బతుకు మీద ఆశని పెంచే – క్యాస్ట్ అవే ఆన్ ద మూన్

Spread the love

క్యాస్ట్ అవే సినిమాని చాలామందే చూసి ఉంటారు. దాదాపుగా ఈ సినిమా పేరు తెలియని సినీ అభిమానులు చాలా తక్కువమంది. అయితే “క్యాస్టవే ఆన్ ద మూన్” పేరు విన్నారా? ఇంతకీ ఏముంటుందీ సినిమాలో? హోప్. జీవితం మీద ఒక ఆశని పుట్టిస్తుంది. మన జీవితంలో మనం మర్చిపోయిన ఎన్నో విషయాలని మళ్లీ గుర్తు చేస్తుంది. బతుకు మీద భయం పుట్టి బలవంతంగా ప్రాణం తీసుకోవాలనుకున్న యువకుడు, బతుకులో ఉన్న శూన్యాన్ని తనలో నింపుకుని తనకు తానుగా బంధించుకున్న ఒక యువతి. ఒకరికి తెలియంకుండానే ఒకరు ప్రభావితమయ్యి కొత్త జీవితంలోకి ప్రవేశించేదాకా సాగిన ప్రయాణం. క్యాస్ట్ అవే ఆన్ ద మూన్.

   నష్టాల్లో ఉన్న కంపెనీలో అనుకోకుండా జాబ్ పోయింది. జాబ్ పోయింది కాబట్టి ప్రేయసీ వదిలేసి పోయింది. తీసుకున్న అప్పు తిరిగి కట్టమని ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి. దిక్కు తోచలేదు. చావాలనుకున్నాడు. సిటీ చివరికి వచ్చి ఎత్తైన బ్రిడ్జ్ మీద నుంచి దూకాలని చూశాడు. కానీ, బతుకు మీద తీపి, చావంటే భయం ఒక్క క్షణం ఆపాయి. అదే సమయంలో ఫోన్ రింగయ్యింది. “అప్పు ఎప్పుడు కడతావ్?” అంటూ వచ్చిన కాల్ అది. ఇక ఏం ఆలోచించకుండా కింద కనిపిస్తున్న రివర్‌లోకి దూకేశాడు. ఇక అన్ని బాధలనుంచీ చావు తనని రక్షిస్తుంది…

   కానీ అలా జరగలేదు… అతను బతికాడు. నది మధ్యలో ఉన్న ఒక ఐలాండ్‌కి కొట్టుకు వచ్చాడు. బతికినందుకు మళ్లీ బాధపడ్డాడు. ఇక ముందు మళ్లీ అవే బాధలతో బతకటానికి భయపడ్డాడు. కానీ, మళ్లీ చావటానికి కూడా భయమే అడ్డొచ్చింది. బతకటానికే ప్రయత్నిద్దామనుకుంటూ చివరి ఆశగా తనదగ్గరున్న ఫోన్ తీసి కాల్ చేద్దామనుకుంటే నీళ్లలో తడిసిన ఫోన్ సరిగ్గా పని చేయటంలేదు. ఎలాగోలా తంటాలు పడితే ఫోన్ ఆన్ అయ్యిందిగానీ. బ్యాటరీ అయిపోయింది. ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేస్తే ప్రాంక్ అనుకున్నారు, ఎక్స్ గాళ్‌ఫ్రెండ్‌కి కాల్ చేస్తే వినకుండానే తిట్టి కట్ చేసింది. ఫోన్ డెడ్ అయ్యింది… అతని ఆశలు కూడా.

   కంటికి సిటీ కనిపిస్తోంది, తాను దూకిన బ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది. కానీ దూరంగా ఉన్నాయి. నదిని దాటటానికి తనకి ఈతరాదు. అలా అక్కడే మిగిలిపోయాడు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఐలాండ్‌లో ఉన్న అడవిలో తానూ. మళ్లీ చావటానికి తన మెడలో ఉన్న టైతో ఉరేసుకోవాలనుకున్నాడు. ఉరి వేసుకోబోతుండగా సైరన్ వినిపించింది. సివిల్ డిఫెన్స్ డే… సంవత్సరానికి రెండుసార్లు జరిగే డ్రిల్ అది. ఆ సమయంలో పౌరులంతా కాసేపు సైనికుల గౌరవార్థం చేస్తున్న పనులన్నీ ఆపేస్తారు. అతనూ ఆగిపోయాడు. చుట్టూ ఉన్న అడవిని చూశాడు. ఆకలికి తట్టుకోలేక అడవిలో కనిపించిన మష్రూమ్స్ తిన్నాడు. చేపలు పట్టటం కుదరలేదు. కనీసం చెట్లమీద ఉన్న పక్షుల గుడ్లని తిందామంటే చెట్టెక్కటం కూడా రాదు. అతని నాగరిక జీవితం ఈ రకమైన వేటని నేర్పించలేదు మరి. ఒడ్డు మీద ఇసుకలో హెల్ప్ అని రాసి ఉంచాడు.

   అటుగా నదిలో వచ్చిన బోట్‌ని పిలుస్తూ అరిచాడు, ఆ ప్రయత్నమూ కుదరలేదు…. నెమ్మదిగా ఆ దీవిని చుట్టబెడుతూ, నదిలో కొట్టుకు వచ్చిన వేస్ట్‌లో వెతుకుతూ ఆ చెత్తలోనుంచే తనకు అవసరమయ్యే వస్తువులని ఏరుకున్నాడు. బాతు ఆకారంలో ఉన్న ఒక టాయ్‌బోట్‌ని ఇల్లుగా చేసుకున్నాడు. అన్నేళ్లు కష్టపడ్డా నగరంలో అతనికి సొంత ఇల్లు లేదు. కానీ ఇప్పుడతని సొంతంగా ఒక దీవి ఉంది. చిన్న సొంత ఇల్లు కూడా ఉంది. ఇప్పుడతనిలో జీవితం మీద ప్రేమ మొదలైంది. ఈ కొత్త జీవితాన్నే అతను ఇష్టపడ్డాడు. ఇక్కడ ఇంటి అద్దె, కట్టాల్సిన అప్పు, ఆడంబరమైన బట్టలు ఇలా ఏ బాధలూ లేవు. కొత్త జీవితం, కొత్త ఆశ…

  బతుకు మీద ప్రేమ మొదలైంది. ఇక్కడినుంచీ అతని సర్వైవల్ ఆఫ్ లైఫ్ అద్బుతంగా ఉంటుంది. హెల్ప్ అనే అక్షరాలని హెలో అని మార్చాడు.

   రోజూ అతనికి సిటీ కనిపిస్తూనే ఉంటుంది, రోడ్డు మీద తిరిగే వాహనాలూ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అతని ప్రపంచం వేరే. అది అతని సొంత ప్రపంచం, అతని సొంత జీవితం. చేపలు పట్టడం నేర్చుకున్నాడు. వాటిని కాల్చుకు తినటమూ అలవాటు చేసుకున్నాడు. నెలలు గడిచాయి. ఒకనాడు అతనికి ఒక నూడుల్స్ ప్యాకెట్ కనిపించింది. నదిలో కొట్టుకువచ్చిన ఖళీ కవర్. చిన్న నాటి జీవితం గుర్తొచ్చింది. ఇవే నూడుల్స్‌ని అమ్మ పెడితే వద్దని వదిలేశాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడతనికి ఆ నూడుల్స్ తినాలనిపించింది. కానీ ఎలా?? దానికోసం ఒక విచిత్రమైన పద్ధతిలో వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు….

                     *        *           *

   ఇదే సమయంలో సిటీలోని ఒక ఎత్తైన బిల్డింగ్. ఒక లావిష్ అపార్ట్‌మెంట్‌లోని చిన్న గది. ఆ గదిలో తనని తాను బంధించుకున్న అమ్మాయి. వింత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి. తల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా తన గదికే పరిమితమైపోయి, సోషల్ మీడియాలో బతుకుతున్న అమ్మాయి. అతను నగరానికి దూరంగా ఒంటరివాడైతే… ఆమె నగరంలో ఉంటూనే ఒంటరిగా బతుకుతోంది. అందవిహీనమైన మొహాన్ని దాచుకొని, అందమైన అమ్మాయి ఫొటోతో సోషల్ మీడియా ఎకౌంట్ తెరిచిన అమ్మాయి. అనుకోకుండా ఒకరోజు తన దగ్గరున్న కెమెరాతో సిటీని ఫొటోతీద్దామని కిటికీలోంచి చూస్తూండగా లెన్స్‌లోంచి నది దగ్గరున్న హెల్ప్ అనే అక్షరాలు కనిపించాయి. ఇంకాస్త  జూమ్ చేసి చూస్తే అక్కడే ఒంటరిగా బతుకుతున్న అతను కనిపించాడు. రోజూ అతన్ని గమనిస్తూ ఫొటోలు తీస్తోంది. అతను చేపలు పట్టడం, వస్తువులు ఏరుకోవటం, బట్టలు లేకుండా డాన్స్ చేయటం అంతా విచిత్రంగా అనిపించింది.

   కొన్నాళ్లకి ఒకరోజు రాత్రిపూట ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సీసాలో హెల్లో అని రాసి ఐలండ్‌లో పడేలాగా విసిరింది. ఎప్పుడూ ఆమె బయటికి రాలేదు, పగలు పూట అసలు రాలేదు. కానీ అతనికోసం ఇప్పుడు అర్థరాత్రి తన ప్రపంచాన్ని దాటి వచ్చింది.  అతను నూడుల్స్‌కోసం ఆశపడుతున్నాడని అతని కోసం స్పెషల్ బోట్ వేసుకుని వెళ్లేంత డబ్బిచ్చి మరీ నూడుల్స్ ఆర్దర్ చేసింది. కానీ అతను ఆ నూడుల్స్ తీసుకోలేదు. అక్కడ తానే పంటపండించి నూడుల్స్ తినాలని అనుకుంటున్నాని. అదే తనకు “హోప్” అనీ డెలివరీ బాయ్‌తో చెప్పాడు. అతన్ని తన ఐలాండ్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాడు.

  నెమ్మదిగా ఆమెకూ జీవితం మీద ఒక కొత్త ఆశ మొదలైంది. సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ జీవితం మీదా విరక్తి పుట్టింది. తన జీవితాన్ని మరెవరోలాగా జీవించటం ఏమిటి? అనుకుంది.  కొన్ని సంవత్సరాల తర్వాత తల్లితో మాట్లాడింది. తనకు కొన్ని మొక్కజొన్న విత్తనాలు కావాలని అడిగి మరీ ఖాళీ దబ్బాల్లో బాల్కనీ వ్యవసాయం మొదలు పెట్టింది. ఇద్దరిలోనూ కొత్త మొలకలు, కొత్త ఆశలూ చిగురించాయి. ఆమె వ్యాధి నయమవుతూ వచ్చింది. అతని వ్యవసాయం ఎదుగుతూ వస్తోంది… కానీ, వర్షం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది.

     ఆశ ఎంత ఉంటుందో దానిని నిలబెట్టుకోవటానికి వచ్చే కష్టాలూ అలాగే ఉంటాయ్. అయినా ఇద్దరిలోనూ జీవితం మీద ఆశ మాత్రం పచ్చగానే ఉంది.

                  *           *         *

  కొన్నాళ్లకి ఆ దీవిని డెవలప్ చేయటానికి వచ్చిన గవర్నమెంట్ సిబ్బంది. అతన్ని దీవినుంచి బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. మళ్లీ నగరం రోడ్లమీద పడేశారు. అంతకాలం లేని భయం, అభద్రత చుట్టు ముట్టాయి. మళ్లీ చావుమీద మనసుపోయింది. ఈసారి తాను రోజూ చూస్తున్న ఎత్తైన బిల్డింగ్ ఎక్కి చావాలనుకున్నాడు. దాని దగ్గరికి వెళ్లే బస్ ఎక్కేశాడు.

    ఇదంతా కెమెరాలోంచి చూస్తున్న ఆ అమ్మయి ఇక ఆగలేకపోయింది. అతన్ని కలవటానికి అన్ని సంవత్సరాలుగా ఉన గదిని దాటి పగలు పూట బయటకు వచ్చింది. పరుగు… అతన్ని అందుకోవటానికి పరుగు. ఆ దీవిలో అయితే అతనొక్కడే కనీ ఈ నగరంలో ఇంత మంది మనుషుల మధ్య మళ్లీ అతను కనిపిస్తాడా? అసాధ్యం కదా. అందుకే పరుగు తీసింది. అతను ఎక్కిన బస్ వెనుకే పరుగు తీసింది. చావుకోసం వెల్తున్న అతన్ని ఆపటానికి ఏడుస్తూ తన సొంత మొహంతో, మన్శుల మధ్య ఏ భయమూ లేకుండా పరుగుతీసింది. అంతలో సంవత్సరానికి రెండుసార్లు జరిగే సైనిక దినోత్సవ సైరన్ మోగింది. బస్ ఆగింది…..

   ఆమె అతన్ని కలిసిందా? ఇంతకీ ఆమె పేరేమిటి? అన్నాళ్లూ ఆమెలో ఆశని నింపిన అతని పేరేమిటి? జీవితం అంటే కష్టాలూ, కన్నీళ్లూ, విడిపోయిన ప్రేమలూ మాత్రమేనా?

    ఎక్కడో ఎవ్వరూ కనిపించని చోట నీకంటూ ఒక ఆశ దాచిపెట్టబడి ఉంది. దాన్ని కనుక్కుంటే బతకొచ్చు… ఏదీ లేదో దాన్ని సృష్టించుకొని బతకొచ్చు. చావులోంచి కూడా కొత్త బతుకు పుట్టొచ్చు…

                        *              *                * 

   దక్షిణ కొరియా సినిమాలో దర్శకుడుగా, స్క్రీన్ రైటర్‌గా పరిచితుడైన లీ హే-జున్ డైరెక్షన్‌లో 2009లో వచ్చిందీ సినిమా. కథా, స్క్రీన్‌ప్లే కూడా అతనే. ఎంతో క్లిష్టంగా ఉండే కథని అత్యంత సాధారణంగా, సింపుల్‌గానే చేసాడు లీ. నిజానికి ఇలా తీయటం వల్లనే ఎక్కువమందికి రీచ్ అయ్యి ఉంటుంది.  ఇతని దర్శకత్వంలోనే వచ్చిన “My Dictator” సినిమా గురించి ఇంకోసారి మాట్లాడుకోవాలి. లీ హే-జున్ కథ ఇచ్చిన సినిమాల్లో “Golden Slumber” , “Coming Out” లాంటి మంచి సినిమాలు ఉన్నాయి.

   హీరోగా చేసిన “జంగ్ జే”, అతన్ని గమనించే అమ్మాయిగా కనిపించే “జంగ్ రియో”ల నటన సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది.  2009లో 29వ హవాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డును గెలుచుకుంది. ఉడిన్ ఫార్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, శాంటా బార్బరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా వివిధ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డ్స్, ప్రశంసలని దక్కించుకుంది . గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ప్లానింగ్ అవార్డులనీ అందుకుంది. 

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *