డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 12

Spread the love

1915 లో ఐదు సార్లు దాడికి గురై,ఎన్నో నష్టాలు చవి చూసిన ఒక బృందానికి మరలా దాడికి సిద్ధంగా ఉండమని ఆజ్ఞ వచ్చింది. ఆ బృందంలో మిగిలిన వారు దానికి నిరాకరించి వెనుదిరిగారు. ఆ సమయంలో లిస్ట్ నిట్ స్కీ దళానికి వారిని అడ్డుకోమని ఆజ్ఞ వచ్చింది. ఆ ప్రయత్నంలో లిస్ట్ నిట్ స్కీ దళం వారిపై పేలుళ్ళకు సిద్ధమైనప్పుడు,ఆ మొత్తం బృందంలో అరవై మంది కూడా లేకపోయినప్పటికి వారు తమను తాము కొసాక్కుల నుండి రక్షించుకోవడానికి చేసిన భీకర పోరాటం,ఎలాగూ చనిపోతామని తెలిసి కూడా ప్రదర్శించిన వీరత్వం లిస్ట్ నిట్ స్కీ కి గుర్తుకు వచ్చింది.

      ఆ ఘటన అతనికి ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.కొసాక్కుల ముఖాలను చూస్తూ,’మేము కూడా ఏదో ఒక రోజు ఒక్క చావు తప్ప ఏది ఆపలేని దశలో ఉంటామా?’అని తనలో తానే అనుకున్నాడు. అలసిపోయి, ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో ఉన్న ఆ ముఖాలను చూస్తూ ఉన్న అతనికి దానికి నిజాయితీతో  కూడిన సమాధానం అవుననే తెలుసు.

  కొసాక్కులలో ఒక ప్రాథమికమైన మార్పు వచ్చింది. వారి పాటలు కూడా కొత్తగా, యుద్ధానుభవంతో పుట్టాయి. వాటిలో విషాదమే ఎక్కువ ఉంది. సాయంకాలాల్లో పెద్ద కర్మాగారపు పాక దగ్గర ఎక్కడైతే వారికి నివాసం ఇవ్వబడిందో, అక్కడి నుండి వెళ్తూ ఉన్నప్పుడూ లిస్ట్ నిట్ స్కీ తరచుగా, దుఃఖ ధ్వనితో ఉన్న ఒక పాట వినేవాడు. ఆ పాట ఎప్పుడూ మూడు,నాలుగు స్వరాల కలయికతో ఉండేది. పాటకు ఉండే మాధుర్యం కూడా ఆ బాధలో కలిసిపోయేది.

        ఓ ,ప్రియమైన భూమి నేను ఎక్కడైతే పుట్టానో,

        ఏ భూమికైతే నేను చెందిన వాడినో,

        ఇక ఎప్పటికీ నేను నిన్ను చూడలేను,

        ఏ ఉదయపు పక్షి స్వరాలు వినలేను

       ఓ, నా ప్రియమైన తల్లి

       నా గురించి శోకించకు

         నా ప్రియమైన కుటుంబమా

       మనందరం యుద్ధంలో చావలేము

       లిస్ట్ నిట్ స్కీ ఆగి ఆ పాట వింటూ, అందులోని విషాదానికి కదిలిపోయేవాడు. అది వింటూ ఉంటే అతని గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు ఉండేది. లిస్ట్ నిట్ స్కీ ఆ పాకకు కొంత దూరంలో నిలబడి,ఆ సాయంత్రపు ఆకాశాన్ని చూస్తూ,ఆ పాట వింటుంటే అతని కళ్ళల్లో కన్నీళ్ళు నిండేవి.

         పొలాల్లో బడి నేను ముందుకు పోతూనే ఉంటాను

          నా హృదయం,నాకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది

           అది నా విధి గురించి స్పష్టం చేస్తూనే ఉంటుంది

           ఈ వీరుడు ఇక తిరిగి మాతృభూమిని చూడలేడని

ఆ పాడుతున్న వారితో పాటు ఇంకొన్ని గొంతులు కూడా మధ్యలో కలిసేవి.

   ఒక తూటా వేగంగా నా వైపుకి దూసుకుంటూ వస్తుంది

 అది నా ఛాతిని చీల్చింది

  నేను గుర్రం తల మీదకి వాలిపోయాను

దాని మెడ అంతా  రక్తసిక్తమైంది

   ఒకసారి రెజిమెంటు అంతా కులాసాగా ఉండటం లిస్ట్ నిట్ స్కీ చూశాడు.ఆ రోజు అతను యధావిధిగా సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న స్వరాలు అతనికి వినిపించాయి. ఆ నివాసపు యజమాని నెస్విస్కా పట్టణం నుండి తిరిగి వచ్చేటప్పుడు కొసాక్కుల కోసం మందు తెచ్చినట్టు అతనికి అర్ధమైంది. వోడ్కా తాగుతూ వారంతా వాదించుకుంటూ,నవ్వుతూ ఉన్నారు. అతను తిరిగి వెళ్తున్నప్పుడు ,కొంచెం దూరం వెళ్ళాక అతనికి ఇంకో పాట వినబడింది. కానీ పాట ధ్వని మాత్రం హుషారుగా ఉంది,మధ్యలో ఈలల శబ్దం కూడా వినిపిస్తుంది.

     అసలు యుద్ధానికే వెళ్ళని మనిషి

    జీవితంలో అసలు భీభత్సాన్నే చూడడు

  పగలంతా తడుస్తూ,రాత్రుళ్ళు వణుకుతూ

  రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఉంటాము

     ఈలల సంఖ్య పెరిగి,మరలా తగ్గిపోయేది. మరలా పాట పుంజుకునేది.

    భయం,బాధ ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి

    ప్రతి రోజు,ప్రతి గంట

 ఉత్సాహవంతుడు,యవ్వనంలో ఉన్న ఒక కొసాక్కు,ఆ పాటకు తాళం వేస్తున్నట్టు పాదాలతో గట్టిగా తంతూ, గట్టిగా ఈలలు వేస్తున్నాడు. ఆ శబ్దాలతో ఆ పాట హోరెత్తిపోయింది.   

         బ్లాక్ సీ అలల గర్జింపుల మధ్య

        మా ఓడలు మండుతూ ఉంటాయి

       ఆ మంటలు చల్లార్చి

      మేము టర్కీలను ఓడిస్తాము!

       కొసాక్కుల వీరత్వానికి జయము!

      అసంకల్పితంగానే లిస్ట్ నిట్ స్కీ పెదవులపై చిరు దరహాసం తాండవం చేసింది, ఆ పాట వింటూ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేశాడు. ‘వారికి ఇంటికి వెళ్ళాలనే  కోరిక అంతా బలంగా ఉందా?’అనుకున్నాడు తనలో తానే. కాదనే అతనికి అనిపించింది. ‘వారు ఎందుకు అలా ఆలోచిస్తారు? కందకాల్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడూ వారు బాధ పడ్డారు. సహజంగానే వారికి ఎప్పుడూ యుద్ధంలో చురుగ్గా ఉండాలన్న కాంక్షే బలంగా ఉంటుంది. కానీ రెండేళ్ల నుండి వారు ఏ కార్యకలాపాలు లేకుండా అనాసక్తికరమైన అజ్ఞాత జీవితం గడిపారు. ఇదివరకి కంటే సైన్యం ఇప్పుడు చాలా బలహీనపడింది.ఈ సమయంలో దానికో గొప్ప విజయం, ముందుకు నడిపించే ప్రేరణ కావాలి,అప్పుడే వారిలో ఉన్న ఈ నిరాసక్తత మాయమైపోతుంది. చరిత్రను గమనిస్తే ఎన్నో ఏళ్ళ పాటు జరిగిన యుద్ధాల్లో క్రమశిక్షణ,అంకిత భావం ఉన్న ఎన్నో సైనిక బృందాలు కూడా బలహీనపడ్డట్టు తెలుస్తుంది. ఆఖరికి సువోరోవ్ కి కూడా ఈ అనుభవం తప్పలేదు. కానీ కొసాక్కులు అలాంటి వారు కాదు. యుద్ధ రంగం నుండి వెళ్ళిపోయే వారిలో వారు ఆఖరున ఉంటారు. నిజానికి,వారిదొక ఒక ఒంటరి ద్వీపం లాంటి దేశం. యుద్ధం వారి సంస్కృతిలోనే ఉంది,వారేమి మామూలు రైతులో,శ్రామికులో కాదు. అతని ఊహలను తారుమారు చేస్తూ అప్పుడే ఆ పాక నుండి ఇంకో పాట వినిపించింది. ఎన్నో గొంతులు అందుకోవడంతో ఆ పాట గట్టిగా వినబడుతుంది.

    ఓ  అధికారి దేవుడికి ప్రార్థిస్తున్నాడు

   ఓ కొసాక్కు ఆ అధికారిని ప్రాధేయపడుతున్నాడు

   ‘ఓ,అధికారి,

    నన్ను ఇంటికి వెళ్ళనివ్వు

   నా తండ్రి దగ్గరకు

   నా తల్లిదండ్రుల దగ్గరకు

   నా యవ్వన భార్య దగ్గరకు.’

   *     *   *

            తను తన దళం నుండి పారిపోయిన మూడో సాయంత్రానికి బంచక్ యుద్ధ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపార పట్టణానికి చేరుకున్నాడు. ఇళ్ళల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇళ్ళ ముందు దట్టమైన మంచు పట్టి ఉండటం వల్ల, ఆ దారిలో నడుస్తున్న వారి అడుగుల శబ్దం దూరానికి కూడా వినబడుతూనే ఉంది. బంచక్ తన చుట్టుపక్కలు జాగ్రత్తగా గమనిస్తూ, వెలుతురు ఉన్న వీధుల దారులను తప్పిస్తూ, చీకటిగా ఉన్న సందుల్లో నుండి నడుస్తున్నాడు. ఆ పట్టణపు సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి దాదాపుగా బంచక్ ఓ పహరా బృందం సమీపానికి వచ్చాడు. వెంటనే అతను తోడేలులా కంగారుగా, అక్కడ ఓ పక్కగా ఉన్న కంచెల మీద ఓ చేయి వేసి ,ఇంకో చేతిని మురికి పట్టి ఉన్న తన కోటు జేబులో పెట్టుకుని అక్కడ నుండి కదిలిపోయాడు. ఆ రోజంతా అతను ధాన్యపు పొట్టు నిండి ఉన్న ఒక పాకలో దాక్కుని ఉన్నాడు.

   ఒక సైనిక దళానికి నిత్యవసర సరుకులు అందించే విభాగం ఆ పట్టణంలో ఉండటం వల్ల,దానికి సంబంధించిన అనేక బృందాలు పట్టణంలోని వివిధ చోట్ల ఉంచబడ్డాయి. ఏ క్షణంలో అయినా వారి కంటబడే ప్రమాదం ఉండటం వల్ల, రోమాలతో నిండి ఉన్న బంచక్ చేతి వేళ్ళు తన రివాల్వర్ చుట్టూ బిగుసుకుని ఉన్నాయి.

  ఆ పట్టణానికి ఇంకో వైపు నిర్మానుషంగా ఉన్న ఒక వీధి గుండా బంచక్ ,ఆ వీధిలో పేదరికంతో నిండి ఉన్న మనుషులను,ఇళ్ళను గమనిస్తూ అనేకసార్లు తిరిగాడు. ఒక ఇరవై నిమిషాల తర్వాత, ఒక మూలలో శిధిలావస్థలో ఉన్న ఒక ఇంటి ముందుకు వెళ్ళి,ఆ ఇంటి తలుపుకు ఉన్న కన్నాల నుండి లోపలికి చూసి,నవ్వుకుని, ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆ ఇంటి తలుపు తట్టాడు. శాలువ కప్పుకుని ఉన్న ఒక వృద్ధురాలు తలుపు తెరిచింది.

  ‘బోరిస్ ఇవనోవిచ్ ఇక్కడ ఉన్నారా?’బంచక్ అడిగాడు.

   ‘అవును. లోపలికి రండి.’

   బంచక్ లోపలికి వచ్చాక, గట్టి శబ్దంతో ఆ తలుపు మూసుకోబడింది. ఒక చిన్న దీపం ఉన్న ఆ గదిలో ఒక కుర్చీలో మిలిటరీ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను బంచక్ ను పరీక్షగా కొన్ని క్షణాలు చూసి, తర్వాత సంతోషంతో పైకి లేచి, తన చేతిని బంచక్ వైపు చాచాడు.

   ‘ఎక్కడి నుండి వస్తున్నావు?’

   ‘యుద్ధ సరిహద్దు నుండి.’

   ‘సరే .’

   ‘ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ….’, బంచక్ నవ్వుతూ ,ఆ వ్యక్తి  బెల్టు దగ్గర చిన్నగా తడుతూ,నెమ్మదిగా, ‘ఇక్కడ ఉండటానికి వీలు ఉందా?’ అని అడిగాడు.

  ‘తప్పకుండా ఉండొచ్చు. ఈ వైపు రా.’

  అతను దీపం వెలిగించకుండానే, బంచక్ ను తనతో పాటు ఒక చిన్న గది వైపుకి నడిపించాడు. బంచక్ కు ఒక కుర్చీని చూపించి,తలుపు మూసి,కర్టెన్ ను తెరుస్తూ, ‘నువ్వు యుద్ధం నుండి మొత్తానికి బతికి బయటపడ్డావు’,అన్నాడు.

  ‘అవును.’

  ‘అక్కడ ఎలా ఉంది?’

  ‘అంతా సిద్ధంగానే ఉంది.’

   ‘నువ్వు నమ్మదగినవాళ్లు ఉన్నారా ?’

  ‘ఉన్నారు. .’

   ‘నువ్వు ముందు ఆ బట్టలు తీసేస్తే, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నాకు నీ కోటుని ఇవ్వు.నేను ఉతికించి తీసుకువస్తాను.’

  బంచక్ తన ముఖం, చేతులు కడుక్కుంటున్న సమయంలో, యూనిఫారంలో ఉన్న వ్యక్తి అతని జుట్టును సవరిస్తూ,మంద్ర స్వరంతో అన్నాడు.

   ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనకన్నా ఎంతో బలవంతులు. మనం వృద్ధి చెందుతూ ,మన బలాన్ని పెంచుకుంటూ, అసలు ఈ యుద్ధం అసలు కారణాల గురించి అందరికీ అవగాహన కలిగించడానికి ఎంతో శ్రమించాలి. మన సంఖ్య పెరుగుతూ ఉంది,ఇందులో అసత్యమేమి లేదు. వారిని వదిలేసిన వారు తప్పక మనతోనే కలుస్తారు. ఒక బాలుడి కన్నా పురుషుడు బలవంతుడే కానీ ఆ బలవంతుడు కూడా వయసుతో పాటు క్షీణిస్తాడు,ఆ సమయానికి ఆ బాలుడు బలవంతుడిగా మారతాడు. ఈ విషయంలో మనకు కనిపించేది వృద్ధాప్యం మాత్రమే కాదు, ఆ మొత్తం వ్యవస్థే బలహీనపడే క్రమం కూడా.’

   బంచక్ అప్పటికే ముఖం కడుక్కుని, పక్కనే ఉన్న ఒక తువాలుతో ముఖం తుడుచుకున్నాడు. ‘నేను అక్కడి నుండి వచ్చే ముందు నా తోటి అధికారులకు నా అభిప్రాయాలు చెప్పాను. అదంతా హాస్యాస్పదంగా మారిపోయింది. ఇప్పుడు నేను అక్కడి నుండి వచ్చేశాను కనుక,ఆయుధ దళాన్ని తప్పక వారు వదిలిపెట్టరు. వారిలో కొందరిని కోర్టు మార్షల్ కు కూడా గురి చేయవచ్చు కానీ సాక్ష్యాలు లేకపోతే ఏం చేయగలరు? నాకు తెలిసి వారు ఆపాటికే వాటిని దొరక్కుండా చేసే ఉంటారు. మనకు అనుకూలంగానే పరిణమించవచ్చు….ఆ విత్తనాలు భూమిపై పడాలి. అక్కడ కొందరు బలవంతులైన కురాళ్ళు ఉన్నారు!’

   ‘నాకు స్టీఫెన్ నుండి ఒక సందేశం వచ్చింది. అతను నన్ను యుద్ధ వ్యూహాల గురించి తెలిసిన ఒక వ్యక్తిని పంపించమని రాశాడు. నువ్వే అందుకు సరైన వ్యక్తివి. కానీ నువ్వు అక్కడకు వెళ్ళాలంటే నీ గుర్తింపును సూచించే పత్రాలు ఉండాలి. వాటిని ఎలాగో సృష్టించగలమా?’

  ‘అసలు పనేంటి?’ తన చేతిలో ఉన్న తువాలుని గోడ పైన ఉన్న మేకుకి తగిలిస్తూ అడిగాడు.

  ‘కుర్రవాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. అసలు నువ్వు ఏమాత్రం ఎత్తు పెరగలేదు?’ఆ అతిధి నవ్వుతూ అన్నాడు.

  ‘ఆ అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను పొట్టిగా,ఎవరూ నన్ను గమనించకుండా ఉంటేనే మంచిది’, బంచక్ బదులిచ్చాడు.

  తర్వాతి రోజు ఉదయం వరకు వారిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక రోజు తర్వాత బంచక్, ఎవరూ గుర్తు పట్టలేనంతగా తన రూపుని మార్చుకుని, సైన్యంలో గాయాల వల్ల బయటకు పంపబడిన 441 ఒర్షా రెజిమెంటుకి చెందిన నిఖోలాయ్ ఉఖావ్తోవ్ అనే పేరుతో కొత్త పత్రాలు సృష్టించి,ఆ పట్టణం నుండి బయటకు వచ్చి,స్టేషన్ వైపుకి వెళ్ళాడు.

  *    *   *

 వ్లాదిమిర్ వొలీస్క్ మరియు కోవెల్ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రత్యేక సైన్యం కార్యకలాపాలు నిర్వహిస్తుందో (అది పదమూడవ సైనిక దళం. కానీ పదమూడు అనే సంఖ్య దురదృష్టాన్ని తీసుకువస్తుందన్న మూఢనమ్మకం అధికారుల్లో కూడా బలపడి ఉండటం వల్ల దానికి ఆ ప్రత్యేక సైన్యం అనే నామం ఇవ్వబడింది),అక్కడ సెప్టెంబర్ ఆఖరు కల్లా దాడి చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. స్వీనుఖా గ్రామ సమీపం నుండి దాడి చేయడానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవడం, ఆయుధాలను అందుకు సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది.

   ఆ సమయానికే యుద్ధ సరిహద్దు మారణాయుధాలతో నిండిపోయి, అనేకమంది ప్రాణాలను గాలిలో కలిపేస్తూ  ఉంటే,దాని ప్రభావం ఈ ప్రాంతంలో మాత్రం పెద్దగా లేదు. ఊహించని సంఖ్యలో ఆయుధాలు తీసుకురాబడ్డాయి. తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా జర్మన్లు ఉన్న  కందకాల దిశలో వేల తూటాల శబ్దంతో భూమి దద్దరిల్లిపోయింది. ఈ దాడి ప్రారంభమయిన మొదటి రోజునే జర్మన్లు అక్కడ జరిగేది గమనించడానికి కొందరిని ఉంచి మొదటి స్థావరం నుండి పారిపోయారు. కొన్ని రోజులకు రెండవ దాని నుండి, ఇంకొన్ని రోజుల తర్వాత మూడవ దాని నుండి కూడా పరారయ్యారు.

   పదవ రోజున తర్కేస్తాన్ కు చెందిన పదాతి దళం దాడి చేసింది. ఈ దాడి ఫ్రెంచి పద్ధతిలో జరిగింది. ఒకేసారి కాకుండా శత్రువు ఊహించని రీతిలో మధ్యమధ్యలో విరామాలు ఇస్తూ యుద్ధం చేస్తారు ఈ పద్ధతిలో. అలా పదహారు సార్లు దాడులు జరిగాక రష్యన్ కందకాల నుండి  సైనికులు రొప్పుతూ, అరుచుకుంటూ, చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల దగ్గరకు చేరుకున్నారు. జర్మన్ సైనికులు దానికి దగ్గరలో ఉన్న ఆల్డర్ చెట్టు వెనుక పొంచి ఉండి, తుపాకులతో,ఫిరంగులతో భూమి దద్దరిల్లే శబ్దాలతో దాడి చేశారు.

   మధ్యమధ్యలో ఆగినట్టు ఉన్నా, వెంటనే ఆ కాల్పులు మొదలయ్యేవి. ఆ దాడులకు సుమారు అక్కడి నుండి ఒక మైలు దూరం వరకు  కూడా ఆ ధ్వనులు ప్రకంపనం సృష్టించాయి. ఆ ప్రకంపనతో ప్రేరేపించబడినట్టు ఆ సైనికులు ఇంకా రెచ్చిపోతూ కాల్పులు జరుపుతున్నారు. ఆ పదహారు సార్లు జరిగిన దాడిలో మూడు సార్లు మాత్రమే ఆ తుటాలు ముళ్ళ కంచెలను దాటి ముందుకు చొచ్చుకుపోగలిగాయి….. తొమ్మిది వేలకు పైగా సైనికుల ప్రాణాలు ఆ స్వినుఖా గ్రామంలో గాల్లో కలిసిపోయాయి.

    ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ దాడి మొదలైంది. తర్కెస్తాన్ ఆయుధ దళానికి చెందిన రెండు,మూడు విభాగాలు మరలా దాడిని ప్రారంభించాయి. 53 వ విభాగ పదాతి దళాన్ని, 307 వ విభాగ ఆయుధ దళాన్ని కందకాల ఎడమ వైపు ప్రతి దాడికి, మూడవ విభాగ గ్రేనేడ్ విభాగాన్ని ఎడమ వైపు ప్రతిదాడికి సిద్ధం చేశారు రష్యా సైన్యాధిపతులు.

   ఇదే సమయంలో  30 వ ప్రత్యేక విభాగ  కమాండర్ లూయీటెంట్ జనరల్ గవ్రిలోవ్ కి ప్రధాన కార్యాలయం నుండి రెండు దళాలను స్వినుఖా ప్రాంతానికి బదిలీ చేయమని ఆజ్ఞ వచ్చింది. ఆ రాత్రి 80వ 80 వ విభాగానికి చెందిన 320 చెంబర్స్కీ దళాన్ని, 319 బెగుల్మింస్కీ రెజిమెంట్లను అక్కడి నుండి బదిలీ చేసి, వారి స్థానంలో స్వచ్చంద సాయుద దళాలను ఉంచారు. దాడి ఎత్తుగడ ఆ రాత్రికే జరగాల్సి ఉంది. కానీ ఆ సాయంత్రమే ఒక రెజిమెంటు ఇంకో దిశలో వెళ్ళింది. ఆ రెజిమెంటు యుద్ధ సరిహద్దుకి దాదాపుగా పన్నెండు వెరస్టుల దూరం వెళ్ళే వరకు తిరిగి రమ్మనే ఆజ్ఞ అందలేదు. 80 వ విభాగానికి చెందిన రెజిమెంట్లు అన్నీ ఒకే దిశలో కాకపోతే విభిన్న దారుల్లో ప్రయాణం చేశాయి. వారితో పాటు వారికి ఎడమ వైపున  71 వ విభాగానికి చెందిన 283 వ పావ్లోగ్రాడ్, 284 వ వెగ్రో రెజిమెంట్లు కూడా మార్చింగ్ లో ఉన్నాయి. ఉరల్ ప్రాంతానికి చెందిన కొసాక్కులు,44 వ కొసాక్కు రెజిమెంటు సైనికులు కూడా వీరిని అనుసరించారు.

      ఈ బదిలీ జరగకముందు, 318వ చెర్నోరాస్కీ రెజిమెంటుని కొన్ని రోజులు శోకాల్  అనే చిన్న పట్టణానికి దగ్గరలో ఉన్న  స్టాకోడ్ నది దగ్గర ప్రాంతంలో ఉంచారు. దీనికి దగ్గరలోనే రుడ్కా మెరిన్స్కోయి ఎస్టేట్ ఉంది. రాత్రంతా మార్చింగ్ చేశాక,ఆ రెజిమెంటును అడవిలో ఎవరూ ఉండకుండా పాడుబడి ఉన్న నివాసాల్లో ఉంచేవారు. నాలుగు రోజుల పాటు ఆ రెజిమెంటుకి ఫ్రెంచి పద్ధతిలో దాడి చేయడంలో శిక్షణ ఇచ్చారు.గ్రేనేడ్ ఆయుధ దళానికి వేగంగా గ్రెనేడ్లు విసరడంలో ,వేగంగా ముళ్ళ కంచెలను తొలగించడంలో శిక్షణ ఇచ్చారు. తర్వాత ఆ రెజిమెంటు అక్కడి నుండి ముందుకు సాగింది. మూడు రోజుల పాటు వారు అడవుల గుండా,నిర్మానుష్య ప్రాంతాల నుండి ప్రయాణం చేశారు. గాలితో పాటు దూది ముద్దల్లా ఉన్న మంచు కూడా పడుతూ ఉంది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. వారు ఆపకుండా మార్చింగ్ చేస్తూనే ఉన్నారు, వానలో తడుస్తున్నా వారి నడక కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల తర్వాత దాడులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న బిగ్, లిటిల్ పోరెక్ గ్రామాల్లో ఆగారు. అక్కడ ఒక రోజు విశ్రాంతి తీసుకుని, యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నారు.

    ఇది ఇలాగ ఉంటే, 80 వ విభాగానికి సహాయక దళంగా ఉన్న ప్రత్యేక కొసాక్కు దళం కూడా యుద్ధ సన్నివేశానికి సన్నద్ధం అవుతుంది. ఆ దళంలో కొంత మంది టాటార్ స్కై గ్రామానికి చెందిన రిజర్వు దళం సైనికులు ఉన్నారు. రెండవ దళం అంతా టాటార్ స్కై కొసాక్కులతోనే ఉంది. ఒంటి చేయి అలెక్సే సోదరులు మార్టిన్, ప్రోఖోర్ షామిల్ లు, మొఖోవ్ మిల్లులో ఇంజిన్ మాన్ గా పని చేసిన ఇవాన్ అలెక్సెయేవిచ్ కొట్ల్యారోవ్, వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండే అఫోంకా ఒజెరోవ్,అంతకుముందు అటామన్ గా పని చేసిన మానీత్ స్కోవ్ ,షామిల్ పొరుగువాడు అయిన యెవ్లాంటి కాలినిన్, ఎత్తుగా ఉండే బొర్శెవ్,చిన్న మెడతో ఎలుగుబంటిలా ఉండే జకార్ కోరోల్యోవ్,ఆ మొత్తం దళంలోనే ఎప్పుడూ సంతోషంగా ఉండే గవ్రిలా లిఖోవిడోవ్, చూడటానికి కఠినంగా కనిపించే ఈ కొసాక్కు, 70 ఏళ్ళ తన వృద్ధ తల్లి దెబ్బలు, భార్య దెబ్బలకు బలవుతూ ఉండేవాడు. వీరే కాక ఎంతోమంది టాటార్ స్కై వాళ్ళు ఆ విభాగంలోని దళాల్లో ఉన్నారు.ఇంకొంతమంది కొసాక్కులు వైద్య అధికారులకు సహాయకులుగా కూడా ఉన్నారు. కానీ అక్టోబర్ రెండవ తారీఖున ఆ విభాగపు కమాండర్ జనరల్ కిచెంకో ఆజ్ఞ మీద ,వారందరి బదులుగా ఉహ్లాన్లను నియమించి,వారిని యుద్ధ సరిహద్దు ప్రాంతానికి బదిలీ చేశారు.

    అక్టోబర్ మూడవ తారీఖు ఉదయం, ఆ దళం లిటిల్ పోరెక్ గ్రామానికి చేరుకుంది,అదే సమయానికి అక్కడ 318 చెర్నోయాస్కీ రెజిమెంటుకు చెందిన మొదటి దళం అక్కడి నుండి వెనక్కి వెళ్తూ ఉంది. పదాతి దళానికి చెందిన సైనికులు గాయపడి ఉన్న గుర్రాల మీద ముందుకు వేగంగా ఆ వీధుల్లో వెళ్తున్నారు. నల్లగా, దేశ చిహ్నం ధరించిన ఒక కుర్ర సైణుకుడు మెల్లగా వెళ్తున్నాడు. అతను తన చొక్కా జేబులో నుండి ఒక చాకోలేట్ ను బయటకు తీసి, దాని పై పొర తొలగించి,నోట్లో వేసుకుని, మిగిలిన వారితో కలిసి గుర్రంతో ముందుకు వెళ్తూ ఉంటే, పొడుగైన అతని కోటు వేలాడుతూ ఉంది. కొసాక్కులు ఆ వీధికి ఎడమ వైపు నుండి వెళ్తూ ఉంటే, కొట్ల్యారోవ్ కుడి వైపు వెళ్తున్నాడు. అతను జాగ్రత్తగా తన పాదాలను చూస్తూ, మురికి నీళ్ళతో నిండిన గుంటల పక్క నుండి వెళ్తున్నాడు. పదాతి దళం నుండి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే అటువైపు తిరిగి చూశాడు.

    ‘ఇవాన్ అలెక్సెయేవిచ్! నా ప్రియమైన స్నేహితుడా!’

  ఒక సైనికుడు తన దళం నుండి విడిపోయి, పరిగెత్తుకుంటూ అతని వైపు వచ్చాడు. అతను పరిగెడుతుంటే అతని భుజాలకు తగిలించి ఉన్న తుపాకి ఊగుతూ ఉంది.

   ‘నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నన్ను మర్చిపోయావా?’

  బుగ్గల వరకు గడ్డంతో నిండిన ఆ సైనికుడి ముఖం వైపు పరీక్షగా చూసి, చివరకు అతన్ని నేవ్ గా గుర్తు పట్టగలిగాడు ఇవాన్.

  ‘నువ్వు ఎక్కడి నుండి వచ్చావు,అబ్బాయి?’

  ‘నీకు కనబడటం లేదా? సైన్యంలో ఉన్నాను.’

  ‘ఏ రెజిమెంటు?’

  ‘318 వ చెర్నోయార్స్కీ  రెజిమెంటులో ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా…అసలు మనవాళ్ళను కలుస్తానని అనుకోలేదు.’

  చెమట పట్టి ఉన్న ఆ సైనికుడి చిన్న చేతిని తన పెద్ద అరచేతిలోకి తీసుకుని నవ్వుతూ ప్రేమగా నొక్కాడు ఇవాన్. వేగంగా పెద్ద పెద్ద అంగలతో ముందుకు  సాగుతున్న ఇవాన్ ను అందుకోవడానికి నేవ్ నడక వేగం పెంచాడు. అతను ఇవాన్ ముఖంలోకి చూశాడు. కోపం,ద్వేషంతో కఠినంగా ఉండే అతని ముఖంలో ఏదో తెలియని లాలిత్యం,కళ్ళల్లో తడి నేవ్ కు కనిపించాయి.

  ‘మేము దాడికి సిద్ధమవుతున్నాము.’

    ‘మేము కూడా.’

   ‘ఎలా ఉన్నావు ఇవాన్ అలెక్సియేవిచ్?’

   ‘మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంది!’

   ‘నాకు అదే అనిపిస్తుంది. కందకాల నుండి బయటకు వచ్చి పద్నాలుగు సంవత్సరాలై పోయింది. నాకు ఒక కుటుంబం లేదు. కానీ ఇక్కడ నేను ఎవరి కోసమో ఇదంతా చేయాల్సి వస్తుంది. పిల్ల గుర్రం తల్లి గుర్రాన్ని వెంబడించినట్టు యుద్ధంలో దేని వెనుకో పరుగులు పెడుతున్నాము.’

  ‘స్టోక్ మాన్ నీకు గుర్తుందా? మన ప్రియమైన ఓసిప్ దవ్యోడోవిచ్ ఉండి ఉంటే దీని గురించి చక్కగా చెప్పేవాడు కదా. అసలు ఎటువంటి మనిషి అతను?’

‘అవును, అతనైతే ఈ పరిస్థితిని చక్కగా వివరించేవాడు!’ నేవ్ నవ్వుతూ ఉత్సాహంగా అన్నాడు.’నా కన్నతండ్రి కన్నా అతనే ఎక్కువ నా జ్ఞాపకాల్లో ఉంటాడు. ఎప్పుడూ నా తండ్రి గురించి కూడా ఎక్కువ ఆలోచించలేదు… అతనికి ఏమైందో నీకు కూడా తెలియదు కదా, ఏమైనా విన్నావా?’

 ‘అతను సైబిరియాలో ఉన్నాడు,అజ్ఞాత నిర్భంధంలో’, ఇవాన్ నిట్టూరుస్తూ అన్నాడు.

  ‘ఏంటి?’నేవ్ ఉలిక్కిపడి అడిగాడు.

 ‘అతను ఖైదీగా ఉన్నాడు. ఈ పాటికి చనిపోయి కూడా ఉండొచ్చు.’

  నేవ్ కాసేపు నిశ్శబ్దంగా నడిచి, వెనక్కి తిరిగి తన బృందం ఎక్కడ ఉందో చూసి, ఇవాన్ ముఖంలోకి చూసాడు. వారిద్దరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. ఇవాన్ అప్పటికే ముందుకు వెళ్లిపోయాడు. నేవ్ అక్కడే ఉండిపోయాడు కొన్ని క్షణాలు. వెంటనే అతను తన్ను తాను సంభాళించుకుని తన దళం వైపుకి వెళ్ళాడు.

   ఇవాన్ ముందుకు వెళ్ళి తన వారితో కలిసిపోయి తర్వాత నేవ్ వైపు తిరుగుతూ వణుకుతున్న స్వరంతో అరిచాడు.

   ‘ఒరేయ్ ! నువ్వు చాలా ధృఢంగా ఉండేవాడివి ఆ రోజుల్లో. గుర్తుందా?’

   కన్నీళ్ళతో మసకబారిన ముఖాన్ని వెనక్కి తిప్పి, తన చిన్న పిడికిలితో గట్టిగా తన గుండె దగ్గర గుద్దుకుంటూ, ‘అవును,ఒకప్పుడు అలానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ముసలివాడినైపోయాను’, అన్నాడు.

  ఇవాన్ బదులుగా ఏదో అరిచాడు కానీ అప్పటికే నేవ్ దళం ఆ వీధి దాటి వెళ్ళిపోయింది, అతను ఇవాన్ కనుచూపుమేరలో లేడు.

  ‘అతను నేవ్ కదా?’ వెనుక ఉన్న ప్రోఖోర్ షామిల్ అడిగాడు.

  ‘అవును అతనే’,ఇవాన్ బదులిస్తుంటే అతని స్వరం వణికింది.

  వారు ఆ గ్రామం దాటుతూ ఉండగా వారికి క్షతగాత్రులు ఎదురయ్యారు. మొదట్లో వారు ఒకరు,ఇద్దరుగా ఎదురుపడ్డారు. తర్వాత సంఖ్య పెరుగుతూ, చివరికి పెద్ద సమూహాలే ఎదురొచ్చాయి. వారిని తీసుకువెళ్ళే బండ్లు కిక్కిరిసి ఉన్నాయి. ఆ బండ్లను లాగుతున్న గుర్రాలు శుష్కించి ఉన్నాయి. కొరడా దెబ్బలకు సాక్ష్యంగా వాటి మెడ దగ్గర దాదాపుగా రక్తపు వర్ణంగా మారిపోయింది. కొన్నిసార్లు ఆ గుర్రాలు రొప్పుతూ, ముందుకు నడవలేక నిస్సహాయంగా ఆగిపోతూ ఉన్నాయి. వెంటనే వాటి మీద నృత్యం చేసే కొరడా వాటిని ముందుకు కదిలేలా చేస్తూ ఉంది. నీరసంతో అవి అలానే ముందుకు సాగుతున్నాయి.

  ‘ఏ యూనిట్?’వారిలో చూడటానికి బాగానే కనిపిస్తున్న ఒక యువకుడిని అడిగాడు ఇవాన్ దళపు కమాండర్.

  ‘తర్కెస్తాన్ సైన్యం,మూడవ విభాగం.’ బదులిచ్చాడు అతను.

‘మీ సైన్యం ఈ రోజే గాయపడిందా?’

ఆ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా అతను తల పక్కకు తిప్పుకున్నాడు. ఆ విభాగం ఆ మార్గం నుండి కొన్ని వెరస్టుల దూరంలో ఉన్న అడవి వైపు వెళ్ళింది. ఆ సమయానికి 318 వ చెర్నోయార్స్కీ రెజిమెంటు కూడా ఆ గ్రామం దాటింది. వారి బూట్ల అక్కడ ఉన్న బురద ఇంకా పైకి రేగింది. కొంత దూరంలో జర్మనీ అబ్జర్వేషన్ బెలూన్ (సాధారణంగా శత్రువులపై గూఢాచారత్వం చేయడానికి ఈ బెలూన్ ని వాడతారు. వీటి వాడకం ఫ్రెంచి విప్లవ యుద్ధ కాలంలో మొదలై ప్రపంచ యుద్ధాల సమయంలో పతాక స్థాయికి చేరుకుంది)పచ్చటి రంగులో ఆకాశంలో చిన్న చుక్కలా కనిపిస్తూ ఉంది.

  ‘పైకి చూడండి కొసాక్కులారా,మీ కోసం ఒక అద్భుతం ఉంది అక్కడ!’

   ‘భలే ఉందే!’

   ‘పనికిమాలిన వెధవా,వాడు మన కదలికలను దాని నుండి గమనిస్తున్నాడు.’

  ‘అంటే వాడు అంత ఎత్తుకి ఏ పనీపాటా లేకపోయినా వెళ్ళాడంటావా?’

  ‘చాలా ఎత్తులో ఉన్నాడు.’

  ‘ఏ ఆయుధం కూడా అంత దూరం వెళ్ళలేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను.’

అడవిలో కొసాక్కులకు చెర్నోయార్స్కీ రెజిమెంటు మొదటి విభాగం ఎదురొచ్చింది.సాయంత్రం వరకు వాన వల్ల అక్కడ ఉన్న పైన్ వృక్షాల కింద ఆగినా తడుస్తూనే ఉన్నారు.ఆ వర్షపు నీరు వారి మెడల నుండి వెనక్కి కూడా కొనసాగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. నిప్పు వెలిగించేందుకు వారికి అనుమతి లేదు,ఆ వర్షంలో అది సాధ్యం కూడా కాదు.సాయంత్రానికి వారు సంచార విభాగం ఉన్న కందకానికి చేరుకున్నారు. ఒక మనిషి ఎత్తు కూడా లేని గోడలతో,ఎన్నో ఇంచుల లోతుతో  నీటిలో ఉన్నట్టే ఉంది అది. నదిలో ఉండే బురద వాసనతో,కుళ్లిన పైన్ ఆకుల దుర్గంధంతోనూ, వాన వల్ల తడిసిన భూమి వాసనతోనూ మిలితంగా ఉంది ఆ చోటు. కొసాక్కులు తమ కోట్లు ఒక పక్కన పెట్టి, మోకాళ్ళ మీద కూర్చుని, పొగ కాల్చుకుంటూ, మాట్లాడుకుంటూ ఉన్నారు. రెండవ విభాగానికి బయలుదేరేటప్పుడు రేషన్ లో ఇచ్చిన పొగాకు అయిపోవడంతో ఆ విభాగపు సార్జెంట్ చుట్టూ చేరారు. అతను ఖాళీగా, తిప్పి పెట్టి ఉన్న డ్రమ్ము మీద కూర్చుని,అంతకు ముందు సోమవారం నాడు చంపబడిన జనరల్ కోపిలోవ్స్కీ గురించి చెప్తూ ఉన్నాడు.ఆ జనరల్ కింద కొంతకాలం పని చేశాడు ఈ సార్జెంట్. ‘ఆయుధాలతో సిద్ధంగా ఉండండి!’అన్న ఆ విభాగపు అధికారి ఆజ్ఞతో ఆ ముచ్చట్లు అక్కడితో ముగిసిపోయాయి.కొసాక్కులు వెంటనే ఉలిక్కిపడి, ముందుకు కదిలారు,ఆ కంగారులో సిగరెట్లు వేళ్ళకి చుర్రుమని తగిలాయి. వెంటనే సర్దుకుని,ఆ సమాచారపు కందకాల నుండి పైన్ వృక్షాలతో నిండి ఉన్న అడవిలోకి దారి తీశారు. ఆ ప్రయాణంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఉత్సాహంలో ఒకడు ఈల కూడా వేశాడు.

  కొంచెం ముందుకు వెళ్ళాక వారికి,శవాల వరుసలు కనిపించాయి. చనిపోయిన వారి భుజాలు వివిధ భంగిమల్లో , ఒకరివి  ఒకరికి ఆనుకుని ఉన్నాయి,అవన్నీ చూడటానికి భయం గొలిపేలా ఉన్నాయి. బెల్ట్ దగ్గర తుపాకి, గాస్ మాస్క్ తో ఆ శవాలకు పహరా కాస్తున్నాడు ఒక గార్డు. . ఆ శవాల చుట్టూ ఉన్న చిత్తడి నేల మొత్తం గుర్రపు డెక్కల ,గుర్రపు బండ్ల చక్రాల ముద్రలతో నిండిపోయింది. అక్కడి నుండి ఆ దళం కొద్ది అడుగులు ముందుకు వెళ్ళింది. అప్పటికే అక్కడి గాలిలో కుళ్ళిన శవాల వాసన తిరుగాడుతూ ఉంది. ఆ విభాగపు కమాండర్ తన వారిని అక్కడ ఆపి, కొందరు అధికారులతో కలిసి,ఆ గార్డు దగ్గరకు వెళ్ళాడు . ఈ లోపు కొసాక్కులు చనిపోయిన వారి దగ్గరకు వెళ్ళి,వారి టోపీలు తీసి,చనిపోయిన వాడి గురించి బ్రతికి ఉన్నవాడికి ఉండే జంతు కుతూహలంతో వారిని వెతుకుతూ ఉన్నారు. చనిపోయిన వారంతా అధికారులే. కొసాక్కులు వారిని లెక్కబెడితే నలభై ఏడు అని తేలింది. అందులో చాలామంది చూడటానికి  20-25 మధ్య వయసు ఉన్న యువకులే. వారిలో కొద్దిగా దూరంలో కుడివైపు ఉన్న ఒక అధికారి మాత్రమే పెద్ద వయసులో ఉన్నాడు. దట్టంగా ఉన్న అతని మీసాలు పక్కకు వాలిపోయి ఉన్నాయి,బహుశా ఆఖరి క్షణాల్లో అతను అరవడానికి నోరు తెరిచి ఉంటాడు. ఆ నోరు కొద్దిగా ఇప్పటికీ తెరిచే ఉంది. ఆ చనిపోయిన వారిలో కొందరు బురద పట్టి ఉన్న కోట్లు ధరించి ఉన్నారు,మిగిలిన వారివి మాత్రం మేలైన రకానికి చెందినవే. కొసాక్కుల దృష్టి అంతా చనిపోయాక కూడా ఇంకా యవ్వనపు శక్తితో అందంగా ఉన్నట్టే ఉన్న ఒక లూయీటెంట్ వైపు మళ్ళింది. అతను బోర్లా పడి ఉంటే,అతని ఎడమ చెయ్యి అతని ఛాతీ దగ్గర ఉంటే,కుడి చెయ్యి మాత్రం తుపాకీ పిడిని గట్టిగా ఇంకా పట్టుకునే ఉంది. అతని టోపీ ఒక పక్కకు పడిపోయి ఉంది. అతనికి కుడివైపున ఉన్న ఇంకో మనిషి కోటు బొత్తాలు ఊడిపోయి ఉన్నాయి. అతని టోపీ కనబడకుండా పోయింది,అలాగే అతని తల కూడా. అతని పక్కనే పొట్టిగా ఉన్న వ్యక్తి కోటు చిరిగిపోయి ఉంది. ఇంకొకడి  ఛాతిలో ఎన్నో తూటాలు దిగాయి. ఎందరి తలలో కనబడకుండా పోయాయి. అంతా భీభత్సంగా ఉంది.

  ‘వీరంతా చనిపోయే ముందు ఎవరి కోసం ఏడ్చి ఉంటారు?’తల్లి కోసమా?’ఇవాన్ తనలో తానే గొణుక్కుంటూ అక్కడ దేనిని చూడకుండా గుడ్డి వాడు నడిచినట్టు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.

  కొసాక్కులు కూడా వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత కొద్దిసేపటి వరకు ఎవరూ ఏమి మాట్లాడలేదు,వారు తాము చూసిన దానిని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విభాగం ఖాళీగా ఉన్న డగ్ అవుట్స్ ఉన్నచోట ఆగింది. అధికారులు, చెర్నోయార్స్కీ రెజిమెంటు ముఖ్యకార్యాలయం నుండి బదిలీ కాబడిన ఓ సహాయ అధికారి అందులో ఒక దానిలోకి ప్రవేశించారు.అప్పుడే అఫోంజా ఒజీరోవ్ ఇవాన్ చేతిని గట్టిగా పట్టుకుని, గుసగుసగా అన్నాడు,’ఇందాక మనం చూసాము కదా.అందులో ఆఖరి వాడు. నాకు తెలిసి వాడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఒక అమ్మాయికి ముద్దు కూడా పెట్టి ఉండడు.ఇప్పుడు వాడు చనిపోయాడు.’

  ‘ఎక్కడ వాళ్ళను అలా ముక్కలుగా చేసింది?’జాకర్ కోరోల్యోవ్ మధ్యలో అడిగాడు.

  ‘ఒక దాడిలో. ఆ గార్డు  అదే చెప్పాడు’, బొర్శ్చేవ్ కొద్ది విరామం తర్వాత బదులిచ్చాడు.

  కొసాక్కులను బయట ఉండమని ఆజ్ఞాపించడంతో వారు అక్కడే ఉండిపోయారు.ఆ అడవి అంతా నల్లటి చీకటితో కప్పబడింది. గాలి అప్పుడప్పుడూ మేఘాలను తాకుతూ,వాటిని చీలుస్తూ ఉండటంతో దూరంలో ఉన్న నక్షత్రాలు మధ్యమధ్యలో తళుక్కుమంటున్నాయి.

   ఈ లోపు డగ్ అవుట్ లో అధికారులంతా సమావేశమయ్యారు. సహాయక అధికారి తీసుకువచ్చిన ఉత్తరాన్ని తెరిచాడు కమాండర్. అక్కడ వెలిగించి ఉన్న చిన్న కొవ్వొత్తి వెలుగులో ఆ ఉత్తరాన్ని పైకి చదివాడు:

  అక్టోబర్ మూడవ తారీఖు ఉదయాన జర్మన్లు 256 వ రెజిమెంటు దళాల మీద విషవాయువు ప్రయోగించి, మన కందకాల మొదటి వరుసను ఆక్రమించారు. మీరు వెంటనే రెండవ వరుస దగ్గరకు వెళ్ళి,318 వ చెర్నోయార్స్కి రెజిమెంటులోని మొదటి దళాన్ని కలుపుకుని, రెండవ వరుస కేంద్రంగా చేసుకుని, మొదటి వరుస నుండి శత్రువుని తరిమి కొట్టడమే లక్ష్యంగా వెంటనే దాడి చెయ్యండి.మీకు కుడి దిక్కున  రెండవ బెటాలియన్ దళాలు,మూడవ సాయుధ దళానికి చెందిన ఫానాగోరిస్కి రెజిమెంటు కూడా ఉన్నాయి.

            అక్కడున్న అధికారులు ఆ పరిస్థితిని గురించి చర్చించుకుని, సిగరెట్లు కాల్చుకుని, డగ్ అవుట్ నుండి బయటకు వచ్చారు. తర్వాత వారు మార్చింగ్ కొనసాగించారు.

  కొసాక్కులు నిరీక్షిస్తున్న సమయంలో, చెర్నోయార్స్కీ రెజిమెంటు మొదటి బెటాలియన్ మార్చింగ్ చేస్తూ, స్టోఖోడ్ నది దగ్గర ఉన్న వంతెనను దాటారు. గ్రేనేడ్ ఆయుధ దళానికి చెందిన సైనికులు ఆ వంతెనకి కాపలా కాస్తున్నారు. సార్జెంట్ మేజర్ అప్పటి పరిస్థితిని బెటాలియన్ కమాండర్ కు వివరించాడు. ఆ వంతెన దాటాక, ఆ బెటాలియన్ దళాలు విడిపోయాయి. రెండు దళాలు కుడి వైపుకి తిరిగితే, ఇంకొకటి ఎడమ వైపుకి తిరిగింది.ఆ బెటాలియన్ కమాండర్ ఉన్న ఆఖరి దళం రిజర్వుగా ఉంది.ఆ దళాలన్ని చెదారగొట్టబడినట్టు ముందుకు వెళ్ళాయి.ఆ అటవీ ప్రాంతం అంతా చెట్లతో దట్టంగా ఉంది. వారంతా ముందు తడుముకుంటూ వెళ్తూ, రొప్పుతూ ఉన్నారు. ఆ వరుసలో కుడి వైపు చివర నుండి ఉన్న ఏడవ మనిషే నేవ్. సిద్ధంగా ఉండండి అన్న ఆజ్ఞ రాగానే, తన తుపాకీని తన ముందుంచుకుని, దారిలో అడ్డంగా ఉన్న పొదలు, చెట్లను గీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఆ వరుసలో ఇద్దరు అధికారులు అతన్ని దాటి వెళ్ళారు. వారు మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరైన కమాండర్ ఫిర్యాదు చేస్తూ మాట్లాడటం అతనికి వినిపించింది.

‘నా పాత గాయం ఒకటి ఇప్పుడు మళ్ళీ రేగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం, ఇవాన్ ఇవానోవిచ్,చీకట్లో నా పాదం ఒక చెట్టు మొద్దుకి గట్టిగా తగిలింది. గాయం మరలా సలుపుతుంది, ఇక నేను నడవలేను. ఇక నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి.’

ఆ స్వరం ఒక నిమిషం పాటు వినబడలేదు, తర్వాత చిన్నగా వినవచ్చింది.’మొదటి దళం కమాండర్ గా నువ్వు వ్యవహరించు.బొగ్దాదేవ్ రెండవ దళానికి నాయకత్వం వహిస్తాడు, ఇక నేను… నిజాయితీగా చెప్తున్నాను, ఇక నేను ముందుకు వెళ్ళలేను. నాకు ఇంకో మార్గం కూడా లేదు.’

  సహాయ అధికారిగా ఉన్న బెలికొవ్ ఘాటుగా బదులిచ్చాడు.

‘ఎంత ఆశ్చర్యంగా ఉంది!ఎప్పుడైతే యుద్ధంకి వెళ్ళాల్సి వస్తుందో అప్పుడే మీ పాత గాయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.’

‘మీరు మౌనంగా ఉండండి!’ఆ విభాగపు కమాండర్ స్వరం పెంచుతూ అన్నాడు.

‘ఇక ఆ విషయం వదిలేయండి! ‘

తన బృందపు అడుగుల శబ్దాల మధ్య నుండి హడావుడిగా వెళ్తున్న ఇంకో అడుగుల శబ్దం వినబడితే, నేవ్ అటువైపు చూస్తే, అప్పటికే ఆ విభాగపు కమాండర్ వెనక్కి వెళ్తూ కనిపించాడు. కొద్ది నిమిషాల తర్వాత బెలికొవ్, సార్జెంట్ మేజర్ తో కలిసి ఎడమ వైపు వెళ్లిన దళం దిశగా వెళ్తూ, నేవ్ ను దాటాడు.

   ‘ఏదైనా సమస్య వస్తుందంటే చాలు, కుక్కల్లా ముందే పసిగడతారు. ఆ పరిస్థితి రాగానే వారికి హఠాత్తుగా ఏదో ఒక జబ్బు వస్తుంది లేకపోతే ఇలా పాత గాయాలు రేగుతాయి.ఇప్పుడు కొత్త  వాడివైన నువ్వు… సగం ఈ బెటాలియన్ సగం పైగా భారం మోయాలి.. ఎలాంటి వెధవలు వీళ్ళు!నేను వారిని…’

ఆ స్వరాలు హఠాత్తుగా ఆగిపోయాయి. నేవ్ కి ఇప్పుడు తన అడుగుల శబ్దం, చుట్టూ ఉన్న వారి అడుగుల శబ్దం తప్ప ఏమి వినబడటం లేదు.

  ‘ఓయ్!’ ఎవరో  ఎడమ వైపు నుండి గుసగుసగా పిలిచారు.

  ‘ఏంటి?’

  ‘ముందుకు వెళ్తున్నావా?’

  ‘హా’, నేవ్ బదులు చెప్తూనే కింద మోకాళ్ళ లోతు ఉన్న నీటి గుంటలో  పడబోయి వెంటనే నిలదొక్కుకున్నాడు.

  ‘చాలా చీకటిగా ఉందికదా ఇక్కడ!’ ఎవరిదో స్వరం వినిపించింది.

వారు ఒక నిమిషం పాటు ముందుకు నడిచారు,ఆ చీకట్లో ఎవరికి ఎవరూ కనబడటం లేదు,అప్పుడు హఠాత్తుగా కుడి వైపు నుండి నేవ్ చెవి దగ్గర ఇందాక వినబడిన స్వరమే మరలా గుసగుసగా వినబడింది., ‘అందరం కలిసి వెళ్దాం!ఇక్కడ మరి లోతుగా లేదు.’

  మరలా అందరూ మౌనంగా ఉన్నారు. తడిసి బురదతో ఉన్న వారి బూట్ల శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది. అప్పుడే క్షీణిస్తూ ఉన్న చంద్రుడు ఒక మేఘం వెనుక నుండి పైకి వచ్చాడు,తన ముఖాన్ని కాసేపు చూపి,మళ్ళీ వెంటనే మాయమైపోయాడు.మరలా ఆ పైన్ చెట్ల వెనుక నుండి కనిపించాడు. నేవ్ తన పక్కన ఉన్నవాడి వైపు చూశాడు. అతను ఆగాడు. ఏదో కుట్టినట్టు ఉలిక్కిపడ్డాడు.

‘ఇటు చూడు’,అన్నాడు.

  మూడు అడుగుల దూరంలో,ఒక పైన్ చెట్టు దగ్గర, ఒక మనిషి రెండు కాళ్ళు ఎడంగా పెట్టి నిలుచున్నాడు.

‘అతను ఒక మనిషి’, నేవ్ తనలో తానే అనుకున్నాడో లేక పైకి అన్నాడో తెలియదు.

  ‘ఎవరు అక్కడ?’ నేవ్ పక్కన ఉన్న సైనికుడు అరిచాడు. ‘మర్యాదగా బయటకు రండి,లేకపోతే కాల్చి పారేస్తాను’, తన భుజం మీద ఉన్న తుపాకీ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.

ఆ పైన్ చెట్టు దగ్గర ఉన్న మనిషి నుండి ఏ స్పందన లేదు. అతని తల ఒక వైపుకి వేలాడబడినట్టు ఉంది, పొద్దు తిరుగుడు పువ్వులా.

‘అతను నిద్రపోతున్నాడు!’నేవ్ నవ్వుకుంటూ అతని వైపుకి అడుగులు వేశాడు,వణుకుతూనే, బలవంతంగా నవ్వే ప్రయత్నం చేశాడు.

   నేవ్,అతని పక్క సైనికుడు వెనక్కి  నిలబడినట్టు ఉన్న ఆకారం దగ్గరకు వెళ్ళారు. నేవ్ తల ముందుకు వంచి చూశాడు. అతని పక్కన ఉన్నవాడు తన చేతిలో ఉన్న తుపాకీతో ఆ ఆకారాన్ని తడిమాడు.

  ‘హే! ఏంటి నువ్వు నిద్రపోతున్నావా?లే’,అని గట్టిగా అన్నాడు. ‘ఏంటి …నువ్వు ?’ఆ గొంతులో ఉత్సాహం మాయమైపోయింది. ‘అది ఒక శవం!’అంటూ ఒక్కసారిగా వెనక్కి వచ్చాడు.

  అతని పళ్ళు ఏవో గొణుగుతూ ఉన్నాయి. నేవ్ ఒక్కసారిగా వెనక్కి దుమికాడు.నేవ్ అంతకుముందు వరకు నిలబడి ఉన్న చోట ఆ నిలబడి ఉన్న మనిషి కింద పడిపోయాడు. అతన్ని వెనక్కి తిప్పి చూస్తే గాని తెలియదు ఆ చనిపోయిన వ్యక్తికి ఆఖరి ఆశ్రయంగా ఆ పైన్ వృక్షం ఉందని. అతని బ్యాడ్జి ని బట్టి 256 వ పదాతి దళానికి చెందిన వాడిగా గుర్తించారు. ఎత్తుగా ఉన్నాడు, తల వెనక్కి వాలి పోయి ఉంది, అతని ముఖమంతా బురదతో నిండి ఉంది, అతని కళ్ళు ఎవరో తినేసినట్టుగా ఉన్నాయి, అతని నాలుక పళ్ళ మధ్య నుండి ఉబ్బి బయటకు వచ్చింది.

‘రా వెళ్ళిపోదాం! అలా వదిలేయ్’,నేవ్ పక్కన ఉన్నవాడు గొణుగుతూ అన్నాడు.

   అక్కడి నుండి వారు ముందుకు కదిలాక ఇంకో శవం వారికి ఎదురైంది. వారు ముందుకు నడుస్తూ ఉంటే, ఇంకా ఎన్నో కనబడుతూనే ఉన్నాయి. కొందరు చిన్న గుట్టల్లా పడి ఉంటే,ఇంకొందరు గడ్డ కట్టుకుపోయి ఉన్నారు,ఇంకొందరు మోకాళ్ళ మీద గడ్డి  మెస్తున్న పశువుల్లా ఉన్నారు, ఇంకొకడు సమాచార కందకానికి దగ్గరలో ఉండచుట్టుకుపోయి ఉన్నాడు.

  నేవ్,అతనితో పాటు ఉన్నవాడు,ఇద్దరూ కలిసి బృందంతో కలవడానికి పరిగెత్తారు. తర్వాత ఇద్దరూ కలిసి నడవసాగారు. తర్వాత ఇద్దరూ కలిసి ఆ చీకట్లో ఆ కందకాల్లోకి దూకుతున్నట్టే వెళ్ళారు.

‘పద వెళ్ళి,డగౌట్స్ లోపలికి వెళ్ళి చూద్దాము. లోపల ఏవో పురుగులు ఉన్నట్టున్నాయి’,నేవ్ పక్కన ఉన్నవాడు అన్నాడు.

  ‘సరే.’

  ‘నువ్వు చెప్పింది బావుంది.నేను ఎడమ వైపుకి వెళ్తాను. మన వాళ్ళు వచ్చేలోపు అంతా జాగ్రత్తగా చూద్దాము.’

 నేవ్ నిప్పు వెలిగించి,తెరిసి ఉన్న తలుపు గుండా మొదటి డగౌట్ లోకి ప్రవేశించాడు-వెంటనే లోపల నుండి ఏదో బలంగా బయటకు తోసినట్టు బయటకు వచ్చాడు. ఆ డగౌట్ లో రెండు శవాలు ఒక దాని పక్కన ఒకటి ఉన్నాయి. మూడు కందకాల్లో వెతికాక ,నాలుగో దానిలో ప్రవేశించగానే జర్మన్ భాషలో ఒక స్వరం పలకరించింది.

  ‘ఎవరది?’

   ముఖం మీద వేడి వేడి బొగ్గులు పడినట్టు నేవ్ ముడుచుకుపోయి ఏం సమాధానం ఇవ్వకుండా ఉండిపోయాడు.

  ‘ఓటో,అది నువ్వేనా? ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది?’ఆ జర్మనీయుడు అడుగుతూనే, భుజాలు బద్ధకంగా విరుచుకుంటూ,కోటు సరిచేసుకుంటూ, డగౌట్ బయటకు వచ్చాడు.

   ‘చేతులు పైకెత్తు!అలాగే ఉంచు!లొంగిపో!’నేవ్ తుపాకీతో అతని వెనుక నిలుచుని అన్నాడు.

  నిశ్చేష్టుడైన అతను మెల్లగా తన చేతులు రెండు పైకెత్తి ,మెల్లగా తన భుజం దగ్గర ఆనించి ఉన్న తుపాకిని చూశాడు. అతని కోటు భుజాల నుండి కిందకు జారిపోయింది,అతని చేతులు వణుకుతున్నాయి,ఏదో తాళాన్ని తెరుస్తున్నట్టు అతని వేళ్ళు అటుయిటూ కదులుతున్నాయి. అతని బాధతో ఏదో గొణుగుతున్నాడు. నేవ్ వెంటనే తన భంగిమను మార్చి ముందుకు వచ్చాడు.

 ‘పరిగెత్తు!’ నేవ్ మెల్లగా అతనితో అన్నాడు.

  ‘ఇక్కడి నుండి వెళ్ళిపోయి! నాకు నీతో వైరం ఏమి లేదు. నేను నిన్ను కాల్చను.’

  నేవ్ తన తుపాకిని కందకం గోడ దగ్గర ఉంచి, ఆ జర్మనీయుడి కుడి చేతిని అందుకున్నాడు. అతని ఆ చర్య పట్టుబడిన ఆ జర్మనీయుడి భయాలు పటాపంచలు అయ్యేలా చేసింది. అతను ఆ అపరిచిత భాషలో మాట్లాడిన మాటల భావాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాడు.

  ఏ అనుమానం లేకుండా నేవ్ ఎన్నో ఏళ్ళ శ్రమ వల్ల గట్టిపడి ఉన్న తన చేతితో చల్లబడి ఉన్న జర్మనీయుడి చేతి వేళ్ళను స్పృశించాడు.

  ‘నేను ఒక శ్రామికుడిని!’జ్వరంతో వణుకుతున్న వాడివలె అన్నాడు నేవ్.

  ‘నేను నిన్ను ఎందుకు చంపాలి?పారిపో!’అంటూనే అతని భుజం మీద చేయి వేసి మెల్లగా తోస్తూ,ముందు ఉన్న అడవి దారి వైపు చూపించాడు. ‘పిచ్చోడా! తొందరగా పారిపో !మావాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు.’

అతను నేవ్ కళ్ళల్లోకి చూస్తూ నిలుచున్నాడు.ఆ అర్ధం కానీ మాటల ధ్వనిలో భావం అతనికి స్పష్టమైంది. ఒక్కసారిగా ఆ కళ్ళల్లో సంతోషం కనిపించింది. వెంటనే నేవ్ దగ్గరకి వెళ్ళి అతని రెండు చేతులు పట్టుకుంటూ,నవ్వుతూ అతని కళ్లలోకి చూశాడు.

  ‘నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావా?నాకు ఇప్పుడు అర్ధమైంది. నువ్వు రష్యా శ్రామిక వర్గానికి చెందిన వాడివి కదా? నాలాగే సోషల్ డెమొక్రాట్ కదూ? అవును కదా? ఇది నిజంగా కలలా ఉంది. ఓ సోదరుడా,ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను! మాటలు కూడా రావడం లేదు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివి,మంచి మనసున్న వాడివి ‘,అని తన భాషలోఅన్నాడు.

ఆ అపరిచిత మాటల ప్రవాహంలో నేవ్ కి ‘సోషల్ డెమొక్రాట్’అన్న పదం ఒక్కటి పట్టుకోగలిగాడు.  

‘అవును,నేను సోషల్ డెమొక్రాట్ నే . నువ్వు వెంటనే పారిపోతే మంచిది…ఇక సెలవు స్నేహితుడా!’

  ఆ పొట్టి రష్యన్ సైనికుడు ,ఆ పొడుగైన జర్మన్ సైనికుడు  ఒక్కసారి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు.

   ‘రాబోయే యుద్ధంలో మనిద్దరం ఒకే వైపున పోరాడాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా కలుస్తాము కదా?’అంటూనే అతను ఆ కందకం ముందున్న కంచె వైపుకి పరిగెత్తాడు.

  అడవి వైపు నుండి అడుగుల శబ్దం వినిపించింది. వారికన్నా ముందు శత్రువుల ఉనికిని ఆరా తీయడానికి నియమించిన జెక్ స్కౌట్ బృందం అధికారితో వచ్చింది. అప్పుడే అక్కడ డగౌట్ లో తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుకుంటున్న నేవ్ తో పాటు ఉన్నవాడిని వారు దాదాపుగా కాల్చేసినంత పని చేశారు.

  ‘నేను మీలో ఒకడినే!కనబడటం లేదా?’ తన వైపుకి గురిపెట్టబడిన తుపాకీ వైపు చూస్తూ అరిచాడు అతను.

 ‘నేను మీ వాడినే’, అని మళ్ళీ అతను చెప్తూ, చేతిలో ఉన్న బ్రెడ్డుని గుండెల దగ్గర పెట్టుకున్నాడు చిన్నపిల్లవాడిలా.

  నేవ్ ను ఒక సైనికుడు  గుర్తు పట్టి, ఆ కందకం మూల లోకి దూకి, తన తుపాకిని అతని వీపుకి గట్టిగా గుచ్చాడు.

  ‘నిన్ను చంపేస్తాను! ఇంతసేపు ఎక్కడ ఉన్నావు?’

  నేవ్ ఒక్కసారిగా ఏం చలనం లేనట్టు అయిపోయాడు. తుపాకి గుచ్చుకున్నా అతనిలో ఏ కదలిక లేదు. అతను ముందుకు వచ్చి, మర్యాదగా అతనికి బదులిచ్చాడు. కానీ అలా బదులివ్వడం అతని సహజ ప్రవృత్తికి వ్యతిరేకమైనది.

  ‘నేను నిన్ను కొట్టబోయాను.అయినా నువ్వు తిరిగి ఏం చేయలేదు.’

  ‘ఆవు తోక లాగినట్టు లాగకు. ఒకసారి ఇలా కందకాల్లో ఉంటే,ఇంకోసారి యుద్ధంలో ఉంటాము.నీకు నిబంధనలు తెలియదా? సైన్యంలో ఇది నీకు మొదటి సంవత్సరమా?’ఒక నిమిషం ఆగి, ‘పొగాకు ఉందా?’అని అడిగాడు.

  ‘కొద్దిగా నలిగిపోయింది.’

   ‘పర్వాలేదు.’

  ‘ఇదిగో.’

  ఆ సైనికుడు ఒక సిగరెట్టు వెలిగించుకుని పక్కకు వెళ్ళాడు.

   తెలతెలవారుతుండగానే జెక్ స్కౌట్లు జర్మనీయుల ;పరిశీలన స్థావరం’దగ్గరకు వెళ్ళారు. జర్మన్లు వెంటనే దాడికి దిగారు. రెండు మూడు విరామాలు మధ్యలో వచ్చిన తుపాకీల నుండి తుటాలు పేలుతూనే ఉన్నాయి. కందకాల గుండా పొగ పైకి లేస్తూ ఉంది, కొన్ని స్వరాలు వినబడుతూ ఉన్నాయి, ఆకాశంలో ఆ కాల్పుల తాలూకా చిహ్నాలు చెరిగిపోకముందే జర్మన్లు ఫిరంగుల దాడి మొదలుపెట్టారు.

   ఆ కాల్పుల ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంది చుట్టూ.

   ఆ  తూటాల వర్షం  మొదటి దళంలో ఉన్న సైనికుల తల పైనుండి దూసుకుపోయాయి. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం, ఆ తర్వాత కొద్ది దూరంలో స్టోఖోడ్ నది సమీపంలో మరలా దాడుల శబ్దం మొదలైంది.

            జెక్ స్కౌట్లకు వెనుక యాభై అడుగుల దూరంలో ఉన్న ఒక బృందం మొదటి కాల్పుల ధ్వని వినిపించగానే నేలకు కరుచుకుపోయింది. ఆ కాల్పులు జరుగుతున్నప్పుడు, సైనికులందరూ చీమల్లా పొదలకు, చెట్లకు మధ్య పాకుతూ, బురదగా ఉన్న ఆ భూమిని ఏ మాత్రం చీదరించుకోకుండా, రక్షణ కోసం దాని మీదే ఆధారపడటం నేవ్ చూసాడు.

            ఆ బురద నేలలో కనబడిన ప్రతి రంధ్రo లోకి తమ తలలు దూర్చారు. అయినప్పటికీ, మెషిన్ గన్ల దద్దరిల్లే ధ్వనులు వారి చెవులను  సోకకుండా పోలేదు.ఆ శబ్దాలకు వారు భయపడుతూ, ఉలిక్కిపడుతూ, వెనక్కి పాకుతూ, తలలను భుజాల మీదకు వంచుతూ, గొంగళి పురుగుల్లా భూమికి అతుక్కుంటూ, పాముల్లా కాళ్ళు, చేతులు మెలికలు తిప్పుతూ,ఆ బురదలో తమ ఆనవాళ్ళు వదులుతూ కదులుతూ ఉన్నారు. కొందరు దుమికారు, పరిగెత్తారు. తూటాలు భూమిని చీలుస్తూ, అడవిలో వారిని ఆ పైన్ చెట్ల గుండా వెంబడించాయి.

  మొదటి వరుస సైన్యం రెండవ వరుస కందకాల దగ్గరకు చేరుకునేసరికి పదిహేడు మంది సైనికులను కోల్పోయింది.  కొద్ది దూరంలోనే ప్రత్యేక దళ కొసాక్కులు ప్రతి దాడికి సన్నద్ధం అయ్యారు.సగం మంది కుడి వైపుకి వెళ్ళి జర్మన్లను ఆశ్చర్యపరిచే రీతిలో ప్రతి దాడి చేద్దామనుకున్నారు. కానీ జెక్ స్కౌట్ల మీద జరిగిన దాడి మొత్తం విభాగాన్నే జాగురుకుల్ని చేసింది.

పద్ధతి లేకుండా జర్మన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కొసాక్కులు మరణించారు, ఒకరు గాయపడ్డారు. కొసాక్కులు చనిపోయిన వారిని, గాయపడిన వాడిని తమతో పాటు తీసుకువచ్చి, వారిలో వారు మాట్లాడుకోసాగారు.

  ‘మనం మన వాళ్ళని పాతిపెట్టాలి.’

  ‘అది ఎవరో ఒకరు చేస్తారు.’

‘ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ గురించి కన్నా బతికున్న వాళ్ళగురించి ఆలోచించడమే ముఖ్యం.’

అరగంట తర్వాత రెజిమెంటు ప్రధాన కార్యాలయం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది : ‘ఫిరంగుల మోత నెమ్మదించగానే, కొసాక్కుల దళం బెటాలియన్ మొత్తం కలిసి మొదటి వరుస కందకాలలో ఉన్న శత్రువులను మట్టి కరిపించండి.’

  ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆ ఫిరంగుల ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటివరకు కొసాక్కులు, ఆశ్విక దళాలు  సెంట్రీలను బయట ఉంచి, డగ్ ఔట్లలో పడుకున్నారు.మధ్యాహ్నం వారు ప్రతి దాడికి దిగారు.ఎడమ వైపు కూడా, తుపాకీలు పేలుతూనే ఉన్నాయి, అక్కడ కూడా దాడి మొదలైంది.

            కుడి వైపున బైకల్ కొసాక్కులు ఉన్నారు. వారికి ఎడమ వైపున చెర్నోయార్స్కీ  రెజిమెంటు, ప్రత్యేక కొసాక్కుల దళం ఉంది.వారి ప్రక్కనే ఫ్రానగ్రోరిస్కీన గ్రేనేడ్ రెజిమెంటు, చెంబార్స్కీ,బుగుల్మింస్కీ , 208 వ మరియు 211వ పదాతి దళాలు, పావ్లోగ్రాడ్,వెగ్రో రెజిమెంట్లు ; మధ్యలో 53 వ విభాగం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ; ఎడమ వైపు అంతా రెండవ తర్కెస్తాన్ పదాతి విభాగమే ఉంది. రష్యన్లు ఎడతెరిపి లేకుండా దాడి చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా ఫిరంగుల మోతతో దద్దరిల్లిపోయింది.

        ఆ యుద్ధ దళమంతా ఖాళీ స్థలం వైపుకి కదిలింది. ఎడమ వైపు ఉన్న వారు చెర్నోయార్స్కీ కుడి వైపు రెజిమెంటుతో కలిశారు. ఎప్పుడైతే కొసాక్కులు జర్మన్లు యుద్ధ స్థావరాలుగా ఏర్పరచుకున్న ప్రదేశాలకు సమీపంగా వచ్చారో అప్పుడు దాడి తీవ్రంగా జరిగేది.అందుకే వారు వారి దృష్టిలో పడకుండా కింద పాకుతూ,పరుగెడుతూ, తూటాలు నింపుకుంటూ హడావుడిగా ముందుకు సాగుతున్నారు. కందకాల నుండి యాభై అడుగుల దూరం వరకు వచ్చాక నేల మీదకి వాలిపోయి,తల కూడా ఎత్తకుండా ఫైరింగ్ చేశారు. జర్మన్లు అక్కడ కందకాల దగ్గర ఉన్న వైర్లు మొదలుకుని ఏది దొరికినా దాన్ని ఆయుధంగా మలచుకుంటున్నారు. అఫోంకా ఒజెరోవ్ వారి వైపు విసిరిన రెండు గ్రెనేడ్లు పేలకుండానే ఏదో తగిలి మరలా వెనక్కి వచ్చి పడ్డాయి. అతను మూడోది విసరడానికి చెయ్యెత్తేసరికి, ఒక తూటా ఎడమ భుజం కింద నుండి అతని శరీరంలోకి చొచ్చుకుపోయి వెనుక నుండి బయటకు వచ్చింది. చిన్నగా కొట్టుకుని చలనంగా లేకుండా అతను అక్కడే పడిపోవడం అక్కడే ఉన్న ఇవాన్ చూశాడు. ఒంటి చేయి అలెక్సి తమ్ముడైన ప్రోఖోర్ షామిల్ అక్కడే చంపబడ్డాడు; పూర్వం అటామన్ గా పని చేసిన మెనీస్కోవ్  మూడవ వాడు అయితే, ఆ తర్వాతి తూటా షామిల్ పక్కన ఉన్న యెలవంటి కాలినిన్ గుండా పోయింది.

   అరగంట వ్యవధి లోనే రెండవ విభాగం ఎనిమిది మందిని కొలోయింది. ఎప్పుడైతే ఆ  విభాగపు మేజర్, ఇద్దరు అధికారులు చనిపోయారో, ఆ దళం ఏ ఆజ్ఞలను పట్టించుకోకుండా వెనుదిరిగింది. ఆ ప్రాంతం నుండి దూరంగా వచ్చాక, కొసాక్కులు అందరూ కలిశారు. వారిలో సగం మంది మాత్రమే ఉన్నారు. చెర్నోయార్స్కీ బృందం కూడా వెనుదిరిగింది. మొదటి బెటాలియన్ లో నష్టాలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. కానీ రెజిమెంటు ప్రధాన కార్యాలయం నుండి ఇంకో ఆజ్ఞ వచ్చింది: ‘ఎట్టి పరిస్థితుల్లో దాడిని మరలా ప్రారంభించి,మొదటి వరుస కందకాల్లో ఉన్న శత్రువును తరిమికొట్టాలి. ఈ మొత్తం యుద్ధంలో విజయం సాధించాలంటే ముందు మన పక్కన ఉన్న శత్రువును మన్ను పెట్టడం ముఖ్యం.’

   మరలా వాళ్ళంతా యుద్ధానికి సన్నద్ధమై ముందుకు కదిలారు. జర్మన్లు ఉన్న కందకాలకు వంద అడుగుల దూరంలో ఉన్నప్పుడే వారు విసిరిన  గ్రేనేడ్ ల వల్ల వాళ్ళు బలంగా భూమిని తాకారు, గాయపడ్డారు. వారు తలలు ఎత్తకుండా,కాసేపు కదలకుండా ఉండి,మృత్యు భయంతో వణికిపోయారు.

సాయంత్రం అయ్యేసరికి చెర్నోయార్స్కీ  రెజిమెంటులో సగం మంది  చెల్లాచెదురై కాళ్ళకు పని చెప్పింది.’మనల్ని చుట్టుముట్టారు!’ అన్న వాళ్ళ అరుపు కొసాక్కులకు వినిపించింది. వాళ్ళు కూడా హడలిపోయి పొదల గుండా, చెట్ల గుండా, తమ ఆయుధాలు కింద పడిపోతున్నా లెక్క చేయకుండా పరుగులంకించుకున్నారు.ఒక సురక్షితమైన ప్రదేశానికి వచ్చానని నమ్మకం కుదిరాక,ఇవాన్ దాడులకు కూలిపోయిన ఒక పైన్ చెట్టు కింద కూలబడ్డాడు.గవ్రిలా లిఖోవిడో అతని వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. లిఖోవిడో తాగిన వాడిలా తూలుతూ,చూపు నేల మీద మాత్రమే ఉంచుతూ, గాలిలో ఏదో పట్టుకుంటున్న వాడివలె ఒక చేతిని ముందుకు పెట్టి , రెండో చేతిని ముఖం మీద వాలిన ఏదో పురుగును చెదరగొట్టడానికన్నట్టు వేశాడు.అతని చేతిలో తుపాకి గాని ఖడ్గం గాని లేవు,ముదురు గోధుమ రంగులో ఉన్న అతని జుట్టు ముఖం మీద పడుతూ ఉంది. అతను ఇవాన్ దగ్గరకు వచ్చి ,ఆగాడు. అతని మోకాళ్ళు సగం వంగి ఉన్నాయి, వణుకుతూ ఉన్నాడు. ఇవాన్ కళ్ళకు అతను ఏదో గాల్లో ఎగిరే వాడిలా కనిపించాడు.

  ‘అయితే ఏమైందంటే ….’ఇవాన్ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ భయంతో వణుకుతున్న లిఖోవిడో ముఖం చూసి ఆగిపోయాడు.

  ‘ఆగు!’ ఇవాన్ గట్టిగా అరుస్తూ,మోకాళ్ళ మీద కూర్చుని అతని భుజాల మీద తన చేయి వేశాడు.

  ‘నేను చెప్పేది విను! నేను నీ కోసం ఒక పాట పాడతాను. ఒక చిన్న పిట్ట గుడ్ల గూబ దగ్గరకు ఎగిరి ఇలా అంది:

    ‘ఓ గుడ్లగూబా,గుడ్లగూబా

నాకో విషయం చెప్పు

ఎవరు పెద్దవారు, ఓ పెద్ద పక్షి చెప్పు!

 ఇక్కడ గద్ద ,అక్కడ జార్

 ఇక్కడ గాలి పటం,అక్కడ మేజర్

హారిర్ ఓ కెప్టెన్

గోధుమ పావురాయిలు ఉరల్ మనుషులు,

తాబేటి పావురాయిలు అంగరక్షకులు,

మేడు పావురాయిలేమో లైన్స్ మెన్ ,

మైనాలేమో కాల్మక్ లు,

కాకులేమో జీప్సిలు,

కొండకాటి పిట్టలేమో స్త్రీలు,

బాతులేమో పదాతి దళాలు

హంసలేమో అమ్మాయిలు …’

      ‘ఆపు!’ఇవాన్ ముఖం పాలిపోయింది. ‘లిఖోవిడో,ఏమైంది?నీకు ఒంట్లో బాగోలేదా?’

     ‘మధ్యలో ఆపకు!’లిఖోవిడో ముఖం ఎర్రగా అయిపోయింది, పిచ్చిగా నవ్వుతూ పాట మళ్ళీ అందుకున్నాడు:

  హంసలేమో అమ్మాయిలు,

  పెద్ద ఉడతలేమో గాడిదలు,

   కాకులేమో కందిరీగలు ….

ఇవాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

  ‘ఇటు రా. మన దళం దగ్గరకు వెళ్దాము.లేకపోతే జర్మన్లు మనల్ని పట్టుకుంటారు.నీకు వినిపిస్తుందా?’

తన చేతిని ఇవాన్ చేతిలో నుండి లాక్కుంటూ, లిఖోవిడో గట్టిగా అరుస్తూ మళ్ళీ పిచ్చిగా పాట మొదలుపెట్టాడు:

  పిచ్చుకలేమో పాటగత్తేలు

  నల్లపక్షికేమో పెద్ద పొట్ట ,

 టామి ఏమో పన్ను అధికారి,

 తీతువ పిట్టెమో సైనికుడు ….

    హఠాత్తుగా మధ్యలో ఆపేసి బొంగురు గొంతుతో మళ్ళీ చిన్నగా పాడటం మొదలుపెట్టాడు. అది పాటలా లేదు,తోడేలు బాధతో అరుస్తున్న అరుపులా ఉంది.పిచ్చిగా కొట్టుకుంటున్న అతని కళ్ళవైపు భయంతో చూశాడు ఇవాన్. ఈ మధ్య వరకు తనకు స్నేహితుడిగా ఉన్నవాడు పెరిగిన జుట్టుతో, పిచ్చి వాలకంతో ఉండటం అతన్ని కదిలించింది. లిఖోవిడో బాధతో మళ్ళీ మొదలుపెట్టాడు:

గట్టిగా శంఖనాదాలు పూరిస్తూ ఉంటే,

డాన్యూబే మీదగా కొసాక్కులు బయలుదేరతారు.

సుల్తాను పంపిన టర్కీలను తరిమికొట్టి

మనం క్రైస్తవులను ఆ సుల్తాను నుండి కాపాడాము.

మేము ఆ చిన్న కొండల మీద

 తేనెటీగల్లా గుంపుగా వెళ్ళాము

డాన్ కు చెందిన కొసాక్కులమైన మనం

గురి తప్పకుండా అందరినీ కాల్చాము .

త్వరలోనే ఆ టర్కీల

ఎముకల్లో గుజ్జు లేకుండా చేస్తాము,

అప్పుడు వారి భార్యాపిల్లలను

పట్టుకుని ఖైదీలుగా తీసుకువెళ్తాము.

‘మార్టిన్ !మార్టిన్! ఇటు రా’, అటువైపుగా వెళ్తున్న మార్టిన్ షామిల్ ను చూసి అరిచాడు ఇవాన్.

వెంటనే మార్టిన్ తుపాకిని చేతి కర్రగా పట్టుకుని అక్కడికి వచ్చాడు.

‘ఇతన్ని తీసుకువెళ్ళడానికి నాకు సాయం చెయ్యి. చూస్తున్నావుగా ఎలా ఉన్నాడో!’ ఇవాన్ పిచ్చిగా ఉన్న అతన్ని తన కళ్ళతో చూపిస్తూ అన్నాడు. ‘అతను దీన్ని భరించలేకపోతున్నాడు.తలలోకి చెడు రక్తం చేరినట్టు ఉంది.’

  షామిల్ గాయపడిన లిఖోవిడో కాలిని తన చొక్కా చేతి నుండి ఒక్క గుడ్డ చించి, అతని ముఖం వైపు చూడకుండా కట్టు కట్టి,అతన్ని తన చేత్తో పట్టుకున్నాడు.వారిద్దరూ కలిసి అతన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళారు.

మేము ఆ చిన్న కొండల మీద

 తేనెటీగల్లా గుంపుగా వెళ్ళాము…..

 లిఖోవిడో అరిచి,మళ్ళీ మౌనంగా అయిపోయాడు. అతని పరిస్థితికి బాధపడుతూ,షామిల్ ఓదార్పుగా అన్నాడు.

  ‘అలా పాడకు. నువ్వు ఎగరాల్సిన ఎత్తుకి ఎగిరావు. ఇక ఆ పాటలు దిగమింగుకో!’

            త్వరలోనే ఆ టర్కీల

ఎముకల్లో గుజ్జు లేకుండా చేస్తాము…… 

  కానీ ఆ పిచ్చివాడు వారి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ పాడుతూనే ఉన్నాడు,మధ్యమధ్యలో మాత్రం తన చేతులను ఛాతికి ఆనించుకుంటూ,పళ్ళు బిగపడుతూ,తల ఊపుతూ ,నొప్పిని దిగమింగుకుంటూ పాటను ఆపినా,మళ్ళీ వెంటనే అందుకునేవాడు.

  *   *   *

               స్టోఖోడ్ కి నలభై వెరస్టుల దూరంలో భారీ యుద్ధం జరుగుతూ ఉంది. రెండు వారాల నుండి తూటాల మోతకు విరామమే లేదు. రాత్రి వేళల్లో దూరంగా ఉన్న ఆకాశమంతా టార్చ్ లైట్ల కాంతి బింబాలతో నిండిపోయి, దూరంగా చూస్తూ ఉన్న వారిలో ఆ కాంతి,యుద్ధ ధ్వనులు భయాన్ని నింపాయి.

  పన్నెండవ కొసాక్కు రెజిమెంటును చిత్తడి నేలతో ఉన్న అటవీ ప్రాంతంలో ఉంచారు. కొసాక్కులు పగటి వేళల్లో లోతు లేని ఆ కందకాల్లో కంగారుగా తిరుగాడుతూ ఉండే ఆస్ట్రియా సైనికుల మీద కాల్పులు జరుపుతూ; రాత్రి వేళల్లో పేకాట ఆడుతూ లేక నిద్ర పోతూ కాలం గడిపేవారు. యుద్ధ ప్రాంతం దిశ నుండి రాత్రుళ్లు కనిపించే వెలుతురు దీపాలను కేవలం సెంట్రీలు మాత్రమే చూసేవారు.

      ఒక మంచు కురిసిన రాత్రి, దూరం నుండి పడుతున్న కాంతి వల్ల ప్రకాశవంతంగా ఆకాశం ఉన్నప్పుడు గ్రెగరి తన డగౌట్ నుండి బయటకు వచ్చాడు. అతను అక్కడ ఉన్న చిన్న దారి గుండా గుబురుగా ఉన్న చెట్ల నుండి దూరంగా ఉన్న చిన్న కొండ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అనువైన చోటు చూసుకుని నేల మీద పడుకున్నాడు. డగౌట్ లో గాలి దుర్గంధాన్ని మోసుకు వస్తూ దానితో పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న ఐదు కొసాక్కులు కాలుస్తున్న పొగాకు వాసనను కూడా తనతో కలుపుకుంది. కానీ ఇక్కడ ఈ చెట్ల మధ్య కొండ ప్రాంతంలో ,గాలి ఆహ్లాదభరితంగా ఉంది. బహుశా అది పైన కనిపించకుండా ఎగురుతున్న పక్షి రెక్కల మీదుగా వచ్చినట్టు ఉంది. కానీ మంచు దగ్గర ఉన్న గడ్డి ఏదో విషాదపు వాసనను మోసుకుస్తున్నట్టు ఉంది. ఆయుధాలు తమ గుండా దూసుకుపోవడంతో  ఆకృతిని కోల్పోయిన వృక్షాలు, పొగను వెలవరించే ఆయుధాలు తాజాగా అటు వచ్చిన సంకేతంగా ఆ పొగల జాడ కనిపిస్తూనే ఉంది. ఆకాశంలో తూర్పు నక్షత్రం మాత్రం వెలుగును ప్రసరిస్తూనే ఉంది.

   సగం మూసి ఉన్న కళ్ళతో ఆ నక్షత్రం వైపు గ్రెగరి చూసినప్పుడు ,,అతని కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వచ్చాయి.

   ఆ సమయంలో గ్రెగరికి అకారణంగా తను యాబ్లోనోవ్స్కోయి గ్రామ దిగువ ప్రాంతం నుండి యాగ్డోనోయ్ లో ఉన్న ఇంటిలో ఉన్న అక్సిన్య దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళిన రాత్రి గుర్తుకువచ్చింది. ఆమె గుర్తుకు రాగానే అతని గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. అతని జ్ఞాపకాల్లో సమీపమైన ఆమె రూపం ప్రత్యక్షమైనా,అది అతనికి అపరిచితమైనదిగా అనిపించింది. అతను వెంటనే ఆఖరి సారి ఆమెను చూసినప్పుడు దుఃఖిస్తూ ఉన్న ఆమె ముఖాన్ని తన కళ్ళ ముందు చిత్రించే ప్రయత్నం చేసినా,అది విఫలమై ఆమె ముఖంలో చిరునవ్వు,విజయగర్వం మాత్రమే అతనికి కనిపించింది. ఆ ఊహాచిత్రంలో ఉన్న ఆమె, తన తలను అటుయిటూ తిప్పుతూ, తన నల్ల కళ్ళతో అతన్ని కవ్విస్తూ, కోరికతో రగిలిపోతున్న ఆమె ఎర్రటి పెదాలు ఏవో గుసగుసలాడుతున్నాయి. వెంటనే ఆమె తన చూపు తిప్పుకుని,వెనక్కి తిరిగింది, ఒకప్పుడు అతను ఎంతో ప్రేమతో ముద్దాడిన కురులు కనిపిస్తున్నాయి.

   గ్రెగరి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఒక్క క్షణం పాటు అతనికి మత్తెక్కించే అక్సిన్య కురుల సువాసన అక్కడ  ఉన్నట్టు అనిపించింది; లేచి కూర్చుని ,ముక్కుపుటాలు అదురుతుండగా చుట్టూ చూస్తే ,అక్కడ కుళ్లిన ఆకుల వాసన తప్ప ఏమి లేదు. గుండ్రంగా ఉండే అక్సిన్య ముఖం క్రమక్రమంగా మాయమైపోయింది.గ్రెగరి కళ్ళు మూసుకుని, ఒక చేతిని నేల మీద ఉంచాడు. ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాడు.

            సంబంధం లేని జ్ఞాపకాలు అక్సిన్య చిత్రాన్ని అతని మదిలో నిర్మించాయి. ఆమెతో విడిపోయిన తర్వాత టాటార్ స్కై లో తన కుటుంబంతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. రాత్రుల్లో తన పూర్వపు లైంగిక స్థబ్దత వల్ల ఏర్పడిన పరిణామాలను సరి చేసుకోవడానికన్నట్టు తనకు దగ్గరయ్యే నటాల్య;పగటి వేళల్లో తనను మెప్పించడానికి ప్రయత్నించే కుటుంబం, గ్రామం మొత్తంలోనే మొదటి సెయింట్ జార్జ్ క్రాస్ పతకం పొందినందుకు గ్రామ ప్రజలు చూపే గౌరవం, ఇవన్నీ గ్రెగరిని ఉక్కిరిబిక్కిరి చేసేవి.ప్రతి చోట, ఆఖరికి తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా తనను ప్రశంసాపూర్వకంగా చూడటం అతని దృష్టి దాటిపోలేదు. ఒకప్పుడు తాము చూసిన తల బిరుసుతనం, కొంటెతనం ఉన్న ఆ కుర్రవాడేనా ఇతను అని అందరూ అతన్ని నమ్మలేనట్టు చూస్తుండేవారు. గ్రామపు కూడలిలో వృద్ధులందరూ కూడా అతన్ని తమతో సమానంగా భావించేవారు, అతని నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టేవారు.కొద్దిగా వంగినట్టు ఉన్న ఆకారంతో, కోటు మీద అతని వీరత్వానికి ప్రతీకగా ఉన్న పతకం చూసి స్త్రీలంతా ఆరాధనగా చూసేవారు. తనతో కలిసి చర్చికి లేదా పెరేడ్ మైదానానికి వస్తున్నప్పుడు తండ్రి ముఖంలో ఉన్న గర్వసూచికను కూడా గ్రెగారి గమనించాడు. కానీ క్రమక్రమంగా ఈ మర్యాద, గౌరవం, పొగడ్తల నిషా  గరంజా అతని మెదడులో నాటిన నిజ విత్తనాలను ధ్వంసమయ్యేలా చేసింది.. గ్రెగరి యుద్ధం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒకలా ఉంటే, తిరిగి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఇంకో మనిషిలా మారిపోయాడు.తల్లి పాలు తాగే సమయం నుండి నూరి పోసిన కొసాక్కు సంప్రదాయాలు అతను కనుగొన్న వాస్తవాన్ని జయించేలా చేశాయి.

            ‘నాకు తెలుసు గ్రీషా!నాకు చాలా కాలం నుండే తెలుసు నువ్వు గొప్ప కొసాక్కు వీరుడివి అవుతావని. నీ మొదటి పుట్టినరోజు నాడు, పాత కొసాక్కు పద్ధతి ప్రకారం నిన్ను వాకిట్లోకి తీసుకువచ్చాను. అమ్మా, నీకు గుర్తుందా?… నిన్ను గుర్రం ఎక్కించాను. నువ్వు అంత చిన్న వయసులోనే ఆ గుర్రాన్ని పట్టుకున్నావు.అప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో సాధిస్తావని, అలాగే చేసావు!’వీడ్కోలు ఇచ్చే రోజు మందు తాగుతూ అన్నాడు తండ్రి, నెరిసిన తన జుట్టును సవరించుకుంటూ.

            ఎప్పుడైతే గ్రెగరి మరలా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడో,అప్పటికి అతను మళ్ళీ మంచి కొసాక్కుగా మారిపోయాడు. మనసులో అర్థంపర్థంతనంతో జరిగే యుద్ధం గురించి రాజీ పడలేకపోయినా, కొసాక్కు కీర్తిని ధైర్యంగా నిలబెట్టేలా ఉండటానికే నిశ్చయించుకున్నాడు.

   1915 వ సంవత్సరం,మే నెల. ఒల్కోవిచ్ గ్రామం సమీపంలో 13 వ జర్మనీ రెజిమెంటు ఒక పచ్చటి బీడు మీదుగా దాడి మొదలుపెట్టింది. మెషీన్ గన్లు కీచు రాయిల్లా రొద చేస్తున్నాయి. నది పైన ఎత్తులో ఉంచిన రష్యా మెషీన్ గన్ను ఒక్కసారిగా గర్జించింది. 12 వ కొసాక్కు రెజిమెంటు దాడికి సిద్ధమైంది. గ్రెగరి శత్రువుకు సూటి లక్ష్యంగా ఉండకుండా తన పక్కన ఉన్నవారి మధ్య నుండి  ముందుకు పరిగెడుతూ, తల వెనక్కి తిప్పి పైకి చూశాడు. ఆ మధ్యాహ్నపు ఆకాశంలో కనిపించిన సూర్యుడు అతనికి పచ్చటి కాట్కిన్ పుష్ప గుత్తులా అనిపించాడు. ఆశ్విక దళం నదికి అవతల వైపు ఉన్న పోప్లార్ చెట్ల వెనుక ఉంది. వారి ముందు జర్మన్లు సూర్యకాంతి పడి మెరుస్తున్న హెల్మెట్లతో వరుసగా ఉన్నారు. కాల్పుల వల్ల వచ్చిన బూడిద వర్ణపు పొగ ఆ గాలిలో కలిసిపోయింది.

    గ్రెగరి నింపాదిగా లక్ష్యం కేసి గురి పెడుతూ, తుపాకి ఖాళీ చేస్తూ, పేలుళ్ళ మధ్య ఆ విభాగపు అధికారి ఆజ్ఞలను అనుసరిస్తూ దాడికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే ఆజ్ఞ వచ్చింది. వెంటనే గ్రెగరి ఎత్తుగా ఉన్న ఒక జర్మనీ లూయీటెంట్ ను తన తుపాకితో నేలమట్టం చేసి, ముగ్గురిని తలల పై నుండి కాల్చి ఖైదీలను చేసి, వారిని అక్కడ ఉన్న నది మీదుగా పరుగుపెట్టించాడు.

   1915 జులై నెలలో రావా-రుస్కాయా వద్ద, కొందరు కొసాక్కులతో కలిసి ఆస్ట్రియా సైన్యం ఆక్రమించిన కొసాక్ స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో శత్రువు ఉన్న ప్రాంతంలోకి జారిన గ్రెగరి కాల్పులు జరిపి, శత్రు సైన్యాన్ని ఓడించాడు.

  బయానెట్స్ ప్రాంతం దగ్గర జరిగిన యుద్ధంలో బలిష్టంగా ఉన్న ఒక ఆస్ట్రియా అధికారిని పట్టుకుని,అతన్ని తన గుర్రపు జీను మీద వేసుకుని,గుర్రాన్ని ముందుకు దుమికించాడు. ఆ సమయంలో భయంతో వణికిపోతున్న ఆ అధికారి నుండి వచ్చిన మలం వాసన అతని కడుపులో తిప్పేలా చేసింది.

   కొండ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గ్రెగరికి తనకు బద్ధ శత్రువైన స్టీఫెన్ అష్ట కోవ్ తో ఎదురైన సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన 12 వ రెజిమెంటును యుద్ధ సరిహద్దు నుండి తప్పించి తూర్పు ప్రష్యాకు బదిలీ చేసిన సమయంలో జరిగింది. కొసాక్కుల గుర్రాలు జర్మన్ల పచ్చటి పొలాలను ధ్వంసం చేశాయి. కొసాక్కులు వారి ఇళ్ళను తగలబెట్టి,ఎర్రటి పొగను, మసిగా మారిన గోడలను ,కూలిపోయిన పైకప్పులను గుర్తులుగా వదిలి, ముందుకు సాగిపోయారు. స్టాలుపోనెన్ పట్టణం దగ్గర ఆ రెజిమెంటు 27 వ డాన్ కొసాక్కు రెజిమెంటుతో కలిసి దాడి చేసింది. గ్రెగరికి అప్పుడు అప్పటికే పీలగా ఉన్న తన అన్న,అతనితో పాటు చక్కగా క్షవరం చేసుకుని ఉన్న స్టీఫెన్, గ్రామానికి చెందిన మిగతా కొసాక్కులు కనిపించారు. కానీ జర్మన్లు ఆ దాడిని తిప్పి కొట్టారు. జర్మన్లు వారిని చుట్టుముట్టారు. అప్పుడు అక్కడున్న 12 దళాలు ఒకటి తర్వాత ఒకటి వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, గ్రెగరి చూస్తుండగానే స్టీఫెన్ కింద నుండి తూటా దూసుకుపోయి అతని గుర్రం శరీరంలోకి చొచ్చుకుపోవడంతో అది కిందపడిపోయే లోపే,జరగబోయేది గ్రహించిన స్టీఫెన్ కిందకు దూకాడు.ఆ సందర్భంలో ఏదో చేయాలన్న సంతోషకరమైన నిశ్చయంతో,గ్రెగరి కష్టం మీద తన గుర్రపు పగ్గాలు అందుకుని,దాన్ని గట్టిగా అదిలించి,అప్పటికే ఒక గుర్రం స్టీఫెన్ మీద పోబోతుండగా అతన్ని చేరుకుని, ‘నా గుర్రపు జీను పట్టీని పట్టుకో ‘అని అరిచాడు గ్రెగరి,స్టీఫెన్ ను ఉద్దేశించి.  

   స్టీఫెన్ దానిని పట్టుకుని,దాదాపుగా గ్రెగరి గుర్రంతో పాటు అరవెరస్టు దూరం పరిగెత్తాడు.

  ‘అంత వేగంగా వెళ్లకు!దయచేసి వెళ్ళకు!’రొప్పుతూ,స్టీఫెన్ అర్థించాడు.

  వారు ఆ యుద్ధ ప్రాంతం నుండి సురక్షితంగా తప్పించుకుని ముందుకు వచ్చారు.ఇంకో వంద అడుగుల దూరంలో ఉన్న అడవికి వెళ్తే చాలు.అక్కడే వారి దళాలన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక తూటా స్టీఫెన్ కాలికి తాకింది,అంతే అతను ఆ జీను పట్టీ మీద పట్టు కోల్పోయి, బోర్లా కింద పడిపోయాడు. గాలి వల్ల గ్రెగరి టోపీ ఎగిరిపోయి, జుట్టు అతని కళ్ళల్లో పడింది. అతను జుట్టు సరిచేసుకుని వెనక్కి తిరిగి చూశాడు. స్టీఫెన్ కుంటుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న పొద దగ్గరకు వెళ్తూ,ఆ పొదలోకి తన టోపీ విసిరేసి, అక్కడ కూర్చుని, తన దుస్తులకు ఉన్న మెరుస్తూ ఉన్న సైనిక హోదాలను సూచించే పట్టీలను తీసేస్తున్నాడు. అప్పటికే జర్మనీ పదాతి దళం కొండ ప్రాంతం మీదుగా వస్తూ ఉంది. స్టీఫెన్ తనను కొసాక్కుగా గుర్తించే సూచనలు లేకుండా జాగ్రత్త పడుతూ,మామూలు సైనికుడిగా తప్పించుకోవాలని అనుకుంటున్నాడని గ్రెగరికి అర్థమైంది. ఆ సమయంలో అప్పటి వరకు జర్మన్లు కొసాక్కులను ఎవరిని కూడా ఖైదీలుగా తీసుకువెళ్ళలేదు …కానీ ఏదో కీడు శంకించడంతో గ్రెగరి వెంటనే ఆ పొద దగ్గరకు పరిగెత్తాడు.

 ‘గుర్రం మీద ఎక్కు!’అన్నాడు స్టీఫెన్ తో.

  అప్పుడు స్టీఫెన్ చూసిన చూపుని గ్రెగరి ఎప్పటికీ మార్చిపోలేదు. గ్రెగరి స్వయంగా అతన్ని గుర్రం మీద ఎక్కడానికి సాయం చేసి, చెమటతో స్నానించినట్టున్న ఆ గుర్రం పక్కన తను పరిగెత్తాడు ఆ జీను పట్టీ పట్టుకుని. 

    అప్పుడు తూటాలు గ్రెగరి పక్క నుండి,స్టీఫెన్ పైన నుండి దూసుకుపోయాయి. ఎలాగో అడవిని చేరుకున్నారు. అక్కడ స్టీఫెన్ గుర్రం దిగి, బాధతో కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ఎడమ బూటు మీదకి రక్తం కారుతూ ఉంది,అతను అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ రక్త ధార ఆపకుండా స్రవిస్తూనే ఉంది. ఒక ఓక్ చెట్టు దగ్గర కూలబడి, గ్రెగరిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు.

  ‘ఈ బూటు అంతా రక్తంతో నిండిపోయింది’,గ్రెగరి దగ్గరకు వచ్చాక అన్నాడు.

  గ్రెగరి ఏం బదులివ్వకుండా తల పక్కకు తిప్పుకున్నాడు.

   ‘గ్రీషా …ఈ రోజు మనం దాడి చేస్తున్న సమయంలో …నీకు వినిపించిందా గ్రెగరి?’ లోపలికి పీక్కుపోయిన స్టీఫెన్ కళ్ళు ఏదో వెతుకుతున్నట్టు అడిగాయి. ‘మనం దాడి చేస్తున్నప్పుడు, నేను నీ వెనుక నుండి నీ వైపు మూడు సార్లు కాల్చాను.కానీ నువ్వు నా చేతిలో చనిపోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు.’

     వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. బాధతో ఉన్న స్టీఫెన్ కళ్ళు లోతుల్లో నుండి కూడా మెరిసాయి. పళ్ళు బిగబట్టి మాటలు కొనసాగించాడు స్టీఫెన్.

     ‘నువ్వు నన్ను చావు నుండి కాపాడావు…దానికి నేను నీకు కృతజ్ఞడినై ఉంటాను. కానీ అక్సిన్య విషయంలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను. క్షమించాలనుకున్నా నా వల్ల కాదు …కనుక నన్ను ఒత్తిడి చేయకు,గ్రెగరి!’

  ‘నేను నిన్ను ఒత్తిడి చేయడం లేదు’, గ్రెగరి బదులిచ్చాడు.

  ఆ పైన ఏం మాట్లాడుకోకుండా వారు విడిపోయారు.

 ఇంకో జ్ఞాపకం కూడా అతని మదిలో మెదిలింది. మే నెలలో గ్రెగరి రెజిమెంటు, బృస్లోవ్ సైన్యంలోని కొన్ని యూనిట్లతో కలిసి,లుట్స్ ప్రాంతం దగ్గర నుండి శత్రువు ప్రాంతంలోకి చొచ్చుకుపోయి,గాయపడి ,వారిని గాయపరచి ముందుకు సాగారు. వోవ్ ప్రాంతం దగ్గర,గ్రెగరి తానే స్వయంగా తానే  తన బృందాపు బాధ్యత తీసుకుని ఆస్ట్రియా దళపు స్థావరాన్ని ఆక్రమించి,అక్కడ ఉన్న సైనికులను కూడా పట్టుకున్నాడు. ఒక నెల తర్వాత ఒక ఖైదిని విడిపించడానికి, బగ్ నదిలో ఈదుకుంటూ శతృస్థావరానికి వెళ్ళాడు. అక్కడ బలిష్తుడైన సెంట్రీతో  ఆశ్చర్యపరిచే రీతిలో తలపడ్డాడు.అతను ఎంతో బలంగా ఎదుర్కున్నా చివరకు అతన్ని గ్రెగరి కట్టి పడేశాడు.

  ఆ ఉదంతం తలపులోకి రాగానే గ్రెగరి ముఖం మీదకు ఒక చిరునవ్వు వచ్చింది.

  అలాంటి రోజులు ఎన్నో ఆ యుద్ధం కాలంలో ఉన్నాయి. గ్రెగరి కొసాక్కు గౌరవాన్ని నిలబెట్టేలా, వీరత్వాన్ని ప్రదర్శించేలానే ప్రతిసారి ప్రవర్తించాడు. దాని కోసం అనేక సార్లు తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకుని మరి,శత్రు ప్రాంతాల్లోకి మారువేషాల్లో వెళ్ళి, అక్కడ ఖైదీలుగా ఉన్న తమ వారిని విడిపించి,ప్రాణాలతో తీసుకువచ్చాడు. ఒక కొసాక్కు తన వీరత్వాన్ని నిరూపించుకోవడానికి చేసేవన్నీ అతను చేశాడు. మొదటి రోజుల్లో సాటి సైనికుల పట్ల అతని హృదయంలో జన్మించి,బాధ పెట్టిన సానుభూతి,మానవత్వం లాంటివి ఇప్పుడు శాశ్వతంలో మాయమైపోయాయి. అతని హృదయం కరువు సమయంలో ఎండిపోయే సముద్రపు ఉప్పు నీటి వల్ల ఏర్పడే చిత్తడి నేలలా మారిపోయింది.అది ఎలా అయితే నీటిని పీల్చుకోలేదో,అలాగే గ్రెగరి హృదయంలో కూడా జాలికి చోటు లేకుండా పోయింది. మొండి ధైర్యంతో అతను తన ప్రాణాలను,తోటి వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టి అనేకసార్లు సాహసానికి పూనుకోవడం వల్లే వీరుడిగా గుర్తింపు పొంది, నాలుగు సెయింట్ జార్జ్ క్రాసులను,నాలుగు పతకాలను పొందాడు. అరుదుగా జరిగే యుద్ధ పేరెడ్లలో రెజిమెంటు బేనర్ పక్కన గర్వంగా నిలబడేవాడు. ఇంకెప్పుడూ ఇదివరకటిలా స్వచ్చంగా నవ్వలేనని; కళ్ళు చుట్టూ గుంటలు ఏర్పడి పీక్కు పోయాయని; ఒక పిల్లవాడికి ముద్దు పెట్టినప్పుడు ఆ స్వచ్చమైన కళ్ళల్లోకి చూడలేనని అతనికి తెలుసు. తన పతకాల కోసం, పదోన్నతుల కోసం తానేమి కోల్పోయాడో గ్రెగరికి బాగా తెలుసు.

    గ్రెగరి తన కోటును కింద పెట్టి, ఎడమ చేతి వైపుకి వాలి కొండ దగ్గర పడుకున్నాడు. తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు, అందులో యుద్ధంలో ఉన్న జ్ఞాపకాలన్నీ తన బాల్యం నుండి ఉన్న జీవితపు కాలాన్ని చెరిపేస్తున్నట్టు అనిపించింది. గ్రెగరి ఆ బాల్యపు జ్ఞాపకాల దొంతరలోకి ఇష్టపూర్వకంగా మనసును కదిలించి, మళ్ళీ వెంటనే తాజాగా జరిగిన ఘటనల దగ్గరకు వచ్చేవాడు. ఆస్ట్రియా సైనికులు ఉన్న కందకాల్లో ఎవరో చక్కగా మాండలిన్ వాయిస్తున్నారు. ఆ చక్కటి ధ్వని,గాలి తరంగాలతో కలిసి,స్టోఖోడ్ నది మీదుగా,రక్తంతో తడిసిన ఆ భూమిని తాకింది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అప్పుడప్పుడూ మిణుక్కుమంటున్నా,చీకటి చాలా చిక్కబడి ఉంది.ఆ అర్ధరాత్రి మంచు కూడా కురుస్తూ ఉంది. గ్రెగరి రెండు సిగరెట్లు ఒక దాని తర్వాత ఒకటి కాల్చి,తన తుపాకీ ని చేత్తో గట్టిగా తడిమి,ఛాతీ మీద ఎడమ చేయి వేసుకుని, అక్కడ నుండి పైకి లేచి కందకాల వైపుకి తిరిగి నడిచాడు.

   డగౌట్ లో ఇంకా పేకాట ఆడుతూనే ఉన్నారు. గ్రెగరి తన జ్ఞాపకాల దారుల్లో మరలా నడవాలనుకుని, తన బంక్ దగ్గరకు వెళ్ళాడు. కానీ అది సాధ్యం కాక వెంటనే నిద్రకు జారుకున్నాడు. అతని కలలో తగలబడుతున్న ఒక పచ్చిక మైదానం,ఆ దారి గుండా గుర్రపు డెక్కల ముద్రలు ….ఆ మైదానం అంతా నిశ్శబ్దంగా ఎవరూ లేకుండా ఉంది. అతను పక్కనే ఉన్న ఇసుక నెలాలో నడుస్తూ ఉన్నాడు.కానీ అతని అడుగుల శబ్దం అతనికే వినిపించలేదు,అందుకే భయపడ్డాడు. వెంటనే నిద్ర లేచి,తలెత్తి చూశాడు. ఒక నిమిషం పాటు పెదాలు చప్పరించాడు.ఆ తర్వాత అతను ఏ కలలు లేకుండా నిద్రపోయాడు.

    అతను ఉదయం నిద్ర లేచే సరికి, అలసటతో,ఏదో తెలియని బాధతో ఉన్నాడు.

  ‘ఏంటి ఈ రోజు అదోలా ఉన్నావు? ఇంటి గురించి కల కన్నావా?’ ఉర్యుపిన్ అతన్ని అడిగాడు.

  ‘నువ్వు సరిగ్గానే కనిపెట్టావు. నాకు పచ్చిక మైదానం కలలోకి వచ్చింది. అక్కడ ఉంటే ఎంత బావుంటుందో ….ఇక్కడ జారుకి సేవ చేస్తూ విసుగొచ్చింది.’

  కర్లీ నవ్వాడు. అతను చాలా కాలం నుండి గ్రెగరితో కలిసి ఒకే డగౌట్ లో ఉంటున్నాడు. ఒక బలమైన జంతువు ఇంకో బలమైన జంతువుకి ఎలా గౌరవమిస్తుందో అలాగే అతను గ్రెగరి పట్ల అలానే వ్యవహరిస్తున్నాడు. 1914 లో వారి మధ్య జరిగిన మొదటి గొడవను మినహాయిస్తే ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. కానీ కర్లీ ప్రభావం మాత్రం గ్రెగరి మెదడు మీద,ప్రవర్తన మీద బలంగా పడసాగింది. ఆ యుద్ధం వల్ల ప్రపంచం గురించి ఉర్యుపిన్ కి ఉన్న దృక్పథం మారిపోయింది. అతను క్రమక్రమంగా యుద్ధ వ్యతిరేకత పట్ల మక్కువ పెంచుకుంటున్నాడు. అతను గంటల సేపూ  ద్రోహులుగా ఉన్న జనరల్స్ గురించి, జారు దగ్గర బలంగా పాతుకుపోయిన జర్మన్ల గురించి చెప్పగలడు. ‘అసలు ఏం మంచి జరుగుతుందని మీరు అనుకోగలరు,జారు భార్యలోనే జర్మన్ రక్తం ఉంటే.ఆమె మనల్ని దేనికోసమైనా సంకోచించకుండా అమ్మేయ్యగలదు’,అని ఒకసారి నోరు జారాడు కూడా.

  ఒక రోజు గ్రెగరి గరాంజా తనకు బోధించిన విషయాలను కర్లీకి అవేమీ ఎక్కేవి కావు.

  ‘పాట బాగుంది కానీ గొంతు బొంగురుగా ఉంది’, తల గొక్కుంటూ విముఖత ప్రదర్శించే నవ్వుతో అన్నాడు. ‘మిష్కా కొషివోయ్ ఎప్పుడూ కంచె దగ్గర కోడి కోసం అరిచే పుంజులా గోల పెడుతూనే ఉన్నాడు దీని గురించి. అసలు ఈ విప్లవాలకు అర్థమే లేదు,అవన్నీ మూర్ఖపు పనులు. అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన కొసాక్కులకు ఒక సొంత ప్రభుత్వం ఉండాలి, ఇంకొకరి అధీనంలో ఉండకూడదు. మనకు ఒక బలవంతుడైన జార్ అంటే నికోలాయి నికోలాయేవిచ్ (మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సైన్యానికి నికోలాయ్ నికోలోయేవిచ్ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత సివిల్ వార్ తలెత్తడంతో అతను అక్కడి నుండి విదేశాలకు పారిపోయాడు. అక్కడ రాంగెల్ మరియు ఎందరో రాచరిక కుటుంబాల్లో జన్మించిన వారు అతనికి రష్యా సింహాసనం పై  హక్కును సమర్థించి,అతనికి మద్ధతుగా ఉన్నారు.) మనం ఆ చిన్నపాటి రైతులతో కలవలేము.ఎందుకంటే ఒక బాతును,ఒక పందితో జత పరచలేము. అంటే దాణా సంచి ఖాళీగానే ఉంది. అదే సమస్య. అసలు జారు పనికి రాడు,అందులో ఇంకో మాటే లేదు. ఆయన తండ్రి గట్టిగా ఉండేవాడు,,1905 లో తలెత్తిన విప్లవం లాంటిదే మళ్ళీ ఇతని కాలంలో సంభవించి,అంతా కుప్పకూలిపోతుంది. దాని వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు. ఒకవేళ వాళ్ళు జారును పదవీభ్రష్టుడిని చేస్తే,తర్వాత మన వెంట కూడా పడతారు. అప్పుడు మన మీద ఉన్న కోపంతో మన భూములు లాక్కుని,రైతులకి పంచిపెడతారు. కనుక ఈ విషయాలన్నీ గ్రహించి నడుచుకుంటే మంచిది.’

    ‘నువ్వు ఎప్పుడు ఏ ప్రశ్నకు అయినా ఒకవైపు చూస్తావు’, గ్రెగరి ముఖం చిట్లిస్తూ అన్నాడు.

    ‘నువ్వు చెప్పేది హాస్యాస్పదంగా ఉంది. నువ్వు ఇంకా కుర్రవాడివే. నీకు ఇంకా తగలాల్సిన గాయాలు తగలలేదు. కొంత కాలం ఆగి చూడు!ఎప్పుడైతే వీళ్ళు నిన్ను కూడా తన్ని తగలేస్తారో,అప్పుడే నీకు కూడా సత్యం ఎటువైపు ఉందో గ్రహింపుకి వస్తుంది.’

  అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయేది. గ్రెగరి మౌనంగా ఉండేవాడు, ఉర్యుపిన్ మిగిలిన విషయాల గురించి మాట్లాడేవాడు.

   ఆ రోజు గ్రెగరికి ఒక చేదు ఘటన ఎదురైంది. ఆ రోజు ప్రతిరోజులానే వంటలు తీసుకువచ్చే వాహనం కొండకు అవతలి వైపుకి వచ్చింది. కొసాక్కులు అక్కడకు కందకాల గుండా వెళ్ళారు. మిష్కా కొషివోయి మూడవ దళానికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళాడు. పొగలు కక్కుతున్న భోజనపు పాత్రలని తీసుకుని అతను డగౌట్ లోకి అడుగుపెడుతూ, ‘అబ్బాయిలారా! ఇది మనకు సరిపోదు! అసలు మన గురించి ఏమనుకుంటున్నారు?మనల్ని కుక్కలనుకుంటున్నారా?’ అని అరిచాడు.

  ‘ఏం చెప్పాలనుకుంటున్నావు?’ఉర్యుపిన్ అడిగాడు.

  ‘వాళ్ళు మనకు పాడైన మాంసం పంపిస్తున్నారు!’కొషివోయ్ కోపంగా బదులిచ్చాడు.

   *     *    *


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *