాన్ని కొలిచే ఒక కొలత) ధాన్యాన్ని తగలబెట్టి రెవైన్ లోయలో పారెయ్యడానికే అవి పనికొచ్చాయి. 1905 లో వసంతకాలం ముగుస్తున్న సమయంలో ఒక చీకటి రాత్రిలో ఒకడు తుపాకితో తనను కాల్చడానికి రావడం కూడా అతనికి గుర్తుంది. కానీ మొఖోవ్ అవన్నీ తట్టుకుని నిలబడి ధనవంతుడిగా ఎదిగాడు. ఆ క్రమంలోనే అతను అరవై వేల దాకా పోగు చేసి,ఆ డబ్బుని వోల్గా-కామా ఒడ్డు దగ్గర ఓ ప్రాంతంలో దాచి పెట్టాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో అనుకోని ఉపద్రవమేదో జరగబోతుంది అని అతనికి బలంగా అనిపిస్తూ ఉంది. అతను ముందు రాబోయే కాలం చెడ్డ కాలమే అని ఊహిస్తూనే కాలం గడుపుతున్నాడు,అతని ఊహ అబద్ధం కాలేదు. 1917 జనవరి నెలలో పాఠశాలలో ఉపాధ్యాయుడు అయిన బలాండా అతని వద్దకు వచ్చి ఫిర్యాదు పూర్వకంగా అన్నాడు.
‘ఓ పక్కన విప్లవం దాదాపుగా దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే,నేను మాత్రం ఒక విచిత్రమైన పిచ్చి జబ్బుతో బాధపడుతున్నాను. ఇది ఎంతో సిగ్గు పడాల్సిన విషయం సెర్జీ ప్లాటోనోవిచ్ ….ఎంత అవమానకరమైన విషయం అంటే నీ ఆస్తులు అన్ని పోయి నువ్వు నడి రోడ్డు మీద పడే రోజులు నేను చూడకుండానే చచ్చిపోవచ్చు.’
‘ఎందుకు అది సిగ్గుపడాల్సిన విషయం?’
‘తప్పకుండా అది అలాంటి విషయమే! అలా ఉన్నదంతా ఊడ్చుకుపోవడం చూడటం గొప్ప సరదా అయినా విషయం.’
‘ఓ స్నేహితుడా,ఆ అవసరం లేదు. నువ్వు ఇప్పుడే చచ్చిపో నేను మాత్రం రేపటి కోసం నిరీక్షిస్తాను!’ లోపల రగిలిపోతూ సెర్జీ ప్లాటోనోవిచ్ బదులిచ్చాడు.
జనవరిలో సెయింట్ పీటర్స్ బర్గులో రాస్పుటిన్ గురించి, రాచ కుటుంబం గురించి వదంతులు గ్రామాల్లో,స్టానిట్సాల్లో షికారు చేస్తున్నాయి. మార్చి మొదటి వారంలో రాచరిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్న వార్తతో సెర్జీ ప్లాటోనోవిచ్ పరిస్థితి వలలో చిక్కిన చేపలా అయ్యింది. కొసాక్కులు ఆ వార్త విని, తర్వాత ఏం జరుగుతుందా అని వేచి చూస్తున్నారు. ఆ రోజు కొందరు ముసలివాళ్ళు,కుర్రవాళ్ళు గుంపుగా మూసేసి ఉన్న మొఖోవ్ కొట్టు దగ్గర గుంపుగా కూడి సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద మీసం, ఒక మెల్ల కన్నుతో ఉన్న ఆ గ్రామపు అటామన్ కిర్యుష్కా సోల్డాతోవ్(మానిస్కోవ్ వారసుడు),దిగులుగా ఉన్నాడు. ఆ కొట్టు చుట్టూ వాడిగా జరుగుతున్న సంభాషణలో అతను అసలు పాలుపంచుకోలేదు.మధ్యమధ్యలో అతను తన మెల్ల కన్నును అటూ ఇటూ తిప్పుతూ ఆ కొసాక్కుల వైపు చూస్తూ, ‘అంతా అస్తవ్యస్తం చేసేశారు’ అనో, ‘అసలు ఇలా ఎలా జరిగింది’ అనో లేకపోతే ‘ఇప్పుడు మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం?’అనో అంటూ ఉన్నాడు మధ్యమధ్యలో.
తన కొట్టు దగ్గర ఉన్న గుంపుని చూసిన సెర్జీ ప్లాటోనోవిచ్,అందులో ఉన్న ముసలివాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడదామనుకున్నాడు.తన ఖరీదైన కోటు వేసుకుని, వెండితో తాపడం చేసిన తన చేతి కర్ర అందుకుని,వాకిట్లో నుండి బయటకు నడిచాడు. ఆ కొట్టు దగ్గర నుండి వాళ్ళ మాటలు చిన్నగా అతనికి అక్కడికే వినిపిస్తూ ఉన్నాయి.
‘సరే ,ప్లాటోనోవిచ్,నువ్వు తెలివైన వాడివి.మేము తెలివితక్కువ వాళ్ళం.మరి నువ్వు చెప్పు ఇప్పుడు ఏం జరగబోతుందో?’మాట్వి కాషులిన్, తన ముఖం మీద ముడతలు పడేలా నవ్వుతూ అడిగాడు.
అక్కడున్న వృద్ధులకి నమస్కరించిన సెర్జీ ప్లాటోనోవిచ్ కి వారు ప్రతినమస్కారం చేసి, అతన్ని తమ బృందంలోకి చేర్చుకోవడానికి వెనక్కి జరిగారు.
‘అయితే మనం జారు లేకుండా బతకాలి’, సెర్జీ ప్లాటోనోవిచ్ సందేహిస్తూనే మొదలుపెట్టాడు.
అంతే అక్కడున్న వృద్ధులంతా ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టారు.
‘జార్ లేకుండానా! ఎలా ఉండగలం?’
‘మన నాన్నలు, తాతలు,అందరూ కూడా జారు అధికారంలోనే బ్రతికారు.ఇప్పుడు మన కాలంలో ఇలా అయితే ఎలా?’
‘నేను చెప్తున్నా కదా, తల కత్తిరిస్తే కాళ్ళు బతకలేవు.’
‘మరి ఎలాంటి ప్రభుత్వం ఉండబోతుంది?’
‘మాట్లాడు,ప్లాటోనోవిచ్! నిజం చెప్పు ….నువ్వు దేనికి భయపడుతున్నావు?’
‘బహుశా అతనికి కూడా తెలిసి ఉండకపోవచ్చు’, అవిడవిచ్ నవ్వుతూ ఉంటే అతని బుగ్గల పైన సొట్టలు పడ్డాయి.
సెర్జీ ప్లాటోనోవిచ్ దిగాలుగా తన రబ్బరు బూట్ల వైపు చూస్తూ,బాధతో మాటలు మింగుతున్నట్టు అన్నాడు, ‘డూమా రాష్ట్రం దేశాన్ని పాలిస్తుంది.మనకు రిపబ్లిక్ ఉంటుంది.’
‘ఈ విప్లవం అనే దయ్యం పేరు మీద మనకు ఇక్కడకు వచ్చామా!’
‘మేము స్వర్గస్తులైన రెండవ అలెగ్జాండర్ కు సేవ చేస్తున్నప్పుడు ‘,అంటూ అవ్డేచ్ మొదలు పెట్టాడు ,కానీ ఒక వృద్ధ కొసాక్కు బోగాట్రియోవ్ అతన్ని విసుగ్గా అడ్డుకుంటూ,’మేము దాని గురించి ఇంతకుముందే విన్నాము. దానికి దీనితో ఏ సంబంధం లేదు’,అన్నాడు కఠినంగా.
‘అంటే ఇంతటితో కొసాక్కుల పని అయిపోయినట్లేనా?’
‘ఒక పక్కన మనం ఈ పిచ్చి పనులతో తీరిక లేకుండా ఉన్నప్పుడూ, జర్మన్లు సెయింట్ పీటర్స్ బర్గు ద్వారం వరకు వచ్చేస్తారు.’
‘వారు సమానత్వం కోసం పొరాడి,మనల్ని సన్నకారు రైతులతో సమానం చేస్తారన్నమాట.’
‘మనం జాగ్రత్తగా ఉండకపోతే, త్వరలోనే వారు మన భూములు కూడా మిగల్చరు.’
బలవంతంగా నవ్వుతూ, సెర్జీ ప్లాటోనోవిచ్ అక్కడ దిగులుపడుతూ ఉన్న వృధ్హుల ముఖాల్లోకి చూస్తూ ఉన్నాడు. అతని మనసు కూడా ఆందోళన,బాధతో నిండిపోయింది. అలవాటు ప్రకారం తన గడ్డాన్ని సవరించుకుంటూ, కోపంగా మాట్లాడసాగాడు.ఆ కోపం ఎవరి మీదో ఎవరికి తెలియదు.
‘అవును,రష్యాను వాళ్ళు అక్కడికే తీసుకువచ్చారు,పెద్దల్లారా…..వాళ్ళు మనల్ని చిన్నపాటి రైతుల స్థాయికి తగ్గించి, మన అధికారాన్ని లాక్కుని, పాత లెక్కల్ని ఇప్పుడు సమానం చేస్తారు. రాబోయే కాలం చెడ్డగా ఉండబోతుంది….ఎవరి చేతుల్లోకి అధికారం ఉంటుంది అన్నదాని మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. కానీ చూస్తూ ఉంటే మంచికాలం అంతా అంతరించిపోతున్నట్టే ఉండబోతుంది.’
‘మనం అప్పటికీ బ్రతికి ఉంటే,అప్పుడు చూద్దాము!’బోగాట్రియోవ్ తల ఊపుతూ,సెర్జీ ప్లాటోనోవిచ్ ను అపనమ్మకంగా చూస్తూ అన్నాడు. ‘నీకు వీటి గురించి ఫిర్యాదు చేయడానికి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. కానీ మాకు అంతా కష్టంగా ఉండకపోవచ్చు కదా?’అన్నాడు.
‘మీకు కష్టంగా ఉండదా ?ఎలా?’ వెటకారంగా అడిగాడు సెర్జీ ప్లాటోనోవిచ్.
‘కొత్త పభుత్వం యుద్ధాన్ని ఆపేయ్యవచ్చు…… అలాంటిది జరిగే అవకాశం కూడా ఉంది కదా?’
సెర్జీ ప్లాటోనోవిచ్ ఆ సూచనను ఒప్పుకోనట్టు చేత్తో సూచిస్తూ, అక్కడి నుండి లేచి తన ఇంటి వైపుకి నడిచాడు. అతను నడుస్తూ తను సంపాదించిన డబ్బు -మిల్లు-వ్యాపారంలో నష్టాలు, లిజా మాస్కోలో ఉండటం,త్వరలోనే వ్లాదిమిర్ నోవోచెర్కాస్క్ నుండి రాబోవడం వగైరా విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. బిడ్డల గురించి కలిగిన చిన్నపాటి చింత అతని ఆలోచనా ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయింది. అతను వాకిట్లోకి వచ్చేసరికి,ఆ ఒక్క రోజులోనే తన జీవితంలోని వైభవమంతా మాయమైపోయినట్టు,తను కూడా దానితోపాటే మాయమైపోతున్నట్టు అతనికి అనిపించింది. అతని నోరంతా చేదు ఉమ్ముతో నిండిపోయింది. చుట్టూ ఉన్న వృద్ధులను చూస్తూ,తన వాకిలి దగ్గర ఉన్న రెయిలింగ్ దగ్గర ఉమ్మేసి ,వరండా దాటి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అన్నా ఇవానోవిచ్ తన భర్తను భోజనాల గది దగ్గర కలిసింది.ఎప్పటిలా కాకుండా ఏదోలా ఉన్న అతని ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ, ‘టీ తీసుకునే ముందు మద్యం తీసుకుంటారా?’అని అడిగింది.
‘ఏంటి ?మందా? అస్సలు తీసుకోను!’ సెర్జీ ప్లాటోనోవిచ్ ఆ సూచనను పక్కకు తోసేస్తూ అన్నాడు.
తలలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటే అతను తన కోటు తీశాడు.
‘లిజా నుండి ఉత్తరం వచ్చింది.’
అన్నా ఇవానోవ్న హడావుడిగా పడక గదిలోకి వెళ్ళి(ఆ పెద్ద ఇంట్లో వ్యవహారాలు ఆమెకు చాలా భారంగా అనిపిస్తాయి.ఆమె తన వివాహం అయిన తర్వాత నుండి అదే రకంగా నడిచేది దానికి సూచనగా)సీలు తీసిన ఒక ఉత్తరం తెచ్చింది.
ఆ ఉత్తరం నుండి వస్తున్న అత్తరు వాసన ముక్కు పుటాలతో పీలుస్తూ సెర్జీ ప్లాటోనోవిచ్ ముఖం చిట్లించాడు. ‘ఈ అమ్మాయికి అసలు బుర్ర లేదు,మూర్ఖురాలు’,అని తనలో తానే అనుకున్నాడు. అతను తన కూతురి గురించి మొదటిసారి అలా అనుకున్నాడు. అతను ఆ ఉత్తరాన్ని శ్రద్ధ లేకుండా చదువుతూ, ఏదో కారణం వల్ల ‘మూడ్’అన్న పదం దగ్గర ఆగి,దానికేదో లోతైన అర్థం ఉంటుందని భావించి దాని గురించి కాసేపు ఆలోచించాడు.డబ్బుల కోసం అడుగుతూ లిజా ఆ ఉత్తరాన్ని ముగించింది.ఆ చివరి వాక్యాలు చదువుతూ ఉండగానే అతని మనసులో ఏదో తెలియని శూన్యం ఆవరించినట్టు అనిపించింది. అతనికి అప్పుడు ఎవరికి కనబడని ఓ మూలలో దాక్కుని ఏడ్వాలనిపించింది. ఆ క్షణంలోనే జీవితం అతని కన్నా ఉన్నతంగా ఎదిగి, శూన్యాన్ని అతనికి పరిచయం చేసింది.
‘ఆమె నాకు ఒక అపరిచితురాలు. నేను కూడా ఆమెకు అపరిచితుడినే. ఆమెకు ఈ కుటుంబం అన్న భావన కేవలం డబ్బు అవసరమైనప్పుడే గుర్తుకు వస్తుంది. ఆమె ఒక వేశ్య, ఎందరో ప్రేమికులు కూడా ఉన్నారు ఆమెకు. కానీ ఆమె బాల్యంలో ఆమె నా బంగారు తల్లి. దేవుడా,ఒక్కసారిగా అన్ని ఎలా మారిపోతాయి! నా వృద్ధాప్యంలో జీవితం బావుండబోతుందని కల గనే మూర్ఖుడిని నేను,కానీ నిజానికి ఎవరూ లేని ఒంటరివాడిని. నేను డబ్బును నిజాయితీగా సంపాదించలేదు,కానీ అలా అయితే సంపాదించగలిగేవాడిని కూడా కాదు.నేను దొంగతనం చేశాను లేకపోతే బలవంతంగా లాక్కున్నాను, ఇప్పుడు విప్లవం ఊపందుకుంది. రేపన్న రోజు నా పనివాళ్ళే నా ఇంట్లో నుండి నన్ను గెంటేయ్యవచ్చు. అప్పుడు అంతా సర్వనాశనమవుతుంది. ఇక పిల్లల విషయానికి వస్తే ….వ్లాదిమిర్ ఒట్టి వెధవ…అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడు అప్రస్తుతం..’అని తనలో తానే అనుకున్నాడు.
అతని మెదడులో అసంకల్పితంగానే కొన్ని సంవత్సరాల క్రితం మిల్లు దగ్గర జరిగిన ఒక ఉదంతం సుడులు తిరిగింది. ఒక కొసాక్కు తన జొన్నలు పిండి పట్టించడానికి మిల్లు దగ్గరకు వచ్చాడు. పిండి తక్కువ అయ్యిందన్న కారణంతో అతను గొడవ పడుతున్నాడు. ఆ సమయంలో ఇంజిన్ గదిలో ఉన్న సెర్జీ ప్లాటోనోవిచ్ ఆ గొడవ విని బయటకి వచ్చి,జరిగింది తెలుసుకుని ,అక్కడున్న పనివాళ్ళతో అతనికి పిండి ఇవ్వద్దని చెప్పాడు. బక్కగా,బలహీనంగా ఉన్న ఆ కొసాక్కు ఆ పిండి సంచిని ఒకవైపు లాగాడు.వెంటనే బలిష్టుడైన జాకర్ దాన్ని పట్టుకుని ఇంకో వైపుకి లాగాడు. ఆ కొసాక్కు అతన్ని పక్కకు తోసేసే ప్రయత్నం చేసినప్పుడు,జాకర్ వెనక్కి తిరిగి అతని రొమ్ము మీద గట్టిగా గుద్దాడు. ఆ కొసాక్కు వెంటనే కిందకు కూలిపోయాడు. అతని ఎడమ రొమ్ము నుండి రక్తం కారుతూ ఉంది. అతను వెంటనే కోలుకుని లేచి నిలబడి,సెర్జీ ప్లాటోనోవిచ్ దగ్గరకు వచ్చి, ‘ఆ పిండి నువ్వే తీసుకో!మొత్తం నువ్వే తిను!’అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఏ కారణం లేకుండా సెర్జీ ప్లాటోనోవిచ్ ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుని,దాని పరిణామాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఆ కొసాక్కు భార్య ఆ పిండి తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చింది. ‘అసలు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూసారా,సోదరులారా!వాళ్ళకు ఏ హక్కు ఉంది?మా పిండి మాకు ఇచ్చేయ్యండి’, అంటూ ఆమె ఇతర కొసాక్కుల సానుభూతి పొందేలా ఏడుస్తూ అడిగింది.
‘నోరు మూసుకుని బయటకు వెళ్ళు,లేకపోతే మీ ఆయనకు జరిగిన శాస్తే నీకు జరుగుతుంది’,అని జాకర్ ఆమె మీద అరిచాడు.
అప్పుడు అక్కడ పని చేస్తున్న స్కేల్స్ మాన్ నేవ్ వెళ్ళి జాకర్ ను ఆ పిండి తిరిగి ఇవ్వమని గొడవ పడ్డాడు,కానీ జాకర్ అతన్ని కూడా చితకకొట్టాడు. ఇది చూసి సెర్జీ ప్లాటోనోవిచ్ కు కోపం,దిగ్భ్రాంతి కలిగాయి. అదంతా ప్లాటోనోవిచ్ మెదడులోకి అప్పుడే జరిగినంత కొత్తగా కనిపిస్తూ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ అతను ఆ ఉత్తరాన్ని మడిచి పెట్టి, శూన్యంలోకి చూడసాగాడు.
ఆ రోజంతా అతను బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆలోచనలు అతని మెదడుని తినేస్తూ ఉన్నాయి,నిద్ర కూడా మధ్య రాత్రి వరకు పట్టలేదు. ఉదయం అతను నిద్ర లేచేసరికి యెవజిని లిస్ట్ నిట్ స్కీ యుద్ధం నుండి తిరిగి వచ్చాడని,తన తండ్రి ఎస్టేటు ఉన్న యాగ్డోనోయ్ లో ఉంటున్నాడని తెలిసింది. వెంటనే అతన్ని కలిసి నిజంగా జరుగుతుందేమిటో తెలుసుకుని తన మెదడుని తొలుస్తున్న భయాల నుండి బయట పడాలని అనుకున్నాడు. యెమెల్యాన్ తన యజమానిని యాగ్డోనోయ్ ఎస్టేటుకు తీసుకువెళ్ళడానికి గుర్రపుబండి సిద్ధం చేశాడు.
ఆప్రికాట్ పండులా సూర్యుడు సూటిగా ప్రకాశిస్తూ ఉన్నాడు,సూర్యుడి వెనుక మేఘాలు దాక్కుని పొగలు కక్కుతూ ఉన్నాయి. మంచు నిండిన గాలి పండ్ల వాసన మోసుకువస్తూ ఉంది. రోడ్డు మీద ఉన్న మంచు ముక్కలు గుర్రపు కాలి డెక్కలు తగిలి పగిపోతూ నీరుగా మారిపోతున్నాయి. సూర్యుడు వచ్చినా ,కొంత మంచు పట్టి ఉంది ,ఆ మంచు గుర్రం మెడ మీద పడుతూ ఉంది. ఆ చల్లటి వాతావరణంలో సెర్జీ ప్లాటోనోవిచ్ కు నిద్ర పట్టింది. బండిలో అతని శరీరం అటూ ఇటూ ఊగుతూ,బండి చివర్లకు తన భుజాలు రుద్దుకుంటూ ఉన్నా,నిద్రకు ఏ భంగం కలగలేదు. ఆ బండి ముందుకు కదిలిపోతూ ఉంటే, వెనుక కూడలి వద్ద కొసాక్కుల ఆకారాలు గుంపుగా కనిపిస్తూ ఉన్నాయి.
బడి పంతులు బలాండా తన నోటికి చేతి రుమాలు అద్దుకుంటూ,కళ్ళు మెరుస్తూ ఉండగా ఆ గుంపును ఉద్దేశించి ప్రసంగించటం మొదలుపెట్టాడు.
‘….ఇక రాచరిక వ్యవస్థ పాలనకు అంతం వచ్చేసింది. ఇక నుండి మన బిడ్డలు ఎవరూ కూడా ఎవరికి ఊడిగం చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన రక్తం పీల్చిన ఆ జారుకు ఇక సేవలు చేయాల్సిన పని లేదు. స్వేచ్చ పొందిన రష్యాలో ఇక నుంచి రాజ్యాంగ పరిషత్తు మన జీవితాలని మారుస్తుంది. అది తప్పకుండా మనందరికీ లాభం చేకూర్చేలా పరిపుష్టమవుతుంది!మన జీవితాలు కొత్తగా,ఉత్సాహంతో నిండుతాయి.”
అతని వెనుక అతని భార్య అతని కోటు వెనుక జేబు దగ్గర చేయి పెట్టి తడుతూ, ‘ఇక చాలు మిత్యా!ఇక ఆపు!ఇది నీకు మంచిది కాదు! నువ్వు ఆవేశపడితే మళ్ళీ నీకు రక్తకఫం అవుతుంది …’అని గుసగుసగా అంది.
కొసాక్కులు నేల చూపులు చూస్తూ బాలాండా చెప్పే మాటలు వింటూ,మధ్యలో అప్పుడప్పుడు తమలో తామే ఏవో సంజ్ఞలు చేసుకుంటూ,కొన్నిసార్లు నవ్వుకుంటూ ఉన్నారు. అతను ఇంకా తన ప్రసంగం ముగించనేలేదు. ముందు వరుసలో నుండి జాలి నిండిన ఓ స్వరం అతన్ని అడ్డుకుంది. ‘చూస్తూ ఉంటే జీవితం ఉత్సాహభరితంగానే ఉండబోతుంది,కానీ అంతకాలం నువ్వు ఉండకపోవచ్చు. ఇక నువ్వు ఇంటికి వెళ్తే మంచిది.అందులోనూ ఈ రోజు బయట చల్లటి గాలులు వీస్తున్నాయి’,అంది ఆ స్వరం.
బలాండా ఏదో మాట్లాడబోయే తనలో తానే గొణుక్కుని,వణుక్కుంటూ,ఊపిక కోల్పోయి , అక్కడ ఉన్న గుంపు నుండి బయటకు వచ్చేశాడు.
సెర్జీ ప్లాటోనోవిచ్ మధ్యాహ్నానికి యాగ్డోనోయ్ చేరుకున్నాడు. సెర్జీ ప్లాటోనోవిచ్ బండి దిగి తన కోటులో ఉన్న చేతి రుమాలు బయటకు తీసుకుని, ముఖానికి అద్దుకున్నాడు. ఈ లోపు యెమెల్యేన్ గుర్రపు శాల దగ్గరకు గుర్రపుబండిని తీసుకువెళ్ళాడు.వాకిట్లో అతనికి దట్టమైన బొచ్చుతో, అక్కడక్కడా మచ్చలతో ఉన్న రష్యాకు చెందిన వేటకుక్క ఎదురైంది. అది ఆ ఇంట్లో కొత్తగా కనిపించిన ఆ అపరిచితుడిని పలకరించడానికన్నట్టు ఆవులిస్తూ పైకి లేచింది. దాని వెనుక గుంపుగా ఉన్న కుక్కలు కూడా దాని చర్యనే అనుసరించాయి.
‘ఎన్ని ఉన్నాయో! దేవుడా!’అని మనసులో అనుకుంటూ,జాగ్రత్తగా వాటినే గమనిస్తూ అడుగులు వెనక్కి వేశాడు.
దీపాల కాంతిలో ప్రకాశవంతంగా ఉన్న ఆ హాలంతా కుక్కల వాసనతో నిండిపోయింది. ఆ హాలు మధ్యలో ఉన్న ఒక పెట్టె పైన గోడ మధ్యలో ఉన్న చెట్టు కొమ్మలా ఉన్న కొమ్ముల మీద మిలిటరీ అధికారి ధరించే టోపీ,కోటు తగిలించి ఉన్నాయి. ఒక్క నిమిషం దాన్ని చూస్తూ నిజంగానే తన ముందు ఓ ఆకారం ఉందని ప్లాటోనోవిచ్ భ్రమించాడు. పక్కన ఉన్న గదిలో నుండి నల్ల కళ్ళతో ఉన్న ఒక లావుపాటి స్త్రీ వచ్చింది. కొత్తగా వచ్చిన వ్యక్తిని గమనిస్తూ, ముఖంలో గాంభీరాన్ని ప్రదర్శిస్తూ, యజమాని కోసం వచ్చారా అని అడిగింది,అతను అవునన్నాడు.
‘సరే నేను వెళ్ళి చెప్తాను’,అని ఆమె పక్కనే ఉన్న గది తలుపు తట్టకుండానే లోపలికి వెళ్ళి, తన వెనుకే తలుపు మూసుకుంది. కొంతసేపు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాక సెర్జీ ప్లాటోనోవిచ్ ఆ నల్ల కళ్ళ అందగత్తెని అక్సిన్య అష్టకోవాగా గుర్తించాడు. ఆమె కూడా అతన్ని గుర్తు పట్టి, చెర్రీ పళ్ళలా ఎర్రగా ఉన్న తన పెదాలను గట్టిగా బిగపట్టి పెట్టి,ఒక రకమైన అసౌకర్యంతో అక్కడి నుండి వెళ్ళింది. ఒక నిమిషం తర్వాత వృద్ధుడైన లిస్ట్ నిట్ స్కీ ఆమె వెనుకే వచ్చాడు. ‘ఓ ఘనమైన వ్యాపారి! ఏంటి ఇలా వచ్చారు…రండి …’అంటూ ఆ వృద్ధుడు నవ్వుతూ అతన్ని పలకరిస్తూ,ఆ అతిథిని తనను అనుసరించమని సంజ్ఞ చేస్తూ పక్కన ఉన్న గదిలోకి వెళ్ళాడు.
సెర్జీ ప్లాటోనోవిచ్ వ్యాపారస్తుడిగా మారినప్పటి నుండి ఇలాంటి సందర్భాల్లో చేసినట్టే ఈ సందర్భంలో కూడా ఆ వృద్ధుడికి వంగి నమస్కరించి,ఆ గదిలోకి ప్రవేశించాడు. తన కళ్ళద్దాలలో నుండి అతన్ని చూస్తూ ,యెవజిని లిస్ట్ నిట్ స్కీ లేచి అతనితో చేతులు కలిపాడు.
‘నా ప్రియమైన సెర్జీ ప్లాటోనోవిచ్! మీరు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. భలేగా ఉందే, మీరు అసలు ముసలివాళ్ళే కావడం లేదు’,అని నవ్వుతూ అన్నాడు.
‘అవును ,యెవజిని నికోలోయేవిచ్! నిజానికి మీ కన్నా కూడా ఇంకా ఎక్కువకాలం బ్రతకాలని ఉంది. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు?అంతా సవ్యంగానే ఉందా?’
పళ్ళు బయటపడేలా నవ్వుతూ,యెవజిని తన అతిథిని కుర్చీలో కూర్చోమన్నట్టు సంజ్ఞ చేశాడు. వాళ్ళు ఒక బల్ల చుట్టూ కూర్చుని,చిన్న చిన్న మాటలు విసురుకుంటూ,అంతకుముందు కలిసినప్పటి నుండి పక్కవారిలో వచ్చిన మార్పులు గమనించడానికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. టీ తీసుకురమ్మని చెప్పి, జనరల్ కూడా వారి ముచ్చట్లలో కలిశాడు. ఆయన ఒక పెద్ద పైపుతో పొగ కాలుస్తున్నాడు. ఆయన సెర్జీ ప్లాటోనోవిచ్ కుర్చీ పక్కనే ఆగి,అక్కడ ఉన్న బల్ల మీద తన చేయి పెడుతూ, ‘గ్రామంలో ఏం విశేషాలు ఉన్నాయి? మీరు ఆ శుభవార్త విన్నారా?’,అని అడిగాడు. శుభ్రంగా క్షవరం చేసుకుని ఉన్న ఆ వృద్ధుడి ముఖం వైపు చూస్తూ, గట్టిగా నిట్టూరుస్తూ, ‘హా,విన్నాను’,అని బదులిచ్చాడు.
‘ఎలాంటి తప్పించుకోలేని విధిగా మారిపోయింది పరిస్థితి …’ పొగ లోపలికి పీలుస్తూ ఉంటే ఆ వృద్ధుడి గొంతు వణుకుతూ ఉంది. ‘కానీ ఇది జరగాల్సిందే. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండే ఇలా జరుగుతుందని నేను ఊహిస్తూనే ఉన్నాను. అలాగే …ఇప్పుడు ఆ వంశం శిథిలమైపోయింది. నాకు మెరిజ్కోవ్స్కి ఘటన గుర్తుకువచ్చింది -నీకు గుర్తుందా యెవజిని? అదే పీటర్ ,అలెక్సి? తనను ఎంతో చిత్రవధ పెట్టిన తర్వాత జారేవిచ్ అలెక్సి తన తండ్రితో, ‘నా రక్తపు పాపం ఈ వంశపు వారసుల మీదకు చిందుతుంది’,అన్నాడు.
‘అయినా మనం ఏది నిక్కచ్చిగా అనుకోవడానికి వీలులేదు’, సెర్జీ ప్లాటోనోవిచ్ ఆదుర్దాతో అందుకున్నాడు;అతని తన కుర్చీ మీద చేతితో ఒక నిమిషం దరువు వేసి,సిగరెట్టు వెలిగించి,తను చెప్పాలనుకున్నది కొనసాగించాడు. ‘అసలు వారం నుండి ఏ వార్తాపత్రిక చూడలేదు. కేవలం గందరగోళంగా ఉన్న విశ్వసనీయత లేని ఈ వదంతులే వింటూ ఉన్నాము. ఇది నిజంగా చాలా భయంకరమైన స్థితి!అందుకే ఎప్పుడైతే నేను యెవజిని నికోలోయేవిచ్ యుద్ధం నుండి సెలవు మీద వచ్చాడని విన్నానో,అసలు ఏం జరుగుతుందో స్వయంగా తెలుసుకోవడానికి వచ్చాను.’ప్లాటోనోవిచ్ కి బదులిస్తున్న క్రమంలో పాలిపోయి ఉన్న యెవజిని ముఖంలో నవ్వు జాడలనేవి మచ్చుకకి కూడా కనిపించలేదు.
‘భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి ….సైనికులందరూ నైతిక స్థైర్యం కోల్పోయారు. వారికసలు యుద్ధం చేయాలనే లేదు, వారు అలసిపోయారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మొదటి నుంచి సైనికులెవరూ కూడా సైనికుల్లా ప్రవర్తించడం లేదు. ఒకప్పుడు క్రమశిక్షణతో ఉన్న సైనికులు ఇప్పుడు నేరస్తుల బృందాల్లా మారిపోయారు. నాన్న మీరైతే -అసలు ఊహించనూ కూడా ఊహించలేరు. అసలు మా సైన్యం ఏ స్థాయిలో అతలాకుతలం అయిపోయిందో మీ ఊహకు కూడా అందదు. ఆజ్ఞను ఉల్లంఘించి యుద్ధంలో కూడా ప్రవర్తిస్తారు,మామూలు జనాన్ని దోచుకుంటారు ,చంపుతారు .వారిపై అధికారులను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. …..అధికారుల ఆజ్ఞలను పాటించకపోవడం సాధారణమైపోయింది.’
‘చేప మొదట తల నుండే కుళ్ళిపోతుంది ‘, వృద్ధ లిస్ట్ నిట్ స్కీ పొగ పీలుస్తూ అన్నాడు.
‘నేను అది అనడం లేదు’,యెవజిని ముఖం చిట్లిస్తూ తండ్రిని అడ్డుకున్నాడు. ‘నేను అది ఒప్పుకోను. సైన్యం కింద నుండి కుప్పకూలిపోతుంది. బొల్షివిక్కుల ప్రభావం అక్కడ ఎక్కువ ఉంది. పదాతి దళాలతో ఉన్న కొసాక్కుల బృందాలు కూడా నైతికంగా దెబ్బ తిని ఉన్నారు.నిరంతరాయంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల అంతా అలసిపోయారు, ఇంటికి తిరిగి వెళ్ళాలన్న కోరిక వారిలో బలపడిపోయింది….వీటన్నిటి మధ్యలో బొల్షివిక్కులు ఉండనే ఉన్నారు.’
‘వాళ్ళకు ఏం కావాలంట?’సెర్జీ ప్లాటోనోవిచ్ అడగకుండా ఉండలేకపోయాడు.
‘ఓ’, యెవజిని ఒక పొడి నవ్వు నవ్వి కొనసాగించాడు. ‘ వాళ్ళకు ఏం కావాలా …వాళ్ళు కలరా క్రిముల కన్నా ప్రమాదకరమైనవారు. ఎందుకంటే ఆ క్రిములు మనిషిని సులభంగా దాడి చేసి, చుట్టూ కూడా వ్యాపించగలదు. నేను ఇక్కడ మాట్లాడుతుంది వారి ఆలోచన గురించి. దానికి వ్యతిరేకంగా ఏ క్వారైంటైన్ కూడా పని చేయదు. బొల్షివిక్కులో ఎందరో అద్భుతమైన వారు ఉన్నారు ,వారిలో కొందరిని నేను కలిశాను కూడా-అలాగే ఒట్టి మూర్ఖులు,ఉన్మాదులు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువమందే ఆ మూర్ఖపు ఉన్మాదులే ఉన్నారు. వారికి అసలు బొల్షివిక్ సిద్ధాంతం గురించి ఏమి తెలియదు, వారికి ఉన్న ఆసక్తి కేవలం దోచుకోవడం, యుద్ధం నుండి తప్పించుకోవడం మాత్రమే. వారి ముఖ్య కాంక్ష అధికారం చేజిక్కించుకోవడం. వారు దాని వల్ల ‘సామ్రాజ్యవాదాన్ని’అంతమొందిస్తామని భావిస్తారు. వారు దీని కోసం శత్రువుతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి కూడా వెనుకాడరు. ఆ తర్వాత వారు భూములు సన్నకారు రైతులకు, పరిశ్రమలు శ్రామికులకు పంచిపెడతారు. దీనికన్నా పిచ్చితనం ఏమి ఉండదు కానీ ఎక్కువమంది సైనికుల సానుభూతి వారి వైపే ఉంది.’
యెవజిని కోపాన్ని అణుచుకుంటూ మాట్లాడాడు. అతను మాట్లాడుతూ ఉంటే అతని చేతి వేళ్ళ మధ్య ఉన్న సిగరెట్టు నాట్యం చేసింది. సెర్జీ ప్లాటోనోవిచ్ ముందుకు వంగి అంతా శ్రద్ధగా విన్నాడు. వృద్ధ లిస్ట్ నిట్ స్కీ ఆ గదంతా పచార్లు చేస్తూ ఉన్నాడు.
ఫిబ్రవరి ఘటనలు జరగకముందే కొసాక్కుల ప్రతీకారానికి భయపడి తానే భయపడి రెజిమెంటు నుండి బలవంతంగా ఎలా పారిపోవాల్సి వచ్చిందో,ఆ తర్వాత పెట్రోగ్రాడ్ లో తను చూసిన వాటి గురించి యెవజిని వివరంగా చెప్పాడు.
ఆ సంభాషణ ఒక్క నిమిషం పాటు దారి తప్పింది. వృద్ధ లిస్ట్ నిట్ స్కీ సెర్జీ ప్లాటోనోవిచ్ ముఖం వైపు చూస్తూ,’సరే కానీ ,నువ్వు ఇది వరకు వచ్చినప్పుడు చూసిన ఆ బూడిద రంగు గుర్రాన్ని కొనుక్కుంటావా?’అని అడిగాడు.
‘ఆ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం ఇదా,నికోలాయ్ అలెక్స్యేవిచ్?’సెర్జీ ప్లాటోనోవిచ్ నిస్సహాయంగా నిట్టూరుస్తూ అన్నాడు.
ఈ లోపు పని వాళ్ళ క్వార్టర్స్ లో యెమెల్యాన్ మంట ముందు కూర్చుని, వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, టీ తాగుతూ, గ్రామం గురించి ,అక్కడి విషయాల గురించి చెప్తున్నాడు. భుజం చుట్టూ ఒక శాలువా కప్పుకుని, మంచం పక్కగా నిలబడి అతను చెప్పేవి వింటుంది అక్సిన్య.
‘ఈపాటికే మా ఇల్లు పడిపోయి ఉంటుంది కదా?’ఆమె అడిగింది.
‘లేదు.ఇంకా గట్టిగానే నిలబడి ఉంది. దానికేమవుతుంది?’తను మాట్లాడే ప్రతి మాట గురించి ఆమెలో ఉత్కంఠ ఏర్పడేలా మాట్లాడుతూ అన్నాడు.
‘మా పొరుగువారైన మెలఖోవులు ఎలా ఉన్నారు?’
‘వారు బావున్నారు.’
‘సెలవు మీద పెట్రో ఇంటికి వచ్చాడా?’
‘రాలేదనుకుంటా.’
‘మరి గ్రెగరి…అదే గ్రీషా?’
‘గ్రెగరి క్రిస్మస్ తర్వాత వచ్చాడు. అతని భార్య కవలల్ని కన్నది.హా,గ్రెగరి ఇంటికి గాయపడి వచ్చాడు.’
‘గాయపడ్డాడా?’
‘అవును.అతని చేతికి గాయం అయ్యింది. ఇప్పుడు అతని శరీరమంతా ఆ యుద్ధగాయాల మచ్చలే. అతనికి భవిష్యత్తులో ఎక్కువ పతకాలు వస్తాయో మచ్చలు మిగులుతాయో ఎవరూ చెప్పలేరు.’
‘ఇప్పుడు ఎలా ఉన్నాడు?’గొంతులో ఏదో అడ్డుపడుతూ ఉన్నట్టు అడిగింది.
‘అలాగే ఉన్నాడు ….నల్లగా ,ఎత్తుగా . టర్కీ వాడిలా.’
‘నేను అడిగేది అది కాదు ….వయసైపోయిందా?’
‘నాకు అదెలా తెలుస్తుంది? ఏదో కొద్దిగా వయసు పెరిగి ఉంటుంది.అతని భార్య కవలల్ని కంది ,కనుక పెద్ద వయసైపోయినట్టు కాదు.’
‘ఇక్కడ బాగా చలిగా ఉంది’,వణుకుతూ అంటూ అక్సిన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఎనిమిదో సారి తన కప్పులో టీ పోసుకుంటూ,ఆమె బయటకు వెళ్తుంటే చూస్తూ,మెల్లగా తనలో తానే తిట్టుకున్నాడు. ‘వాసన వస్తూ,మురికి మొహంతో ఉండేది! ఇక్కడకు వచ్చేటప్పుడు దరిద్రపు సంచిలా ఉంది. పొలంలో వేసుకునే బూట్లతో ఊరంతా తిరుగుతూ ఉండేది.కనీసం సూటిగా మాట్లాడటం కూడా రాదు. ఇలాంటి ఆడదానితో నేనైతే ఉండలేను. పాముల్లాంటి వాళ్ళు …ఈ గదిలో చల్లగా ఉండంతా ..పనికిమాలినది!’
ఎందుకో ఆ ఎనిమిదో కప్పు తాగబుద్ధి కాక మధ్యలోనే వదిలేశాడు. బల్ల మీద నుండి లేచి,కావాలనే తన బూట్లకు ఉన్న బురదను కింద బలంగా రాస్తూ బయటకు వెళ్ళాడు.
అతని యాజమాని లానే అతను కూడా ప్రయాణమంతా కోపంగా ఉన్నాడు. తన కోపాన్ని అంతా గుర్రాల మీద చూపిస్తూ వాటిని దారంతా కొరడాలతో కొడుతూనే,తిడుతూనే ఉన్నాడు. తన అలవాటుకి వ్యతిరేకంగా అతని ఆ ప్రయాణంలో యజమానితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సెర్జీ ప్లాటోనోవిచ్ కూడా అంతే మౌనంగా ఉన్నాడు.
* * *