సినిమా ఒక ఎంటర్‌టైన్మెంట్ మాధ్యమమే అయినా. అది ఒక బలమైన ప్రచార సాధనం అని కూడా గుర్తుంచుకోవాలి. ఒక భావజాలాన్ని ఈజీగా జనం మధ్యలోకి తీసుకువెళ్లటానికి మంచి మార్గం సినిమా. లాభాలకోసం, కళా సేవకోసం సినిమాలు తీసేవాళ్ల మధ్యలో కొందరు తాము నమ్మిన సిద్దాంతాలనే పాటిస్తూ సినిమాలు తీశారు. ఆనాటి చార్లీ చాప్లిన్ దగ్గరనుంచి ఇలాంటి స్పృహ ఉన్న వాళ్ళు ప్రతీ భాషలోనూ అతితక్కువమందే అయినా కొందరు నిలబడ్డారు అద్బుతమైన సినిమాలని తీశారు. తెలుగుకు వచ్చేసరికి ఈ తరం ఫిలిమ్స్ అలాంటి సినిమాలకు కేరాఫ్ అనుకోవచ్చు.
1990లో పోకూరి బాబూరావు, ముత్యాల సుబ్బయ్యల ఆలోచన ఓఅద్బుతమైన సినిమాని టాలీవుడ్‌కి ఇచ్చింది. వర్గపోరాట అవసరాన్ని, నిమ్నకులాల వెనుకబాటుతనాన్ని, కుల,వర్గ అంతరాలనీ బలంగా చర్చించిన సినిమాగా “ఎర్రమందారం” నిలబడింది. కమర్షియల్ ఫర్ములా అనబడే సినిమాలమధ్య కూడా మంచి సినిమా అన్న మెప్పు పొందింది.
ఒంగోలు దగ్గరలోని దొరవారి పల్లెలో, ఊరి దొర నడిపే టూరింగ్ టాకీస్ ఆపరేటర్ బండి రాముడు. ఆ ఊరికి ప్రెసిడెంటు, భూస్వామి అన్నీ తనే అయిన జగ్గన్న దొర దగ్గర నోరెత్తని పాలేరు. చెప్పిన పని చేయటం ఇచ్చింది తీసుకోవటం తప్ప మరేమి తెలియని మనిషి. ఊరికి పక్కగా ఉన్న వెలివాడ మనిషి. ఆ ఊళ్లోనే ఉన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు.హాయిగా నడుస్తున్న జీవితం. అంతా హాయిగా ఉందనుకుంటున్న సమయంలో ఊరికి పంచాయితీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానమొస్తుంది. తన దగ్గర అణిగిమణిగి పడిఉంటాడని రాముణ్ణి ఏకగ్రీవంగా పంచాయితీ ప్రెసిడెంటును చేస్తాడు జగ్గన్న దొర. తమ వాడ కుర్రాడు ప్రెసిడెంటు అయ్యాడు కదా ఇకనైనా ఊరు బాగుపడుతుందనుకుంటారు జనాలు.
కానీ పేరు రాముడిదైనా, పెత్తనం మాత్రం జగ్గన్నదొరదే. పంచాయితీ నిధులు తన సొంతానికి వాడుకుంటున్నడని పై అధికారులకి కంప్లైంట్ చేసిన ఫలితంగా హత్యా నేరం మోపబడి జైలుకెళ్తాడు రాములు. అప్పుడే పుట్టిన కొడుకునీ, భార్యనీ వదిలి ఆరేళ్లపాటు జైల్లో ఉండిపోతాడు.
తిరిగి వచ్చాక తెలుగుగంగ కింద పోతున్న భూముల వివరాలు పేపర్‌లో చూస్తే అప్పటివరకూ వీళ్ల భూములన్నీ గ్రామస్తుల పేరుతో దొర ఆధీనంలో ఉన్నాయని తెలుస్తుంది.మళ్లీ దొరమీద తిరగబడతాడు రాముడు, కానీ ధైర్యంలేని ఊరిజనం రాముడివెంట రారు, రాముడు హత్య చేయబడతాడు. ఆ శవం రాముడిది కాదనీ తన దగ్గర పనిచేసే ఈరిగాడిదనీ రాముడే ఈరి గాడిని చంపేసి పారిపోయాడని తప్పుడు సాక్ష్యమిప్పిస్తాడు దొర. ఆఖరికి రాముడు భార్య కూడా ఆ కాగితాల మీద సంతకం పెడుతుంది. అంతే కాదు ఆ తరవాతనుంచి చక్కగా అలంకరించుకొని మరీ ఆ దొరదగ్గరికి వెళ్తుంది. అతనికి పాము కరిస్తే కంటికి రెప్పలా కాపాడిమరీ బతికించుకుంటుంది.
ఆమె ఎందుకలా చేసింది? ఊరిజనమంతా అసహించుకుంటున్నా, తన వాడ మనుషులు మొగున్ని చంపినవాడి దగ్గరే పడుకుంటున్నావని వెలివేసినా ఆమె ఆ నిర్ణయం ఎందుకుతీసుకుందన్నదే ఈ కథకి ప్రాణమైన మలుపు. నిజానికి ఈ ముగింపే సినిమాని ఇంకో మెట్టు ఎక్కించి నిలబెట్టింది. లాభాల లెక్కలతో పోలిస్తే హిట్ సినిమా కాకపోవచ్చుగానీ. అద్బుతమైన తెలుగుసినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది “ఎర్రమందారం”. విప్లవాన్ని తిరుగుబాటుఈ, కులవివక్షనీ చర్చలోకి తెచ్చిన సినిమాఇది.
అప్పటివరకూ కామెడీ సినిమాల హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో సీరియస్ పాత్రలో మెప్పిస్తాడు. నిజానికి ఇందులో మెయిన్ లీడ్ అని చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం హీరోయిన్‌గా నటించిన యమునదే. ఇక ప్రతినాయకుడుగా చేసిన దేవరాజ్, మిలట్రీబాబాయ్‌గా కనిపించే పీఎల్ నారాయణల నటన ఆ పాత్రలని నిజమైనవే అని నమ్మెంతగా ఉంటుంది.
1090లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఎంవియస్ హరినాథ రావు రాసిన‘లేడి చంపిన పులి నెత్తురు’ కథను చదివి సినిమాగా తీయాలన్న ఆలోచనతో ఆయనని కలిస్తే ఇది చదివేందుకు బాగుందేగానీ, స్క్రీన్ మీద ఆశించినంత గొప్పగా పండకపోవచ్చని హరినాధరావు చెప్పారట. అయినా వదలకుండా కొన్ని కీలక మార్పులతో సంజీవి, మరుధూరి రాజా అందరూ కలిసి ఎర్రమందారం స్క్రిప్ట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ముత్యాల సుబ్బయ్య దర్శకుడిగా రూపుదిద్దుకున్న ఈ సినిమా జాలాది రాసినపాటలతో, వాసూరావు సంగీతంతో మంచి సినిమాగా నిలిచిపోయింది.
థియేటర్లదగ్గర వసూళ్లలో యావరేజ్ అనిపించుకున్న ఎర్రమందారం 1991 సంవత్సరంలో ఉత్తమ నటుడిగానూ (రాజేంద్రప్రసాద్) ఉత్తమ విలన్ (దేవరాజ్) ఉత్తమ కథా చిత్రం, ఉత్తమ గేయ రచయిత (జాలాది- యాలో యాలో ఉయ్యాలా అనే పాట), ఉత్తమ ఎడిటర్ (గౌతంరాజు) విభాగాల్లో అయిదు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులని సాధించింది. తమిళంలో “పుతియ పరాశక్తి”గా, కన్నడలో “బలరామ”గా రీమేక్ చేయబడింది.
సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనికి మూల కథ అయిన ‘లేడి చంపిన పులి నెత్తురు’ కూడా ఇంటర్‌నెట్‌లో అందుబాటులోనే ఉంది.