కవిత్వం పుట్టుక – పరిణామం
కవిత్వం పుట్టుకను గురించీ, పరిణామాన్ని గురించీ తెలుసుకోవాలంటే సాంఘిక, మనో వైజ్ఞానిక, భాషా శాస్త్రాలను గురించి తెలుసుకోవడం అవసరం. కవిత్వాన్ని చదివి సంపూర్ణంగా ఆనందించాలంటే అదేమిటో, ఎలా పుట్టిందో, ఎలా పరిణామం చెందిందో శాస్త్రీయంగా తెలుసుకోవడం అవసరం. అంతేకాదు, పురాతన కవిత్వాన్ని గూర్చిన పరిజ్ఞానం యీనాటి మన కవిత్వ భవితవ్య మెలాగుంటుందో ఊహించడానికి కూడా తోడ్పడుతుంది.
అచ్చు యంత్రం లేని పూర్వకాలంలో కవిత్వం ప్రజల రసనాగ్రాల పైననే వుండేది. సామూహిక శ్రమ క్రమంలో సద్యోజనితంగా వచ్చిన కవిత సంగీతాత్మకంగా లయబద్ధంగా వుండి అందరి సొత్తుగా ఉంటుండేది. అది అందరికీ తెలిసి వుండేది. అందరి చేతా ప్రేమింపబడేది. అనుదిన సంభాషణ క్రమంలో పెల్లుబుకుతూ వుండేది. ప్రముఖ ఘటన ఏది జరిగినా దాని చుట్టూ కవిత అల్లబడుతూ వుండేది. తర తమ భేదాలే తప్ప ఆ రోజుల్లో అందరిలో కవితాంశ అంతో యింతో వుండేదేమో ననిపిస్తుంది.
కవిత్వమంటే భాష యొక్క ఒక ప్రత్యేక స్వరూపం. కవిత్వం పుట్టు కను గురించి తెలుసుకోవాలంటే భాష పుట్టుకను గురించి తెలుసుకోవడం అవసరం. (ఉత్పత్తి) పరికరాలూ, భాషా- ఇవి రెండే మనిషిని జంతువునుండి విడ దీసే ప్రధాన లక్షణాలు.
పరికరాలను సమకూర్చుకున్న మానవుడు వాటిని ఉపయోగించి తన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోనారంభించాడు. ప్రకృతిని తనకి యిష్టం వచ్చినట్లు లొంగదీసుకోనారంభించాడు.
తొలి దశల్లో ఉత్పత్తికోసం జరిగే శ్రమ సమష్టి రూపంలో వుండేది. వాళ్ళ పరికరాలను ఏక సమయంలో సమన్వితంగా వాడాల్సి వచ్చినప్పుడు ఏక కాలంలో సంజ్ఞారూపంలో శబ్దాలు చేస్తూ వచ్చారు. ఆ విధంగా పరికరాలను కనుగొనడం ద్వారా మనిషి భాషను కనుగొన్నాడు. దీన్నిబట్టి చేతికి, మెదడుకీ మధ్య సంబంధం బోధ పడుతుంది. ఉత్పత్తి క్రమంలో భాష ఉద్భవించినట్లు బోధపడుతుంది.
మానవ శ్రమ నైపుణ్యం పెరిగిన కొద్దీ ఊతపదాల అవసరం క్రమంగా తొలగిపోయి, కార్మికులు వ్యక్తిగతంగా పని చెయ్యగల శక్తిని సంపాదించుకున్నారు. అయితే, సమష్టి యంత్రాంగం పూర్తిగా అదృశ్యం కాలేదు.
ఈ లోగా భాష అభివృద్ధి చెందింది. ఉత్పత్తి సాధనాలతో బాటు వాడే సంజ్ఞా శబ్దాల దశనుండి మనుషుల మధ్య భావ వ్యక్తీకరణకు తోడ్పడగల వాహికగా భాష అభివృద్ధి చెందింది.
అన్ని భాషల్లోనూ మనకి రెండురకాల పలుకుబడి కనిపిస్తుంది. వ్యక్తుల మధ్య దైనందిన వ్యవహారంలో వాడే సాదా భాష ఒకటి. కవిత్వ భాష మరొకటి. ఈ కవిత్వ భాష మరింత ప్రగాఢమైనది, సమష్టి కర్మలకు సంబంధించినది. లయబద్ధమైనది, మంత్రోచ్చాటన వంటిది. మంత్రాల ద్వారా దేవుళ్ళను, దెయ్యాలను ఆవాహన చెయ్యడం యిటువంటిదే. దీన్ని బట్టి కవిత్వ భాష మామూలు భాష కన్న పురాతనమైనదని బోధపడుతుంది.
పడవలాగేటప్పుడు, రోడ్డు రోలరు లాగేటప్పుడు, బరువు లెత్తేటప్పుడు, బట్టలుతికేటప్పుడు చేసే శబ్దాలు లయబద్ధంగా వుంటాయి. అలాగే ఊడ్పులు, కోరలు. కుప్ప నూర్పిళ్ళప్పుడు రైతులూ, కూలీలూ లయబద్ధమైన పాటలు పాడటం వింటాం.
ఈ విధంగా మన సాహిత్యం క్రమ క్రమంలో జానపద కవిత్వంగా ప్రారంభమై క్రమంగా పరిణతి చెందింది.
అయితే, యిదంతా మౌఖికంగానే రావాలి కాబట్టి, కాలాన్ని బట్టి భావాలూ భాషా మారుతూ అవే పాటలు కొత్త రూపాలు దాలుస్తూ వస్తాయి. వాటి కాల నిర్ణయంగాని కవి నిర్ణయంగాని సాధ్యంకాదు.
ఆంధ్ర వాఙ్మయంలో మనకు దొరికిన తొలి గ్రంథాలలో మొట్టమొదటిది నన్నయ రచించిన ఆంధ్రమహాభారత భాగం.
ఇంత బాగా పరిణతి చెందిన గ్రంథం ఒకేమారు ఊడిపడటం అసహజమైన విషయం. అంతకుముందు కొంతవాఙ్మయం ఉండే ఉండాలి. కానైతే, యీనాటి వరకు అది లభ్యంకాలేదు. అంతకు పూర్వపు ఆంధ్రవాఙ్మయ స్వరూపం తెలుసుకోవడానికి వున్న ఆధారమల్లా శాసనాలు మాత్రమే.
ఈ శాసనాలలో ఆరవ శతాబ్ది చివరిపాదానికి చెందిన ధనంజయుని కలమళ్ళ శాసనం యిప్పటికి దొరికినంతవరకు తొలి తెలుగు శాసనమని తెలుస్తోంది. కడప మండలంలో క్రీ.శ. 6వ శతాబ్దం నాటి రే నాటి చోళరాజుల చిలమకూరు, ఎర్రగుడిపాడు శాసనాలు, 7వ శతాబ్దం నాటి ఉరుటూరు శాసనం బయటపడ్డాయి. కడప జిల్లా రామేశ్వరంలోని వసంతపోరి మహాదేవి శాసనం గుంటూరుజిల్లా విప్పర్తి శాసనం 7వ శతాబ్దినాటివని, లక్ష్మీపుర శాసనం 705 నాటిదనీ, అహదనకర శాసనం 718-752 మధ్యదనీ వీటిలో అహదనకర శాసనం తప్ప మిగిలినవన్నీ తెలుగు భాషలోనే వున్నాయనీ అహదనకర శాసనంలో కూడా దాని వివరాలన్నీ తెలుగు లోనే వున్నాయనీ చరిత్రకారులు తేల్చారు.
పూర్వచాళుక్య గుణగ విజయాదిత్యుని సేనానాయకుడైన పండ్రంగడు క్రీ.శ. 849-50లో అద్దంకిలో ఒక శాసనం వేయించాడు. తెలుగు పద్యము – తరువోజ కనిపించిన మొట్టమొదటి శాసనం యిదే. 850నాటి కందుకూరు శాసనంలో సీస పద్యముంది.
క్రీ.శ. 950 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కరలున్నాయి.
క్రీ.శ. 1000 ప్రాంతము నాటిదని పరిశోధకులచేత నిర్ణయించబడిన విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి.
నన్నయ తర్వాతి కాలమువాడైన పాల్కురికి సోమనాధుడు తన పండితారాధ్య చరిత్రలో తుమ్మెద పదాలు, ప్రఖాత పదాలు, పర్వత పదాలు, ఆనంద పదాలు, గొబ్బి పదాలు, వెన్నెల పదాలు మొదలైన వాటిని పేర్కొన్నాడు. ఇవీ, యిటువంటివే మరికొన్ని పదాల నన్నయ్యకు పూర్వం తెలుగు నాట పల్లెప్రాంతాల్లో ప్రచారంలో ఉండి ఉండాలి. తీరిక వేళల్లో, ఉత్సవాలలో ఉత్సాహంగా పనుల క్రమంలో శ్రమ తోచకుండా స్త్రీలు, పురుషులూ వీటిని పాడుకొంటూ ఉండి ఉండాలి. స్త్రీల పాటలు బాలబాలికల క్రీడా గీతాలు భక్తిగేయాలు, జానపద యువతీయువకుల గీతాల రూపంలో జానపద సాహిత్యమెంతో ఉండి వుంటుంది. అయితే, నన్నయ పూర్వపు ఆ సాహిత్య సంపద అంతా లక్షణ వ్యవస్థితీ, పండితాదరణా లేక గ్రంథరూపంలో మనకు అందలేదు. అలాగే, నన్నయకు పూర్వం తెలుగుభాషలో గ్రంథ రచన సాగి వుంటుంది. కాని అవేవీ లభ్యంకాలేదు.
కాగా, తెలుగుభాషలో ఆదిగ్రంథం నన్నయ భారతమేనని యిప్పటికి మనం అనుకోవాల్సి వుంటుంది. అయితే, నన్నయ, మహాభారతమే ఎందుకు రాయాల్సి వచ్చిందో? ముందు చూద్దాం.
మహాభారత రచన
1022లో రాజరాజనరేంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికే కన్నడంలో ‘విక్రమార్జున విజయ’మనే పేరుతో పంపభారతం, ‘గదాయుద్ధం’ అనే మరో కావ్యం భారతకథను ప్రచారంలోకి తెచ్చాయి. తమిళంలో కూడా ‘వెణ్బా’ గీతాలలో క్రీ.శ. 7,8 శతాబ్దాలలో పెరిందేవనార్ కవి రచించాడు. సంస్కృత భారతాన్నే దేవాలయాల్లో పురాణంగా చెప్పేవారు. అది ఏ కొద్ది మందికో తప్ప జనసామాన్యానికి అందుబాటులో ఉండేదికాదు. రాజరాజు కాలానికి వెయ్యేళ్ళకు ముందే తెలుగునాట జైన బౌద్ధమతాలు కాళ్లు నిలదొక్కుకున్నాయి. ఆ మతాలు జనసామాన్యపు భాషలలో ప్రబోధాలు చేసేవి. అందరికీ తెలిసే విధంగా పాటలు, గాథలు ప్రచారంలో ఉండేవి. జనమంతా ఆ మతాలవైపు ఎగబడుతూండేవారు. రాజరాజు శైవమతానుయాయి- బ్రాహ్మణ భక్తి కలవాడు. వర్ణాశ్రమ ధర్మాలపై ఆధారపడే మతాన్ని ఉద్దరించదలచాడు. అందుకు పంచమ వేదమైన మహాభారతమే ప్రయోజనకారి అనీ, వర్ణాశ్రమ ధర్మాలకు శత్రువులైన బౌద్ధులు, జైనులు ఏ దేశభాషా ప్రకటనాస్త్రాన్నైతే చేబట్టారో శైవుడైన రాజరాజు కూడ అదే అస్త్రాన్ని చేబట్టి ప్రజల్లో తన మతాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తేదలచి వుంటాడు. కన్నడ సాహిత్యం గురించి, తమిళ సాహిత్యం గురించి తెలిపినవాడు కాబట్టి తెలుగులో ఉద్గ్రంథ రచన చేయిస్తే తప్పులేదని భావించి వుంటాడు. నన్నయను భారతాంధ్రీకరణకు పూనుకోవలసిందిగా కోరి వుంటాడు.
మరే యితర గ్రంథాన్నీ కాకుండా మహాభారతాన్నే ఎందుకు అనువదింప చేశాడన్న దానికి కారణాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.
9-11 శతాబ్దుల మధ్య దక్షిణాదిన ఫ్యూడలిజం స్థిరపడింది. ఫ్యూడల్ యుగంలో నిర్ణయాత్మకమైన సామాజిక చైతన్యరూపం మతం. హిందూ మతానికి రెండు పాదాలున్నాయి.
ఒకటి : వర్ణాశ్రమ ధర్మవ్యవస్థ
రెండు : కృతి, స్మృతి, పురాణేతిహాస వాఙ్మయం
కృతి, స్మృతి, పురాణేతిహాసాల సారసంగ్రహం మహాభారతం. అది పంచమ వేదం. ధర్మశాస్త్రం, మహాపురాణం, రాజవంశావళులు ఇతిహాసం.
అందుకని భూస్వామ్య సంస్కృతీ సమర్ధనకు ఉపకరించే ఏకైక గ్రంథం కాబట్టి మహాభారతాన్నే ఆనాడు అనువదించారు.
నన్నయ ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకు గాని ఆంధ్ర మహాభారతానువాదం పూర్తికాలేదు. క్రీ.శ. 1260 ప్రాంతంలో తిక్కన దాన్ని పూర్తి చేశారు.
“గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుంగు వారికిన్ వ్యాసముని ప్రణీతమైన” మహాభారత గాథను వివరిస్తున్నానని నన్నయకట్టును గురించి ఎర్రాప్రెగడ ఒకచోట చెప్పారు.
అలా గాసట బీసటగా నన్నయ ఈసడించినది అంతకు పూర్వపు ప్రజా వాఙ్మయమై వుండాలి. ప్రజా వాఙ్మయం పట్ల ఈ నిరసన వైఖరిపై తిరుగుబాటుగానే తదనంతర కాలంలో వీరశైవ వాఙ్మయం తలయెత్తింది.
నన్నయ భారతాంధ్రీకరణ మారంభమైన తర్వాత దేశంలో తెలుగుపై గౌరవ మేర్పడింది.
భారత ప్రభావంతో నీతిభూషణము, ముద్రామాత్యము మొదలైన నీతి శాస్త్ర గ్రంథాలు కొన్ని వచ్చాయి.
వీరాచార్యుడు సంస్కృతంలో రచించిన గణితశాస్త్రాన్ని పావులూరి మల్లన తెలిగించాడు.
శాపానుగ్రహ సమర్థుడని, జ్యోతిషము, రాఘవ పాండవీయము, నృసింహ పురాణము, శతకంధర రామాయణము, బసవ పురాణము, హర విలాసము మొదలైన అనేక గ్రంథాలకు కర్తగా లోకమున వాడుకగల వేముల వాడ భీమకవి ఏ కాలమువాడో యిదమిత్థంగా యింకా నిర్ణయం కాలేదు. కవి జనాశ్రయం తప్ప యితని కావ్యాలేవీ లభ్యము కాలేదు.
రాజరాజనరేంద్రుని కొడుకైన రాజేంద్ర చోళుడు కులోత్తుంగ చోళుడనే పేరుతో క్రీ.శ. 1070లో వేంగీ చాళుక్య, చోళరాజ్యాల కధిపతియై తన రాజధానిని తమిళ దేశానికి మార్చుకున్నాడు. దానితో ఆంధ్రదేశంలో తమిళ ప్రాబల్యం పెరిగి ఆంధ్ర సారస్వత పోషణ అడుగంటింది. రాజ్యం కన్నడిగులైన పశ్చిమ చాళుక్యుల వశమైంది. దానితో తెలుగు సారస్వతాభివృద్ధికి రాజాదరణ లేకపోయింది.
ఆంధ్రదేశంలోని వివిధ మండలాధిపతులు స్వతంత్రులవడం, కొందరు వైష్ణవాన్నీ, మరికొందరు శైవాన్నీ అభిమానించడం, పరస్పర వైషమ్యాలతో పోరాటాలు ప్రబలడంతో దేశంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. వీరశైవం అటువంటి అదనులో తలెత్తి, శీఘ్రవ్యాప్తి నందింది.
శివకవులు
శైవంలో పాఠువత, శైవసిద్దాంత, కాలాముఖ, ప్రత్యభిజ్జా, వీరశైవం అనే అయిదు శాఖలున్నాయి. వీటిలో ప్రత్యభిజ్ఞా శైవం (కాశ్మీరశైవం) తప్ప మిగిలిన వన్నీ దక్షిణ భారతంలోని శైవమతశాఖలే.
క్రీ.శ. 12వ శతాబ్దిలో మిగిలిన శాఖలన్నీ వీరశైవంలో విలీనమయ్యాయి. శైవసిద్ధాంతంలో వున్న వర్ణ వ్యవస్థ, నిరుపయోగమూ అర్ధ రహితమూ అయిన కర్మకాండ వీరశైవ మతస్థాపకుల అసంతృప్తికి కారణ మయ్యాయని చెప్పవచ్చు.
పెరియ పురాణము అనే తమిళ గ్రంథంలో అరువది ముగ్గురు నాయ నార్ల జీవిత చరిత్ర చదివితే అప్పటి శైవమత సాంఘిక జీవిత విధానం తెలుస్తుంది.
క్రీ.శ. 18వ శతాబ్దంలో వీరశైవం ఆంధ్రదేశానికి వచ్చింది.
శైవుడు కాని కవి, వారి దృష్టిలో “భవి కవి”. కవికవుల ప్రస్తావన కూడా శివకవుల రచనలలో కనిపించదు.
శివకవులు కళను కళకొరకు గాక శైవమత ప్రచారంకోసం వినియోగించారు. కాబట్టి వీరి రచనలలో కళాత్మకత, సౌందర్యారాధనకన్నా ప్రచార ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.
శివకవుల రచనలన్నీ క్రీ.శ. 12వ శతాబ్దంలోనూ, 13వ శతాబ్ద ప్రధ మార్థ భాగంలోనూ వచ్చాయి.
శివతత్వసార కర్త మల్లికార్జున పండితుడు (12వ శతాబ్ది చివరి భాగంలో వాడు). మన కంటికి స్పష్టముగా కనిపించే ఈ జగత్తును మిథ్య అని, రజ్జుసర్పభ్రాంతి వంటిది అని శంకరుడు అద్వైత మతంలో స్థాపించిన సిద్ధాంతాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదన్నాడు. పాశుపతం ఆత్మ, పరమాత్మ అయిన శివుడు, జగత్తూ- యీ తత్వాలను ఒప్పుకుంటుంది.
కాలాముఖ శివకవులు
యావజ్జీవ బ్రహ్మచర్యం. శివ శక్తుల అవినాభావ సంబంధం, అహింసావలంబనం. శాకాహారం, యజ్ఞయాగాదుల నిరసనం వీరి ప్రత్యేకతలు.
వీరిలో శక్తిపూజ చేసే తెగవారు ఉత్సవ సమయాల్లో మద్యమాంసాలను గ్రహిస్తారు. వీరిలో పరమత సహనం, వర్ణవ్యవస్థపై గౌరవం కనిపిస్తాయి.
శివకవుల్లో అగ్రగణ్యుడు కవిరాజ శిఖామణి నన్నెచోడుడు. ఇతను క్రీ.శ. 1125 ప్రాంతాన పాకనాటి ప్రాంతము నేలిన తెలుగు చోళ రాజు. జన్మచే బ్రాహ్మణులైన కాలాముఖులు బ్రాహ్మణ జాతిని గౌరవించారు. నన్నెచోడుడు తన కావ్యంలో బ్రాహ్మణులను పొగిడాడు.
జ్ఞానమూజ్ఞేయం వలె, శబ్దార్థాలవలె, ప్రకృతి పురుష స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు అవినాభావ సంబంధం కలవారని నన్నెచోడుడు తన కుమార సంభవంలో వర్ణించాడు.
పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ సందర్భంగా ‘మాండలార్చనం’ అనే విధి సందర్భంలో స్త్రీ పురుషులు స్వేచ్చగా మద్యమాంసాలు సేవించే విధానాన్ని నన్నెచోడుడు వర్ణించాడు.
వీరశైవ కవిత
క్రీ.శ. 1162లో భూలోకమల్లుని మంత్రి బిజ్జలుడు చాళుక్య సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు.. అతని మంత్రియే వీరశైవ మత ప్రతిపాదకుడైన బసవేశ్వరుడు. వీరశైవం యికని ప్రాపున వృద్ధిచెంది దేశాన్ని ఉర్రూతలూపింది. ఈ మతప్రభావం సారస్వత రంగంపై ఎక్కువగా ప్రసరించి నూతన వాఙ్మయ శాఖా సృష్టికి తోడ్పడింది.
ఈ శైవ కవితను వర్ణాశ్రమ వ్యవస్థకూ, బ్రాహ్మణాధిక్యతకూ వ్యతిరేకంగా వాటి ఉపరి నిర్మాణమైన వేద వేదాంగాలపైనా, శ్రుతి స్మృతి పురాణాలపైనా జరిగిన తిరుగుబాటుగా పరిగణించవచ్చు.
ఈ సైద్ధాంతిక పోరాటంలో వారు చూపిన ప్రజాస్వామ్య భావాలేమిటో చూద్దాం.
1. భాష: పండిత భాషకు విరుద్ధంగా సకల జనానికి అందుబాటులో వుండే “జానుతెనుగు”.
2. ఛందస్సు: సంస్కృత ఛందస్సుల ద్వారా తప్పనిసరిగా వచ్చిన సంస్కృత పదబంధురమైన భాషను వదిలించుకొనడంకోసం తెలుగు ఛందస్సులను రకరకాల ద్విపదలు, రగడలు, పదాలు, వచనాలను తీసుకొన్నారు.
3. ప్రజాతంత్ర సాంఘిక భావాలు : : కులవ్యవస్థ పై తిరుగుబాటు. సంస్కృతంలో వున్న శాస్త్రాలపై తిరుగుబాటు. స్వభాషలో ఆరాధన. స్వయం పౌరోహిత్యం.
4. ప్రజాతంత్ర రాజకీయ భావాలు: చేతివృత్తుల వారికి సంపూర్ణ స్వేచ్ఛ. ఫ్యూడల్ నిగళాలనుంచి విముక్తి వగైరా.
నన్నెచోడుని గురించి యీ సందర్భంగా మరికొన్ని విషయాలు చెప్పు కుందాం.
తెలుగులో తొలిసారిగా మహాకావ్యరచనకు పూనుకొన్నవాడు రాజకవి నన్నెచోడుడు. ఇతడు శైవకవులలో మొదటివాడు.
నన్నయ దృష్టి ప్రధానంగా పౌరాణికం, అనుషంగికంగా కావ్యసంబంధి కాగా, నన్నెచోడుని దృష్టి భిన్నమైనది. శైవమతదృష్టి, రసమార్గం, వర్ణనా మార్గం, కథాప్రాధాన్యం, జానుతెనుగు రచన. యిన్ని దృక్పథాలనూ మేళవించుకొని కుమారసంభవాది కావ్యరచన చేసినవాడు నన్నెచోడుడు.
“సరళముగాగ భావములు, జాను తెనుంగున నింపు పెంపుతో బిరిగొన వర్ణనల్” కుమార సంభవ కావ్యం తను రచించినట్లు అవతారికలో నన్నెచోడుడు చెప్పుకున్నాడు. సర్వజన సుబోధకము, యింపు పెంపుగల ‘జానుతెనుగు’ పేరుతో తెనుగులో తొలిసారిగా భాషా విషయకమైన ఒక సిద్ధాంతాన్ని లేవ దీసి తరువాత కవుల్లో కొందరికి మార్గదర్శకుడైనాడు నన్నెచోడుడు. ఇతని కవితను తిక్కన చెప్పకయే పాటించాడు. చెప్పి సోమనాథుడు సాధించాడు.
నన్నెచోడుడు తన కవితను వస్తు కవితయని పేర్కొన్నాడు. భావాలు, వర్ణనలు, అర్థాలు, గుణాలు, రసం, సూక్తులు, జానుతెనుగు, దేశిమార్గం, అలంకారాలు మొదలైన దశవిధ కావ్యవస్తువులతో కూడినది ప్రబంధ కవిత అనుకొంటే, తొలిసారిగా ప్రబంధానికి తెలుగుమాగాణిలో బీజావాపము చేసిన వాడు నన్నెచోడుడు; పురాణాంధ్రీకరణ జరుగుతున్న ఆ రోజుల్లో దీన్ని గొప్ప ప్రయోగంగా పరిగణించవచ్చు.
షష్ఠ్యంతాలను, కావ్యాన్ని అంకితమివ్వడాన్ని, చిత్ర, గర్భ కవిత్వా లను తెలుగులో మొదటిసారిగా ప్రవేశ పెట్టినవాడు కూడా నన్నెచోడుడే.
కాబట్టి, ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు ఎర్రన కన్నా నన్నెచోడునికే న్యాయంగా వర్తిస్తుందేమో.
పండిత త్రయం
శైవమత వ్యాప్తికి జీవితాలను అంకితంచేసి, రచనలు సాగించిన వారిలో శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచెన పండితుడు ముఖ్యులు.
శ్రీపతి పండితుడు తెలుగులో శివభక్తి దీపిక రాశాడని చెప్తారు.
మల్లికార్జునుడు బసవనకు సమకాలికుడు. తెలుగులో శివతత్త్వసారం రచించాడు. అందులో అతను ప్రతిపాదించిన సూత్రాలు :
శివభక్తులను చూచి జాతి మొదలైనవి అడగడం మానెయ్యాలి.
రొంపిలో పుట్టినా పద్మం చాలా పూజ్యమైనట్టు ఎలాంటి హీనకులంలో పుట్టినా శివభక్తుడు గొప్పవాడే.
కులం తక్కువవాడే శివభక్తుడైనందు వల్ల గొప్పవాడవుతున్నప్పుడు కులమున్న వాడైతే యిక చెప్పేదేముంది? బంగారానికి తావి అబ్బినట్లే దీన్ని బట్టి శివకవులు కులవ్యవస్థకు యింకా కొంత గౌరవం యిస్తూనేవున్నట్లు తెలుస్తుంది.
భర్త శివభక్తుడు కాకపోతే అవమని భార్య బుద్ధి చెప్పాలి. అతడు అలా కాని పక్షంలో అతణ్ణి వదిలెయ్యాలి.
శివనింద చేసే పాపులను ఆలోచించకుండా చంపెయ్యాలి. శివనింద చేసే అవమానకరమైన పుస్తకాలను తగలబెట్టెయ్యాలి. ఆ పుస్తకాలను రచించిన వాణ్ణి చంపెయ్యాలి. ఈ విధంగా వీరశైవం కొంత క్షుద్రరూపం ధరించింది. తెలుగుదేశంలో కొన్ని యితర మతాల పుస్తకాలను తగలబెట్టించిన అపకీర్తి వండితయ్యకు దక్కింది.
బ్రాహ్మణులు ఎలాగైతే వధకు అనర్హులో శివభక్తులుకూడ అనర్హులే.
శివుణ్ణి పూజించే భార్య, భక్తుడు కాని భర్త చిత్తం వచ్చినట్లు నడుచుకోవలసిన అవసరం లేదు. పురుష ప్రతికూలత్వం వల్ల ఆ సతికి దుర్గతి లేదు.
శివభక్తులు కానివాళ్లు ఎంత పెద్ద వాళ్ళయినా వాళ్ళకు దండం పెట్టకూడదు. వాళ్లు నమస్కరించినా దాన్ని స్వీకరించరాదు.
శివభక్తులు కాని వాళ్ళవద్ద అప్పు చెయ్యకూడదు. వాళ్ళకు అప్పు ఇవ్వకూడదు. వాళ్ళను చూడకూడదు. వాళ్ళతో సరదాగా మాట్లాడకూడదు.
వాళ్ళతో సమానంగా ఒక దగ్గర పడుకోగూడదు. వాళ్ళ సహవాసం చెయ్యకూడదు.
శివభక్తుడు చేసిన పాపమైనా పుణ్యమే ఆపుతుంది. శివభక్తులు కాని వాళ్ళు చేసిన పుణ్యమైనా పాపమే అవుతుంది.
శివభక్తుల దుర్గుణాలను వెదికేవాడు చండాలుడు.
పోతే మూడవ వాడైన మంచెన కావ్యకర్తగా ప్రసిద్ధి కెక్కినవాడు కాదు.
పాల్కురికి సోమన
తర్వాతి ప్రముఖ వీరశైవకవి పాల్కురికి సోమన. ఈయన బసవపురాణ, పండితారాధ్య చరిత్రలు కవితాంశతో నిండివున్నాయి. వ్యషాధిప శతకము, చెన్నమల్లు సీసాలు, బసవరగడలు, అనుభవసారము, బసవోదాహరణము మొదలైనవి యితని యితర రచనలు. శిష్ట వ్యావహారిక భాషను, లోకంలో వున్న శ క్తిమంతములైన పలుకుబళ్ళను యధేచ్చగావాడి తన రచనలకు చైతన్యాన్ని కూర్చుకున్నాడు. రోకటిపాటగా నున్న ద్విపదను నవరస పోషకంగా, లయ సమన్వితంగా, భావ వైవిధ్య వాహికగా, దానికి తెలుగు కావ్యజగత్తులో స్వర్ణాసనాన్ని సమకూర్చిపెట్టాడు సోమనాథుడు.
ఇతని తర్వాత నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, పల్నాటి వీర చరిత్ర మొదలైన చక్కని ద్విపద కృతులు వెలువడ్డాయి.
పాల్కురికి సోమనాధుడు “తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదియవి” అన్నప్పటికీ.
“భక్తి మీది తలపు
బ్రాహ్మ్యంబుతో పొత్తు
బాయలేను నేను
బసవలింగ” అని చెప్పుకున్నాడు.
బ్రాహ్మ్యంతో పొత్తును వదులుకోలేకపోయిన మల్లికార్జున పండితుని వలె కాక పాల్కురికి సోమన బ్రాహ్మణాధిక్యతను, వైదిక కర్మ సిద్ధాంతాలను నిశితంగా అవహేళన చేశాడు.
పండితారాధ్య చరిత్రలోని యీ క్రింది వాక్యాలు చూడండి.
“అసమాక్షు గొలువని అగ్రజుండైన
వసుధ మాలల మాలవాడ కాకెట్లు”
“వేద ధరాక్రాంతులనగబడిన
బ్రాహ్మణ గార్దభంబులతోడ
బ్రతి సేసి యాడిన పాపంబు వచ్చు”
కళను కళకోసమే అన్నట్లు కాక మత ప్రచారం కోసమే తన రచనలను వాడుకున్నప్పటికీ సోమనాథుని కవిత జానుతెనుగు సరణికి, మాటల పొదుపుకు ప్రసిద్ధి చెందింది. పదకవితకు సాహిత్య గౌరవం సంపాదించి పెట్టింది. ఆనాటి సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడే శివ కవితలు ద్విపదలో వ్రాయబడ్డాయి. సంస్కృత ఛందస్సును వదిలి, దేశీయ ఛందస్సును స్వీకరించడమే కాకుండా, భావప్రకటనకు ఆటంకంగా వుండే అనేక నియమాలను కూడా శివకవులు ఉల్లంఘించారు. తెలుగు సాహిత్యంలో ఒక కొత్తమార్గాన్ని సృష్టించారు.
ఈయన ‘బసవ పురాణము’, ‘పండితారాధ్య చరిత్ర’ తెలుగునుండి కన్నడం లోనికి అనువదింపబడ్డాయి.
సోమనాథునితో యిట్టి శివకవుల పరంపర ముగిసిందనే చెప్పవచ్చు.
తిరిగి క్రీ.శ. 15వ శతాబ్దిలో పిడపర్తి వంశంవారు యీ సంప్ర దాయాన్ని ఉద్ధరించి, శివకవులుగా ప్రసిద్ధి గాంచారు.
తిక్కన హరిహరనాథ తత్త్వం
12వ శతాబ్దంలో ఒకవైపు బసవని వీరశైవం, రామానుజుని వైష్ణవ మతం దక్షిణదేశంలో విజృంభించి కల్లోలాలకూ, రక్తపాతానికి దారితీస్తూండేవి. 18వ శతాబ్దిలో మధ్వాచార్యుల ద్వైతమత ఝంఝు బయల్దేరి అప్పటికే ప్రజ్వలిస్తున్న మత వైషమ్య మహాగ్ని మరింత రెచ్చింది. అటువంటి సమయంలో శివకేశవుల అభేధ్యాన్ని ప్రకటించే హరిహరనాధ తత్త్వ ప్రతిపాదనతో సాహిత్యలోకానికీ, ఆధ్యాత్మిక లోకానికి నవ్యమార్గాన్ని చూపాడు తిక్కన.
నన్నెచోడుడు ప్రతిపాదించిన ‘జానుతెనుగు’ సిద్ధాంతాన్ని తిక్కన పాటించాడు. పలుకుబడిలో, ఊహలో, సంభాషణలలో అచ్చమైన దేశిత్వాన్ని చూపాడు.
“తెనుగుబాస ఎనిర్మింపఁ దివురుట రాయ
భవ్య పురుషార్థ తరు పక్వఫలము గాదె” అని చెప్పుకున్నాడు.
“జాత్యము కాని నొప్పయిన
సంస్కృత మెన్నడు జొన్న” నని నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన అన్నాడు.
అలాగే తెలివిషయంలో
“అలతి అలతి తునియల కాహల సంధించిన విధంబున” రచన సాగించాడు.
“ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక యుగంలో గురజాడ నా కవిత్రయం” అని శ్రీ శ్రీ తిక్కనను ప్రస్తుతించడం కూడా యీ సందర్భంగా గుర్తుచేసుకోవడం సముచితం.
తిక్కన కాలపు రాజకీయ పరిస్థితిని కొంత పరిశీలించడం అవసరం. క్రీ.శ. 1176-1192 మధ్య జరిగిన పల్నాటియుద్ధ ఫలితంగా వెలనాటి చోళులు పూర్తిగా బలహీనపడిన పిమ్మట కాకతీయులు క్రమంగా బలపడి, తమ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. శాతవాహన రాజుల తర్వాత యావదాంధ్ర దేశాన్నీ పాలించినవారు కాకతీయ రాజులే. కాకతీయులు నాల్గవ వర్గానికి చెందిన కర్షకులు. రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ కులాలతో వివాహ సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. తద్వారా, వీరికి దేశమందంతటా సంపన్నులగు భూస్వాములు బంధువులయ్యారు. ఆంధ్రదేశాన్ని జయించడంతోబాటు సాంఘిక సాంస్కృతిక రంగాలలో కూడా ఆంధ్రై క్యతకెంతో సహాయపడ్డారు.
నెల్లూరు జన్మస్థలమైన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్ళి కాకతీయ గణపతి దేవుని ఆస్థానంలోనే తన మహాభారతం పూర్తి చేశాడని కొందరు పండితుల అభిప్రాయం. తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలను సాంస్కృతికంగా ఐక్యపరచిన సాహిత్య సృష్టికి తిక్కన మూలపురుషుడని చెప్పవచ్చు.
కాకతీయ యుగంలో సాహిత్యం, సంగీతం, శిల్పం, చేతిపనులు బాగా వృద్ధిచెందాయి. రుద్రమ పాలననుబట్టి స్త్రీలకు సమాజంలో సమానమైన ప్రాముఖ్యం వున్నట్లు తోస్తుంది.
ఆంధ్రదేశంలో ఆనాడు వీరశైవానికి ప్రత్యర్థిగా అక్కడక్కడ వీర వైష్ణవం తలెత్తసాగింది. 1182లో జరిగిన పల్నాటియుద్ధానికి రాజ్యభాగమే ప్రధాన కారణమైనా, ఆ వైరాన్ని ప్రజ్వలింపచేసినది ఆ రాజ్యంలో పుట్టిన మత వైరుధ్యమే.
వలనాటి వీరాగ్రగణ్యుడైన బ్రహ్మనాయుడు వీర వైష్ణవుడు. అతడు చాప కూటిని ప్రవేశ పెట్టి, వీరవైష్ణవ సంఘ వ్యవస్థను స్థాపించాడు. అతని ఎదిరి పక్షపు నాయకురాలైన నాగమ్మ శైవ మతస్తురాలు. దాని ఫలితంగానే అపర భారతయుద్ధ మనదగిన పలనాటి యుద్ధం జరిగింది.
వీర శైవానికి, యీ వీరవైష్ణవానికి వ్యతిరేకంగా కూడా తిక్కన మహా భారతానువాదానికి పూనుకొని యుండవచ్చు.
అభినవదండి కేతన
అభినవదండి కేతన తిక్కన సమకాలికుడు. దశకుమార చరిత్ర గద్య కావ్యాన్ని చంపూ కావ్యంగా రచించి తిక్కనకి అంకితమిచ్చాడు. ఔచితిని చక్కగా పాటించినవాడు. అంగాంగ వర్ణనకు దిగక పాత్రల మానసిక ప్రవృత్తులనే వర్ణించినవాడు.
ఇతడు రచించిన ఆంధ్రభాషా భూషణము తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథం.
అలాగే, యితని విజ్ఞానేశ్వరీయం తెలుగులో వెల్వడిన మొదటి ధర్మ శాస్త్ర గ్రంథం. తిక్కన కవితలో వలెనే యితని కవితలో కూడ కందము లెక్కువ.
మారన
తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణ కర్త. ఇది ప్రౌఢము, హృదయంగమమైన గ్రంథం.
మంచన
రాజశేఖర కవి రచించిన సంస్కృత సాలభంజికా నాటికను అనుసరించి యితను కేయూరబాహు చరిత్రను రచించాడు. ఔచితీ శోభితములైన వర్ణన లతో అలరారే ప్రసన్నమైన రచన యిది.
కృష్ణమాచార్యుడు
తెలుగులో మొదటి వచన కావ్యకర్త. ఇతని వచనాలకు సింహగిరి వచనాలని పేరు. వీటికి చూర్ణికలని పేరని తాళ్ళపాక అన్నమయ్య పేర్కొన్నాడు. ఈ వచన వాఙ్మయమంతా మధురభావ విలసితము. భగవంతుని ప్రియునిగా పరిగణించి నాయికా భావనతో భక్తుడు ఆత్మార్పణ చేసికొనుట యిందులోని యితివృత్తం. ఈయన ద్రావిడ వేదమును తెనిగించినట్లు ప్రతీతి.
బద్దెన సుమతీ శతకము, అప్పన మంత్రి చారుచర్య, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకములు యీ కాలపువే.
ఎర్రన
అద్దంకి రాజు ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి ఎర్రాప్రెగడ. హరి వంశము, భారతంలో అరణ్య పర్వోత్తర భాగం, సృసింహ పురాణములను ఈయన రచించాడు. ఈయన రామాయణము కూడ రచించాడన్న ప్రతీతి వుంది.
నాద సౌందర్యము, అర్థపుష్టి కలిగిన హరివంశము భారతానికి అనుబంధ రచన.
ప్రపంచ మహాకావ్యాల్లో ఉన్నత స్థానాన్ని పొందిన మహాభారతంలోని అరణ్య పర్వోత్తర భాగాన్ని నన్నయ్య తిక్కనలతో సరిదీటుగా రచించి కవిత్రయంలో ఒకడుగా ప్రసిద్ధి చెందినవాడు ఎర్రన.
నృసింహ పురాణం పేరుకు పురాణమైనా రచనా విధానాన్నిబట్టి రసవత్కావ్యం. వర్ణన బాహుళ్యం, ఉక్తి వైచిత్రి, ఆలంకార ప్రాధాన్యం, ఆవరి పుష్ట కథాంశం మొదలైన ప్రబంధ లక్షణాలు యీ కావ్యంలో స్పష్టంగా కన్పించిన కారణంగానే ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు లభించి వుంటుంది.
నాచన సోమన
మహాపండితుడు, మహాకవి అయిన నాచన సోముడు ఎర్రనికి యించు మించు సమకాలికుడు.
హరివంశమునే మరొక విధంగా రచించి ఎర్రనతో పోటీగా ప్రబంధ మార్గమున మరో మెట్టు పైకి వెళ్ళినాడు సోమన. తిక్కన వలెనే యితను కూడ హరిహరుల మధ్య అభేదమును పాటించాడు. ఇతని ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశిష్టత, భావతీవ్రత, భావావేశం కనిపిస్తాయి. శబ్దార్థాలంకారముల ఆడంబరముతో కూడిన రచన యితనితోనే ప్రారంభమైంది.
రామాయణానువాదం
రెడ్డి రాజధాని అద్దంకిలో ఎర్రాప్రగడ రామాయణాన్ని రచిస్తున్నాడన్న వార్త విన్న సాహిణి మారన ప్రోత్సాహముచే భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవులు రామాయణ రచనకు పూనుకొన్నారు. ఈ రామాయణము 1890 ప్రాంతాన అయ్యలార్యునిచే పూర్తి చెయ్యబడింది. ఈ రెండు రామా యణములకు పూర్వమే రంగనాథ ద్విపద రామాయణం వెలిసింది.
భాస్కర రామాయణ కర్తలు నలుగురిలో భాస్కరుడు మేటి. అతని తర్వాత చెప్పదగినవాడు అయ్యలార్యుడు. రుద్రదేవుడు మల్లికార్జునభట్టు తర్వాత చెప్పదగినవాడు.
భాస్కర రామాయణము పండితుల ఆదరానికి పాత్రమైంది. దీని తర్వాత శ్రీనాథుని కాలందాకా చెప్పుకోదగిన కావ్యాలు వెలువడలేదు.
ఈ యుగంలో పేర్కొనదగిన యితర కవుల్లో చిమ్మపూడి అమరేశ్వరుడొకడు.
దోనయామాత్యుడు సస్యానందము, సర్వలోకాశ్రయము అనే గ్రంథాలు రచించాడు.
విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. తెలుగు సంస్కృతం నుంచి పుట్టిందన్న అభిప్రాయాన్ని మొదట ప్రతిపాదించిన వాడితనే.
వెన్నెలకంటి జన్న మంత్రి దేవకీనందన శతకం రచించాడు.
రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము. చంద్రతారావళి, మదన విజయం అనే తెలుగు గ్రంథాలు, ప్రేమాభిరామమనే సంస్కృత గ్రంథమూ రచించాడు. శ్రీనాథుని క్రీడాభిరామానికి యీ ప్రేమాభిరామమే మూలం.
ప్రబంధ పూర్వయుగం
(క్రీ.శ. 1400 క్రీ.శ. 1500)
ఈ ప్రబంధ పూర్వయుగాన్నే ‘శ్రీనాథ యుగం’ అనికూడా పిలుస్తారు. క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయాక అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యం, విజయనగరం రాజధానిగా విజయనగర రాజ్యం స్థాపితమయ్యాయి. రెడ్డి రాజధాని అద్దంకి నుండి కొండవీటికి మారాక శ్రీనాథుడు రెడ్డిరాజుల ఆస్థానకవి అయ్యాడు. శ్రీనాథుడు కవిసార్వభౌముడనే సార్థక బిరుద నామంతో ‘ఈ క్షోణిన్ నినుబోలు సత్కవులు లేరీ నాటి కాలమ్మునన్’ అని రాజులచేతా, మంత్రులచేతా కొనియాడబడుతూ సింహాచలం నుండి దక్షి ణాదిన కంచివరకు పర్యటించి ఆంధ్రదేశైక మహాకవిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీనాథుడు 1880 నుండి క్రీ.శ. 1460 వరకు జీవించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
శ్రీనాథుడు శృంగార రస పోషకుడు.
తెలుగులో విడివిడిగా బహుకావ్యములు రచించినవాడు.
శృంగార రచనలు : శృంగార నైషధము, హరవిలాసము, క్రీడాభిరామము మొదలగునవి.
భక్తిప్రధాన కావ్యాలు : భీమఖండము, కాశీఖండము, వీటిలో కూడ రక్తి స్పర్శలేకుండా పోలేదు.
ఈయన చాటువులు : శృంగార రస పేటికలు.
శ్రీనాథుని రచనల్లో శృంగార రసము శిఖరస్థాన మధిష్టించింది.
శ్రీనాథునితోనే కథా ప్రాధాన్యం తగ్గిపోయి, రసప్రధానమైన రచనలు వెలువడనారంభించాయి. శృంగార వైషధము, హరవిలాసము అట్టి రచనలే.
తెలుగు నుడికారానికి, సీసపద్యాల చిత్ర చిత్ర గతులకు, ఒకే విషయాన్ని పెక్కుభంగుల సాగదీసి చెప్పే ధోరణులకు శ్రీనాథుడే శ్రీకారాన్ని చుట్టాడు.
తెలుగులో మొదటి వీరగాథా కావ్యము (Ballad) “పల్నాటి వీర చరిత్ర” రాసిన కవి శ్రీనాథుడే.
సమకాలీన జీవితాన్ని సమగ్రంగా చిత్రించడంలో శ్రీనాథుడు ప్రత్యే కత కనబరచాడు. క్రీడాభిరామంలో ఓరుగంటి సాంఘిక జీవనానికి అద్దం పట్టాడు, కాకతీయులనాటి వృత్తులు, వర్ణాలు, కులాలు, క్రీడా వినోదాలు, పూటకూళ్ళ భోజనాలు, ఆనాటి ప్రజల ఆచారవ్యవహారాలు చక్కగా చిత్రించాడు. దీనిలో అధిక్షేప కావ్య లక్షణాలు సైతం గర్భితంగా కనిపిస్తాయి. మంచనకర్మ పాత్రద్వారా ఆనాటి వేశ్యాలోలుపత్వాన్ని ఎత్తిచూపాడు. ఇది అనువాదమన్న సంగతి గమనార్హం.
భీమఖండంలో మధ్యాంధ్ర దేశాన్ని వాస్తవికంగా చిత్రించారు.
శ్రీనాథ మహాకవి చాటు పద్యాలకు బాటలు తీసి ఆంధ్ర సాహితిని రాచ నగరాలనుండి రచ్చపట్టుదాకా ప్రసరింప చేశాడు. కవిత్వాన్ని మహోద్యమంగా నడిపినవారిలో యితడు మొదటివాడు.
డిండిమభట్టు మొదలైన సంస్కృత పండితులను ఓడించి తెలుగు భాషకు ఎనలేని గౌరవాన్ని చేకూర్చాడు.
పోతన
శ్రీనాథుని సమకాలికుడైన పోతన మహాభాగవతాంధ్రీకరణం ద్వారా అంత్య ప్రాసరచనకు కొత్తదారులు తొక్కాడు,
నన్నయ ప్రారంభించిన శబ్ద సంగీతాన్ని తారస్థితికి తీసుకు పోయాడు.
దండకమనే కావ్య ప్రక్రియకు పరాకాష్ఠ కలిగించిన గౌరవం పోతన్నకే దక్కింది.
భోగినీ దండకం శృంగారాత్మకంగా వెలువడిన తొలి దండకం.
దండకాన్ని కావ్యంలో అంతర్భాగంగా కాక విడిగా రచించడం, శృంగార రస ప్రధానంగా రచించడం పోతన ప్రత్యేకతలు.
కావ్యాన్ని నరాంకితం చెయ్యనని కంఠోక్తిగా చెప్పడం, మాతృదేవతా స్తవం చేయడం, మధుర భక్తికి పూలపందిళ్ళు వేయడం పోతన ప్రత్యేకగుణాలు.
వంగదేశంలో కృష్ణతత్వాన్ని ప్రబోధించిన చైతన్యునికంటె ఏబదేండ్లు పూర్వుడు పోతన. అందుచేత వంగదేశంకంటె ముందే ఆంధ్రదేశానికి కృష్ణ తత్వ విజ్ఞానమందించిన ఘనత పోతనకు దక్కింది.
సాధారణ ప్రజల సంస్కారానికి, మనోగతికి అనుగుణమైన హితమైన మార్గాన్ని చూపించిన గ్రంథం అయినందుననే భాగవతానికి విశేషవ్యాప్తి కలిగింది.
ఈ యుగంలో శ్రీనాథ పోతనలకి పిమ్మట పేర్కొనదగిన కవి పిల్లల మర్రి పిన వీరభద్రుడు. ఇతను అవతార దర్పణము, నారదీయ పురాణము, మాఘ మహాత్మ్యము, మానసోల్లాస సారము, శకుంతలా పరిణయము, జైమిని భారతము రచించాడు. శకుంతల అనుసరణలో పిన వీరభద్రునికి శ్రీనాథుని పట్లగల గురుభావం కనిపిస్తుంది.
శృంగార శాకుంతలంలో ప్రబంధ లక్షణాలు కనిపిస్తాయి.
జైమిని భారతానువాదం శృంగార శాకుంతలం కంటే ప్రౌఢమైన గ్రంథం.
నంది మల్లయ, ఘంట సింగయలు వరాహపురాణం, ప్రబోధ చంద్రోదయం అనే రెండు గ్రంథాలు రచించారు.
కృష్ణమిశ్రుడు సంస్కృతంలో రచించిన ప్రబోధ చంద్రోదయమనే నాటకాన్ని ప్రబంధంగా యీ జంటకవులు తీర్చిదిద్దారు.
ప్రదర్శన సౌకర్యాల్లేని నాటకం కంటె ఎటువంటి ప్రబంధాలు వాఙ్మ యంలో సుస్థిరంగా ఉంటాయన్న తలపే యీ కృషికి కారణమై యుండవచ్చు. శ్రీనాథుని యుగంలో పురాణాలపై ఆదరం తగ్గి ఖండ పురాణాలపై అభిరుచి హెచ్చింది.
ఈ యుగంలో చారిత్రాత్మకములైన చిత్ర కథా కావ్యాలు కూడా వెలువడ్డాయి. జక్కన విక్రమార్క చరిత్రము, అనంతామాత్యుని భోజరాజీయము యిటువంటివే.
శబ్ద సంఘటన, వర్ణనా విన్యాసం, శయ్యా సౌభాగ్యం, ఊహాసంపద, ఆలంకారిక శైలి జక్కన కవితలో ప్రత్యేకతలు. శిల్ప ప్రౌఢి, భావనకంటే స్వాభావికత, అర్థగాంభీర్యం, శిల్ప విన్యాసం అనంతామాత్యుని ప్రత్యేకతలు. అనంతామాత్యుడు ఛందో దర్పణం, రసాభరణం అనే ఛందోలంకార గ్రంథాలు కూడా రచించాడు.
శ్రీనాథ యుగంలో ద్విపద కవితను పునరుద్ధరించిన ఘనత గౌరనకు దక్కింది. విసుగుపుట్టని రీతిగా ద్విపదను నడిపిన శక్తిమంతుడు రంగనాథ రామాయణకర్త తర్వాత గౌరనయే. ఇతను హరిశ్చంద్రోపాఖ్యానము, నవ నాథ చరిత్ర కూడా రచించాడు. లక్షణ దీపిక అనే సంస్కృత లక్షణ గ్రంథం కూడా రచించాడు.
కథాగుచ్చమనదగిన సింహాసన ద్వాత్రింశక రచించిన కవి కొరవి గోపరాజు. సాలభంజికలు భోజునకు చెప్పే కథల రూపంలో పెక్కు విజ్ఞాన దాయకములైన లౌకిక విషయాలు యీ కావ్యంలో చెప్పబడ్డాయి.
గేయ కవితా శాఖను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన పదకవితా పితా మహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఈ యుగంవాడే. ఈయన ముప్పది రెండువేల ఆధ్యాత్మిక కీర్తనలు రచించాడు. సంకీర్తన లక్షణమనే లక్షణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించి, దానికనుగుణంగా అన్నమయ్య యీ కీర్తనలు రచించాడు..
మొత్తంమీద, నూరేళ్ల ఈ ప్రబంధ పూర్వయుగ ప్రత్యేక విశిష్టత కావ్య ప్రక్రియా వైవిధ్యం, శైలిలో అలంకారికత, భావాల్లో శృంగారార్ద్రతలనవచ్చు. ప్రబంధ యుగానికి బలమైన పునాది ఈ యుగంలో పడిందని కూడా చెప్పవచ్చు.
ఈ యుగానికి ప్రారంభదశలో కొండవీడు, రాచకొండలు, మధ్య కాలంలో రాజమహేంద్రవరం, అటు తర్వాత ఉదయగిరి, చివర విజయ నగరము సాహిత్య పీఠాలయ్యాయి.
ప్రబంధ యుగం
(క్రీ.శ. 1500 – క్రీ.శ. 1875)
ఆంధ్ర వాఙ్మయంలో ప్రబంధ శాఖకున్న ప్రాధాన్యం, ప్రాచుర్యం -మరే శాఖకు లేవు.
ఏకనాయకాశ్రయత్వం, వస్వైక్యం, అష్టాదశ వర్ణనలు, శృంగార రస ప్రాధాన్యం, అలంకారికమైన శైలీ, అనువాదం కాక స్వతంత్ర రచన అయ్యుండటం ప్రబంధ లక్షణాలు.
నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, నాచన సోమన, శ్రీనాథులు ప్రబంధానికి పాదులు పెట్టారు. అయినా పెద్దనాదులనే ప్రబంధ కర్తలనడానికి కారణం మనుచరిత్ర మొదలైనవి స్వతంత్ర రచనలు కావడమే.
ఆంధ్ర వాఙ్మయంలో కృష్ణరాయల యుగం ఆంగ్ల చరిత్రలో ఎలిజబెత్ యుగంవంటి స్వర్ణయుగం. ఎలిజబెత్ యుగంలో షేక్స్పియర్ మొద లైన నాటక కర్తలు స్వతంత్రములైన ‘రొమాంటిక్’ నాటికలను రచించినట్లే రాయలయుగంలో పెద్దనాదులు స్వతంత్ర నూతన కావ్యసృష్టి చేయడంచేత ఒక ‘నవ్యకవితోద్యమం (‘రొమాంటిక్ మూవ్ మెంట్ ‘ )ప్రవర్తిల్లిందని చెప్పవచ్చు. రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, ధూర్జటి మాత్రమే తెలుగు కవులు, తక్కిన ముగ్గురూ యితర భాషా కవులు.
రాయల ఆస్థాన కవుల్లోని అల్లసాని పెద్దన, నంది తిమ్మనలు, తది తరుల్లో పింగళి సూరన, రామరాజభూషణులు విశేష ఖ్యాతినార్జించుకున్నారు.
అలాగే సమకాలీన ప్రజా జీవితాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’ లోను తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యంలోను చక్కగా వర్ణించారు.
రాయల యుగమనదగిన నూరేండ్లలో (క్రీ.శ. 1500. క్రీ.శ. 1600) నంది తిమ్మన పారిజాతాపహరణము, పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్న ములు ప్రబంధరూపం దాల్చిన నాటకాలు.
శైలీ రమణీయకతకు పెద్దన మనుచరిత్ర, కళాకౌశలానికి తిమ్మన పారిజాతాపహరణము, కల్పనా చాతురికి సూరన కళాపూర్ణోదయము, పద్య రచనలో నేర్పుకు, లయకు, శ్లేషకు రామరాజభూషణుని వసుచరిత్రా పేరు పొందాయి.
అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయం తదుపరి ప్రబంధాల్లో కనిపించే కృత్రిమాలంకారాలకు మార్గదర్శి అయింది.
దూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యము ప్రబంధ శైలిలో రచింపబడిన స్థల పురాణం.
1530లో రాయల మరణానంతరం మాదయగారి మల్లన రాజశేఖర చరిత్ర, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము, చింతలపూడి యెల్ల నార్యుని రాధా మాధవము, సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనము, కందుకూరి రుద్రయ నిరంకుశోపాఖ్యానము, సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసం, చదలవాడ మల్లయ్య విప్రనారాయణ చరిత్ర, పొన్నిగంటి తెలగన్న యయాతి చరిత్రం (అచ్చ తెలుగు కావ్యం), శంకరకవి హరిశ్చంద్రో సాఖ్యానం వెలువడ్డాయి.
ఈ ప్రబంధాల్లో అధికాంశం శృంగార రస ప్రధానాలే.
ఆంధ్ర సాహిత్యంలో శృంగార రసానికి అగ్రతాంబూలం కలగడానికి హేతువులను చూద్దాం.
16వ శతాబ్దిలో ఆంధ్రదేశంలో మహమ్మదీయులు విజృంభించారు. నన్నయ తిక్కనలతో పెంపొందిన వైదికమతం, పాల్కురికి వేరూనిన వీర శైవం క్రమంగా శిథిలమైపోయాయి. మహమ్మదీయ పాలకుల రాజ్యవైభవం హైందవ సమాజంలో భోగాభిలాషను రేకెత్తించింది. విజయనగర ప్రభువులపై అనాటి మహమ్మదీయ ప్రభువుల ప్రభావం సోకడంవల్లనే వారు శృంగార రస ప్రధానాలైన కావ్యాలనే అభిమానింవసాగారు. క్షుద్ర శృంగారం సైతం ప్రభువుల మెచ్చికోలుకు పాత్రమయ్యేది.
ఆంధ్ర సాహిత్యంలో అంతకుపూర్వం గతానుగతికంగా నడుస్తున్న అనువాద పద్ధతిని త్రోసిరాజనడం ప్రబంధయుగ ప్రత్యేకత. కథా వస్తువు పై నుండి దృష్టి వర్ణనలవైపు మళ్ళింది. ప్రసిద్ధ వస్తువుతోపాటు కల్పితేతి వృత్తాలకు గౌరవం లభించింది.
పదహారవ శతాబ్ది ముగిసేనాటికి విజయనగర సింహాసనం ఆత్మ రక్షణార్థం మొదట పెనుగొండలోను, తర్వాత చంద్రగిరిలోను తలదాచుకొనవలసిన దుస్థితి ఏర్పడింది.
అపర కృష్ణదేవరాయలైన తంజావూరు రఘునాధరాయలు ఆస్థానంలో ఆంధ్ర సరస్వతి వలసరాజ్య మేర్పరచుకొంది.
దక్షిణాంధ్ర యుగం
దక్షిణాంధ్ర యుగంలో సాహిత్యరంగంలో చెప్పుకోతగిన నూత్న ప్రక్రియలు వెల్వడలేదు. వచనగ్రంథాలు విస్తారంగా వెలువడ్డాయి. శతకాలు, యక్షగానాలు, గేయరచనలు ప్రబలంగా వెలిశాయి. మనుచరిత్రతో ప్రారంభమైన ప్రబంధ కావ్యప్రక్రియ ఈ కాలంనాటికి వెర్రితలలు వేసింది. శృంగారం అంగ పరిమితమై, అంతస్సారాన్ని కోల్పోయి క్షుద్రమైనది. చేమకూర వెంకట కవి ‘విజయ విలాసం’ వంటి ఒకటి రెండు ప్రబంధాలు తప్ప చెప్పుకోతగిన ప్రబంధము లీ యుగంలో లేవు.
శేషము వేంకటపతి తారాశశాంకము, సముఖము వెంకట కృష్ణప్ప నాయకుని ఆహల్యా సంక్రందనము, రాధామాధవ సంవాదము, ముద్దుపళవి రాధికా సాంత్వనము లజ్జావిహీనతకు, కామపరాయణత్వానికి ప్రతీకలై ఆ కాలపు సంఘ స్థితిని ప్రతిబింబిస్తున్నాయి.
ఆ రోజుల్లోనే ఆంధ్రులకు తంజావూరు, మధుర మొదలైన సామంత రాష్ట్రములైనా లేకుండా, పాశ్చాత్యులాక్రమించుకున్నారు. జాతికళ క్షీణించినట్లే సారస్వత కళలూ క్షీణించాయి. జాతి దారిద్ర్య పరాధీనతలే కవితలోని భావదాస్య పరాధీనతలకు కారణమయ్యాయి.
ఈ కాలంలో ఒకే ఒక్క సుగుణం గేయ కవితా పట్టాభిషేకం, రఘు నాథ రాయలు, విజయరాఘవ నాయకుడు స్వయంగా గేయరచనలు చేశారని చెప్తారు. అనేక గేయకృతుల నాదరించారు. విజయరాఘవుడు కర్ణాటక భాషలో సాంగత్యమనే ఛందస్సులో శృంగార సాంగత్యం, సంపంగిమన్నారు సాంగత్యమనే రెండు గ్రంథాలు రచించి, ఛందస్సులో కొత్తరీతిని ప్రవేశ పెట్టాడు. ఈ కాలంలో వెలువడ్డ మిగిలిన కావ్యాలన్నీ గతానుగతికాలే.
వేమన ప్రయోగాలు
వేమన ప్రజాకవి, మహాకవి. తన నాటికి జడీభవించిన వైదిక ధర్మ మార్గాన్ని, సాంఘిక దురాచారాలను అధిక్షేపించడానికి పద్యాన్ని వజ్రాయుధంలా ప్రయోగించాడు.
పాత ఛందస్సులోనే అయినా వస్తువులో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచాడు. అధిక్షేప కావ్యరీతికి వేమన పద్యాలు శ్రీకారం చుట్టాయి. తన చుట్టూ జరిగే విషయాల్ని సూటిగా ఎత్తిచూపడం సంఘ సంస్కారార్థమై కవిత్వా న్నుపయోగించడం, ప్రజల భాషలో పద్యాల్ని రచించడం వేమన చేసిన విశిష్ట ప్రయోగాలు. భాషలో, భావంలో, శైలిలో అచ్చమైన తెలుగుదనం కలిగిన పద్యాలు వేమనవి. వేమన ఆధునిక యుగపు కవుల్లో పలువురిపై ప్రభావం వేసిన ప్రజాకవి. తెలుగు కవితను జానపదుల రసనాగ్రాలపై నర్తింప చేసిన కవి.
రాళ్ళపల్లి అనంతశర్మగారన్నట్లు, “ఇరుప్రక్కలందును మరుగులేని మంచి పదునుగల చురకత్తివంటి కవితా శక్తి, దానికి మెరుగిచ్చునటువంటి సంకేత దూషితంకాని ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్య కుళలత”, యివన్నీ వేమన ప్రత్యేకతలు.
రామాయణానువాదాలు
14-18 శతాబ్దాల మధ్య రామాయాణానువాదాలు భారతదేశమందంతటా జరగడం గమనార్హం. కృత్తివాసరామాయణం (బెంగాలీ), సారంగరామా యణం (ఒరియా), తులసీరామాయణం (హిందీ), కంబరామాయణం (తమిళం), మొల్ల, రంగనాథ, భాస్కర, రఘునాథ రామాయణాదులు (తెలుగు) – ఇవన్నీ దాదాపు ఒకే కాలంలో వెలువడటానికి కారణం ఏమైయుంటుంటో పరిశీలించడం అవసరం.
14-18 శతాబ్దాల మధ్య భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సరకుల ఉత్పత్తి (Commodity Production) పెంపొందింది. ఫ్యూడల్ శృంఖలాలను పగల గొట్టవలసిన అవసరం చేతి వృత్తులవారికి వచ్చింది. అందుకని, ఆ తర్వాత ఉధృత రూపంలో బయల్వెడలిన భక్తి. సూఫీ, జానపద వేదాంత. ఉద్యమాలకు పూర్వరంగంగా భక్తి సముచ్చయం, భక్తి సర్వసంగా రామాయణం వెలువడింది. ఈ భక్తి ఉద్యమాన్ని క్రింది వర్గాలకు, కులాలకు బాగా వ్యాపింపచెయ్యడంలో రామాయణం విశేషంగా తోడ్పడింది. రామాయణంలో కూడా శంబుక వధ లాంటి వర్ణ వివక్ష వున్నా, అది అనువాదాల్లోలేదు. అను వాదాల్లో భక్తి ప్రాధాన్యం మాత్రమే ఉంది.
క్షీణయుగం (క్రీ.శ. 1775 క్రీ.శ. 1875)
క్రీ.శ. 1775 తర్వాత ఒక శతాబ్దం మన వాఙ్మయ చరిత్రలో క్షీణ యుగంగా పరిగణింపబడుతుంది. ఈ యుగంలో కూడా సాహిత్య సృష్టి విరివిగానే జరిగింది. రాసియేగాని వాసి కనిపించదు. చోళ, పాండ్య రాజ్యాలు ఛిన్నా భిన్నమవడంతో నామ మాత్రావశిష్టాలైన జమీలు మాత్రం మిగిలాయి.
విదేశీయుల రాక కారణంగా దేశంలోని ప్రజాతంత్ర సంప్రదాయాలు నాశనమయ్యాయి. క్షీణ జమీందారీ విధానం పాదుకుంది. దానికి అనుగుణంగా క్షీణ జమీందారీ సాహిత్యం తంజావూరు మొదలైన చోట్ల వెర్రితలలు వేసింది. నృత్య సంగీత ప్రియత్వమనే పౌర భోగప్రియత్వం ముదిరింది. అల్లసాని పెద్దన ఎంతటి శృంగార ప్రబంధం రచించినా ధర్మ ప్రభోధాన్ని విస్మరించలేదు. ఇప్పుడలా కాక ఐహిక సుఖవాంఛలకు దోహదం చేసే, కామ శృంగార ప్రేరకాలైన ప్రబంధాలే కుప్పలు తెప్పలుగా రాసాగాయి. అనుకరణశీలం పెరిగింది. చిత్ర కవిత్వంపై మమకారం హెచ్చింది. పిల్ల వసు చరిత్రలు పెచ్చుమీరాయి. ప్రబంధ కవిత్వం బంధ కవిత్వంగా దిగజారింది. ఆంధ్ర సాహిత్య రంగంలో ఏ యుగంలోనూ లేని రాధికా సాంత్వనము వంటి ముద్ర శృంగార కావ్యాలు, శ్లేషకావ్యాలూ బయలుదేరాయి. వాటిలో కొన్ని త్ర్యర్థులు, చతురర్థులు కూడా వెలిశాయి. 19 వ శతాబ్ది మధ్యభాగం వరకు యిట్టి స్థితే కొనసాగింది. ప్రబంధాలకు వసుచరిత్ర, ద్వ్యర్థి కావ్యాలకు రాఘవ పాండవీయము మాతృకలయ్యాయి. అదే ఎత్తుగడ, అవే సన్నివేశాలు, అవే పాత్రలు, అదే కథా శరీరం, అదే నిర్వహణం. ఇలా గతానుగతిగంగా రచనలు సాగాయి. వీరేశలింగం పంతులుగారి అవతరణంతో ఆంధ్ర సాహితి గ్రహణం నుండి తొలగి వెనుకటి కాంతితో కలకలలాడింది.
భారతదేశంలో సాంఘిక స్థితి
18 వ శతాబ్దంలో విద్యావికాసం మృగ్యం. ‘కంపెనీ’ పరిపాలన కాలంలో దేశీయులు ఆజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడారు.
రాజారామమోహనరాయలు
భారతదేశంలో ఇంగ్లీషు విద్య ప్రబలటానికి అతడే మూలపురుషుడు. 1835 లో మెకాలే ఇంగ్లీషు విద్యా విధానం అమల్లోకి వచ్చింది. బ్రహ్మసమాజ స్థాపనం, సహగమన నిర్మూలనం, సంఘ దురాచార నిరసనం, ఆధునిక విజ్ఞాన వ్యాపకం, అసంఖ్యాక గ్రంథ రచన సాగాయి.
రామమోహనరాయ్ ‘సంవాద కౌముది’ పత్రిక నిర్వహించాడు. సంఘ సంస్కరణకోసం, ఆధునిక భావవ్యాప్తి కోసం ఆంగ్ల, సంస్కృత, వంగ, పారశీకాది భాషల్లో అసంఖ్యాకంగా వ్యాస రచన చేశాడు.
ఆంగ్ల విద్యావ్యాప్తి-జాతీయ చైతన్యం
ఆంగ్ల విద్యావ్యాప్తి ఫలితంగా దేశీయుల్లో స్వదేశోద్ధరణ సంకల్పం బల పడ సాగింది. వినూత్న హేతువాద దృక్పథంతో ప్రాచీన సంస్కృత గ్రంథాల పరిశీలన ప్రారంభమైంది. మాతృదేశ భాషలతోబాటు ఇంగ్లీషులో కూడ రచనలు చెయ్యసాగారు.
మద్రాసులో 1812 లో కళాశాల స్థాపన జరిగింది. ఈ కళాశాలలో తెలుగు నేర్చుకున్నవారే క్యాంబెల్, విలియం బ్రౌన్, సి.పి. బ్రౌన్ మొదలైన వారు. వీరు తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రాసి సారస్వతానికెంతో సేవ చేశారు.
1833 లో ఏనుగుల వీరాస్వామయ్య, పెండాకం రాఘవాచార్యులు, శ్రీనివాసపిళ్ళ కలిసి హిందూ లిటరరీ సొసైటీని స్థాపించారు. దాని తరపున యిప్పించబడిన ఉపన్యాసాలతో మద్రాసు పౌరుల్లో, దక్షిణాది ప్రజల్లో అపూర్వ రాజకీయ చైతన్యం వెల్లివిరిసింది.
1841 లో మద్రాసు యూనివర్శిటీ స్థాపన.
1844 లో ‘చెన్నపట్టణ స్వదేశ సంఘం’..
1846లో మహజరు.
1875 నాటి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం.
1878 లో హిందూపత్రిక స్థాపన.
1885 లో హ్యూము దొరచే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన.
19వ శతాబ్ది చివర భాగంలో భారత విద్యాధికుల్లో విశేషంగా వైజ్ఞానిక సంచలనం.
1893 లో చికాగోలో వివేకానందుని ఉపన్యాసం. వివేకానందుని యితర ఉపన్యాసాలు, లేఖలు, నాటి జాతీయ చైతన్యన్పూర్తికి దోహదం చేశాయి.
బ్రౌను భాషా సేవ
క్రైస్తవమత ప్రచారకులకోసం తెలుగు భాషలో నిఘంటు నిర్మాణం జరిగింది. కాంబెల్ నిఘంటువుకున్న సమగ్రమైన రెండు నిఘంటువులను బ్రౌను 1852 లో ప్రచురించాడు (ఆంధ్రాంగ్ల, ఆంగ్లాంధ్ర). 1833 లో తెలుగు సాహిత్యంపై వ్యాసం, 1844 లో తెనుగు వ్యాకరణం రచించాడు. తెలుగు భాషకు బ్రౌనుదొర అమరసింహుని వంటివాడు. వేమన శతకాన్ని ఇంగ్లీషులోకి అనువదింపచేసి ప్రచురించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర, శ్రీ మదాంధ్ర భాగ వతములను తొలిసారిగా ముద్రింపచేసినవాడు బ్రౌను. ఈనాడు అచ్చు లిపిలో వున్న కొన్ని ‘వత్తు’లను ఆయనే కనిపెట్టాడు.
వచన రచనా పరిణామం
తెలుగులో వచనం ముఖ్యంగా మూడు శాఖల్లో వికాసాన్ని పొందింది.
1. ప్రాఙ్నన్నయ యుగం నుంచి నాయకరాజుల యుగం వరకు ఆయా వంశాల రాజులు ప్రకటించిన శిలాతామ్ర శాసనాలు.
2. చంపూ (గద్య పద్యాత్మక) కావ్యాలు.
3. వచనైక రచనలు.
శాసనాలు
మనకు లభించిన శాసనాల్లో గద్య శాసనాలే మొదటివి.
క్రీ.శ. 7వ శతాబ్దినాటి చోళ మహారాజు ‘ఉరుటూరు’ శాసనం క్రీ.శ. 9 వ శతాబ్దంనాటి చాళుక్యభీముని ‘కొరవి’ శాసనం వచనంలో ఉన్నాయి.
కాకతీయ యుగ శాసనాలు గద్య పద్యమయంగా ఉన్నాయి. వీటికి ఉప్పరపల్లి శాసనం ఒక ఉదాహరణ.
14-15 శతాబ్దాలనాటి చీమకుర్తి శాసనం వ్యవహారిక వచనంలో వుంది.
పెక్కు విజయనగర రాజ్య శాసనాలు వ్యవహారిక వచనంలో ఉన్నాయి. ఈ శాసనాల్లో చూర్ణికలు, ఉత్కళికా ప్రాయాలు, ఒక్కొక్కసారి పద్య గంధులు అనే వచన వైవిధ్యాలు కూడా ఉన్నాయి.
వ్యవహారిక భాష తెలుగులో ఒక పరిణతిని పొంది పరిపూర్ణత్వాన్ని ప్రయోజనాన్ని, పొందడం విజయనగర యుగ శాసనాల్లో కన్పించే ప్రత్యేకత.
విజయరాఘవ నాయకుడు రజత పత్రంపై వేయించిన ‘నమ్మిక’ శాసనం ఇండొనేషియాలోని బడేవియా మ్యూజియంలో భద్రపరుపబడింది. ఈ ‘నమ్మిక’ శాసనం డచ్చివారికి వ్యాపార నియమాలను విధిస్తూ ప్రకటించిన శాసనం. ఇది దానపత్రం కాదు. నమ్మిక పత్రం (అగ్రిమెంటు) మాత్రమే. ఇందులో, వోలందా, కుంపునీ, పరంగి మొదలైన అన్యభాషా పదాలు కని పిస్తాయి.
ఈ శాసనాలన్నింటిలోనూ ఆనాటి సాంఘిక రాజకీయ భాషా విశేషాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
ఆంధ్రమహాభారతం-వచన రచన
సలక్షణమైన గద్యానికి కూడా ఆద్యుడు నన్నయభట్టే. మహాభారతం చంపూ కావ్యం. నన్నయ భారత భాగంలో మూడవవంతు గద్యం వుంది.
కథ చెప్పేచోట్ల, సంభాషణలు, అందునా చిన్నవి చెప్పేచోట్ల నన్నయ వచనాన్నే ఉపయోగించాడు.
నన్నయ కవిత్వంలోని ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థసూక్తి నిధిత్వం అనే నల్లక్షణాలు ఆయన వచనంలోకూడా కనిపిస్తాయి.
తిక్కన భారత భాగంలో వచన పరిమాణం యిరవైశాతం మాత్రమే కనిపిస్తుంది. తిక్కన వచనంలో దేశ్యపదాలు అధికంగా కనిపిస్తాయి.
ఎర్రన అంగవర్ణన వచనం, స్తంభోద్భవ వచనం అనే శీర్షికలతో ప్రత్యేక వచనాలను రచించాడు.
పోతన శ్రీనాథులు
పోతన స్తుతి వచనాలు రచించాడు. పోతన పద్యాలకు వలెనే వచనాలకు కూడా అలంకారిక రచన కారణంగా ఒక వింత సొగసు సమకూడింది.
శ్రీనాథుడు కూడ తన గ్రంథాలను చంపువులుగానే రచించాడు. శ్రీనాథుడు తన వచన రచనపట్ల విశేషమైన శ్రద్ధ కనబరచి, వచనాన్ని సముచితంగా వినియోగించాడు.
ప్రబంధాలు
16వ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధాల్లో వచనం శాతం పది పదిహేను శాతం మాత్రమే కనిపిస్తుంది. ప్రబంధకర్తలు వచన రచనలో కఠిన శైలినే అవలంబించారు. వారు తమ వచన రచనను తమ పాండితీ ప్రకర్ష ప్రదర్శనానికే వినియోగించారు. మొత్తంమీద ప్రబంధ కర్తల చేతుల్లో తెలుగు వచనం శైలీ పరిపుష్టిని సంతరించుకుంది.
వచనైక రచనలు- స్తుతి వచనాలు
కన్నడ, సంస్కృత భాషల్లో వెలువడ్డ శైవ, వైష్ణవ స్తుతి వచనాలు తెలుగులో వెలువడ్డ స్తుతి వచనాలకు మార్గదర్శకాలైనాయి. స్తుతి వచనాలు వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ భక్తి ప్రధానాంగమై ఉంటుంది.
ఓరుగల్లు పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనాలు ప్రసిద్ధమైనవి. ఈయన రచించిన వచనాలు నాలుగు లక్షలదాకా వున్నట్లు ప్రతీతి.
తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు వేంకటేశ్వర వచనాలనే పేర కొన్ని వచనాలను రచించాడు.
ఈ వచన రచయితలు పోతన వంటి రచయితలను, తాళ్ళపాక అన్న మాచార్యులవంటి గేయ రచయితలను ప్రభావితం చేశారు.
శఠకోప విన్నపాలు, శేషగిరినాథ విన్నపాలు ఈ రకమైనవే.
శైవ సంబంధమైన వచనాల్లో భవానీ మనోహర వచనాలు, గంగాధరయ్య వచనాలు, కాశికాధీశ్వర వచనాలు మొదలై నవి పేర్కొనదగినవి.
చారిత్రక రచనలు
చరిత్ర రచనకు పద్యంకంటే వచనమే అనువైనది. క్రీ. శ. 16వ శతాబ్దంలో ఏకామ్రనాథుడు అనే రచయిత ‘ప్రతాప చరిత్ర’ అనే తొలి వచన చారిత్రక గ్రంథాన్ని రచించాడు. దీనిలోని అంశాల్లో చాలవరకు చారిత్రకంగా యధార్థాలని చారిత్రకులు విశ్వసిస్తున్నారు.
ఈ రకమైన మరో పుస్తకం ‘రాయవాచకం’. 16వ శతాబ్దంనాటి విశ్వనాథ నాయకుని స్థానాపతి యీ గ్రంథాన్ని రచించాడు. వ్యవహారిక భాషలో రచింపబడిన ఈ గ్రంథంలో మాండలికాలు, అనేక అన్యభాషా పదాలు వాడబడ్డాయి. దీనిలో నీతి, రాజనీతి వర్ణింపబడ్డాయి. ‘కర్నాట రాజవృత్తాంతము’, ‘తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర’ నాటి భాషా స్వరూపాన్ని తెలిపే చక్కని వచనగ్రంధాలు.
దాక్షిణాత్య యుగం
విజయనగర రాజ్య పతనానంతరం ఆంధ్ర సాహిత్యరంగం తంజా వూరు, మధుర, పుదుక్కోట మైసూరు మొదలైన దక్షిణాది రాజ్యాలకు మారింది. క్రీ. శ. 17, 18 శతాబ్దాల్లో ఈ ప్రాంతాల్లో వచన వాఙ్మయం బహుముఖాలుగా వికాసం చెందింది.
క్షేత్ర మాహాత్మ్యాదులు
క్షేత్ర మాహాత్మ్యాలే. స్థల పురాణాలు. శ్రీరంగ మాహాత్మ్యం అనే వచన కావ్యాన్ని, విజయరంగ చొక్కనాథుడు (1706-32) రచించాడు. ఈయనే మామ మహాత్మ్యం కూడా రచించాడు. లింగనమఖి శ్రీ కామేశ్వరకవి ధేను మహాత్మ్యాన్ని రచించాడు. వ్యావహారిక పద ప్రయోగాలు దీని ప్రత్యేకత. కరువెనంజరాజు రచించిన ‘హాలాస్య మాహాత్మ్యం’ యిటువంటి వచన కావ్యమే. ఈయనే ‘కాశీ మహిమార్థ దర్పణం’ కూడా రచించాడు. కాశీనగర క్షేత్ర విశేషాలు శిష్ట వ్యవహారిక భాషలో యీ గ్రంథంలో వర్ణింపబడ్డాయి. ఇవిగాక గజారణ్య మాహాత్మ్యం, వేంకటాచల మాహాత్మ్యం, వైశాఖ మహాత్మ్యం అనేవి కూడా అదే కాలంలో వెలువడ్డ వచన గ్రంథాలు.
పౌరాణిక వచన కావ్యాలు
దాక్షిణాత్య యుగంలో పలురకాల పురాణాలు వచనంలో రచింప బడ్డాయి.
ఎల్ల కర నృసింహకవి రచించిన భారత సావిత్రి అనే రచన గ్రంథం బహుళ ప్రచారం పొందింది.
సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు తన జైమిని భారతంలో శృంగార వీర భయానక రసాలనేకాక హాస్యాన్ని కూడా చక్కగా పోషించాడు.
క్రీ.శ. 17వ శతాబ్దంలో మైసూరును పాలించిన చిక్కదేవరాయల కాలంలో నివసించిన కళువె వీరరాజు రచించిన వచన భారతం, తుపాకుల అనంత భూపాలుని అనుశాసనిక పర్వం. నారాయణీయమనే వచన శాంతి పర్వం భారత సంబంధియైన వచన రచనలు.
విజయరంగ చొక్కనాథుడు మధురను పాలించినకాలంలో శ్యామరాయ కవి రామాయణాన్ని వచనంలో రాశాడు.
తుపాకుల అనంత భూపాలుడు రచించిన విష్ణుపురాణం, మార్కండేయ కథ, పుష్పగిరి తిమ్మన రాసిన భాగవతసారము, మాచనామాత్యుని బ్రహ్మాండ వచనము పౌరాణిక వచన గ్రంథాలు.
తత్వశాస్త్ర గ్రంథాలు
తెలుగులో తత్వశాస్త్ర గ్రంథాలు అనేకం వ్యవహారిక వచనంలో రచింపబడ్డాయి. ‘సాత్విక బ్రహ్మ విద్యా విలాసం’, ‘వేదాంత సార సంగ్రహం’, ‘అజ్ఞాన ధ్వాంత చండ భాస్కరం’, ‘వాసుదేవ మననం’ మొద లైన అనేక వచన గ్రంథాలు వాడుకలో ఉండేవి.
వివిధ శాస్త్ర గ్రంథాలుకూడా 19 వ శతాబ్దంలో ప్రచారంలో ఉండేవి. అల్లాడి రామచంద్రశాస్త్రి గారి ‘సిద్దాంత శిరోమణి’ క్రీ.శ. 1837). భూగోళ దీపిక (క్రీ.శ. 1843),వఠ్యం వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రులవారి జాన్ ఫ్రై యర్టామస్బూ పాలీయమనే ‘వ్యవహార దర్పణం’ (క్రీ.శ.1851) మొదలైన అనేక వచన శాస్త్ర గ్రంథాలు ప్రచారంలో ఉండేవి.
అలాగే, దత్తాత్రేయ యోగి ‘వేదాంత వ్యవహార సార సంగ్రహం” దాన గోస్వామి ‘పరమానంద బోధ ప్రకరణం’, పెద్దరామకవి ‘ప్రభుదేవర వాక్యం’, కాశీ బసవేశ్వరుని ‘వివేక సింధువు’, ‘వివేక చింతామణి’, ‘క్రిస్మిన్ వేద కథా సంక్షేపం’, సృష్టి రహస్యం అనే క్రైస్తవమిత గ్రంథాలూ, 17, 18 శతాబ్దాలో ప్రచారంలో వుండేవి.
తెలుగుదేశంలో ఇంగ్లీషు విద్యా ప్రారంభంతో కథా వాఙ్మయం ప్రారంభమైంది. క్రీ.శ. 1811లో యెర్రమిల్లి మల్లికార్జునుడు ‘చార్ దర్విషు’ కథలు వ్యావహారిక భాషలో అనువదించాడు.
క్రీ.శ. 1819లో ‘విక్రమార్కుని కథలు’, క్రీ.శ. 1884లో ‘పంచ తంత్ర కథలు’ రావిపాటి గురుమూర్తి శాస్త్రి రచించాడు. కాంభోజరాజు కథలు తెనాలి రాముని కథలు, శుక సపతి కథలు, బేతాళ పంచ వింశతి, పలుకని పద్మాక్షి కథలు విస్తృత వ్యాప్తిని పొందాయి. వీటిలో చాలవరకు వాడుక భాషలో ఉండటం గమనార్హం.
క్రీ.శ. 1820- క్రీ.శ. 1856 మధ్య పుదూరి సీతారామశాస్త్రి గారి ‘పెద్ద బాలశిక్ష’ మొదలుకొని పెద్ద తరగతుల్లో బోధించే అనేక బడి పుస్తకాలు వెలువడ్డాయి.
క్రీ.శ. 1856లో ‘జానుబన్యను చరిత్ర’ ‘అమెరికాను కనిపెట్టిన చరిత్ర’, ‘మహమ్మదు చరిత్ర’ మొదలైనవి వెలువడ్డాయి.
దాదాపు అదే కాలంలో సి పి. బ్రౌనుదొర పెక్కుమంది పండితుల సాయంతో తెలుగు భాషా వాఙ్మయాల విషయంలో విశేష పరిశోధన చేసి ప్రాచీన గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, ప్రచురింపచేశాడు. వాడుక భాషలో నిఘంటువులు ప్రచురించారు.
వీరేశలింగంగారు – సంఘ సంస్కరణోద్యమం
ఫ్రాన్సు దేశంలో వాల్టేరు వలె ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణకోసం తన కలాన్ని ఖడ్గ సదృశంగా వాడిన మహాపురుషుడు వీరేశలింగం. సాంఘిక దురాచార నిర్మూలనంలో, బహుముఖ సాహితీ ప్రక్రియ సృష్టిలో, ఆంధ్ర జాతీయతా ప్రచారంలో ఆయనే పితామహులు.
తెలుగుభాషలో మృదువైన, సరళమైన సలక్షణ వచన రచనకు ఆద్యులు. 1881 నాటక సమాజస్థాపన చేశారు. 1881 డిసెంబరు 1న రాజ మహేంద్రవరంలో మొదటి వితంతు వివాహం చేశారు.
సంఘ సంస్కరణోద్యమంతో బాటు తెలుగు సాహిత్యంలో కొత్తపుంతలు తొక్కినదీయనే.
కావ్య నాటకాలే కాక తెలుగులో ప్రకృతిశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, శారీర శాస్త్రము, పదార్ధ వివేచనా శాస్త్రము, భౌతిక, భూగోళ శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు, అలంకార సంగ్రహము, ఆంధ్ర తర్క సంగ్రహం మొదలైన బహువిధ వాఙ్మయ సృష్టిచేసిన మహామనీషి ఆయన.
ఆయన అయిదవ వాచకం మొదలుకొని ఆంధ్రకవుల చరిత్రవరకు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
“తెనుగులో వచన ప్రబంధమును నేనే చేసితిని. మొదటి నాటకమును నేనే తెలిగించితిని. మొదటి ప్రకృతి శాస్త్రమును నేనే రచించితిని. మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని. మొదటి చరిత్రమును నేనే రచించితిని. స్త్రీల కై మొదటి వచన పుస్తకమును నేనే కావించితిని.” అన్నారాయన.
19 వ శతాబ్దిలో కొందరు కవులు -వారి కవితా రీతులు
19 వ శతాబ్ది రచయితల్లో ప్రధమగణ్యుడు చిన్నయసూరి.
మతుకుమల్లి నృసింహకవి (1816-73) ‘ఆజచరిత్ర’మను ప్రౌఢ ప్రబంధం రచించాడు.
1860లో ‘చెన్నపురీ విలాసం’ రచించాడు. కోకొల్లలుగా ఆంగ్ల పదములను ప్రయోగించి సమకాలిక సమాజ స్థితిగతులను చిత్రించిన కావ్యమిది.
మండపాక పార్వతీశ్వరశాస్త్రి ‘ఆత్మచర్య’ అనే పద్యబద్ధమైన స్వీయ చరిత్ర రాశారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి జాతక చర్యకు దారిచూపిన కావ్యమిది.
మాడభూషి వెంకటాచార్యులు
‘భారతాభ్యుదయ ‘మనే ప్రౌఢ ప్రబంధం రచించారు. అవధానాలను బహుళ ప్రచురితాలుగా చేశాడు.
కొక్కొండ వెంకటరత్నం పంతులు
భాషా విషయికంగాను, రచనా విషయికంగాను అత్యంత సాంప్రదాయికులు. బిల్వేశ్వరీయం, కుమార నృసింహం. మొదలైన గ్రంథాలు రచించాడు. వెండి, బంగారం మొదలైన పేర్లతో కొత్త వృత్తాలను సృష్టించాడు.
ఆదిభట్ల నారాయణదాసు
‘ఉమరుఖయ్యాము’ తొలి తెలుగు అనువాదం చేశారు. అనేక హరి కథలు యక్షగానాలు రచించారు.
వావిలాల వాసుదేవ శాస్త్రి
మొత్తం గీత పద్యాల్లో ‘నందకరాజ్యం’ అనే నాటకం రాశారు.
వేదం వెంకటరాయ శాస్త్రి
కవిత్వంలో కొత్త ప్రయోగమేమీ చేయకపోయినా నాటక రచనలో గొప్ప స్వేచ్ఛ కనపరిచారు. ‘ప్రతాపరుద్రీయం’ రచించారు. వ్యావహారిక భాషకు తొలిసారిగా ‘గ్రాంధికత’ కల్పించారు. వీరి తర్వాతనే గురజాడ వ్యావహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రచించారు.
దేవులపల్లి సుబ్బరాయకవి
‘మహేంద్ర విజయం’ రచించారు.
శొంఠి భద్రాద్రి రామశాస్త్రి
చిత్రసీమ రచించారు.
మేడేపల్లి వెంకటరమణాచార్యులు
‘దేవవ్రత చరిత్ర’ రచించారు. నాటకీయత దీని ప్రత్యేకత.
దాసు శ్రీరాములు
‘తెలుగునాడు’ రచించారు. ‘చంద్రశేఖర శతకము’లో వ్యావహారిక భాషను అధిక్షేపకంగా ప్రయోగించారు.
ఆచంట వెంకటసాంఖ్యాయనశర్మ
1892: ఆంధ్ర పద్యావళి రచించారు. సంఘ సంస్కరణకోసం కవిత్వం వ్రాసిన 19వ శతాబ్ది రచయితల్లో ఈయన గణనీయుడు.
19 వ శతాబ్దిలో వెలువడిన కవిత్వం చాలవరకు నలిగిన బాటలోనే నడిచింది. ఆ వెలువడిన కావ్యాలలో ముప్పాతిక మువ్వీసము వసుచరిత్రాదులను ముందుంచుకొని వెలువడినవే.
చిన్నయ సూరి
క్రీ.శ. 1857 వ సంవత్సరం రాజకీయంగానే కాక సాంస్కృతికంగా కూడా భారతదేశానికి ముఖ్యమైంది. 1857 లో మద్రాసు విశ్వవిద్యాలయ స్థాపన జరిగి, అందులో తెలుగుభాష పఠనీయమైంది. అప్పటికి ప్రభుత్వ కళాశాలలో పండితుడుగా, ఉపయుక్త గ్రంథకరణ దేశభాషా సభకు అధ్యక్షు డిగా పలుకుబడి కలిగివున్న పరవస్తు చిన్నయసూరి మిత్రలాభం, మిత్రభేదం అనే రెండు భాగాలను ఒకరకమైన కృతక గ్రాంధిక శైలిలో రచించాడు. వాటికి పాఠ్యాంశాలుగా ఉండే అవకాశం లభించింది. దానితో, ఆ రకమైన కృతక వచనానికి గిరాకీ ఏర్పడింది. రాజధాని కళాశాలలో ప్రధాన పండితులైన కొక్కొండ వేంకటరత్నంగారు గ్రాంథిక భాషోద్యమాన్ని స్థిరీకరించారు. వీరి ‘విగ్రహం’ 1872 లో పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడింది.
ఆ విధంగా విశ్వవిద్యాలయంలో ఒక వంక గ్రాంథిక వచన గ్రంథాలు ప్రాబల్యం సంపాదించుకొంటే ప్రజాసామాన్యంలో పరమానంద గురువుల కథలు (1861), తడకమళ్ళ వెంకటకృష్ణారావు రాసిన అరేబియన్ నైట్స్ కథలు (1862), కంబుధర చరిత్ర (1966), ఎర్రమిల్లి మల్లికార్జునుడి దారు దర్వీసు కథలు (1881), చదలువాడ సీతారామశాస్త్రి దక్కను పూర్వ కథలు వ్యావహారిక భాషలో వెలువడి విశేష ప్రచారం పొందాయి.
మరోవంక సులభ గ్రాంథికంలో సుబ్బరాయలు నాయనివారి దశావతార చరిత్ర సంగ్రహం 1861), తిమ్మరాజు లక్ష్మణరాయకవి మార్కండేయ పురాణసార సంగ్రహం (1876), శ్రీ కూర్మ పురాణ సంగ్రహం (1877) మొదలైన గ్రంథాలు వెలువడ్డాయి.
రావిపాటి గురుమూర్తిశాస్త్రి క్రీ.శ. 1834 లో వ్యావహారిక భాషలో రచించి ప్రచురించిన ‘పంచతంత్రం’ క్రీ.శ. 1870 వరకు అనేక ముద్రణల్లో వ్యావహారికంలో వుండి, తర్వాత కావ్యభాషలోకి మారిపోయి అచ్చుపడింది.
విశ్వవిద్యాలయంలో గ్రాంథిక వచన రచనకు చోటు దొరకటంతో నోట పలికే మాటకూ, చేతి వ్రాతకూ ఉండవలసిన సాన్నిహిత్యం విచ్ఛిన్నమైపోయింది.
వీరేశలింగం
‘సంధి’ని గ్రాంథికంలో రచించిన వీరేశలింగం పంతులుగారు వచన రచనకు గ్రాంథికం ఎంతమాత్రం పనికిరాదని గ్రహించి, తదుపరి రచనల్లో సులభ గ్రాంథికాన్నీ, ప్రహసనాదుల రచనలో వ్యావహారిక భాషనూ వాడనారంభించారు.
1890 లో వీరేశలింగంగారు రచనలు వెలువడినప్పటినుంచి తెలుగు రచనలపై ఆంగ్లభాషా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 1899 నాటికి వీరేశ లింగంగారి రచనలన్నీ సంపుటాలుగా వెలువడ్డాయి. వీరి రచనల్లో శైలీ కాఠిన్యంలేదు.
వీరేశలింగంగారితో ప్రారంభమైన ఆధునిక వచన వాఙ్మయం నవల, నాటకం, కథ, వచన సాహిత్యం, శాస్త్రగ్రంథాలు, చరిత్రవ్యాసం, పత్రికా రచన మొదలైన అనేక శాఖలుగా విస్తరించింది.
నవలా ప్రక్రియలో కొక్కొండ వెంకటరత్నం మహాశ్వేత (1857) , నరహరి గోపాలకృష్ణయ్య సెట్టి రంగరాయ చరిత్ర (1872), వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర, ఖండవిల్లి రామచంద్రుడు ధర్మవతీ విలాసం తల్లా ప్రగడ సూర్యనారాయణరావు సంజీవరాయ చరిత్ర, చిలకమర్తి నరసింహం రామచంద్ర విజయం, అహల్యాబాయి (1897). కర్పూర మంజరి (1898) మొదలైనవి వెలువడ్డాయి.
చారిత్రక వచన గ్రంథాల్లో బుక్కపట్టణం రాఘవాచార్యులు తెలుగు రాజుల చరిత్ర (1881), ఒడయరు వీరనాగయ్య, బెండపూడి అన్న మంత్రి చరిత్ర (1881), చాణక్య చరిత్ర (1885), తిమ్మరుసు చరిత్ర (1898) వెలువడ్డాయి.
వీరేశలింగంగారు తెలుగు వచన వికాసానికి విశేషంగా తోడ్పడ్డారు. సులభ గ్రాంథికంలో ఉండే తన రచనలను సంఘ సంస్కారోద్యమానికొక ఆయుధంగా వినియోగించారు. తాను ‘సంధి’ రచనకు ఉపయోగించిన కృతక గ్రాంథికం వచన రచనకు అనువైనది కాదని గ్రహించిన వీరేశలింగంగారు సులభ గ్రాంథికాన్ని గ్రహించి, తరువాత ప్రారంభమైన వ్యావహారిక భాషోద్య మానికి పూర్వరంగం తయారు చేశారు.
(‘ఆంధ్రప్రదేశ్ దర్శిని‘ కోసం 1976 లో రచింపబడిన వ్యాసం)
* * *