జిగేలు అరణ్యం

Spread the love

కాసుల గలగల లేకపోతే
కనికరించని జీవితం..

పరిగెత్తి పరిగెత్తి డస్సి
ఒక నీటి చుక్క కోసం దోసిలి పడితే
కనుచూపు మేర ఎడారి..

నాగరిక వడగాలులు
ముమ్మరంగా వీస్తున్న నగరంలో
ఒక నియోరిచ్ రోడ్డులా మసలిపోతూ..

విరిసిన పువ్వు వాడిపోవడమో
ఎవని పాలబడి వాడుకోవడమో తప్ప
మరో దారి తెలియని
ఏ ఐ జీవితాలు

వర్చువల్ బతుకుల్లో
చాట్ జీపీటీ ల సంభాషణల్లో
పైథోన్ బిగి కౌగిల్లో
డేటా ఎనాలిసిస్ చేస్తుందీ
జిగేలు అరణ్యం.

ఎన్ని చెప్పు..
నగరం నోరు తెరిచిన ఊబి.

విసిగిపోయి ఇంటికొస్తే
కళ్ళమెరుపుల్తో కాళ్ళూచేతులు ఆడించే
శిశువు పసినవ్వులా వుండదు.

అకారణంగా అలిగి కూర్చొని
మన జీవన మకరంద మిఠాయి బిళ్ళలు
కావాలని మొండికేసే పెంకిపిల్లది.

నవ్వుకుంటూ ఇవ్వలేము.
అలాగని మనం మనల్ని ఖర్చు చేసుకుంటూ
ఇవ్వకుండా ఉండలేము.

ఇక్కడ మనకు రూఢిగా తెలుస్తుంది..
ఒకటి కావాలంటే
మరొకటి వదులుకోవాల్సిందేనని !

Spread the love

One thought on “జిగేలు అరణ్యం

  1. ఒకటి కావాలంటే ఇంకోటి వదలాల్సిందే..
    వాస్తవిక నగర జీవన శకలం.. wah..

    నమస్తే గౌడ్ సర్🌷🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *