వ్యక్తిస్వామ్యమే ఆర్డర్ ఆఫ్ ది డే

Spread the love

యాభై ఏళ్లుగా అక్షరాలతోటే నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్న  గోవిందరాజు చక్రధర్ రాత-కూతే జీవితమనుకున్నారు. అక్షరసేద్యంలో బోలెడన్ని పుస్తకాల దిగుబడులు.అంచనాలు తప్పి కొన్ని ఇంట్లోనే దిగబడిపోయినా దిగులు పడక ధైర్యంగా అడుగు ముందుకేశారు. రెండు నవలలు, కొన్ని కథలు చెక్కారు.అనువాదాలు చేశారు. జర్నలిజం పుస్తకాలు రాశారు. వందల వ్యాసాలతో పత్రికలకెక్కారు. వీడియో విశ్లేషణలు సరేసరి. పబ్లిషర్ గా ఎక్స్ ట్రా రోల్. రామోజీరావు: ఉన్నది ఉన్నట్టు పుస్తకంతో తన వైపు చూపు మరల్చేలా చేసిన చక్రధర్ తో ఉదయిని సంభాషణ.

తన రచనా వ్యాసంగంతో మొదలుపెట్టి, ప్రచురణ రంగం తీరుతెన్నుల మీదుగా, వ్యవస్థలు, రాజకీయాలు, అమెరికా ఆధిపత్యధోరణుల దాకా చర్చించారు. పదండి ముందుకు.

నాణేనికి రెండు ముఖాలను పట్టి చూపే ప్రయత్నం చేసిన పుస్తకం రామోజీరావు-ఉన్నది ఉన్నట్టు. సోషల్ మీడియాలో కొంతమేర మిత్రులు రివ్యూలు,పరిచయాలు రాశారు.ఎందుకోగానీ పెద్ద పత్రికలు ఈ పుస్తకాన్ని సమీక్షించే సాహసం కూడా చేయలేదు. రామోజీరావు మరణించేవరకూ మార్గదర్శి కేసు వివాదంతో వార్తల్లో ఉంటూనే వచ్చారు. కన్ను మూశాక మరో కోణంలో చర్చకు వస్తూనే ఉన్నారు. రామోజీ గురించి భిన్న అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు.

   అయితే మరణించాక శ్రుతిమించి కీర్తిగానాలు చేయడమే దారుణం. సి.పి.ఐ వారి సి.ఆర్. ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో  జరిపిన సంతాప సభలో రామోజీరావును ఆకాశంలో నిలుపుతూ ఇంద్రుడు చంద్రుడంటూ స్తుతిగీతాలు పాడారు. మరోపక్క చినజియ్యర్ స్వామి నిర్వహించిన సమతా ఇళయరాగం  కార్యక్రమంలో రామోజీరావు తనకెంతో సన్నిహితులని చెప్పుకున్నారు.ఆయన ఆత్మ ఆ భగవద్ సన్నిధికి చేరాలనీ ఆకాంక్షించారు. సభికులందరితో, నాస్తికుడైన రామోజీరావు ఆత్మకు శాంతికలగాలని చెప్పి నిమిషం మౌనం పాటింపజేశారు. సాధారణంగా స్వామిజీలు సదా భగవన్నామస్మరణలో మునిగి తేలుతూ ధర్మపరిరక్షణకు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. కానీ చిన జియ్యర్ స్వామి సినిమా పాటల కచ్చేరి ఏర్పాటు చేయించటమే గాక, ఆ సందర్భాన్ని రామోజీరావు ఘనతను చాటేందుకూ వాడుకున్నారు. ఆయన సమక్షంలో ఇళయరాజా బృందం ప్రేమగీతాలాపనతో సంగీతాభిమానులను అలరింపచేశారు . తన దృష్టిలో ప్రతి ప్రేమ గీతమూ భక్తిగీతమేనని ఇళయరాజా సరికొత్త భాష్యం చెప్పారు.

    ప్రభుత్వ లాంఛనాలతో తెలంగాణ సర్కార్ అంత్యక్రియల నిర్వహణకు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి విజయవాడలో అధికారికంగా సంతాపసభను గ్రాండ్ గా నిర్వహించింది. రామోజీరావుకు, ఎన్.టి.రామారావుకు భారతరత్న ప్రకటించేందుకు కృషి చేస్తామని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, విశాఖలో రామోజీ చిత్రనగరి నిర్మిస్తామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. తెలుగు పత్రికల్లో సంతాపసభకు సంబంధించిప్రభుత్వం ఫుల్ పేజి ఎడ్వర్ టైజ్ మెంట్ విడుదల చేసింది. ఈనాడు వారు కూడా రామోజీ సంతాప సభ పేరిట ఆదాయం పొందగలిగారు. ఇదే  సభలో రామోజీ గ్రూప్ తరపున కిరణ్ పదికోట్ల విరాళాన్ని అందచేశారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి కోసం ఆ నిధులు వెచ్చించాలని కిరణ్ సూచించారు. ఇంతవరకూ బాగానే ఉంది. రాగల ఐదేళ్లలో ఈనాడుకు ఎన్ని ఫుల్ పేజీల ప్రకటనలు ప్రభుత్వం విడుదల చేయనున్నది?వాటి ద్వారా ఎన్ని వందల కోట్ల ఆదాయం సమకూరనున్నది?వేచి చూద్దాం.

   ఇవన్నీ చూస్తుంటే మనం ఎటు పోతున్నాం? అనే సందేహం కలుగుతుంది. లాభార్జనే ధ్యేయంగా పని చేసిన ఒక వ్యాపారవేత్త కోసం ఇంతగా హద్దులు మీరిన ఉత్సాహం, ఔదార్యం ప్రదర్శించడంలో ప్రజాప్రభుత్వాల వివేచన ఏమిటి? మునుముందు పద్మవిభూషణ గ్రహీతలైన తెలుగు ప్రముఖులకూ ఇదే విధమైన పాలసీలనూ వర్తింపచేస్తారా? మొత్తానికి రామోజీ ప్రభావాల వేళ్ళు  మన ఊహకందని రీతిలో ఎక్కడిదాకా విస్తరించాయో తేలిగ్గానే గ్రహించవచ్చు. ప్రజాప్రయోజనాల పేరిట పాక్షిక సత్యాలనే వార్తలుగా గుమ్మరిస్తూ నిష్పాక్షికత కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు. రామోజీరావుకి సంబంధించిన అన్ని కోణాలను తెలియచెప్పటానికి చేసిన ప్రయత్నమే ‘రామోజీరావు: ఉన్నది ఉన్నట్టు.’

 నా అనువాదాల్లో ఎక్కువభాగం మిత్రులతో కలిసి చేసినవి. అదొక సమష్టి వ్యవసాయం. తెలుగు వారి చరిత్రను చెప్పే 25 దాకా ప్రామాణిక ఇంగ్లీషు పుస్తకాలను ఎంచుకుని ఒక ప్రాజెక్ట్ గా అనువాదం చేస్తూ వచ్చాం. ఎక్కువ భాగం పుస్తకాలను ఎమెస్కో ప్రచురించింది. మిత్రులు కాకాని చక్రపాణి,దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి, జనప వెంకట రాజం సహ అనువాదకులు. వ్యక్తిగతంగా కూడా చాలా జీవితచరిత్రలు అనువదించాను, రాసిపెట్టాను. అనువాదం పూర్తయినా పలు కారణాల వలన అచ్చుకాని పుస్తకాలు ఐదారువరకూ ఉంటాయి.

  అనువాదాలు ప్రోత్సాహకరంగా లేవు. పాఠకాదరణ అంతంతమాత్రమే. మూల భాషలో బాగా ఆదరణ పొంది, ఆ రచయితకో, పుస్తకానికో జాతీయస్థాయి గుర్తింపు దక్కినప్పుడు తెలుగులో అనువాదం చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

            హిందీ,గుజరాతీ, రాజస్థానీ వంటి భాషల సంగతి పక్కన పెడదాం. పొరుగున వున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో సమకాల ప్రముఖ రచయితల పేర్లు కొన్నయినా మీకు తెలుసా? అంటే తెల్లముఖం వేయాల్సిందే. తమిళ పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువాదం చేసేందుకు అక్కడి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇలా తమ భాష,సంస్కృతుల వ్యాప్తికి పాటుపడుతున్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్దిష్ట పాలసీ కాదు గదా, ధ్యాస, శ్రద్ధ కూడా లేవు. ఇంతటి నిరాశామయ వాతావరణంలో ఎవరు మాత్రం సమయాన్ని, డబ్బుని వెచ్చించి అనువాదాలకు సిద్ధపడతారు. నిజానికి అనువాదకులది రెండో స్థానమే. మూల రచయిత కొచ్చిన గుర్తింపు అనువాదకుడికి లేదు. వ్యక్తిగత విశ్వాసాల,సిద్ధాంతాల పరివ్యాప్తి కోసం కొందరు అనువాదాలు చేస్తున్నారు. ఇక్కడ లాభాపేక్ష ప్రసక్తి లేదు.

కాకాని చక్రపాణితో కలిసి గోరంత దీపం, ది ఘోస్ట్ నవలలు రాశాను. ఆంధ్రప్రభ, జాగృతి పత్రికల్లో  సీరియల్ గా వచ్చాయి. ఆ తర్వాత పుస్తకాలుగా కూడా తెచ్చాం. నిజానికి ఘోస్ట్ రైటింగ్ అనేది వివిధ స్థాయిల్లో ఉంది. ఒకప్పుడు వారపత్రికల్లో సీరియల్స్ కు బాగా ఆదరణ ఉన్న కాలంలో పేరొందిన రచయితలు, రాత ఒత్తిడి కారణంగా ఇతరుల సేవలు పొంది తమ పేరిట చలామణి చేసుకునే వారు.సినిమా ఫీల్డ్ లోనూ ప్రసిద్ధులనేక మంది అజ్ఞాత రచయితల చేత రాయిస్తున్నారు. ఇలాంటి వారిలో  కొత్తవారే కాకుండా సీనియర్లూ ఉన్నారు. సొంతగా ప్రయత్నాలు చేసి అవకాశాలు పొంది తమ పేరుతో రాసుకోవటం కంటే,పేరున్న డైలాగ్ రైటర్ దగ్గర ఘోస్ట్ గా పని చేయడమే లాభసాటి అని భావిస్తున్నవారు ఉన్నారు. ఇక రాజకీయనేతలకు ప్రసంగాలు రాసే పిఆర్వో వ్యవస్థ ఉండనే ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీకి  శారదా ప్రసాద్ అనే ఆయన ప్రసంగాలు రాసిపెట్టే వారు. ఇప్పటి నేతలు ప్రసంగాలకే వీటిని పరిమితం చేయడం లేదు. ఫోటో షూట్ లో ఎలా మెలగాలి?ఏ సందర్భంలో ఏ వస్త్రధారణ చేయాలి? ఎలా మాట కలపాలి?దగ్గర్నుంచి ఇమేజి కోసం నానాతిప్పలు పడుతున్నారు.

  ఇక మా నవల పాపులర్ కాకపోవటానికి దాని పేరు కొంత కారణం. ది ఘోస్ట్ అనగానే ఇదేదో దయ్యాల భూతాల కథ అనుకున్నారు. ‘ది ఘోస్ట్ రైటర్’అని పెడితే కొంతమేరకు పాఠకులకు పట్టేదేమో! ఇప్పటి మాదిరి వివాదం ప్రచారం చేయగలిగే యూట్యూబ్ వేదికలు అప్పట్లో లేవు.

  కొన్ని కథలు రాసినా ఆ ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను. ఎకడమిక్ జర్నలిజానికి ఎక్కువ సమయం కేటాయించడం, ఆయా సబ్జెక్ట్ లపై పుస్తకాలు రాయడం,పబ్లిషింగ్ లో తలమునకలుగా ఉండటం కొంత కారణం. పత్రికల వ్యాసాలు,సన్మాన పత్రాలు,కరపత్రాలు మొదలుకుని అన్ని ప్రక్రియల్లో రాసినా జర్నలిస్టుగా ఎక్కువమందికి తెలిశాను. ప్రతివారికీ  ఈ రకమైన బ్రాండింగ్ ఉంటుంది.

రాసేవారు పెరిగారు. పత్రికలు మూతపడినా బ్లాగులు, వెబ్ సైట్ల వంటి విస్తృత వేదికలు రచయితలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బ్లాగులోనో, ఫేస్ బుక్ లోనో కవిత్వమో, యాత్రా కథనమో రాసినా, పుస్తకంగా అచ్చేసుకుంటేగానీ దానికి గుర్తింపు, స్థానం దక్కడం లేదు. ఒక్క కథాసంకలనం తోటే మంచి పేరు, గుర్తింపు పొందుతున్న యువరచయితలున్నారు. పబ్లిషర్లు ముందుకు రాకపోవడంతో, సెల్ఫ్ పబ్లిషింగ్ పెరిగింది. మంచి గెటప్ లో, జిగేల్ మనే పేపర్ తో, అట్టహాసాలతో ఖర్చుకి వెనుకాడకుండా సొంతంగా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. ఆవిష్కరణ సభలతో ప్రచారమూ చేసుకుంటున్నారు.

   సంస్థాగత పబ్లిషింగ్ లో స్క్రిప్ట్ సెలక్షన్, ఎడిటింగ్ వంటి కొన్ని వడబోతలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి అవకాశం లేదు. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు, అచ్చుకు అర్హమా? కాదా? అనే దాంతో నిమిత్తం లేకుండా దేశం మీదకు అచ్చోసి వదులుతున్నారు.

            మరో ప్రక్క పుస్తక విక్రేతలు అమ్మాక, డిస్కౌంట్ పోను మిగిలిన డబ్బులు ఇవ్వడం లేదు. రచయితే సోషల్ మీడియా ద్వారా ప్రచార వేదికలు కల్పించుకుని సొంతగా అమ్ముకుంటున్నారు. బాగుందని పేరొస్తే పాఠకులు కొంటున్నారు.నెమ్మదిగానైనా కాపీలు కదులుతున్నాయి.

ఆదర్శం, సిద్ధాంతం, సమష్టితత్వం – ఒకప్పుడు వ్యవస్థలకు కొంగు బంగారమై భాసిల్లాయి. సామాజిక,రాజకీయ,సాహిత్య రంగాలన్నింటికీ ఇదే సూత్రం వర్తించేది. స్వాతంత్ర్య పోరాటమైనా, సామాజిక చైతన్య ఉద్యమమైనా, అరసం, విరసం, దిగంబర, పైగంబర వంటి సాహిత్య ఉద్యమాలైనా, వ్యక్తిస్వామ్యం కంటే సమష్టితత్త్వం ప్రస్పుటంగా కన్పించేది. కమ్యూనిస్టు పార్టీలకూ ఇదే ఆదర్శం. అయితే వ్యక్తులే లేకుండా వ్యవస్థలుండవు. గతంలో కూడా క్రియాశీలకంగా లీడ్ రోల్ లో నిలిచిన వ్యక్తులున్నారు. ఆ పరిస్థితి వేరు. సిద్ధాంతాలూ, ఆదర్శాలూ  వెనక సీట్లోకి వచ్చాయి. ఆ పార్టీ ఈ పార్టీలనే తేడా లేదు.అంతటా వ్యక్తి ప్రాధాన్యమే. మోదీ, సోనియా, మమత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, కే సి ఆర్ ల వరకూ ఏ పార్టీలో చూసినా ఒకరిదే హవా. వారి మాటకే చెల్లుబాటు.వారి మాటే శాసనం. వారి కనుసన్నల్లో మెలుగుతూ ప్రజాసేవలో తరిస్తూ, జీవితాలను ధన్యం చేసుకోవాలని ఉబలాటపడుతున్నారు. కేరళ, త్రిపుర, బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ ప్రాబల్య రాష్ట్రాల్లోనూ వ్యక్తిస్వామ్యం-ఇప్పుడు వీస్తున్న గాలి. కేరళలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్, మార్క్సిస్ట్ పార్టీ అధిష్టాన చట్రంలో ఇమడనంతగా ఎదిగాడు. విజయన్ ను కాదని పార్టీ పెద్దలూ ముందుకు వెళ్ళలేని స్థితి.

   కారు చీకటిలో కాంతి రేఖలా ఆశావహ పరిస్థితులు లేకపోలేదు. వ్యక్తిగత చొరవ, కమిట్మెంట్, మంచి పనులకు బాటలు వేస్తున్న సందర్భాలున్నాయి. పార్టీలు సంస్థాగతంగా చేయలేని పనులను, ఆయా పార్టీ సిద్ధాంతాలకు అంకితమైన వారు వ్యక్తిగత స్థాయిలో కొనసాగించగలగటం అభినందనీయం.

మతం గురించి ఎక్కువగా దృష్టి పెట్టి మాట్లాడుకుంటాం గానీ, నిజానికి మతం కంటే కులతత్వం రానురాను మరింత బాగా వేళ్లూనుకుంటోంది. బిజెపిని మతపార్టీగా ముద్రవేయడమూ తప్పే. వారిది ఓట్ల పార్టీ. హిందూ ఓటు బ్యాంకు తమ అవసరం తీర్చేవరకూ బిజెపి ఆ పాట పాడుతుంది. మతం పేరిట ఓట్లు రాలవని తేలిపోయాక దండిగా ఓట్లు కురిపించే మరో భావోద్వేగ ఎజెండాను పుచ్చుకుంటుంది. బిజెపి అనుసరిస్తున్న పంథాలోనే ఏదో ఒక రూపేణా అన్ని పార్టీలు పయనిస్తున్నాయి.

  ఏ నియోజకవర్గంలో ఏ కులం ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారో చూసి ఆ కులపు అభ్యర్ధిని ప్రతి పార్టీ ఎంపిక చేస్తోంది. ఓటర్లు కూడా మనోడు అనే సానుకూల నిర్ణయం తీసుకుంటున్నారు. ఇద్దరు అభ్యర్ధులూ ఒకే కులానికి చెందిన వారైనప్పుడు ఇతర స్థానిక అంశాలు, డబ్బు, అభ్యర్ధి వ్యక్తిగత ఇమేజికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అటూ యిటూ చేసి ఆధిపత్య కులాలే రాజ్యాధికారాన్ని చేపడుతున్నాయి. ఈ వంతు నీకైతే, మరోసారి నా వంతు అనే కుర్చీలాట కొనసాగుతోంది. ఓట్లు మావి సీట్లు అధికారం మీకా? అని బి.సి, ఎస్.సి, ఎస్.టి వర్గాలు ప్రశ్నిస్తున్నా వారి గోడు అరణ్యరోదనగానే మిగులుతోంది.

     క్రైస్తవం పుచ్చుకున్నవారిలో దళిత క్రైస్తవులు,రెడ్డి క్రైస్తవులు ,కమ్మ క్రైస్తవులు,బ్రాహ్మణ క్రైస్తవులుగా కూటములుగా విడిపోయి ఉన్నారు. హిందూ, ఇస్లాం మతాలు కూడా ఇందుకు అతీతం కాదు. మావోయిస్టు లాంటి విప్లవపార్టీల్లో కూడా ఆధిపత్య కులాలే మొదటినుంచీ నిర్ణేతలు, సారథులు. అంతర్జాతీయ  స్థాయిలో కులసమ్మేళనాలను సగర్వంగా, కదనోత్సాహంతో జరుపుకునే స్థితికి ఎదిగినందుకు నవ్వాలో, ఏడ్వాలో తెలీటం లేదు. ‘నేను ఫలానా కులం వాడిని’ అని చెప్పుకోవటానికి  సిగ్గుపడాల్సిన ఈ ఆధునిక కాలంలో మేం ఫలానా కులం వారమని ఛాతి విరుచుకుని గర్వంగా చెప్పుకునే దాకా పరిస్థితి వచ్చింది. మా సంస్థలో మా కులంవారికే ఉద్యోగాలిస్తాం, వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండని  రేపు ప్రకటనలు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే పైకి చెప్పినా చెప్పకున్నా  చాలా సంస్థల్లో కుల ఆధిపత్యం, మెజారిటీ కొనసాగుతోంది. ఇక్కడి దాకా వచ్చాం కనుక, మా సంస్థ ఉత్పత్తులు, సేవలు మా కులం వారికే పరిమితం చేస్తున్నామని ప్రకటించగలరా?పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్లుగా ఉంది పరిస్థితి.

   మానవజాతి పరిణామ క్రమంలో ఉండి, ఆ పరిణామ క్రమానికి ఊతంగా నిలవాల్సిన కర్తవ్యం సాహిత్యానిదే. ఎన్ని రకాల ప్రక్రియలు, వాదాలు, సిద్ధాంతాలు సాహిత్యంలో ఉన్నా నదులన్నీ సాగరంలో కలిసినట్లు, మానవ వికాసానికి, అభ్యున్నతికి సంస్కారానికి దోహదపడటమే వాటన్నిటి లక్ష్యం. ఈ దిశగా సాహిత్యం ఎటువంటి ముద్ర వేస్తున్నదన్నదే ప్రశ్న.

   మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు నేర్చిన సమాజం ఏ మేరకు సాహిత్యాభిరుచి కలిగి వుంది, వారు చదువుతున్న సాహిత్యం ఏ మేరకు వ్యక్తి సంస్కారాలకు ప్రోది చేస్తున్నాయి? ఆలోచనా పంథాను మారుస్తున్నాయి?అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

  నిజానికి జాతీయవాద సాహిత్యంగా చెప్పబడే ఆర్.ఎస్.ఎస్. వారి ఆలోచనా ధార ప్రభావం కమ్యూనిస్ట్ సాహిత్యంతో పోల్చి చూస్తే చాలా బలహీనమైనది. యువతను నేటికీ ఉర్రూతలూగిస్తున్న శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక్కటే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను ఏర్పరచి ఉండాల్సింది.కానీ అలా జరగలేదు.సాహిత్య పఠనం, అభిలాష ,సామాజిక స్పృహ కమ్యూనిస్టుల్లో ఎక్కువే. మొదటి నుంచి కమ్యూనిస్టులు ప్రభావశీల బృందంగానే ఉంటూ వస్తున్నారు. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వారే ముందుండేవారు. ప్రజా సమస్యలపై గొంతెత్తడంలోనూ వారే చొరవ తీసుకునేవారు. పత్రికలు,పుస్తక ప్రచురణ రంగాల్లోనూ వారే చురుగ్గా పని చేస్తూ వచ్చారు. ఇన్ని సానుకూలతలున్నా ప్రజల విశ్వాసం పొంది, ప్రభుత్వాల్లోకి రావటంలో నానాటికీ వెనుకబడిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలకు తోకలుగా మిగిలిపోతున్నారు.

   మరోపక్క జాతీయవాద సాహిత్య ప్రభావం పరిమితంగానే ఉన్నా,మతపరమైన భావోద్వేగాలు ప్రజలను బలంగా కదిలిస్తున్నాయి. కమ్యూనిస్టులు, బిజెపి పై ధాటిగా విమర్శలు చేస్తున్నామనే భ్రమలో, సామాన్య ప్రజానీకంలో గూడు కట్టుకుంటున్న  భయాలను మరింతగా ఎగదోస్తూ , బిజెపికి పరోక్షంగా మేలు చేస్తున్నాయి. మత ప్రభావాన్ని,పాత్రను పరిమితం చేసే జ్ఞానబోధ చిట్కాలేమి కమ్యూనిస్టుల దగ్గర ఉన్నట్టు లేవు.

కుల, మత విషయాలే కాదు,ఎన్నికల్లో అంతకుమించి ప్రభావం చూపిస్తున్న అంశాలు ఉన్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావటానికి దోహదపడింది కులమత అంశాలు కాదు. ఎన్నికల ప్రచారఘట్టం ముగింపులో బలంగా చర్చకు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ; వై యస్సార్  కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసింది. ఈ యాక్ట్ ద్వారా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తమ భూములన్నీ లాగేసుకుంటాడనే అనుమానం ప్రజలను భీతావహులను చేసింది. ఈ ఎన్నికల్లో జగన్ ఎదుర్కొన్న చేదు అనుభవమే కొన్ని దశాబ్దాల ముందు కమ్యూనిస్టులూ చవిచూశారు.

  1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రాబోతున్నారన్న ఊపు వచ్చింది. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే మీ భూములన్నీ లాగేసుకుని పేదలకు పంచుతారంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం అంతటి కమ్యూనిస్ట్ యోధులనూ మట్టి కరిపించింది. కాంగ్రెస్ ప్రచారం చివరి నిమిషంలో ఫలితాలను తారుమారు చేసింది. ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగాడు కనకే తెలంగాణ రాష్ట్రం సాధించి పదేళ్ళ పాటు కేసీ ఆర్ తిరుగులేని నేతగా చక్రం తిప్పగలిగాడు. తమ బతుకుల్లో ఆశించిన మార్పు కనబడకపోయేసరికి ఆ ప్రజలే కేసీ ఆర్ కు గుణపాఠం నేర్పారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అంశం సింగిల్ ఎజెండాగా ప్రజల ముందుకొస్తోంది. ఓ రకంగా జయాపజయాలనేవి గాంబ్లింగ్ గా మారాయి. ప్రజల పల్స్ పట్టటం కష్టంగా ఉంది. పార్టీ శాఖలు,కేడర్ నిర్మాణం, ఎన్నికల ప్రణాళికలు, ఉచిత పథకాలు – ఇవన్నీ సెకండరీ.

ప్రపంచీకరణ, టెక్నాలజీలో అనూహ్య మార్పులు – వినియోగతత్వాన్ని, వస్తు వ్యామోహాన్ని సామాన్యుల్లో సైతం పెంచి పోషిస్తున్నాయి. అత్యధిక జనాభా గల దేశాల మార్కెట్లను సరుకులతో ముంచెత్తి,ప్రచారంతో ఊదర గొట్టి అమెరికా కార్పొరేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. వేప పుల్లని కూడా అద్భుతంగా అమ్ముకోగలిగిన వ్యాపార ప్రచారంలో కార్పొరేట్లు ఆరితేరాయి. ఈ మార్కెట్ కాప్చరింగ్ ,వస్తువులకే పరిమితం కాలేదు. మన భాషల్ని, సంస్కృతిని , అలవాట్లని, ఆలోచనలను కూడా ముంచేస్తున్నాయి. ఆ ప్రవాహంలో మునగడమే తప్పించి,తేలడమెలాగో తెలీక సామాన్యుడు గుడ్లు తేలేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ రావడం ప్రజల మధ్య దూరాలను తగ్గించేసిందని అనుకుంటున్నాం.బంధాలకు మారాకులు తొడుగుతుందనీ భావిస్తున్నాం. కానీ దీనికి భిన్నంగా మనుషుల మధ్య అంతరాలను పెంచేసింది. ఎవరి లోకం వారిదిగా ,అందరిలో ఉన్నా కలివిడిగా లేకుండా మానసికంగా ఒంటరి వాడైపోతున్నాడు. యూత్ మీద ఇది మరీ చెడు ప్రభావం చూపుతోంది.

స్మార్ట్ ఫోన్ తో వచ్చిన టెక్నాలజీ సరికొత్త ఇంగ్లీషు పదజాలాన్ని వినియోగంలోకి తెచ్చింది. వాటి తెలుగు సమానార్థకాలని నిర్ణయించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా ప్రచార ఉధృతి, వినియోగ స్థాయి విస్తరిస్తోంది. దీంతో ఆ ఇంగ్లీషు మాటలే గ్రామ సీమల్లోనూ చలామణిలోకి  వస్తున్నాయి. వీడియో కాల్,చాటింగ్,వాట్సాప్,షేర్ ,మొబైల్ డేటా,ఇంటర్నెట్ వంటి మాటలనేకం తెలుగేనన్నంతగా  వాడకంలోకి వచ్చాయి. భాషకు ఈ పరిణామాలు తీవ్ర హాని కలిగిస్తున్నాయని భాషాభిమానులు ఎంత మొత్తుకున్నా  అడ్డుకునే దారులే కనిపించడం లేదు.

  పల్లెల్లోనూ ఇంటర్నెట్ చవకరేట్లకు చొచ్చుకుపోవడంతో,పిల్లల దగ్గర నుండి పెద్దల దాకా ఎల్లలు లేని సంస్కృతి ప్రభావానికి లోనవుతున్నారు. చైనా,అమెరికాలు పిల్లల కోసమే రూపొందిస్తున్న  వీడియో గేమ్స్ ,రెయిమ్స్ స్థానిక అలవాట్లను,సంస్కృతులను గట్టి దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు తల్లులు,చందమామ రావె జాబిల్లి రావె అంటూ తెలుగు పాటలు పాడుతూ పిల్లలకు బువ్వ తినిపించేవారు. ఇప్పటి తల్లులు ఆ అవసరమే లేకుండా స్మార్ట్ ఫోన్,ల్యాప్ టాప్ కట్టిపడేస్తున్నాయి. చెడుగుడు,బిళ్ళంగోడు,తొక్కుడు బిళ్ల ,గోలీలాట వంటి గ్రామీణ ఆటలు ఇకముందు పుస్తకాల్లో మాత్రమే చదువుకుని ఆనందించాలేమో?

  ఈ పరిణామాలన్నిటితో  ఎల్లలోకము ఒక ఇల్లయి  నవీన విశ్వమానవుడు అవతరిస్తే, అంతకంటే కావలసిందేముంది? కానీ జరుగుతున్నది అది కాదు. ఎటుపోతున్నాం మనం?

  *    *  *

గోవిందరాజు చక్రధర్‍

Spread the love

One thought on “వ్యక్తిస్వామ్యమే ఆర్డర్ ఆఫ్ ది డే

  1. Ramoji rao is not great guy —corruption // cheating //tdp puttuka —babu c.m — play
    Too much politics with his power and paper
    Too much land grabbed from telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *