కవిత్వంలో హాస్యం పలికించడం, పండించడం అంత ఆషామాషీ కాదు. పైగా జాషువా కవిత్వంలో హాస్యమా?! అని అబ్బురపడే తరం కూడా ఇవాళ లేకపోలేదు. కొందరు విమర్శకులు జాషువాను కురుచ దృక్పథంలో చూస్తారు కానీ జాషువా కవిత్వకాంతి బహుముఖీనమైంది. నవరసాలలో కరుణరసాన్ని, హాస్యరసాన్నీ పోషించడం కష్టం. ఈ రెండురసాలూ జీవితంలో అనుభవించడం తెలిసినవాడే కవి అవుతాడు. కళాకారుడవుతాడు. హాస్యం మనిషిని ఆర్యోగవంతంగా నిలబట్టే పరమౌషధం. అందుకేనేమో ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల మూడుముక్కల్లో హాస్యతత్త్వాన్ని హాయిగా చెప్పగలిగాడు.
“నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం”
ఉటంకింపులో తేడా వున్నా విషయం మాత్రం ఇది.
మహాకవి జాషువా (1895-1971) కడుపారా నవ్వగల కవిచక్రవర్తి. అదే స్థాయిలో నవ్వించగలిగిన చతురుడు. నా మాటల్లోకంటే, రసజ్ఞురాలైన ఆయన చిన్నకూతురు హేమలతాలవణం మాటల్లో వినండి. జాషువా నవ్వురుచి తెలుస్తుంది.
“అనేక యిబ్బందులలో కూడా నవ్వగల ధీరోదాత్తుడు నాన్నగారు.”
తాను ఛలోక్తులు విసరడమేకాక తనమీద ఎవరైనా ఛలోక్తులు విసిరినా ఆయన ఆనందించేవాడు. “కవిగారూ! మీ మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టవచ్చా అని ఎవరైనా అంటే నిమ్మకాయలేమిటి గుమ్మడికాయలే నిలబెడతా సంపెంగనూనె ఉంటే అనేవారు.”
జాషువా కవిత్వం, చార్లీచాప్లిన్ నటన రెండూ ఒకటే. ఇద్దరూ పేదరికాన్ని అనుభవించిన వారే. ఇద్దరూ అవమాన పీడితులే. అయితేనేం దరిద్రదేవతను భలే ఆటపట్టించారు. చాప్లిన్ అభినయంలోనూ, జాషువా అభివ్యక్తిలోనూ గొప్ప లాలిత్యం తొణికిసలాడుతూ ఉంటుంది. జాషువాను పూర్తిస్థాయి హాస్యకవిగా ముద్రవేయలేం. కానీ ఆయన ఖండకావ్యాల్లో ఎండుద్రాక్షల్లా తియ్యని హాస్యం తగులుతూనే ఉంటుంది. ఎంత మహాకవి అయినా అతడి కవిత్వంలోనూ, వ్యక్తిత్వంలోనూ కొంత సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అలా ఉన్న కవుల్నే కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఈ రహస్యం జాషువాకు బాగా తెలుసు. ఆయన ఒకచోట ఈ నిజాన్ని అక్షరబద్ధం చేయడం జరిగింది కూడా.
హృదయం బావశ్యకమగు
సదా మహాకవికి; విశ్వ సత్యపరతయున్
బెదరని గుండెయు హాస్యము
బొదిగిన చతురోక్తి ముఖ్యములు తలపోయన్
‘నా కథ‘
ఈ హాస్యం పొదిగిన చతురోక్తుల్ని జాఘవా కవిత్వంలో పట్టుకోగల్గితే ఒక నవ్వుల ఖజానా దొరికినట్టే.
‘అనాధ’ కావ్యం అత్యంత కరుణరసభరితమైంది. చాప్లిన్ సినిమాల్లోని పేదరికంలాగే ఉంటుంది. హంగ్రీ థర్టీస్ లో ఈ రచన పుట్టింది.
ఓ పేద విధవరాలు, ఆమె ఆరుగురు సంతానం దయనీయమైన ఆమె దుర్భరజీవితం ‘అనాధ’ కావ్య వృత్తాంతం ఒకరోజు ఆ అనాధ తన ఆరుగురు పిల్లలతో ఆడుక్కోవటానికి బయలుదేరుతుంది. నిలువనీడలేని ఆ కుటుంబం. ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద వర్షంలో చిక్కుకుంటుంది. కాసేపటికి వాతావరణం సర్దుకుంటుంది. ఆ సన్నివేశాన్ని జాషువా ఎలా వర్ణించాడో గమనించండి.
“మగడు గొట్టిన రోదించి మానుకున్న
పెద్ద గయ్యాళివలె వాన వెలసిపోయె
మమతలుడిగిన సన్యాసి మనసు వోలె
గగన మండలంబెల్ల నిష్కలుషమయ్యే”
హృదయవిదారకమైన సందర్భాల్లో కూడా జాషువా ఉపమానచమత్కారం కనిపిస్తుంది. ఇటువంటి చోట్ల చార్లీచాప్లిన్ నటనని గుర్తుకు తెస్తుంది.
1916 – 1919 వరకు జాషువా జీవికకోసం రాజమండ్రిలో ఉన్నాడు. వృత్తి : మూకీ చిత్రాలకు కథావాచకత్వం. కదిలే బొమ్మలకు పెద్ద గొంతేసుకొని సంభాషణలు చెప్పినా సంభావన మాత్రం మృగ్యం, సినిమావాళ్లు కళాకారులకు డబ్బులెగ్గొట్టి నానా తిప్పలు పెట్టడం జాషువా తన ఆత్మకథలో రాశాడు.
ఆనాటి తన కష్టాల్ని ఎంత కమ్మగా చెప్పుకున్నాడో చూడండి.
“ఇద్దరు సుతలుం కూరిమి
ముద్దియ మేరాంబ తోడ ముట్టెడు జీతం
అద్దెకు ముద్దకు చాకలి
పద్దుకు సరిపోక పెక్కు పాట్లం బడితిన్”
ఇలా అయితే ఇక లాభంలేదనుకొని జాషువా ఆర్మీలో చేరుదామని నిశ్చయించుకున్నాడు. అవి మొదటి ప్రపంచ యుద్ధం (1914 – 1919) జరిగే రోజులు. జాషువాకు అక్కడ కూడా విధి వక్రీకరించింది. ఎలాగో చూడండి.
“కదనమున సైనికుడనై
బదుకుట మేలంచు సిద్ధపడి రిక్రూటింగ్
సదనమున కేగ ముగిసెం
గదనంబానాడె యేమి గ్రహచారంబో !”
జాషువా ఒకచోట ఇలా అంటాడు. ‘పేదరికము పెద్ద వింత విద్యాశాల. అందులోన లజ్జ గానపడదు.’ తన కష్టాల్ని దైన్యంగా కాకుండా, ధైర్యంగా నవ్వుతూ చెప్పడం ఆయనకే చెల్లింది. బహుశా దళితజీవితం ఈ అనుభవం నేర్పి ఉంటుంది.
ఇంట్లో గడవకపోయినా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా జాషువా సన్మానాల్లో పెట్టిన కొత్తబట్టలు ధరించి బయట దర్జాగా కనిపించేవాడు. అది చూసి లోకులే కాదు లోపలివాళ్లు కూడా ఆడిపోసుకునే వాళ్లట. ఈ వైనాన్ని జాషువా సరదాగా చెప్పుకున్నాడు.
“కలవారిచ్చిన పట్టు వస్త్రములతో గన్పట్టునన్ జూచి, శ్రీ
గల వాడీతడటంచు నల్వురన, నా కర్ణించి, నాకన్న కొ
డ్కులు జుట్టాలునూ డబ్బు లేదనిన సంకోచింతురీనాటిక
న్యుల మాటేల? ప్రచారమందు ఋతమున్ శుద్ధానృతంబయ్యెడిన్”
రాజమండ్రిలో ఉంటున్నప్పుడే ఒకసారి పుష్కరాలు వచ్చాయి. జాషువా పుష్కరదృష్టి విలక్షణమైంది. ‘అఖండ గౌతమి’ మీద పద్యాలు రాసి పడవలు చేసి గోదాట్లో వదిలాడు. చుట్టుప్రక్కల ఘాట్లన్నీ తిరిగాడు. కొబ్బరి ముక్కల కోసం, చిల్లర నాణేల కోసం ఎగబడే పేద భిక్షకుల్నీ చూశాడు. వాళ్లని ఈసడించుకుంటున్న భక్తసందోహాన్ని గమనిస్తున్నాడు. ఈ లోపు ఒకచోట నుండి కలకలం వినిపించింది.
“ఒక్క భక్తవరుని వొడిసి యెత్తుకపోయె
మొసలి యొకటి నీట మసలుచుండి
‘మేలు మేలు పర్వకాలాన చచ్చుట
పున్నె’ మనిరి చూచుచున్నవారు.”
విషాద హాస్యానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. అంతేకాదు. ప్రజల అజ్ఞానానికి మెత్తన చురక. ఒక్కొక్కసారి జాషువా హాస్యంలోనూ కొంటెతనం కనబడుతుంది. ఆయన అనుభవించిన అంటరానితనం కొంత కారణం కావచ్చు. ఉక్రోషం పుట్టినప్పుడు ఆయన కలం వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంది. బ్రహ్మలాంటి వాణ్ణి సైతం ఆటపట్టించడానికి కూడా వెనుకాడదు.
“కనబడవేమిర జగము కల్పన
చేసిన గారడీడ?’ అని నిలదీస్తాడు. అంతటితో ఊరుకోడు. ఊరుకుంటే జాషువా ఎందుకవుతాడు? ఈ అవక తవక సృష్టి చేసిన చతుర్ముఖుణ్ణి భూమ్మీదకు రావద్దని ఇలా వెటకారంగా హెచ్చరిస్తాడు. వస్తే నిన్ను ‘జూ’ లో పెడతారని చమత్కరిస్తాడు.
“నాలుగు మోములుం తలలు నాలుగుదాలిచి వత్తువేమొ? యీ
కాలము వారు మానిసి మొగంబిది పద్మము కన్నదంచు జం
త్వాలయ మందు జేర్తురు సుమా ! కమలాసన ! స్రష్టవంచునీ
నాలుగు నోళ్లు మొత్తుకొనినన్ వినరొక్కరు విశ్వసించరున్”
కొత్తలోకం
జాషువాలో గొప్ప సమయస్ఫూర్తి కనబడుతుంది. మంచి అవధానికుండే సరసగుణం ఇలాంటి పద్యాల్లో తేటతెల్లమవుతుంది. ‘అల్లుడు’ అనే ఖండికలో జాషువా ఎక్కుపెట్టిన ఈ సమస్యాత్మకపాదం పరిశీలిస్తే నవ్వు రాకమానదు.
‘పురుషాకారత నున్న జాలతనిలో
పుంస్త్వంబు లేకుండినన్’
మరోచోట కూడా జాషువా మహిళల పక్షాన నిలిచి మగవాళ్ళని ఇలా ఎద్దేవా చేస్తాడు.
“పెండ్లి యాడిన భార్యల పిప్పిజేసి
తరుముచున్నవి పురుష భూతములు కొన్ని
స్త్రీత్వమిడి యట్టివాని శిక్షింపవోయి…”
కొత్తలోకము
భగవంతుడికి జాషువా చేసిన ఈ వ్యంగ్య నివేదనలో వేదనాత్మక హాస్యం ధ్వనించడం లేదా?
జాషువా హాస్యాన్ని కొన్నిసార్లు పండితులు కోపగించుకున్న సందర్భాలు లేకపోలేదు. ఆచారాల మీద జాషువా అధిక్షేపధోరణికి సనాతనులు కొంత కినుక వహించారు.
అలాంటిదే ఈ పద్యం
‘నిన్ను చూపుమనుచు నేనర్చకుని వేడ
చూడమంచు గుడిని చూపినాడు.
గుడికిబోయి జూడ గుండ్రాయివైనాడ
వెందుకిట్టులైతి వేడ్పువచ్చె’
కొత్త లోకము
బ్రతికియున్న సాయిబాబెన్నడు గాడు
చావకున్న వట్టి సాయిబయ్య
తిరుమలేశుడైన తెలియడీ యర్ధంబు
చావు బ్రతుకులోని సారమిదియ’
గబ్బిలము
జాషువాది హాస్య ప్రవృత్తి ఉన్న హృదయం. ఒక్కోసారి సామాజిక మార్పులే ఆయన హాస్యానికి ఆధునికతకీ, సంప్రదాయానికీ మధ్య సంఘర్షణ ఎదురైంది. ఎలా అయ్యిందో జాషువా ‘పిలక’ అనే ఖండికలో గట్టిగా పట్టుకున్నాడు. ఆనాటి యువకుల్లో కొందరు ఫ్యాషన్ కోసం హెయిర్ కటింగ్ చేసుకునేవారు. ఆచారం కోసం పిలకను కూడా అట్టే పెట్టుకునేవారు. ఈ రెంటికీ పొసగని తనం మీద జాషువా విసుర్లు వినండి.
“కుచ్చుల క్రాఫింగును గని
మచ్చర పడి పిలకజుట్టు మారు మొగంబై
కచ్చకు తలకావలి దరి
ముచ్చెర గుంటలకు జారి ముడి వేసికొనెన్
నేనైన నుండవలయున్
తానైన న్నిల్వవలయు తలమీద నటుల్
గాని యెడను భయకులములు
ఖూనీ గావలయు వట్టి గుండుండ వలెన్”
ఖం. కా.5
జాషువా కవిత్వంలో పొలిటికల్ సెటైర్ కూడా కనబడుతూ ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నాయకుల్ని ఎండగడుతూ ఉంటాడు. కొంతకాలం జాషువా ఎం.ఎల్.సి.గా ఉన్నాడు. అందువల్ల ఆయనకు అసెంబ్లీతంతు ప్రత్యక్ష పరిచయం. నలభై యేళ్లనాడు ఎటువంటి అభ్యర్థులుండే వాళ్లో జాషువా పద్యం చదివితే మనకు నవ్వురాక మానదు.
“చేతులెత్తుడన్న చేతులెత్తిడివారు
నిలువుడన్న లేచి నిలుచువారు
చదువుకొన్నవారు చదువెరుంగనివారు
ఉభయ సభలలోను ఉందురచట”
జాషువాకి హాస్యం జీవితంలోంచి పుట్టింది. మంచి హాస్యం మనచుట్టూ ఉంటుందనటానికి ఆయన పద్యాలు చక్కటి ఉదాహరణలు. చదువు సంధ్యలు లేకుండా, ఏ పనీ పాట చేయకుండా, ఊరికే తిని కూర్చునే కొడుక్కి ఏదైనా పని అప్పచెప్పితే ఏం జరిగిందో చూడండి.
“జాబు పోస్టుజేసి సరగరమ్మని పల్క
వినయముట్టి పడక స్వీకరించు
మరచినాడంచు మరునాడు కొనివచ్చి
చెక్కు చెదరకుండ చేతికొచ్చు”
ఖం.డా. 5
రేడియో మీద ఎన్నో ఛలోక్తులున్నాయి. ఆ రోజుల్లో రేడియో ఉండడం గొప్ప. అప్పో సప్పో చేసి దాన్ని కొనడం స్టేటస్ సింబల్గా భావించే వాళ్ళు. ఆనాటి రేడియో కార్యక్రమాల మీద జాషువా గమ్మత్తైన కామెంట్ చేయడం గమనార్హం.
“నాల్గు వందలిచ్చి నట్టిల్లు సగమిచ్చి
మెచ్చి చేతులార తెచ్చుకొంటి
రేడియో మెషేను చేడియా! దయచేసి
పాడకమ్మ! చలిది పాత పాట”
ఖం.డా. 5
ఏ రేడియోనైతే జాషువా ఆడిపోసుకున్నాడో అందులోనే కొంతకాలం కార్యక్రమ ప్రయోక్తగా ఉద్యోగం చేయడం ఒక చమత్కారం.
‘పానుగంటి’ వారి ‘కంఠాభరణం’ నాటకంలో అనుకుంటాను. ఒక పాత్ర ఇలా అంటుంది.’
“ఏమేవ్ కవులొస్తున్నారు. కర్రపట్రా” అని, తాము గొప్ప కవులమని విర్రవీగే సమకాలీన రచయితల మీద జాషువా నవ్వు పుట్టించే అక్షింతలు ఎంత అందంగా వేశాడో చూడండి.
“నా కవిత్వంబునందు రత్నములు గలవు
వాని బెకలించి చూపెడు వాడు లేడు.
కాలమిట్లున్నదని మొనగాడు వోలె
పలుకు కవిగాడ! యేటికీ స్వాతిశయము?
ఏవీ యా రతనంబులు
నీవే పెకలించి యట్లొనర్పగ
నీ వలనన్ గాదొ! యింక నీల్గెద వేలా?”
అప్పటి సమకాలీన కవులమీద జాషువా విసిరిన విసుర్లు ఇప్పటి అత్యాధునిక కవులకు కూడా వర్తిస్తాయి. అంతెందుకు? రకరకాల ఇజాల పేర పాశ్చాత్య ఫ్యాషన్ల మోజులోపడి వచన కవిత్వంలో ప్రయోగాలు చేస్తున్న పద్ధతి మీద జాషువా నిరసన ప్రకటించాడు.
“ఈ బిత్తల తోకబీకుడు కవిత్వపు ఫక్కిననాదరించెదన్” అని తిట్టినా అందులో చేదు హాస్యం లేకపోలేదు. కవిత్వ ప్రస్తావన వచ్చింది కాబట్టి జాషువా ఎప్పుడూ సుకవుల పక్షమే వహించాడు.
ఎవడు సుఖించెనో తెలుపు మీ కవితా కళ నభ్యసించి…. అని సానుభూతి వ్యక్తం చేస్తాడు కవిగాడి బ్రతుకు శ్రీరామరామ అంటూ “ఈ బిరుదముల్ ఈ కవి పెండారముల్ దుప్పట్లక్కర తీర్చునా? సుకవులెందున్ మంద భాగ్యుల్ గదా !” అని మధనపడ్డాడు. ఈ మధనలోనూ ఒక మందహాసం లేకపోలేదు. అసలు కవిగా పుట్టడమే ఒక శాపం అంటాడు జాషువా. అంతేకాదు అందులోనూ పద్యం రాయడం ఎంత కష్టమో, ఎన్ని తిప్పలు పడాలో జాషువా చెప్పిన తీరు చూస్తే మనం నవ్వు ఆపుకోలేం.
“గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ
తగ్గవో! యని యతిస్థానమురుము
యతిని మచ్చిక జేసి యడుగు ముందుకు సాగ
ప్రాసంబు కుత్తుక బట్టి నిలుపు
ప్రాసవేదన దాటి పయనంబు సాగింప
భావంబు పొసగకిబ్బంది పెట్టు
భావంబు పొసగించి పద్యంబు ముగియింప
రసలక్ష్మి కినిసి మారాము సేయు
ఇట్టి ప్రతిబంధకంబుల నెల్ల గడచి
గట్టుకెక్కుదనున్న వ్యాకరణ శాస్త్ర
మాదరింపదు శబ్ద మర్యాద గాన
రాక; కవిగాని బ్రదుకు శ్రీరామ రామ”
పద్య నిర్మాణంలో ఇన్ని పరేషాన్లు ఉన్నాయి. గనకే ఆధునికులు ఈ చాకిరీ నుంచి సుఖంగా తప్పించుకున్నారు. ఫ్రీవే (Free way) లాంటి ఫ్రీ వెర్స్ (Free Verse) ను ఎంచుకున్నారు. ఇన్ని కష్టాలుపడి పద్యం రాయడమంటే మాటలా? మజాకా? జాషువా చెప్పాడు గనుక పద్యకవుల కష్టం గుర్తించి అభినందించి కరచాలనం చేయవలసిందే !
జాషువాలో అవధాన లక్షణాలు అంతర్లీనంగా దాగున్నాయి. తిరుపతి వేంకట కవుల, కొప్పరపు సోదర కవుల ప్రభావం చిన్నప్పుడు ఆయన మీద బలంగా ఉండేది. బాల్యంలో చేసిన అవధాన సాధన పెద్దయ్యాక కవిగా ఆయనని మరింత బలోపేతుణ్ణి చేసింది. పేర్లు కుదరలేదు గానీ బాల్యమిత్రులైన దీపాల పిచ్చయ్య శాస్త్రితో కలిసి గొప్ప అవధానులుగా వీళ్ల కీర్తి దీప్తివంతమయి ఉండేది. తెలిసిన పద్యమే అయినా మళ్లీ ఒకసారి చదువుకొని మనసారా నవ్వుకుందాం !
“నా పేరు ముందు నిల్పం
పాపం బదియేమొ జాషువా పిచ్చులగున్
నా పేరు చివర నిల్పిన
శాపం బిడిపట్లు పిచ్చ జాష్వాలయ్యెన్”
పిచ్చయ్య శాస్త్రి, జాషువాలది అపురూప స్నేహం. ఇద్దరూ వినుకొండలో కలిసి చదువుకున్నారు. చిన్నప్పుడు పిచ్చయ్యశాస్త్రి పిలకతో ఆడుకునే తుంటరి తనం పెద్దయ్యాక కూడా పోలేదు. ఇద్దరూ ఎంతో ప్రసిద్ధులైనా అవకాశం దొరికినప్పుడల్లా జాషువా పిచ్చయ్యశాస్త్రిగారి పిలకను ప్రేమగా పలకరించేవాడట!
జాషువా తన చీకటి జీవితంలో నవ్వుల దీపాల్ని వెలిగించుకున్నాడు. దళిత సాహిత్యంలో లోపించిన హాస్యస్పర్శ కొంత జాషువాతోనే భర్తీ అవుతుంది.
జాషువా హాస్యానికి ఒక సామాజిక ప్రయోజనం ఉంది. చార్లీ చాప్లిన్ తన చిత్రాల ద్వారా సాధించింది కూడా ఇదే…
* * *