పూర్ణలత నాకంటే రెండేండ్లు పెద్దదే కావొచ్చు; అప్పటికే లగ్గలా కనబడేది. ఆమెను కనీసం తలుచుకోగానే నా ఒంట్లోకి సిగ్గు ఎక్కివచ్చేది. ఎదురుపడితే నా కాళ్లల్లో నడక తడబడేది. ఆమె కంట్లో పడకుండా ఉండటానికే సాధ్యమైనంత ప్రయత్నించేవాణ్ని. కానీ నేను పొట్టిగా ఉంటానా! పొడుగ్గా ఉన్నందున తరగతి గదిలో ఆమె నా వెనక వరుసల్లో కూర్చునేది. ఆమె గమనింపులో ఉంటానన్న సంగతే నా శరీరాన్ని బిగుసుకుపోయేలా చేసేది.
ఆ రోజు మా లెక్కల సారు రాలేదు. దాంతో పిలగాండ్లందరూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్లిపోయారు. అక్కడ ఐదో తరగతివాళ్లకు ఆటల పీరియడ్ ఇప్పుడు. సత్తయ్య సారు ఖోఖో ఆడిస్తాడు. ‘రామయ్య పొలం చుట్టుకొలత’ లెక్కతో కుస్తీపడుతూ నా పక్కలు చూసుకోలేదు. బంతికి కూర్చున్నట్టుగా ఖాళీ జోరతట్లు, వాటిముందు వడ్డించినట్టుగా పుస్తకాలు! లేవడానికి వీలుగా కాలు విడిపించుకుంటుండగా అంతటి నిశ్శబ్దంలోనూ ఒక మెత్తటిలంగా పెరపెర శబ్దం మెడ తిరిగేటట్టు చేసింది. పూర్ణలత! కూర్చుని ఏదో రాసుకుంటోంది. తేలికగా ఉన్న దేహంలోకి బరువు ఏదో వచ్చి కూర్చుంది. లేవడం ద్వారా తన దృష్టిని మరల్చుతానన్న స్పృహ నన్ను అలాగే బొమ్మలాగా శరీరం ఎక్కువ కదల్చకుండా కూర్చునేలా చేసింది. సత్తయ్య సార్ విజిల్ చిన్నగా వినబడుతోంది. బయటి నుంచి పావురాలు కువకువమన్నట్టుగా పిల్లల చదువు గొణుగుడు వినబడుతోంది. విజిల్ మళ్లీ వినబడుతున్నప్పుడు, వెనక వయిని తీసి సంచీలో పెట్టిన అలికిడి. బకుల్స్ టిక్కుమని పట్టుకున్నాయి. మా బడి మొత్తం మీద వున్న ఏకైక స్టైలు బ్యాగు అదే. గులాబీ రంగు. పూర్ణలత వాళ్ల నాన్న దాన్ని మస్కట్ నుంచి వచ్చినప్పుడు తెచ్చాడు. నేను వినకుండా ఉండనన్న ధీమాతో, ‘లెక్కలు దీసినవా పిలగా’ అంది, బయటికి వెళ్లబోతూ. నా అదుపు లేకుండా జవాబు దానికదే వచ్చేసింది: ‘ఇంక రెండు జెయ్యలె’. రెండు వైపులా మూతి తిప్పుకుంటూ వెళ్లిపోయింది. మూతి ఎందుకు తిప్పడం? పో…రి…!
నిన్న కూడా ముక్కుచెంప కొట్టింది. తెలుగు సారు ‘గ్రావము’ అర్థమడిగాడు. నేను వినడంలోనే పొరబడ్డాను. చెప్పనోళ్లందరినీ మాకు మేమే ముక్కుచెంప కొట్టుకోమన్నాడు. నాకూ పూర్ణలతకూ పడింది. ముందు నేను కొట్టాలి. గుండె గుబగుబలాడింది. ఆమె దగ్గరికి వెళ్లి, ఆ ముఖం మీద చూపు నిలపడం కష్టమైంది. ఎడమచేత్తో పట్టుకోవడానికి ముక్కు అందలేదు. నర్సయ్య కిసుక్కుమన్నాడు. నా మగతనమంతా లాగులోకి ముడుచుకుపోయినట్టయింది. ఆమె తన నవ్వు పెదవుల్ని బిగించి ముందుకు వంగింది. ముక్కుపుల్ల తాకకుండా ముక్కు పై అంచును పట్టీపట్టనట్టుగా పట్టుకున్నాను. ప్రాణం విడిచి కొట్టడానికి చేతులు రాలేదు. ‘తింటలెవ్వారా? అంత సుతారంగా గొడుతున్నవ్’ అన్నాడు సారు. నేను కొట్టానో లేదో, ఛటేల్‌మని నా ఎడమచెంప మీద దెబ్బపడింది. పో…రి…!
రెండు పీరియడ్లు వరుసగా కింద కూర్చునివున్నాను కాబట్టి, చాపగానే కాళ్లకు హాయి అనిపించింది. మధ్యలో ముక్క తెగిన ఎల్ ఆకారంలో ఉన్న బడి మాది. ప్రధానోపాధ్యాయుడి గది అంటూ వేరుగా ఉండదు. అందులోనే పెద్దబాలశిక్ష పిల్లలు కూర్చుంటారు. మూర్తి సార్ ఏవో సంతకాలు పెడుతున్నాడు. వరండాలో అఆల వాళ్లు ఆఆఆఆ అంటూ అఆ తేడా లేకుండా పలకలు దిద్దుతున్నారు. రెండు, మూడు, నాలుగు, ఐదు తరగతులు ఒక వరుసలో ఉంటాయి. రెండో తరగతికీ హెడ్మాస్టరు గదికీ ముందట ఏర్పడే సందులో హన్మవ్వ మధ్యాహ్న భోజనం వండుతుంది. అటునుంచి పిల్లలు బయటికి పోకుండా, అలాగే వంటకు కొంత ఒచ్చోర ఏర్పరచడానికి అక్కడ చిన్న ఎనుగు నాటారు. బడి ముందు ప్రహరీ అంటూ విడిగా లేదు. అంతా మైదానమే. నేను ఐదో తరగతి గదిని చుట్టేస్తూ వెనక్కి వెళ్తున్నప్పుడు మా నాలుగో తరగతి పిల్లల్ని కూడా మైదానంలోకి రమ్మన్నట్టుగా కీచుపిట్ట ఊదుతూ చేయితో సంజ్ఞ చేస్తున్నాడు సత్తయ్య సార్. నేను బడి వెనుక ఒత్తుగా ఉన్న పాలసంద్రం చెట్ల దిక్కు నడిచాను. నేను అక్కడికి వెళ్లడమూ పూర్ణలత సర్రున లేచి రావడమూ… ఏది ముందు జరిగింది? ముక్కుపుటాలు గుండ్రంగా తిరుగుతుండగా, పూర్తిగా తెరుచుకున్న కళ్లతో… ఆ రూపం నన్ను భయపెట్టింది. కానీ నన్ను దాటుతుండగా, ఒక సన్నని రేఖ ఆమె కుడిపెదవి మూలగా చెంప పై అంచును తాకుతూ తళుక్కుమంది. అప్పుడే చేసినట్టున్న ఉడుకు తడి నన్ను ఉత్తేజితుణ్ని చేసి, నా లాగు చుట్టుకొలతను పెంచింది. ఆ స్థితిలో నీటిని వదలడం కష్టమే అయ్యింది. కాళ్లమీద, నిక్కరు మీద చుక్కలు! అట్లా చూస్తే నర్సయ్య మళ్లీ కిసుక్కుమంటాడు. గాలికి ఆరేట్టుగా కాసేపు అటూయిటూ తచ్చాడాను.
దూరంగా వున్న చెరువు కట్టమీద మేకలు నడుస్తున్నాయి. వాటిని కట్ట చివర కరుచుకోవడానికన్నట్టుగా పైన మేఘాలు పరుగెడుతున్నాయి. గౌండ్లాయన సైకిల్‌కు బింకి తగిలించుకుని ఎల్లమ్మ గుడి దిక్కు పోతున్నాడు. దూరంగా ఏదో డప్పు చప్పుడు వినబడుతోంది. రెండు దువ్వెనలు తోకల్ని కలుపుకుని ఎగురుతున్నాయి. తొవ్వ వెంట ఉండే వాడకట్టువాళ్లు పిల్లల అరుపుల వల్ల ఒకసారి ఆగి చూసి తమ పనుల్లో పడుతున్నారు.
నేను మైదానంలోకి వచ్చేసరికి ఐదు, నాలుగు తరగతుల్ని కలిపేసి రెండు జట్లు చేశారు. నర్సయ్య ఒక పెబ్బ, రత్నాకర్ మరోదానికి. రత్నాకర్ దిక్కు పూర్ణ ఉంది. ఆయన ఐదో తరగతి. లాగు మీద ఇన్‌షర్ట్ చేసుకుంటాడు. రింగుల వెంట్రుకలు. పూర్ణకన్నా ఎత్తుగా బలంగా ఉంటాడు. ఎందుకో చెప్పలేను, అతణ్ని ఒకసారి కొట్టగలిగితే బాగుండనిపించింది. పూర్ణ ఖో ఇవ్వడానికి పరుగెత్తి కూర్చున్నప్పుడు ఆమె నిలువు బండపాకురు రంగు లంగా ఒక్కసారిగా గుండ్రంగా అయింది. ఇక్కడ ఒక విడ్డూరం జరిగింది. ఒకసారి పూర్ణకు ఖో ఇచ్చేటప్పుడు, ‘మ్మోమ్మోమ్మో’ అని మేక సకిలింపులాగా గుల్లిచ్చి కూర్చున్నాడు రత్నాకర్. ఆ సంజ్ఞకు అర్థం తెలిసిన సత్తయ్య సార్ చేతిలోని కట్టె అసంకల్పితంగా పైకి లేచింది. కొన్ని చుట్ల తర్వాత– రత్నాకర్‌కు ఖో ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు, వీపు మీద గట్టిగా డొప్ప కొట్టింది పూర్ణ. నడ్డి విరుచుకుంటూ ఉరికాడు రత్నాకర్. మీసాల కింద సత్తయ్య సార్ చిరునవ్వును నేను పోల్చుకోగలిగాను. ఈలోపు డప్పు చప్పుడు పెరిగింది. పిల్లల గోల అంతకంటే మిన్నంటింది. గుడ్డేలుగును ఆడిస్తూ ఒక ఫకీరాయన వస్తున్నాడు. అది ఆట కంటే సంభ్రమమైనది కావడంతో ఆట దానికదే నిలిచిపోయింది. గుడ్డేలుగు మెడకు తాడు కట్టివుంది. అది ఒక్కోసారి మనిషిలా పైకి లేస్తోంది. పది పైసలిచ్చినవాళ్లకు దాని బూరు కొద్దిగా పీకిస్తున్నాడు. అది మొందారానికి కట్టుకుంటే దయ్యాలు పట్టవట. నా దగ్గర పది పైసలు ఉండింటే బాగుండనుకున్నాను. వాడకట్టు జనం చుట్టూ మూగిపోయారు. ఆయన్ని పిల్లల వినోదం కోసం అక్కడ కాసేపు నిలబడనీయడమా, చదువుల కోసం వెళ్లమనడమా అని మూర్తి సార్, సత్తయ్య సార్ ముచ్చట పెడుతున్నారు. ఉన్నట్టుండి నన్ను గజ్జున భయపెట్టి, ‘నువ్వు ఆడుటానికి ఎందుకు రాలేదోయ్’ అని అడిగి, ‘ఈయన తలుచుకుంటే ఈ గుడ్డేలుగునే మాయం జేస్తడు’ అన్నాడు నర్సయ్య, ఒక దిక్కు చూపిస్తూ. నలుపు వర్ణంలో వున్న బక్కటి మనిషి. తలకు రుమాలు, చేతుల కమీజు, కుడిచెవుకు కొనుక పోగు, కాళ్లకు మాదిగి చెప్పులు, నోట్లో బీడీ. సిరి దుర్గయ్య! ఈయన గురించి కథలు కథలుగా చెబుతారు. నాకు గుడ్డేలుగు కంటే ఈయనంటేనే ఎక్కువ భయమైంది.
* * *
బడి విడిచిపెట్టినంక, నేను ఇంటికెళ్లి దీగుట్లో పంచపాలలో ఉన్న తాళపు చెవిని తీసుకుని తాళం తీశాను. పుస్తకాల సంచీ తనబ్బీలో పెట్టి, ఇంటెనుక తలుపు తీసి జామ చెట్టెక్కాను. ఎర్రజామ పండ్లు రెండు తెంపుకుని కొమ్మ మీదే కూర్చుని తిన్నాను. దిగివచ్చి, మిగిలిన లెక్కలు తీశాను. పెద్ద చీపురుతో ఇల్లు ఊడ్చి, ఐదు కడుపల మీద నీళ్లు జల్లాను. కాళ్లు ఎగేసుకుంటూ బాయిలోంచి నీళ్లు చేది గోలెం, గంగాళం నింపాను. ఇంటెనుక ఉన్న కనకాంబరాలకూ, టమోటా చెట్లకూ నీళ్లు పోస్తుండగా– కుడితి గోళెం మూతను నూకిన శబ్దం రావడంతో వాకిట్లోకి ఉరికాను. బర్ల మంద వస్తోంది. ‘అయ్’ ‘అయ్’ అంటూ అదిలింపు మాటలు వినబడుతున్నాయి. కొత్త తలుగు కావడంతో ముడులు రంధ్రాల్లోకి ఈగక బర్రెను కట్టేసుడు కష్టమైంది. రేకుల కింద వున్న ఎండుగడ్డిని మెదంత తెచ్చి దాని ముందేశాను. కొరికీ కొరకనట్టుగా కొరికింది. ఈలోగా మాగి పొద్దు గూట్లో పడింది. ఇంటి పక్కనేవున్న మూడు చింత చెట్ల మీద కొంగల గంపులు వచ్చి వాలుతున్నాయి.
‘దీపం ముట్టియ్యలేదాయే నాయిన’ అంటూ పెద్ద దర్వాజలోంచి అవ్వ కేక వినబడింది. కాళ్లు కడుక్కోవడానికి నీళ్ల ముంత పట్టుకెళ్లి ఇచ్చి, చేతిలోని అడ్డగుల్ల అందుకున్నాను. దాన్ని గడంచె కింద పెట్టాను. నట్టింటి దీపంలో నూనె లేదని చూసి, అర్రలోని గ్యాసునూనె డబ్బా తెమ్మంది. అర్ర చిమ్మచీకటిగా ఉంటుంది. లోపల దుర్గయ్య కూర్చుంటే! ‘కాపుదనపోళ్లు భయపడుతారు బిడ్డా!’ అని అవ్వ అనకముందే, కళ్లు మూసుకుని ఠక్కుమని పట్టుకొచ్చి తలుపేశాను. డబ్బాకు మూతగా పెట్టిన కున్నె కిందిసగభాగం నొక్కుకుపోయింది. ఈలోగా పొయ్యిగోడ మీద ఉన్న గౌర, దీపం రెండూ తెచ్చింది అవ్వ. ‘ఆకిట్లది గూడ తేపో బిడ్డా’. కిరోసిన్‌ను ఏకధారగా సన్నగా జాగ్రత్తగా వంపుతున్నప్పుడు ఆ వాసనకు నా ముక్కు విప్పారింది. అవ్వ దగ్గర గుంజుకుని అగ్గిపుల్ల ముట్టించాను, బర్రుమనే వెలుగు చప్పుడును వదులుకోవద్దని. చిన్నపీట వేసుకుని, దానిమీదకు ఎక్కి చెమ్మమీద దీపం పెట్టాను. ఎసరు పెట్టుటానికి దీపం తీసుకొని అవ్వ సాయమానులోకి పోయింది. నేను వాకిట్లో దీపం పెట్టుటానికి పోతున్నప్పుడు గుడుగుడు మోటార్ ఆగింది. మనుషుల్ని పోల్చడానికి చేతిలోని వెలుగు వెంటనే చాలలేదు. పూర్ణలత! ముంగట వాళ్ల నాన్న గంగరాజం. అట్టకు అట్ట ఉంటాడాయన. రంగు లుంగీ మీద జబ్బల రంగు బనీన్. నా సంగతి ఏమన్నా చెప్పిందా? పెండతట్ట ఎందుకు తెచ్చినట్టు?
‘‘ఏమల్లుడూ,’’ హుషారుగా మందలించాడు గంగరాజం. ఆ వరుస తర్కం అర్థం కాలేదు. ‘ఆ మామ’ అనడానికి నోరు చాలక, పూర్ణ వైపు చూశాను. ఆ పలకరింపు పట్ల సమ్మతి ఏమీ ఆ ముఖంలో కనబడలేదు.
గడ్డిమోపు ఎత్తుకొని సరసరా వస్తున్న నాయిన, ఒకసారి ఆగి, తలను తిప్పి మరోసారి నిర్ధారించుకున్నట్టుగా చూసి, ‘‘గంగరాజమా, అగో ఎట్లనో గిటు తొవ్వవడ్డది,’’ అంటూ నడుస్తూ రేకుల కింద మోపును ఎత్తేశాడు. పగ్గం విప్పి, బర్రెకు అందులోంచి సగం వేశాడు. బర్రె ఎంత ఇష్టంగా తింటున్నదన్నది దాని పసపస చప్పుడులో తెలుస్తోంది. తన జవాబుకు నాయిన చెవులు సిద్ధమయ్యాయని నమ్మకం కుదిరాక, ‘‘సంటిదానికి ఏదో లెక్కల కాపి గావాన్నంటే…’’ అని మింగేశాడు గంగరాజం.
నెత్తిమీద పడిన గడ్డిపోచలను తువ్వాలతో దులుపుకుంటూ, ‘కొన్ని మంచినీళ్లు దేపోరా’ అన్నాడు నాయిన. ఈ ముందటి అలికిడి ఏమిటో చూద్దామని కడప దాకా వచ్చిన అవ్వ, ఈ మాట విని మళ్లీ వెనక్కి పోయింది. తిరిగొచ్చి, ఇత్తడి చెంబు నాయినకిస్తూ, పూర్ణ చేతిలో వున్న పెండతట్టను చూసి, ‘గుర్రాలకు గుర్రాలు మీ అవ్వాబిడ్డ; మందెనుక పోక పోయిన్రేమే’ అంది. ఎటూ జవాబు ఆశించని ప్రశ్నే అన్నట్టుగా, పూర్ణ దానికి ఏ స్పందనా కనబరచలేదు. ‘ఇంట్లేదో అలుకువూత వుందక్కా’ చెప్పాడు గంగరాజం.
ఒక గుక్క నోట్లో పోసుకొని, పుకిలించి ఉమ్మి, గడగడా తాగి, చెంబు అవ్వకిచ్చి, బనీను జేబులోంచి ‘నెక్లెస్ దాగుతవా’ అంటూ గంగరాజానికి ఒకటి ఇచ్చి, తాను ముట్టించి, అడిగాడు నాయిన: ‘‘మల్లేడన్న ఎడ్లు జాడ దీత్తివా?’’
వాళ్ల రెండు కోడెలు ఈ మధ్యే ఉన్నయి ఉన్నట్టే కొట్టంలో కూలబడి చచ్చిపోయినై. ఇంకా దుక్కులు కూడా పడనివి. వట్టెంల అంగడిలో మూడు వేల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిండని చిత్రంగా చెప్పుకున్నారు. దానికి సమాధానం కూడా అందులోనే ఉన్నదన్నట్టుగా, అందుకే ఆ ప్రయత్నం చేయలేదన్నట్టుగా, ‘‘ఎవని సూపో పడింది బావ; ఏం మంచిగలేదు’’ అన్నాడు గంగరాజం,
‘‘సూపుగాదు మన్నుగాదు తియ్యి, రోగం’’ అని కొట్టేస్తూ, ‘‘మల్ల వోతవా ఉంటవా?’’ అడిగాడు నాయిన.
‘‘ఏమున్నది బావా ఈడ?’’ గంగరాజం మాటలో నిరాశ.
‘‘అన్నా, ఏదో తిరం జేసుకోవాల్నే’’ అంటూ, పూర్ణ దిక్కు చేతు పెట్టి, ‘‘ఇది ఇంతున్నప్పటి నుంచి వోవడితివి, రెండేండ్లయితే పెండ్లికి ఎదుగుతది’’ అన్నది అవ్వ. అక్కడితో ముగియలేదన్నట్టుగా మళ్లీ దీర్ఘం తీస్తూ, ‘‘పీతికడుపు కోసం ఎన్ని కట్టాలు వడాలె మనిషి’’ అంది.
మస్కట్ వీజాలు, అక్కడి బతుకులోకి పెద్దవాళ్ల సంభాషణ మళ్లడంతో, మా పాత్రలకు ఒక చైతన్యాన్ని కల్పిస్తున్నట్టుగా, ‘‘ఆనిగెపు పిందె వండుకుంటారె పోరి’’ అని పూర్ణను అడిగి, ‘‘అడ్డగుల్లలున్నది సోడుపో బిడ్డా’’ అని నాతో అంది. నాకు అట్లా పూర్ణ ముందు పనిచెప్పడం చిన్నతనం అనిపించింది. అడుగు కదలకపోతే నేను భయపడుతున్నాననుకుని, ‘‘బుజ్జి, నువ్వు వోయె ఎనుక’’ అంది. ఇదింకా మానం పోయే మాట.
నట్టింట్లోని దీపం పట్టుకుని చంకలోకి పోయాము. నేను వంగడానికి వీలుగా నా చేతిలోంచి తను దీపం తీసుకుంది. అడ్డగుల్లలో రెండు ఆనిగెపుకాయలు, ముళ్ల తెల్లవంకాయలు, కొద్దిగా ఉల్లి ఆకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పెద్దది చేతికిచ్చాను. బయటికి వచ్చాక, తను పెద్ద పీట మీద కూర్చుంటూ, ‘నేను సంతకం పెట్టుడు నేర్సుకున్న’ అంది, చిన్నపిల్లగా గొంతును ధ్వనింపజేస్తూ. ఆ ప్రదర్శనకు వీలుగా నేను చిత్తు కాపీ, పోంటీన్ పట్టుకొచ్చాను. దీపం పీట మీద పెట్టాను. పోంటీన్ తీసుకుని కాపీ మీదకు వంగింది. పొద్దుటి బడికి భిన్నంగా లేత పాలపిట్ట రంగు గగ్గెర వేసుకుంది. రెండు జడలకు బదులుగా వదులుగా ఒంటి జడ వేసుకుంది. ఒక కాలును కిందకు వేలాడేసి, ఇంకో కాలును పీట మీదే ముడుచుకుని కూర్చుంది. పాదానికి మామిడిపిందెల గొలుసు కనబడుతోంది. ముందుకు వంగినప్పుడు మెడలోని గొలుసు ఊగింది. ముందుకు పడిన ఎర్రరంగు రిబ్బన్ పువ్వు జడను వెనక్కి వేసుకుంది. ఆ గదువ, ఆ కళ్లు, ఆ మెడ, ఆ నున్నటి చెంపలు… కూర్చున్న మేరా వెలుగు ఇస్తున్న ఒక దివ్యకన్యలా కనబడింది. పెద్ద గుడ్డేలుగు బుజ్జి కుందేలుగా మారిపోయినట్టయింది. నా శరీరంలోకి కొత్త తీపు ఏదో చేరినట్టయింది. కనీసం ఇలా అని తాకితే తప్ప దేహాన్ని నిభాయించుకోలేనంత ఆవేశం తన్నుకొచ్చింది. భూమ్మీద అది ఎప్పటికీ చెరిగిపోదన్నంత ధీమాగా జి.పి ఒ ఒ ఆర్ ఎన్ ఎ ఎల్ ఎ టి హెచ్ ఎ అని ఇంగ్లీషులో రాసింది. సంతకం అంటే ఇంగ్లీషులో స్పెల్లింగ్ తెలియడమే. బయట్నుంచి, ‘అటే వోతిరేమో’ అంటోంది అవ్వ.
నేను దీపాన్ని చేతిలోకి తీసుకుని, చెమ్మ దగ్గరకు వెళ్లి, నిక్కి, దానిమీద పెట్టబోతుంటే వెనకే వచ్చిన పూర్ణ తన చేతులోకి తీసుకుని అక్కడ పెట్టింది. అప్పుడు తను పూర్తిగా నా వెనక. ఆ దేహపు మృదుత్వం వెన్నుకు తెలుస్తోంది. ఏం చేయాలో తెలీని గిలగిల. మల్లెపూల పరిమళం చుట్టేసినట్టు, రంగులరాట్నం దిగుతున్నప్పుడు నడుము దగ్గర జివ్వున లాగేసినట్టు. ‘వారీ.’ నాయిన కేక.
* * *
చీకటి ఒక శబ్దంగా ఆవరిస్తోంది. నేను నిద్రలోకి జారుతున్నాను. ‘ఇంట్ల నూనెలేదు; రేపు నువ్వులు గానుగు పట్టిచ్చుకరావాల్నయ్యా’ అంటోంది అవ్వ. మారుతున్న బీడీ వెలుగు దిశను బట్టి నాయిన నోరు ఎక్కడుందో తెలుస్తోంది. కుక్క ఎక్కడో మొరుగుతోంది.
పూర్ణ జడను పట్టుకుని నేనేదో కొండ ఎక్కుతున్నట్టూ, పెద్ద గుహలోకి పాకుతున్నట్టూ, ఉప్పుమొగ్గ రుచి ఏదో కొత్తగా తెలుసుకున్నట్టూ, హఠాత్తుగా దుర్గయ్య గుడ్డేలుగులాగా ఉరికొస్తున్నట్టూ, గంగరాజం ఎద్దులాగా పారిపోతున్నట్టూ… భయంతో తెలివి వచ్చింది. ఉట్టిమీద పెట్టిన సత్తుగిన్నె చందమామలా మెరుస్తోంది. పెద్దపీట మీద అవ్వ, నాయిన ఒక భంగిమలో ఉన్నారు. మళ్లీ అటే కళ్లు మూసుకున్నాను. చిమ్మెటల రొద వినబడుతోంది. భూమంతటా ఉన్నది కప్పలే అన్నట్టుగా బెకబెకమంటున్నాయి. కొమ్మల మీద నిద్రలో పట్టుజారిన కొంగ రెక్కల చప్పుడు. కుక్కలు ఆగకుండా మొరుగుతున్నాయి. పెద్దపిట్ట ఉండుండి కూస్తోంది.
‘లెవ్వురా నాయినా, గా దుర్గయ్య తాతను ఎవరో సంపిర్రట బిడ్డా.’ మా అవ్వ బొచ్చె కొట్టుకోవడంతో మబ్బుల్నే తెలివైంది.
ఏ దుర్గయ్య తాత? అదెవరో మా అవ్వ నోటినుంచే వినక్కర్లేకుండా, వాకిట్లోకి వెళ్తే అప్పటికే చాలామంది నోళ్లల్లో నానుతోంది. సిరి దుర్గయ్య!
నిద్రపోయినట్టే పండుకున్నాడంటే… బనీను మీద నెత్తుటి మరకలు ఉన్నాయంటే… బోర్లాబొక్కల పన్నట్టు శవం ఉందంటే… కుడిపక్క మీద పండబెట్టినట్టు ఉన్నదంటే… ఒంటి ముసలోణ్ని చంపుటానికి చేతులెట్లొచ్చినయంటే… మంత్రకాణ్ని చంపింది ఎవరైనా ఆరునెళ్లకు మించి బతుకరంటే… ఇంట్లకేలి ముసలిదాని వాపితి నగలు కూడా మాయమైనాయంటే… పైసల కోసమే ఈ పని చేశారంటే… ఎన్నో తీర్లుగా ఆ చావువార్త మా ఊరి గాల్లో వ్యాపించడం మొదలుపెట్టింది. వాకిళ్లు ఊడ్చే ఆడవాళ్లు చీపుళ్లను కాళ్లకు ఆనించుకుని ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టారు.
అంబటాళ్ల వరకు ఖాకీ లాగులు, ఎర్ర టోపీలు, లాఠీలతో పోలీసులు చాలామంది దిగారు. ఎప్పుడో ఒకసారి వచ్చే సోమరి వ్యాన్ తప్ప తెలియని మా ఊరి మట్టిరోడ్డు ఈ రయ్యి రయ్యి జీపులతో ఉక్కిరిబిక్కిరైంది. ‘చంపిందెవరో మీకు తెలియకుండా వుండ’దని పెద్ద మనుషులందరినీ పిలిపించారు. ఎదురు మాట్లాడినవాళ్లకు దెబ్బలు పడినై. ఊళ్లో వయసుకు వచ్చిన ప్రతి మగవాడినీ పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొందరిని అక్కడే కొట్టారు. కొందరిని వెంట వేములవాడ తోలుకుపోయారు. వాళ్లకు స్టేషన్లో రోకలిబండలు ఎక్కించారని చెప్పుకున్నారు. తెల్లారి తిరిగొచ్చినవాళ్లు కొందరు కుంటుతూ నడుస్తూ కనిపించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చాలామంది చుట్టాల ఊళ్లకు పారిపోయారు. ఎన్నడూ మా అమ్మమ్మ ఊళ్లో నిద్ర చేయడం ఎరగని మా నాయినను కూడా బలవంతపెట్టి ఇంటెనుక పిల్లబాట నుంచి తోలింది అవ్వ. మా బడి బందు పెట్టారు. ఊళ్లో చేను చెలకల పనులు ఆగిపోయినై. ఊరి మీది మంద పోలేదు. కొట్టాల కాడికి ఆడవాళ్లే వెళ్లి ఎడ్లకు నీళ్లు పెట్టొచ్చారు. మబ్బుల రాట్లు కొట్టకపోవడంతో పొలాలకు నీళ్లు అందలేదు. ధోవతి కట్టుకున్న మగమనిషంటూ ఊరిలో కనబడలేదు. మూడు దినాల పాటు ఊరు ఊరంతా గత్తర లేచినట్టయింది.
నాలుగోరోజు గంగరాజం లొంగిపోయాడు. మంత్రమేసి తన ఎడ్లను చంపినందుకే ఊరిమీది పీడైనా విరగడౌతుందని ఆ పని చేశానని ఒప్పుకున్నాడు. ‘నా కొడుకు ఉప్పు వెట్టి బండ మీద కత్తి నూరుతుండంగ నా కళ్లతో నేను జూసిన’ అని వాళ్ల నాన్నే స్వయంగా పోలీసులకు చెప్పొచ్చాడట. ఆ చెప్పేముందు,‘ఊళ్లె ఇంతమంది కలకల దలిగితే మనకు మంచిది కా’దని కొడుకును బాగా బుదురకిచ్చిండట. ‘నిన్ను ఎల్లకాలం లోపల ఉంచుతనా బిడ్డా? మన ఇల్లూ చేనూ అన్నీ అమ్ముకచ్చయినా సరే నిన్ను ఇడిపిచ్చుకత్తా; నువ్వు లేని ఇంట్ల నేను మాత్రం బతుకుతనా’ అన్నాడట.
తెల్లారి నర్సయ్య మా ఇంటికచ్చి, ‘నీకూ పూర్ణకూ ఏదో ఉందటగదనోయ్’ అన్నాడు. ప్రాణం పోయినంత పనైంది. వీరనుమాండ్ల స్వామీ, గంగరాజం ఎప్పటికీ జైల్లోనే ఉండాలని మొక్కుకున్నాను.
* * *
కొన్ని రోజులు ఊరి ముచ్చట్లన్నీ గంగరాజం చుట్టే తిరిగినై. కానీ ఆ తర్వాత కేసు ఏమైందీ, ఎంతదూరం పోయిందీ ఎవరికీ తెలియదు. దుర్గయ్యకు భార్యా కొడుకులూ బిడ్డలూ ఎవరూ లేకపోవడంతో పట్టిచ్చుకున్నవాళ్లు లేకపోయారు. అట్లాంటి ఒక హత్య జరిగిందని ఊరే మరిచిపోయిన కొన్ని నెలల తర్వాత గంగరాజం మళ్లీ ఊళ్లో అదే గుడుగుడు మోటార్ మీద తిరగడం మొదలైంది. ఆ చప్పుడు వినబడ్డప్పుడల్లా నా గుండె, గాలి ఊదినట్టుగా ఉబ్బుతుండేది.
ఇట్లాంటి రోజుల్లో ఒక విశేషం జరిగింది. ఊరి పెద్దమనుషులందరూ గంగరాజంను మర్రి కిందికి పిలిపించారు. పెద్ద పంచాయితీ జరిగింది. అయింది అయిపోయిందని కొందరూ, ఎట్లయిపోతదని మరికొందరూ…
‘నువ్వేదో కడుపుల వెట్టుకున్నవ్, మనిషి పాణం దీసినవ్. ఆ పాపం పుణ్యం దేవుడే జూత్తడు. బంగారం ఎందుకు ముట్టినవురా? దీనికి నీకు దోషం అంటుకున్నది’ అని పెద్దమనిషి బక్క మల్లయ్య అన్నప్పుడు గంగరాజం ముఖం నల్లగైందట. దొంగతనం ఆలోచన ముందు లేదట. ఎటూ చంపేశాను కాబట్టి నగలుండి ఏం చేస్తాయనుకున్నాడట.
ఆ సాయంత్రమే డప్పు కొట్టి చాటింపు వేయించారు, గంగరాజం కుటుంబాన్ని వెలి వేస్తున్నట్టు. అట్లాంటి మాట వినడం నాకు కొత్త. ప్రతి కులాన్నీ పేరు పేరునా హెచ్చరించారు. గంగరాజం ఇంటికిగానీ చేనుకుగానీ ఎవరూ పనికి పోవద్దు; మీరినోళ్లకు ఇన్నూరు రూపాయల జరిమానా! మంగలోళ్లు క్షవరం చేయొద్దు; చాకలోళ్లు బట్టలు ఉతకొద్దు; మాదిగోళ్లు తాళ్లు పేనొద్దు, చెప్పులు కుట్టొద్దు; కమ్మరోళ్లు కొడవళ్లు చరువొద్దు; వడ్లోళ్లు నాగండ్లు పెట్టొద్దు; అవుసులోళ్లు నగ ముట్టొద్దు; బావన్లు ముహూర్తాలు పెట్టొద్దు…
అప్పట్నుంచీ పూర్ణ బడికి రావడం మానేసింది. ఒకేసారి ఎంతో దగ్గరగా వచ్చి మళ్లీ అంతే దూరంగా జరిగిపోయినట్టయింది. గుడుగుడు చప్పుడు ఒకట్రెండు సార్లు వినబడి ఆగిపోయింది. వడ్లు దంచుకునుటానికి కుదురు కావాలని పూర్ణ వాళ్లమ్మ మున్నూరోళ్ల భూమవ్వను అడిగిందట. ఆమె ఇచ్చిందో లేదో! చింతపండు కొట్టుటానికి గూటం కావాలని తెనుగోళ్ల కనకవ్వను అడిగిందట. ఆమె ఇచ్చిందో లేదో! నల్ల నువ్వులు నాగులకు గావాన్నని పల్లెమీది వజ్రవ్వను అడిగితే, ఆమె ఇచ్చిందో లేదో! గంగరాజం కుటుంబం మళ్లీ పొలాల కాడి సద్దుల ముచ్చట్లలోకీ, మా బడిలో ఒంటేళ్లు పోసేప్పటి మాటల్లోకీ చొచ్చుకొచ్చింది.
జెండావందనం రోజు మా దండు ఊరి బజార్లన్నీ తిరిగినప్పుడు, పూర్ణ కనబడుతుందేమో అని చూశాను. తను ఉంటే పాడేది. వాళ్ల వాడకట్టోళ్లందరూ ఇండ్ల ముందు నిలబడ్డారుగానీ వీళ్లు మాత్రం కనబడలేదు. తలుపులు వేసివున్నాయి. అలుకు జల్లక వాకిలి పొక్కిలి పొక్కిలి అయింది. ఇంటి ముందటి మల్లెచెట్టు ఎండిపోతోంది.
* * *
కొన్ని రోజుల తర్వాత అవ్వ నన్ను ఎందుకో బడికి పోవద్దంది. ‘పూర్ణవ్వ రాయేశ్వరాలు’ అయిందట! అదేమిటో తెలియకపోయినా కొంచెం తెలిసినట్టుగా కూడా అనిపించింది. అదేమిటో ఎవరినీ అడగకూడదని కూడా ఎందుకో ముందే తెలుసనిపించింది. వెళ్లేముందు, ‘తండ్రి జేసిన తప్పుకు బిడ్డకు ఎందుకు శిచ్చ?’ అని నాయినతో అవ్వ అంటుండగా మాత్రం విన్నాను. నా వరకు ఇది ఊరి మీద తిరుగుబాటులాగా కనబడింది.
అవ్వతోటి పూర్ణ వాళ్ల ఇంటికి పోయాను. గంగరాజం వాళ్ల నాన్న వాకిట్లోనే గొంగడి మీద కూర్చుని చుట్ట తాగుతున్నాడు. గంగరాజం మూలకు కింద కూర్చున్నాడు. ఆయన్ను అలా చూస్తే నేను బుగులు పడలేదు. మేము వెళ్తూనే తలెత్తి, పోల్చుకున్నట్టుగా తల పంకించి, కుడిచేతును లోపలికి చూపించాడు. నేను ఇంట్లోకి రాకుండా కడపలోనే నిలబెట్టింది అవ్వ. ఇంట్లోకి వెళ్తూ, గాలికి మూసుకున్న తలుపు రెక్కను పూర్తిగా తెరిచినప్పుడు పూర్ణ బయటికి చూసింది. ఒక ఆశ్చర్యం, సిగ్గుతోపాటు, లోపల అణిచిపెట్టిన నవ్వు ముఖమంతా వ్యాపించింది.
పాత చాప మీద కూర్చోబెట్టివుంది. విరబోసిన తల. ముఖానికి పసుపు. పెద్ద కుంకుమబొట్టు. కొత్త కాంతిని నింపుకున్న కళ్లు. కొత్త మెరుపు అద్దినట్టుగా దేహం. ఇల్లు కోల్పోయిన మొత్తం వెలుగంతా ఆమె ముఖంలో ఉంది. నువ్వులు కలిపిన బియ్యం, కుడుకలు, పసుపు, కుంకుమ ఉన్న తపుకు అవ్వ ఆమె ముందు పెట్టింది. పసుపు అద్దిన తెల్లబట్టను చీరలాగా చుట్టిన బొమ్మ ఏదో చేతిలో పెట్టింది. పూర్ణ తలవంచుకుంది. ఆ లోక నియమాలు వేరుగా ఉన్నట్టూ, అక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియనట్టూ అయిపోయింది నా స్థితి. ఉన్నట్టుండి ఒక రకమైన దేవడం కడుపులో మొదలైంది. పూర్ణకు నేను చెందని మనిషిలాగా, ఆమె ముందు నేను పసిపిల్లాడిలాగా… తనను తేరిపార చూడటం వెగటుగా అనిపించింది. అవ్వ బయటికి వచ్చి, తాను పోసుకొచ్చిన తవ్వెడు నువ్వుల పాద్దోతిని గంగరాజంకు ఇచ్చినప్పుడు, ‘అక్కా’ అని ఆయన బావురుమన్నాడు. ముసలాయన ఒకసారి కొడుకు వైపు చూసి, నోట్లోంచి చుట్ట తీసి, పందిరి వైపు ముఖం పెట్టి కళ్లు మూసుకున్నాడు. సాగదోలుటానికి వచ్చిన పూర్ణ వాళ్లమ్మ కళ్లు తుడుచుకుంది. నేను మాత్రం వెనక్కి చూల్లేదు. అప్పుడు చూడకుండా వదిలేసిందే చివరి చూపు అని నాకు తెలియదు.
ఆ తర్వాత ఒక రాత్రెప్పుడో నలుగురికి నలుగురు ఊరు విడిచి వెళ్లిపోయినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో స్థిరపడ్డారనీ, ఇక్కడ మిగిలివున్న పొలం అమ్మేశారనీ, ముసలాయన జరిగిపోయిండనీ, గంగరాజం మళ్లీ ఎలాగో మస్కట్ పోయిండనీ, పూర్ణకు పెళ్లయిపోయిందనీ… అట్లాంటి కొన్ని మతలబుల తర్వాత వారి ఊసు వినిపించకుండా పోయింది.
ఇన్నేళ్లు గడిచినా పూర్ణను నేను మళ్లీ చూడలేదు. వాళ్ల ఇల్లు మాత్రం అలాగేవుంది. దాన్ని వాళ్లు అమ్మనూలేదూ, ఎవరూ కొనే సాహసమూ చేయలేదు. ఎప్పుడైనా పనుండి వాళ్ల వాడకట్టు వైపు పోయినప్పుడు మాత్రం, ఇంటి ముందరి మల్లెచెట్టు నిండుగా విరబూసినట్టూ, లోపలి నుంచి పూర్ణ అంతే నిండుగా నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్టూ మాత్రం అనిపిస్తుంటుంది.
(ఫిబ్రవరి 2018)

పూడూరి రాజిరెడ్డి
కథకుడు పూడూరి రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపురం గ్రామానికి చెందినవారు. మధుపం, రియాలిటీ చెక్, చింతకింది మల్లయ్య ముచ్చట, ఆజన్మం , గంగరాజం బిడ్డ వంటి పుస్తకాలు తెలుగు పాఠకుల ఆదరణ పొందాయి. కొన్ని కథలు తమిళంలోకి అనువదించబడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. సహ రచయితలతో కలిసి తీసిన 'వెళ్ళిపోవాలి' సినిమాలో తన పాత్రకు మాటలు రాసి అందులో నటించారు. ఈ కథ 'గంగరాజం బిడ్డ' కథా సంపుటి నుంచి తీసుకోబడింది