చీకటి

Spread the love

థడ్… థడ్… థడ్…

అమ్మ డాడీ తలపై డంబెల్ తో కొడుతూనే ఉంది. డాడీ చిన్న మూలుగు తప్ప ఏమీ శబ్దం చెయ్యకుండా అలా పక్కకు పడిపోయారు. ఆయన శరీరం వెక్కిళ్ళు వచ్చేటప్పుడు కంపించినట్లుగా కంపిస్తూ ఉంది. నేను కొట్టుకుంటున్న కాళ్ళను పట్టుకుని ఉన్నాను కదా… ఆ కంపన నా చేతులకు తెలుస్తూ ఉంది. అమ్మ శక్తినంతా కూడా దీసుకుని గట్టిగా ఇంకోసారి కొట్టి… అలా కూర్చుండిపోయింది. డాడీ శరీరం కదలడం ఆగిపోయింది.

డాడీను చంపేసిన చాలాసేపటి వరకు అమ్మ డాడీను చూస్తూ కూర్చుంది. అమ్మ మొహం చాలా ప్రశాంతంగా ఉంది. హానీ ఇదంతా చూస్తూ ఉంది.

 హనీ గురించి మీకు కాసేపట్లో చెప్తాను. 

అమ్మ ముగ్గు వెయ్యటం మొదలుపెట్టింది. నేను, హనీ ఒకర్నొకరు చూస్తూ కూర్చున్నాం. అమ్మ ముగ్గు పూర్తి చేసి, పైకెళ్ళి డంబెల్ తీసుకొచ్చింది. తర్వాత నేను, అమ్మ చాలా శ్రద్దగా గురూజీ అమ్మకు చెప్పిన మంత్రాన్ని చదివాం.

            గురూజీ గురించి కూడా మీకు చెప్తాను.

 అసలు నేను సరిగ్గా చెప్పగలనో లేదో. కానీ నాకు వీలయినంత స్పష్టంగా ఈ కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు నేను చెప్పేది మీకర్ధం కాకపోవచ్చు.అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. జోల్సోమా…  ఉమ్మ్  ఇంకా చాలా పేర్లు చెప్పలేని మెడికేషన్ లో ఉన్నాన్నేను.

గత రెండేళ్లుగా నాకు ఆరోగ్యం బాలేదు. అమ్మకు చాలా కాలం నుండి బాలేదు. అమ్మను ట్రీట్ చేసే  డాక్టర్ ఒకామె ఉంది.  ఆమె నాకు కూడా ట్రీట్ మెంట్ ఇస్తోంది. ఆమె గురించి కూడా మీకు చెప్తాను. అబ్బా… టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎక్కడాపానూ?

ఆ.. గురూజీ చెప్పిన మంత్రాన్ని ఇద్దరం చదివాక నేను డాడీ కాళ్ళు పట్టుకున్నాను, కదలకుండా… తలమీద  గట్టిగా కొడితే ఒక్కసారిగా కాళ్ళు చేతులు కొట్టుకుంటారట. మొన్న నేను, హనీ, అమ్మ మాట్లాడుకున్నప్పుడు అమ్మే చెప్పింది. నేను కాళ్ళు పట్టుకున్నాక, అమ్మ డాడీను కాసేపు అలా చూస్తూ డంబెల్ పట్టుకుని నిల్చుంది. అమ్మ కళ్ళ నిండా నీళ్ళు. అలాగని ఏడవట్లేదు. ఒక్కసారిగా కొట్టడం మొదలుపెట్టింది. అమ్మ బలంగా కొట్టిన దెబ్బలకు డాడీ ఎక్కువ కష్టపడకుండానే చనిపోయారు.

రక్తం గడ్డకడుతూ ఉంది. గడ్డ కట్టే కొద్దీ రక్తం నలుపు రంగులోకి మారుతుండటం చూసాను. భలే వింతగా అనిపించింది. రక్తం నీచు వాసన కూడా వేస్తుంది. అమ్మ కూడా అలానే అనుకున్నట్టుంది. లేచి.. రింగు రింగులుగా ఉన్న జుట్టును ముడివేసుకుంటూ బాత్ రూమ్ లోకెళ్ళి బకెట్, పెద్ద టవల్ తో వచ్చింది. నేను సంగీతం నేర్చుకుంటున్నప్పుడు మ్యూజిక్ టీచర్, వాళ్ళ నాన్నగారు శ్రద్ధగా తంబూరపై శృతి మీటేవారు. అమ్మలో నాకిప్పుడు అదే శ్రద్ధ కనిపిస్తూ ఉంది.

 మ్యూజిక్ టీచర్ వాళ్ళ నాన్నగారి గురించి కూడా మీకు చెప్తాను.

అమ్మ ఆ టవల్ ను నాలుగు ముక్కలుగా కత్తిరించి, మొదటి ముక్కతో ఫ్లోర్ పైన రక్తాన్ని వత్తుతూ బకెట్ లోని నీళ్ళలో కలుపుతూ ఉంది. మధ్య మధ్యలో టైం చూస్తూ ఉంది. హనీ ఎప్పుడెళ్లిపోయిందో కానీ చూస్తే పక్కన లేదు. అన్నట్లు మీరు హనీ అంటే ఏ కుక్కపిల్లో అనుకుంటునట్లున్నారు, కాదు. హనీ చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటుంది. నాకు రెండు సంవత్సరాల క్రితం కనిపించి, పరిచయమైంది. అమ్మకు గత ఆరు నెలలుగా కనిపిస్తుంది. మా ఇద్దరితో మాట్లాడుతుంది. హనీ  ఇంకెవరికీ కనిపించదు. అసలు హనీ మా ఇంట్లో ఉన్నట్లు డాడీకు  కూడా తెలీదు.

నాకు ఎక్కువ టైం లేదు. ఈ కథంతా మీకు చెప్పాలి.ఇప్పుడు చెప్పకపోతే నేను మళ్ళీ మీకెప్పటికీ చెప్పలేను. చెప్పాను కదా… నా ఆరోగ్యం బాలేదని, నేను అసలు ఈ మధ్య బయటకెళ్ళట్లేదు. ఈ రోజు గురించి గత పదిహేను రోజులుగా నేను, అమ్మ, హనీ మాట్లాడుకున్నాం. చాలాసార్లు నేను వాదించాను అమ్మతో… అయితే హనీ అమ్మ వైపే ఉంది. నాక్కూడా ఇదంతా వీలైనంత త్వరగా ముగించెయ్యాలని గట్టిగా అన్పిస్తోంది.

సరే… ముందు నా కథ చెప్పేస్తాను.. ముందే చెప్పినట్లు మీరే అర్ధం చేసుకోవాలి. నేను సరిగ్గా చెప్పకపోయినా.. మీకు అర్ధం కాకపోయినా.. సారీ!

అమ్మా, డాడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్లకు నేను పుట్టానంట. అప్పటికి డాడీ గుంటూరు ఐ.టి.సి. లో పని చేస్తుండేవారు. నేను పుట్టిన రెండ్రోజులకు డాడీ టేబుల్ సొరుగులో నిమ్మకాయలు, రాగి రేకులు, బ్రహ్మ కమలం పువ్వు దొరికాయంట. అప్పటికి పదిరోజుల ముందు డాడీ వాళ్ళ సెక్షన్ హెడ్ సడెన్ గా చచ్చిపోయారు. ఆయనకు, డాడీకు అసలు పడేది కాదంట. కారణం డాడీ ప్రవర్తన. అంటే… ఎప్పుడూ మజ్జుగా ఉండటం, ఏవేవో పుస్తకాలు చదువుతుండటం, ఒంటి మీద కుంకుమ, విభూది వాసన.  ఆ సెక్షన్ లో ఎవరికీ నచ్చేవి కాదంట. ఇప్పుడు డాడీ టేబులు సొరుగులో దొరికిన సామాగ్రితో అందరూ కలిసి సెక్షన్ హెడ్ కు డాడీనే ఏదో చేయించారని సంతకాలు సేకరించి ఆఫీసోళ్ళకిస్తే…  ఐ.టి.సి. వాళ్ళు డాడీ ఉద్యోగం తీసేశారు.

 నేను పుట్టిన తర్వాత వెంటనే ఉద్యోగం పోయిందని డాడీకు నా మీద కోపం. నన్ను డాడీ గారం చేయటం, ముద్దులాడటం నాకు అసలు గుర్తు లేవు. నాకు డాడీ అంటే ఇష్టం. అయన మీద వచ్చే జవ్వాది వాసన చాలా ఇష్టం.

అన్నట్లు నా ముక్కు చాలా చురుకు. నాకు వాసనతో చాలా విషయాలు గుర్తుంటాయి.

 అమ్మా, డాడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే నాకెప్పుడూ నమ్మబుద్ది కాదు. వాళ్ళ గొడవలే నాకు చాలావరకు జ్ఞాపకాలు.          

డాడీ ఆ తర్వాతెప్పుడూ ఉద్యోగానికెళ్ళటం, పని చేయటం నేను చూళ్ళేదు. డాడీకు, అమ్మకు మాటలుండేవి కావు. డాడీ రోజులో చాలా సమయం  పూజగదిలో ఉండేవారు. వినాయకుడు, లక్ష్మి, వెంకటేశ్వరస్వామి లాంటివి కాకుండా బయటెక్కడా కనబడని పటాలు డాడీ పూజగదిలో ఉండేవి. అమ్మ కిచెన్ లోనే చిన్న బల్ల కొట్టించి వేరుగా పూజ చేసుకునేది.

            నేను సెకెండ్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒకరోజు కొంత మంది ఇంటికొచ్చి గొడవ చేశారు. డాడీ ను వీధిలోకి లాగి  కొట్టారు. అమ్మ తల బాదుకుని ఏడ్చింది. కొన్ని రోజులు మేం  ముగ్గురం బయటకు రాలేదు. ఆ తర్వాత  మేము గుంటూరు వదిలి, కాకినాడ వచ్చేసాం. అమ్మ అక్కడే ఒక స్కూల్లో టీచర్ గా ఉద్యోగం చూసుకుంది. నేనూ అదే స్కూల్. మ్యూజిక్ టీచర్ మా పక్క ఇంట్లో ఉండేవారు. అమ్మ నన్ను అక్కడ సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ చేసింది.

మంచి నిద్రలో ఉండగా పెద్ద పెద్ద అరుపులతో అమ్మా, డాడీ దెబ్బలాడుకునేటప్పుడు నాకు మెలకువ వచ్చేది. డాడీ అమ్మను వీపు మీద గుద్దుతూ, కాళ్ళతో తంతూ కేకలు వేస్తుంటే… అమ్మ చేతులు తిప్పుతూ, ఏడుస్తూ అరుస్తుండేది. ఆ కేకలకు మ్యూజిక్ టీచర్ వాళ్ళ నాన్న గారు వచ్చి అమ్మా, డాడీలతో మాట్లాడి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళిపోయేవారు. నేను అక్కడే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు టీచర్  దగ్గర, కొన్ని సార్లు ఆయన దగ్గర.

కొన్నిసార్లు నిద్ర ఉండేది కాదు. అలాగని లేచేదాన్ని కూడా కాదు. టీచర్ వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకోవడమంటే భయంగా ఉండేది. ఒకసారి అమ్మకు చెప్పాను. ఆ తర్వాత ఇంట్లో  గొడవైనా అమ్మ నన్ను వాళ్ళింటికి  పంపించడం మానేసింది.                                                                              

                                                  ***

            నేను ఆరవతరగతిలో వచ్చేటప్పటికి  అమ్మా, డాడీ గొడవపడటం తగ్గించేశారు. ఇప్పుడు  డాడీ ఎక్కువ ఇంట్లో ఉండట్లేదు. బయటకు వెళ్తే పది, పదిహేను రోజుల దాకా కనబడరు. వచ్చేటప్పుడు ఎవరో ఒకర్ని ఫ్రెండని తీసుకొచ్చేవారు. డాడీ ఫ్రెండ్సంతా చూట్టానికి చాలా విచిత్రంగా ఉండేవాళ్లు. వాళ్ళ బట్టలు, వేషధారణ, వాళ్ళ దగ్గర వచ్చే వాసన వేరేగా ఉండేవి. అందులో కొంతమందిని చూస్తే  భయం వేసేది. డాడీ ఫ్రెండ్సెవరూ నాతో, అమ్మతో మాట్లాడేవారు కాదు. పూజ గదిలోంచి బయటకోచ్చేవారు కాదు. అప్పుడు మా ఇల్లంతా అగరొత్తుల, సాంబ్రాణి వాసనలతో ఉండేది.

అమ్మ ఆ వాతావరణం తట్టుకోలేక నన్ను తీసుకుని గురూజీ గారి ఆశ్రమానికి ప్రయాణమయ్యేది. గురూజీ వాళ్ళ ఆశ్రమం ముమ్మిడివరంలో ఉంటుంది. గురూజీ మాట్లాడుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో జాంచెట్టు, దానిమ్మ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఆ రెండు చెట్లకూ చప్టా ఉండేది. ఆ చప్టా పైన కూర్చుని నేను దూరంగా మండపంలో ధ్యానం చేస్తున్న వాళ్ళలో అమ్మను చూస్తూ కూర్చునేదాన్ని. అక్కడే నాకు ఆచారి అంకుల్ పరిచయం. ఆశ్రమంలో ఆయన కర్ర పని చేస్తుండేవాడు. ఆయన, ఆయన శిష్యులు దానిమ్మ చెట్టు దగ్గర ఉన్న జాగాలో కర్రను కోస్తూ, ఉలితో కొడుతూ, ఫెవికాల్ పూస్తూ… ఆశ్రమానికి కుర్చీలు, అలమారీలు, చెప్పుల స్టాండ్ లు తయారు చేస్తుండేవారు.

ఆచారి అంకుల్ నవ్వుతూ ఉండేవారు. ఆయన పనోళ్ళతో కూడా కోపంగా మాట్లాడటం నేను చూళ్ళేదు. డాడీ కూడా ఆచారి అంకుల్ లా నవ్వుతూ, సంతోషంగా ఉంటే చూడాలని నాకు అనిపించేది. ఆచారి అంకుల్ నా పక్కనే కూర్చుని కబుర్లు చెప్పేవారు. చిన్న, చిన్న మేజిక్స్ చేసేవారు. ఆయన దగ్గర ఫెవికాల్ వాసన వస్తూ ఉండేది. కర్ర కోస్తున్నప్పుడు వచ్చే చెక్కపొడివాసన, ఫెవికాల్ వాసన ఆ గాలిలో కలిసిపోయి ఒక మంచి పరిమళాన్ని సృష్టించేవి. నాకా వాసన నచ్చేది.  కొద్దిరోజుల తర్వత నేను అమ్మను గట్టిగా పట్టుకుని పడుకున్నప్పుడల్లా.. అమ్మ మీద ఫెవికాల్ వాసన వచ్చింది. అప్పటినుండీ  నేను ఆచారి అంకుల్ తో మాట్లాడటం మానేసాను. అటువైపు వెళ్ళేదాన్ని కాదు. క్రమంగా  నేను, అమ్మ ఆశ్రమానికి  వెళ్ళడం ఎక్కువైంది. ఒక రోజు అమ్మకు, డాడీకు పెద్ద గొడవైంది. డాడీ ‘నువ్వే ఇల్లు చూసుకో నేను వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను’ అని కోపంగా అరిచి… చేతులూపుకుంటూ బజార్లోకి వెళ్ళిపోయారు.

 ఆ రోజు తర్వాత డాడీ ఇంట్లో తాగడం మొదలుపెట్టారు. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే  ‘పాపా… ఒకసారి ఇలారామ్మా’ అని నన్ను పిలిచేవారు. అప్పుడప్పుడు నన్ను దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా తలమీద తన గడ్డాన్ని ఆనించి చాలాసేపు కూర్చునేవారు.  నాకప్పుడు చాలా  హాయిగా ఉండేది.

నేను సెవెన్త్ లోకి వచ్చాను. అమ్మకు ఏదో సమస్య. రాత్రిళ్ళు కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండేది. నేను అమ్మను అలానే చూస్తూ నిద్రపోయేదాన్ని. డాడీ పక్క రూమ్ లో ఉండేవారు. అమ్మ ఏడుస్తుందని డాడీకు తెలుసని నాకు తెలుసు. ఒకసారి డాడీను అడిగాను. ‘అమ్మ చాలా మంచిది. నేనే కరెక్ట్ కాదు. నువ్వు చిన్నపిల్లవి. ఇవన్నీ ఆలోచించకు. బాగా చదూకో’ అన్నారు. ఇంకెప్పుడూ నేను ఆ టాపిక్ డాడీ దగ్గర తీసుకురాలేదు. అమ్మ నాతో మాట్లాడటం తగ్గించింది.  స్కూల్ నుండి వచ్చాక నాతో కూడా మాట్లాడేది కాదు.

 ఒకసారి మాకు కిరాణ సామన్లు అరువిచ్చే అంకుల్ వచ్చి డాడీతో గట్టిగా మాట్లాడారు. అమ్మ ఆయనకు ఏదో సర్ది చెప్పబోయింది. డాడీకు ఆయనకు చాలా పెద్ద గొడవైంది.  ఆ రాత్రి  డాడీ, అమ్మకు కూడా గొడవైంది. ఆ రాత్రిని నేను మర్చిపోలేను. నేను చాలాసేపు నిద్రపోలేదు. బెంగగా ఉండింది. మధ్యరాత్రిలో అమ్మలేచి కూర్చుని ఒక చెంపకు చేతిని ఆనించి గోడవైపు చూస్తూ ఏదో మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు చాలా భయం వేసింది. ‘అమ్మ… అమ్మా’ అని పిలిచినా పట్టించుకోలేదు. నేను లేచి డాడీ రూముకు వెళ్ళిపోయాను. డాడీ  పక్కన పడుకుని నిద్రపోతే చాలా బావుంటుందని నాకా రోజు తెలిసింది.

 మర్నాడు డాడీ షర్ట్ ఇస్త్రీ చేసుకుని, గడ్డం గీసుకుని బజార్లోకి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత డాడీ బయటకెళ్ళడం.

సాయంత్రం అమ్మ స్కూల్ నుండి రావడాని కంటే ముందు డాడీ ఇంటికొచ్చేశారు. అమ్మ వచ్చేటప్పటికి జీడిపప్పు ఉప్మా చేశారు. ఫిల్టర్ లో కాఫీపొడి వేసి వేణీళ్ళు పోసి పెట్టారు. అమ్మ వచ్చింది. ఇల్లంతా సర్ది ఉండటం చూసి అమ్మ మొహంలో చాలా ఆశ్చర్యం కనిపించిందారోజు.  అమ్మ మొహం కడుక్కుని వచ్చేటప్పటికి డాడీ ఉప్మా ప్లేటును అమ్మకిచ్చారు. నీతో కొంచం మాట్లాడాలి అన్నారు. ‘నువ్వెళ్ళి టీ.వీ చూసుకో పాపా’ అని నన్ను అక్కడ్నుంచి  పంపించేశారు . నేను టీ.వీ  చూస్తున్నానే కానీ చెవులన్నీ  అమ్మ, డాడీ వైపే ఉన్నాయి. వాళ్ళు గొడవ పడతారేమో అని భయం వేసింది . కానీ వాళ్ళు  చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరూ టీ.వీ దగ్గరకు వచ్చేసరికి అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డాడీ కళ్ళు కూడా…

ఆ రోజు తర్వాత వారం రోజులకనుకుంటా, అమ్మ నన్ను హాస్పిటల్ కు తోడుగా తీసుకెళ్ళింది. అమ్మ, రోజూ ఒక నెలపాటు హాస్పిటల్ కు రావలసి  ఉంటుందని డాక్టర్ చెప్పింది. ఆమెను చూసాక నాకు కూడా డాక్టరవ్వాలని అనిపించింది. మేము హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేసరికి డాడీ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన్ని నేను ఇంతకముందు బజారు సెంటర్లో చూసాను. వినాయకచవితి, దసరా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఫోటోలు స్కూల్ కెళ్ళే దారిలో ఫ్లెక్సీల మీద ఉంటాయి. వాళ్ళది బజార్లో పెద్ద స్వీట్ షాప్. నేను, అమ్మ రాగానే డాడీ, ఆయన నిలబడ్డారు. డాడీ నవ్వుతూ నన్ను దగ్గరకు పిలిచి పరిచయం చేశారు. డాడీ నవ్వటం చాలా బావుండింది. ఆయన డాడీతో ‘ఎప్పుడెళదాం’ అని అడిగారు.

 అమ్మ నన్ను తీసుకుని లోపలికొచ్చేసింది. డాడీ, ఆయనా చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆయన వెళ్లిపోయాక డాడీ ఒక ప్లాస్టిక్ క్యారిబాగ్ నిండా డబ్బుని తీసుకొచ్చి అమ్మకిచ్చారు. ఆ రాత్రి అమ్మ మందు బిళ్ళలేసుకుని గోడతో చాలాసేపు మాట్లాడింది.     

                                                            ***

            హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్  చివరిరోజు ఇంటికొచ్చేటప్పటికి డాడీ, అమ్మ హాల్లోనే కూర్చుని ఉన్నారు. ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు అట్టపెట్టెల్లోకి సామాన్లు సర్దుతున్నారు. అమ్మ నన్ను చూడగానే లోపలకి తీసుకెళ్ళి తలస్నానం చెయ్యమని చెప్పింది.  నాకు కొత్తబట్టలు వేసింది. ‘నువ్వు, డాడీ  బయటకు వెళ్తున్నారు. జాగ్రత్త పాపా. డాడీ చెప్పినట్లు చెయ్యి… సరేనా’ అంది. నాకేం అర్దం కాలేదు. డాడీ నేను  కలిసి బయటకు వెళ్తున్నాం అన్న ఆలోచన నన్నేం ఎదురు చెప్పనివ్వలేదు. మేం బయటికొచ్చేటప్పటికి స్వీట్ షాపాయన, డాడీ మాట్లాడుకుంటున్నారు.

  బయట స్వీట్ షాపాయన కార్ ఉంది. మేం ముగ్గురం ఎక్కగానే డ్రైవరు కార్ ను ముందుకు పోనిచ్చాడు. ‘మనం తిరిగొచ్చేటప్పటికి కొత్తింట్లోకి, ఇంకా పెద్దింట్లోకి మారిపోతాం పాపా’ అంటూ డాడీ వీధి మలుపు తిరిగే వరకు ఇంటిని చూసుకుంటూ వచ్చారు. నేను, డాడీ వెనకసీట్లో కూర్చున్నాం. స్వీట్ షాపాయన ముందు సీట్లో కూర్చుని ఏదో భాషలో ఫోన్లు మాట్లాడుతూ, మధ్యమధ్యలో డాడీతో మాట్లాడుతూ ఉన్నారు. కారు  హైవే ఎక్కేసరికి నాకు నిద్రొచ్చేసింది.

నాకు మెలకువ వచ్చేసరికి డాడీ, స్వీటు షాపాయన మంచి నిద్రలో ఉన్నారు.. ‘నాకు ఆకలిగా ఉందని’ డ్రైవరుకు చెప్పాను. అతనేం మాట్లాడలేదు.తర్వాత హైవే మీద దాబాలో పుల్కాలు తిన్నాం.అర్ధరాత్రి అవుతుండగా మా కార్ హైవే నుంచి మలుపు తీసుకుని అడవి దారిలోకి ప్రవేశించింది. కాసేపటికి మేము గూడెం లాంటి ఓ చోటుకు చేరుకున్నాం. అక్కడ ఒకాయన మమ్మల్ని కలిసి కొంతదూరం చిక్కగా ఉన్న చెట్ల మధ్యలోంచి సన్నటి బాట  గుండా నడిపించుకుని   తీస్కెళ్ళాడు.  

అదొక పాతగుడి.  పిచ్చి మొక్కలు పెరిగిన మండపం, గర్భగుడిలో చిన్న వత్తి దీపం. గర్భగుడిలో దేవుని విగ్రహం ఉండాల్సిన చోట బోసిగా ఉంది . చూట్టూ పూర్తిగా చీకటి. మేం వెళ్ళాక మాతో వచ్చిన మనిషి కిరోసిన్ బుడ్డీ మండపంలో వెలిగించాడు. ఆ వెలుగులోనే స్వీట్ షాపాయన ఆ మనిషికి కొంత డబ్బిచ్చారు. అ మనిషి  గర్భగుడి  లోపలికెళ్ళి ఒక గుడ్డ సంచీ  తీసుకొచ్చాడు. లోపల ఏదో ఉంది. అది కదులుతోంది. డాడీ నన్ను ఆ మూటను తీసుకోమన్నారు. నాకు చాలా భయం వేసింది. ‘లోపలేదో ఉంది డాడీ’ అన్నాను. ‘ఏం కాదమ్మా. అది నువ్వే తీసుకోవాలి. నిన్ను తీసుకొచ్చింది అందుకే .  కారు దాకా పట్టుకో  తల్లీ’ అన్నారు. నాకు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భయం వేస్తూ ఉండింది. ఆ మనిషి మూటను చేత్తో పట్టుకునే ‘పాపకు ఎన్నేళ్ళు’ అని అడిగాడు. ‘పదకొండున్నర’ అన్నారు డాడీ.

‘చాలా జాగర్తగా తీసుకెళ్ళాలి సామీ. కింద పెట్టకూడదు. చెయ్యి మారకూడదు. పాప ఇంకా పెద్దదవ్వలేదు  కదా?’ అన్నాడు.

డాడీ ఇబ్బంది పడటం  ఆయన మొహంలో కనిపించింది.

‘ఇంకోలా అనుకోకు సామీ… ఈ కాలం పిల్లలు పదేళ్ళు, పదకొండేళ్ళుకే అయిపోతున్నారు. పని జరిగే వరుకు పాపకు ఏం కాకూడదని అనుకోండి  సామీ’ అన్నాడతను. 

డాడీ స్వీట్ షాపాయన నావైపే చూస్తున్నారు. నేనా మూటను పట్టుకోవడానికే భయపడిందాన్ని, ఆ మూటలో ఉన్నదాంతో కొన్ని రోజులు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుందని అప్పుడనుకోలేదు.

‘టైమవుతుంది పాపా’ అన్నారు డాడీ.

నేను తెగించి, అమ్మను తల్చుకుని, ధైర్యం తెచ్చుకుని ఆ మూటను తీసుకున్నాను. పెద్ద బరువు లేదు. అసలు బరువే లేదు. లోపల దాని కదలికలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నాకు భయమేస్తోంది. పాస్ కెళ్తే బావుణ్ణు అనిపిస్తోంది. మేం బయలుదేరుతుండగా అతను చెప్పాడు. ‘పది రోజుల్లోపే అయిపోద్ది సామీ, అంతదాకా జాగర్త. అంతో పాప చేతుల్లోనే ఉంది’ అని నా తలమీద చెయ్యేసి దీవించాడు.

మేం తెల్లవారకముందే టౌన్ లో కొచ్చేసాం. టౌన్ చివర అప్పుడప్పుడే నిలబడుతున్న కాలనీ అది. అన్నీ రెండస్థుల మేడలు. అక్కడొకటి, ఇక్కడొకటి  విసిరేసినట్లున్న కొత్త ఇళ్ళు. అలాంటి ఒక ఇంటి ముందు మా కారాపారు. ఆ ఇంట్లో అమ్మ అట్టపెట్టెల మధ్య కుర్చీలో కూర్చుని నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉంది. అమ్మ కళ్ళు బాగా ఏడ్చింది అన్నట్లు ఉబ్బిపోయి ఉన్నాయి. అదే మా కొత్తిల్లు అని అప్పుడు నాకర్ధం అయింది. అప్పటికే శుభ్రం చేసి ఉంచిన మెట్ల పక్కగదిలో మూటను పెట్టించి స్వీట్ షాపాయన వెళ్ళిపోయారు. అమ్మ మళ్ళీ నాకు స్నానం చేయించింది. నాకు బాగా నిద్రొస్తోంది. డాడీ ఒక గిన్నె నిండా పాలను తీసుకువచ్చి నాకిచ్చారు. గదిలోకి వెళ్ళి మూట విప్పి… దానికి పాలు పెట్టమన్నారు.. నేను వణికిపోయాను. ‘ఏంటి డాడీ అదీ  అదీ నాకు భయమేస్తుంది డాడీ.. అందులో  ఏముంది డాడీ’  అని అడిగాను.

‘భయపడకమ్మా, అదేం చెయ్యదు. అది మత్తులో ఉంది’ అన్నారు.

నేను గదిలోకెళ్ళానే కానీ కాళ్ళు వణుకుతున్నాయి. దడగా, కంగారుగా ఉంది. డాడీ కిటికీ నుండి నాకు దైర్యం చెప్తూ ఉంటే మూటను విప్పాను. అది నిద్రపోతున్నట్లుగా ఉంది. కొద్దిగా కదులుతోంది. స్పృహలో లేదు.

దాన్ని మొదటిసారి ముట్టుకున్నప్పుడు… మెత్తగా, పట్టుకుచ్చును పట్టుకున్నట్లు అనిపించింది. అమ్మ తలస్నానం చేసినప్పుడు… అమ్మ జుట్టు కూడా అలానే మొత్తగా ఉంటుంది.

 దాన్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది. పాలగిన్నె దాని పక్కగా జరిపి నేను బయటకొచ్చేసాను. ఆ తర్వాత నేను బా… గా నిద్రపోయాను. నేను లేచేసరికి ఇల్లంతా సర్ది ఉంది. డాడీ టీ.వీ చూస్తున్నారు. నేను అదున్న గది తలువు కిటికీని తెరిచి చూసాను. అది పాలగిన్నెను ఖాళీ చేసి ప్రక్కనే నిద్రపోతోంది. కిటికీ తెరిచిన శబ్దానికి మేలుకుందేమో, లేదా ఇంకా మత్తు వదల్లేదో,  ఓ సారి చిన్నగా అరిచి, మూతిని నాలుకతో తుడుచుకుని మళ్ళీ పడుకుంది. రాత్రి సరిగ్గా చూళ్ళేదు కానీ.. అది బావుంది. నల్లగా,  బుజ్జిగా… చిన్న మీసాలు.

డాడీ దగ్గరకెళ్ళి అడిగాను  ‘ మనం పెంచుకోవటానికా అది… ? ఏంపేరు పెడదాం ?’

‘పేరేం వద్దు పాపా…’ అన్నారు డాడీ

‘మరేమని పిలవాలి దాన్ని’

డాడీ ఏం మాట్లాడలేదు… డాడీ వద్దన్నారని దానికి నేను పేరు పెట్టలేదు. అది నల్లపిల్లి… కాబట్టి దాని పేరు ‘నల్లపిల్లి’

                                            ***

ఆ రోజునుండీ  నాకు ఆ నల్లపిల్లి గదిలోనే పడుకునే ఏర్పాటుచేసారు. గది బయట డాడీ పడుకునే వారు. అమ్మ స్కూల్ కెళ్ళడం మానేసింది. రోజు హాస్పిటల్ కు  ఒంటరి గానే వెళ్ళేది. షాపాయన వస్తూ పోతూ ఉండేవారు. నాకు నాలుగురోజుల్లో అర్దమయిందేంటంటే… నల్లపిల్లికి త్వరలో పిల్లలు పుట్టబోతున్నాయి. అది అటూ ఇటూ తిరుగుతూ ఉండేది.  దాని కాలికి కట్టిన తాడు అది గదిలో కొంతదూరం వరకే నడిచేందుకు వీలుగా ఉండేది.

 డాడీ, అమ్మ దానికి పిల్లలు పుట్టేటప్పుడు నేను  ఏం చెయ్యాలో రోజూ  చెప్తుండేవాళ్ళు. డాడీ పిల్లి సైజులో ఒక గుడ్డ బొమ్మను తయారు చేసి నాతో ప్రాక్టీస్ చేయించేవారు. మూడు రోజుల్లో నాకు మొత్తం వచ్చేసింది.

నల్లపిల్లి ఒక్కోసారి నావంకే తీక్షణంగా చూస్తూ ఉండేది.  అదంటే ఇప్పుడు  నాకు భయం పోయింది. దానికి పాలు, చేపలకూర పెట్టేదాన్ని. మా ఇంట్లో నీచు వండరు. డాడీ బజారు నుండి తీసుకొచ్చేవారు. ఆ చేపలవాసన, దాని పాస్ వాసన చాలా దారుణంగా ఉండేవి. రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. తెల్లారగానే డాడీ వచ్చి కిటికీలోంచి లేపేవారు. నాకు నిద్ర సరిపోయేది కాదు.

  ఒక రోజు  స్వీట్ షాపాయన ఇంకో ఇద్దరు మనుషులతో వచ్చాడు. వాళ్ళు  టెంపో నిండా సామాన్లతో వచ్చారు. నల్లపిల్లిని, నన్ను అమ్మ రూమ్ లో వుంచారు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ ఇల్లు చాలా పెద్దది. మా సామానంతా సర్దినా ఎక్కడా కనపడేది కాదు. ఇల్లంతా ఖాళీగా ఉండేది. మేం మాట్లాడుకున్నా, భోజనాలు చేస్తున్నప్పుడు ప్లేట్లు చప్పుడయినా.. రీసౌండ్ వస్తూ ఉండేది. నాకు కూనిరాగాలు తీస్తూ ఇంట్లో తిరగటం అలవాటు. ఈ ఇంటికొచ్చాక   నాకు నల్లపిల్లి తోనే సరిపోతోంది. ఈ ఇంట్లో పాడుతుంటే నా గొంతునాకే వికృతంగా వినిపించడం వలన పాడటం పూర్తిగా ఆపేశాను.

నల్లపిల్లి రూమ్ లో శబ్దాలు  పొద్దుపోయేవరకు వినిపించాయి. చీకటి పడ్డాక ఆ మనుషులు వెళ్ళిపోయారు. మళ్ళీ నేను, నల్లపిల్లి గదిలోకి  చేరాం. ఇప్పుగా గది పూర్తిగా మారిపోయింది. సినిమా హాల్ గోడల్లా ఆ గది గోడలు మారిపోయాయి. గదినిండా  చెక్క వాసన, వెలగపండు వాసన కలిసిపోయినట్లు ఒక కొత్త రకమైన వాసన. గదిలో ఇపుడు  రీ సౌండ్ రావట్లేదు.

 రాత్రి పడుకున్నప్పుడు గమనించాను. పైకప్పుకు ఒక దూలం బిగించి ఉంది. దానికి బావిలో నీళ్ళు తోడటానికి ఉపయోగించే గిలక బిగించి ఉంది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలాంటిది పెద్ద బావి దగ్గర చూసాను. ఇది అంత పెద్దది కాదు కానీ… అలాంటిదే.

నల్లపిల్లి ఆ రోజంతా ఆయాసపడుతూ ఉంది. మధ్యమధ్యలో పెద్దగా అరిచింది. అటూ ఇటూ తిరుగుతూ ఉంది. నాకు నిద్ర రావట్లేదు. దానికి కూడా. అది చీకట్లో మెరుస్తున్న కళ్ళతో నన్నే చూస్తూ ఉంది. అవి రెండూ గుండ్రటి గోళీల్లా కనిపిస్తూ ఉన్నాయ్. అయినా నాకు భయం వెయ్యలేదు. వాటినే చూస్తూ  అలానే నిద్రపోయాను.

పెద్దగా విన్పించిన నల్లపిల్లి అరుపుకు  మెలకువ వచ్చింది. అది అరుస్తూ, గింజుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. గదిలో లైట్ వేసి ఉంది. డాడీ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. నాకు కళ్ళు మండుతున్నాయి. ఇంకా తెలవారలేదు. అమ్మ హడావిడిగా వచ్చి ఒక పసుపురాసిన కొత్త మట్టి ముంత, ఎర్ర బట్ట, చిన్న కత్తి , సన్నకి ప్లాస్టిక్ తాడును గదిలో పెట్టి వెళ్ళింది.

డాడీ ఫోన్ మాట్లాడేసి  పెద్ద నిచ్చెనను  తీసుకొని వచ్చారు. చెప్పాను  కదా.  బావి గిలక బిగించారని. దానికి తాడు కట్టి ఒక కొసను కిటికీ బయటకు వదిలేసారు. రెండో కొసను నాకిచ్చి, నుదుటి మీద ముద్దుపెట్టి ‘ఇకపై అంతా నువ్వే చెయ్యలి పాపా.. జాగ్రత్త’ అని వెళ్ళిపోయి తలుపేసేసారు.

 నల్లపిల్లి అరుస్తూ ఉంది. ఇప్పుడేం చెయ్యాలో నాకు తెలుసు. ఫుల్ గా ప్రాక్టీస్ చేశాను కదా. నేను రెండో కొసను పిల్లి మెడ పట్టేంతగా ఉరి ముడి వేసాను. నల్లపిల్లిని పట్టుకొని దాని మెడకు తగలించడమే కష్టమైంది. అది నా చెయ్యిని కొరికింది. రక్కంది. నేనూ పట్టుదలగా దాని మెడకు ఆ తాడును బిగించేశాను. అమ్మ నన్ను బయటకొచ్చేయ్యిమంది.బయటకొచ్చే ముందు నేను చెయ్యాల్సిన పని ఇంకోటుంది.  కత్తితో పిల్లి కాలికున్న తాడును కోసేసి బయటకొచ్చేసాను.

  డాడీ గిలక తాడును కిటికీ గుండా లాగటం మొదలెట్టారు . నల్లపిల్లి ఆపకుండా అరుస్తూనే ఉంది. కాళ్ళు కొట్టుకుంటానే ఉంది. దాని కాళ్ళు గది గచ్చు మీదే ఉన్నాయి. దాని మెడ సీలింగ్ కు ఉన్న గిలక వైపు ఉంది. నేను కిటికీ లోంచి చూస్తూ ఉన్నాను.  తలుపు చప్పుడైంది. అమ్మ తీసింది.  స్వీట్ షాపాయన వచ్చాడు. ఆయన మొహం  ఆందోళనగా ఉంది.

 తర్వాత పని చాల  తొందరగా అయిపోయింది. నల్లపిల్లి వికృతంగా అరస్తూ, అరుస్తూ… నాలుగు పిల్లల్ని ప్రసవించింది. అవి చిన్నగా వణుకుతూ నేలమీద కళ్ళు తెరవకుండా పడ్డాయి. నల్లపిల్లి నాలుగుపిల్లల్నీ ప్రసవించాక… నేలమీద భళ్ళున ఏదో పడింది. వీళ్ళు నాకు చెప్పింది అదే అనుకుంటా.

‘పడినట్టుంది , పడిందా’ అడుగుతున్నాడు స్వీట్ షాపాయన.

డాడీ చెమటతో తడిసి ముద్దైపోయి ఉన్నారు. అమ్మ దూరంగా కుర్చీలో కూర్చుని చూస్తూ ఉంది.

‘పడింది… లాగుతున్నా.. నాలుగు పిల్లల్నే పెట్టింది. ఇంకా ఉన్నాయేమో. ఆరేడు కూడా ఉంటాయట’ అన్నారు డాడీ.

పిల్లి పెద్దగా అరిచింది.

‘మాయ పడింతర్వాత ఆలోచించకూ.  పర్లేదు లాగేయ్’ తొందర పెడుతున్నాడు  స్వీట్ షాపాయన.

అప్పుడు డాడీ, షాపాయన ఒకర్నొకరు చూసుకున్న చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది .

డాడీ తాడును లాగారు. పిల్లి పైకి లేచింది. గిలకవైపు దాని శరీరం గాల్లో తేలుతూ వెళ్తుంటే అది కాళ్ళు గిల గిలా కొట్టుకుంటూ ఉంది. దాని మెడవైపు చూసాను. నేను కట్టిన ఉరిముడి దాని మెడకు బిగుసుకుని దాని బొచ్చులో కలిసిపోయి  కనిపించడం మానేసింది. నేను కళ్ళు మూసుకుని కూర్చుండి పోయాను.

పిల్లి  బలహీనంగా రెండు మూడుసార్లు అరిచింది.  కాసేపటికి పూర్తి నిశ్శబ్దం. 

 ‘పాపా’ డాడీ కేకేశారు.

నేను చప్పున లేచి గదిలోపలికెళ్ళాను.మట్టి కుండలోకి గచ్చు మీద మాయను చేత్తో తీస్తూ వేయటం మొదలెట్టాను. అది చాలా జిగటగా జుగుప్సగా ఉంది. అలా చెయ్యను అని చెప్పాలనిపించలేదు. ఆ మాయను కుండలోకి పూర్తిగా ఎత్తివేశాక  ఎర్రబట్టతో కుండను మూసి ముడి వేశాను. జాగ్రత్తగా తీసుకొచ్చి డాడీ పూజగదిలో పెట్టాను.  స్వీట్ షాపాయన స్నానం చేసి తడిబట్టలతో ఉన్నాడు. డాడీ స్నానం చేస్తున్నంత సేపు ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు .

  వాళ్ళు పూజ చేసుకుని, దీపం వెలిగించాక ఆ చిన్నకుండను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు.

నేను స్నానం చేసి వచ్చేసరికి అమ్మ గదిని శుభ్రం చేసింది. పిల్లి పిల్లలు కనిపించలేదు.  నేను పైకి చూసాను. నల్లపిల్లి దూలానికి వేలాడుతూ కనిపించింది. దాని కళ్ళు నావైపే చూస్తున్నట్లు అనిపించింది. నాకు భయం వేసింది. కడపులో తిప్పినట్లుగా అనిపించింది. వికారంగా, తలతిరుగుతున్నట్లుగా అనిపించింది. నాకు ఆ మధ్యాహ్నం  జ్వరం వచ్చింది. ఒంటి మీద స్పృహ లేని జ్వరం.  కళ్ళు కనిపించనంత జ్వరం.  మూడు రోజుల తర్వాత నెమ్మదించింది.

నాకు జ్వరం తగ్గిన రాత్రి…  హనీ మొదటి సారి నాకు కనిపించింది .

నిజానికి ఆ రోజు సాయంత్రం అమ్మకు ఫిట్స్ వచ్చాయి. డాడీ, అమ్మను హాస్పటిల్ కు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అమ్మను చూస్తే భయపడతానని నన్నింట్లోనే ఉంచేశారు. డాడీ వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది.

వంటగదిలో కాసేపు  గిన్నెలతో కుస్తీ పట్టి, నాకు అన్నంపెట్టి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే పడుకున్నా…నిద్ర రావట్లేదు . దిగులుగా ఉండింది . కాసేపటికి  ఎవరో నన్ను ముట్టుకున్నట్లు అనిపించింది. లేచి కూర్చున్నా. జీరో బల్బు వెలుగులో అది నామంచం మీద కూర్చుని ఉండటం చూశాను. నల్లపిల్లికి నా మొహం తగిలించినట్లు ఉంది. శరీరం అంతా నల్లని బొచ్చు. మెడలో నేను బిగించిన ఉరితాడు ముడి. మొహం మాత్రం నాది. అచ్చు నాదే. నాకు చాలా భయం వేసింది. గొంతు మొత్తం ఎండిపోయినట్లు అనిపించింది. మాట రావట్లేదు. అది నవ్వింది.

 ‘భయపడకు . నేను నీ ఫ్రెండుని’ అంది.

కొంచం ధైర్యం తెచ్చుకుని

‘నీ పేరేంటి?’ అడిగాను.

‘నాకు పేరు లేదు. నువ్వే పేరు పెట్టు’

నేను ఆలోచించి ‘హనీ’ అన్నాను. హనీ నా క్లాస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ . ఆ సమయానికి అదే గుర్తొచ్చింది మరి.

‘బావుంది. నాపేరు హనీ’ నవ్వింది.

ఆ రాత్రి  మేమిద్దరం బోలెడు కబుర్లు చెప్పకున్నాం. హనీ కు నా గురిచి అన్ని విషయాలు తెలియడం నాకు భలే ఆశ్చర్యం వేసింది .

                                                            ***

 అమ్మ పదిరోజులు హాస్పటల్లోనే ఉంది. డాడీ హాస్పటిల్ కు, ఇంటికి తిరుగుతూ ఉన్నారు. ఈ పదిరోజుల్లో హనీ నేను చాలా మాట్లాడుకున్నాం. హనీ అచ్చం నాలాగే ఆలోచిస్తుంది. నేను ఏం అనుకుంటున్నానో చెప్పేస్తుంది. నేను నిద్రపోగానే వెళ్ళిపోతుంది. మళ్ళీ కనబడదు. ఇంట్లో ఎవరైనా ఉన్నా నా దగ్గరకు రాడు. కనబడదు.

ఒక రోజు ‘హనీ, ఎక్కడుంటావ్ నువ్వు!’ అని అడగాను.

‘ఇంకోసారి అలా అడిగితే మళ్ళీ రాను. ఫ్రెండ్షిప్ కటిఫ్’ అంది. తర్వాత నేను ఎప్పుడూ హనీ వివరాలు అడగలేదు.

అమ్మ హాస్పటల్లో ఉన్న పదిరోజుల్లో చాలా మార్పులొచ్చాయి. మా హాల్లో టీ.వీ పెద్దదైంది. కొత్త సోఫాలు , డైనింగ్ టేబుల్ , డాడీ రూం లో కొత్త మంచం .పెద్ద బీరువా .  ఇల్లంతా ఫర్నిచర్ తో నిండి పోయింది. నా రూమ్ లో, అమ్మ రూమ్ లో ఎ.సి లు బిగించారు .  నల్లపిల్లి రూముకు తాళం వేశారు.

 ఒకరోజు స్వీట్ షాపాయిన ఇంకొక ఆయనతో మా ఇంటికొచ్చాడు. డాడీ, వాళ్ళిద్దరూ హాల్లో తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

‘అతను మాట్లాడిన భాష ఏంటో తెలుసా నీకు’ అంది హనీ…

‘తెలీదు’

‘కన్నడ. అతను మంగుళూరు నుండి వచ్చాడు. మళ్ళీ నీకు పనిపడింది.’

‘ఏం పని’

హనీ నవ్వింది.

ఆ మర్నాడు మా అమ్మను ట్రీట్ చేసే డాక్టర్ ఇంకొకామెతో  మా ఇంటికొచ్చింది. వచ్చినామె కూడా డాక్టర్ అని నాకు  ఎవరూ చెప్పకుండానే అర్ధం అయింది. డాడీ ఇద్దరు డాక్టర్లు అమ్మ గది లోకి  వెళ్ళారు. మేడ పైన అమ్మ గది లో  చాలాసేపు  వాళ్ళంతా మాట్లాడుకున్నారు. అమ్మ మధ్య మధ్యలో ఏడుస్తూ ,అరుస్తూ ఉంది. అమ్మను డాడీ కొట్టారనుకుంటా. కాసేపటికి ముగ్గురూ నా రూమ్ కొచ్చారు. వాళ్ళు రావడం గమనించి హనీ వెళ్ళిపోయింది. డాక్టర్ తో వచ్చిన ఇంకో డాక్టర్ నాకు ఇంజక్షన్ ఇచ్చింది. ‘ఎందుకు’ అని అడగాలనుకున్నాను. డాడీ మొహం చూసి అడగలేకపోయాను. ధైర్యం చాల్లేదు. నేను ఆడగాలనుకున్నది  డాక్టర్ గమనించినట్లుంది.

‘బలం రావటానికే ఇంజక్షన్, ప్రతీ మూణ్ణెళ్ళకు ఇదోటి వేసుకుంటే నీకు బావుంటుంది. గుడ్ గర్ల్…’ అంది డాక్టర్. అప్పుడు  నాకు ఆమెలా డాక్టరవ్వాలన్న  కోరిక పోయింది. ఆమె మీద ఉన్న ఇష్టం పోయింది. ఆ తర్వాత ఎప్పుడూ ఆమె నాకు నచ్చలేదు.

                                                            ***

ఈ రెండేళ్ళలో నాకు పదిసార్లు ఇంజక్షన్ ఇచ్చారు. నేను నా నోట్ బుక్ లో ఇంజక్షన్ ఇచ్చిన ప్రతీసారీ రాసుకునేదాన్ని. ప్రతీ ఇంజక్షన్ ముందు అమ్మకు, డాడీకు గొడవయ్యేది. డాక్టర్  అమ్మను కలవటం మానేసి నేరుగా నాకు ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయేది. అమ్మను ఆ గదిలో మంచానికి గొలుసు వేసి కట్టేశారు డాడీ. అమ్మ మొదట్లో అరిచేది. తలుపుకు తాళం వేసేసి డాడీ బయటకు వెళ్ళిపోయేవారు. నేను సెవెన్త్ తర్వాత స్కూల్ మానేశాను. బాగా సన్నగా, బలహీనంగా అయిపోయాను. నాకాళ్ళు పుల్లల్లాగా అయిపోయాయి. డాక్టర్ వచ్చి  నాకు రెగ్యులర్ చెక్ అప్స్ చేసేది . హనీ మాత్రం ప్రతీరోజు నాతో మాట్లాడుతూ ఉంది.

ఈ రెండేళ్ళలో నేను ఏడుసార్లు  డాడీ తో బయటికెళ్ళాను. వెళ్ళిన ప్రతీసారీ నల్లపిల్లితో వెనక్కు వచ్చేవాళ్ళం.  స్వీట్ షాపాయన అప్పడప్పుడూ వచ్చేవాడు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు. ఏవేవో భాషల్లో  మాట్లాడేవాళ్ళు.  డాడీ రెండు కార్లు కొన్నారు. ఒకటి నల్లపిల్లిని తీసుకురావడానికి మాత్రమే వాడేవారు.

నేను రెండేళ్ళలో అమ్మతో నాలుగైదుసార్లు మాట్లాడాను. ఎప్పుడైనా అమ్మ రూమ్ లోనికి నన్ను పంపేవారు డాడీ.. అమ్మ నన్ను చూసి ఏడ్చేది.  ‘నేనారోజు ఒప్పుకోక పోయి ఉంటే బావుండేది పాపా’ అంటూ ఏడుస్తుండేది.

నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మ ఏడవటం నాకు నచ్చేది కాదు. ఒకే ఇంట్లో ఉంటున్నా మేం కలుసుకోవటం లేదు. నా మంచం పక్కన టేబుల్ మీద నా  మందులు ఎక్కవయ్యాయి. రోజంతా నిద్రగా ఉండేది. నాపెదవులు చిట్లిపోయాయి.. చర్మం అంతా పొలుసులుగా ఉంటోంది. రాత్రుళ్ళు నిద్ర రాదు. ఉన్న ఒకే ధైర్యం హనీ… అన్నట్లు చెప్పటం మరిచిపోయాను. హనీ ఆర్నెల్లుగా మారిపోయింది. పెద్దదయిపోయింది. బాగా పెరిగింది. దాని మొహం ఇప్పుడు అమ్మ మొహంలా ఉంది.

                                                            ***

డాడీ ఒక ఫారినర్ జంటను నెలక్రితం ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు నల్లపిల్లి గదిలో చాలాసేపు గడిపి  డాడీకు ఫారిన్ విస్కీ బాటిళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. డాడీ ఆరోజు నుండి చాలా కంగారుగా ఉన్నారు. స్వీట్ షాపాయన రెండు మూడుసార్లు మా ఇంటికొచ్చి వెళ్ళారు. మధ్యలో డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళింది. ఆ సాయంత్రం డాడీ నా రూంలో  కంప్యూటర్ ను బిగించారు. చాలా బావుంది అది.

‘రేపట్నుంచి నీకు ఆన్లైన్ క్లాసులు పాపా. మళ్ళీ నువ్వు చదువుకోవచ్చు!’ అన్నారు.

‘నాకు స్కూల్ కెళ్ళాలని ఉంది డాడీ. బయటికెళ్ళాలని ఉంది.  ఇంట్లోనే  ఉండటం బావుండట్లేదు డాడీ’ అని అంటున్నప్పుడే నాకు పెద్దగా ఏడుపొచ్చేసింది.

డాడీ నన్ను సముదాయిస్తూ ‘ఇంకొక్క సంవత్సరం పాపా… తర్చాత కాలేజ్ కు వెళ్దువు గానీ’ అన్నారు.

‘నాకు ఇంజక్షన్లు వద్దు డాడీ, నాకిష్టం లేదు డాడీ’ అన్నాను ఏడుస్తూనే…

‘ఇంకో రెండు సార్లు పాపా… తర్వాత అవసరం లేదు’

ఆ మరుసటిరోజు ఒకాయన పాపతో మా ఇంటికొచ్చాడు. నేను హనీ కిటికీలోంచి హాల్లో వాళ్ళను చూస్తున్నాం. వాళ్ళు చిన్న గొంతుతో  మట్లాడుకుంటున్నారు.

‘డాడీ చెప్పింది నిజమే… నీకు ఇంక ఇంజెక్షన్లు  ఉండవు. నువ్వు బయటకెళ్ళక్కర్లేదు. ఆ పాప ఆర్నెల్ల తర్వాత నుండీ మనింట్లోనే ఉంటుంది. నల్లపిల్లిని చూసుకుంటుంది’. అంది హనీ.

నేనా పాపను చూసాను. ఆ పాప  నాలానే చాలా బలహీనంగా  ఉంది.. ఆ పాప సిక్స్ తో, సెవెన్తో చదువుతూ ఉండొచ్చు. డాడీ వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టారు.  డబ్బులిచ్చి పంపించేశారు.

***

పదిహేను రోజుల క్రితం. డాడీ పొద్దున్నే బయల్దేరారు. సాయంత్రం లేటవుతుందని చెప్పారు. అమ్మ గది తలుపు తీసి భోజనం ప్లేట్లు పెట్టి వచ్చి  తాళం వేశారు.  డాడీ వెళ్ళాక కాసేపటికి  నేను , హనీ  అమ్మ రూమ్ దగ్గరకు వెళ్ళాం. అమ్మ రూములోంచి మాటలు వినిపిస్తున్నాయ్. గోడతో మాట్లాతుందని అర్దమైంది.

‘మీ అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది’ అంది హనీ.

‘అవునా .!’ ఆశ్చర్చపోయాను నేను.

‘నీకెలా తెలుసు’ అడిగాను.

‘నాకు చాలా తెలుసు’ అంది హనీ

‘ఏం తెలుసు’

 ‘అమ్మ రోజు గురూజీతో మాట్లాడుతుంది. కష్టం సుఖం చెప్పుకుంటుంది. నీకు నేనున్నాను. అమ్మకు ఎవరున్నారు’?

‘ఇవన్నీ నీకెలా తెలుసు’

‘నాకింకా బోలెడు తెలుసు’

‘ఏం తెలుసు’

‘నీకిచ్చే ఇంజక్షన్ పేరు, జి ఎన్ ఆర్ హెచ్ అనలోగ్’

‘అంటే’

‘నేను చెప్పను. కంప్యూటర్లో వెతుక్కో’

‘అమ్మకు ఇంజక్షన్ సంగతి చెప్పాలి హనీ. నా దగ్గర అమ్మ గది తాళం ఉంటే బావుణ్ణు·’

‘తాళం నా దగ్గర ఒకటుంది. స్పేర్ కీ’

‘ఎక్కడిది?’

‘డాడీకు తెలీకుండా దాచిపెట్టాను’

‘డాడీకు తెలిస్తే’

‘తెలీదు. అమ్మ దగ్గరకు వెళ్దామా?’

‘………………………………’

ఆ మధ్యాహ్నం నేను తాళం తీస్తున్న చప్పుడుకు పడుకున్న అమ్మ లేచి కూర్చుంది. నేను, అమ్మకు హనీను పరిచయం చేశాను. ముందు కాసేపు అమ్మకు హనీ కనిపించలేదంట. తర్వాత కనిపించిందంట.

అమ్మ, నేను, హనీ ముగ్గురం చాలాసేపు మాట్లాడుకున్నాం. అమ్మ గోడ వైపు తిరిగి… చేతిని చెంపకు ఆనించి మాట్లాడుతూ ఉంది. మధ్యలో నేను వెళ్ళి పేపర్ పెన్ను తీసుకొచ్చాను. అమ్మ  ఆ పేపర్ మీద గురూజీ చెప్పిన మంత్రాన్ని చాలా శ్రద్ధగా  రాసింది.

‘ఇదంతా ఇంకొద్దు పాపా.ఆపేద్దాం.  మనం దేవుడి దగ్గరకెళ్ళిపోదాం’

నాకు అమ్మంటే ఇష్టం. అమ్మ దగ్గర వాసన చాలా ఇష్టం. అమ్మ శీకాయతో రోజూ తల స్నానం చేస్తోంది. ఆ వాసన రోజంతా అమ్మ దగ్గర వస్తుంటుంది. అమ్మతో కలిసి దేవుడి దగ్గరకు వెళ్ళడమంటే ఇంకా ఇష్టంగా  అనిపించింది.

‘దేవుడి దగ్గరికెళ్ళాక ఇంజక్షన్ వేసుకోనక్కర్లేదు కదమ్మా’ అని అడిగాను.

అమ్మ అడ్డంగా తలూపి నవ్వింది.

నాకు మొన్న ఇంజక్షన్ వేశారు. ఇదే చివరి ఇంజక్షన్ అని నాకు తెలుసు. నేనేమీ మాట్లాడలేదు. హనీను చూస్తూ కూర్చున్నా. నిన్న రాత్రి నేను బయటకు వెళ్ళాను. ఈ రోజు పొద్దున్నే వచ్చాం. ఈ నల్లపిల్లి చాలా గొడవ చేస్తుందని డానికి మత్తు మందు ఇచ్చారు డాడీ.

సాయంత్రం వరకూ నిద్రపోయాను. సాయంత్రం స్వీట్ షాపాయన, ఫారినర్ జంట వచ్చి వెళ్ళారు. నేను పిల్లికి పాలుపెట్టాను. హనీ అప్పటికే నా  గదిలోని కొన్ని జోల్సోమా టాబ్లెట్లను డాడీ విస్కీ బాటిల్లో కలిపేసింది.

డాడీ పూజ చేసుకు ని వచ్చి… ఆయన రూమ్ లోకి వెళ్ళారు.

‘చాలా డబ్బులున్నాయ్. బీరువాలో’ అంది హనీ…

‘నువ్వు చూసావా!’

‘ఆ… అమ్మకు ఇక ఏ చికాకు ఉండదు’ అంది హనీ.

 నాకు చాలా సంతోషంగా అనిపించింది. డాడీ హాల్లో కూర్చుని తాగటం మొదలుపెట్టారు. నేను, హనీ చూస్తూ ఉన్నాం. నేను ఆయన కుర్చీలో వెనక్కి జారబడగానే చప్పున వెళ్ళి అమ్మ గది తాళం తీసాను. అమ్మ చాలాసేపటి నుండి ఎదురుచూస్తుందేమో… నన్ను చూడగానే నవ్వింది. నేను నాన్న జేబులోంచి తీసిన తాళం గుత్తిలో  అమ్మ కాలికున్న గొలుసు తాళం తీసేసాను.

            అమ్మ స్నానం చేసి, దీపం పెట్టుకుని హారతి గంట మోగిస్తున్న వేళకు, డాడీ విస్కీలో నేను కలిపిన జోల్సోమా పని చెయ్యటం మొదలుపెట్టింది అనుకుంటా. అప్పటికే మగత కమ్మి తాగుతున్న రెండో పెగ్గును పక్కన పెట్టేసారు. కుర్చీ వెనక్కి జారబడిపోయిన డాడీను…అమ్మా, నేను హాల్లోకి లాక్కొచ్చాం.  

***

            గచ్చు మీద రక్తం పూర్తిగా శుభ్రమైపోయింది. అమ్మ నీళ్ళు పారబోసి… మళ్ళీ బకెట్ నిండా నీళ్ళు నింపుకుని వచ్చింది.  హనీ గురించి చూస్తుంటే కనిపించట్లేదు… ఒకసారి ‘బై’ చెబ్దామని అనుకుంటుంటే కనిపించదేం?

          అమ్మ ఎదురుగా వచ్చి నిల్చుని

           ‘నువ్వు రడీనా పాపా’ అని అడిగింది.

           నేను తలూపాను.

            అమ్మ ఫోన్ ను అప్పుడు స్పష్టంగా చూసాను.. చిన్న ఫోన్.. చేతిలో పట్టేంత. అమ్మ ఫోన్లో మాట్లాతూ ‘ఊ’ కొడుతూ ఒక్క మాటకూడా మాట్లాడకుండా పెట్టేసింది.

            ఆ తర్వాత నాకు గట్టిగా ముద్దు పెట్టింది. ముగ్గు పక్కన ఉన్న కుంకుమతో బొట్టు పెట్టింది.

            బొట్టు పెడుతున్నప్పుడు అమ్మ చాలా దగ్గరగా ఉంది. ఆ సమయంలో అమ్మ దగ్గర చాలా వికారమైన వాసన వచ్చింది. నల్లపిల్లి మాయను నేను మట్టికుండలోకి ఎత్తుతున్నప్పుడు వచ్చిన జుగుప్సాకరమైన వాసన…

            అమ్మ చేతిలోకి డంబెల్ తీసుకుని … 

             ‘రెండ్రోజుల్లో ఆశ్రమంలో కలుద్దాం పాపా. గురూజీ మనల్ని బాగా చూసుకుంటారు. ఇక ఇంజక్షన్లు అవసరం లేదు. హాయిగా చదువుకోవచ్చు. కాలేజ్ కెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ని కలవొచ్చు. నువ్వు పెద్దదానిని కావచ్చు.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు’ అంది.

            ‘త్వరగా అమ్మా.. త్వరగా పంపించు అన్నాను.

            అమ్మ వాసన భరించలేనంతగా ఉంది.  

            అమ్మ డంబెల్ పైకెత్తి…  మళ్ళీ మంత్రాన్ని చదివింది. అమ్మ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నావైపు ఒక సారి చూసి, గట్టిగా ఊపిరి తీసుకుని నా వైపు చేతిని వేగంగా …

             థబ్…

             నా కళ్ళ మీదకు రక్తం కారటం తెలుస్తూ ఉంది.

            థబ్…

            నా కళ్ళు మూతలు పడుతుండగా మసక మసకగా గస పెడుతూ ఉన్న  అమ్మ,  చాలా సేపుగా కనిపించని హనీ కనిపించారు. హనీ అమ్మ వెనుక నిలబడి ఉంది. నాలుగు కాళ్ళ మీద.

            ఇప్పుడు దాని శరీరం, మొహం మొత్తం పూర్తిగా మారిపోయాయి.  అది నవ్వుతూ  ఒక కాలెత్తి నాకు టాటా చెప్తూ ఉంది. ఇంతకు ముందు దాని మొహం నా మొహంలానో, అమ్మ మొహంలానో ఉండేదని చెప్పాను కదా.

ఇప్పుడు దాని మొహం నల్లపిల్లి మొహంలానే ఉంది.  

కరుణ కుమార్

ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం జిల్లా కంట్రగడ గ్రామం స్వస్థలం.15 సంవత్సరాల వయసులోహోటల్ లో కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి , రచయితగా, సినీ దర్శకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. మొదటి కథ 'చున్నీ' 2018 లో వ్రాసారు. 498, పుష్పలత నవ్వింది, మేఘమాల, జింగిల్ బెల్స్, పురుగు కథలు వివిధ కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి.

చలన చిత్ర దర్శకుడిగా పలాస1978 , శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మట్కా ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాసిన కథలు తక్కువైనా ప్రభావ వంతంగా, సరళమైన భాషలో రాస్తారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు


Spread the love

7 thoughts on “చీకటి

  1. ‘చీకటి ‘ కథ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. దృశ్య ప్రధానంగా వున్న కథ. మంచి నరేషన్.

  2. వామ్మో.. గుక్క తిప్పుకోనివ్వకుండా భయపెట్టింది, చదివించింది.
    ఇలాంటి లోకమూ ఒకటుంది మన పక్కనే అని తలచుకుంటే భయం వేస్తుంది.

  3. కథ భిన్నమయిన ఇతివృత్తంతో సాగింది.శైలి కూడా భిన్నమైనది.

  4. What a gripping tale..!!! Im sure that it will haunt me for coming days. Emanna rasara anna!

  5. కథ ఆసాంతం చదివించింది.

    కథ, దానికి వాడుకున్న భాష, శైలి, కథనం బాగున్నవి.

    ఆ మధ్య బహుశ తిరుపతి ప్రాంతంలో అనుకుంటా తమ కూతురు? ని చంపేసిన అధ్యాపక జంట వ్యవహారం గుర్తు వచ్చింది.

    ఏ రైటర్స్‌మీట్‌లోనో మరెక్కడో ఈ కథ – దానికి నేపధ్యం నువ్వు చెప్పాలి. అలా కాకపోయిన మనం భవిష్యత్తులో ఎప్పుడైనా కలిసినప్పుడు …నీకు టైమున్నప్పుడు చూద్దాం.

    ఇంతకీ నీ కథల సంపుటి ఎప్పుడు వెలువరిద్దాం అనుకుంటున్నావు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *