ఒక రాత్రి

Spread the love

భారతీయ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలు యెందరో. అనేక భాషల సమ్మిళితం భారతీయ సాహిత్యం. ప్రతి భాషలో వారి వారి సంస్కృతిని, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో కథలను రాసినా, ప్రధానంగా భారతీయులుగా ఆయా కాలాలలో వ్యక్తిగత జీవితం, సమాజం పట్ల వున్న ఆలోచనలు… ఆచరణ… ఆశలు… ఆశయాలు… ఆకాంక్షలు… కలలు వూహలు… ప్రేమల్లో మనోభావాలు దాదాపుగా వొక్కలానే అనిపిస్తాయి. విభిన్న దృక్కోణాలు, దృక్పథలు ప్రతి చోట కనిపిస్తూనే వుంటాయి.
బెంగాలీ సాహిత్యాన్ని యెంతో యిష్టంగా మనమంతా చదువుకుంటూ వుంటాము. ఆ రచనల్లోని భావోద్వేగాలతో మనం ఐడెంటిఫై అయ్యాము.
ఆ రచయితల అక్షరాలంటే మనకి అభిమానం. ప్రేమ.
నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవిత్వమంటే అపారమైన ప్రేమ. వారి కథలు కూడా చాలా యిష్టం. ఠాగూర్ గారి సాహిత్యాన్ని చదువుకోవటమే కాదు ఠాగూర్ గారు పుట్టి పెరిగిన యింటిని చూసినప్పుడు రవీంద్ర సంగీతం నా మనసులో పల్లవించింది. శాంతినికేతన్ లో సంచరిస్తూ వొకప్పుడు రవీంద్రులు నడిచిన తోవలు కదా యివీ అనిపించి జీవితమంటే భిన్న రంగుల చిత్రం కదానిపించింది. సాలవృక్షాల నీడల్లో రవీంద్రుని గీతాంజలీని  నెమరేసుకోవటం వో అందమైన జ్ఞాపకం.
యీ సారి ఉదయిని పాఠకుల కోసం 1892 లో ప్రచురితమైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ‘ఒక రాత్రి’ కథని పరిచయం చేస్తున్నాను. 
చాలా సంవత్సరాల క్రితం యీ కథ చదివినప్పుడు యెన్నో విషయాలు అంతకుముందు విన్నవి, చదివినవి స్ఫురించాయి. మళ్ళీ యీ మధ్య చదివినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. యీ కథ యే తరానికైనా ‘అవును కదా…’ అనిపిస్తుంది. 
చిన్ని చిన్ని పల్లెల్లో… వూళ్ళ ల్లో వున్న వాళ్ళకి తమకి దగ్గరగా వున్న పట్టణం లేదా సిటీకి వెళ్ళి చదువుకోవాలని కొత్త రంగాల్లో ప్రవేశించాలని  వుంటుంది. అలా  వెళ్ళినప్పుడు అప్పటివరకు మనకున్న ప్రయారిటీస్ మారిపోతుంటాయి. వొక్కోసారి అవి భవిష్యత్తుకి
బోళ్ళన్ని కొత్త తలుపులని తెరుస్తాయి. అదే సమయంలో జీవనాన్ని  పెనవేసుకోవలసిన సుగంధపు గాలులు జీవితంలోకి రాకుండా మనోరెక్కలన్ని మూసేస్తాయి.
యే యే వ్యక్తిగత, సామాజిక పరిస్థితులు అటువంటి 
పరిస్థితిలోకి వ్యక్తులని నెడుతూ వున్నాయి.
యీ ‘ఒక రాత్రి’ ని ఫస్ట్ పర్సన్ లో రాశారు. 
బాల్యంలో అతను, సురబాల వొకే బడిలో చదువుకున్నారు. వాళ్ళ యిళ్ళల్లో వారు వీళ్ళిద్దరూ వీడు జోడుగా వున్నారనుకోవటంతో  ఆ చిన్నతనంలోనే  సురబాల మీద తనకి అధికారం వుందని భావించేవాడు. 
కాబోయే భార్యాభర్తలు అనగానే అమ్మాయి మీద అబ్బాయిలకి వచ్చే పెత్తనాన్ని, నాది అనుకోగానే  ప్రత్యేకమైన అధికారం వుందని నమ్మి ప్రదర్శించేవాడు సురబాల మీద.
అతను తన పదిహేనోయేట కలకత్తాకి చదువు కోసం, మంచి వుద్యోగం కోసం యింట్లో నుంచి పారిపోయాడు.
అప్పటికి సురబాలకి యెనిమిదేళ్ళు.
కలకత్తా నగరం అతనిలో యెన్నో మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రాధాన్యతల్లో బోల్డంత మార్పు. అందులో ప్రధానమైనది ‘జీవితాంతం వివాహం చేసుకోకుండా స్వదేశం కోసం ప్రాణత్యాగం చేయాలని మనసులో ప్రతిజ్ఞాబద్ధుడు’ అవ్వటం. 
యే యే వుద్యోగాలు చేయాలని కలలు కంటూ కలకత్తా వెళ్లాడో అవేవీ నెరవేరవు. పరిస్థితులు మారిపోయాక అతను నౌ ఖాలీ జిల్లాలో వో చిన్న బస్తీలోని మిల్క్ స్కూల్లో రెండవ మాస్టారుగా పనికి కుదురుకుంటాడు.
అతని జీవితంలో వో రాత్రి సురబాల యెలా సాక్షాత్కరించిందో… ఆ వొక్క రాత్రిలో వచ్చిన యెరుక యేమిటి? ఆ తాత్వికత యేమిటి? అల్ప జీవితంలో యేది పరమశార్ధకమైనది?
బాల్యం, యవ్వనం మలుపులు తిరుగుతున్నప్పుడు యే ముందు చూపు జీవితానికి అవసరమైన వుత్సాహాన్నిస్తాయి? స్థబ్దతనిస్తాయి?
యే ‘ఒక్క రాత్రి’ అతని హృదయంలో కాంతివంతంగా విచ్చుకుంది. అతనికి యే స్పురణ జీవితంలో త్వరగా దర్శనమయింది. యే మేరకు అతని జీవితం ధన్యమైందో 
అనేకనేక రాత్రింబగళ్ళన్నింటిలో ఆ ‘ఒక్క రాత్రి’ యెలా పరమసార్ధకమైనదో  యీ ‘ఒక్క రాత్రి’ లో చూద్దాం.
హ్యాపీ రీడింగ్.
….
కుప్పిలి పద్మ

సురబాల నేనూ కలసి ఒకే బళ్లోకి వెళ్లేవాళ్లం, మొగుడూ పెళ్లాలాట ఆడుకునేవాళ్ళం. వాళ్ల ఇంటికి వెడితే సురబాల తల్లి నన్నెంతో అపేక్షగా చూసేది. మమ్మల్నిద్దర్ని దగ్గిర దగ్గరగా జేర్చి తనలో తాను, “ఆహా! ఇద్దరూ ఈడూ జోడుగా ఉన్నారు” అనుకునేది.

చిన్నవాణ్ణి అప్పుడు. అయినా ఆ మాటలోని అర్థం ఒకవిధంగా గ్రహించగలిగాను.  సురబాల విషయంలో సర్వసామాన్యంగా అందరికంటే నాకొక ప్రత్యేకమైన అధికారం ఉన్నదన్న అభిప్రాయం నా మనస్సులో గట్టిగా నాటుకుపోయింది. ఆ అధికారమదంతో మ త్తెక్కి నేనామె విషయంలో శాసించడం, వేధించటం చెయ్యక పోలేదు. సురబాలకూడా ఎంతో ఓర్పుతో నే పురమాయించినట్లూ చేసేది. ఆరట్లన్నీ భరించేది. మా పల్లెటూళ్లో సురబాల అందానికి మెప్పు ఉండేది. కాని మూర్ఖ బాలకుడి దృష్టిలో ఆ అందానికేమీ మన్నన ఉండేది కాదు. సురబాల నాధాష్టీకానికి తల ఒగ్గటానికే తలితండ్రులింట పుట్టింది. కనుక నా అవహేళన కెంతయినా పాత్రురాలు అని మాత్రమే తెలుసు నాకు.

మా నాన్న చౌధురీ_జమీందారులదగ్గిర ‘నాయబ్ ‘గా ఉండేవారు. నేను కాస్త  గడితేరగానే నాకు జమీందారీ శిరస్తాపని నేర్పించి, ఎక్కడో అక్కడ నన్ను గుమాస్తాగా పెట్టాలని మా నాన్న అభిప్రాయం. అందుకు నాకు మనస్సులో మహాకోపంగా ఉండేది. మా ఊళ్లోని నీలరతన్ కలకత్తా పారిపోయి చదువుకుని, కలెక్టరు దొరగారి దగ్గిర ‘నాజరు’ అయినట్లు… నా జీవిత లక్ష్యంకూడా అలా చాలా ఉచ్ఛస్థాయిలో ఉండేది. కలెక్టరు దొర గారి వద్ద నాజరుని కాకపోతే కాకపోయాను. కనీసం జిల్లా కోర్టు హెడ్ క్లర్క్ నయినా కావాలి అని నాలో నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

ఎప్పుడూ చూస్తూండేవాణ్ణి. మా నాన్న కోర్టు ఉద్యోగుల్ని ఎంతో మర్యాద చేనే వాడు. రకరకాల కారణాలతో చేపలు కూరలు, డబ్బు దస్కం తీసుకెళ్లి వాళ్లకి పూజార్చనాదులు జరిపిస్తూఉండటం నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. అంచేత కోర్టులోని చిన్నచిన్న ఉద్యోగులకు అందాకా యెందుకు — చివరకు చప్రాసీలకు కూడా నా హృదయంలో చాలా గౌరవమైన స్థానం ఇచ్చాను. వీరే మన వంగదేశానికి పూజ్యదేవతలు – ముప్ఫైమూడుకోట్ల దేవతల చిన్నచిన్న క్రొత్త నమూనాలు. ఐశ్వర్యసిద్ధి విషయంలో సాక్షాత్తూ సిద్ధి దాత విఘ్నేశ్వరుడి మీద కంటే లోకులు వీళ్ళ మీదనే మనస్ఫూర్తిగా ఆధారపడి ఉండటం హెచ్చు. అంచేత పూర్వం విఘ్నేశ్వరుడికి ప్రాప్తిస్తూ ఉండేవన్నీ ఇప్పుడు వీరికి ప్రాప్తిస్తున్నాయి.

నేనుకూడా, నీలరతన్ దృష్టాంతంతో ఉత్సాహితుడినై ఒకమాటు మంచి వీలు చిక్కటంతో కలకత్తా పారిపోయాను. మొదట్లో మా ఊర్లో పరిచితులైన ఒకరి బసలో  ఉన్నాను. తర్వాత తర్వాత నాన్న దగ్గిర్నుంచి చదువుకు కావలసిన సాయం కూడా పొందుతూ వచ్చాను. చదువు యథావిధిగా సాగిపోసాగింది.

ఆ తర్వాత సభల్లో- సమితుల్లోకూడా పాల్గొంటూ ఉండేవాణ్ణి. దేశం కోసం హఠాత్తుగా ప్రాణాల్ని విసర్జించటం ఎంత అత్యంతావశ్యకమో దాన్ని గురించి నాకేం సందేహం లేదు. కాని ఆదుస్సాధ్యమైన కార్యాన్ని ఎలా చెయ్యటం అనేదే నాకు తెలియదు, పైగా ఎవరూ దృష్టాంతం చూపించలేదు కూడా. మా పల్లెటూరి కుర్రవాళ్లం కలకత్తాలోని ఆరిందాలైన కుర్రవాళ్లలాగా దేన్ని పడితేదాన్ని ఎగతాళి చెయ్యటం నేర్చుకోలేదు. కనుక మా పట్టుదల చాలా గట్టిగా ఉండేది. మా సమితిలో మూల స్తంభాలయిన వాళ్ళు ఉపన్యాసాలిచ్చేవారు. మేమేమో చందాల పుస్తకాలు తీసుకుని తిండి లేకుండా మిట్ట మధ్యాహ్నపు యెండలో చక చకా ఇంటింటికీ వెళ్లి భిక్షమడుగుతూ తిరిగేవాళ్లం. రోడ్డు ప్రక్కన నిలబడి కరపత్రాలు పంచిపెట్టేవాళ్లం. సభాస్థలానికి వెళ్లి కుర్చీలు, బెంచీలు మోసుకువచ్చి అమర్చుతూండేవాళ్లం. నాయకుల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చాలు – నడుములు బిగించి దెబ్బలాటకి సిద్దపడేవాళ్లం. సిటీలోని కుర్రవాళ్లు ఈ లక్షణా లన్నీచూసి మమ్మల్ని

‘ పల్లెటూరి సజ్జు’ అనేవాళ్ళు.

నాజరునో శిరస్తాదారునో కావాలని వచ్చాను. కాని ‘మాట్ సీ’ని ‘గారిబాల్డ్ ‘ లను కావటానికి ప్రయత్నించసాగాను.

ఈ సమయంలో మా నాన్న సురబాలనాన్న, ఏకమై నాకు సురబాలతో వివాహం చెయ్యటానికి ఉద్యుక్తులయినారు.

నేను పదిహేనోయేట కలకత్తాకి పారిపోయివచ్చాను. అప్పుడు సురబాలకు ఎనిమిదేళ్ళు. ఇప్పుడు నాకు పద్దెనిమిది. నాన్న అభిప్రాయంప్రకారం నాకు క్రమంగా పెళ్లి యీడు దాటిపోతోంది. కాని ఇక్కడ నేను జీవితాంతం వివాహం చేసుకోకుండా స్వదేశంకోసం ప్రాణత్యాగం చెయ్యాలి అని మనస్సులో ప్రతిజ్ఞాబద్దుడనయాను. నేను నాన్నతో—” చదువు పూర్తికానిదే వివాహం చేసుకోను” అని చెప్పేశాను.

తర్వాత రెండు మూడు నెలలకు వకీలు రామలోచనబాబుతో సురబాలకు వివాహమయిందన్న వర్తమానం తెలిసింది. పతితభారత దేశం కోసం చందాలు వసూలు చెయ్యటంలో హడావిడిగా ఉన్న నాకు, ఈవార్త అల్పాతి  అల్పమైనదిగా తోచింది.

ఎంట్రన్సు (స్కూల్ ఫైనల్) ప్యాసయాను. యఫ్.ఏ. పరీక్షకు వెళ్ళబోతున్నా. ఈ స్థితిలో నాన్న చనిపోయారు. సంసారంలో నేనొక్కణ్ణికాదు. తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళు  ఉన్నారు. అంచేత కాలేజీ వదలి, కాళ్ళరిగేట్లు ఉద్యోగంకోసం తిరగవలసి వచ్చింది. ఎంతో ప్రయత్నించగా… ప్రయత్నించగా నౌఖాలీ జిల్లాలో ఉన్న ఓ చిన్న బస్తీలోని మిడిల్ స్కూల్లో రెండవమాస్టరు పదవిని పొందగలిగాను.

‘నాకు తగిన ఉద్యోగమే దొరికింది’ అనుకున్నాను. ‘ఉపదేశాన్ని, ఉత్సాహాన్ని నూరిపోస్తూ ఒక్కొక్క కుర్రవాణ్ణి భావిభారతదేశానికి ఒక్కొక్క సేనాపతిగా తయారు చేద్దాం’ అనుకున్నాను.

ఉద్యోగంలో చేరి పని ప్రారంభించాను, చూస్తే భావిభారత దేశంకంటే దగ్గిరలో కొచ్చిన ఎగ్జామినేషన్స్ ఒత్తిడి ఎక్కువ. విద్యార్థులకు గ్రామర్, ఆల్జీబ్రా తప్ప మరొకటేదయినా చెపితే హెడ్మాస్టరు మొహం కండలు చించుకునేవాడు. రెండునెలలు గడిచేసరికి నా ఉత్సాహంకూడా చప్పబడిపోయింది.

మాలాంటి ప్రతిభావిహీనులు, ఇంట్లో కూర్చుని, ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.చివరికి కార్యరంగంలోకి దిగి, కాడి బుజాన వేసుకుని, తోక మెలిపెట్టించు కుంటూ, వంచినతల యెత్తకుండా ప్రతిరోజూ దుక్కి దున్నుతూ, సాయంత్రమయేసరికి- ఇంత జనపకట్టె పడేస్తేచాలు సంతృప్తి పడతారు. పట్టశక్యంకాని ఉత్సాహంతో ఎగిరి గంతులు వేస్తారు.

అగ్నిభయంమూలంగా మాస్టర్లు వంతుల ప్రకారం ఒక్కొక్కరు స్కూల్లో ఉంటూ ఉండాలి. నేను ఒంటరివాణ్ణి. ఆ భారం నామీద పడింది. పెద్ద ఎనిమిది దూలాల స్కూలు భవనంలోని ఒకభాగంలో ఉంటున్నాను నేను.

స్కూల్ ఊరికి కొంచెం దూరంగా, ఓ పెద్ద చెరువుగట్టున ఉంది. స్కూల్ కి నాలుగు ప్రక్కలా పోకచెట్లు, కొబ్బరిచెట్లు, గజనిమ్మచెట్లూ ఉన్నాయి. స్కూల్ ని ఆనుకునే రెండు పెద్ద వేపచెట్లు ఒకదాని కొకటి పెన వైచుకున్నట్లుండి. చక్కని నీడనిస్తుంటాయి.

ఒక సంగతి ఇంతవరకు పైకి తీసుకురాలేదు. ఇంతవరకు అది అంత పైకి తీసుకు రావలసినదిగా అనిపించను కూడా లేదు. ఇక్కడ గవర్నమెంట్ లాయరు రామలోచన బాబు ఇల్లు మా స్కూల్ కి దగ్గరలోనే. అతడితో అతడి భార్య – నా బాల్య సఖి సురబాల- ఉంది. అది నాకు తెలుసు.

రామలోచనబాబుతో నాకు పరిచయమయింది. సురబాలతో నాకు చిన్నప్పుడు చాలా చనువు ఉండేదని రామలోచనబాబుకి తెలుసునో లేదో నాకు తెలియదు. నేనుకూడా క్రొత్త పరిచయం కనుక ఆ సంగతులన్నీ చెప్పటం ఉచితమని భావించలేదు. అదీ కాక సురబాల ఒకానొకప్పుడు ఎప్పుడో నా జీవితంతో ఎలా ముడిపడి ఉందో-ఆ సంగతి నా మనస్సులో సరీగ్గా తల యెత్తలేదు.

ఒక సెలవురోజున  రామలోచనబాబు యింటికి అతణ్ణి కలుసుకోటానికి వెళ్ళాను. ఏ విషయాలు మాట్లాడుకున్నామో జ్ఞాపకం లేదు. బహుశా ప్రస్తుత భారతదేశపు దుస్థితి గురించే అయి ఉండొచ్చు. అతడు దాన్ని గురించిన దిగులుతో చచ్చిపోతున్నా డని కాదు. కాని ఆ విషయం హాయిగా పొగ త్రాగుతూ, అనర్గళంగా గంట – గంటన్నర వేపు పై పై సానుభూతితో మాట్లాడుకోవచ్చు.

ఈ సమయంలో ప్రక్కగదిలోంచి గాజుల గలగలలు, చీరెకుచ్చెళ్ళ గర గరలు, రవంత అడుగుల సవ్వడి మెల్లిగా విన్పించసాగాయి. కిటికీ సందులోంచి కుతూహలపూరితాలయిన రెండు కళ్ళు ఏవో నా వైపే చూస్తున్నాయని స్పష్టంగా గ్రహించాను.

తక్షణమే రెండునేత్రాలు. విశ్వాసం, సరళత, శైశవోత్సుకత వెల్లివిరిసే రెండు విశాల నేత్రాలు- రెండు నల్లటి తారకలు, కారు నలుపు కనురెప్పలు. వాటి స్థిరస్నిగ్ధదృష్టులు తలపుకు వచ్చాయి నాకు. హఠాత్తుగా ఎవరో నా గుండెను గుప్పిటతో గట్టిగా పట్టేసినట్లయింది. మనస్సు బాధతో థెగ లాగసాగింది.

నా బసకు తిరిగి వచ్చాను. కాని ఆ బాధ వదలకుండా అలాగే ఉంది. చదువుకుంటున్నా, వ్రాసుకుంటున్నా, ఏం చేస్తున్నా మనస్సులోని బరువు మాత్రం దూరం కాలేదు. మనసు చటుక్కున ఏదో చాలా బరువైన పదార్థంలా అయి, గుండెల్లోని నరాలను క్రుంగతీయసాగింది.

సంజెవేళ మనస్సు కాస్త కుదుటపరచుకుని ఆలోచించసాగాను. “ఇలా ఎందు కయింది” అని. “నీ సురబాల ఎక్కడికి పోయింది?” అని అడిగింది మనస్సు.

“నేనామెని బుద్ధిపూర్వకంగా వదిలివేశాను. ఆమె చిరకాలం నాకోసం కనిపెట్టుకుని కూర్చుంటుందా?” అని సమాధాన మిచ్చాను.

” అప్పుడు కావాలని అనుకుంటే చాలు పొందగలిగినదాన్ని – ఇప్పుడు తల పగల కొట్టుకుని సతమత మయినా, ఒక్కసారి కళ్ళలో చూనే అధికారాన్నయినా పొందలేవు. ఆ చిన్ననాటి సురబాల నీ కెంత దగ్గిరగానయినా ఉండనియ్: ఆమె గాజుల గలగలలే విన్పించనియ్; ఆమె తలలోని సువాసన లెంతయినా సోకనియ్; కాని మధ్యలో అడ్డంగా పెద్ద గోడ మాత్రం ఉంది” అన్నారెవరో మనస్సులో.

” ఉండనియ్, సురబాల ఎవరు నాకు” అన్నాను నేను.

” సురబాల ఇప్పుడు నీకేమీకాదు. కాని సురబాలఏమీ కాకుండా పోగలదా?” అని జవాబు విన్పించింది.

ఆమాట నిజమే. సురబాల నాకేమీ కాకుండా పోగలదా? నాకు అన్నిటికంటె పరమాత్మీయురాలు, నాకందరికంటె అతిసన్నిహితురాలు. నా జీవితంలో సమస్త సుఖదుఃఖ భాగస్వామిని కాగలిగిన ఆమె ఇలా దూరపుది, పరాయిది అయిపోయింది. ఆమెని చూడటమే నిషిద్దం. ఆమెతో మాట్లాడటమే దోషం. ఆమెనిగురించి ఆలోచించటమే పాపం, ఎవరో ఒక్క రామలోచన్ ఎక్కడా ఏమీ కానివాడు. హఠాత్తుగా వచ్చి పడ్డాడు. కేవలం రెండు మంత్రాలు పలికి, సురబాలను ప్రపంచంలో అన్నిటి దగ్గిర్నుంచి క్షణంలో ఎగురేసుకుపోయాడు.

నేను మానవసమాజంలో నూతననీతిని ప్రచారం చెయ్యటానికి కూర్చోలేదు. సమాజాన్ని భగ్నం చెయ్యటానికి రాలేదు. బంధాల్ని త్రెంచి వెయ్యాలనుకోవటం లేదు. నేను నా మనస్సులోని ప్రస్తుతభావాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. నా మనస్సులో తలయెత్తే భావాలన్నీ వివేకసంగత!మయినవేనా రామలోచన్ ఇంటిగోడల లోపల ఉంటున్న సురబాల, రామలోచన్ కికంటె ఎక్కువగా నాది అన్న మాటను ఏమయినా నేను మనస్సులోంచి త్రోసిపారేసుకోలేకపోతున్నాను. ఇలాంటి ఆలోచన కేవలం అసంగతం, అన్యాయం అన్నది ఒప్పుకుంటాను; కాని అస్వాభావికం మాత్రం కాదు.

అప్పటినుంచి ఇంక ఏ పనిలోనూ మనస్సును చొరనివ్వలేక పోయాను. మధ్యాహ్నమప్పుడు క్లాసులో విద్యార్థులు గోల చేస్తుండేవాళ్ళు. బయట ఎండ మిట మిట లాడుతూండేది. కొంచెం వేడెక్కిన గాలి వేపపువ్వు వాసనలను వెదచల్లుతూండేది. అప్పుడు అనిపించేది ఏమనిపించేదో అంతా తెలియదు. కాని ఇంతవరకు మాత్రం చెప్పగలను. ఈ భారతదేశపు భావిశ్రేయోదాయకుల వ్యాకరణదోషాలను సరిచేస్తూ జీవితం గడపాలని మాత్రం అనిపించేది కాదు.

స్కూల్ విడిచిపెట్టాక నా విశాలమైనభాగంలో ఒంటరిగా కూర్చోబుద్ధి పుట్టేది కాదు. ఒకవేళ ఏ పెద్దమనిషయినా కలుసుకోవటానికి వచ్చినా దుస్సహంగా ఉండేది. సాయంత్రమప్పుడు చెరువు ఒడ్డున పోకచెట్లు, కొబ్బరిచెట్ల అర్థవిహీనమైన మర్మర ధ్వనులు వింటూ ఆలోచించేవాణ్ణి. మానవసమాజం ఒక జటిలమైన భ్రాంతిజాలం. సరియైన సమయంలో సరియైన పని చెయ్యటం అనేది ఎవరికి తోచదు. తర్వాత తగని సమయంలో, తగని వాంఛలు పెంచుకుని అశాంతితో సతమత మవుతూంటారు.

నీలాంటివాడు సురబాల భర్తయై ముసలితనం వరకు చాలా సుఖంగా ఉండొచ్చు. నువ్వు మరి ‘గారిబాల్ద్’ కాబోయి, చివరికి పల్లెటూరి మిడిల్కూల్లో సెకండ్ మాష్టరివయినావాయె. రామలోచనా రాయ్ అంటే వకీలు. అతడికి ముఖ్యంగా సురబాలకే భర్త కావలసిన అత్యావశ్యకమేమీ లేదు. వివాహం కావటానికి ముందు క్షణంవరకు అతడికి సురబాల యెంతో భవశంకరీ అంతే. అతడేమీ ఆలోచించకుండా వివాహం చేసుకుని, సర్కారువారి వకీలయి హాయిగా నాలుగు రాళ్ళు సంపాయిస్తున్నాడు. అతడు పాలు పొగ చూరుకంపు కొట్టిన రోజున సురబాలను గట్టిగా చివాట్లేస్తాడు. మనస్సు, ప్రసన్నంగా ఉన్న రోజున సురబాలకు నగలు చేయించి పెడతాడు. అతడు బొద్దుగా లావుగా ఉంటాడు. పొడుగాటి లాల్చీ వేసుకుంటాడు. చీకూ చింతా యేమీ లేదు. అతడు ఏనాడూ చెరువు ఆకాశంలోని నక్షత్రాల కేసి చూస్తూ నిట్టూరుస్తూ సంజె వేళలు గడపడు.

రామలోచన్ ఒక పెద్ద దావా పనిమీద మరొక ఊరు వెళ్లాడు. నేను మా స్కూల్  భవనంలో ఒంటరిగా ఎలా ఉన్నానో, ఆనాడు సురబాల కూడా తన గదిలో అలాగే ఒంటరిగా ఉండి ఉంటుందనిపించింది.

ఆ రోజున సోమవారమని జ్ఞాపకం ఉంది. ప్రొద్దుటినుంచీ పైన మబ్బుమబ్బుగా ఉంది. పదిగంటలయిం దగ్గర్నుంచి కొద్దిగా వర్షం కురవటం మొదలెట్టింది. పైన మబ్బులు . అవీ చూసి, హెడ్మాస్టరు పెందరాళే స్కూలు విడిచిపెట్టాడు. కారు మబ్బులు ఏదో పెద్ద  విలయం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు రోజంతా ఆకాశంలో హడావిడిగా తిరుగుతూనే ఉన్నాయి. ఆ మర్నాడు సాయంత్రంనుంచి కుండపోతగా వర్షం – దానితోపాటు గాలి కూడా ప్రారంభమయింది. రాత్రిప్రొద్దు పోతున్న కొద్ది గాలి – వానల తీవ్రత హెచ్చసాగింది. మొదట తూర్పు వైపునుంచి గాలి ప్రారంభమయింది. తర్వాత క్రమంగా ఉత్తరపు వైపుగానూ, ఆ తర్వాత ఈశాన్యపు వైపుగాను గాలి కొట్టడం మొదలెట్టింది.

`ఈ రాత్రి నిద్రపోవాలని ప్రయత్నించటం వృథా అని తోచింది మనస్సుకు, ఈ దుర్యోగసమయంలో సురబాల ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గుర్తుకొచ్చింది.  మా స్కూల్ భవనం వారి యింటికంటే చాలా గట్టిది. ఆమెని స్కూల్ భవనంలోకి తీసుకొచ్చి ఉంచి, నేను చెరువుగట్టున ఆ రాత్రి గడుపుదామని యెన్నోసార్లు ఆలోచించాను, కాని మనస్సును ఏమయినా స్థిరపరచుకోలేకపోయాను.

రాత్రి ఒకటి ఒకటిన్నర అయేసరికి, హఠాత్తుగా ప్రవాహపు హోరు విన్పించింది.. సముద్రం పొంగి పరుగెత్తుకు వస్తోంది, ఇంట్లోంచి బయటికి వచ్చాను. సురబాల ఇంటి వైపు నడిచాను, దారిలో మా చెరువుగట్టు. అంతవరకు వెళ్ళేలోపుగానే నాకు చీల మండల లోతు నీళ్ళు వచ్చేశాయి. గట్టుమీదికి యెక్కి నిలబడే సరికి మళ్ళీ రెండో కెరటం వచ్చి పడింది.

మా చెరువుగట్టు ఒక వైపున కొంత భాగం ఇంచు మించు పది పన్నెండు మూరల యెత్తు ఉంటుంది. ఆ గట్టుమీదికి నేను ఎక్కేసరికి అటువైపునుంచి మరొక వ్యక్తి కూడా పైకి ఎక్కివచ్చారు. ఆ వచ్చిన దేవరో నా మనస్సు, నా ప్రత్యవయమూ కూడా గ్రహించగలిగాయి. అలాగే ఆవ్యక్తికూడా నన్ను గుర్తించగలిగినదనటంలో సందేహంలేదు నాకు.

ఇంక తక్కినదంతా నీళ్ళలో మునిగిపోయింది. అయిదారు గజాల ఎత్తున దిబ్బ, మీద మేమిద్దరం మాత్రమే వచ్చి నిలుచుని ఉన్నాం.

అది ప్రళయసమయం. అప్పుడు పైన ఆకాశంలో నక్షత్రాలు లేవు. పృథివి మీది దీపాలన్నీ కూడా ఆరిపోయాయి. అప్పుడొకమాట మాట్లాడినా నష్టంలేదు. కాని ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఎవరూ ఎవరినీ ఒక్క కుశలప్రశ్న కూడా వేసుకోలేదు.

ఇద్దరం కేవలం అంధకారం కేసి చూస్తూ ఉండిపోయాం, పాదాల దగ్గిర కారు నల్లని – ఉన్మత్త మృత్యువాహిని గర్జిస్తూ ప్రవహిస్తోంది.

ఇవాళ విశ్వజగత్తునంతనీ విసర్జించి సురబాల నా దగ్గిరకు వచ్చి నిలబడింది.. ఇవాళ నేను వినా సురబాలకింకెవరూ లేరు. ఎన్నడో శైశవంలోని సురబాల  ఏదో ఒక జన్మాంతరం నుంచి, ఏదో ఒక ప్రాచీనరహస్యాంధకారంలో నుంచి తేలివచ్చి, ఈ సూర్యచంద్రాలోకితమైన, జనవరిపూర్ణమైన వృథివిమీద నా సరసకు వచ్చి నిలిచింది. ఎంతో కాలానికి ఈనాడు లోకమయమూ, ఆలోకమయమూ అయిన పృథివిని వదలి, జనశూన్య మైన ఈ భయంకరప్రళయాంధకారం మధ్య సురబాల ఏకాకినిగా నా సరసకే తీసుకుని రాబడింది. జన్మవాహినిలో ఆ నవకలిక నా దగ్గిరకు కొట్టుకునివచ్చింది. మళ్ళీ మృత్యు వాహినిలో ఆ వికసితపుష్పం నా దగ్గిరకే కొట్టుకునివచ్చింది. ఇప్పుడింక ఇంకొక కెరటం కనుక వస్తే, వృథివి ఈ ప్రాంతంనుంచి – ఈవిచ్ఛేదపువృంతంనుంచి రాలిపోయి, మేమిద్దరం ఐక్యమైపోగలం.

ఆ కెరటం రాకుండుగాక: భర్త, సంతానం, ఇల్లు, వాకిలీ సమస్త ఐశ్వర్యాలతో సురబాల సుఖంగా ఉండుగాక. నేను ఈ ఒక్కరాత్రి మహాప్రళయతీరాన నిలబడి అనంత ఆనందాన్ని ఆస్వాదించాను.

తెలతెలవారుతోంది, గాలి ఆగిపోయింది. నీరు తీసిపోయింది. సురబాలు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయింది. నేనూ ఏమీ మాట్లాడకుండా నా బసుకు తిరిగి వెళ్లాను.

నేను నాజరును కాలేదు, శిరస్తాదారునూ కాలేదు, గారిబార్డ్ ల్ట్ కాలేదు, నేనొక పల్లెటూరి స్కూల్లో సెకండ్ మాస్టర్ని. నా ఇహజీవనానికంతకీ ఒక్క క్షణంపాటు ఒక అనంతరాత్రి ఉదయించింది. నా పరమాయుర్దాయంలోని రాత్రింబగళ్లన్నిటిలో ఆ ఒక్క రాత్రే-నా అల్పజీవితంలో పరమసార్థకమైనది …

(మే -జూన్1892)

రవీంద్రనాథ ఠాగూర్
మద్దిపట్ల సూరి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *