ఆటబొమ్మ

Spread the love

“తల్లిలేని సమయం చూసి మైనర్ బాలికపై ఆమె సవతి తండ్రి అఘాయిత్యం చేయబోవడం పాతకథే గదా…!” గార పట్టిన పళ్ళు కన్పించేలా గట్టిగా నవ్విందావిడ. ‘ఆయీ’ అని పిలువబడే ఆ లావాటి ఆవిడ ఆ ఇంటికి యజమానురాలు.

ఆవిడ ఎదురుగా ఓ వన్నెండేళ్ళ బాలికను అమ్మకానికి తెచ్చిన ఆమె తల్లి అనసూయ దీనవదనంతో నిలబడి ఉంది.

“సరే… అయిందేదో అయింది. చక్కని చుక్కలా ఉన్న నీ కూతురికిక్కడేం లోటుండదు. చూశావ్ గా అనసూయా! ఇక్కడున్న అమ్మాయిలంతా ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారో? రోజూ ఉదయాన్నే వీళ్ళందరికీ నేను గుడ్లు, పరాటాలు పెడ్తాను…” ‘ఆయీ’ మళ్ళీ తానే అంది.

ఆ బాలిక ఆక్కడున్న ఏడుగురు యువతులవంకా పరికించి చూసింది. వాళ్ళంతా దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ పక్కనే కిటికీ లోంచి తొంగిచూస్తోందో బక్కపల్చని అమ్మాయి. తెల్లగా, అందంగా ఉన్న ఆ అమ్మాయికి పదిహేనేళ్ళలోపే ఉంటాయేమో! తన లాంటి చిన్నమ్మాయే గనుక బహుశా ఆమే తనకి తగిన జోడీ అని, ఫ్రెండ్ అనీ భావించిందా బాలిక.

“రుక్మిణీ… దగ్గరకురా తల్లీ…” అంటూ ఆ బాలికను తన గుండెలకు హత్తుకొని ప్రేమగా ఇలా చెప్పింది ఆయీ-

“ఇక మీ అమ్మను వెళ్ళనీయమ్మా… ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అదుగో అప్పుడే పోస్ట్ మాన్ కూడా వచ్చేస్తున్నాడు. పాపం అమ్మ చాలా దూరం వెళ్ళాలిగదా!”

అంతలో పోస్ట్ మాన్ అక్కడికి రానేవచ్చాడు.

“నాకేమన్నా లెటర్ తెచ్చావా? పదేళ్ళక్రితం నామీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిన నా కొడుకు గురించి ఏమైనా వార్త తెస్తావేమోనని ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా” అంది అతనితో ఆయీ.

అతను లెటరేం లేదన్నట్లు సైగచేసి వెళ్ళి పోయాడు.

“నువ్వు మంచిదానివి. భగవంతుడు నీకు మేలే చేస్తాడమ్మా నువ్వు ఎదురుచూసే శుభవార్త త్వరలోనే నీకు చేరుతుంది” అంది అనసూయ. తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్న ‘ఆయీ’ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఆ మాటలు ఆమె కంఠం నుంచి వెలువడ్డాయి.

తల్లివంక భావరహితంగా చూసింది రుక్మిణి.

తమ ఇల్లు విడిచిపెట్టేసి ఇక్కడకు వచ్చేస్తున్నందుకామెకి ఎలాంటి విచారమూ లేదు. ఎందుకంటే, తండ్రి కనబడకుండా పోయిన కొన్నాళ్ళకు తమ ఇంట్లో ప్రవేశించిన ఆ కొత్త మనిషి నిజంగా రాక్షసుడే! రోజూ రాత్రివేళ తాగివచ్చి అమ్మని చితకబాదుతుంటాడు. అంతేకాదు. అమ్మ ఇంట్లోలేని వేళల్లో తన చిన్నిచిన్ని రొమ్ముల్ని పట్టుకొని కసికసిగా నలిపేస్తుంటాడు. మొన్నటికిమొన్న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు… తనని ఏదేదో చేశాడు. నేలమీద పడేసి తనని ఏదేదో చేశాడు. ఆ బాధ భరించలేక తను విలవిల్లాడిపోయింది. ఆ తర్వాత చూస్తే తను పడి ఉన్న ప్రదేశమంతా ఎర్రటి నెత్తురుతో నిండిపోయింది.

“నువ్వు చాలా పొరపాటు చేశావు అనసూయా! నేను దగ్గర ఉండి పెళ్ళి జరిపించిన మణిపూసలాంటి మనిషిని కాలదన్నుకున్నావ్. ఆ కుర్రవెధవ మోజులో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. ఇప్పుడు నీకేమైనా సుఖంగా ఉందా? నిజం చెప్పు!” అంది ఆయీ రుక్మిణి తల్లివైపు చూస్తూ.

అనసూయ తల కొట్టుకుంటూ దుఃఖించింది.

“అంతా నాఖర్మ… నేను పాపిష్టిదాన్ని… అమ్మా నా కూతుర్ని నీచేతుల్లో పెడ్తున్నాను. అదొట్టి ఆమాయకపు పిల్ల. దాన్ని జాగ్రత్తగా చూడు తల్లీ…” అంటూ కళ్ళు తుడుచుకుందామె.

తర్వాత ఆయీ ఇచ్చిన డబ్బు రొంటిన దోపుకుంటూ-

“అసలు నీదగ్గర ఇలా డబ్బు తీస్కోడం నాకిష్టం లేదు ఆయీ. కానీ ఏం చేయను? కటిక దరిద్రంతో ఛస్తున్నాం. పిల్లకి ఒక్కపూట కడుపునిండా తిండి పెట్టలేక పోతున్నాం…” అంది అనసూయ గాద్గదికంగా.

తల్లి వెళ్ళిపోయాక ఆయీవంక చూసింది రుక్మిణి, ఎడమచేతి అరచేతిలో పుగాకుపొడి వేసుకొని నలుపుతోందామె. అంతలో లోపల నుంచి ఆ బక్కపల్చని అమ్మాయి బయటికి వచ్చి రుక్మిణివంక చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.

తను వేసుకున్న గాజుల్ని చూపుతూ “నీకూ ఇలాంటివి కావాలా? ఇవి ప్లాస్టిక్ వి కావు నైలాన్ గాజులు, ఆయీ కొనిపెట్టినవే ఇవి” అంది ఆమె.

“సీతా… మనింటి పద్ధతులు, ఇక్కడ నడుచుకోవల్సిన తీరు గురించి రుక్మిణికి చెప్పమ్మా. ఆ పిల్ల నీకంటే రెండేళ్ళు చిన్నది. అన్నీ నువ్వు దగ్గరుండి నేర్పించాలి” అంది ఆయీ ఆ అమ్మాయివంక చూసి.

ఆ మాటతో సీత రుక్మిణి దగ్గరకొచ్చి ఆలింగనం చేసుకుంటూ చాలా కలుపుగోలుగా మాట్లాడింది. “కావాలంటే నా గాజులు నీకిచ్చేస్తాలే” అంటూ రుక్మిణి చేతుల వంక చూసి పకపక నవ్వింది.

“అయ్యో…. నా గాజులు నీకేం సరిపోతాయి? నా కంటే నీ చేతులు లావు కాదూ? అయినా నాకంటే నీ చాయ కూడా తక్కువే… ఆరెంజి కలర్ గాజులు నీలాంటివాళ్ళ కస్సలు బాగోవు” అని బాధపడింది.

అంతలో గదిలో ఓ మూల పడుకుని ఉన్న నల్లటి స్త్రీ ఒకామె లేచి ఆ ఆమ్మాయిలిద్దరి వంకా చూసి, “నల్లగా ఉంటే ఏంటట? చూడు… నేను నల్లగానే ఉన్నాను. అయినా ప్రతీ క్లయింటూ నాకోసమే వెంపర్లాడ్డం లేదంటావా ఆయీ?” అంటూ యజమానురాల్ని అడిగింది.

సీత రుక్మిణిని వెంటపెట్టుకొని ఇల్లంతా చూపించింది.  తర్వాత ఆమెను ఓ పెద్ద హాలులోకి తీసుకెళ్లింది. తుంగచాపల మీద పడుకొని అక్కడ కొందరు యువతులు నిద్ర పోతున్నారు. వారిలో ఒకామె అయితే వంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా ఎరుగనంత గాఢంగా నిద్రపోతోంది. సీత ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు సరిచేసి ఆచ్ఛాదనా శూన్యమైన ఆమె తొడలమీద ఓ టవలు కప్పి, “దీని పేరు రాధ. సిగ్గూ ఎగ్గూ లేని ముండ! పైపెచ్చు పొగరుబోతు. నువ్ దీని విషయంలో చాలా జాగ్రత్తగా

ఉండాలి” అంది.

ఆ తర్వాత హాల్లో మూలనున్న దారి వైపు చూపిస్తూ “అదుగో… అదే నా చాప సామాన్యంగా పగలంతా నేను దానిమీదే నిద్రపోతాను. నువ్వూ వస్తానంటే రోజూ ఇద్దరం దానిమీదే పడుకోవచ్చు” అంది.

“నేను అసలు పగలెప్పుడూ పడుకోను” అంది రుక్మిణి.

ఆ మాట వింటూనే సీత పడిపడి నవ్వింది. పొట్ట చెక్కలవుతుందనుకుందేమో రెండు చేతులతో పొట్టను పట్టుకొని మరీ నవ్వింది తర్వాత.

“నువ్వెంత అమాయకురాలివి. అందరిలా మనం రాత్రివేళ నిద్రపోతామను కుంటున్నావా పిచ్చిదానా?… మనం ప్రతి రాత్రీ క్లయింటుల్ని సంతోష పెట్టాల్సుంటుందని తెలియదా?” అంది.

“క్లయింట్ లేమిటి? రాత్రివేళ రావడమేంటి?”

“మగాళ్ళు రాత్రివేళ వచ్చి ఇక్కడ కొన్ని పనులు చేస్తారు?”

“కొన్ని పనులంటే ఏంటవి?” రుక్మిణికి తన సవతి తండ్రి చేసే పనులు గుర్తువచ్చి భయపడిపోయింది.

“అవేవో త్వరలో నీకే తెలుస్తాయిలే. నువ్వూ వాళ్ళు చెప్పినట్టల్లా చేయాల్సుంటుంది. లేకుంటే ఆయీ కూడెట్టదు…” హాల్లోంచి వచ్చి కారిడార్లో నడుస్తూ అంది సీత.

అంతలో “ఎవరది?” అన్న గొంతు ప్రక్క గదిలోంచి విన్పించింది.

“నేనే సీతను” అంది సీత.

“చిన్నగా మాట్లాడుకోరాదూ” మందలింపుగా అంది ఆ గొంతు.

ఆ గదిని దాటాక, “ఆ గది మీరాది. ఈ ఇంట్లో అందరికంటే అందగత్తె ఆమే. అందులోనూ ఆమె మిగిలిన అందరిలా చదువూ సంధ్యా లేని మనిషి కాదు. మెట్రిక్ పాసైంది. అందుకే ఆయీ ఆమె ఒక్కతికి ప్రత్యేకంగా ఓ గది కేటాయించింది” అని ‘అవునూ నువ్వెందాకా చదివావ్ రుక్మిణీ?” అనడిగింది సీత.

“నేను ఆరోతరగతిలో ఉన్నాను”

అయితే నువ్వు నాకో పుస్తకం చదివి పెట్టాలి. మరి దాన్నిండా బూతు బొమ్మలే… నేను చదువుకున్నదానిలా నటించేసరికి ఓ క్లయింట్ దాన్ని నాకోసం తెచ్చిచ్చాడు” అంది సీత నవ్వుతూ.

“అదేంటి? నవ్వేప్పుడు నువ్వు పొట్టనలా రెండు చేతుల్తో పట్టుకుంటావ్ దేనికి?” ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణి.

“నవ్వుతుంటే కడుపులో చాలా మంటగా ఉంటోంది. అసలు ఇటీవల నాకు వంట్లో అంతగా బాగోట్లేదు… ఆకలి కూడా చచ్చిపోయింది” బాధగా అంది సీత.

అంతలో వసారాలో ఎవరిదో గొంతు–

“అంతా అబద్ధం లచ్మీ… నేనేంటి? మీ ఇంట్లో అమ్మాయిల గురించి చెడ్డగా చెప్పడం ఏంటి? పిల్లల్ని నువ్వెంత శ్రద్ధగా చూస్కుంటావో నాకు తెలియకపోతేగదా? ఆ ఇన్స్ పెట్రు గూడా మీ ఇంట్లో మీరా గురించి తెగ ఇదయిపోతాడు. ఆ పిల్ల అచ్చం సిన్మాస్టార్ ఉంటుందంటాడాయన ఎప్పుడూ…”

ఆయీ పుగాకు నముల్లూ, “నువ్వు ఇన్సెపెక్టర్ని ఎక్కడ కలిశావ్ సింధూతాయి?” అడిగింది.

రెట్టించేసరికి సింధుతాయి అనబడే ఆ ముసలమ్మ విననట్లు ఊర్కున్నా ఆయీ జవాబు చెప్పక తప్పలేదు. అందుకే జంకుతూ, “నిన్న కౌసల్య ఇంట్లో కనబడ్డాడు” అంది మెల్లగా.

“ఛత్… ఖరీదైన బహుమతులిచ్చేది నేను, వారం వారం యాభయ్యేసి రూపాయలు మాముళ్ళిచ్చేది నేను, వచ్చినప్పుడల్లా వాడు కోరిన పిల్లని ఫ్రీగా పడగ్గదికి పంపించేది నేను…అయినా ఆ వెధవకేమైనా విశ్వాసం ఉందా? ఇక్కడి పిల్లలకేం లోటొచ్చిందంట ఆ కౌసల్య కొంపకి పోవడాన్కి? దాని దగ్గరంతా బజారు ముండలు.. ఐదురూపాయల సరుకు గాదూ?” అగ్గి మీద గుగ్గిలమై పోయింది ఆయీ.

“ఊర్కే అలా ఆవేశపడకు చెల్లాయ్! అయినా ఇన్సెపెట్రుకి అమ్మాయిలతో మొహం మొత్తిందంట… పడుచుగుంటలు చిన్న చిన్న పిల్లలు కావాలంటూ ఎంపర్లాడుతున్నాడు” అంది సింధుతాయి ఆమెను సమాధానపరాచాలని ప్రయత్నిస్తూ.

“అంటే అలాంటోళ్ళు ఇక్కడ లేరా? అందాక ఎందుకు? సీత లేదేంటి? అది తెల్లగా ఎంత నాజూగ్గా ఉంటదో నీకు తెలీదా? అవునూ ఇందాకే ఓ గుంటని కొన్నాను. నువ్వు చూళ్ళేదుగదూ?” అని సింధుతాయితో అని, “రుక్మిణీ ఓసారి ఇలారా” గట్టిగా కేక పెట్టింది ఆయీ.

సీతతోసహా రుక్మిణి వసారాలోకి వచ్చింది. సింధుతాయి ఆమెను ఆపాదమస్తకం నిశితంగా పరీక్షించి, అక్కడక్కడ అవయవాల్ని తడిమి, నొక్కి చూసి సంతృప్తిపడుతూ ఆయీ వంక తిరిగి, “పిల్ల బాగుంది… ఎంతపోసికొన్నావేంటి?” అంది నెమ్మదిగా,

ఆయీ ఆమె చెవిలో ఏదో చెప్పింది. “మరి అలా చెప్పవేం? అనసూయ కూతురా… అందుకే దీనికాళ్ళింత అందంగా ఉన్నాయి” అంది సింధుతాయి.

అంతేకాదు. ఆయీ కోరిక ప్రకారం ఆ సాయంత్రమే ఇన్స్పెక్టర్ చెవిలో రుక్మిణి విషయం వేస్తానని మాటయిచ్చి మరీ వెళ్ళిపోయింది సింధుతాయి. రుక్మిణికి మాత్రం ఆమె తనను వళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంటే తేళ్లూ, జెర్రులు వంటిమీద పాకినట్లన్పించింది. ఆ విషయమే సీతతో ఆందామె.

“అవును… అదొట్టి తార్పుడు. ముండ” అంటూ తిట్టిపోసింది సీత.

*   *  *

వీధిలైట్లు వెలిగాయి. కానీ ఇంకా పూర్తిగా పొద్దుకుంకలేదు, అంతలో “మీరా… మీరా…” అంటూ పిలుస్తూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడో కాలేజీ స్టూడెంట్, అతను మీరా పర్మినెంట్ కస్టమర్.

“ఈ వెధవ మళ్ళీ దాపురించినట్లున్నాడు… ఇవ్వాళ వీడు డబ్వివ్వకపోతే పోలీసులకి పట్టిస్తాను” బాత్రూమ్ లో  స్నానం చేస్తున్న ఆయీ గొణిగింది. ఆమె కాళ్ళు రుద్దుతున్న రాధ ఏం మాట్లాడలేదు.

“ఏమే రాధా ఈ వెధవ నీ దగ్గరకెప్పుడైనా వచ్చాడా?”

“లేదు. అతనికి మీరాయే కావాలి. అది కూడా వీడ్ని మొగుడిలాగే చూస్తుంది. అర్ధరాత్రివరకూ ఇద్దరూ ఏవేవో మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడూ తగాదా కూడా పడ్తుంటారు” అంది రాధ.

“అర్ధరాత్రి దాకానా?… మరి అప్పటివరకయ్యే డబ్బిస్తున్నాడా?”

“నన్నడుగుతావేం ఆ మాట? మీ ముద్దుల మీరానే అడుగు. ఆవిడ్ని ప్రశ్నించే ధైర్యం ఈ కొంపలో ఎవరికుంది? ఆవిడదంతా ఇష్టారాజ్యం. చివరికి ఇన్స్ పెక్టర్  వచ్చినా నిన్న తలనొప్పి వంక పెట్టి తప్పించుకుంది. అసలావిడ తనకు తను పడుపుగత్తె అనుకోడంలేదు. కాలేజి కుర్రాడికి పెళ్ళాంగానే మసలుకుంటోంది” అంది రాధ.

అతనేదో అన్నట్లున్నాడు. మీరా గదిలోంచి నవ్వులు విన్పించాయి గట్టిగా. “అసలు వాడేం మాట్లాడతాడే ఆస్తమానం దానితో….?” ఆసక్తిగా అడిగింది ఆయీ.

“వాడు దానికి ఏదో చదువు నేర్పిస్తాడనుకుంటా”

“సానికొంపలో చదువేంటే వాడి తలకాయి! వెధవకి మగతనం లేదంటావా ఏంటి?” అంది ఆయీ.

“ఏమోనమ్మా మాకేం తెలుస్తాయి ఎప్పుడైనా వాడు దాని దగ్గరకు తప్ప మరెవ్వరి దగ్గరికి రాడు. వాడు వెళ్ళిపోయాక తలనొప్పి అంటూ ఆవిడగారు ఏ కష్టమర్నీ దగ్గరకు రానివ్వదు.”

ఆయీ స్నానం పూర్తిచేసి మీరా గదిని సమీపించింది. అతనేదో చెబుతున్నాడల్లే ఉంది. “విప్లవం” అనే మాట పదేపదే అతని మాటల్లో దొర్లుతోంది.

“టక్ టక్” తలుపు కొట్టింది ఆయీ.

“ఎవరూ?” అంటూ తలుపు తీసిన మీరా ఆయీని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది.

ఆయీ కళ్ళు గదిలోని వాతావరణాన్నంతా పరిశీలించాయి క్షణాల్లోనే. మీరా కట్టుకున్న బట్టలుగానీ, మంచంమీద పరచిన దుప్పటి గాని చెక్కుచెదరలేదు. కుర్రాడు కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు.

“ఏమయ్యా… నువ్విక్కడకి వచ్చేది అమ్మాయికి విప్లవాన్ని గురించి బోధించేందుకా?” కుర్రాడివంక తీక్షణంగా చూస్తూ అడిగింది ఆయీ.

“నేను డబ్బు చెల్లిస్తూనే ఉన్నాను”

“కావచ్చు. ఇది సాని కొంపేగాని సమావేశ మందిరం కాదన్న విషయమూ గుర్తుంచుకోవాలి. నీపనేదో చూసుకొని త్వరగా బయటకినడు. అవతల ఇంకా దానికోసం వచ్చే కస్టమర్స్ ఉన్నారు” అంటూ గిరుక్కున వెనుతిరిగింది ఆయీ.

ఆయీ వసారాలోకొచ్చింది. అమ్మాయిలంతా ఎవరికి వారు ముస్తాబు చేసుకోవడంలో మునిగి ఉన్నారు. కాని సీత, రుక్మిణి మాత్రం గచ్చుమీద చాకీసుతో గళ్ళు గీసుకొని ‘అష్టాచెమ్మా’ ఆడుకొంటున్నారు.

“సీతా… ఇంకా ఈ ఆటలేంటి? ఆపెయ్యండి… అవతల కస్టమర్లొచ్చే వేళయింది” అంటూ గట్టిగా అరిచింది ఆయీ.

అంతలోనే లావుగా, చిన్నసైజు పర్వతంలా ఉన్న ఇన్స్ పెక్టర్  అక్కడకి వచ్చాడు. వస్తూనే రుక్మిణివంక తినేసేలా చూసి, ఆయీతో “ఇదే నేంటి? నువ్వు తెప్పించిన కొత్త పిట్ట” అన్నాడు.

అవునన్నట్లు తలూపింది ఆయీ.

అంతే! “పదవే లోపలికి…” అంటూ రుక్మిణిని బరబరా గదిలోనికి ఈడ్చుకుపోసాగాడతను. .

“పోవే… రుక్మిణీ… ఆయన చాలా మంచాయన” అంది ఆయీ వెనకనుంచి.

ఇన్స్ పెక్టర్  లోపల గదిలో రుక్మిణిని మంచంమీద పడేసి బట్టలన్నీ పీకేయడం మొదలెట్టాడు. రుక్మిణి ఏడుస్తూ అతన్ని ప్రతిఘటించసాగింది.

‘నన్ను వదలకపోతే నీ రెండు కళ్ళూ పొడిచేస్తా…” గట్టిగా అరిచింది రుక్మిణి.

“ఏంటే? నా కళ్ళు పొడిచేస్తానంటావే లంజా?” అంటూ కోపంతో వడిసిపట్టుకోబోయాడు ఇన్స్ పెక్టర్  ఆమెను.

“నేను లంజను కాను” కీచుగొంతుతో అరిచింది రుక్మిణి. కానీ అతను విన్పించుకోలేదు. ఆమెపై దాడికి పూనుకున్నాడు. అయితే ఆమెను ఆక్రమించుకోడానికికతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అతను బాగా అలసిపోయాడు. శ్వాస ఎగదన్నడంతో రొప్పనారంభించారు. దాంతో మంచంమీదే పక్కకు ఒత్తిగిలి పడుకుని కళ్ళు మూసుకుని-

“పిల్లా…. నీకోసం ఓ ఎర్రగౌను కొనిపెట్టనా?” అని అడిగాడతను ఆమెనెలాగైనా మంచి చేసుకోవాలని.

కానీ రుక్మిణి అప్పటికే వసారాలోకొచ్చేసి సీతతో ఆటకు తిరిగి ఉపక్రమించింది.

 కొన్ని నిముషాల తర్వాత “నేనే గెల్చాను చూశావా?” అంటూ సీతముందు ఆనందంతో గెంతసాగింది రుక్మిణి.

అప్పుడే ఇన్స్ పెక్టర్  డ్రస్ సరిచేసుకుంటూ గదిలోంచి ఇవతలకొచ్చాడు. ఆయీ అతన్ని చూసి చిరు మందహాసం చేసింది.

“నిజంగా ఈ పిల్ల గయ్యాళి గంగమ్మే… వృత్తిలో పైకొస్తుంది. నాకు బాగా నచ్చిందనుకో” అన్నాడు అతను ఆయీతో.

రుక్మిణి అతని ముఖంవంక చూసింది. తను గోళ్ళతో రక్కడంవల్ల ఎర్రగా కందిపో యిందతని వదనం. కానీ ఎంతో సంతోషంగా కన్పిస్తున్నాడతను.

“మీరా గదిలో ఎవరున్నారు?” సంభాషణ మారుస్తూ అడిగాడు ఇన్సెపెక్టర్.

“ఇంకెవరు? ఆ కాలేజీ కుర్రోడే?… దానికి పాఠాలు చెప్తున్నాడు” తల కొట్టుకుంటూ చెప్పింది ఆయీ.

“నువ్వు ‘ఊఁ’ అన్నావంటే వాడ్ని ఈ ఛాయలకు రాకుండా చేస్తాను. అవసరమనుకుంటే బొక్కలో తోయించేస్తాను”

“తమరంతటి పని చేయగలరని తెల్సు కానీ మీరా బాధపడ్తుందని ఎనకాడ్తున్నానయ్యా. అది నా కూతుర్లాంటిది. దాని మనుసు కష్టపెట్టడం ఇష్టంలేకే…”

“అయితే తప్పంతా నీదే లచ్మీబాయ్. నీ అలుసు చూసుకునే అదట్టా విర్రవీగుతోంది తనేదో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలా…”

“నిజమే అది పెద్ద కుటుంబంలో పుట్టిన పిల్లే! పసిపిల్లగా అది నాగడపలో దొరికినప్పుడు ఖరీదైన సిల్కు చీరలే దానికి పొత్తిగుడ్డలుగా చుట్టి ఉన్నాయ్. అసలు నా తప్పిపోయిన కొడుకు వస్తే మీరాని వాడికిచ్చి పెళ్ళిచేయాలని నా ఉద్దేశం. ఈడూ.. జోడూ చాలా బాగుంటుంది” అంది ఆయీ.

“సరే నేవెళ్తానింక” లేచాడు ఇన్స్ పెక్టర్ .

“ఏంటి మీరీమధ్య ఆ కౌసల్య కంపెనీకి వెళ్తున్నారంట?”

“అసలు ఆ సింధుతాయి ముండని అరెస్టు చేసి బొక్కలో తోస్తే పీడ విరగడవుతుంది అదే ఇలాంటి తప్పుడు వార్తలన్నీ మోసేస్తుంది. తప్పుడు ముండ… విషయం ఏమంటే… నిన్న ఆ కౌసల్య కొంప మీదుగా బస్టాపుకి పోతూ దాని కళ్ళబడ్డా. అంతే దానికి చిలవలు పలవలు చేర్చి నీకు విన్పించి ఉంటుంది. అయినా ఆ కొంపకి పోవాల్సిన ఖర్మ నాకేంటి లచ్మిబాయ్?”

ఆయీ ముక్కు చీదుకొంటూ “ఆ కౌసల్య నా దగ్గరి పిల్లలందరికీ రోగాలని ప్రచారం చేస్తోందంది సింధుతాయి. ఇలాగైతే నా వ్యాపారం ఎలా సాగాలి?” అంది ఏడుస్తూ,

“భయపడకు. నేనున్నానుగా, నీ వ్యాపారానికేం డోకా ఉండదు” అంటూ ధైర్యం చెప్పి, ఆమె ఇచ్చిన పాన్ నముల్తూ వెళ్ళిపోయాడు ఇన్స్ పెక్టర్.

అతనటు వీధిలోకి వెళ్ళాడో లేదో తన దగ్గరున్న అమ్మాయిలందరి పైనా విరుచుకుపడింది ఆయీ. “ఏమే పాడు ముండల్లారా? మగాళ్ళనెలా మచ్చిక చేసుకోవాలో మర్చిపోయారటే! ఆ కౌసల్య దగ్గరి పిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. మిమ్మల్ని పీకల్దాకా మేపడమే గానీ మీవల్ల నాకేంటి లాభం? మీలో చాకచక్యం ఉండి ఏడ్వాలేగాని మనింటిమీదుగా ఎందరు మహారాజులు పోవడంలేదు. చేతకాని ముండల్లారా… అటు చూడండి కౌసల్య కొంపముందు ఎన్ని కార్లు ఉన్నాయో? దానిలాగే రోజూ మిమ్మల్ని నేనూ చావగొడే అప్పుడు మాట వింటారే మీరు… అసలు ఎవరిదారి వాళ్ళు చూస్కోండి. నేను హాయిగా ఏ కాశీకో పోయి అక్కడే ప్రశాంతంగా కన్ను మూస్తాను…”

అంతలో బొగ్గులా నల్లగా ఉండే సరస్వతి గడప దిగివెళ్ళి ఐదునిముషాల్లో ఓ వ్యక్తిని వెంట పెట్టుకొచ్చుకుంది. ఆమె వెనుకే గదిలోకి వెళ్ళిపోయాడా ఆగంతకుడు.

“ఈ అణాకాణీ మనుషులకోసం దానిలా చిల్లర వేషాలు వేస్తూ, తిప్పుకుంటూ నడవడం నాకిష్టం ఉండదు” రుక్మిణికి, సీతకి వినబడేలా గొణుక్కుంది రాధ.

అంతలో సీతకోసం ఎవరో వచ్చారు.

“ఆయీ… రాత్రంతా కాదుగా?” అని రుక్మిణివంక తిరిగి నా పావులు కదిలించకు… మళ్ళీ వచ్చి ఆడతాను””అంటూ అతనితో వెళ్ళి పోయింది సీత.

ఇంతలో లోనుండి ఎవరిదో ఏడ్పు.  

“ఎవరా ఏడ్చేది?… మన మీరా కాదుగదా! దాని గదిలోకి వెళ్ళి చూడండర్రా ఏం జరిగిందో మగాళ్ళని నమ్మడానికి లేదు. వాళ్ళు ఏదైనా చేయగలరు? నా చిన్నతనంలో ఒసారి నా దగ్గరకో డబ్బున్నాయన వచ్చాడు. వచ్చి అరగంట సేపు చావ చితగ్గొట్టి ముప్పై రూపాయలు నాచేతిలో పెట్టి పోయాడు. ఆ రోజుల్లో ముప్పై రూపాయలంటే మాటలు కాదు. ఆయన కోసం ఆ తర్వాత నేనెన్నో రోజులు ఎదురు చూశానుగానీ, మళ్ళీ రాలేదాయన” అంది నవ్వుతూ ఆయీ.

“మీ ఆయన సంగతి చెప్పు ఆయీ. ఆయనెలాంటివారు?” అడిగింది రాధ కూతూహలంగా.

“మా ఆయన సంగతి కావాల్సొచ్చిందా నీకు!” అంటూ ముద్దుగా రాధ నెత్తిమీద మొట్టికాయవేసి, “ఆయన బ్రాహ్మడు. తెలివైనవాడు. మనదగ్గరకొచ్చే సన్నాసుల్లాంటి వాడు కాదు బట్టలు ధరించే సమయంలో కూడా సంస్కృత శ్లోకాలేవో పఠించేవాడు” అంది ఆయీ.

“ఆయన చూడబోతే మన మీరా దగ్గరకొచ్చే కాలేజి కుర్రాడిలాగే ఉన్నాడే. ఈ కుర్రాడు మీరాకి గీత గోవిందం పాటలు నేర్పించడం నేననేకసార్లు విన్నాను..” అంది రాధ.

“మన మీరాకి మాత్రమేం తక్కువ. తియ్యని గొంతు దానిది. పిల్లకూడా నిజంగా రత్నంలాంటిది, పందొమ్మిదేళ్ళక్రితం అది నా గుమ్మంలో దొరికినప్పుడే ఇది గొప్పింటి బిడ్డ అయి ఉంటుందనుకొన్నాను’

మీరాని పొగుడుతుంటే రాధ మూతి విరిచింది. అది చూసి ఆయీ “మీ అందరికీ మీరా అంటే అసూయ. అందుకే దాన్నలా ఆడిపోసుకుంటారు.” ఆమె మాట ముగిసేలో గానే కుర్రాడు మీరా గదిలోంచి రావడం, వెనుతిరిగి చూడకుండా బయటికి పోవడం జరిగిపోయింది.

వెంటనే మీరా ఏడుపుకి కారణం తెల్సుకుందామని ఆమెని పిలిచింది ఆయీ.

“ఏమ్మా…. ఆ వెధవ నిన్నేమైనా చేశాడా… లేక ఏదైనా తిట్టి బాధ పెట్టాడా? చెప్పు తల్లీ” అంది ఆయీ ఆప్యాయంగా.

“లేదమ్మా… నా దగ్గరకు రావడానికి డబ్బు లేకపోతే తన ఖరీదైన పెన్ను అమ్ముకొని వచ్చాడట. ఒక్కొక్కప్పుడు పస్తుండి తనకిచ్చే లంచ్ అలవెన్స్ తో  నా దగ్గర కొస్తాడు. నేనంటే అతనికంత ప్రేమ…” అంటూ కళ్ళు తుడుచుకుంది మీరా.

*    *   *

సీత వాంతిచేసుకొని గదంతా ఖరాబు చేయడంతో వచ్చిన కస్టమర్ నానా తిట్లు తిట్టి డబ్బు వాపను ఇచ్చేయమన్నాడు. అంతే కాదు ‘రోగిష్టి మారి ముండలతో వ్యాపారం చేస్తావా?” అంటూ ఆయీని కొట్టినంతపని చేశాడు. దాంతో ఒళ్ళు మండిన ఆయీ ఆ కోపమంతా సీతమీద చూపించి చెంపలు వాయగొట్టింది. తర్వాత ఆమె కడుపులో మంట విషయం తెల్సుకొని మూడు రోజులపాటు సెలవిచ్చింది.

ఆ సమయంలో సీత తనవాళ్ళంతా కలరా మహమ్మారి బారినపడి మరణించారని రుక్మిణికి చెప్పింది.

ఓరోజు సీతను, రుక్మిణిని దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళ తలల చిక్కుతీస్తోంది ఆయీ. ఆ సమయంలో అక్కడకి వచ్చింది సింధుతాయి.

సీత అనారోగ్యం గురించి ఆమెతో అంది ఆయీ.

“అసలది పెద్దమనిషయిందా?” ఆచూకి తీసింది సింధుతాయి.

“లేదు. ఆదే జరిగితే నాకింత దిగులెందుకు?” నిట్టూర్చింది ఆయీ.

‘నువ్వు అమ్మాయిల్ని వారంవారం డాక్టర్కి చూపించవా చెల్లాయ్?” ఆయీ చురుగ్గా చూసింది.

“ఎందుకా సందేహం? అలా అని ఆ కౌసల్య ముండ ప్రచారం చేస్తోందా ఏంటి?”

“అవును” నిన్న దానింటిమీదుగా పోతుంటే పిలిచి మరీ అందీమాట. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అది గొప్ప జాణ అందుకే దాని వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది” అంది సింధుతాయి

“అవునూ… ఆ బజారు ముండలతో అదెలా చేయగలుతోందంటావ్ అంత వ్యాపారం?” ఆసక్తిగా అడిగింది ఆయీ.

“ఏముంది” వాళ్ళంతా వృత్తిలో ఆరితేరారు!”

ఆయీ డాక్టర్ దగ్గరకి అమ్మాయిల్ని తీసుకొని బయలుదేరింది.

“చెల్లాయ్… కడుపులో తిప్పుతోంది. ఓ సోడా తాగుతానుగానీ ఓ పావలా పడేయమ్మా” అంటూ చెయ్యి జాచింది సింధుతాయి.

“నువ్వు నాటుసారా తాగుతావని ఇన్స్ పెక్టర్  చెప్పాడే” అడిగింది ఆయీ.

“దొంగ ముండాకొడుకు. అందరికీ నన్ను చూస్తే లోకువే ఇప్పుడు. నా రోజులు బాగున్నప్పుడు అందరూ కుక్కల్లా నా చుట్టూ తిరిగారు. ఇప్పుడు ముసలిదాన్నయిపోవడంతో అంతా ఆటలు పట్టిస్తున్నారు. లచ్మీబాయి నువ్వయినా అంతేనమ్మా… పదేళ్ళు పోయాక నీముఖం ఎవరూ చూడరు” అంది సింధుతాయి.

“అలా శపించకు… అయినా నా పిల్లలంతా నన్ను పువ్వుల్లో పెట్టి చూస్కుంటారు. నేను వాళ్ళనెంత ప్రేమగా చూస్కుంటున్నానో కావాలంటే వాళ్ళనే అడుగు” అంది  ఆయీ.

“నేనూ ఒకప్పుడు అలాగే అనుకున్నానమ్మా. కానీ ఏమైంది నా బతుకిప్పుడు?” అంది సింధుతాయి.

ఆమె అలా మాట్లాడేసర్కి ఆయీకి దుఃఖం పొంగుకొచ్చింది. ఎక్కిళ్ళు పెడ్తూ కళ్ళు వత్తుకుంది భవిష్యత్తును ఊహించుకుంటూ. ఆమె వంక జాలిగా చూస్తున్న రుక్మిణి లోపలి నుండి మీరా పిలవడంతో ఆమె గదిలోకి వెళ్ళింది.

మీరాకు జాకెట్ హుక్కు పెట్టి ఆమెనే చూస్తూ నిలబడింది రుక్మిణి. వివాహితలాగా పాపిట్లో కూడా సింధూరం పెట్టుకొని చాలా హుషారుగా ఉందామె.

“అక్కా! పెళ్ళయిందానిలా కన్పిస్తున్నావ్…?”

“అవును నాకు పెళ్ళయింది. కానీ ఎవరికీ చెప్పకు రుక్మిణీ… అతనే రోజూ వచ్చే కృష్ణ నా భర్త. గమ్మత్తుగా లేదు నేను మీరా, అతను కృష్ణ” నవ్వుతూ రుక్మిణిని దగ్గరకు తీసుకొని నుదురు చుంబించింది మీరా.

తర్వాత రుక్మిణి బయటకువచ్చి సీత పక్కన కూర్చుంది. అప్పటికి ఆయీ ఏడుపు ఆగిపోయింది. సింధుతాయి కూడా వెళ్ళిపోయింది.

తన రోగం గురించి చెబుతూ సీత, “నా రోగానికి కారణం మగాళ్ళే.. అందుకే వీళ్ళంటే నాకు అసహ్యం…” అంది.

“మరి పెళ్ళి చేసుకోవా?”

“చేసుకుంటాను. పిల్లల్ని కూడా కంటాను. కానీ నా ఇంట్లో మగాళ్ళని మాత్రం ఉండనివ్వను. ఎంచక్కా పిల్లలతో ఆట పాటలతో కాలక్షేపం చేస్తాను”

అంతలో ఎవరో కస్టమర్ రావడం రాధని తీసుకొని పక్క గదిలోకి పోవడం జరిగింది.

“అరవకండర్రా! మీరా పాట వినబడుతోంది. ఎంచక్కా ఉందో దాని స్వరం  వినండి” అంది ఆయీ.

“రతిసుఖసారె గతమభి సారే…” కమ్మగా మీరా స్వరం విన్పిస్తుంటే అమ్మాయి లంతా బయట నిశ్శబ్దంగా వింటూ కూర్చున్నారు.

*    *   *

మర్నాడు మీరా ఎంత పిల్చినా టిఫిన్ చేయడానికి రావడంలేదని ఆమె గదిలోకి వెళ్ళిన రాధకు బోసిపోతూ దర్శనమిచ్చిందా రూమ్. మీరా తన కాలేజీ కుర్రాడితో కల్సి ఉడాయించిందన్న విషయం తెల్సి ఆయీ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది. తను ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నదీ చెబుతూ శోకాలు పెట్టింది

“ఊర్కో ఆయీ…. అదే తిరిగొస్తుంది. ఆ కుర్రాడి దగ్గర డబ్బేది దాన్ని పోషించడానికి? దాని మెడలో గొలుసు అమ్ముకుని నాల్రోజులు తింటారు. అదైపోయాక వాళ్ళే తిరిగొస్తారు” అంటూ రాధ ఆమెను ఓదార్చింది.

ఆయీకొచ్చిన కష్టం గురించి తెల్సుకొని ఆమె ప్రధాన ప్రత్యర్థి కౌసల్య కూడా వచ్చి ఆమెను సముదాయించింది. “నువ్వు మరీవాళ్ళని గారాబంగా చూస్తున్నావ్ గనుకే వాళ్ళలా నీ నెత్తినెక్కి తొక్కుతున్నారు. వెధవ వేషాలు వేసినప్పుడల్లా నాలుగు తగల్నిస్తే ఇంతదాకా రాకపోను. నీ అలుసు చూనుకునే వాళ్ళలా కొవ్వెక్కి  ప్రవర్తిస్తున్నారు” అని ఆమెకు హిత బోధ చేసిందామె.

కౌసల్య ఔదార్యానికి ఆయీ కళ్ళు చెమర్చాయి. ఆమెను దగ్గరకు తీసుకొని, “గతాన్ని మర్చిపోదాం. ఇకనుంచి మనం ఐకమత్యంగా ఉందాం చెల్లాయ్” అందామె.

నల్లగా ఉండే సరస్వతి తన సామాను తెచ్చుకొని మీరా గదిలో సర్దేసుకుంది. “అందరికంటే ఎక్కువమంది కస్టమర్స్ నాకోసమే వస్తుంటారు. ఈ గది నాకుంటేనే బావుంటుంది” అన్నది ఆమె వివరణ యిస్తూ.

ఎవ్వరేం మాట్లాడలేదు.

రాధమాత్రం మూతి మూడు వంకర్లు తిప్పి ఊర్కుంది.

ఆ సాయంత్రం ఐ‌ఎన్‌ఎస్ పెక్టర్ వచ్చాడు. “లక్ష్మీబాయ్! నువ్వీ విషయం కాస్తంత ముందుగా చెబితే ఆ తొత్తు కొడుకును ఎముకలేరి జైల్లో తోయించేవాడ్నిగదా?”

“ఇలా అర్ధాంతరంగా లేచిపోతారని నేననుకోలేదు బాబూ, అయినా ఆడ్ని జైల్లో పెడితే ఏమొస్తుంది? అది ఆడ్ని పెళ్ళికూడా చేస్కుందని రుక్మిణి చెప్పింది…” ఆయీ విచారంగా అంది.

“పెళ్ళా? ఏది రుక్మిణిని పిలువ్”

రుక్మిణిని పిల్వడానికి ఆయీ లోపలికి వెళ్ళే సరికి ఆమె సీతతో కల్సి ‘బొమ్మల పెళ్ళి’ ఆట ఆడ్తోంది. ఓ బొమ్మకి “కృష్ణ” ఓ బొమ్మకి ‘మీరా’ అని పేరు పెట్టి పెళ్ళికి సిద్ధం చేస్తున్నారు వారిద్దరూ.

ఆయీ బలవంతంగా ఆమెను ఆటమీద నుంచి లేపి ఇన్స్ పెక్టర్  దగ్గరకి తీసుకొచ్చింది. అప్పటికే అతను రుక్మిణికోసం గదిలో సిద్ధంగా ఉన్నాడు. రుక్మిణిని ఆ గదిలో ఉంచి ఆయీ బయటకు వెళ్ళిపోయింది.

“చర్చి గేట్ దగ్గర షాప్ లో ఓ బొమ్మని చూశాను. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటుంది. పొట్టమీద నొక్కితే ‘మమ్మీ మమ్మీ’ అంటుంది. అలాంటిది నీకొకటి తెద్దామనుకుంటున్నాను కావాలా రుక్మిణీ” ఆప్యాయంగా అన్నాడు ఇన్స్ పెక్టర్.

రుక్మిణి కళ్ళు ఆనందంతో మెరిసాయి. “కావాలి” అంది ఆశగా.

“దాని ఖరీదు చాలా ఎక్కువ వంద రూపాయలుంటుంది. అయినా తెస్తాను. నీ కోసం ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం రుక్మిణి” మెల్లగా ఆమెను దగ్గరకు తీస్కుంటూ అన్నాడు. అతను.

“మరి మీ భార్యా పిల్లలు?’

“ఆఁ వాళ్ళముఖం… నీ ఈడుదే నాకో మనుమరాలుంది. దానికన్నా కూడా నువ్వంటేనే నాకిష్టం. నీకు ప్రతినెలా అడిగినన్ని బొమ్మలు తెచ్చిపెడ్తాను సరేనా?”

బొమ్మలు తెస్తాడన్న ఆశతో పంటిబిగువున బాధను భరిస్తూ అతడేం చేసినా ఎదురు చెప్పలేదు రుక్మిణి.

*      *    *

సింధుతాయి మెత్తగా నూరిన ఆకుల ముద్దను పట్టుకొని ఆయీ గదికి ప్రక్కనే ఉన్న చిన్న గదిలోకి వెళ్ళింది. ఆమె వెనుకే సీతను బరబరా యీడ్చుకుంటూ ఆ గదిలోకి వెళ్ళింది ఆయీ.

ఆ దృశ్యం చూసి ఆశ్వర్యపోయింది రుక్మిణి.  

బంధించిన ఆ గది తలుపుల ముందు అటూ ఇటూ తిరిగిందామె. లోనుండి సీత మూలుగుతో కూడిన ఏడ్పు, సింధుతాయి గద్దింపులూ వినబడుతున్నాయిగాని విషయం మాత్రం అర్థంకాలేదు.

కొన్ని నిముషాలు గడిచాక సింధుతాయి బయటికివచ్చి అక్కడి బల్లమీద కూర్చుని తమలపాకులు వేసుకుంటూ “సీత ఆరోగ్యం బాగోలేదు.. బతకడం చాలా కష్టం” అంది తాపీగా.

రుక్మిణి గదిలోకి పరుగెత్తింది.

అపస్మారకస్థితిలో పడి ఉంది సీత. ఆమె తొడలమధ్య నుంచి ప్రవాహంలా వెలువడుతున్న రక్తస్రావాన్ని ఆపటాన్కి ఆయీ, రాధ పాతచీరల్ని బట్టల్ని అడ్డంపెడ్తూ హైరాన పడిపోతున్నారు.

మరికొద్ది నిముషాల తర్వాత, “రుక్మిణీ…. మన సీత వెళ్ళిపోయిందమ్మా” అంటూ నిట్టూరుస్తూ ఇవతలకి వచ్చింది ఆయీ.

“సీత చచ్చిపోయిందా?” భయంతో దుఃఖంతో కేక పెట్టింది రుక్మిణి. తర్వాత సీత చావును పోలీస్ కేసు కాకుండా ఇన్స్ పెక్టర్  ఆయీకి బాగా  సహకరించాడు.

ఆ రాత్రి రుక్మిణికి భయంతో నిద్రపట్టలేదు.

ఓ రాత్రివేళ సరస్వతి గదినుండి ఎవరిదో పురుష కంఠంతోపాటు సరస్వతి మూల్గులు కూడా విన్పించి గజగజ వణికిపోయిందా పిల్ల. ఈ ఇంట్లో అడుగుపెట్టిన వారంతా సీతలాగే మరణిస్తారేమో?

తెల్లవారింది.

తన ఇంటికేదో శని పట్టిందని భూతవైద్యుడ్ని పిలిపించి పూజలు, శాంతులు జరిపించింది ఆయీ. మీరా వెళ్ళిపోవడం, సీత మరణించడం చూసి ఆమె కూడా దిగులుతో సగమైపోయింది.

ఆ సాయంత్రం ఇన్స్ పెక్టర్  వచ్చాడు. రుక్మిణిని అతని గదిలోకి పంపి ఇవతలకి వచ్చింది ఆయీ.

అప్పటికే డ్రెస్ విప్పి అండర్వేర్తోనున్న ఇన్స్ పెక్టర్ , రుక్మిణి గది తలుపు వద్దే నిలబడడం చూసి దగ్గరకు పిలిచాడు.

“నువ్వడిగిన బొమ్మ తేలేదని కోపంగా ఉందా రుక్మిణి? ఏం చేయను చెప్పు? తెద్దామనుకుంటున్నంతలో సీత చావు… కేసు మాఫీ చేసేసర్కినా తాతలు దిగొచ్చారు… ఒక్క మూడు రోజులు గడువు ఇవ్వు ఆ బొమ్మను తెచ్చి నీ చేతుల్లో పెడతాను. ఎంచక్కా దానికి నీ స్నేహితురాలు ‘సీత’ పేరే పెట్టుకుందువు గాని….”

అతను సీత పేరెత్తగానే రుక్మిణి ఒక్కసారిగా బావురుమంది. పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని గుండెల్లో ముఖం దాచుకుని ఎక్కిళ్లు పెడ్తూ “నాన్నా.. నాన్నా… నాకిక్కడ భయంగా ఉంది. ఇక్కడుంటే ఏదో ఓ రోజు నేనూ సీతలాగే చచ్చిపోతానేమో? నన్నిక్కడ్నించి ఎక్కడికైనా తీస్కెళ్ళిపో నాన్నా….”

ఇన్స్ పెక్టర్ లో  మనిషి మేల్కొన్నాడు కాబోలు ఆప్యాయంగా ఆమె నుదురు చుంబించాడు. అంతలోనే మళ్ళీ అతనిలో కోర్కె విజృంభించింది.

“నాన్నా’ అంటున్నావేంటి రుక్మిణి?”

“అవును, మా నాన్న అచ్చం మీలాగే ఉండేవాడు. ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ. కానీ అమ్మ, నాన్న ఎప్పుడూ గొడవ పడేవారు. అందుకే కనీసం నాకు చెప్పకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాడాయన. నాకోసం దీపావళి పండక్కి, కొత్త గౌను, కాకర పువ్వొత్తులూ తెస్తాడని ఎన్నో రోజులు ఆయనకోసం ఎదురుచూశాను. కానీ ఆయన రాలేదు. ఇపుడు మిమ్మల్ని చూస్తే వెళ్ళిపోయిన మా నాన్నే గుర్తొచ్చాడు…” ఎక్కిళ్ళు పెడుతూ చెప్పింది రుక్మిణి.

ఆ పసిహృదయంలో గూడుకట్టుకున్న ఆవేదనను విని కరిగిపోయాడు ఇన్ స్పెక్టర్.  

“ఏడవకు తల్లీ… నీకేం భయంలేదు. ఇకనుంచి నేనే మీ నాన్నని అనుకో… నిన్ను కూతుర్లా చూచుకుంటాను. సరేనా?” అంటూ ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడాయన. రుక్మిణి నిశ్చింతగా అతని పొట్టమీద పడుకొని నిద్రపోయిందా రాత్రి.

*     *    *

ఆరోజు మీరా వచ్చేసింది ఇంటికి. ఆమె వచ్చేసరికి ఆయీ మధ్యాహ్నభోజనం చేసి ఓ చిన్న కునుకు తీస్తోంది. రుక్మిణి ఆమెపక్కనే కూర్చుని ఉంది.

మీరా వస్తూనే ఆయీ మీద పడి ఏడుస్తూ “నీ కాళ్ళు పట్టుకుంటా ఆయీ. నా కృష్ణని రక్షించు, పోలీస్ స్టేషన్లో అతన్ని చితక్కొట్టేస్తున్నారు. మేం వెళ్ళిపోవడంలో అతని తప్పేంలేదు. అంతా నా ప్రోత్సాహమే. అతన్ని విడిపించు నీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే జీవితాంతం నేనిక్కడే ఉండి నీ సేవలు చేసుకుంటా” అంటూ ప్రాధేయపడింది.

ఆయీ స్టేషన్ కెళ్ళి కృష్ణని విడిపించుకొని గుర్రబ్బండిలో ఇంటికి తీసుకొచ్చింది. దెబ్బల కారణంగా అతను కదలలేని స్థితిలో ఉన్నాడు. రుక్మిణి, మీరా సాయంపట్టి అతన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆయీ ముభావంగా ఉంది తప్ప అతన్ని పలకరించలేదు.

“ఆయీ నీకు ఉత్తరం…” అంటూ సైకిలు దిగి లోనికొచ్చాడు పోస్ట్మాన్.

“మా అబ్బాయే రాసుంటాడు. కాస్త చదువమ్మా రుక్మిణీ” అంది ఆయీ. ఆమె మనసు ఆనందంతో గంతులేస్తోంది.

ఉత్తరంలో విశేషాలు వినడానికి పోస్ట్ మాన్ తో సహా అంతా అక్కడే చతికిలబడ్డారు.

“అమ్మకు…” రుక్మిణి చదవడానికి ఉపక్రమించింది.

“… నువ్వు చేసే వృత్తి నచ్చకనే నేనింట్లోంచి వెళ్ళిపోయానన్న విషయం నీకు తెల్సుగదా? అయితే ఇటీవల మా యజమాని నేను పదేళ్ళుగా నిన్ను విడిచి ఉంటున్న విషయం తెల్సుకొని ముక్కచివాట్లు పెట్టాడు. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని, పోగొట్టుకున్న సంపదని, భార్యాబిడ్డల్ని దేన్నయినా తిరిగి పొందవచ్చుగానీ తల్లిని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందలేమని చెప్పాడు. అతని తల్లిని తిరిగి బతికించి యిస్తే తన ఆస్తిమొత్తం నాకిచ్చేస్తాను అంటూ అతను చెబుతుంటే నా కళ్ళు తెరుచుకున్నాయి.

‘తల్లి తప్పుదారిలో ఉంటే మార్చుకోవాలేతప్ప సొంతం విడిచిపెట్టి రావడం అమానుషం’ అని నొక్కిచెప్పాడు. కనుక అమ్మా… నా తప్పు మన్నించు… నేను రేపు శనివారం సాయంత్రమే బయలు దేరి వచ్చేస్తున్నాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూస్కుంటాను, ఇట్లు, నీ ప్రియపుత్రుడు, సదాశివ్..” ఉత్తరం పూర్తయింది.

కొడుకు వస్తున్నందుకు ఆయీ సంతోషించింది.

గాయాల బాధతో మూల్గుతున్న కృష్ణను చూసి, “ఇదంతా నా మూలంగానే జరిగింది. కదూ..? నన్ను క్షమించవూ?” అంది మీరా బాధగా.

“మీరా! అతన్ని కాసేపు ప్రశాంతంగా ఉండనీ” అంది ఆయీ.

“అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను లేకుండా అతనికి ప్రశాంతత ఎక్కడ్నించి వస్తుంది? అవునా కృష్ణా” అడిగింది మీరా. “ఏమో నాకేం తెలియదు” అన్నాడతను నేలచూపులు చూస్తూ.

“నాయనా నువ్విక మీ ఇంటికెళ్ళు… మీ అమ్మ పాపం నీకోసం ఎంత కలవరపడుతోందో!?” అంది ఆయీ అతనివంక చూస్తూ,

“అమ్మా, నాన్నా పూనా వెళ్లారండి. వాళ్ళకీ విషయం తెలియదు. సాయంత్రం వాళ్ళు వచ్చేలోగా నేనింటికెళ్ళిపోతాను”

“అదేంటి కృష్ణా… మనం ఇద్దరం భార్యాభర్తలం అన్నావ్?” జీరపోతున్న గొంతుతో

అంది మీరా.

అతనేం మాట్లాడలేదు. మెల్లగా లేచి కుంటుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతుంటే, “విశ్వాసహీనుడు… వీడికంటే పంది నయం” అంటూ తిట్టుకుంది మీరా.

ఆ తర్వాత సరస్వతి ఆక్రమించుకున్న తన మునుపటి గదిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన మీరాకు ఆ విషయంలోనూ చుక్కెదురైంది. చేసేదిలేక నలుగురితోపాటు హాలులోనే సర్దుకోవాల్సి వచ్చిందామె.

ఆ సాయంత్రం ఇన్స్ పెక్టర్  వచ్చేసరికి స్వీట్ తెచ్చి తినిపించి తన కొడుకు రాక గురించి ఆనందంతో చెప్పేసింది ఆయీ. అతనెంతో సంతోషించాడు. తర్వాత రుక్మిణిని ప్రేమగా పిల్చి, “నీకోసం ఏం తెచ్చానో చూసుకో తల్లీ” అంటూ ఆమె చేతిలో ఓ గిఫ్ట్ పాకెట్ ఉంచాడు. అందులోని బొమ్మను చూసి ఆనందంతో గెంతులు వేస్తూ దాన్ని ముద్దులతో ముంచెత్తేసింది రుక్మిణి.

“మరి బొమ్మ తెచ్చినందుకు మీ నాన్నకు ముద్దులు ఇవ్వవా?” అన్నాడు ఇన్స్ పెక్టర్  రుక్మిణి అతని ఒళ్ళోకి దూకి ముద్దుపెట్టింది బుగ్గమీద.

ఆయీ ఆశ్చర్యపోయింది.

“ఆశ్చర్యపడకు లక్ష్మీబాయ్. రుక్మిణి వయసు మనవరాలుంది నాకు నాగపూర్ లో . దానికి రుక్మిణికి మల్లేనే నేనంటే ప్రాణం” అన్నాడు రుక్మిణి తల నిమురుతూ అతను.

“ఇన్స్ పెక్టర్  బాబూ…. నేనూ ఈ వ్యాపారం సరస్వతికి అప్పచెప్పేస్తాను. నా కొడుక్కి కావాల్సింది కూడా అదేగదా?”

“మరి రుక్మిణి గతి” ఆదుర్దా వ్యక్తంచేశాడు ఇన్స్పెక్టర్.

“ఏముంది… దాన్ని నా కోడల్ని చేసేసుకుంటాను” అంది ఆయీ రుక్మిణివంక ఆప్యాయంగా చూస్తూ.

రుక్మిణి నొక్కిందేమో ఆమె చేతిలోని బొమ్మ, “అమ్మా… అమ్మా…” అని తీయగా పిలుస్తోంది.

*    *   *

కమలాదాస్

ప్రఖ్యాత భారతీయ రచయిత్రి కమలా దాస్ మార్చ్ 31, 1934 కేరళ రాష్ట్రం మలబారు జిల్లాలో జన్మించారు. చిన్నతనం నుంచే కవిత్వం మీద ఇష్టం పెంచుకుని ఇంగ్లీషులో తన కవిత్వం వెలువరించారు. కేరళ సాహిత్య అకాడెమీకి వైస్ చైర్మన్ గా పని చేశారు. కేరళ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. 'పోయెట్' మ్యాగజైన్ కి,  ఇల్లస్ట్రేటెడ్ వీక్లి లో కవిత్వానికి ఎడిటర్ గా పని చేశారు. 2009 సంవత్సరంలో మే 31వ తారీఖున మరణించారు.

కంతేటి చంద్ర ప్రతాప్

30-7-1958న కృష్ణాజిల్లా పాత రేపూడిలో  జన్మించారు. సీనియర్ పాత్రికేయులు. ఈనాడులో పని చేశారు. విపులచతురలకు సంపాదకులుగా చేసి పదవీ విరమణ చేశారు. కథా రచయితకాలమిస్టుకవినటులు. ట్యాంక్ బండ్ కథలుఅనువాద కథలుపద్య కవితలుశతకాలు వెలువరించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *