అనుపపూల వాసన
శింగరేణి బొగ్గు, దుమ్మూ, నీళ్లుపడని బోర్లూ, తెల్లారగట్ల బొగ్గు పొయ్యిలూ… మంగలి పల్లెకి ఉన్న మస్తు స్పెషాలిటీలల్ల మా అవ్వ మంగలిగట్టవ్వ కూడా ఒకటి. అంత స్పెషల్ అయ్యేదానికి మా అవ్వ చాకలి ఐలవ్వ అంతటి యోదురాలో, ఐష్వర్యారాయ్ అంత అందగత్తెనో కాదు గనీ. మంగలి పల్లె పెద్దంపెట ఊళ్లల్ల పేరుమోసిన మంత్రసాని. మంత్రసాని అంటే చేతబడులు చేసే మంత్రగత్తె అనుకునేరు…. కాన్పులు చేసే ఎక్స్పర్టు లేడీ అన్నమాట. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆ ఏరియాకి పాపులర్ గైనకాలజిస్ట్. రెండూళ్లలో ఏ ఆడపిల్ల పెద్ద మనిషి అయినా గోళ్లు తీశేదానికి మంగలి గట్టవ్వ రావాల్సిందే, ఆ పిల్లకి పెళ్లై కానుపుకు వచ్చిందంటే మంగలి గట్టవ్వకు మత్లావ్ పంపేటోళ్లు. ఆ ఇంటికివొయ్యి పిల్లని చూశి. ఎన్నిరోజుల్ల కానుపు అయితదో అందాజ లెక్కలు కట్టి చెప్పి, ఆ రోజుల్లల్ల ఏ పనిమీద పోకుంట ఉండేది.
కానుపైనంక అవ్వబిడ్దల జాగ్రత్తలు సూసుకునుడు, పురుడురోజుదాంక తల్లిపిల్లలకు తానంబోసుడు మా అవ్వ పనే. ఎప్పుడన్నా అవ్వ దగ్గర లేకుంటే ఆ పని మా అమ్మ అనసూయ సూసుకునేటిది. ఆ ఇరవయొక్క రోజుల తర్వాత పురుడు వోసుకోని, పేరువెట్టినందుకు అవ్వకు ఓ యాబై రూపాలో, వందరూపాలో శేతులవెట్టి, పాత శీరే, ఓ జాకీటుముక్క పెట్టి, పురుడు దావత్ కోసం వండిన అన్నం, కౌసుకూరా ఓ గిన్నెల పెట్టి ఇచ్చెటోళ్లు అదే బంగారం. వాళ్లిచ్చిన పైసలు కొడుకులకూ, జాకీట్‌ముక్క అమ్మకో, చిన్నమ్మ రమకో ఇచ్చి. గిన్నెల తెచ్చిన అన్నం, కౌసుకూరా పిల్లలమైన మాకూ అన్నది ఓ రివాజ్ తీరు నడుస్తుండే.
ఈ కాన్పులు, మైలపోళ్లు కాకుంటా సైడ్ బిజినెస్ కింద రెండు బర్లు, ఓ పాలియ్యని ఆవుని కూడా సాదుకుంటా ఉండేది.
ఎండకాలం శెలువులల్ల ఓనాడు ఇంటికచ్చి “ఇంత శాయబొట్టున్నదానే బిడ్డా” అనుకుంట కూసున్నది. మిశినిమీద ఎవలకో పోశమ్మ శిల్కలు కుట్టుకుంట కూసున్న మా అమ్మ లేశి, గ్యాసునూనె స్టౌ మీద చాయెవెట్టి ఇచ్చింది. అక్కన్నే ఆడుకుంటున్న నన్ను పిలిశి “నానిగా జెర పెద్దంపెట పొలాలదాక అత్తవారా? ఇంత అరిగడ్డి వట్టుకద్దాం.” అని బొడ్లెసంచిలకెల్లి చిన్న దబ్బతీశి ఇంత నశం బీర్సుకున్నది.
“నీయవ్వ, నేను ఆడుకుంటాన, నేన్రాను.” శీదరిచ్చుకున్న.
“ఓ పెద్ద మొగోనివేగనీ, పొలాలలల్లకెల్లి అచ్చెటప్పుడు దోసకాలు తెచ్చుకుందాం రారా మిండెడా.” అని నవ్వుకుంట అన్నది. దోసకాయల మాట ఇన్వడంగనే సక్కగ అవ్వెనుక నడ్శిన. అప్పుడప్పుడూ, కిట్టక్కా, శిన్నమ్మా కూడా వచ్చేటోళ్ళు. ఇట్లా గడ్డి చేరేశేదానికి, కానీ అప్పుడెందుకో వీళ్లిద్దరూ లేరు.
ఇద్దరం కల్శి బైలెల్లినం, తుర్క ముస్లాయినే సైకిల్షాపు, మా రెండూళ్లకూ నడిమిట్ల ఉన్న మా సర్కార్ బడీ దాటి ఇటుకబట్టీల కాన్నుంచి పొలాల పొంట ఒడ్లల్ల నడుస్తున్నం. కొద్ది దూరం పోంగనే దయ్యాల రాలెశెట్టు కనవడ్దది.
మెల్లగా మా అవ్వదగ్గరికిదగ్గరికి పొయ్యి శెయ్యివట్టుకోని. “అవ్వా! గీ శెట్టుమీద దయ్యాలుంటయాటనే?, మొన్న మా దోస్తు దేవేశుకు కనవడ్డదాట.”
“ఎంత మోగోడు మీ దోస్తు? దయ్యం కనవడి ఏమన్నదాట? గుద్దమంచిగ కడుక్కొమ్మని శెప్పిందాటన?” నవ్వుకుంటనే నా శెయ్యి వట్టుకోని నడిపిచ్చుకుంట. “శిన్నపోరగాండ్లని ఏమనై దయ్యాలు. నేనుండంగ నీదగ్గరికి ఏ లంజత్తది. శెప్పు శీపిరందుకోని నాలుగు దెంగుతే అదేవోతది.” అని ఊకోలే. ఆ శెట్టు దగ్గరికి తీస్కపోయి “సూడు ఎంతపెద్ద శెట్టో ఎన్ని పిట్టలున్నయ్, ఉడుతలున్నయ్ ఇవ్వన్నిటికి లేని భయం మనకెందుకు.” అన్నది. అప్పుడు సూపర్ ఉమెన్ తెల్వదుగానీ ఆమె మా ఊళ్లె పుడితే మా అవ్వే ఆమెకు డెలివరి చేశి, పురుడుచేసి పేరు వెడ్తుండే.
అట్ల ముచ్చట్లు చెప్పుకుంటా పెద్దంపేట కల్లాలల్లకు పోయినం. శింగరేణి వల్ల మంగలిపల్లెల పొలాలు, శెల్కలు ఉండయిగానీ, పెద్దం పేటకు ఆ బాధలేదు. అంతో ఇంతో వ్యవసాయం ఉన్న ఊరే. మేం పోయేటాళ్లకు కొన్ని కల్లాలల్ల నాలుగెద్దులతోని బంతి కొడుతున్నరు. ఇంకొందరు వేరే కల్లంల తూర్పారవడుతున్నరు. ఇంకోకాడ గడ్డికూరిచ్చిన కచ్చురాలని మిఠాయిలేపి పెట్టిండ్లు. అందర్ని వల్కరిచ్చుకుంటా ఓ కల్లంకాడికి వోయినం. ఆ ఆసామి పేరు యాదికిలేదుగనీ. మనిషి యాదికున్నడు. మోకాళ్లమీదికి కట్టిన దోతీ, శేతులబనీను ఏస్కోని గడ్డిని ఎడ్లబండిల మోపుజేస్తాండు.
“ఏంది గట్టవ్వ మనువన్ని తీస్కచ్చినవ్, గడ్డిమోశేటోడైండా. ఇగ పెండ్లి జేసుడే పిలగానికి” అని ఆయినె అంటుంటే మస్తు శిగ్గనిపిచ్చి మా అవ్వ కడుపుల మొకం దాస్కున్న.
నవ్వుకుంట నవ్వుకుంటనే. “ఏదో ఉన్నమొగోడే పెద్దోడు తియ్యరాదయ్య, శాతనైనకాడికి మోసుకత్తడు.” అని అట్లనే నిల్సున్నది.
“అగో అటుదిక్కు ఇంతాంత ఉన్నది మోపుగట్టుకోపో” అని పక్కకు ఉన్న గడ్డికుప్పదిక్కు శెయ్యి జూపుకుంట అన్నడు. నా శెయ్యివట్టుకోని ఆ కుప్పకాడికి తీస్కపోయి మోపులు కట్టుడు సురువుజెశింది మా అవ్వ. నాకేమో కాయిశంతా దోసకాయలకాడ ఉన్నది. దోసకాయలంటే ఇప్పుడు సూపర్మార్కెట్లలో కనిపిచ్చే కీరాకాయలు కాదు. మూరెడు మూరెడు పొడుగుండేటియి, ఎండకాలం మొదలుకాంగనే పెద్ద గంపలల్ల నింపుకోని దగ్గరిపట్ల ఊళ్లల్ల అమ్ముకానికి అచ్చేటోళ్లు. కానీ కొనుక్కునేదానికి పైసలుండాలె కదా. పక్కపొంటి ఉన్న దోస శేను దిక్కు సూసుకుంట కూసున్న. నేను మోశేదానికి చిన్న మోపు కట్టి, తనకోసం గట్టిగనే పెద్ద మోపు కట్టుకున్నది మా అవ్వ. ఇప్పుడు దోసకాయలు అడుగాలే. పక్కపొంటి ఉన్న శేను దగ్గర కూసున్న ఆడామేదగ్గరికి పోవుకుంట “ఓ రాజవ్వో, బిడ్డ ఎట్లున్నది, ఏమన్న మాట చెప్పిందా?” పల్కరిచ్చుకుంట పోయి, ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడి మొత్తానికి రెండు పెద్ద దోసకాయలు కూడా పట్టుకచ్చింది. అవ్విట్ని పెద్దమోపుల పెట్టి జారిపోకుంట కట్టింది.
మెల్లగ సూర్యుడు ఎర్రవడుతుంటే ఊరిమొకం నడుస్తున్నం. ముంగట మా అవ్వా, ఎనుక నేను… కొద్ది దూరం అచ్చినంక అవ్వ దిక్కు సూశేటాళ్లకు ఉచ్చవడ్డది. అవ్వ ఎత్తుకున్న మోపుల ఓ పాము కదుల్తున్నది. అంతే… “అవ్వా…. పామే, పాము” అని ఒర్రుకుంట నా నెత్తిమీది మోపు కింద వారేశిన.
అయితే పాము నాదగ్గర ఉన్నదేమో అనుకొని, తన గడ్డి మోపుకూడ కిందవడేశి నాదగ్గరికి ఉరికచ్చింది.
“ఏడ, ఏడవిడ్డా పామేది?” అని గావర గావర నన్ను ఎత్తుకున్నది.
“నీ గడ్డిపోపులనే ఉన్నది, గింత పొడుగు” అని మోపుదిక్కు సూపిచ్చేటాళ్లకే కొద్దిగ పాము తోక బైటికచ్చింది. అవ్వ మెల్లఘ కాలుతోని మోపును పక్కకు నూకింది. రెండు దోసకాయల నడుమనుంచి మెల్లగ కదులుకుంట కట్టు మధ్యనుంచి బయిటికచ్చింది పాము. నన్ను గట్టిగ వట్టుకోని అట్లనే నిలవడ్దది అవ్వ. మెల్లగ మెల్లగ మోపులనుంచి బయటికచ్చిన పాము సర్రసర్ర బాటపక్కపొంటి ఎంపలి శెట్లల్లకు పోయింది. అప్పుడు నన్ను కిందికి దించి.. ఈపుమీద రెండు కొమటిదెబ్బలేశి, భయపదకు అదేమనది. అని మళ్లా మోపు దగ్గరికిపోయి ఇంకేమన్నా పురుగుబుశ్శి ఉన్నయేమో చూసింది. ఏం లెవ్వు, కానీ పాము తాకిన దోసకాయలు నాకు తినిపిచ్చుడంటే భయంబుట్టినట్టున్నది. ఆ రెండు కాయలూ తీశి మాదిగ యాదగిరి ఇటుకబట్టీలకోసం తవ్వినంక మిగిలిన నీళ్లగుంతలకు ఇశిరేశింది.
“లచ్చినంగోలె కాయలు, మనకు బాకిలేకపాయే.” అనుకుంట మళ్ళా నా మోపు నెత్తికెత్తి, ఆ పెద్దమోపును ఎత్తుకున్నది. అప్పటికే కొద్దిగా చీకటి పడ్డది, సల్లటిగాలి, దయ్యాల రాలెశెట్టు ఆకుల సప్పుడు ఇనుకుంటా నడుస్తున్నం. నాలుగడులు ఏశినంక కొద్దిదూరంలో ఉన్న శేను మీదినుంచి అనుపపూల వాసన కమ్మగ తాకుతుంది. శేనుకు ఉన్న దడికి ఉన్న పనుగడ తీసుకుంటా బయటికి వస్తున్న మనిషి “ఏంది గట్టవ్వో, పెద్దమోపే ఎత్తుకత్తున్నవ్? మంచిగనే జమజెశినవ్ గదా, అని నన్ను సూశి ఈ కోల్ల్యాగ ఏడిది? సార్ కొడుకా?” నా శెంపగిచ్చుకుంట మా అవ్వను పల్కరిచ్చిండు.
“ఆ పెద్దవిడ్డ కొడుకు పటేలా.” దోసకాలిప్పితనని గడ్డికి పట్టుకస్తే ఆ గాశారానికి అవ్వికూడ దొర్కలే.” అనుకుంట మోపు దొంచకుంటనే బొడ్లెసంచి దీశి నశం బీర్సుకున్నది.
“అనుప కాయలు కోశేదుండే, మా ఇయ్యంపుడు సచ్చిపోతే అటే తిరుగుడైంది. ఇగో పట్టుకపోతవా అనుకుంటా తువ్వాలల ఉన్న అనుపకాయలు సూపిచ్చిండు. నెత్తి మీది మోపు కిందదించి కొంగు సాపింది. ముట్టుకోకుంటనే కొంగులవోశిండు పటేలు.
“అయ్యో, ముత్తెమన్నే అయినయి గదనే ముసల్దానా, నేను పోతున్న గనీ ఇంకోనాలుగు కాయలు తెంపుకపో, పోయెటటప్పుడు జెరంత పనుగడ మంచిగ దగ్గరికేశిపో, లేకుంటే గొడ్లు సొత్తయ్.” అని బీడి ముట్టిచ్చుకుంట వోయ్యిండు.
అనుపకాయలనంగనే నాకు మస్తు సంబురమైంది. కొంగుల ఉన్నయి అట్లనే మూట గట్టుకోని ఇద్దరం శేన్లకు అడుగ్వెట్టినం. బాగ ఎత్తులేకుంట కుర్సగ ఏశిన పందిర్లకు అనుపతీగలు పాకిచ్చిండ్లు. నాకు అందుతలెవ్వుగని, అవ్వనే తెంపుతున్నది. తెంపిన కాయలు ఒకదగ్గర ఏశినం. అవ్వి ఒలిశి గుడాలేసుకుంటే మస్తుంటది… అనుకుంటా అన్నీ జమేస్తుంటే… అప్పుడచ్చిండి పటేలు పెద్దకొడుకు.
“ఎవ్వతే కాయలు తెంపుతున్నది, గొడ్లే అనుకుంటే మనుసులుకూడా మోపైండ్లా మా పానానికి. అనుకుంటా అచ్చుడచ్చుడే శేతికి దొరికిన ఓ బరిగె దీస్కొని అవ్వమీదిమీదికి అచ్చిండు”
“అట్లగాదు, పిలగా మీ బాపే తెంపుకపొమ్మడు, నాలుగు కాయల్ దెంపుకున్నం” అని చెప్పుకుంట గడ్దం పట్టుకోబోయింది.
అంతే, ఇంకా రేశానికచ్చిండు, “మంగల్లంజె నీ మొగందనుకున్నవా? తెంపుకపొమ్మంటే ఇగ మునుంబెట్టి మొత్తం ఖాళీ చేస్తున్నవ్..”
కోపంతో నిలువెల్లా వణికిపోయింది అవ్వ, కానీ ఒక్క మాట మాట్లాడలే, అప్పటిదాంక కొంగుల ఉన్న కాయలు కూడా అక్కన్నే కిందవోశింది.
“ఇగోనయ్యా, నీ సొమ్ము…” అని కండ్లల్ల నీళ్లత్తాంటే కూడా ఆపుకుంట నా శెయ్యివట్టుకోని శేన్లకెల్లి బయిటికచ్చింది.
ఇద్దరం ఎవలమోపులు వాళ్లం పట్టుకోని ఊల్లెకు నడ్శినం. ఇంటికచ్చి, మోపులు పెరట్ల పారేశినంక… పొయ్యికాడికచ్చి కూసున్నది. గౌండ్లోల్ల ఇంట్లకెల్లి లైటు బుగ్గ ఎలుగు మొకమ్మీద పడి, ఏడుస్తున్న అవ్వమొకం సూసుకుంట అట్లనే నిల్సున్న.
“నా శేతుల్లనే పుట్టిండు, గుద్దబట్ట సుట్టి, తానంబోశి, పేరువెట్టిన పోరడు, కక్కుడేరుగుడు వెడ్తే ఓనాడంతా ఆళ్లింటికాన్నే ఉన్న, పాలరుగుతలెవ్వంటే బొడ్డుపుల్లేశి బచ్చలాకు కప్పిన… ఈ మంగల్లంజె లేకుంటే ఇయ్యల ఆడే ఉండకపోవు.” అనుకుంటా కండ్లు తుడుసుకోని లేశి, జనార్ధన్ రెడ్డి పటేల్ దుకాండ్ల ఓ బిస్కీట్ పాకిట్ కొని నాకిచ్చింది, ఇద్దరం మా ఇంటిదిక్కు నడిశినం…
ఇప్పటికీ, ఎక్కడన్నా అనుప గుడాల్ కనిపిస్తే… ఆరోజు అనుపపూల వాసన యాదికస్తది. మా అవ్వ కండ్లల్ల నీల్లు యాదికస్తయ్.