నా చదువు కథ పార్ట్ 8

Spread the love

నేను కథలూ,నవలలూ చదివే రోజులలోనే నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథా సంకలనాలు వస్తూ వుండేవి.వాటిల్లో డి.రామలింగం గారు కూర్చిన సంకలనాలు బాగుండేవి.అలాంటి సంకలనాలలో ఒక దాంట్లో “బ్రిడ్జి క్రింద” అనే కథ చదివాను.చాలా నచ్చింది .గొప్ప కథ అనిపించింది.కథంతా పూర్తయ్యాక యెవరు రాశారా? అని చూస్తే ,ఆర్ .వసుంధరాదేవి అనే పేరు కనిపించింది.అదే మొదటి సారి నేనా పేరు చూడడం. అది చూసి నేను చాలా ఆశ్చర్య పోయాను,ఎందుకంటే ఆ కథంతా దాదాపు అట్టడుగు వర్గాల గురించే.రిక్షా లాక్కునే వాళ్లూ ,అతిపేదగా జీవించే వాళ్లూ అనుభవించే కష్టాలూ ,కన్నీళ్లూ,వారి ఆశలూ,నిరాశలూఅంతా ఇదే.

నాకానాడు వున్న ఆలోచనా ధోరణి ప్రకారం ఒక రచయిత్రికి ఇలాంటి వర్గాల జీవన విధానం పరిశీలించే అవకాశం దొరకడం కష్టమనీ,ఒకవేళ దొరికినా దానినంత ప్రతిభావంతంగా చిత్రించడం అసాధ్యమనీ అనిపించడం వలన ఆ ఆశ్చర్యం.

పైగా ఆ రోజుల్లో రచయిత్రులు రచించేదంతా “వంటింటి సాహిత్యం” అనే పేరుతో అపహాస్యానికి గురవుతూ వుండేది.

ఆ తర్వాత ఆమె రాసిన కథలు అక్కడక్కడా కనపడినప్పుడల్లా చదువుతూ వుండేదాన్ని .

చాలామంది రచయితల కథలు కాలక్షేపానికి చదివి మరిచిపోయేవి.అలాకాకుండా చదివిన తర్వాత కూడాచాలా కాలం వరకూ వెంటాడుతూ ఆలోచనలని రేకెత్తిస్తూ వుండే కథలు చాలా తక్కువ.

ఆర్. వసుంధరా దేవి గారి కథలు ఆ కోవకు చెందినవి.

ఆమె కథలు  కేవలం ఆలోచింప జేయడమే కాదు  ,మానసిక విశ్లేషణ తోనూ,తాత్త్వికధోరణితోనూ నిండి వాస్తవానికి దగ్గరగా వుండటం విశేషం

2004వ సంవత్సరంలో ఆవిడ రాసిన నలభై యెనిమిది కథలు ఒక సంకలనంగా “ఆర్ .వసుంధరాదేవి కథలు” పేరిట పుస్తకం వెలువడింది.

ఆ పుస్తకం తీసి చదువుతుంటే నా తల తిరిగి పోయింది. ఎన్ని రకాల జీవితాలని కథలుగా రాశారు? ఎంత వస్తు వైవిధ్యం ?ఎంత లోతైన ఆలోచనా ధోరణి?ఎంత ఫిలాసఫీ? అని.

ఆవిడ చిత్రించిన పాత్రలలో చిన్నపిల్లలూ,ముసలి వాళ్లూ,మధ్యతరగతి గృహిణులూ,పేదవారూ,ఉన్నతస్థాయి వ్యక్తులూ ఇలా అన్ని వర్ణాల,వర్గాల వారూ కనపడతారు.

వీరందరూ అతి సహజంగా వారి పరిథి మేరకు ప్రవర్తిస్తారే గానీ యెక్కడా  అసహజంగా కృత్రిమంగా ప్రవర్తించరు.

ఇంకో విశేషం ఏ ప్రాంతానికి చెందిన పాత్ర ఆ ప్రాంతానికే చెందిన యాసతో మాట్లాడుతుంది.ఎలా పట్టుకున్నారో ఆమె ఈ టెక్నిక్ తెలియదు,గుంటూరు జిల్లా యాస,చిత్తూరు జిల్లా యాస బహు అందంగా పలికించారు.

ఉదాహరణకి “చెరువు దగ్గర” అనే కథలో లింగయ్య అనే పనివాడు రాయలసీమ యాసలో అద్భుతంగా మాట్లాడుతాడు.

“బ్రిడ్జీక్రింద” అనే కథలో  పూర్తిగా గుంటూరు జిల్లా యాస తొణికిలాడుతుంది.

ఇప్పుడు ఆవిడ రాసిన కొన్ని కథల గురించి చెప్పుకుందాం అన్ని కథల గురించీ మాట్లాడటం కుదరదు కాబట్టి

నాకు ఆవిడ కథలలో బాగా ఇష్టమైన కథ “బ్రిడ్జీక్రింద” ఈ కథలో ఆవిడ పల్లెటూరులో వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలయిపోయి,ఆ అప్పులు తీర్చుకోవడానికి తన రెక్కలనే నమ్ముకుని పట్టణానికి వలస వచ్చిన ఒక సన్నకారు రైతు కుటుంబం గురించి రాశారు.

పల్లెలో పరువుగా బతుకుతున్న ఆ రైతు పట్టణంలో రిక్షా తొక్కి నిజాయితీగా డబ్బుకూడబెట్టి షావుకారు అప్పుతీర్చి తిరిగి ఊరు వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని కలలు కంటూ వుంటాడు.మొదట్లో కాస్త బాగానే జరుగుబాటుగా అనిపించినా హఠాత్తుగా అతని బావమరిది అతను పెంచుకున్న గొర్రెపిల్లని దొంగతనంగా అమ్మేసి ,ఆ సొమ్ముతో తాగి దొర్లుతుంటే కడుపు మండి అతనితో తగాదా పడతాడు.,ఇద్దరూ కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలులో పెడతారు.ఆ జైలునుంచీ విడిపించటానికి అతను కూడబెట్టిన కాసింత డబ్బుతో పాటు అప్పుచేయవలసి వస్తుంది.

ఒక్కసారిగా పైసా చేతిలో లేకుండా నిరుపేదగా నడిరోడ్డులో నిలబడవలసి వస్తుంది అతని కుటుంబం.ఇది అతనిని అయోమయానికి గురి చేస్తుంది.ఆ అయోమయంలో ఆవేదనకి గురి అయి యెన్నడూ లేనిది తాగి మళ్లీ తగాదాలోకి దిగుతాడు మళ్లీ పోలీసుల చేతిలో పడకుండా తప్పించడానికి అతని భార్య ఇంకా అప్పుచేస్తుంది.

మానం మర్యాదా కాపాడుకుంటూ కష్టపడి కడుపుకట్టుకుని డబ్బు సంపాదించి ,షావుకారు అప్పుతీర్చాలనుకున్న పోతప్ప చివరికి డబ్బునీ, ఆత్మ విశ్వాసాన్నీ కూడా కోల్పోయి యేం చేయాలో అర్థం కాక నిరోమయంగా అయిపోతాడు.

రైతులని కూలీలూగా,పేదలని అతి పేదలుగా మార్చే ఈ సమాజపు పోకడమీద తగిలించిన చురక ఈ కథ  

“చెరువు దగ్గర”—-సంఘం మనుషుల మీద కొన్ని ముద్రలు వేస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్లమీద ఈ ముద్రలు అధికంగా వుంటాయి “ఆడపిల్లలు చెట్లేక్క గూడదు, ఆడపిల్లలు యెక్కువగా నవ్వకూడదు, యెవరింటికీ వెళ్లకూడదు ,భార్య భర్తకు అనుకూలంగా,అణకువగా వుండాలి ,ఆడదానికి శీలం ముఖ్యం” ఇలాంటి ముద్రల ప్రభావంతో పెరిగిన సుశీలమ్మ ,కమర్షియల్ బ్యాంక్ నడుపుతున్న భర్త ఆనందరావుతో భద్రమైన జీవితమే గడుపుతూ వున్నా యెక్కడో యేదో అసంతృప్తి .తనకు కావలసిన విధంగా స్వేఛ్ఛగా ఆనందంగా జీవితం గడపలేకపోతున్నానేమో అనే సందేహం ఆమెను పట్టి పీడిస్తూ వుంటుంది.

ఇలాంటి ఆమె జీవితంలో  యనభై యేళ్ల పనివాడు లింగప్ప పెద్ద రిలీఫ్ .జీవనోత్సాహంతో అతను చెప్పే కబుర్లు ఆమెను సేదతీరుస్తాయి.

ఈ లోగా భర్త మీద కక్షతో అతని విరోధులు భార్యాభర్తలను బంధించి ,భార్యపై అత్యాచారం చేస్తారు.ఈ సంఘటన ఆమెను అల్లకల్లోలం చేస్తుంది తన మీద వున్న ముద్రలను వదిలించుకుని మామూలు జీవితం గడపలేక పోతుంది.చుట్టూ వున్న వాళ్ల నిర్లిప్తత బాధిస్తుంది.జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్న ఆమె ఆలోచన గ్రహించిన లింగప్ప “పానం పోగొట్టుకోటం ఏలనమ్మా.ఎందరు జనాలు బతకటం లేదు,దేవుడు పెట్టినయ్యన్నీ అనుబగించాలి గెదా” అంటాడు ఇంకా “ఈ ఊల్లో వుండలేకపోతే   మా వోల్లకాడికి పంపిత్తా ,మా కోడలి సుట్టంరాలివి అని యాదో నే సెప్పుకుంటా.నీకేల అదంతా.బతకటానికి సోటేలేదా” అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు.

కానీ ఆమె  ఇన్నాళ్లూ తాను నిజమని నమ్మిన నాగరికత తనకు న్యాయం చెయ్యలేదు అని భావించింది.

తనలో తాను ఆలోచించుకుంటూ “నాకు అంటిన తప్పుఏది? అని తన్ను తాను చూచుకున్నది.’నాకు తప్పు అంటితే నాలో ప్రాణం యెందుకున్నది?ప్రాణం భగవంతుడు కదా?’ అనుకుంది తేలిగ్గా

చివరకు కథని ఈ వాక్యాలతో ముగించారు వసుంధరా దేవి.

“ఆమె కాలికి ఎదుర్రాయి తగిలింది.బోర్లాపడి క్రిందకి దొర్లిపోయింది.రాళ్లు తగిలిన చోట చర్మం చీరుకుపోయింది. ఆమెకు నొప్పి తెలియలేదు.భయం తెలియలేదు. అక్కడి రాళ్లలో రాయిగా,మట్టిలో మట్టిగా ,ఆ సత్యంలో సత్యంగా ప్రకృతి గర్భం లోకి చేరిపోయింది.

అలా తాను చేయని తప్పుకి బలయిపోయింది సుశీలమ్మ

“గాలిరథం”  వలీ అనే యెనిమిదేళ్ల పిల్లవాడి కథ తనని యెంతో ప్రేమించిన తల్లి మరణిస్తే  ఒక్క సారిగా వాడి జీవితం తల్లకిందులవుతుంది.కూలీనాలీ చేసుకువచ్చి పిల్లవాడిని పోషిస్తూ వుంటుందామె .వాడారోజల్లా యెక్కడెక్కడో తిరుగుతాడు తల్లి అంత్య క్రియల డబ్బుకోసం మోయలేని బరువులు మోస్తాడు.అయినా ఆ డబ్బులు అతనికి దక్కనీకుండా యెవడో లాక్కుంటాడు.చివరికి తల్లిశవంతో పాటు ఖబర్ స్థాన్ కి వెళ్లేటప్పుడే వాడి తాగుబోతు బావ వాడి భవిష్యత్తుని నిర్ణయిస్తాడు.

వాడిని మొదట కాకా హోటల్లో సర్వర్ ని చేస్తాననీ కాస్త కాలు సాగాక ఆఫీసర్ల క్లబ్బులో బోయ్ గా చేరుస్తాననీ వాడి జాతకం చెబుతాడు.

అప్పుడు వాడికి వాళ్లమ్మ చెప్పేమాట “రాతికీ రాతికీ మద్దెన పుట్టే చెట్టుకు ఎవరు పోషణ చేస్తారు? ఆ గాలీ ,ఆ దేవుడూనూ” జ్ఞాపకం వచ్చింది.

సమాజపు అంచున గాలివాటంగా జీవించే కుటుంబాలలోని పిల్లల జీవితాలకు అద్దం పడుతుందీ కథ.

“మనుషులూ- బొద్దింకలూ” అనే కథలో ఒకామెకు ఏ వాతావరణంలోనయినా,ఎలాంటి పరిస్థితులలో అయినా తట్టుకుని నిలబడి బతికే బొద్దింకలంటే అసహ్యం .అలాగే పరిస్థితుల కనుకూలంగా తమను తాము మార్చుకుని బొద్దింకల్లా బతికే మనుషులన్నా అసహ్యమే .పరిస్థితుల కెదురీది,సమాజాన్ని లెక్కజెయ్యకుండా తమ ఇష్టాను సారం బతికే మనుషులంటే ఇష్టం. 

చివరికి ఆమె యేమనుకుంటుందంటే 

“మనుషులు పోయి బొద్దింకలే బతకటం సాధ్యమా? కావచ్చు కాని…కాని….తెలివిగల మనిషి చివరికి మిగిలేది బొద్దింకేనని గ్రహించి తానే బొద్దింకయి మిగులుతాడేమో!

ఎంత ఘోరం!” అని

“పెంజీకటి కవ్వల” అనే కథలో ఆధ్యాత్మికత పాళ్లెక్కువ,మానసిక విశ్లేషణ కూడా సమ పాళ్లలోనే వుంటుంది.

ఇందులో జయలక్ష్మి అనే ఆమె మనస్సు స్థిరంగా వుండదు అనేక ఆలోచనలు అసలు ఈలోకంలో ఈబాధలూ, ఈకష్టాలూ యెందుకున్నాయి ?జీవితానికి అర్థమూ లక్ష్యమూ యేమిటీ? మనుషులు చనిపోవడమేమిటీ?మనం చనిపోయాక కూడ ఈ ప్రపంచమంతా మామూలుగానే జరిగిపోవడమేమిటీ? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

 తన ఇద్దరు పిల్లల్లో ఒక పిల్ల చలాకీగా తెలివిగా వుంటే రెండో పిల్ల బుధ్ధి మాంద్యంతో అర్భకంగా వుంటుంది.

రెండో పిల్లపట్ల  ప్రేమా వుంటుంది, ఎందుకిలా పుట్టింది ?అనే బాధలోంచి వచ్చిన ఆవేదనా వుంటుంది.

ఆ ఆవేదనతో ఒకోసారి ఆ పిల్లను శిక్షిస్తూ వుంటుంది,మళ్లీ బాధపడుతూ వుంటుంది.

చివరికి ఆమెకి ఒక సాంత్వన దొరుకుతుంది,ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుంది.ఇదివరకు నేను లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే వుంటుందా? అని బాధపడ్డ మనిషి.

నేను లేకపోయినా ఈ మనుష్యులూ,చెట్లూ,గోరింకలూ ,సూర్యుడూ ,ఆకాశం …..అన్నీ ఎప్పటికీ వుంటాయి అని ఆనందంగా అనుకోవడంతో కథ ముగుస్తుంది .గొప్ప కథ

“చిట్టి రాజు” అనే కథ  లో ఒకామె అమెరికాలో వుంటున్న కూతురి బిడ్డని ఇండియా తీసుకు వచ్చి ఒక మూడేళ్లు పెంచి మళ్లీ అమెరికాలోని కూతురూ అల్లుడికి అప్పజెప్పడానికి అమెరికా వస్తుంది.అప్పుడు ఆమె మనసులో మెదిలే భావాలూ,మనవడిని పెంచిన మమకారంతో వదల లేకపోవడం,అల్లుడు బిడ్డ తమకు అలవాటు కావడం లేదనే కోపంలో అత్త గారి పెంపకాన్ని అవహేళన చెయ్యడం.దానిని భరించలేక ,మనవడి మీద మమకారం తెంచుకోలేక ఆమె పడే అవస్థ యెంతో సహజంగా రాశారు.

“అమ్మా ఇక శెలవు” అనే కథలో పాత్ర తన తల్లి చివరి రోజుల గురించి  చెబుతూ వుంటుంది.ఈ కథ చాలా హృద్యంగా వుంటుంది .ఇది చదివిన వారిలో చాలామంది ఇది మా అమ్మ కథే అనుకునే అవకాశం వుంది.

“శివరావు కోట” అన్న కథ  తర్వాత విస్తరించి రాస్తే “భారతి” మాస పత్రికలో ధారావాహికగా ప్రచురించబడి ఆ తర్వాత “రెడ్డెమ్మ గుండు “అనే నవలగా ప్రచురించ బడింది అని రచయిత్రి ఈ కథల పుస్తకానికి రాసిన ముందుమాటలో రాశారు.

 వసుంధరా దేవి గారి కథలన్నీ  ఎంతో వైవిధ్యంగా వుంటాయి.ఒక్కో కథ లో ఒక్కో ప్రత్యేకత వుంటుంది.

 .ప్రతి కథలోనూ అనేక కోణాలు వుంటాయి అనేక పొరలు వుంటాయి .ఆషామాషీగా చదివి అవతల పారేసేవి కాదు జాగ్రత్తగా నెమ్మదిగా చదవాలి.

ఆమె  తన కథల పుస్తకం ముందుమాటలో యేమంటారంటే

“రచన ప్రయోజనం –ఆలోచనా పరులైన సహృదయ పాఠకుల ముందుకు వచ్చి వారి జ్ఞాపకాల్లో నిలవడం,అందుకే నా కథలని ఈపుస్తక రూపంలో మీముందు వుంచుతున్నాను”అని

ఆమె కథలు “భారతి,ఆంధ్ర పత్రిక,జాగృతి,జమీన్ రైతు,యువ” మొదలైన ప్రముఖ పత్రికలలో ప్రచురించ బడ్డాయి.

ఆమె రచనలకు సాహిత్య అకాడెమీ అవార్డూ,నూతలపాటి గంగాధరం అవార్డూ లభించాయి.

ఆమె వ్యక్తిగత వివరాల గురించి చెప్పాలంటే ఆమె గుంటూరు జిల్లాకు చెందిన వారు .గ్రాడ్యుయేషన్ వరకూ గుంటూరులో చదువుకున్నారు.ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశారు. ప్రఖ్యాత విమర్శకులు ఆర్ .యస్ .సుదర్శనం గారు ఆమె భర్త.ఆమె ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు .ఇంతకు మించిన సమాచారం నాకు లభించలేదు.

వసుంధరా దేవి గారి రచనల గురించి విశ్లేషించడం చాలా కష్టమైన పని.ఆమె కథల్లో ఎన్నో పార్శ్వాలూ,పొరలూ వుంటాయని చెప్పుకున్నాం కదా,ఎవరికి వారే ఆ కథలని చదివి ఆ కోణాలన్నీ దర్శించాలి.

తెలుగులో అత్యున్నత స్థాయికి చెందిన రచనలు చేసిన వసుంధరా దేవి గారికి ఎందుకో రావలసినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది.

తెలుగులో నాకు నచ్చిన రచయిత్రి పేరు చెప్పమంటే నేను మొట్ట మొదట వసుంధరా దేవి గారి పేరే చెబుతాను.

డా. రొంపిచర్ల భార్గవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *