22 ఏప్రిల్,2024 నిన్న పొందిన అలసటకుతోడు రాత్రి తెల్లవార్లు విపరీతంగా చలివేసింది. అయినా, డ్రైవర్లు చెప్పిన దాని ప్రకారం మేమంతా లేచి తెల్లవారు జామున నాలుగ్గంటలకల్లా తయారయ్యాము.
డార్జీలింగ్ నుండి టైగర్ హిల్స్ సుమారు 13 కి.మీ. దూరంలో వుంటుంది. నాలుగ్గంటలకే బయలు దేరాలనుకున్న మేము సుమారు ఇరవై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాము. నిజానికి అంత త్వరగా ఎందుకు అక్కడికి వెళ్ళాలో ఇథమిద్ధంగా నాకు తెలియదు. వాహనంలో ఎక్కిన తరువాత మా డ్రైవర్ని అడిగితే “అక్కణ్ణుండి చూస్తే సూర్యోదయం ఆద్భుతంగా వుంటుంది. అందుకే” అంటూ చెప్పాడు.
“ఇంతా చేస్తే మేము వెళ్ళేది సూర్యోదయం చూడ్డం కోసమా!? అది మేము కన్యాకుమారిలో చూసాము కదా? మరి దానికోసం ఇంత శ్రమపడాలా?” అనుకున్నాను.
వాహనాలు టైగర్ హిల్స్ రోడ్డు దిశగా ముందుకు సాగుతున్నాకొద్ది నా అభిప్రాయం మెల మెల్లగా మంచు మాదిరి పల్చబారి పోసాగాయి. ఎందుకంటే రెండు
పక్కలా చిక్కటి అరణ్యం. అద్భుతమైన లోయలు. వింత వింత పక్షుల కలకూజీతాలు. ధారాళంగా కురుస్తున్న ఇరయ్యో నెంబర్ తెల్లనూలు రెక్కదుప్పటి లాంటి మేఘ వినిర్ముక్త మంచు, పొరలు పొరలుగా వయ్యారి వన సుందరి శిరస్సున అలంకరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ మనస్సు మన ప్రమేయం లేకుండానే ఊర్ధ్వలోకాల్లోకి సాగిపోతుంటుంది. ఆ పరిసరాలను చూస్తుంటే నిజంగానే ఒకానొకప్పుడు అక్కడ పులులు, కుందేళ్ళ మాదిరిగా తిరిగి వుండవచ్చునన్పిస్తుంది. కొండ శిఖరం ఇంకా రెండు కి.మీ. దూరం వుందనగానే రోడ్డు మొత్తం మాలాంటి సందర్శకులను తోలుకొచ్చిన రక రకాల వాహనాలతో కాలు మోప సందులేకుండా నిండిపోయింది. మా డ్రైవర్లు అతి కష్టం మీద మరో కి.మీ.దూరం వాహనాలను ముందుకు లాగించినా చివరికి “ఇక మావల్ల కాదు. నడిచి వెళ్ళండి!” అంటూ కార్ల సమూహం మధ్యలోనే ఆపేశారు.
ఆ దైవీభూత అహ్లాదాన్ని ఆస్వాదిస్తూ నడవచ్చునన్న ఊహ మనసులో ఉర్రూత లూగుతుంటే నేను, నాతో పాటు జనార్ధన్ గారి దంపతులు అందరికన్నా ముందుగా కాళ్ళకు స్కేటింగ్ చక్రాలు కట్టుకున్నట్టు ముందుకు దూసుకుపోసాగాము. మామ్ముల్ని చూసి మా ఆవిడతో సహా మిగతావాళ్ళంతా వేగంగా
అనుసరించారు. వ్యూ పాయింట్ దగ్గరవుతున్నా కొద్ది నిట్ట నిలువుగా పైకెక్కవలసి రావడంతో తొడలు పట్టేస్తూ చాలా కష్టమనిపించసాగింది. ఇంకోకొక్క వంద మీటర్లు ఎక్కాల్సి వుందనగా పైనుండి “ హ్హో.. హ్హూ.. హ్హో..” అంటూ వందలాది మంది సందర్శకులు బాలార్కుని ఆగమనాన్ని వెర్రి ఆనందంతో ఆస్వాదిస్తూ గెంతులు వేయసాగారు. ఆ హోరుని వింటూనే మేము అప్రయత్నంగా మా తొడ కండరాల బాధను మర్చిపోయి, మా ముందున్న వంద మీటర్ల దూరాన్ని ఎలా? ఎంత వేగంగా అధిగమించి పైకి చేరుకున్నామో కూడా మాకు స్పృహే లేదు.
తూర్పు దిశలోని ఆకాశమంతటా స్వర్ణ వర్ణ జలతారు వస్త్రం పరిచినట్టుగా వుంది. ఆ వర్ణానికి భిన్నమైన మరో కాంతిమయ వర్ణంతో తేజరిల్లుతూ, సందర్శకుల అరుపులకు బెదిరిపోతున్నట్టుగా మాటి మాటికి మబ్బుల మాటున దాక్కుంటూ, వెలికి తొంగి చూస్తూ, అలనాడు వ్రేపల్లెల్లో గొల్ల భామలతో దోబూచులాడిన చిన్ని కృష్ణుని మాదిరిగా ఆ బాల భానుడు శిఖరం మీదున్న సందర్శకులతో దోబూచులాడుతున్న దృశ్యాన్ని చూస్తూనే మేమంతా వయసు అడ్డంకులను, అవసరంలేని భేషజాలను ఆవలకుతోసి, ఆదే మోపున మాకు ఎదురుగావున్న శిఖరపు చివరి అంచు దాగా జనం మధ్యలో నుండి ఈదులాడుతూ వెళ్ళాము.
ఆ మనోహర దృశ్యాన్ని మనసుతో వీక్షించి, మనసు పొరల్లో నిక్షిప్తీకరించుకోవడమేతప్ప బయటకు వ్యక్తీ కరించడానికి మరో మార్గం లేదన్నట్టు అలా చూస్తూనే, యాంత్రికంగా కొన్ని ఛాయాచిత్రాలను తీసుకున్నాము. ఇంతలో మిగిలిన మా బృందమంతా మమ్ముల్ని చేరవచ్చారు.
చూస్తున్నంతలోనే సందర్శకులంతా అక్కణ్ణుండి తేనెటీగల మాదిరిగా ఎక్కడి వాళ్ళు ఆక్కడ మాయమై పోసాగారు. మేము మాలాంటి వాల్లము మరి కొందరం మంచు తెరల మధ్య నుండే చూసాయగా నైనా ‘ కాంచన్ జంగ్’ పర్వతం కనిపిస్తుందేమోనని ఆశగా ఎదురు చూసాము. కానీ, గత వారం రోజులుగా పొగ మంచు కమ్మడం లంగా సందర్శకులేవ్వరికీ దాన్ని చూసే అవకాశం లభించడంలేదని అక్కడున్న స్థానికులు చెప్పుకొచ్చారు.
ఇక్కడ మనం కొంత దూరం కాలంలో వెనక్కి వెళ్ళి బ్రిటీష్ వారి కాలంలో ఆగుదాం. పందొమ్మిదో శతాబ్ధిలో బ్రిటీష్ వాళ్ళు వేసవి తాపం నుండి తమను తాము రక్షించుకోడానికి కలకత్తా నుండి ఇక్కడికొచ్చి విడిది చేసేవారట. అటువంటి సందర్భంలోనే వారు ‘కాంచన్ జంగ్’ హిమ నగం మీద ప్రభాత సూర్యుని వైభవోపేత
ఆవిర్భావాన్ని చూసి చకితులై పోయేవారట. అదుగో అప్పటి నుండి ఈ టైగర్ హిల్స్ మీద నుండి హిమాలయ శ్రేణుల మీద పొద్దు పొదుపు సూర్యుని సోయగాన్ని చూడాలన్న తహ తహ లకు బీజాలు పడ్డాయట. అది నేటికీ అంతర్జాతీయ సందర్శకులను విపరీతంగా ఆకర్షించే ప్రధాన సందర్శనీయ క్షేత్రమయ్యింది.
కన్యాకుమారి లాంటి సముద్రతీర ప్రాంతాల్లో చూసే సూర్యోదయానికి ఇక్కడ హిమాలయ పర్వత శ్రేణుల మీద చూసే సూర్యోదయానీకీ మధ్య ఊహించ లేనంత వ్యత్యాసం వుంటుందన్నది కాదనలేని సత్యం.
మరికొద్దిసేపు అక్కడే గడిపిన మేము మెల్లగా వెనుదిరిగి కిందికి దిగుతుండగా మమ్ముల్ని ఎక్కడో దించిన మా వాహన చోదకులు వాటిని తీసుకొచ్చి సరీగ్గా మెట్ల పక్కనే వుంచారు. దాంతో మా వాళ్ళంతా “హమ్మయ్య రెండు కి.మీ. నడిచే బాధ తప్పిందిలే” అనుకుంటూ సంతోష పడసాగారు.
అంతలో నేను, ఆ పక్కనే రెండు ప్లాస్టిక్ మంచాల మీద పరిచిన ఉన్ని దుస్తుల్ని అమ్ముతున్న సంచార వ్యాపారి యోగేష్ కుమార్ దగ్గరకెళ్లి “చూడు బెటా! ఇక్కడ ఈ చలిలో, ఈ మంచులో నువ్వు ఎన్నేండ్ల నుండి ఈ వ్యాపారం చేస్తున్నావు?” అంటూ కదిలించాను.
దానికతను “నేను నా బచ్ పన్ నుండి ఇక్కడ ఈ దందా చేస్తూనే వున్నాను. మా తాత, తండ్రులు కూడా ఇక్కడే ఇదే చోట వ్యాపారం చేశారు. ఇప్పుడు మూడో తరంలో నేను చేస్తున్నాను. కాకపోతే తేడా అల్లా వాళ్ళు ఈ మూటలు నెత్తి కెత్తుకుని తెల్ల వారుజామున మూడు గంటలకు కింది నుండి బయలుదేరి, పాముల్ని, పులుల్ని ,తోడేళ్లను లెక్కచెయ్యకుండా పొద్దు పొడవక ముందే పైకి చేరుకునే వాళ్ళు. వాళ్ళు అంత కష్టపడి ఇక్కడిదాకా వచ్చినా ఇప్పటి మాదిరిగా యాత్రీకులు వస్తారన్న నమ్మకం వుండేది కాదు. అయినా వాళ్ళీ దందాను మాత్రం విడిచిపెట్టలేదు. నేనూ విడిచి పెట్టేది లేదు. నేనిప్పుడు మెటొడోర్ మీద సరుకేసుకొస్తాను. ఇక్కడ వుండే ఈ రెండు గంటల్లో ఒక్కో రోజు రెండు నుండి పదివేల వరకు గిరాకీ వుంటుంది. ఇక్కనుండి వెళ్ళిన తరువాత సిటీలో నాకో అడ్డా వుంది. అక్కడ బండి పెట్టుకొని రాత్రి ఎనిమిది గంటల దాకా దందా చేసుకొని అప్పుడు ఇంటికి పోతా. మాకు ఇద్దరమ్మాయిలు. ఇద్దరబ్బాయిలు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు చదువుకుంటున్నారు ” అంటూ తన వివరాలన్నీ దాచుకోకుండా తెలియజేశాడు.
మా వాళ్ళంతా నాకోసం ఎదురు చూస్తుండడంతో యోగేష్ దగ్గర శలవు తీసుకుని వెళ్ళి మా వాహనం ఎక్కాను.
అక్కణ్ణుండి బయలుదేరిన మేము మధ్యలో ఫలహారం చేసి, నేరుగా సిలిగురి వైపుగా సాగి పది గంటల కల్లా హోటల్ ‘సుందరం పాలెస్” ముందర దిగాము. మమ్ముల్ని దించేసిన డార్జీలింగ్ డ్రైవర్లు వెనుదిరిగిపోయారు.
“పన్నెండు గంటలకు రూమ్స్ చెక్ ఔట్ అవుతాయి. అప్పటిదాకా మీ లాగేజ్ అంతా ఒకచోట పెట్టి వుంచండి! రూమ్స్ ఖాళీ కాగానే మీకు ఎలాట్ చేస్తాం” అంటూ హోటల్ వాళ్ళు మెల్లగా చెప్పుకొచ్చారు.
“ఇప్పుడేం చేద్దాం?” అన్న ప్రశ్న మాలో మొలకెత్తింది.
“ఏముంది? ఈక్కడికి పది కి.మీ.దూరంలోనే ‘నగ్జల్ బరీ’ గ్రామం వుందట. చూసొద్దాం” అన్న నిర్ణయం తీసుకున్నాం. అదే విషయాన్ని రుఖేష్ తో చర్చించాము. అతను వెంటనే “నేను మన బస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఓ అరగంటలో వస్తుంది. మీరా వెహికల్ మీద వెళ్ళి రండి! నేను రూమ్స్ చెక్ ఔట్ కాగానే తాళాలు తీసుకుని వుంచుతాను” అన్నాడు.
ఓ గంట తరువాత మా కోసం వెహికల్ వచ్చి ఆగింది.
మేమంతా బిర బిరా వెళ్ళి ఎక్కి కూర్చున్నాము.
బస్సు ‘నగ్జల్ బరీ’ వైపుగా సాగింది.
మా బస్సు డ్రైవర్ పేరు ‘ఆనంద్’ మనిషి చాలా
నెమ్మదస్తుడు.
22 ఏప్రిల్,2024 సిలిగురి బ్రిటిష్ వారి కాలం నుండి పేరున్న పట్టణం. సిలిగురిలోని కొంత ప్రాంతం డార్జిలింగ్ జిల్లాలోను కొంత ప్రాంతం జల్పాయిగురి జిల్లాలోను కలిసి వుంటుంది.
సిలిగురి పట్టణం అంతా మురికి మురిగ్గా కన్పిస్తున్నా ఉత్సాహంగా చూస్తూ కూర్చున్నాము. బస్సు పట్టణ సరిహద్దులు దాటి తేయాకు తోటల మధ్య గుండా ముందుకు వెళుతుంటే “మేము ‘నగ్జల్ బరీ ’ గ్రామం చూడాలని చెబుతుంటే మీ రెటు తీసుకెళుతున్నారు?” అంటూ మేము డ్రైవర్ ఆనంద్ ను ప్రశ్నించాము.
దానికతను “ఈ ఏరియా అంతటినీ కలిపి ‘నగ్జల్ బరీ’ అంటారు. అంతే, గాని మీరంటున్నాట్టు ఇక్కడ ఆ పేరుతో వున్న గ్రామం ఇప్పుడు ఏదీ లేదు” అంటూ చల్లగా చెప్పుకొచ్చాడు.
అతని మాటలు విని ఒక్కసారిగా విస్తుబోయిన నేను “అసలు మీదీ ప్రాంతమేనా?” అంటూ అడిగాను.
“మా దసలు నేపాల్. బ్రిటీషోల్ల కాలంలో మా ముత్తాత వాళ్ళు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీ ప్లాన్ టేషన్స్ లో పనిచేయడానికి తోలుకురాబడ్డారట. అప్పట్నుండి ఇప్పటికీ నాలుగు తరాల వాళ్ళం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఇక్కడివాళ్ళమైపోయాము. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకులు ఈ ‘టీ’ ఎస్టేట్ భూములన్నింటినీ నిరుపేదలైన గిరిజనులకు పంచిపెట్టారు. అప్పటి నుండి వాళ్ళంతా ఒక సొసైటిగా ఏర్పడి ఈ తేయాకు తోటల్ని పెంచుతున్నారు. వాళ్ళంతా ఎక్కడి కక్కడ గుడిసలు వేసుకుని నగ్జల్ బరీ గ్రామం పేరుగల గ్రామంలోనే నివసిస్తున్నారు.
కాబట్టి మీరనుకుంటున్న ఆ నాటి ‘నగ్జల్ బరీ’ గ్రామం ఆనవాళ్ళు ఇప్పుడు ఎక్కడా మిగిలి లేవు. కావాలంటే ఆ ఎస్టేట్స్ లోపలికి వెళ్ళి విచారిద్దాం పదండీ!” అంటూ బస్సును మాకు కుడి పక్కనున్న ఎస్టేట్ లోకి తీసుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒకచోట నాలుగురైదుగురు మహిళలు, మరో నాలుగురైడుగురు పురుషులు కలిసి నిల్చుని తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. మా బస్సు వెళ్ళి వాళ్ళ పక్కనే ఆగింది. సగం మంది మహిళలు సిగ్గుపడుతూ మాకు దూరంగా వెళ్లిపోగా మిగిలిన సగం మంది మహిళలు, పురుషులూ “ఏంకావాలి?” అన్నట్టు మా వంక చూడ సాగారు.
డ్రైవర్ ఆనంద్ వంగ భాషలో మా అవస్థ ఎంటో వాళ్ళకు వివరించాడు. అయితే వాళ్ళంతా “ఈ మొత్తమంతా నగ్జల్ బరే’ మీరంటున్న పాత గ్రామం ఇప్పుడు ఎక్కడా కనబడదు” అంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళ మాటలు వింటూనే మేమంతా “నిన్న డార్జీలింగ్ లో రాహుల్ జీ విషయంలో అక్కడి వాళ్ళు ఎట్లా మాట్లాడారో! ఇక్కడ ‘నగ్జల్ బరీ’ గ్రామాన్ని గురించి గూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం? మన కండ్ల ముందు జరిగిన చరిత్రనే మార్చి పోతున్న పిదప జాతి మనది!” అనుకున్నాము.
దాదాపు గంట పాటు ఆ ఎస్టేట్స్ లో చెడ తిరిగి విచారించినా మాకా పాత గ్రామాన్ని గురించిన సమాచారం తెలియక పోవడంతో విసిగిపోయిన మేము “ఆ ఊరు కనబడకపోతే పోయిందిగాని, ఇక్కడికి దగ్గర్లో బంగ్లాదేశ్ బోర్డర్ వుందట గదా? అక్కడికన్నా పోయోద్దమ్ పదండి!” డ్రైవర్ తో అన్నాము.
దానికతను “బంగ్లాదేశ్ బోర్డర్ ఇక్కడికి చాలా దూరం. దానికన్నా నేపాల్ బోర్డర్ కాస్త దగ్గరగా వుంటుంది. మీరు చూడాలంటే అక్కడికి తీసుకుపోతాను” అంటూ బదులిచ్చాడు.
“ఏదో ఒక బోర్డర్! చూస్తే చాలు. ఒక్క ట్రిప్పులో రెండు దేశాలు చూసినట్టవుతుంది. కాబట్టి పోదాం పదండీ! ” అంటూ మా వాళ్ళంతా ఒకే మాటగా చెప్పారు.
మరో అరగంటలో బస్సును ఇండో నేపాల్ బోర్డర్ చెక్ పాయింట్ కి కుడిపక్కగా వున్న రోడ్డు మీదికి తిప్పి ఓ చెట్టుకింద ఆపిన డ్రైవర్ “అదుగో ఆ నదికి ఆవలి ఒడ్డున కన్పిస్తున్న ఊరు నేపాల్ దేశంలోని మొట్టమొదటి ఊరు. కొంచం ముందుకెళ్లి చూడండి!” అంటూ చెప్పుకొచ్చాడు.
“బోర్డర్ దాటి ఆవతలికి వెళ్ళక పోతే నేపాల్లోకి వెళ్ళినట్టు ఎలా అవుతుంది!?” అన్న ఒక కదలిక మా వాళ్ళలో వచ్చింది. దాంతో జనార్ధన్ గారు, సుబ్బారావు గార్లతోపాటు మరికొందరు డ్రైవర్ని చుట్టు ముట్టి మమ్ముల్ని” చెక్ పోస్ట్ దాటించి ఆవలికి తీసుకుపోవాల్సిందే” అంటూ పట్టుపట్టారు.
నా అంచనా ప్రకారం డ్రైవర్ మెతక మనిషే కాదు, భయస్తుడుకూడా. నేను అనుకున్నట్టుగానే అతను “ బోర్డర్ దాటాలంటే ముందుగా మీ అందరిపేర్లతో తయార్ చేసిన లిస్ట్ బోర్డర్ సెక్యూరిటీ ఆఫీస్ లో సబ్ మిట్ చేసి, వెహికిల్ కి ఆరొందలు చలానా కట్టాలి. వాటికంటే ముందు మా ఓనర్ ఒప్పుకోవాలి” అంటూ వెంటనే వాళ్ళ బాస్ కి ఫోన్ చేసి విషయాన్ని వివరించిన తను నాచేతికి ఫోనిచ్చి “ మా ఓనర్ తో మాట్లాడండి!” అన్నాడు.
ఫోన్లో ఓనర్ చెప్పినవన్నీ సావధానంగా విన్న నేను “సరే మీరు చెప్పినట్టుగా చలానా కడతాము. మా లిస్ట్ కూడా సబ్ మిట్ చేస్తాం సరేనా?” అంటూ సమాధానం చెప్పి వెంటనే ఫోన్ డ్రైవర్ చేతికిచ్చాను. వాళ్ళ భాషలో అతనేం చెప్పాడో తెలీదుకానీ “పదండీ! అంటూ డ్రైవర్ చెక్ పోస్ట్ వైపుగా కదిలాడు.
నేను, జనార్ధన్ గారు, నాగేశ్వరరావు గారు లింగయ్య గారు అతణ్ణి అనుసరించాము. మేము మెల్లగా నడ్చుకుంటూ భారత్ నుండి నేపాల్ వైపు వెళ్ళే ప్రధాన గేట్ ముందుకు చేరుకున్నాము. డ్రైవర్ నమోన్నారాయణ అన్నట్టు నిల్చున్నాడు టప్ప నోరు విప్పడంలేదు. ముందుకు కదలడంలేదు. కొంతసేపు అక్కడి వాతావరణాన్నంతా పరిశీలించిన నేను వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్న సిబ్బందిలో అందరికన్నా కాస్త స్మాట్ గా, యాక్టివ్ గావున్న అధికారి దగ్గరికీ మెల్లగా వెళ్ళిన అతనికి శల్యూట్ చేశాను. ప్రతి శల్యూట్ చేసిన తను “చెప్పండి!” అన్నాడు మృదువుగా.
“మేము మొత్తం పదిహేను మందిమి. హైదారాబాద్ వాళ్ళం. అంతా ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ సిటిజన్స్ మి, గత పది రోజులుగా భూటాన్ దేశాన్ని సందర్శించుకుంటూ తిరుగు ప్రయాణంలో ఈ రోజు ఇక్కడికొచ్చాము. మా వాళ్ళంతా ఒకసారి మన బోర్డర్ దాటి, నేపాల్ భూభాగంలో కాలుమోపి వద్దామంటున్నారు. దయచేసి అనుమతించ
వలసినదిగా అడుగుదామని వచ్చాము” అంటూ వివరించాను.
వెంటనే అతను “ఈ టోటల్ సైట్ ఇన్ చార్జ్ మా మేజర్ సాబ్ అటుపక్క వున్నారు. వెళ్దాం రండీ!” అంటూనే తను రోడ్డుకు అటు దిక్కుగా అడుగులు వేశాడు. మేము తనను అనుసరించాము. నేరుగా వారి మేజర్ సాబ్ టేబుల్ దగ్గరికి మమ్ముల్ని తీసుకెళ్ళి మా గురించి కొంత వివరించిన తరువాత “మీరు చెప్పండీ!” అన్నట్టు నా వంక చూశాడు.
వెంటనే అందుకున్న నేను ఆ మేజర్ సాబ్ తో తిరిగి మా విషయాన్ని మరో మారు వివరించాను. ఆయన ఎంతో సానుకూలంగా స్పందిస్తూ “మీ వెహికిల్ ఎక్కడ?” అంటూ మా వెనుకవున్న డ్రైవర్ని అడిగాడు.
ఎక్కడుందో చెప్పిన డ్రైవర్తో “అవతలిపక్క బోర్డర్ ఆఫీస్ లో ముప్పై రూపాయిలు చలానా కడితే మీ బస్సును నేపాల్లోపల ఐదు కి.మీ.దాకా వెళ్ళి చూసిరానిస్తారు. అక్కడో హోటల్ వుంటుంది. అందులో టీ బావుంటుంది. వీళ్ళతో తాగించుకుని రండి!” అంటూ మమ్ముల్ని అనుమతించాడు.
డ్రైవర్ ఆనంద్ ఎందుకోగాని మా వంక ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి మమ్ముల్ని ఎక్కించుకుని చెక్ పోస్ట్ దాటి నీల్లు లేక ఎండిపోయిన మహానదిని చూపించుకుంటూ
నది మధ్యలో భారత్, నేపాల్ సరిహద్దు గుర్తుగా నిర్మించిన సరిహద్దు కట్టడాన్ని దాటి దాదాపు అటుపక్క తనిఖీ కేంద్రం దరిదాపుల్లోకి బస్సును తీసుకెళ్ళాడు. అప్పుడు మా వాళ్ళంతా “నేపాల్ గడ్డ మీద అడుగుపెట్టాలకున్నాం. పెట్టాం ఇక చాలు. అసలే పొద్దుపోయింది” అంటూ డ్రైవర్తో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
దాంతో అతను వెంటనే బస్సు వెనక్కి తిప్పాడు. మన వైపు వచ్చే చెక్ పోయింట్ దాటిన తరువాత బస్సునాపించిన నేను గబ గబా మేజర్ సాబ్ దగ్గరికెళ్లి వారికి, వారి దగ్గరికి మమ్ముల్ని తీసుకు పోయిన జమేదార్ గారికి ధన్యవాదాలు తెలియజేసివచ్చి తిరిగి బస్సెక్కాను. అప్పటికి సమయం ఒంటి గంట దాటిపోయింది. వెను దిరిగి నగ్జల్ బరీ గ్రామాన్ని గురించి వాళ్ళను వీళ్ళను అడుగుతూ చాలా ముందుకు వెళ్ళిన తరువాత అందెశ్రీ గారు “లేదన్నా! నా కెందుకో మనం వెతుకుతున్న నగ్జల్ బరీ గ్రామం మనకు ఎడమచేతి పక్కనే వుంటుందని నా మనస్సాక్షి చెబుతుంది. కాబట్టి మీరు బస్సును మరోసారి వెనక్కి తిప్పించి ముందుకు పోనివ్వమనండి!” అని అనడంతో బస్సును వెనక్కి తిప్పించి వేగంగా ముదుకెళ్లి ఎడమచేతి పక్కగా వెళుతుంటే ‘నగ్జల్ బరీ’ రైల్వే స్టేషన్, గవర్నమెంట్
జనరల్ హాస్పిటల్, ఆర్.డీ.ఓ. ఆఫీస్, పోలీసు క్వార్టర్స్, పెద్ద పెద్ద దుకాణ సముదాయాలు కనిపించ సాగాయి. అది మేం అనుకున్న నగ్జల్బరీ గ్రామ పరిధిని ఏనాడో అధిగమించి సమితి స్థాయికి మించి ఎదిగిన పట్టణం మాత్రమే కన్పిస్తుంటే, మేము లేని ఓపిక తెచ్చుకుంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూనే వున్నాము. త్వరలో దేశ వ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పట్టణమంతటా ఏ వీధిలో, ఏ కూడలిలో చూసినా అరవై శాతం బి.జె.పి. జండాలు, బ్యానర్లు, ఇరవై శాతం తృణమూల్ కాంగ్రెస్ వి, పది శాతం కాంగ్రెస్స్ వి, మిగతా పార్టీల జండాలన్నీ కలిపి ఓ పది శాతం కన్పిస్తున్నాయి. దౌర్భాగ్యం ఏమిటంటే మూడు మూడున్నర దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని ఏలిన కమ్యూనిష్టుల జండాలు మిగతా అన్ని జండాల మాటున అక్కడొకటి, ఇక్కడొకటి కొడిగట్టిన దీపాల మాదిరిగా కనిపిస్తుండడం చూస్తుంటే “అయ్యే! అన్న ఆర్తనాదం నా గుండెలోతుల్లో సుడులు తిరగి పోసాగింది.
తిరిగి తిరిగి రెండు గంటలు దాటుతున్న సమయంలో మేము అనుకొకుండా ‘బెంగై జోటే’ అనే చోటుకి చేరుకున్నాము. అదే నగ్జల్ బరీ ఉద్యమానికి దారితీసిన స్థలం కావడం పొద్దుటి నుండి మేము పడిన శ్రమకు దక్కిన ఫలితంగా మురిసిపోయాము.
25 మే, 1967 నాడు అక్కడ సమావేశమైన వందలాది మంది సంతాల్ గిరిజన కౌలు రైతులు, తాము పండించిన పంటల్లో భూస్వాములకు మూడింట ఒక వంతు మాత్రమే కౌలుగా ఇస్తామంటూ చేస్తూన్న నినాదాల హోరుతో ఆ పరిసరాలు కంపించ సాగాయి. సరిగ్గా ఆ సమయంలో భూస్వాముల అండతో పోలీసులు సాగించిన కాల్పుల్లో 1. ధనేశ్వరీ దేవి 2. సీమేశ్వరీ ముల్లిక్ 3. నయనేశ్వరీ ముల్లిక్ 4. సురుబాలా బర్మన్ 5. సొనమతి సింగ్ 6. ఫుల్ మతీ దేవి 7. సంసారీ సాయిబాని 8. గౌద్రా సాయిబాని 9. ఖర్సింఘ్ ముల్లిక్ అనే తొమ్మిది మంది పెద్దవాళ్ళతో పాటు గుర్తు తెలియని ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఆ స్థాలంలోనే వారి స్ర్ముతి చిహ్నంగా స్థూపాన్ని నిర్మించారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో, లిన్ పియాఓ ల విగ్రహాలతోపాటు చారుమజుందార్, సరోజ్ దత్త్, మహదేవ్ ముఖర్జీల విగ్రహాల్తో పాటు కాల్పుల్లో మరణించిన వారి పేర్లను వ్రాసిపెట్టిన శిలాఫలకం కాన్ని కూడా దర్శించాము.
ఆనాటి నుండీ ఈనాటి దాకా ఆ పక్కనే వున్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓ నలుగురు ఉపాధ్యాయులు అదేసమయంలో అక్కడికొచ్చారు. వారికి మాగురించి
వివరించి పొద్దుటి నుండి మేము పడిన ఇబ్బందులను వివరించాము. మా మాటలను విన్న ఆ ఉపాధ్యాయుల్లో ఒక్కరు మాత్రం ముందుకొచ్చి “నక్సలైట్ ఉద్యమానికి బీజం ఇక్కడే పడింది. మీరు ఊహించుకున్న ఆ ప్రాంతం ఇదే. ఆ నాటి ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన కాను సన్యాల్ ఇల్లు ఇక్కడికి రెండు కి.మీ.దూరంలో వుంది. కావాలంటే వెళ్ళి చూడొచ్చు” అంటూ తెలియజేసిన తను అక్కడికి ఎలా వెళ్ళాలో ఆవివరాలను మా డ్రైవర్ కి తెలియజేసి మా దగ్గర శలవ్ తీసుకున్నాడు.
అప్పటికి మా డ్రైవర్ ఆనంద్ కి ఎందుకోగాని వీళ్ళు మామూలోల్లు కాదన్న భావం మా మీద కలిగినట్టుంది. అతను అక్కణ్ణుండి ఇరవై నిమిషాల్లో బస్సును తీసుకెళ్లి ‘కాను సన్యాల్’ స్మృతి భవన్ ముందర ఆపాడు. ఆ భవన్ ‘సెబోఎల్ల జోట్’ గ్రామంలో, ‘హతిఘిశ’ పోస్ట్, నక్షల్బరి బ్లాక్, సిలిగురిలో వుంది. అప్పటికి సమయం మూడు గంటలు కావస్తుంది. అది పక్కా పల్లెటూరు మాదిరిగా వుంది. ఆయన్ని గురించి తెలుసుకుందామంటే ఆ భవన్ నిర్వాహకుడు టౌన్ లోకి వెళ్లాడట. ఎవర్ని అడుగుదామన్నా పెద్దవాళ్ళు ఎవ్వరూ కనిపించడంలేదు. ఇంతలో మాకోసమే అన్నట్టుగా యండి. గులాబుద్ధీన్ అన్సారీ అనే 62 ఇండ్ల వ్యక్తి
సైకిల్ మీద వెళుతూ కనిపించాడు. అతన్ని ఆపి కాన్ సన్యాల్ గురించి తనకు తెలిసింది చెప్పమని అడిగాము.
అతను తన జీవితమంతా పేదవారి కోసమే శ్రమించాడు. బ్రహ్మచారి.కొన్ని వందల ఎకరల భూమి పేదలకు పంచాడు. ఏ పార్టీ నేపధ్యంలో, ఏ పేదలకోసం తన జీవితమంతా శ్రమించాడో, ఆ పేదలు తనకు దూరమవ్వడంతో భరించలేని బాధతో అతను ఓ రోజు మిట్టమధ్యాహ్నం ఆ ఇంట్లోనే ఊరి వేసుకుని మరణించాడని వివరించాడు. అతను చెప్పిందంతా విన్న మా గుండెలు బరువెక్కి పోయాయి. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి అక్కణ్ణుండి కదిలి బస్సెక్కాము.
అరగంటలో వెళ్ళి సాయంకాలం నాలుగ్గంటల ప్రాంతంలో ఓ హోటల్లో భోజనం చేశామంటే చేశామనిపించుకొని అక్కడికి 25 కి.మీ.దూరంలో కరోనేషన్ (పట్టాభిషేకోత్సవ) వంతెనను చూడడానికి వెంటనే బస్సెక్కము.
వినడానికి, చూడడానికి కరోనేషన్ బ్రిడ్జ్ 25 కి.మీ.అనడంతో, మేమంతా “మహా అయితే ముప్పావు గంటలో వెళ్ళిపోవచ్చులే” అనుకున్నాం. కానీ విపరీతమైన ట్రాఫిక్ కారణంగా మా అంచనా దారుణంగా తల్లకిందులయ్యింది. చూస్తుండగానే చీకట్లు
ముసురుకు రాసాగాయి. బస్సులోవున్న మావాళ్ళంతా “ఇంకెంతసేపు? పగలంతా అట్లా తిరిగాము. ఇప్పుడేమో ఇట్లా అవుతుంది. ఈ చీకట్లో వెళ్ళి అక్కడ చూసేదేముంటుంది?” అంటూ దీర్ఘాలు తీయడం మొదలు పెట్టారు.
కానీ, ఏం చేస్తాం? ‘మెడకు పడ్డ పాము కరవతక తప్పదు’ అన్నట్టుగా కూర్చునే వున్నాము. రోడ్డుకు రొండు పక్కలా వున్న అందమైన కొండల, వనాల సోయగాలను కూడా చూసే సందర్భం లేకుండా పోయింది. బ్రిడ్జ్ కి రెండు కి.మీ ఈవల వున్న రైల్వే స్టేషన్ని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించారట. కొండల మధ్య అదేంతో అందంగా వుంది.
సమయం ఆరుంబావు అవుతుంది. పరిసరాల్లో పూర్తిగా చీకటి అలుముకుంది.. బ్రిడ్జ్ కి ఇవతల కొంత దూరంలో మా వాహనం ఆగింది. ఆ చుట్టు పక్కల చిన్న చిన్న దుకాణాలు చాలా మూసి వేసి కన్పిస్తున్నాయి. బ్రిడ్జ్ మొదట్లో నిల్చుని వున్న సెక్యూరిటీ సిబ్బంది మా వంక ఆశ్చర్యంగా చూస్తుండగా, డ్రైవర్ ఆనంద్ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి “వాళ్ళంతా హైదారాబాద్ నుండి వచ్చారు. పైగా అంతా సీనియర్ సిటిజెన్స్. చదువుకున్న వాళ్ళు. నేపాల్ బోర్డర్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే అక్కడున్న మేజర్ సాబ్ తో మాట్లాడి బోర్డర్ దాటి వెళ్లోచ్చారు. ఈ ట్రాఫిక్ కారణంగా సకాలంలో రాలేక పోయారు. ఒక్క పదినిమిషాలు వాళ్ళను బ్రిడ్జ్ మీదికి వదిలితే నేనే తీసుకుపోయి చూపించి తీసుకొస్తాను” అంటూ మా గురించి కాస్త మాషాలా దట్టించి చెప్పాడు. అతని ప్రయాస ఫలించింది.
“ఇంత చీకట్లో వెహికిల్ని బ్రిడ్జ్ మీదికి వదల్లేము. వాళ్ళను గురించి నువ్వు ఇంతగనం చెబుతున్నావు. కాబట్టి వంతెన మీద కొంత దూరం అలా తీసుకెళ్లి ఇలా తీసుకురా!” అంటూ అనుమతించారు.
తీస్తా నది మీద నిర్మించబడిన ఆ కరోనరీ వంతెన మీద మేమంతా భయం, భయంగానే పాదచారుల కోసం నిర్మించబడిన ఫుట్ పాత్ మీదుగా కొంత దూరం వెళ్ళి మెల్లగా వెనుదిరిగి వచ్చాము. ఇటీవలే ఆ ప్రాంతంలో ఓ యువ ప్రేమికుల జంట ఆత్మ హత్య చేసుకుందట. అందుకే అక్కడంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయట.
ఇక్కడ పూర్వకాలంలో వున్న సాధారణ వంతెనను శివొకె రోడ్డు వంతెన అనేవారట. కారణం అక్కడికి ఇరవై కి.మీ. దూరంలో శివొకేశ్వరి కాళీ మాత మందిరం వుండడమేనట. ఈ వంతేనను స్థానికులు భాగ్ ఫూల్ (టైగర్ వంతెన) అని కూడా అంటారు. వంతెనకు రెండు
పక్కలా రెండు పులిబొమ్మలుండడమే అందుకు కారణం. ఈ వంతెన మీదుగా గ్యాంగ్ టాక్ తో పాటు ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు శులభతరమయ్యాయట. సందర్శకులకు వీలైతే ఇక్కడ ఒక రోజంతా తిరిగి చూసేంత అందమైన ప్రాంతాలున్నాయి. కానీ మాకావకాశం లేకుండా పోయిందా అనుకున్నాము.
శివొకె వంతెన, కరోనేషన్ బ్రిడ్జ్ గా మారడం వెనుక వున్న కథ కూడా తప్పకుండా తెలుసుకోదగిన కథే.
1937లో ఆనాటి మన దేశ పాలకులైన బ్రిటీష్ వారి యువరాజు కింగ్ జార్జ్ ఆరు, యువరాణి ఎలిజబెత్ ల పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారి గౌరవార్ధం ఇక్కడ ఈ నూతన వంతెనకు ఆ నాటి బెంగాల్ గవర్నర్ జాన్ ఆండర్సన్ శంకుస్థాపన చేశాడు. అది 1941 నాటికి నిర్మాణం పూర్తిచేసుకుంది. దీని పొడవు 698 అడుగులు. ఎత్తు 114 అడుగులు. ఇది పాదచారులకు, వాహనాలకు అనుకూలంగా వుండే విధంగా రెండు పాయలుగా నిర్మించబడింది.
నది మధ్యలో ఎక్కడా పిల్లర్ అనేది లేకుండా ఆ చివర, ఈ చివర్ ఇనుప గడ్డర్స్ ను నిర్మించి వాటి ఆధారంగా ఆ వంతెనను నిర్మించుకుంటూ వచ్చారు. అప్పట్లో అదో
అద్భుత సాంకేతిక నిర్మాణం కిందనే లెక్క. దీనిని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ పేరు జాన్ చాంబర్స్. ఆనాడు దాని నిర్మాణ వ్యయం ఆరు లక్షల రూపాయలట!
“ఇంకొక్క గంట ముందొచ్చినా ఇంత గొప్ప వంతెనను, దీని చుట్టూ వున్న అద్భుతమైన పరిసరాలను పూర్తిగా చూసి ఆస్వాదించేవారము కదా?” అనుకుంటూ మేమంతా వెనుదిరిగి వెళ్ళి బస్సెక్కాము.
ఎనిమిది గంటలకు మమ్ముల్ని సిలిగురిలోని “హాంకాంగ్” మార్కెట్ ముందర దించి బస్సు వెళ్లిపోయింది. ఆ మార్కెట్ రాత్రి ఎనిమిదిన్నరకే బందవుతుందని తెలియడంతో ఓ అరగంట పాటు, రెండు బజార్లు మాత్రమే తిరిగి చూశాము. మా మిత్రబృందంలో కొందరు కావాలకున్న వాటిని గబ గబా కొనుక్కున్నారు. తరువార బయటకొచ్చి ఆటోలు పట్టుకుని తొమ్మిదిన్నరకల్లా హోటల్ సుందరానికి చేరుకున్నాము.
23-04-24 యధావిధిగా ఉదయాన్నే లేచి తయారైన మేమంతా ఎనిమిది గంటలకల్లా రుమ్స్ చెక్ ఔట్ చేశాము. మా లాగేజ్ అంతా కింద రిసెప్షన్ హాల్లో సర్ధిపెట్టి, మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందో ఆరాతీయ సాగాము. మా హోటల్ కి ముందు వైపున వుండే మరో రోడ్డులో సౌత్ ఇండియన్ టిఫిన్స్ దొరుకుతాయని తెలియడంతో మేమందరం కలిసి, అక్కడికే వెళ్ళి టిఫిన్ చేద్దామని నిర్ణయించుకున్నాము.
ఇంతలో మా హోటల్ పక్కనే వున్న ఓ పెద్ద భవనం, ఎవరో ఓ బాబా గారి ఆశ్రమ మట! ఉదయం ఎడున్నర నుండే దాని ముందర చాలా మంది వృద్ధులు మెల మెల్లగా గుమిగూడా సాగారు. వాళ్ళను గమనించిన నేను “ఎంటబ్బా!? ఇక్కడ ఇంతమంది వృద్ధులు ఎందుకు గుమిగూడుతున్నారు?” అన్న విచికిత్సకు లోనయ్యాను. దాంతో మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి “ఎందుకు మీరంతా ఇంత పొద్దున్నే ఇక్కడ గుమిగూడుతున్నారు?” అంటూ సౌమ్యంగా కన్పిస్తున్న ఓ వృద్ధురాలిని అడిగాను.
“ఇది బాబా ఆశ్రమం. మాకిక్కడ ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు నాష్టా పెడతారు. దానికోసమే మేమంతా పొద్దున్నే ఇక్కడి కొస్తాం బేటా!” అంటూ ఆవిడ బదులిచ్చింది.
“ప్రతిరోజూ ఇక్కడికి రావడమెందుకు? మీకు ఇల్లు వాకిళ్ళు, కుటుంబాలు, పిల్లలు లేరా?” తిరిగి ప్రశ్నించాను.
నా ప్రశ్నను వింటూనే అక్కడున్న వృద్ధులంతా నన్ను చుట్టూ ముట్టి రక రకాలుగా ఆక్రోశించసాగారు.
వాళ్ళ ఆక్రోశనల సారాంశం ఏమిటంటే!? వాళ్ళంతా ఈ వృద్ధాప్యంలో తోడును కోల్పోన ఒంటరులు. తమ ఒంట్లో శక్తి వున్నంత కాలం ఇంట్లో వుండనిచ్చిన కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్లు రెక్కల్లో శక్తి ఉడిగిపోగానే నిర్దాక్షిణ్యంగా ఇండ్లల్లో నుండి వెళ్ళ గొట్టారు. దాంతో వాళ్ళంతా వీధుల్లో తిరిగే కంచిమేకల్లా, వీధి పశువుల్లా బజార్లాలో తిరుక్కుంటూ ఖాళీ సీసాలు, అట్ట పెట్టెలు మొదలైనవి ఏరి అమ్ముకుంటూ రాత్రికి ఏ వీధి బండి దగ్గరో ఓ రొట్టెనో, బన్నునో కొనుక్కుతిని ఏ షాపుల ముందరో ముడ్చుకు పడుకుంటారు.
వాళ్ళు చెప్పిందంతా విన్న నేను “మరి మధ్యాహ్నం భోజనం మాటేమిటి?” అంటూ అడిగాను.
“ఇదే బాబాజీ గారి మరో ఆశ్రమం వేరే వీధిలో వుంది. మేమంతా ఇక్కడ నాష్టా చేసిన తరువాత ఊళ్ళో బడి తిరుక్కుంటూ, తిరుక్కుంటూ ఒంటి గంటకల్లా అక్కడికి చేరుకుంటాము. అక్కడ మా కందరికీ భోజనం పెడతారు. అది తిని మళ్ళీ ఊరు మీద పడి చిత్తు కాగితాలు ఎరుకుంటాము. దొరిక్కిన్నాడు వాటిని అమ్ముకుని ఆ పూటకు ఏదో ఒకటి తిని, ఎక్కడో చోట పడుకుంటాము” అంటూ వాళ్ళ దైనందిన జీవన భ్రమణాన్ని నా ముందుంచారు.
కన్నవారి చేత వంచితులై వీధుల పాలైన ఆ వృద్ధుల
మాటలను ఆలకించిన నా మనసు కలి కలి అయిపోయింది. మరి కొంతసేపు వారి ఆక్రోశం వింటూ అక్కడే నిలబడిన నేను మెల్లగా మా హోటల్ దిక్కుకు నడుస్తుండగా ఓ ముసలమ్మ నాకు అడ్డం తిరిగి “మాకు ఎన్నో కొన్ని పైసాలిచ్చిపో” అంది.
“డబ్బు లివ్వాలా!?” ఆశ్చర్యపడిపోతూ అన్నాను.
“మరి? మా సాదక బాదకాలిని మజా ఉఢాయించడమేగాని, మాకు అంతో ఇంతో సాయం చేయడం చేత కాదా?” అంటూ నా వెన్ను పూసలు కదిలిపోయేలా ప్రశ్నించింది.
నిస్సహాయుణ్ణై పోయిన నేను, నాకు చేతనైందేదో ఆవిడ చేతిలో వుంచి దండం పెట్టాను.
“మేమంతా కలిసి చాయ్ తాగతాంలే బేటా!” అంటూ నాకు వీడ్కోల్ చెప్పారు.
ఇంతలో.. “టిఫిన్ కి వెళ్దాం రండీ!” అంటూ మా ఆవిడ కేక వేసింది.
పదిరోజుల తరువాత ఇడ్లీ, దోశల్తో మంచి టిఫిన్ చేశాము.
మా రైల్ మధ్యాహ్నం రెండుంపావు కుంది.
ఒంటి గంట కొచ్చిన బస్సు మమ్ముల్ని , లగేజ్ ని ఎక్కించుకుని అరగంటలో స్టేషన్ లో దించి వెళ్ళిపోయింది.
నిర్ధారిత సమయంకన్నా అరగంట ఆలస్యంగా స్టేషన్ లో కొచ్చి ఆగిన రైలెక్కి విజయవాడ వైపుగా సాగాము.
ఆ పగలు, ఆ రాత్రి ప్రయాణం చేసి, మరునాడు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్టణం స్టేషన్లో మా రైల్ ఆగినప్పుడు రంగారావు గారి తమ్ముడు దామా అంజయ్య, శ్యామల గారి దంపతులు మా పదిహేను మంది మిత్రులకు తలో పులిహోర, పెరుగన్నం డబ్బాలు అందించారు. వారి కలయిక కొన్ని నిముషాలదే అయినా కలకాలం నిలిచిపోయేది. రాత్రి పది గంటలకు విజయవాడ స్టేషన్ లో దిగిన తరువాత మేమంతా ఎవరికి వారం చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం మా మా ఊళ్ళకు బయలుదేరాము.
సుబ్బారావు గారి దంపతులు, జనార్ధన్ గారి దంపతుల్తో పాటు మా దంపతులం కూడా మా కోసం అప్పటికే కొత్తగూడెం నుండి వచ్చి వున్న వాహనం ఎక్కి కూర్చున్నాము. ఆ వాహనం వేగంగా గమ్యం వైపుగా పరుగందుకుంది
(ఇంతటితో మా భూటాన్ యాత్ర సమాప్తం)