బోధిసత్వ

Spread the love

“ఆ చెట్టు ఫలాలు అమితమైన రుచిని, అపూర్వమైన సువాసనను వెదజల్లడం వలన దానిపై ఆవాసముంటున్నటువంటి కోతులైన మేము ఎంతో ప్రపత్తితోను, అప్రమత్తతతోను వ్యవహరించేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రమేయం లేకుండా ఆ చెట్టు పండు ఏ ఒక్కటి కూడా నేలరాలేందుకు మేము ఎన్నడూ అనుమతించిందిలేదు. అయినప్పటికీ అటువంటి సంఘటన ఒక రోజు చోటు చేసుకుంది. గంగానదీతీరంపై పొడవుగా వేలాడుతున్న కొమ్మ నుండి బాగా పండిన ఫలమొకటి కిందనున్న జాలరి వలలోకి అనూహ్యంగా చిక్కుకొంది

‘ఇంతగా మెరిసిపోతూ, సుగంధ పరిమళభరితమైన ఫలాన్ని ఇంతకు ముందెన్నడూ నేను చూసెరుగను…’ అని జాలరి కళ్ళింత పెద్దవి చేసుకొని రాజసభలోని కాశీ మహారాజుకు వాటిని సమర్పించాడు.

దాని రుచికి అబ్బురపడిన మహారాజు తన సైనిక పరివారంతో, మేళతాళాలతో, డప్పూబాకాలు మారుమోగేలా, వేటగాళ్ళ బృందంతో ఆ చోటును చుట్టుముట్టి, ఆశగా ఆ చెట్టును సమీపించి అందులో గుంపుగానున్న మా మూకను చూడగానే కోపంతో మమ్మల్ని తక్షణం చంపేయమని ఆజ్ఞాపించారు.

మా వానర సైన్యం యావత్తు ప్రాణభీతితో ఆర్తనాదాలు చేస్తూ, వానరరాజు అయినటువంటి నాతో మొరపెట్టుకున్నాయి. మిగిలిన వానరాల కంటే ముందుకు విరుచుకున్న ఛాతీతో ధృడకాయుడైన నేను, పొడవైన, దృఢమైన ఒక వెదురుబొంగును మేమున్న చెట్టుకు, గంగానదీ అవతలితీరంలో వేళ్ళానుకున్న పెద్ద మర్రిచెట్టుకు మధ్య వారధిలా నిర్మించాను. అయితే, దురదృష్టవశాత్తు, అవతలి తీరానికి వెదురుబొంగు పొడవు సరిపోలేదు. మరోవైపు పదునెక్కిన శరములకు కుప్పకూలుతున్న వానరాల హాహాకారాలు.

తక్షణమే నిర్ణయించుకున్నాను…

వెదురుబొంగు ఒక మొనను మా చెట్టుకి, ఇంకో మొనను నా చీలమండకు కట్టుకుని, అవతలివైపు చెట్టును ఎగిరిపట్టుకొని, నన్ను నేనే వారధిగా మార్చుకున్నాను. నాపై ఎక్కి వానరాలు తప్పించుకోవడంతో, అమ్ములపొది నుండి శరములు నాపై గురిపెట్టబడ్డాయి. అయితే నా పట్టు ఏ మాత్రం తప్పలేదు. వెరసి, నా గుంపు కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన నా చర్యను చూసి మహారాజుకి నాపై అమితమైన గౌరవము, కారుణ్యము కలిగాయి. గురిపెట్టిన బాణాలు ఒక్కసారిగా సద్దుమణిగాయి. నేను కింద పడకుండా ఉండేందుకు మందమైన, విశాలమైన గుడ్డను పట్టుకుని పరిచి, నన్ను మెల్లగా కిందకు దింపారు. ఈలోపు నా వానరమూక పూర్తిగా అవతలి తీరాన్ని చేరి తప్పించుకొన్నాయి.

బాణాల గాయాలతో, రాజు ఒడిలో తుదిశ్వాస విడిచే తరుణంలో “సృష్టిలో ప్రాణత్యాగం కంటే మహోత్కృష్టమైనది మరేం ఉండగలదు రాజా?” అన్నాను.

ఎండిన చెట్టుబెరడు రంగులో నిశ్చలనమైన బుద్ధుని జటాజూటం ఎగసి, పెదవులు విచ్చుకొని ఇది జరిగేసరికి ఎదురుగా నిలుచున్న బాటసారి చిరుదరహాసంతో అడిగాడు…

“నిజమే! ఇతరులకై ప్రాణ త్యాగం చేశారు కదా, మరి ఆ జన్మలో బోధిత్వం పొందారా?”

విశాలమైన నేత్రాలను మూసుకొని, ముందూవెనకకు తలపంకిస్తూ, “ లేదు! ఆ జన్మలో నేను జ్ఞానం పొందలేకపోయాను…”

బుద్ధుని దీర్ఘ నిశ్శ్వాస, అంతవరకు అడవిలో పేరుకుపోయిన నిశబ్దాన్ని ఒక్కసారిగా కలచివేసింది. అంజూరపుచెట్టు కొమ్మలు కాసేపు గాలివాటుకి అటూఇటూ కదిలి, ఆపై సద్దుమణిగాయి. చంద్రకాంతితో వెండిపూత పూసిన అంజూరపు ఆకులను పైకితలెత్తి చూస్తూ ఇలా సెలవిచ్చారు.

“నా వానర జన్మలో, నేను జ్ఞానం పొందలేనిమాట వాస్తవమే. అయితే , ఆ దిశగా సాగిన ప్రయాణంలో మరింత ముందుకు సాగాను అనొచ్చు. నా అనేక అవతారాలలో ఇదేవిధంగా నేను చేసిన అనేక సత్కర్మల ఫలితంగానే కడకు ‘సిద్దార్ద’ జన్మలో నేను జ్ఞానాన్ని పొందగలిగాను.

అదే వాస్తవం కూడాను. ఈ భువిలో ప్రాణత్యాగమే కదా అన్నింటి కంటే మహోత్కృష్టమైనది…”

“మూర్ఖత్వం…” అని బాటసారి నిశ్శబ్దంగా సణుగుతూ బుద్ధునికి, తనకి మధ్యనున్న కాగడాను బలంగా మట్టిపై అదిమి గుచ్చాడు. ప్రయాణానికై కట్టుకున్న మూటను కిందపెట్టి, బుద్ధునికి ఎదురుగానున్న మర్రిచెట్టుకింద కూర్చోగా, సమీపంలోనున్న బుద్ధునిలో ఏదో తెలియని అలజడి.

భయపడినవాడు కాస్తా సర్దుకొనేలోగా, దట్టమైన శ్వేత రోమాన్ని విదుల్చుకొని, చెట్టూచేమల మాటున, చెవులు నిక్కబొడుచుకుని కుందేలొకటి రెప్పపాటులో అడ్డంగా పరుగు తీసి మరో పొదలోకి కనుమరుగైంది.

“ఛ! అనవసరంగా కంగారుపడ్డాను…” అనుకుని బాటసారి ముఖాన చెమటను తుడుచుకోగా, గౌతముని ముఖాన చిరుదరహాసం వెల్లివిరిసింది.

నిండుపున్నమిని చూపించి అడిగాడు “చందమామలో కనబడే  మచ్చను పరికించి చూస్తే ఎలా గోచరిస్తుంది??”

మౌనంగా పైకి చూసినవాడు కాస్తా “ఇప్పుడు చూసిన కుందేలు ఛాయలో…”

“నిజమే! వెన్నెలలో కనిపించేది సైతం ఒక కుందేలు బింబమే”

“నీ లాంటి బాటసారి ఒకరు, అడవి మధ్యలో ఆకలితో రోదించడం చూసి, అతడు చలి కాచుకునేందుకు వేసిన మంటలో ఆహుతై, తననే ఆహారంగా అర్పించుకునేందుకు ముందుకురికిన కుందేలు త్యాగాన్ని మెచ్చి, బాటసారి రూపంలో విచ్చేసిన భగవంతుడు యుగాంతాలకు నిలిచిపోయే ఆ కుందేలు రూపాన్ని, చంద్రునిలో మచ్చగా గీసిన రూపమే అది!!”

“ఈ ప్రపంచములో ప్రాణత్యాగం అనే మాటను మించిన ఆత్మవంచన మరొకటి ఉండదు … మరణించినవానిని ఉద్దేశించి చెప్పేందుకు ఇంతకు మించిన కుంటిసాకు మరొకటుండదు!”

“ఇందులో ఆత్మవంచన ఏముంది?”

“అంతకుమించి తేలికగా జీర్ణించనలవి కానీ మరెన్నో విషయాలు ఉన్నాయి…” అని గాఢంగా చెప్పినవాడు కాస్తా, కొన్ని నిముషాలపాటు  మౌనం వహించి, ఆ తర్వాత  ఇలా చెప్పుకుంటూ పోసాగాడు…

“పెద్దగా ఎటువంటి ఆదాయాన్ని ఆర్జించలేని భర్తకు, ప్రతిరోజు సురాపానము సేవించేందుకు మాత్రం ఏదో ఒకవిధంగా డబ్బులు లభించేవి. ప్రతిరోజూ సురాపానము సేవించి రాత్రి ఇంటిముఖం పట్టేసరికి, ఆ ఇంటి ఒంటి దీపం వెలుతురు మాత్రమే ఆ వీధి చీకటితో తలపడేది. తండ్రి అడుగుల చప్పుడు వినగానే ఆ పిల్లవాడు ఠారెత్తిపోయేవాడు. నిద్రపోనప్పటికీ కళ్ళు గట్టిగా మూసుకుని పడుకునేవాడు. అలా  నటించడం వలన ఏదో ఒక నెపంతో తనని కొట్టి, చీకట్లోకి నెట్టే నాన్న నుంచి తప్పించుకోవచ్చని అతని గాఢమైన నమ్మకం. అయితే చాలా నమ్మకాల్లా అది కూడా వైఫల్యంతోనే ముగుస్తోంది.

ఆ పిల్లవాడి తల్లి అందుకు పూర్తి విరుద్ధం. ఆమెది నిత్యం కారుణ్యం వెల్లివిరిసే ముఖం. ఆ పిల్లవాడు ఈ ఊరిలోనే తన తల్లిని మించిన సౌందర్యవతి ఇంకెవరూ లేరని తలచేవాడు. ఆమె ఏరోజు గొంతెత్తి పల్లెత్తుమాట కూడా బిగ్గరగా మాట్లాడి ఎరుగదు. ఆమె తమ పేదరికాన్ని చూసి ఏ రోజు నొచ్చుకుంది కూడా లేదు. భర్త ఇంటికి వచ్చేంతవరకు తినకుండా, నిద్రపోకుండా పడిగాపులు పడి మరీ ఎదురుచూసేది. ఎందుకంటే? అతడు ఆమెను పట్టి తొక్కేందుకు, దుమ్మెత్తి పోసే

జుగుప్సాకరమైన మాటలను వినేందుకు కాబోలు.

‘ఆ మనిషికి, మనల్ని బాగా చూసుకోవడం లేదనే దిగులు. అందుకే మద్యం సేవిస్తున్నాడు. పాపం బయట నాలుగు చోట్లకెళ్ళి నలుగురిని కలిసొచ్చే మనిషి అంతకుమించి ఏం చేస్తాడులే…’

అణుమాత్రం కూడా చికాకు పడకుండా, తనని తాను సముదాయించుకోవడంతోపాటు, ఆ పసివాడిని కూడా సముదాయించేది. ఎలా తన భార్య ఇంతటి ఓర్పుతోను,

ప్రేమతోనూ అన్నివేళలా ఒకేలా తనని ఎదుర్కోగలుగుతుంది అన్న ఆలోచన కలిగినప్పుడల్లా అతను మరిన్నిరెట్లు  జాలి, దయ లేని కర్కశుడిగా మసలుకునేవాడు.

అయితే ఒక వేకువజామున ఆ అద్భుతం చోటుచేసుకుంది.

‘ఇకపై మద్యం సేవించను. పొరుగూరిలోనే ఒక కొత్త కొలువు దొరికింది. ఇకపై సకాలంలో ఇంటిని చేరుకుంటాను అని అతడు చెప్పిన మాటను, అంతవరకు కేవలం ఏడుపులను, చీవాట్లను మాత్రమే విని వాటిని మాత్రమే ఆకళింపు చేసుకున్న ఆ ఇంటి గోడలకు సైతం ఆ మాటలు అంత నమ్మశక్యం కాలేదు.

‘నేను తిరిగి రాగానే వీధిలోని అంగడికెళ్ళి వస్త్రాలు కొనేందుకు వెళదాం…’ అని చెప్పి అతడు నదికి స్నానమాచరించేందుకు వెళ్ళగా, ఎగరిగంతేసిన ఆ చిన్నపిల్లాడు తన వద్ద ఉన్న వాటిలోనే కాస్త మంచి వస్త్రాలను తొడుక్కొని సన్నద్ధమయ్యాడు. తడి శిరోజాలను ఆరబెట్టేందుకు భార్య వాకిట్లోనే ఎదురుచూస్తుంది. అయితే సమయమెంత గడుస్తున్నప్పటికీ భర్త ఇంటిముఖం పట్టలేదు. కేవలం ఒక సమాచారం మాత్రమే అందింది. స్నానమాచరిస్తున్నప్పుడు నది సుడిగుండంలో చిక్కుకొని చనిపోయాడని… తడియారని శిరోజాలను విరబోసుకుని, చీరకొంగు వీదులెమ్మట జారి దొర్లుతుంటే అమ్మ పరుగులు తీస్తున్న దిశగా చూస్తూ, ఆ చిన్నపిల్లాడు నిలబడియున్నాడు.

“ఎవర్నో ఒకడిని కాపాడబోయి ఆయన సుడిగుండంలో చిక్కుకున్నాడు…”

“పాపం ఇక ఈ కుటుంబానికి దిక్కెవరో!”

నట్టింట్లో నాన్న శవం చుట్టూ జనం గుమిగూడి చెవులు కొరుక్కుంటుంటే, ఆ పిల్లవాడికి ఇవేవి తలకెక్కలేదు. అయితే, తన తల్లి మాత్రం ఇంత బిగ్గరగా రోదించగలదనే విషయం అతడికి ఆ రోజే అవగతమయ్యింది…”

సరిగ్గా కథను ఈ చోట్లో ఆపి, బుద్ధుడిని చూసి అడిగాడు…

“ఇప్పుడు చెప్పండి… ప్రాణత్యాగం అంత మహోత్కృష్టమైనదా? ఎవడో ముక్కూముఖం తెలియని ఒకడి కోసం అతడు తన ప్రాణాన్ని ఎందుకు పణంగా పెట్టాలి? అందువలన ఆయనకు మోక్షం లభిస్తుందంటే అది ఎంత పచ్చిఅబద్ధం? ఇన్ని రోజులుగా తన భార్యతోను, కొడుకుతోను కర్కశంగా వ్యవహరించినందుకుగాను కాలం అతనిపై కత్తిగట్టడం తప్ప దీనిని మరేమిటంటారు? ఎన్నోరోజుల తర్వాత తన తల్లిదండ్రులతో సంతోషంగా బయటికెళ్ళొచ్చు అని ఆశగా ఎదురుచూసిన ఆ పిల్లాడి భంగపాటుకి మీరు చెప్పే ఈ ప్రాణత్యాగం, జ్ఞానం ఎలా సమాధానం కాగలవు?”

బాటసారి మాటలు వేగం పుంజుకున్నాయి. ఎన్నో రోజులుగా తనలో నిక్షిప్తం చేసుకున్న వర్షాన్ని ఒక్క ఉదుటన కురిసి,వెలిసిన ఆకాశపు ప్రశాంతత అతడి ముఖాన ఆవరించింది. అదే సమయం ఏదో అంతుచిక్కని ఆవేదన.

బుద్ధుడు ఎంతో నెమ్మదిగా చెప్పసాగాడు…

“మరణమన్నది ఎన్నటికీ అంత తేలికగా అధిగమించలేని, ఎంతో సంక్లిష్టమైన విషయమే. అయితే ఒక తాగుబోతుగా… కుటుంబ బాధ్యతలను పట్టించుకోనివానిగా…. కొడుకుతోను, భార్యతోను బూటకపు ప్రేమను చూపేవానిగా… జీవితమంతా అకారణమైన చికాకుతోనే కాలం వెళ్ళబుచ్చేవాడు, తనపై పడ్డ మచ్చను తుడుచుకొనేందుకు దొరికిన సదవకాశాన్ని అత్యంత కారుణ్యంతో అంగీకరించాడు. తన మరణంతో అతను కైవల్యం పొందాడా లేదా అన్న ప్రశ్న కంటే అతడి వలన ఒక ప్రాణం కాపాడబడింది. కనుక అదే మహోత్కృష్టమైనది!!!”

మరణంలో మహోన్నత్వం ఏమున్నది? ఒక తండ్రిగా, ఒక భర్తగా, అతడు పరాజితుడేగా. అయినప్పటికీ ఎవరి గురించి ముందువెనుకలు ఆలోచించకుండా ఆ క్షణంలో ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఎంత మూర్ఖమైనది. అది అక్కడితో ముగిసిపోలేదు. కొందరిని జీవితపర్యంతం శాపంగా వెంటాడింది.

ఆయన అంతిమ సంస్కారాల్లో ఒక వ్యక్తి పురుగులా పక్కకు ఒదిగాడు. బంధుమిత్రులు చెల్లాచెదురైన తర్వాత కూడా అతని ఉనికి కొనసాగింది. ఎప్పుడూ ఆ ఇంటి వాకిట్లోనే నిలబడేవాడు. కిటికీ గుండా ఆ పిల్లవాడు అతడిని తొంగిచూసేటప్పుడు అతడి అమ్మ భళ్ళున వీపుపై ఒక్కటి చరిచేది. కడుపుమంటతో అతడిని శపించేది. కిటికీ తలుపులు భళ్ళున మూతపడేవి.

కట్టుకున్న వాడు తుచ్ఛంగా బలైపోయిన దాని వాకిట్లోనే, దానికి కారణమైనటువంటి వ్యక్తి ఎదురుచూస్తుంటే  ఆమె సైతం అంతకుమించి ఏం చేయగలదు? చనిపోయిన భర్త వలన కాపాడబడిన వ్యక్తి రేయింబవళ్ళు ఇంటి వాకిట్లోనే ఒక యాచకుడిలా ఎదురుచూసేవాడు. ఆ ఎదురుచూపు, అతడు వెతికే ఓదార్పును కాస్తయినా అందించి ఉండాలి. దానిని రివాజుగా అతడు ఆచరించేవాడు. అదేపనిగా అతడు నిరాకరించబడటాన్ని, శపించబడటాన్ని అతడు ఏ మాత్రం లెక్కచెయ్యలేదు.

తనంతట తానే ఇంటి పచారీ సామాన్లను కొనితెచ్చి ఇంటి వాకిట్లో పెట్టేవాడు. అయితే అతడు కొనితెచ్చే వస్తువులను ఏమాత్రం ముట్టుకోక, అవి ఆ ఇంటి వాకిట్లోనే పడుండేవి. ఆ పిల్లాడికి వీధిలోని అంగట్లో ప్రతిరోజూ తినుబండారాలు కొనిచ్చేవాడు. తిను బండారాలను లాక్కొని అతడు కళ్ళెదుటే దుమ్ముపేరుకుపోయిన వీధిలో పడేసి, పిల్లవాడిని కోపం చల్లారే వరకూ కొట్టేది. ఆపై గట్టిగా గుండెలకు హత్తుకుని గుక్కపెట్టి ఏడ్చేది. అమ్మ కన్నీటి వెనుక దాగిన కారణం ఏమాత్రం ఎరుగని ఆ పసివాడి కళ్ళలో కూడా నీళ్ళు తిరిగేవి. ఇంటిపైకప్పును తదేకంగా చూస్తుండే ఆమె ఎరుపెక్కిన కళ్ళు ఎన్నో రాత్రులుగా విశ్రమించలేదు.

ఒకానొక దశలో కళ్ళలో కన్నీళ్ళు సైతం ఇంకిపోయి కిటికీ తలుపులు ముయ్యడం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఏడ్చిఏడ్చి ఏడుపు ఆగిపోయిన కళ్ళు అలసిపోయాయి. చిన్నపిల్లాడి అరచెయ్యి నుండి తేమతో ఊరిపోయిన తినుబండారాన్ని లాక్కొని విసిరికొట్టడం కూడా పూర్తిగా ఆపేసింది. బిగ్గరగా అరిచి అతడిని తిట్టడం, చెవులు దద్దరిల్లేలా అరవడం తగ్గినప్పటికీ ఆమె మానసికఒత్తిడి మాత్రం అంత తేలిగ్గా సద్దుమణగలేదు.

అయితే, భర్తను కోల్పోయిన స్త్రీ ఒక ఏడాది తిరిగేలోపే అందుకు కారణమైన వాడినే అనూహ్యంగా పునర్వివాహం చేసుకుంటుందని ఎవ్వరూ ఏమాత్రం ఊహించలేదు. ఆఖరికి ఆ పిల్లవాడు కూడా. ఆ విషయంలో ఆ పిల్లవాడికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. నిజానికి అది ఒకరకంగా సంతృప్తికరంగానే భావించాడు. ఎందుకంటే అతడు మునుపు భయపడినట్లు ఈ కొత్త నాన్న అర్ధరాత్రులు మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు కాదు. అకారణంగా చెయ్యి చేసుకోవడం లేదు. పైగా అడగకుండానే నూతన వస్త్రాలు, ఆటాడేందుకు బొమ్మలు కూడా కొని తెస్తున్నాడు. ఇదిపోను కలో గంజో తాగి అర్ధాకలితో కడుపు నింపుకున్న రోజులు పూర్తిగా గతించిపోయాయి. ఇప్పుడు అనుకున్నదే తడవుగా, కడుపు నిండేంతవరకు తినేందుకు లభ్యమవుతోంది.

ఒకానొక దశలో నాన్న చనిపోవడమే మంచిది అనుకున్నాడు…

ఇక ఆ చిన్నపిల్లవాడిని ‘నేను’ అనే సంభోధించవచ్చుననే అనుకుంటున్నాను. అదే నేను చెప్పబోయే విషయానికి కూడా న్యాయం చేకూరుస్తుంది.

బుద్ధుడి ముఖాన్ని చూడలేక, తలను కిందకు వాల్చాడు. అడవి మధ్యలో గుండ్రంగా చదును చేయబడ్డ ఆ చోటు వెన్నెల కాంతిలో తటాకంలా గోచరిస్తుంది. ఒక కొంగలా తలవాల్చినవాడు సంకోచంతో తలెత్తి పైకి చూశాడు. పౌర్ణమి వెలుతురులో బుద్ధుడు పాలరాతితో మలిచిన శిల్పంలా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. గౌతముని ముఖం నిశ్చలమై ఉండడం చూసి కాస్త నిట్టూర్పు విడిచినవాడిలా, మళ్ళీ మాట్లాడసాగాడు.

“అమ్మతో అతడు గట్టిగా మాట్లాడటమో, తిట్టటమో, లేదా కొట్టేందుకు చెయ్యి ఎత్తడమో నేను ఏ రోజు చూసెరిగింది లేదు. అమ్మ కూడా ‘నీ వల్లే నా భర్తను కోల్పోయాను’ అని అతను ముందు వెల్లడించడమో, ఏడ్చిగీపెట్టడమో ఏనాడూ చేసి ఎరిగింది లేదు. ఆ విషయంగా నాతోను ఆమె ఏం మాట్లాడింది లేదు. తనలో తను రోదించడం, సణుగుకోవడం తగ్గిపోయింది. అదే సమయాన, ఆమె ముఖం కాంతివిహీనమై రోజురోజుకీ ముఖాన కాఠిన్యం పెరగడం కూడా బాహాటంగానే తెలిసింది. ఏళ్ళు గడుస్తున్నా,

ఎన్నో కొత్త వస్తువులతో ఇంటిని నింపుతున్నప్పటికీ, ఎన్నటికీ పరిపూర్ణం కానీ ఏదో వెలితి నిత్యముండేది.

‘నువ్వు ఆమె కొడుకువేగా…’

‘మొగుణ్ణి బలిచ్చిన వాడినే కట్టుకుందే… భలే ఆడదిలాగుందే ఆమె?’

‘ఆమె మేని రంగు అటువంటిది. అందుకేగా తనంతట తానే ఏరికోరి పెళ్ళి చేసుకున్నాడు.

బాపనోడి పిలక గాలిలో ఊరికే ఊగుతుందా ఏంటి?

అమ్మ పునర్వివాహం తర్వాత బాల్యం నుంచే ఇటువంటి మాటలకు నేను అలవాటుపడినప్పటికీ, మీసాలు మొలిచే సమయానికి ఊర్లో హేళనగా చూసే చూపులు, తరచూ ఎదురయ్యే తిరస్కృతులు సూదిలా గుచ్చుకునేవి. అవమానాలకు జంకి బయట ప్రదేశాలకు వెళ్ళేందుకు కూడా కాస్త సంకోచించేవాడిని.

వీటన్నిటికీ కారణం అమ్మే…. కేవలం అమ్మ మాత్రమే..

అందరి దృష్టిలో నేనొక పురుగులా కనబడేందుకు ఆమె ఒక్కర్తే కారణం.

ఈ ఆలోచన నన్ను పూర్తిగా ఆక్రమించేసరికి, అమ్మ ప్రతిచర్యను బేరీజు వేసుకునేవాడిని. అదే సమయాన, నేను ఆమెతోపాటు మాట్లాడటం తగ్గిపోయింది.

చిన్న అగ్గిరవ్వను పెద్దది చేసి ‘నువ్వు నాకు తండ్రివి ఎలా కాగలవు. నువ్వొక హంతకుడివి’ అని కావాలనే బిగ్గరగా అరిచాను. అయితే ఆయన అందుకు ఎటువంటి ప్రతిస్పందన చూపకపోవడం, నన్ను మరింత మూర్ఖత్వంలోకి  నెట్టింది.

నా లోలోపల చోటు చేసుకునే మార్పులను అమ్మేమి గమనించకుండా లేదు. అయినప్పటికీ మౌనం వహించేది. ఆ మౌనం నన్ను మరింత కోపోద్రిక్తుడిని చేయడంతో ఒకరోజు ఆమెను నేరుగానే అడిగేశాను.

నాన్న చావుకు కారణమైన వ్యక్తితో నువ్వు ఎలా కాపురం చెయ్యగలుగుతున్నావ్?  నాన్న అనుకోకుండా చనిపోయారా లేకపోతే మీరిద్దరూ కలిసి పథకం పన్ని చంపేశారా? నువ్వు ఏం ఆడదానివే? నీకు కొంచెం కూడా ఒళ్ళు కుచించుకు పోలేదా?

అమ్మ ఎటువంటి సమాధానమివ్వలేదు. శూన్యం నిండిన ఒక్క చూపు తప్ప. ముందు నువ్వు నన్ను ఈ ప్రశ్నను అడిగేందుకు అర్హుడివా అనేంతగా ప్రశ్నించింది ఆ చూపు.

అది మనసును తొలిచేసే నిదర్శనాన్ని జీర్ణించుకోలేని అవస్థ. అది కట్టలు తెంచుకున్న విచ్ఛేదనం. దహించే అంతర్ ఘోష నాలో నిత్యం రగులుతుండేవి. అయితే నాకు  సాధ్యమైంది కేవలం నన్ను వెంటాడే చూపుల నుంచి నన్ను నేను దాచుకోవడం మాత్రమే.

అమ్మ తీక్షణమైన చూపులోని మౌన ఆక్రందనకు, ఊర్లో వాళ్ళ సూటిపోటి మాటలకు భయపడి, ఇల్లు విడిచి, బయట ఊరిలో ఉండి, విద్యనభ్యసించి అక్కడే కొలువుదీరాను. దానితో ఊరికి వెళ్ళడం పూర్తిగా ఆగిపోయింది.

నా ఎడబాటు, అమ్మకు నేను విధించే శిక్ష అని నన్ను నేను సముదాయించుకున్నప్పటికీ, నిజానికి ఆమె బలీయమైన మౌనాన్ని ఎదుర్కోలేకనే ఆమెకు దూరంగా నిలిచాను.

మరణశయ్యపై ఆ తర్వాతి రోజుల్లో అమ్మని చూసినప్పుడు ముఖం పొడిబారి, కాఠిన్యం సడలింది. ఊపిరి గట్టిగా బిగబట్టింది. ఎన్నో ఏళ్ళ తర్వాత నన్ను చూసిన ఆమె తన మంచం పక్కన కూర్చోమని చెప్పి, నా ముఖాన్ని సుతారంగా నిమిరింది. మేమిద్దరం కాకుండా గదిలో గాఢమైన మౌనం మాత్రమే చోటు చేసుకుంది.

కొన్ని నిమిషాల బిడియం తర్వాత, తనంతట తానే నెమ్మదిగా మాట్లాడసాగింది.

‘మీ నాన్న చావుకు కారణమైన వ్యక్తినే నేను పునర్వివాహం చేసుకున్నందుకు, నువ్వు అనుకున్నట్టు పేదరికమో, శారీరక అవసరమో కారణం కాదు’ అన్న కఠోర వాస్తవాన్ని నా చెవిలో మెల్లగా గొణిగింది.

మాట్లాడుతున్న బాటసారి గొంతు పెగలక మౌనం వహించాడు. రాత్రి చిరుగాలి చల్లందనము, అతని సంకోచపు తీవ్రతను మరింత ఇనుమడింపజేసింది.

అతని మౌనాన్ని చూసి బుద్ధుడు కనుబొమ్మను పైకెత్తి ఇలా అడిగాడు.

ఇంతకీ అంతలా ఏమంది?

బాటసారి ముఖాన్ని ఇంకోవైపు తిప్పుకొని, అరచేతులు వేడెక్కింతవరకు రుద్దాడు. కింద పడివున్నటువంటి ప్రయాణానికి తెచ్చుకున్న మూటను ఒడిలో తీసి పెట్టుకున్నాడు. చెప్పవలసిన విషయాలను పెదవులు మాత్రం ఒంటరిగా ఒద్దిక చూస్తున్నవి. అసంకల్పితంగా కళ్ళు మూసుకున్నాడు. వీటన్నిటిని ఎందుకు చేశానని ఆలోచించగానే మళ్ళీ మాట్లాడదలిచాడు.

“అమ్మ నా అరచేతులను గట్టిగా పట్టుకొని ఇలా చెప్పింది…”

“మనతో ఉన్నటువంటి ఒక్కొక్క రోజూ, అపరాధభావం ఒక చెదపురుగులా అతడి మనసును తొలిచేస్తూ ఉండేది. ఈ జన్మలో అతడు దాని నుండి బయటపడలేడు. నా ముఖాన్ని దగ్గరగా చూసిన ప్రతిసారి తన లోలోపల అతడు దహించివేయబడటం నేను అనుభూతి చెందగలను. ఆ నిరంతర అవస్థనే  అతడికి నేను విధించిన శిక్ష. అదే నాకు మానసిక సంతృప్తిని కలిగించింది. దానికోసమే అతడినే పునర్వివాహం చేసుకున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా అతడికి మనశ్శాంతి ఉండదు. నా తలంపు సైతం తనకి ఒక అడ్డుకట్టే. ఆఖరికి నువ్వు కూడా.

ఇది వినగానే నా చేతిని ఆమె పిడినుంచి వెనక్కి లాగే ప్రయత్నం చేశాను. అయితే అది సాధ్యపడలేదు. ఆమె చేతులు సైతం ఆమె మాటల్లాగే బిగుసుకుపోయాయి. చనిపోయే చివరిదశలో ఆమె ముఖంలో అమితమైన ప్రశాంతత. ఆ ప్రశాంతతలో దాగిన కక్షసాధింపు, క్రోధం ఎంతో క్రూరమైనవి. తొలిసారి నా తల్లి ముఖాన్ని చూసేందుకు సంకోచించాను” అని బాటసారి గాలి వీచే దిశగా మెదిలే కాగడ అగ్నికీలను చూస్తున్నాడు.

నువ్వేం అనుకుంటున్నావ్? పునర్వివాహం చేసుకొని మీ అమ్మ తన తనివితీరే దాకా అతడిని కక్ష సాధించిందనా? ఒక రకంగా ఇది నిజమైనప్పటికీ, తనకోసం ప్రాణం ఇచ్చిన వాడి భార్యను పెళ్ళి చేసుకునేందుకు ముందుకు వచ్చినప్పుడే అది జీవితాంతం తనకి కలిగించబోయే రణమని కచ్చితంగా తెలిసేవుంటుంది. అది తనకై తాను అంగీకరించిన శిక్షనే. మీ అమ్మ మానసిక సంతృప్తి కోసం మరింత స్పష్టంగా చెప్పాలంటే, నేను కూడా ఇటువంటి ఎన్నో ఏళ్ళ ద్వేషాన్ని ఎదుర్కొన్నాను…” అన్నటువంటి బుద్ధుడు దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ఆపై మాట్లాడడం మొదలెట్టాడు.

ఆ జన్మలో నేను ‘షద్దంత’ జాతికి చెందిన ఏనుగుగా జన్మించాను. అది నా గత జన్మ సత్కర్మల వల్లనే అని చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఏనుగుల కంటే ‘షద్దంత’ జాతికి చెందిన ఏనుగులు ఆకారంలో నాలుగింతలు పెద్దవి. అతిపెద్ద పరిమాణంతో శ్వేత వర్ణంలో, ఆరు దంతాలు కలిగినవి. నుదురు, కాలి గోర్లు సింధూర వర్ణంలో ఉంటాయి. అంతటి విశిష్టత కలిగిన అరుదైన ‘షద్దంత’ ఏనుగుల రాజు అయినటువంటి నేనూ, నా ఇరువురు భార్యలు ఒకరోజు హిమాలయాల నుండి ప్రవహిస్తున్న నదిలో స్నానమాచరించి దేహపు తడి ఆరేంతవరకు మాట్లాడుకుంటూ, అడవిలో మెల్లగా నడుస్తున్నాము…

నా షట్ దంతాలలో మధ్యనున్నటువంటి రెండు దంతాలు అతి పెద్దవి. బాగా దట్టంగా పెరిగాయి. అనుకోకుండా నేను నుదురు విదిల్చినప్పుడు అనూహ్యంగా నా మధ్యదంతం సాలవృక్షానికి మోదడంతో ఎండుటాకులు, చెట్టు బెరడులు, అందులో మెదులుతున్నటువంటి ఎర్రటి చీమలు మొదలైనవి నా భార్య ‘సుల్లసుభక్త’ పైన చెదిరిపడ్డాయి. అసలు సమస్య అక్కడి నుండే మొదలయ్యింది. నా ఇంకొక భార్య అయినటువంటి ‘మహాసుభక్త’ పై కేవలం లేత సింధూర వర్ణపు సాలవృక్షపు పువ్వులు మాత్రమే రాలిపడటమే ఈ సమస్యకు తెరలేపింది. నేను కావాలనే ఆమెను మాత్రం అవమానించాననుకున్న ‘సుల్లసుభక్త’ కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు.

‘సుల్లసుభక్త’ చావు కబురును, మరోజన్మలో ఆమె కాశీ రాణిగా జన్మించిందని, ఎన్నో ఏళ్ళ తర్వాత నేను తెలుసుకోగానే, ఆమె కోసం ఒక రకంగా సంతోషపడసాగాను. అయితే తదుపరి జన్మలోను నా పైనున్నటువంటి కోపమూ, ద్వేషము ఆమె మనసులో అణుమాత్రం కూడా తగ్గలేదనే సంగతి నాకు తెలియదు. నాపై కక్ష సాధించాలనే నెపంతో రాజు వద్ద నా దంతాలను కావాలని బలవంతం చెయ్యడంతో, రాజు ‘సోనుతార’ అనే నేర్పైన వేటగాడి ఆధ్వర్యంలో ఒక దళాన్ని అడవికి పంపించాడు.

‘సోనుతార’ ఏడేళ్ళ,ఏడు మాసాల, ఏడు రోజులు ప్రయాణం చేసి నేను ఉన్నటువంటి చోటును చేరుకున్నాడు. చెరువు పక్కన లోతైన గుంతను తవ్వి ఆకులు అలమలు పోగు చేసి, వాటిని కప్పెట్టి, చెట్ల వెనుక దాకున్నాడు. అనూహ్యంగా నేను గుంతలో పడటంతో వెనక నుండి విషం పూసిన బాణాలు ఎగసిపడ్డాయి. దానితో నాకు మదమెక్కింది. ఎర్రమట్టిని తీసుకొచ్చిపోసి, అడవి దద్దరిల్లేలా ఘీంకరించాను. కట్టలు తెంచుకున్న ఆక్రోషంతో గుంత నుండి బయటపడి, బాణాలు వస్తున్న దిశగా, అడ్డు తగిలిన చెట్లన్నిటిని కూకటివేళ్ళతో పెకలించి పారేసి, అతడిని సమీపించినపుడు ఒక సాధువు వేషంలోని వేటగాడు ‘సోనుతార’ నక్కి ఉండటం తెలియగానే, అతడిపై దాడి చేసేందుకు మనసొప్పలేదు. అతడు కూడా తన విల్లును, అమ్ములపొది, బాణాలను పక్కన పడేసి నా మహాకాయం ముందు శరణాగతి పొందాడు. అతడికి తెలుసు, నన్నెన్నటికీ చంపి నేలకూల్చలేడని.

మీ దంతాలను నేను తీసుకురాకుంటే నాకు మరణశిక్ష అని రాణి ‘సుల్లసుభక్త’ అజ్ఞాపించింది అని గజగజా వణికిపోతూ చెప్పాడు.

అయితే, నా దంతాలను నా అంతట నేనే ముందుకొచ్చి అర్పించనంతవరకు, ఎవరూ వాటిని అపహరించలేరు. అది కూడా నేను ప్రాణాలతో ఉన్న పక్షంలోనే.

‘సుల్లసుభక్త’ నువ్వు అదే కోరుకుంటున్నావా?

నేను కోసిచ్చిన నా దంతాలను ‘సోనుతార’ సుల్లసుభక్తకు సమర్పించాడు. ఇది నా అంతట నేనే సుల్లసుభక్త ఆత్మసంతృప్తి కోసం ఇష్టపూర్వకంగా అంగీకరించిన శిక్ష. ఫలితాల తీవ్రత తెలిసి కూడా అతడు నీ తల్లిని తనకు తానుగా ముందుకు వచ్చి పునర్వివాహం చేసుకున్నట్టుగా.

ద్వేషం, పగ మనసులో ఎంతగా పేరుకుపోయినప్పటికీ, స్వచ్ఛంగా తనని తాను సమర్పించినపుడు దానిని ఎదుర్కొనే శక్తి వాటికి ఎన్నటికీ లేదు. నీ తల్లి కూడా దీనినే ఆఖరి నిమిషాల్లో అనుభూతి చెందుంటుంది.

నా తెగిపడిన దంతాలను చూసినంతనే సుల్లసుభక్త తన తుదిశ్వాస విడిచింది.

బుద్ధుడి సమాధానానికి తృప్తిపడని బాటసారి ‘ఊ’ కొడుతున్నాడు. రెండువైపులా మార్చి మార్చి తల పంకిస్తున్నాడు. మౌనం ఒక క్రూరమృగంలా రక్తమాంసాలతో అతడిని మింగడాన్ని గమనించిన బుద్ధుడు,

“ఏది నిన్ను వెనక్కిలాగుతోంది? తను చనిపోయేవరకు తనలోని అసూయ మారకుండా, పగ సాధించిన నీ తల్లి విద్వేషమా? లేకుంటే దాని సెగలో ఒక చిమ్మటపురుగులా అనునిత్యం రగిలి మాడి మసైపోయిన అతడి వేదనా? దేనిని ఎదుర్కొనేందుకు భయపడుతున్నావ్?  

“నిజానికి నేను నన్ను చూసే భయపడుతున్నాను…”

యుక్తప్రాయంలో ఊరు వదిలి వెళ్ళిపోయిన నేను, అమ్మ మరణం తర్వాత, మళ్ళీ అదే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరోజు ఆయన నన్ను ఒంటరిగా పిలిచాడు. అమ్మ పునర్వివాహం తర్వాత ఆయన నాతో ఇలా ఒంటరిగా ఎన్నడూ పిలిచి మాట్లాడిందిలేదు. నన్ను కూర్చోమని చెప్పిన ఆయన, ఒక పసిబిడ్డలా పొంగుకొస్తున్న దుఃఖంతో ఏడవసాగాడు.

“నీ తండ్రి నా వలనే మరణించాడు. నేను అనుకుంటే ఆయన్ని కాపాడి ఉండొచ్చు. అయితే ప్రాణభీతి నన్ను ఏదీ చెయ్యనివ్వలేదు. చనిపోయే ముందర అతని కళ్ళు నన్నే తదేకంగా చూస్తుండిపోయాయి… నేను కేవలం ఆర్తనాదాలు చేస్తూ, అరుపులు మాత్రమే పెట్టగలిగాను. నీ తండ్రి ఎంతో నిర్ధాక్షిణ్యంగా చనిపోవడానికి నేనే కారణం…నేను శిక్షించబడవలసినవాడిని. నేను అనుకుంటే అతడినే కాపాడుండొచ్చు. నీ తండ్రి నా వల్లే చనిపోయారు…”

అదే విషయాన్ని పదేపదే చెబుతూ ఒళ్ళు ఊగిపోతూ ఏడుస్తూ ఉన్నాడు. ఏళ్ళు గడిచినప్పటికీ ఒకవైపు అతని మీద ఉన్నటువంటి కోపము, అదే సమయం ఏనాడో ఇరవై ఏళ్ళక్రితం జరిగిన సంఘటన కోసం నేరాన్ని తనపై మోపుకుని, గుండెలు పగిలేలా రోదించే అతడిని చూసేందుకు ఎంతగానో జాలేసింది. అతడు నా వద్ద కోరుకుంది ఒకే ఒక్కటి. అదే క్షమాపణ… అతడిని ఎప్పటికీ పట్టి పీడుస్తున్నటువంటి అపరాధభావం నుంచి బంధవిముక్తుడిని చేసేందుకు అది ఒక్కటి చాలు.

అయినప్పటికీ, మానవ హృదయాంతరాలలో మీరు ఎరుగని అసూయ ఒకటి ఉండనే ఉంటుంది. తన వద్ద కన్నీరు చిందించి ఒకడు రిక్త హస్తాలతో మోకరిల్లినప్పుడు, అతడు తనని తాను ఆ దేవుడికి సరిసాటి అనుకుంటాడు. కళ్ళలో హేయమైన చూపు ఒకటి చోటు చేసుకుంటుంది. తన కనికరం కోసం ఎదురు చూస్తున్నట్టు వాడి వేదనను చూసి లోలోపల కుతూహలపడతాడు.

‘అమ్మానాన్నల కాలం ముగిసిపోయింది. నేను కూడా వీటన్నిటిని అధిగమించాను. గతాన్ని మర్చిపోండి’ అని నేను అనుకున్నప్పటికీ మౌనంగానే ఉండిపోయాను. అతడి వేదన అనునిత్యం కొనసాగినప్పటికీ, నేను దానిని పట్టించుకోలేదు. నా ముఖాన్ని నేరుగా చూసేందుకు ఇష్టపడక, అతడు లోలోపల ముడుచుకుపోవడం నేను కూడా కోరుకున్నాను. ఒకవేళ నేను కూడా మా అమ్మలా అతడిపై కక్షగట్టానా…

‘నా తదనంతరం కూడా ఆయనకి ఎటువంటి మనశ్శాంతి ఉండదు’ అని నా ముఖాన్ని తడిమి చూసి అమ్మ పలికిన ఆఖరి మాటలను తలుచుకున్నాను. మొట్టమొదటిసారి  ముఖాన్ని అద్దంలో చూస్తున్నవాడిలా  అణువణువు నన్ను నేను తీక్షణంగా చూడసాగాను. త్రిభుజాకార ముఖం…బండ ముక్కు…దట్టమైన మీసము… బుగ్గలు రెండు తనలో పొదివిదాచినట్టు నిగనిగలాడే నల్లని దట్టమైన గడ్డం…అచ్చం చూసేందుకు బాల్యంలో నేను ఎదుర్కొనేందుకు భయపడే నాన్న ముఖమే!

ఇప్పుడు ఆయన వేదనకు గల కారణమేమిటో అవగతమయ్యింది. నా ముఖమే ఆయన జీవితపర్యంతము ఎదుర్కొనే శాపం. దానిని ఎదుర్కొన్న ప్రతిసారి జ్ఞాపకాలు, దృశ్యాలుగా విచ్చుకుని అతడిని వెంటాడేవి. ఇప్పుడు నా కళ్ళెదుట రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి…

‘పాపం! ఆయన తన చివరి రోజుల్లోనైనా మనశ్శాంతిగా బ్రతకనివ్వని అని నేను అతన్ని విడిచివెళ్ళడం, లేదా నేను కక్ష సాధించదలచిన నా ముఖాన్ని చూసేందుకు వెనకడుగేసే ఒకరి వేదనను, సదా వెన్నంటే ఉండి లోలోపల ఆస్వాదించడం…”

మాటలు వెనకడుగేశాయి. పండిన ఆలివ్ ఆకులు నేల రాలడాన్ని చూస్తుండిపోయాడు. బుద్ధుడి వదనంలో ఒక చిరుదరహాసం. ఆ నవ్వుకు కొనసాగింపుగా, బుద్ధుడు శాంతంగా మాట్లాడ సాగేసరికి, బాటసారి మళ్ళీ అడ్డుపడి ఇలా మాట్లాడాడు.

“ఒకవేళ నా పరిస్థితుల్లో మీరు ఉండి ఉంటే, సర్వం పరిత్యజించిన బుద్ధుడిలా కాకుండా, నిత్యం బాధలలో కొట్టుమిట్టాడే సాధారణ మానవమాతృడిగా సెలవివ్వండి. మీరు ఈ రెండిటిలో దేనిని మనస్ఫూర్తిగా చేసేవారు?”

బాటసారి గొంతు గట్టిగా పలికి, ఆపైన నిశ్శబ్దం అలుముకుంది. బుద్ధుని కనుబొమ్మలు విశాలంగా విచ్చుకొన్నాయి.

తనని తీక్షణంగా చూసే బాటసారి నిశ్చలమైన చూపుల నుంచి తన చూపు మరల్చి ఏదో చెప్పదలచినవాడు కాస్తా, ఒక క్షణం నిదానించి, ఆపై మౌనం వహించాడు. అడవి ఏనుగుల గుంపులా, దూరంలో ఉన్నటువంటి చీకటిలోని పర్వత శ్రేణులను తదేకంగా చూస్తూ, మౌనం వహించినటువంటి బుద్ధుడి కమలవదనంలో కాగడా ఎర్రనిజ్వాల అగ్నికీలతో నీడలా మెదులుతుంది. దట్టమైన కారడవి పూర్తి నిశ్శబ్దంతో అలుముకుంది.

విజయరావణన్

1986లో తిరునల్వేలిలో జన్మించిన విజయరావణన్, 2018 నుండి తమిళ సాహిత్య పత్రికలకు విరివిగా రాస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఇండియాలోను, విదేశాల్లోనూ ఆయిల్ శుద్దీకరణ శాఖలో పనిచేస్తున్న తను, నిత్యం ప్రయాణాలు చెయ్యడం, ఆయా ఊర్లలోని తేనీటిని ఆస్వాదించడం పరిపాటి. 2019 లో ‘కాగిత పడవ’ అనే కథ తమిళంలో ‘ఉత్తమకథ’ గా ఎంపికయ్యింది. ఇంతవరకు ‘నిళర్ కాడు’, ‘ఇరట్టయి ఏసు’ అనే రెండు కథా సంకలనాలు, ‘పచ్చయ్ ఆమై’ అనే ఒక నవలికను రచించారు.

శ్రీనివాస్ తెప్పల

శ్రీనివాస్ తెప్పల 1989 విశాఖజిల్లాలోని పాయకరావుపేట లో జన్మించారు. 1998 లో కుటుంబంతో పాటు చెన్నైలో స్థిరపడిన తను, విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన తను ఆరేళ్ళు గ్రాఫిక్ డిజైనర్‍‍గా పని చేసి 2019 లో జాబ్ వదిలేసి, ప్రస్తుతం సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. సాహిత్యం మీదున్న ఆసక్తితో కొన్ని కథలను, కవితలను అనువాదం చేశారు. కుమార్ కూనపరాజు గారి కథలను ఎంపిక చేసి ‘ముక్కుళిపాన్’ పేరిట, పెద్దింటి అశోక్ కుమార్ గారి జిగిరి నవలను ‘కరడి’ పేరిట తమిళంలోకి అనువదించారు. తమిళ రచయిత నరన్ గారి కథాసంకలనం ‘కేశం’ త్వరలో తెలుగులోకి రానుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *