‘మంచి ముత్యాలు‘
శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు “నీలి” కథతో దేశంలోనూ, శ్రీ పాలగుమ్మి పద్మ రాజుగా “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగుకథకి మంచి పేరు సంపాదించిన తరువాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్తకొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతేకాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్చేరు. తెలుగుకథ విస్తరించింది. మధ్యతరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను అయితే జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకుతినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకుతినడంలో తప్పులేదని వాదించేవారు, కదిలించిచూస్తే చాలామంది ఉంటారు.
ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినేవారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నారు. తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు, తినకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంతవరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే వున్నారు. చంపకపోతే,దోచుకుంటూనే ఉన్నారు.
ఈ వేట విధానాన్ని మార్చి లోకాన్ని మరొక దారంట నడిపించడానికి భగవంతుడు ప్రయత్నిస్తున్నాడనడానికి ఎక్కడా నిదర్శనం లేదు. ఈ అన్యాయంలోంచి బైటపడడానికి మానవుల్లో మాత్రమే కొంత మంది ప్రయత్నంచేస్తూ వస్తున్నారు.
ఈ వేట ఎన్నో కథలు వచ్చాయి కాని తెలుగులో వేట గురించి కథలు శ్రీ అల్లం శేషగిరిరావుగారు రాసేవరకూ రానేలేదని చెప్పవచ్చునేమోనని నేను అనుకుంటున్నాను. ఈ వేట కథలన్నింటినీ అందరూ చదివితీరాలని నా కోరిక. ఇవి వట్టినే తమాషాకి రాసిన కథలు కావు. ఊసుపోక రాసినవీ కావు. జీవితం గురించి ఆందోళన చెందుతున్నారనేది ఈ వేట కథలు చదివితే తెలుస్తుంది. జీవితంలో మార్పుకోసం ప్రయత్నం చెయ్యడం సహజంగా జరుగుతుంది. అలాగే రచయితలు తాము వాంఛించే మార్పుని తమ రచనల ద్వారా తేవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ పిట్ట కథలకీ వేట కథలకీ మానవ సమాజంలో మార్పులు వచ్చేస్తాయా అని వెటకారం చేస్తే నేనేం జవాబు చెప్పలేను. పిల్ల పిల్ల గాలులన్నీ కలిసి ఒకప్పుడు అవే ప్రభంజనంలా మారవచ్చు.
ఈ వేట కథలన్నీ చాలా నిజాయితీతో రాసిన కథలు, అంతేకాదు, వేట జీవితాల్ని, శ్రీ శేషగిరిరావుగారికి బాగా తెలిసే ఈ కథలు రాసేరు. ఈ వేట కథలు తెలుగు కవితా సుందరికి కొత్త అలంకారాలని చెప్పడం కంటే ఇవి తెలుగు సాహిత్యలోకంలో కొత్త వెలుగులని చెప్పడం సమంజసంగా ఉంటుందని నేను తలుస్తున్నాను.
1-6-1979
(అల్లం శేషగిరిరావు ‘మంచి ముత్యాలు’)
‘ఆ గదిలోనే‘
‘ఆ గదిలోనే’ అనే కథని నేను నా తొమ్మిదో ఏట చదివేను (అని ఇప్పుడు తెలుసుకున్నాను.) అప్పుడు అది అద్భుతమైన కథగా నాకు అనిపించింది. చిన్నవాణ్ని అవడంచేత కొన్ని మాటలకి అర్ధాలు తెలియకపోయినప్పటికీ కథ మాత్రం బోధపడింది. చిన్నతనంలో చదివినప్పటికీ ఈ కథ నాకు బాగా గుర్తుండిపోయింది.
తరువాత చాలామంది మిత్రులతో నేను ఈ కథ గురించి చెప్పేను. కథని మళ్ళీ చదవాలని చాలాసార్లు నాకు అనిపించింది కూడా. కాని నాకు ఎక్కడా ఇది దొరకలేదు. నేనేకాక మిత్రులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారూ, శ్రీ స్వాతి బలరాంగారూ, శ్రీ చలసాని ప్రసాద్ గారూ కూడా చాలా ప్రయత్నం చేసారు కాని ఇది చిక్కింది కాదు.1930-1933 సంవత్సరాల మధ్యకాలంలో ఈ కథని నేను “గృహలక్ష్మి” చదివినంతమేరకి మాత్రం గుర్తు. ఆ గృహలక్ష్ములు చాలా గ్రంథాలయాలు వెతికినా దొరకలేదు. అయితే మిత్రుడు శ్రీ అత్తలూరి నరసింహారావు పట్టుదలగా పూనుకొని శ్రీమతి కె. మలయవాసినిగారి సహాయంతో పూజ్యులు శ్రీ ముద్దా విశ్వనాధంగారి చేత ఈ కథని తప్పక తవ్వి తీయింపించేడు. చూస్తే ఇది 1931వ సంవత్సరం నవంబరు నెలలో ప్రచురింపబడ్డట్టుగా తెలిసింది. అందులో ఒక్క పేజీకి మాత్రమే ఇది సరిపోయిందని నాకు బాగా గుర్తు.
నలభై ఎనిమిది సంవత్సరాల తరవాత నేను ఈ కథని తిరిగి ఈ రోజుననే చదివేను. ఇప్పుడు చదివినా కూడా ఇది అద్భుతమైన కథగానే నాకు అనిపిస్తోంది. ఈ కథని తొలిసారి చదివిన తరవాత, చాలా కాలం తరువాత, నేను రాసిన కథల్లో చాలావాటిలో ఈ కథ ప్రభావం కనిపిస్తోందని నేను తలుస్తున్నాను. ఈ కథని మర్చిపోలేకనే నేను ‘వెన్నెల’ అనే కథ రాసేను.
వెలుతురు చాలకుండా, డబ్బులు లేకుండా, జబ్బులు మాత్రం తక్కువ కాకుండా, వైద్యులు మాత్రం రాకుండా, కష్టాలు తప్పకుండా చిన్న చిన్న చీకటి చీకటి అద్దెగదుల్లో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయిపోయే ఎన్నెన్నో సంసారాల జీవితాలని ఈ ఒక్క పేజీడు కథలో ఈ రచయిత్రి కరుణాత్మకంగా కన్నీటిమయంగా చిత్రించేరని నేను భావిస్తున్నాను. ఎన్నెన్నో బాధల బరువుని ఒక్కపుటలో ఇమడ్చగలగడం చాలా కష్టమైన పని. అయితే ఈ రచయిత్రి ఆ పని చాలా తేలికగానూ, ఎంతో ప్రతిభావంతంగానే చేసేరు. ఈ కథలో లేత వెన్నెల్లూ చల్లగాలుల్తోపాటు మండుటెండలూ వడగాడ్పులూ ముడిపడి వున్నాయి. ఈ కథలో ఎంతో సొగసుంది. ఎంతో బీభత్సం ఉంది. ఈ కథని ఇలాగే చెప్పాలి. ఇంతకంటే బాగా ఇంకోలా చెప్పడం చాలా కష్టం.
కథ నాకు గుర్తుండిపోయింది. కాని కథ రాసిన వారి పేరు మాత్రం గుర్తులేకుండా పోయింది. ఈ రోజే వారి పేరు నేను తెలుసుకోగలిగేను. ఈ ప్రపంచ బాల సంవత్సరంలో ఈ రచయిత్రి సృష్టించిన “అమలా” బాలయోగిన్ని వెతికి వెలుగులోకి తెచ్చిన శ్రీ ముద్దా విశ్వనాథంగారికీ, శ్రీమతి కె.మలయవాసిని గారికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
ఈ ఒక్క చిన్న కథతో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన శ్రీమతి యు. సత్యబాల సుశీలాదేవిగారికి నేనీ రోజున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
9-6-1979
(స్వాతి మాసపత్రిక – జులై సంచికలో ‘నాకు నచ్చిన కథ’ శీర్షిక.)
సాహిత్యాభిమానుల సౌకర్యార్థం ‘ఆ గదిలోనే….’ కథ ఇక్కడ పొందుపరుస్తున్నాం.
రావిశాస్త్రికి నచ్చిన – ‘ఆ గది లోనే…‘
పిన్నమ్మ కొడుకు విమల్ బొమ్మ లాక్కోగానే మాతృ సమక్షంలో తీర్పు కోరడానికి అమలా పరుగెత్తిందా గదిలోకి. మొన్న ఈలాగే అరుస్తూ పరుగెత్తి వస్తే ‘చూడమ్మా . ఇక్కడ నొప్పి కాదూ!’ అని అమ్మ చూపించగానే అల్లరంతా మానేసి తన చిన్న చేతుల్తో ఆమె ఫాల భాగమంటి ‘నొప్పా అమ్మా! ఇక్కలా!’ అంటూ గది నాలుగువేపులా చూస్తూ కాస్సేపు నిలబడి మెల్లగా బయటికొచ్చేసిందా గదిలోంచే. మొదటిసారి అమ్మ వళ్ళో చెల్లిని చూసి బెదిరి చూస్తూ వెనక్కు తగ్గిందా గదిలోంచే. చెల్లి పరిచయమయ్యాక గంటల కొద్దీ కబుర్లు చెప్పుకుంటూ చెల్లి చిన్న కాళ్ళూ, బుల్లి చేతులూ, చిట్టి బొజ్జా, ముద్దులాడిందా గదిలోనే. తన ఏడు రోజుల చెల్లి కోసం ఏడుస్తోన్న అమ్మను ‘చెల్లేదమ్మా’ అంటూ కుమ్మేస్తుంటే ‘చెల్లి దేవుడి దగ్గర కెళ్లిందమ్మా’ అని కళ్లు తుడుచుకుంటూ వచ్చిన తండ్రికి ఎత్తుకోమని చేతులందించిందా గదిలోనే. తరువాత మూడు రోజులకు నిద్రపోతున్న అమ్మ చుట్టూ నాన్న నుంచుందా గదిలోనే. అందరూ గోలగా ఏడుస్తోంటే అమ్మను పూలరథంలో పెట్టి తీసుకెళ్లిన దృశ్యం చెమ్మగిల్లిన పెద్ద కళ్లతో నిశ్చలంగా చూసిందా గదిలోంచే. అమ్మేది అని అడిగితే అత్త వచ్చి కొంగుతో కళ్లొత్తుకుంటూ అమలాని ఎత్తుకు వెళ్లిందా గదిలోంచే. ఇప్పుడు అపరిమిత వేగంతో పరిగెత్తికొచ్చిన తన పాదద్వయాన్ని హృదయవిదారక శూన్య దృశ్యం హఠాత్తుగా బంధించేసిందాగదిలోనే. గుక్క తిప్పుకోలేనంత బరువుగా తెచ్చిన విమల్ మీద చాడీలన్నీ గాలికెగిరిపోయి రిత్త హృదయం శూన్య మందిరాన్ని ప్రతిఘటించిందా గదిలోనే.
“అమ్మేది” అని ఏడుపు మొగం పెట్టి బరువుగా అడుగు వేసుకుంటూ ఇల్లంతా వెతికొచ్చేసి అలసి నిద్రబోతున్న ఆ మధ్యాహ్నకాలంలో, నేల మీద బోర్లపరుండి ఏడ్చి ఏడ్చి నిద్రించిందా గదిలోనే, సాయంత్రానికి, నిప్పుసెగ జిమ్ముతున్న అమలా శరీరాన్ని అత్త వచ్చి బాధాకల్పితమైన నిట్టూర్పుతో మంచం మీద చేర్చిందా గదిలోనే.
మర్నాడు తీవ్ర జ్వరంతో ‘అమ్మేది’ అని పలవరిస్తున్న అమలాను శిథిల హృదయంతో “వస్తుందమ్మా” అని తండ్రి ఓదార్చిందా గదిలోనే. ‘అమ్మేది’ అనే ప్రణవనాదం ప్రతిధ్వనించిన నిశ్శబ్ద నిశీధంలో, నిశ్చలంగా జాలి చూపులు విదరాలుస్తోన్న నేత్రాలు, బ్రహ్మత్వమందిన యోగి వలె శాశ్వత కాలమునకు ముకుళించిన అమలా పవిత్ర శరీరమున్నదా గదిలోనే.
సుందర మందహసం విరజిమ్ముతూండే అమలా యోగిని చిన్ని పెదవులు జపించిన ‘అమ్మేది’ యను పావనమంత్రము సర్వకాలమునకు వినబడకుండ బోయినదా గదిలోనే.
అహో! ఆ గృహమేధి కెంత హృదయవిదారక దృశ్యమా గది!
(ముద్రణ : గృహలక్ష్మి మాసపత్రిక 1931 నవంబరు)
దేవుడూ, రాజేశ్వర్రావూ
సుమారు పందొమ్మిది లేక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో వక్తృత్వపు పోటీకి నేనొక న్యాయనిర్ణేతగా వెళ్ళేను. అప్పుడు విశాఖపట్నపు మిసెస్. ఏ.వి.ఎన్. కాలేజీ తరపున ఆ పోటీకి వచ్చిన ఇద్దరబ్బాయిలూ కూడ చాలా తెలివిగానూ, ఇంపుగానూ మాట్లాడేరు. ఆ కుర్రవాళ్ళని న్యాయనిర్ణేతలు మంచి టీమ్ గా ఎంచి ఏదో బహుమానం ఇచ్చేరు. “ఓయ్ శాస్త్రీ, ఆ ఇద్దర్లో ఎస్. రాజేశ్వర్రావంటే ఎవరనుకున్నావ్? నా కొడుకే!” అని రెండు మూడు రోజుల తరువాత నా స్నేహితుడూ, ఏ.వి.ఎన్. కాలేజీలో నాకు రెండేళ్ళ సీనియరూ అయిన శ్రీరంగం సుబ్బారావు చాలా సంతోషంగా నాతో చెప్పేడు. అది విని నేను కూడా చాలా సంతోషించేను.
తరవాత కొద్దికాలానికి ఏ.వి.ఎన్ కాలేజీ విద్యార్థి ఒకతను వచ్చి మా యింట్లో పాతికో, ముప్పయ్యో కథల కట్టలు పడేసేడు. “మా కాలేజీలో కథల పోటీకి వచ్చిన కథలండి ఇవి. వీటన్నిటిలోకి మంచి కథ ఏదో మీరు నిర్ణయించాలి” అన్నాడతను నాతో. ఆ కథల రచయితల పేర్లివ్వకుండా ప్రతి కథకు ఏదో సంఖ్య ఇచ్చినట్టు నాకు గుర్తు
ఆ కథలన్నీ చదవడానికి నాకు ఓపిక లేదు, వ్యవధీ వుండదు అని నేను ఎంత చెప్పినప్పటికీ ఆ విద్యార్థి వినకుండా కథల్ని మా యింట్లో వదిలేసి వెళ్ళిపోయేడు. అవి నావేపు బిక్కు బిక్కు చూసేయి. నేనూ వాటివైపు బిక్కు బిక్కు చూసేను. అవి అలాగ నన్నూ నేను వాటిని అలాగా చూసుకుంటూ వుండగా నాకొక మంచి చక్కని ఆలోచన కలిగింది.
మా అమ్మకి కథలూ నవల్లూ చదవడం అంటే చాలా ఇష్టం. మా చిన్నతనంలో ఆమెవల్లనే మా నలుగురన్నదమ్ములకీ కూడా సాహిత్యాభిలాష కలిగింది. అందుచేత ఆ కథల్లో మంచి కథని ఎంచే పూచీ మా అమ్మకి అప్పచెప్పేస్తే బావుంటుందని నాకు తోచింది. మా అమ్మ “ఏమో నేను సరిగ్గా ఎంచగలనో లేదో” అంది “ఫరవాలేదు ఎంచీ” అని నేనన్నాను. ఆ మూణ్నాలుగు రోజుల్లో ఓ సాయంకాలం నేను కోర్టునించి ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఓ రెండు కాయితాలు నా చేతికి యిచ్చి “ఇదిగోట్రా విశ్వం, అన్ని కథల్లో ఇదే బావుంది. మిగతావి ఏవీ ఈపాటి బాగులేవు” అంది.
కథ పేరు నాకు గుర్తులేదు. దానిమీద వున్న సంఖ్య కూడా నాకు గుర్తులేదు. ఏపాటి మంచి కథ అని దాన్ని నేను కూడా చదివేను. అందులో కథ కంటే కథనం బావుందని నాకు తోచింది. సరే బాగానే వుందన్చెప్పి మా అమ్మ చేసిన నిర్ణయాన్ని నా నిర్ణయం కిందే ఆ విద్యార్థి ప్రతినిదెవరో మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేసేను.
తరవాత కొద్ది రోజులకి శ్రీరంగం సుబ్బారావు మా ఇంటి జంక్షన్లో కలిసి “ఓయ్ శాస్త్రీ, మావాడికి ఫస్టు ప్రయిజిచ్చీసేవు కాని, చదివేవా నువ్వు.” అని అడిగేడు.
“అయితే కథలలో ఫస్టు ప్రైజుకూడా మీవాడే కొట్టేసేడేఁవిటి?” అని నేనన్నాను. “అవును కాని నువ్వు సరిగా చదివేవా? నిజంగా బావుందంటావా?” అని మళ్ళీ అడిగేడు. అదొక్కటే ఎలాగా చదివేను కాబట్టి, సరిగానే చదివేనని నేను సరిగ్గా చెప్పగలిగేను.
“నిజంగా బావుందంటావా?” అని మళ్ళీ అడిగేడు రాజేశ్వర్రావు నాన్న.
“బాగానే వుందోయ్, ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి కథలు రాయగలడు. కుర్రాళ్ళో ఆ ప్రామిస్ వుంది” అని నేను సరిగా చెప్పేను.
“కాని కథ చాలా గ్లూమీగా (చీకటిమయంగా) లేదుటోయ్ శాస్త్రీ? ఇంత గ్లూమీగా రాసేడేంట్రా నాయనా అని నేను భయపడ్డానుస్మీ శాస్త్రీ” అన్నాడు స్నేహితుడు సుబ్బారావు.
“చాలా మందికి పరిస్థితులు గ్లూమీగా ఉన్నాయి కదా! అలాంటప్పుడు కథలు గ్లూమీగా
వుంటే తప్పేమొచ్చింది?” అని నేనన్నాను.
సూర్యుడు ఈ లోకంలో చాలామంది కష్టాలను చూస్తాడు. కాని, చంద్రుడే వారి ఆవేదనల్ని ఎక్కువ అర్థం చేసుకోగలడని నే ననుకుంటాను. శ్రీరంగం రాజేశ్వరరావు చూడ్డానికి వెన్నెల్లా వుండేవాడు. అందుకే అతను మనుషులు ఆవేదనల్ని అర్థం చేసుకోగలిగేడని నేను తలుస్తాను.
శ్రీరంగం రాజేశ్వరరావు మంచి కథలు రాస్తున్నాడని నా స్నేహితులంతా చెప్తే వినడమే కాని – అతని ప్రయిజు కథ లేమీ నేనింతవరకూ చదవలేదు. ఈ పన్నెండు కథలు ఇప్పుడే చదివేను. వీటిలో చాలామట్టుకు బావున్నాయని నేను తప్పక చెప్పగలను. ఇంకా రాస్తూ వచ్చినట్లయితే ఈ పాటికి కథక చక్రవర్తి అయేవాడని నేను ఇంకా తప్పక చెప్పగలను.
ఈ కథల్లో మనకు రాజేశ్వర్రావు హాస్యం, లాస్యం, కన్నీళ్లూ, కోపం, వ్యంగ్యం వెటకారం అన్నీ స్పష్టంగా కన్పిస్తాయి. అన్యాయం, అధర్మం యెడల కథకుడికి వుండే కసి కూడా మనకి ఈ కథలనిండా కన్పిస్తుంది. పద్దెనిమిది లేక పంతొమ్మిదేళ్ళ వయసు లోపలే ఇందులోని కథలన్నీ శ్రీరంగం రాజేశ్వరరావు రాయగలిగేడని అంటే అతను ఎంతటి ప్రతిభగల కథకుడో మనకి అర్థం అవుతుంది.
“వైజాక్కి స్టీలు ప్లాంటయినా వస్తుంది కాని మీకు బుద్దిరాదు” అంటుంది ఈ కథలలో ఓ అమ్మాయి నాగరాజుతో. విశాలాక్షికి ఎవరో అబ్బాయి ప్రేమలేఖ రాసేడు. అటువంటిది జీవితంలో ఆమెకి అదే మొదటిసారి “కథలలో ఎక్కువసార్లు, కలలలో తక్కువసార్లు ఇలా చదివింది, చూసింది విశాలాక్షి.” రామారావు అత్తగార్లాంటి వాళ్ళని చూస్తే అసహ్యం. ఆప్యాయతని వాళ్లు “మనుషులు కొద్దీ మీటర్లలో కొలిచి మరీ వొలకబోస్తారు.” “సాయంకాలం ఆరున్నరకి చీకటి వెలుగూ ఒకటే సరిహద్దుని చేరుకున్నట్టున్నాయి”ట! “ప్రకృతికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు వెలుగూ చీకటి కలిపి ఒకే లాగున్నాయి”ట. నాగరాజు మేనమామ అప్పట్లో అప్పుడెప్పుడో చాలా మంచివాడేనట. కానీ, ‘మంచితనం, సుఖం, మంత్రుల వాగ్దానాలు ఇవేవీ శాశ్వతం కావు”. కాబట్టి మిగతా వాట్లాగే ఆ మంచితనం కూడా ఆఖరికి ఆవిరైపోయిందట. మరో కథలో “అక్కడ నిరాశతో నేసినట్టున్న నులకమంచం వుంది”ట. అదే కథలో మనకి కనిపించే రెడ్డి మంచివాడు కాడు (అందుచేత) “నిఖార్సయిన విషాన్నెండబెట్టి, దానికి పాలిష్ కొట్టి, హిట్లర్ మీసాలు తగిలించి, నూరో నెంబరు నూలుపంచె, ఖద్దరు లాల్చీవేసి చేతికి ఓ కర్ర ఇస్తే అది రెడ్డౌతుంది”ట. సిమిలీ బాగులేదని అతనికి తెలుసుటకాని అతను ప్రేమను ప్రేమించేట్ట. (మన) “దేశాన్ని దరిద్రం ప్రేమించినట్టు” కొన్ని నమ్మలేని విషయాలు “దేవుడు మొన్ననే అవతారమెత్తి నిన్ననే చచ్చిపోయాడు. ప్రపంచంలో శాంతీ, దేశంలో సౌఖ్యం సముద్రంలా పొంగుతాయి.” ఇవి ఓ కథలో మనకి కనిపిస్తాయి. అదే కథలో ఒకతనికి జీవితం అంతా గులాబిరేకులే పరుచుకున్నట్టుగా ఉంటూ ఉండగానే ఓ ఏడాదిలోనే మొదటి ముల్లు గుచ్చుకుందిట. అమ్మ చచ్చిపోయిందట. అతని కొడుక్కి జ్వరమొచ్చింది. వస్తే. “బాబుకి జ్వర మేమిటి? దేముడికే బాధలలాగ” అనిపించిందిట అతనికి.
ఇలా చాలా చోట్ల విచిత్రంగానూ, బలంగానూ, స్పష్టంగానూ చెప్తాడు శ్రీరంగం రాజేశ్వరరావు. అంతే కాకుండా ఇతను జీవితంలోని అనేక విషయాలను గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది. అంటే సంఘంలో జరిగే అనేక విషయాల గురించి చాలాచోట్ల ప్రస్తావన వస్తూ వుంటుంది.
ఈ సంపుటంలో ఓ చిన్న ప్రత్యేకత వుంది. ఇందులో వున్న పన్నెండు కథలలోనూ, అయిదు కథలు దేముడి పేరుతోనే వున్నాయి. ఇంకో కథ “గాజుకళ్ళు” లో దేవుడి ప్రస్తావన ఉంది. దేవుడి కథతో పాటు ఇందులో దేవుడు చూడని కథ, దేవుడు రాయని డైరీ, దేవుడి నవ్వు, ‘దేవుడి మనసు’ అనే కథలున్నాయి. ఈ కథలన్నీ 1965-67 సంవత్సరాల మధ్యకాలం లోనే రాసినవి అయినప్పటికి అందుకు సంబంధించిన ఆలోచనలు అంతకు ముందు చాలా కాలం నుంచి వస్తున్నవే అయుండాలి. దేవుడు వుంటే ఇన్ని దుఃఖాలు ఎందుకుండాలి అనే ఆలోచన శ్రీరంగం రాజేశ్వరరావుని ఎంతోకాలంనుండీ తీవ్రంగా వేధిస్తూ వస్తుండాలి. చివరికి విసుగెత్తి కాబోలు “గాజు కళ్ళ”లో చివర్న రాజేశ్వరరావు “దేవుడున్నట్టేనా?” అని ప్రశ్నించి “ఉన్నట్టే మరి” అని సమాధానం చెప్పుకుంటాడు. ఆ కథ చదివితే రాజేశ్వర్రావు అలా సమాధానం చెప్పుకోవడంలో ఆవేదనా వ్యంగ్యం కూడా తెలుస్తాయి.
అంత చిన్నతనంలోనే దేవుడి గురించి ఆలోచించినవాళ్ళు తరువాతరవాత ఎన్నెన్నో దూరాలు, దృశ్యాలు చూడగలరు.
చిరంజీవి రాజేశ్వరరావు చాలా దినాలనుంచి కనపడడం లేదు. అతను దేవుణ్ని వెతుక్కొంటూ వెళ్ళేడని నేను తలుస్తాను. ఇంతలోనే దివ్యంగా తిరిగి వస్తాడని నమ్ముతాను.
4-4-1980
(శ్రీరంగం రాజేశ్వర్రావు విశాఖ రచయితల సంఘసభ్యుడు. తన 20వ ఏట అంటే 1967లో అందర్నీ వీడి వెళ్లిపోయాడు. రావిశాస్త్రిగారి ‘వెన్నెల’ ‘బాకీ కథలు’ ఇతనికే అంకితమిచ్చారు. అతని కథల సంపుటి ‘ఎర్రచీర’కి ముందుమాట.)
‘తప్పెవరిది’
“తప్పెవరిది?” చదివేను. తప్పెవరిదో రచయితే చెప్పేరు. అందులో పేచీ ఏమీ లేదు. పేదవాడికి డబ్బు అవసరం ఉంటుంది. శ్రీమంతులకి అధికార దాహం ఉంటుంది. ఇందులోని సన్యాసినాయుడు, చంద్రయ్యనాయుడూ శ్రీమంతులేకాని పూర్వకాలపు భూకామందులు. ప్రెసిడెంట్లుగానూ, ఎమ్మెల్యేలుగానూ ఉండడం వారి దర్జాకోసమేకాని ధనార్జనకోసమూ, అధికారం చెలాయించి అన్యాయాలు చెయ్యడం కోసమూ కాదు. ఆ మేరకి శ్రీమంతుల్లో కూడా నీతిమంతులు ఉండవచ్చునని చెప్పేరు ఈ రచయిత నవల్లో.
దుష్టసహవాసాలూ దురాలవాట్లూ కూడా ఏమీ లేని వాళ్ళకీ,ఎక్కువ డబ్బున్న వాళ్ళకీ అబ్బుతాయని ఓ హెన్రీగారు ఎక్కడో చెప్పేరని నాకు గుర్తు. ఇందులో గోపాలం మంచివాడేకాని రెండోరకంవాడు.
ఈ నవల చదువుతూంటే అలనాటి – అంటే నా చిననాటి శ్రీమంతులైన బ్రాహ్మల జీవితాలు గుర్తుకొచ్చాయి. ఆ బ్రాహ్మల జీవితాలు కూడా సరిగా ఇలాగే వుండేవి. లచ్చి తల్లికి జాతి భేదం లేదు మరి.
ఇందులోని కథనం చాలా సూటిగా వుంది.
28-5-1980
(జగన్నాథ్ ‘తప్పెవరిది’ నవల)
అక్కడా –ఇక్కడా – అంతటా
దేశంలో చాలా బందిఖానాలు ఉన్నాయి. కాని మొత్తం దేశమే చాలామందికి బందిఖానాలా వుందని కొంతకాలం కిందట మహాకవి శ్రీశ్రీగారు అన్నట్లుగా నాకు గుర్తు. నాకు తెలిసిన విశాఖ జిల్లా జనాల జీవితాలకి కవిగారి మాటలు అన్వయించుకొని చూస్తే అవి నిజాన్ని పలుకుతున్నాయని నేను గ్రహించుకున్నాను.
మా స్వస్థలం విశాఖజిల్లాలో అనకాపల్లి దరినివున్న తుమ్మపాల గ్రామం. మాకు ‘ఆదిపురుషుడు, నల్లగొండ’ జిల్లాలోని రాచకొండ గ్రామంనించి ఇప్పటికి సుమారు మూడువందల సంవత్సరాల కిందటవచ్చి తుమ్మపాలలో స్థిరపడిన గురు భట్టుగారని మావాళ్ళ ఇళ్ళల్లోని పాత కాయితాలు చెప్తాయిట. నాకు ఆ విషయం సుమారు ఏభై సంవత్సరాల క్రితం మా నాన్నగారివల్ల తెలిసింది. అప్పటినుంచి కూడా నేను ఆ రాచకొండ గ్రామం వెళ్దామనీ అక్కడి జనాన్ని చూదామనీ చాలా సార్లు అనుకున్నాను. నాకు అరవయ్యేళ్ళు దగ్గిరికి వస్తున్నాయికాని ఆ అవకాశం మాత్రం యింకా చాలా దూరంలోనే ఉన్నట్లుగా ఉంది.
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావుగారు. నల్లగొండలైనా, రాచకొండలైనా అంతకంటే భిన్నం కాదు. చూడవలసింది కొండల్నొక్కటే కాదు, అంతకంటే ముఖ్యంగా మనుష్యుల్ని.
ఆ సరదా నాకు శ్రీ జంగయ్యగారు తీర్చేసేరు. వీరి గొర్రెల కథలు ఆ ప్రాంతపు వాస్తవ జీవితానికి ప్రతిబింబాలని చదువుతూంటేనే తెలుస్తుంది. జీవితాన్ని బాగా చదివినవారే ఇటువంటి కథలు రాయగలరని కూడా వీటిని చదవగానే తెలుస్తుంది. అందుచేత, ఇవి చదివిన తరవాత, విశాఖ ప్రాంతపు పాటకపు జనం కంటే నల్లగొండల మధ్య నలిగే పాటకపు జనాల పరిస్థితులు భిన్నంగా లేవని నాకు స్పష్టంగా తెలుస్తుంది. కట్టిన జెయిళ్ళలో ఉన్నవారు ఎలా వున్నారో కట్టని జెయిల్లో ఉన్నవారు కూడా అలానే ఉంటున్నారన్న శ్రీశ్రీ పలుకుల్లోని పరమ సత్యం కూడా మనకి ఈ కథలు చదివితే తప్పక తెలుస్తుంది. మావైపు గొర్రెలూ, మేకలూ ఎలా ఉన్నాయో అటుకూడా అలానే . అటు పుల్లూ, సింహాలూ, నక్కలూ, కుక్కలూ ఎలా వున్నాయో యిక్కడా అలానే వున్నాయి. తేడా నాకేమీ కనిపించడం లేదు. ఇందులో చూపించిన అన్యాయాల్లాంటి అన్యాయాలు అక్కడి పెద్దల్లాగే ఇక్కడి పెద్దలు కూడా అనునిత్యం చేస్తూనే వున్నారు. ఇక్కడ అజ్ఞానాన్నీ, అది వీలు చేసుకొని పెద్దలు చేసే అన్యాయాలని, అత్యాచారాలనీ చూస్తుంటే వళ్ళు ఎలా జలదరిస్తూందో, ‘పనిష్ మెంట్’, ‘గత్తర’, ‘బంచరాయి’ కథలు చదివితే అలా వళ్ళు జలదరిస్తుంది, గుండె మండుతుంది.
పేదలంతా ఏకమైతే పెద్దలందర్ని సులభంగా ఒక పెట్టు పెట్టేయవచ్చని నేను నా ఆశల అజ్ఞానపు రోజుల్లో అనుకొంటూ ఉండేవాణ్ని. కాని, పెద్దలంతా కొండల్లా బలిసిపోయేరంటే వాళ్ళ వేళ్ళు నేను అనుకున్నకంటే లోతులోతుల్లోకి చొచ్చుకుపోడమే కాకుండా దూర దూరాల్లోకి విస్తరించుకొని ఉన్నాయని నేను తెలుసుకున్నాను. పెద్దల్ని కూకటివేళ్ళతో సహా పెకలించకపోతే ప్రయోజనం లేదు. మాను కొట్టేస్తే అది వేళ్ళల్లోంచి మళ్ళీ తన్నుకు పుడుతుంది.
విషాదాన్ని వెలుగులోకి తేవడంవల్ల ఈ కథలకి పదునొచ్చింది. అయితే, అన్యాయాల జులుం జబర్దస్తీలని తల్చుకొంటే నాకు నీరసం, నిస్సత్తువా వచ్చేసేయి.
కాని అంతలోనే
“ఇంకానా, ఇకపై సాగవు”
అనుకున్నాను.
శ్రీశ్రీ బోయ జంగయ్యగారు రచించిన ఈ గొర్రెల కథలు ఎంతో బాగున్నాయి.
31-1-1981
షరా.
పైది అంతా రాసిన తరువాత ఎంతో బాగున్న కథలగురించి ఎంతో తక్కువ చెప్పి చాలా తప్పు చేసేనేమోనని నేను కొంచెంకంటే ఎక్కువగానే బాధపడ్డాను.
నేను కథలు రాసినపుడు శిల్పం గురించి అవసరంకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొంటానని కొందరు విమర్శకులు అన్నారని నాకు తెలిసింది. వాస్తవానికి నేను కథగా చెప్పే ఇతివృత్తం ఏ విధంగా చెప్తే బాగుంటుందోనని కొంచెం ఆలోచిస్తాను. ప్రతి ఇతివృత్తం కూడా ఏదో ఒక్క విధంలో చెప్తేనే అది పాఠకుడి మనసుకి హత్తుకుంటుది. అది ఏదా అని కొంచెం ఆలోచిస్తానంతే. కాని దాని గురించి తన్నుకు చావను. ఆ విధానం తెలిస్తే ఆ కథ సరిగా వస్తుంది. లేకపోతే రాదు. అదంతే.
శ్రీ బోయ జంగయ్యగారి కథల్లో ఇతివృత్తానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆ ఇతివృత్తాన్ని ఏ మూసలో పోస్తే పాఠకుడి మనసుని ఆకట్టుకొంటుందో అనే విషయం గురించి శ్రీ జంగయ్యగారు ఆలోచించేరో లేదో నాకు తెలియదు కాని, కథలు కూడా పిస్తోల్లా పేలాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయా కథల్ని ఆయన చెప్పిన ఆయా విధాలకంటే చక్కగా చెప్పడం ఎవరికైనా కష్టమని చెప్పగలను.
అన్ని కథలూ ఆకాశంలో పుట్టవు, మనిషి జీవితంలోంచి పుడతాయి. అందుచేతనే రచయితలు జీవితానికి దగ్గరగా వుండాలి; జీవితానికి దగ్గరగా వుండగలిగినవారే మంచి రచయితలుగా మిగిలేరు. గొర్రెల కథల్లో శ్రీ జంగయ్యగారు తీసుకున్న ఇతివృత్తాల్లో అవలంబించిన శిల్పాల్లో, అన్నింటిబట్టి కూడా ఈయన ఉత్తమరచయిత అని తెలుస్తుంది. ఇన్ని కథలూ కూడా సూటిగా ఉన్నాయి, ఒక్కదాన్లోకూడా ఒక్క పొల్లు మాట లేదు.
‘మనసు’ కథలో కాబోలు ఒక బలిసినవాడు ఒక బక్కవాడి గురించి
‘పక్క లిరగదంతే గాని తిక్క తిరగదు”
అంటాడు.
అది జీవితంలోంచి జంగయ్యగారు జాగ్రత్త చేసిన మాట.
ఆ మాటనే ఆ బక్కవాడు ఆ బలిసినవాడి గురించి సరిగా చక్కగా గట్టిగా చెప్పవలసిన మాట అని శ్రీజంగయ్యగారు జాగ్రత్తగా గ్రహించేరని నేను నమ్ముతున్నాను.
చక్కని కథలు చిక్కని జీవితాన్ని వడబోసినప్పుడే ఎంచక్కగానో వస్తాయనడానికి ఇందులోని కథలే మంచి నిదర్శనం.
(బోయ జంగయ్యగారి కథల సంపుటి ‘గొర్రెలు’కి)
అమరజీవి స్పార్టకస్ గురించి
రాక్షసి బొగ్గులే ఒకానొక పద్ధతిలో వజ్రపురాళ్లు అవుతాయని అంటారు. మనుష్యులు విప్లవవీరులుగా ఆ పద్దతిలోనే అవుతారని స్టార్టకస్ చరిత్ర మనకి నిరూపిస్తుంది. పీడనశక్తి వస్తువుల్నే కాదు. మనుష్యుల్ని కూడా మారుస్తుంది.
అయితే, సైన్సు బోధించడానికి కాని, చరిత్ర చెప్పడానికి కాని నేను సిద్ధంగా లేను.. సైన్సు నాకు రాదు. తెలియవలసినంతగా చరిత్ర నాకు తెలియదు. నిజం చెప్పాలంటే స్పార్టకస్ గురించి ఏమాటైనా చెప్పడానికి నాకు అర్హతలేదు. కానైతే చెప్పు చెప్పుమని మిత్రులు బలవంతం చెయ్యడం వల్ల ఈ సాహసంలోకి నేను దిగవలసి వచ్చింది. అయితే, అందరికీ కొన్ని కొన్ని సంగతులు తెలిసినట్టుగానే నాకు కూడా కొన్ని భోగట్టాలు తెలుసు.
లోకంలో మనిషికి నిత్యావసరమైన వస్తువులన్నింటినీ మనుషుల్లో కాయకష్టం పడేవాళ్ళే ఉత్పత్తి చేస్తుంటారు. ఆ శ్రమ ఫలితం మాత్రం వాళ్ళకి దక్కలేదు. అది స్పష్టంగా అందరికీ కనిపిస్తున్నదే కాని, అలా దక్కక పోడానికి కారణం రాముడిమీదో రహీముడి మీదో లేక పూర్వజన్మలమీదో, మరి దేనిమీదో దేనిమీదో తోసేస్తారు. అలా ఎవరు తోసేస్తారు? అని ప్రశ్నిస్తే, ఆ శ్రమ పడే వారి కష్టఫలితాన్ని ఎవరైతే దోచుకుంటున్నారో వారేనని సమాధానం చెప్పవలసి ఉంటుంది. దోపిడీ చేసే వర్గాలే దాదాపు ప్రతి దేశంలోనూ పాలకవర్గాలుగా ఉంటూ వస్తున్నాయని చరిత్ర ఏమాత్రం చదువుకున్నా మనకి తెలుస్తుంది.
మనం ఎవరి కష్టం మీదైతే బతికేస్తామో, ఎవరి కష్టం తాలూకు ఫలితాన్నయితే దోచుకుంటామో వారిని గడ్డిపోచల్లా చూస్తాం. వారిని చూసి అసహ్యించుకుంటాం. వారు మనకంటే బలహీనులనో, తెలివితక్కువవారనో మనకంటే నల్లగానో తెల్లగానే ఉన్నారనో, మన కంటే తక్కువ జాతివారనో మనకి మనం చెప్పుకొని, ఆ కారణం వల్లనే వారి అవస్థ అలా ఉన్నదని సమాధానాలు చెప్పుకొని, వాళ్ళ “తక్కువ” తనానికి ఇప్పుడు కారణాలు అంటగట్టి, మన దోపిడీని మట్టుకు నిరాటంకంగా సాగించుకొందికి మనం సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాం.
అయితే –
దోపిడి కాబడేవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక తిరుగుబాటు చేస్తాడని ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రతిదేశపు దోపిడీ పాలక వర్గానికీ కూడా స్పష్టంగా తెలుసు. కాని, ఈ నిజాన్ని స్పార్టకస్ తిరగబడేవరకూ కూడా ఆనాటి రోమన్ పాలక వర్గం కానుకోలేకపోయింది. అందువల్ల తొల్త దెబ్బతింది. తరవాత, నిలదొక్కుకొని తిరుగుబాటుని అణిచి వేయగలిగింది.
పాలకవర్గం స్పార్టకస్ నించి పాఠాలు నేర్చుకుంది. స్పార్టకస్ తరవాత ఈ రోజుకి కూడా పాశ్చాత్యదేశాల పాలక వర్గాల ఏకైక లక్ష్యం (ఇప్పుడు మన దేశంలోని పాలక వర్గపు లక్ష్యంలాగే) ఏమిటి అంటే:
శ్రామిక వర్గాన్ని ఎన్నటికీ అధికారంలోకి రానివ్వకూడదు. వారిని ఎల్లకాలం అణిచి ఉంచాలి.
అందుకు ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉండాలి.
అదీ లక్ష్యం.
అందువల్లనే స్పార్టకస్ కి అంత ప్రాముఖ్యత.
అతను ఓడిపోయేడు, చనిపోయేడు. క్రీస్తుకి పూర్వమే పుట్టేడు గిట్టేడు, కాని అతని పేరు చెప్తే దోపిడీ దారులందరికీ ఇప్పటికీ బెదురు. ఎందుకంత బెదురు? ఎందుకా? వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు. కాని ఆ జనాలు ఉగ్రనరసింహులుగా మారి విజృంభించగలరన్న సత్యాన్ని పుస్తకం విప్పి చెప్పలేదు. కత్తి ఎత్తి చెప్పేడు. అందుకే, ఇరువర్గాల వారికీ కూడా ఇతను ముఖ్యుడు. ఇరువర్గాలవారూ అతణ్ని గుర్తుంచుకుంటారు – శ్రమించేవారు ఆశతో, దోపిడీదార్లు పగతో.
ప్రధానంగా బానిసల కష్టాన్ని ఉపయోగించుకొని బాగుపడిన రోమన్ పాలకవర్గం, ఆ బానిసలని ఎంత నీచంగా హేయంగా చూసి వారియెడల ఎంత దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ప్రవర్తించేదో ఈ నవల చదివితే తెలుస్తుంది. ఇప్పటికి కూడా దోపిడీ పాలక వర్గాలు శ్రామిక వర్గాల యెడల ఇలాగే ప్రవర్తిస్తున్నదని ఇప్పటి దోపిడీ దేశాల చరిత్ర చూసినా తెలుస్తుంది. అయితే ఈ దానవులు ఆ దానవుల్లా ఉండకపోవచ్చు. ఏమైతేనేం? దానవులు వేరైనా దానవత్వం ఒక్కటే.
చరిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా ఎక్కువ కష్టం. కాని, ఈ నవల రాసిన హవార్డ్ ఫాస్ట్ గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు “ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ ” లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించేడు. కాని, అలా చిత్రీకరించగలగడానికి అదంతా ఆయనకి దగ్గర చరిత్రే. అందులో కూడా అతని పాత్రలు చరిత్రలో ఉన్న పాత్రలు కావు. కాని, ఇందులోని స్పార్టకసే కాదు, క్రేససే కాదు, వెరీనయాలే కాదు, ఆఖరికి బాటియాటిస్ కూడా చరిత్రలో వారితోపాటు ఉన్నవాడే. రెండువేల సంవత్సరాల కిందటి వ్యక్తుల్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించగలగడమే కాకుండా, ఆనాటి ఆర్థిక రాజకీయ సాంఘిక జీవితాన్ని యావత్తూ కళ్ళకి కట్టినట్టు చూపించగలిగేరు హవార్డ్ ఫాస్ట్ గారు.
ఇది నిజాయితీతో రాసిన నవల, ఇది ఆవేదనతో రాసిన నవల. ఇది ప్రయోజనంతో కూడుకొన్న నవల, విప్లవాలనీ వాటి కారణాలనీ నగ్నంగా చూపెట్టే నవల, సామాన్యుడు అనన్యసామాన్యుడెలా అవుతాడో చూపెట్టగలిగిన నవల. ఇది సామాన్య జనానికి సాయుధ విప్లవమే శరణ్యమని నిరూపించి చాటిచెప్పే నవల. ఈ నవల చదువుతూంటే మీరు ఏదో ఒకసైడు ఉంటారు. ఉండక తప్పరు.
ఇటువంటి నవల అనువదించగలగడం చిన్నఫీటు కాదు. బాగా అనువదించగలగడం పెద్ద ఫీటు. ఆ ఫీటు శ్రీ ఆకెళ్ల కృష్ణమూర్తిగారు అద్భుతంగా చేసేరని అందరూ అంటున్నారు. ఆ మాటే నేనూ అంటున్నాను.
“స్పార్టకస్” సినిమా నేను చూసేను. అందులో స్పార్టకస్ కి వారు న్యాయం చేకూర్చేరు. ఈ నవల్లో స్పార్టకస్ న్యాయం ధర్మం మనకి కనిపిస్తాయి. జీవితమే అతనికి అన్యాయం చేసింది. కానైతే, చరిత్ర మాత్రం అతనికి న్యాయమైన స్థానం ఇచ్చి, పేదవారి తిరుగుబాటు జండాగా అతణ్ని ఎగరేసి నిలబెట్టింది. అందుకే, ఆ జెండా అంటే పెద్దలకి గడగడ, చిన్నలకి మిలమిల.
9-7-81
(అమెరికన్ రచయిత హవార్డు ఫాస్టు 1951లో రాసిన ఇంగ్లీషు నవల స్పార్టకస్ 1952 లో వెలువడింది. విశాలాంధ్ర వారు 1955లో తెలుగు అనువాదం వేశారు. రావిశాస్త్రిగారి ముందు మాటతో హైదరాబాద్ బుక్ ట్రస్టువారు 1981లో మళ్ళీ వేశారు.
ఈ ముందుమాట రచయిత గురించి: చాలా మంచి మాట
లోకంలో మంచితనం మీద నమ్మకం ఉన్న మనుష్యుల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఇందులోని కథలన్నీ రాసిన సీతారాంకి సరిగ్గా అటువంటి నమ్మకమే ఉంది. “జీవితం ఒక కథ కాదు” అనే కథలో మానేజర్ రంగయ్యలాంటివాడు మా సీతారాం. అంతటి నిగర్వి.
చెప్పకేం, నాక్కూడా మానవుడి మంచితనం మీద నమ్మకం ఉంది. అందుకే నన్ను గురించి కూడా నేను జాలిపడుతుంటాను. అయితే నేను మాటమాటకీ కాకపోయినా చీటికీ మాటికీ ‘సినికల్’ అయిపోతూ ఉంటాను.
కాని సీతారాం అలాకాదు; అలాకాడు. అందుకే నేనతన్ని మెచ్చుకుంటాను.
ఇందులోని కథలన్నీ చదివితే మనిషి మారాలనే తపన సీతారాంకి ఉన్నదని బోధపడడమే కాదు, స్పష్టపడుతుంది. లేకపోతే ‘వెల్ డన్’ కథకాని ‘మానేజర్ రంగయ్య కథ’ కాని అతను రాసి ఉండలేడు. అలాగే ఇతర కథలు కూడా రాసి ఉండలేడు.
జీవితంలోని మంచిని చూడగలిగినవాడు అందులోని చెడ్డని కూడా చూడగలడు. అయితే ఆ మంచిని గుర్తించగలిగి ఆ చెడ్డని ఎత్తి చూపగలిగినవాడు రచయిత – మంచి రచయిత అవుతాడు. ఆ విధంగా చూస్తే ఈ గరిమెళ్ళ వెంకట సీతారాం చాలా మంచి రచయిత.
నేను రచయితని కాబట్టి మరొకరి రచనల గురించి ముందుమాట చెప్పాలంటే కొంచెం మొహమాటపడతాను. మరేం ఫరవాలేదు. నిర్మొహమాటంగానే చెప్పండి అని ఆయా రచయితలు గట్టిగా చెప్పినప్పటికీ ఆ మొహమాటం తగ్గదు.
మొహమాటం తగ్గకపోయినప్పటికీ ముందుమాట చెప్పడం ఒకప్పుడు తప్పదు. సీతారాం విషయంలో అదే సంభవించింది.
మానవుల మంచి చెడ్డల గురించి మనిషి తర్కించుకున్నాడు. ఆ మనిషి తరచు మంచివైపు మొగ్గుతాడు. ఆ మనిషి ఈ లోకంలో మంచే నెగ్గాలని మధన పడినవాడు. అతను సంఘ సేవకుడిగానో, రాజకీయవేత్తగానో, రచయితగానో మారుతాడు. ఏదో ఒక మంచి పని చెయ్యడానికి తాపత్రయ పడతాడు. సీతారాం రచనలకి మంచి చెడ్డల గురించి అతని మధనే అసలు కారణం.
ఇందులోని ఏ కథ చదివినా అది ప్రస్తుత సామాజిక జీవితంలోంచి పుట్టుకొచ్చి అందుకు సంబంధించినదేనని స్పష్టంగా తెలుస్తుంది. అయితే అలా పుట్టుకొచ్చే కథలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని కథలు జీవితంలోంచే పుట్టుకు వచ్చినప్పటికీ జీవితం లోని మంచి చెడ్డలతో సంబంధం పెట్టుకోకుండా, కొంత మంది ఖుషీ కోసం మాత్రం పుట్టుకువస్తాయి. ఆశ్చర్యపరిచే సైన్సు కథలూ, ఆనందపరిచే సెక్సు కథలూ అటువంటి వాటిలో కొన్ని మాత్రమే. ఎన్నెన్నో ప్రేమ కథలు కూడా ఆ జాబితాలోకి వస్తాయి. అటువంటి కథలన్నీ కూడా జీవితంలో తీరిక ఎక్కువున్నవాళ్ళ కాలక్షేపానికి పనికొస్తాయి. అలాగే జీవితంలోని దారిద్ర్యాన్నీ దుఃఖాన్నీ అన్యాయాన్నీ చూసి జాలిపడే కథలు ఉన్నాయి. అటువంటి కథలు ఆ దారిద్రం, దుఃఖం, అన్యాయం ఉన్నన్నాళ్ళూ వస్తూనే ఉంటాయి. వాటికి అయ్యో అయ్యో కథలని పేరు పెట్టేన్నేను. నేను రాసిన ‘మెరుపు మెరిసింది’ ‘కార్నర్ సీట్ ‘. ‘జరీ అంచు తెల్లచీర’ ఈ అయ్యో అయ్యో కథల జాబితాలోకి రామారావు మేష్టరుగారు రాసిన ‘యజ్ఞం’ కథ బేసిక్ గా అయ్యో అయ్యో కథే అయినప్పటికీ అది మొత్తం సంఘంలోని దురాగతాన్ని విప్పిచూసి జాలిపడుతుంది. కాబట్టి అది గొప్ప కథ అవుతుంది. ఆఖర్న ముఖ్య వ్యక్తి అసహాయత మనకి కనిపించి మనం జాలి పడ్డప్పటికీ ఆ జాలి కంటే అటువంటి వ్యక్తుల్ని అటువంటి దుర్భర పరిస్థితులలో ఉంచిన వారియెడల మనకి రుద్రుడి రౌద్రం ఎక్కువ కలుగుతుంది. ఒక చిన్న చీమకి ప్రమాదవశాత్తు కాలు విరిగితే ఆ కుంటి చీమను చూసి జాలిపడి రాసిన కథ కాదు. కోట్లాది చీమలకి పద్ధతి ప్రకారం బంధాలు బిగించి పద్ధతి ప్రకారం వాటిని పీల్చి పిప్పి చేస్తున్నవారి మీద ఆగ్రహం ఆ కథ.
అయ్యో అయ్యో కథల్లాగే ఛీ ఛీ కథలు కూడా ఉన్నాయి. సంఘంలోని దురాచారాలనో దుష్టవ్యక్తుల్నో దుయ్యబడుతూ రాసిన కథలివి. కొంతగా ఇవి పూర్వకాలం తిట్టుకవిత్వపు కోవలోకి వస్తాయి. ఇటువంటి కథలవల్ల ఆశించిన అంటే రచయిత ఆశించిన ప్రయోజనానికి విరుద్ధమైన ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది.
ఇలాగ్గ రకరకాల కథలు ఉన్నాయి. చెప్పొచ్చేదేమిటంటే మంచి కథలు సంఘానికి మంచి కలగాలని ఉద్దేశించి రాసిన కథలూ అని;
ఈ విధంగా ఇందులోని కథలన్నీ మంచి కథలు. అయితే ‘హేట్స్ ఆఫ్ టు కాంతం’లో పెట్టుబడిదారీ సూత్రం ఒకటి సీతారాం సోదాహరణంగా చిత్రించేడు. అయితే ఆ కథలో మణికాంతాల మంచితనమే చూస్తాం కాని ఆ పెట్టుబడిదారీ సూత్రపు దౌష్ట్యాన్ని గమనించం. ఇందులో ఓ కథలో కామేశ్వరీ జగన్నాధాల ప్రస్తావన ఉంది. వారు సత్యకాలపు వ్యక్తులు. ఆ కాలం మనకి తిరిగి రావాలంటే మన దేశానికి లెనిన్ మావోల రోజులు రావాలని సీతారాం గుర్తించినట్లయితే అతని కలం నుంచి ఇంకా మంచి కథలు ప్రవహించగలవని తలుస్తాను.
4-9-1981
(గరిమెళ్ళ సీతారంగారి ‘హేట్సాఫ్ టు కాంతం’కి రాసిన ముందు మాట. “కథలు రాయడం చాలా కష్టమైనపని. కథలు రాస్తే జీవితం మీద కామెంట్ చేయాల్సివుంటుంది. అంచేత మనకి మనం మంచేమిటో చెడ్డేమిటో తెల్సుకున్నామా అని తర్కించుకున్నాకే కథలు రాయాలి.” ఈ పుస్తకం ఆవిష్కరిస్తూ 14-2-82న రావిశాస్త్రి అన్నారు. )
‘దొంగిలించదగిన‘ కథలు
‘శ్రీరాజ్’గారి అసలు పేరు నాకు తెలుసు. కాని, అది ఆయన తెలియజెప్పడానికి ఇష్టపడనప్పుడు అది నేను తెలియచేయడం మర్యాద కాదు. అయితే – దేముడే ఎంతో మంది మంచివాళ్ళకి శత్రువైనట్టు, మారు పేర్లతో రాసే రచయితలకి, ఒక్కొక్కప్పుడు, ఆ మారు పేర్లే అనుకోని చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం కలగవచ్చు. అటువంటి ప్రమాద పరిస్థితిలోనే శ్రీ రాజ్ గారితో నాకు పరిచయం ఏర్పడింది.
కాకుల్ని అందరూ తక్కువగా చూస్తారు. కాని, అవి పేదవాడి ముంగిట్లోకి వెళ్ళి అతని పరిస్థితి నంతటినీ ఎంత సులభంగా చూడగలవో, రాజుల పెరళ్ళలోకి వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నింటినీ కూడా అంత సునాయాసంగా కనిపెట్టగలవు. హంసలూ, రాజహంసలూ ఆ రెండు పనులూ అంత సులభంగా చెయ్యవు. హంసలసలు పేదవారి వాడలకి రావు. రాజుల అంతఃపురాల్లోకి వెళ్ళినా అవి రాజులకీ, రాణులకీ మధ్య రాయబారాలు నడుపుతాయి తప్ప, ఆ రహస్యాలు మనకి చెప్పవు. అంతేకాదు, హంసలు మా వూరికే కాదు, ఏ ఊరికైనా కూడా ఉపకారం చెయ్యవు. కాకులు అలా కాదు. మనం ఆరవేసుకున్న బట్టల్ని అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఖరాబు చేస్తే చేస్తాయేమో తప్ప, అవి సాధారణంగా ఊరిని శుభ్రం చేసి ఊరివారికి ఉపకారం చేస్తాయి. కాకినీ, హంసనీ తక్కెట్లో వేసి తూచి చూసుకొని నా మొదటి మారుపేరుగా “కాకి”నే ఎన్నుకొని, ఆ పేరుతో “దయ్యాలకి ద్వేషాల్లేవు” అని కథరాసి పంపిస్తే దాన్ని “చిత్రగుప్త” వారు ప్రచురించేరు. కానైతే ఆ కథని మరి ఒక ఏ కాకైనా తనే రాసేనని అరుచుకు తిరిగినా, మరి ఒక ఏ కాకి అయినా అలాగే కేకలేసుకు పురివిప్పుకు తిరిగినా అందుగురించి నేను చెయ్యగలిగింది ఏమీ ఉండకపోను.
శ్రీరాజ్ గారి విషయంలో సరిగా అలాగే జరిగింది. ఈయన రాసిన కథలన్ని తనే రాసేనని చెప్పుకు తిరగడమే కాకుండా, అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని అరబ్బువారికి అమ్మివేసినట్టు, ఓ తగు మనిషి ఈయన రాసిన ‘లాస్ట్ కేస్ ‘ అనే కథని ఎత్తుకుపోయి, నాటకంగా ఆమెకి వేషం మార్చి ఆలిండియా రేడియో వారికి తనదిగా అమ్మివేసేడు. తనకాంతని ఎవరైనా ఎత్తుకుపోతే ఏ మనిషైనా ఎంత బాధపడతాడో త కథని ఎవరైనా దొంగిలిస్తే ప్రతి రచయితా అలాగే బాధపడతాడు. అప్పుడు శ్రీరాజ్ గారు ప్లీడర్నయిన నా దగ్గరికి పరుగెట్టుకొని వచ్చేరు. నేను, ఈయన కథని ఎత్తుకుపోయిన వారెవరో కనుక్కున్నాను. అతనికి నోటీసు ఇచ్చేను. శ్రీరాజ్ గారు మంచివారు కాబట్టి అలా ఎత్తుకు పోయినవాణ్ని క్షమించి విడిచి పెట్టేరు. చెప్పొచ్చేదేమిటంటే; ఎత్తుకు పోదగ్గట్టి మంచి కథలు రాసేరు శ్రీరాజ్ గారు.
కథలు మంచివైనా చెడ్డవైనా మానవ జీవితంలోంచే పుట్టుకొస్తాయి. మంచి కథలు రాసేవారిని మానవ సంఘంలోని గొప్పవారు ఎత్తుకుపోయి తమ గురించి సేవ చేయింపించుకొందికి ప్రయత్నిస్తారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఆ కష్టం అంతా తెలుసుకోగలిగినవారు కూడా అధిక వర్గంలోకి ఎలా చేరిపోయి మారిపోగలరో “దేముడూ శత్రువే!” కథలో మనం చూడగలం. ఈ రచయితకి కష్టసుఖాలు తెలుసు; ఇతివృత్తాల మంచితనాలూ శిల్పసౌందర్యాలూ కూడా తెలుసు. “లాస్ట్ కేస్ ” చదివితే “నాటకీయత అంటే ఏమిటో కూడా ఈయనకి బాగా తెలుసునని మనకి బాగా తెలుస్తుంది. ఇతివృత్తం మంచిది అయివుండాలని కూడా ఈయనకి తెలుసునని ఈ పుస్తకంలోని ఏ కథ చదివినా మనకి తెలుస్తుంది. కార్మికలోకానికి కొంత మంది చేసే అన్యాయాలని దగ్గరనించి చూడగల్గిన శ్రీరాజ్ గారికి వాటి గురించి బాగా తెలుసు కాబట్టే ఆయన “గ్రేట్మెన్ థింక్ ఎలైక్” అనే కథలో అందుగురించి అంత అందంగానూ కఠినంగానూ కూడా చెప్పగలిగేరు.
శ్రీరాజ్ గారు ఎత్తుకు పోదగ్గ కథలు రాసేరు. ఎక్కువ వర్గాల వారిచేత ఎత్తుకుపోబడకుండా అట్టడుగు వర్గాలవారికే అధికంగా సహాయం చేస్తూ శ్రీరాజ్ గారు చిరకాలం నిలబడగలరన్న నమ్మకంతో నేనున్నాను.
22-9-1983
(శ్రీరాజ్ కథలు ‘ఒక్కక్షణం’)
మున్నీ
మున్నీ-
అనేది ఒక మంచి ముత్యం.
“మున్నీ” అనే పేరుగల ఈ సంచిక ఉందే – ఒక మంచి ముత్యాల సంచీ. దీనిలో దేనికంటే ఏది మంచి ముత్యం అంటే ఏం చెప్పడం ?
ఎంచడం చాలా కష్టం!
అయితే ఒక్క సంగతి చెప్పడం చాలా సులభం.
అన్నింటికంటే మంచి ముత్యం అచ్యుతరామరాజుగారే.
1-11-1986
మున్నీ; కథల సంపుటి – గణపతి అచ్యుతరామరాజు
“బానిసత్వం అమ్మబడును”
అడిగోపుల వెంకటరత్నమ్ గారిని చూడగానే “ఈయన ఎంతో మంచివాడు” అని నాకు తోచింది. అయితే మంచితనం మీద మోహం కలగడం కూడా ఒకప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందువల్లనే ఈ “బానిసత్వం అమ్మబడును” అన్న వీరి గేయ సంపుటికి నేను ముందు మాట రాయవలసిన పరిస్థితి ఏర్పడింది.
నేను పామర జనరంజకమైన కథలు కూడా రాయలేని కథకుణ్ణి కాని నేను ఏ విధంగా చూసినా పండితుణ్ణి మాత్రం కానేకాను. పోనీ కథలే కదా, ఏదైనా రాద్దామంటే ఇవి గేయాలు కాని కథలు కావు. అంటే ఇది కవిత్వం!
అయితే ‘కవిత్వం’ అంటే అర్థం ఏమిటి? అందుగురించి నేను వెతుక్కోవలసి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ వారు ప్రచురించిన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువుని అందుగురించి – అంటే కవిత్వం అంటే అర్థం గురించి వెతికాను. అందులో కవిత్వము అంటే కవిత అని అర్థం చెప్పారు. కవిత అంటే అర్థం మాత్రం మళ్లీ కవిత్వము అనే చెప్పారు. పోనీ “కవి” అంటే ఏమిటి అని చూస్తే కవిత్వము చెప్పువాడు అనీ, పండితుడు అనీ అర్థం చెప్పారు. అందుచేత ఈ నిఘంటువు వల్ల కవి అన్నా. కవిత అన్నా, కవిత్వము అన్నా నాకు స్పష్టంగా గాని, స్పష్టాతి స్పష్టంగానైనా గాని నాకేమీ అర్థంకాలేదు. నిఘంటువు వెల తక్కువేగాని నాకుమాత్రం ఏపాటి విలువైన బోధనా చేయలేకపోయింది.
ఈ గందరగోళంలో నేను వుండగా యేదో మహాత్ముడి బోధగా లేదా ఎవరో స్నేహితుడి సలహాగా “బాధ కవిత్వానికి పర్యాయపదం” అని ఎప్పుడో, ఎక్కడో మహాకవి శ్రీశ్రీగారు రాసిన మాట నాకు గుర్తుకొచ్చింది. దాంతో ‘హమ్మయ్య’ అనుకున్నాను. గురజాడ వారు చెప్పినట్టు బ్రాహ్మల్లోనే కాదు కవుల్లు కూడా మహానుభావులంటారు.
అయితే బాధ అంటే ఏమిటి?
బాధ అంటే ఏమిటో ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఎందుచేతనంటే బాధ అంటే ఏమిటన్నది జీవలోకం యావత్తుకీ తెలుస్తుంది. అందులోనూ అదంటే ఏమిటో బాధపడే వారికే కాకుండా బాధపెట్టే వారికి కూడా తెలుస్తుంది. బాధపెట్టడంలో వుండే విలువా, లాభము తెలుసుకున్నవారు కాబట్టే బాధపెట్టేవారు ఇతరులను బాధపెడతారు. ఇందులో లాభము అంటే దోపిడీ అని నా అభిప్రాయం. అడిగోపుల వెంకటరత్నమ్ గారి ఈ గేయాలు చదివితే వారి అభిప్రాయము కూడా అదే అని మనకు బోధపడుతుంది.
“ఐదేళ్ళ కొకసారి వచ్చే
ఎన్నికల్లో నువ్వు
ఐదు రూపాయలకు
ఓటు అమ్ముకుంటే
ఐదు సంవత్సరాల
బానిసత్వం
కొనుక్కున్నట్లే
కొత్త రంగుల పల్లకీ
మొయ్యడానికి
ఒప్పుకొన్నట్టే”
అని వెంకటరత్నమ్ గారు అనడంలో ఐదు రూపాయల లాభం చూపించడం ఐదు సంవత్సరాల పాటు పల్లకీ మోయించడానికే అని మనకి బోధపడుతుంది. మోత బాధ ఎంత బాధో కవి గారికి తెలుసు. అది మనకు తెలియజేస్తాడు. ఆ బాధ గురించి వీరు ఎంతటి ఆవేదన చెందుతున్నారో అన్నది ఇందులో ఏ గేయం చదివినా తెలుస్తుంది.
“నా పేరు బహువచనం
నన్ను స్వారీ చేస్తున్నవాడు ఏకవచనం”
-అనే మాటని వెంకటరత్నమ్ గారు ఎంతో చక్కగా మళ్ళీ మళ్ళీ గుండెకి హత్తుకుపోయేలా చెప్పారు.
అలాగే
“భూగోళాన్ని ఒకడు పెనంపై వేయిస్తూంటే
పెట్టండి తింటామంటూ
కొందరు ప్లేట్లు పట్టుకు కూర్చున్నారు”
అని చెప్పడంలో కూడా మనకి చక్కదనమే కాకుండా వాడి వేడి లేదా వేడి వాడి భగ్గున కనిపిస్తుంది. బాధపడే వాయి మీద కరుణ అవసరమే. కానీ బాధపెట్టే వారి మీద ఎంతో కోపం కూడా అవసరం. అడిగోపులవారు ఈ గేయ రచనల్లో రెండింటినీ దృష్టిలో పెట్టుకున్నారు.
“పల్లకీలో
ప్రభువు
పండుకొన్నా
కూర్చున్నా
బోయీలకు
బరువు ఒక్కటే!”
అనడంలో బోయీల ఎడల కరుణ కనిపిస్తుంది. ప్రభువు మీద పగ కనిపిస్తుంది. అయితే ఈ వ్యవస్థ మారవద్దా? అందు గురించి ఈ గేయాల్లో ఏదయినా దారి కనిపిస్తుందా?
“దారి తప్పినవారి దారి యిది
దారి కాననివారి దారి యిది”
అని ఒకచోట అన్నారు. కాని
“నీ దారి నిర్భయమని చూపెట్టు
నీ దారి స్వర్గానికి తొలిమెట్టని చాటిచెప్పు
అప్పుడు
మల్లెల్ని మించిన పరిమళాలు
నువ్వు వెదజల్లుతూంటే
దారిన నడవడం మాకెంతో హాయి”
అయితే అది ఏదారో కవిగారు స్పష్టంగా “మిత్రుడికి లేఖ”లో తెలియజేస్తున్నారనీ, బాధా విముక్తికోసం మార్గమేదో వారు సూచిస్తున్నారనీ బాగా అర్థం అవుతోంది.
“పాలు మరచిన పిల్లలు
తమ్ముళ్ళ పాలకోసం
తల్లిదండ్రుల భుక్తికోసం
బాలకూలీలై
బరువుల మోస్తూనే వున్నారు.
అంతా యథాతథంగానే వుంది
కానీ
వాళ్ళ చూపుల్లో
నేడు ఏదో మార్పు వుంది”
ఏమిటా మార్పు?
“బానిసత్వం అమ్మబడును” పూర్తిగా చదివి తెలుసుకోండి
గాయాలేగేయాలని అడిగోపుల వెంకటరత్నమ్ గారిని చదివితే తెలుస్తుంది.
4-5-1987
(బానిసత్వం అమ్మబడును, మే 1987-అడిగోపుల వెంకటరత్నమ్)
రావి పత్రం
ఇందులో చిరంజీవి రాంభట్ల వేంకట సుందరలక్ష్మి నరసింహశర్మ చెప్పిన కవితలు చదివేను. పేరు పెద్దది. కాని చిరంజీవి ఇరవయ్యేళ్ల చిన్నవాడు. అయితే ఇతని కవిత్వం మాత్రం గొప్పది.
గొప్పది కాకుండా ఎలా అవుతుంది?
ఈ పక్క రాంభట్ల వారు సాహితీ శిరోమణులు, ఆ పక్క తాతావారు మహోపాధ్యాయులు, . మరో పక్క మహాకవి శ్రీశ్రీ ఈతని బంధుకోటిలోని వారు, మించి మహామేధావీ మా గురువుగారూ అయిన శ్రీతాతా శ్రీరామమూర్తి గారికి ఇతడు దౌహిత్రుడు. నాల్గువైపులా ప్రతిభగలవారి వల్ల ప్రభావితుడు అయిన ఈ చిరంజీవి కవిత గొప్పది కాకుండా ఎలా ఉండగలదు?!
నేను తెలుసుకోగల్గినంత మట్టుకు ఈ చిన్నవానికి భావబలం ఉంది. భాషాబలం ఉంది. భాషమీద అధికారమే కాదు, చలాయింపు ఉంది. భావబలంతో ఇతను తెలుగు సంస్కృతాలు రెండింటినీ ఎలాగు పిలిస్తే అవి ఇతనికి అలా పలుకుతాయి. రెండింటినీ ఇతను అభ్యుదయ భావాలతోనూ, దైవభక్తితోనూ కూడా పిలుస్తున్నాడు.అవి ఇతనికి అలాగునే పలుకుతున్నాయి.
“ప్రగతి నాకు ప్రేరేపణ
వెగటు నాకు వెనుదిరుగుట”
అని చిన్నతనంలోనే చెప్పగలిగిన ఈ బాలకవి మహాకవి “శ్రీశ్రీ కి సాశ్రునివాళి”లో
“నువ్వులేని కవిజనాళి
దివ్వెలేని దీపావళి”
అని చెప్పేడు. కాని, జనాళికి జరుగుతున్న అన్యాయాలకి మూలకారణాలు తెలుసుకోగలిగితే ఈ చిన్న వయస్సు కవికుమారుడు మరొక శ్రీశ్రీగా, మరొక మహాదీపంగా జగలడు అని ఆశిస్తున్నాను. తప్పక నమ్ముతున్నాను.
“అనైక్యతా తమస్సులో సమైక్యతా ఉషస్సుకై”
“పెన్నిద్దుర విడచి మనం కన్నెత్తే ఘడియలకై
క్రొన్నెత్తుట ముంచి కలం కొత్తపాట రాస్తున్నా”
అని చెప్పిన ఈ కవికిశోరం మాటల్లో ఎంతో నిజం ఉంది అని ఈ కవితలు చదివితే తెలుస్తుంది.
12-1-88
(రాంభట్ల నృసింహశర్మ ‘ఉషాతుషారాలు’)
రణరంగం
రంగంలోకి దిగి ఇరుపక్షాల వారూ రణంలోకి కూడా దిగిపోయేక అందులో పాల్గొంటున్నవారు మంచికా చెడ్డకా – దేన్ని గురించి యుద్ధం చేస్తున్నాము అని ఆలోచించడానికి వ్యవధి వుండదు. పరిస్థితుల ప్రాబల్యం వల్లనే ఏది మంచి ఏది చెడ్డ అనే నిర్ణయానికి ఇరుపక్షాలా వారూ వస్తారు. వడ్డీలు, చక్రవడ్డీలు గుంజడం షావుకార్లకి న్యాయం అనితోస్తే ఆ గుంజడం వల్ల నెత్తురు తప్ప మరేదీ కక్కలేని వాళ్ళకి అది అన్యాయం అనిపిస్తుంది. అధర్మం అని తోస్తుంది. అందుకే వాళ్ళు ఎదురు తిరుగుతారు. అన్యాయం, అధర్మం అని వాళ్ళకి తోచకపోయినప్పటికీ వాళ్ళు తిరగబడతారు. ఎందువలన అంటే; బాధలు పెట్టే వారిపై బాధింపబడేవారు తిరగబడతారు. కనీసం తిరగబడడానికి ప్రయత్నమైనా చేస్తారు.
రంగంమీద ఈ నిజనాటకం జరుగుతూన్నప్పుడు ఎవరిది ధర్మ యుద్ధం? ఎవరి అధర్మయుద్ధం అనే నిర్ణయానికి ప్రేక్షకులు రావలసి వుంటుంది. అది ప్రేక్షక ధర్మం.
పోడు – పోరు అనే ఈ సంపుటిలోని అన్ని కథల్లోనూ నిజం వుంది. కథలు చెప్పిన అట్టాడ అప్పలనాయుడుగారిలో ఎంతో నిజాయితీ వుంది. జీవితాన్ని తరచి తరచి చూసి అందు గురించి స్పందించిన రచయిత మాత్రమే ఇటువంటి కథలు రాయగలడు; వేరొకడు రాయలేడు. వీటిలోని ప్రతిమాట, ప్రతివాక్యం, ప్రతి సామెత కూడా కథకుడికి వీటిలో చెప్పిన జీవితం గురించి కొంతకంటే ఎక్కువగానే సంబంధం వున్నదని తెలుపుతుంది. సంబంధం వుంది కాబట్టే ఆ జీవితం గురించి పాఠకులయిన మనల్ని ప్రేక్షకులుగా కూడా మార్చగలిగేడు.
జీవితాన్నీ పోరాటాన్నీ కంటికి కనిపించేలా చూపించగలిగిన ఈ రచయిత మనల్ని ప్రేక్షకులుగా మార్చి పోరాటపు మూలకారణాలు సత్యస్వరూపం తెలియజేసి ఇరుపక్షాల గురించీ ధర్మాధర్మ నిర్ణయాలు మనలనే తేల్చుకోమంటున్నాడు.
ఇందులోని కథలన్నీ చదివితే అధర్మయుద్ధానికి దిగేవారు ఎవరు, ఎవరు దాన్ని ప్రతిఘటించి ధర్మ యుద్ధం చేస్తున్నారు అనే విషయం ఆ చదివిన వారందరికీ తప్పక తెలుస్తుంది.
23-1-88
(అట్టాడ అప్పలనాయుడు ‘పోడు-పోరు’)
‘ఎన్నెస్ కోసం‘
ఎన్నెస్ ప్రకాశరావు :
చూపుకి మల్లెమొగ్గ
మనసు మాత్రం మందారం
తెలివికి సూర్యకిరణం
నీలికి అవతలా
ఎరుపుకు లోపలా కూడా
హృదయం కాదది నవనీతం
ఆశయం:
అధర్మానికి అపజయం
ధర్మానికి దిగ్విజయం
విప్లవానికి
ఎగరబోయిన ఇనపడేగ
వదలబోయిన రామబాణం
కాని, అంతలోనే
ముప్ఫయారు గంటలు
మృత్యువుతో భీకర సమయం
ఆ తర్వాత వీర మరణం
అతను శ్రీశ్రీ రాయని గేయం
మార్క్సు రాయని నవల
2-6-1988
(బి.టి.రామానుజం, ఎన్నెస్ కోసం : కథల సంపుటి ముందుమాట)
అవును నిజం
కాకర్లపూడి పతంజలి రాజుగార్ని నాకు తెలుసు. పతంజలి కూడా నాకు తెలుసు. కాని ఋషి పతంజలిని ఈ భాష్యం చదివాకనే తెలుసుకొన్నాను.
అయితే నాకు తెలిసిన పతంజలి ఋషిగా మారడంలో ఆశ్చర్యం లేదని ఈ ఆవేశపూరితమైన భాష్యం చదివేక అర్ధం చేసుకొన్నాను. ఆవేశంలో రాసిన వాళ్ళు తరచుగా అమాయకులే అవుతారు. ఆ అమాయకులైన వాళ్ళు అకస్మాత్తుగా జీవితం గురించి నిజాన్ని తెలుసుకొన్నప్పుడు నిప్పులుగా మారుతారు.
పతంజలి యిప్పుడు నిప్పుగా మారేడు. అలమండ వాస్తవ్యుడూ, మా తుంపాలవారి అల్లుడు అనే ఇంతవరకూ అనుకొన్నాను కాని యితను నివురు గప్పిన నిప్పు అని అనుకోలేదు. కాని జీవితంలోని కఠోర సత్యాలు ఈయన్ని నివురు దులిపిన నిప్పుగా తయారు చేశాయని యిప్పుడు అర్థం చేసుకున్నాను.
లోకంలో ఆవుల్ని ఆవులు తినవు. పులుల్ని పులులు తినవు. కాని చేపల్ని చేపలు తింటాయి. పాముల్ని పాములు తింటాయి. కాని మనం – మనుష్యులం కనీసం పులుల్లాగయినా కాకుండా సొరచేపల్లాగా, తాచుపాముల్లాగా వర్తిస్తున్నందుకు ఈ పతంజలి పరమ కుపితుడయ్యేడని నేను గ్రహించగలిగేను. నరమాంసభక్షణ ఈయనకిష్టం లేదు. అటువంటి భక్షణ చేయకూడదనీ, అది చేయరాని పని అని ఎవరికైనా సరే కారల్ మార్క్సే చెప్పనక్కర్లేదు, ప్రతి మతమూ అదే చెబుతుంది – ఒక్క ‘కాపిటలిజం’ అనే మత అటువంటి భక్షణ అతి మంచిదని చెప్పే దొంగవేషధారులపై ధ్వజమెత్తిన
చేతిలో పదును త్రిశూలమే ఈ భాష్యం రాసిన కలం. అందుచేత –
పతంజలీ
మహాకవీ శ్రీశ్రీ గారి మాటలతోనే నీ గురించి ముగిస్తున్నాను.
‘అవును నిజం అవును నిజం
అవును నిజం అవును సుమీ’
“నీవన్నది నీవన్నది
నీవన్నది నిజం నిజం”
జన విశాఖ
22-11-88
రా. విశ్వనాథశాస్త్రి
(కె.ఎన్.వై.పతంజలి ‘పతంజలి భాష్యం’)
శ్రీశ్రీగారి సలహా
మహాకవి శ్రీశ్రీ గారిని 1953వ సంవత్సరంలో విశాఖపట్టణం హిందూ రీడింగు రూమ్ మేడ మీద నేను తొలిసారిగా కలిశేను. రాచకొండ విశ్వనాథశాస్త్రి బదులు టూకీగా రావిశాస్త్రి అన్న పేరు అప్పుడే ఆయన నాకు తగిలించేరు. ఆయనతో మాట్లాడ్డానికి నేను చాలా భయపడ్డాను. ఆయన మహాకవే కాకుండా మహామేధావి అని కూడా అప్పటికే నాకు తెలుసు. ఆయనతో సరిపోల్చి చూస్తే నిజంగా నేను అల్పజీవినే. అప్పటికి ఆ ఒక్క నవలే నేను రాసినది కూడా. తెలుగు రాయడానికే నేను భయపడేవాణ్ని. అందుచేత ఆయన్ని తెలుగులో బాగా రాయాలంటే ఏం చదవాలి అని కొంచెం జంకుతో అడిగేను. అందుకు ఆయన చిన్నగా నవ్వి ఇంగ్లీషు బాగా చదవండి అన్నారు. అన్నాక కొంచెం ఆగీ చేమకూర వెంకటకవి రచించిన ‘విజయ విలాసం’ చదవమన్నారు. అదేకాకుండా విశ్వనాథ సత్యనారాయణగారు రాసిన ‘ఏకవీర’ చదవమన్నారు. ‘ఏకవీర’ గురించి ఆయన చాలా
బాగా చెప్పేరని కూడా నాకు గుర్తు.
కాగా పోగా, ఆయన ఇంగ్లీషు బాగా చదవండి అని ఎందుకు తరవాత ఆలోచించగా అందులోని అర్థం నాకు కొంతగా బోధపడింది అనుకుంటాను. ఆంగ్లభాష తెలుగు కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందిన భాష, తెలుగులో నేర్చుకోగలిగిన విషయాలకంటే ఆ భాష నేర్చుకుంటే చాలా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. రచయితకి ఎన్ని విషయాలు తెలిస్తే అంతమంచిది అని మహాకవి శ్రీశ్రీగారి అభిప్రాయం అయి వుంటుందని నాకు తోచింది.
ఇప్పుడు నేను కూడా ఆ అభిప్రాయానికే వచ్చేను.
జీవితం గురించి రచయితకి ఎంత ఎక్కువ తెలిస్తే అతని రచనలకి అది అంత ఎక్కువ ఉపయోగపడుతుంది. రామాయణం, మహాభారతం చదివితే అవి రచించిన వారికి మానవ స్వభావాల గురించే కాక వాటిలోని పాత్రల నిత్యజీవనం గురించి ఎంత ఎక్కువ తెలుసునో మనకి బోధపడుతుంది. ఇదే విషయం మనకి ఏ ప్రఖ్యాత రచయితల రచనలు చదివినా బోధపడుతుంది. టాల్ స్టాయ్ రచించిన ‘వార్ అండ్ పీస్’, విక్టర్ హ్యూగో రాసిన ‘లా మిసరబ్లా’, డికెన్సు మనముందు వుంచిన ‘పిక్విక్ పేపర్స్’ వగయిరా వగయిరా గ్రంథాలు ఏవి చదివినా మనకి ఈ విషయం అర్థం అవుతుంది.
చిరంజీవి బెజగం వెంటకరామకృష్ణ వయసుకి చిన్నవాడు అయినా ఊహకి పెద్దవాడు అని నాకు తోస్తూంది. అయితే ఊహ ఒక్కటే వుండి ప్రయోజనం లేదు. దానికి తగ్గ కృషి కూడా వుండాలి. ఇప్పటివరకూ ఈయన రాసిన రచనలు చదివితే వయసుకి తగ్గకంటె కూడా ఎక్కువ కృషి వుందని తెలుస్తూంది. ఆ కృషిలో కూడా వైవిధ్యం వుంది. అందుచేత కల్పనా సాహిత్యం కూడా చేపడితే కొన్నాళ్ళకి ఈయన రచనలు విరివిగా వస్తాయనీ వేలాది పాఠకుల చేతుల్ని అలంకరిస్తాయి అనీ నేను తప్పక నమ్ముతున్నాను.
30-7-1991
‘రవితేజ హితశతకమ్‘
ఇతను గంటి ఉమాపతిశర్మ. నేను రాచకొండ విశ్వనాథశాస్త్రిని, నాకంటే చాలా చిన్నవాడు. అల్లరి వైద్య విద్యార్థిగా ఇతను ఉన్నప్పటినించీ నాకు తెలుసు. కాని ఇతను చిల్లర విద్యార్థి అని మాత్రం నేను ఎన్నడూ అనుకోలేదు. సహవాసదోషం ఇతనికి ఒకప్పుడు సంక్రమించింది. అంటే ఇతను ఒప్పుకోకపోవచ్చు. కాని – అతను కోప్పడినా సరే నేను ఒప్పుకుంటాను. ఉమర్ ఖయ్యాం గారి ఉద్యానవనం అనే చెరలోకి అక్కడి మనోహరమైన పుష్పాలని చూసి మనసు పట్టలేక ఇద్దరం అందులోకి కళ్ళు తెరుచుకొని నడచి వెళ్ళేం. కాని అది వనమే కాని ఉద్యానవనం కాదు అని తెలుసుకొని, అక్కడి ముళ్ళ బాధా, పాముల బాధా, ఘోర మృగాల క్రూర బాధ భరించలేక బైటపడగలిగేం.
వైద్యుడిగా శర్మ, నీ జబ్బు ఏమిటో (ఉంటే) చిటికలో పోల్చగలడు. చికిత్స నిమిషాల మీద చెయ్యగలడు. ఛాయాగ్రాహకుడిగా కంటిలో చురుకు ఉంది. చేతిలో ఉంది. సంగీతం కోసం మరి అతను ఏనాడో రెండు చెవులూ కోసేసుకున్నాడు. ఇవన్ని నాకు ఇదివరకే తెలుసు.
కానీ –
శర్మని కవిగా చూసేక నేను సంభ్రమాశ్చర్య సంతోషాల్లో మునిగిపోయి తేలియాడేను. ఇతను మబ్బు విడిచిన చంద్రుడు. గ్రహణం విడిచిన సూర్యుడు, ఉమాపతి పేరుకాని నిజానికి అక్షరకన్యకి కవితానాధుడు.
ఆలస్యం అమృతం విషం అంటారు. ఇతను ఆలస్యం చేస్తే చేసేడు కాని, ఇతని విషయంలో విషకుంభం అమృతభాండం అయ్యింది.
2-1-1993
(‘రవితేజ హితశతకమ్’ – డా. గంటి ఉమాపతిశర్మ)
శ్వేత రాత్రులు
ఈ కథలన్నీ చాలా బాగున్నాయి. ఇవి చదివితే మనిషిని మరో మనిషి ఎలా దగా చేస్తున్నదీ, ఏ విధంగా దోపిడీ చేస్తున్నదీ తెలుస్తుంది. దోపిడీని, దగాని గరించే వారందరికీ ఇవి నచ్చుతాయి. అలా చేయడం మంచిదనుకునే వారికివి నచ్చవు.
25-6-1993
(‘శ్వేత రాత్రులు’, కథాసంకలనం)
* * *
