ఒడెస్సా నుంచి స్వెస్తాపోల్ కి ప్రయాణిస్తున్న స్టీమర్ డెక్ మీద గుండ్రటి, చిన్న గెడ్డం కలిగిన ఒక చూడచక్కని పెద్దమనిషి పొగ కోసం నా వద్దకు వచ్చి,ఇలా అన్నాడు:
“ఆ నీడ పట్టున కూర్చున్న జర్మన్ లను చూసేరా? ఎక్కడైనా ఆంగ్లేయులు కానీ ,జర్మన్ లు గానీ కలిసేరంటే వారు పంటల గురించీ,ఊలు ధరల గురించీ, లేదా తమ వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడుకుంటారు.అదే మన రష్యన్ లు నలుగురు ఒక చోట కూడేరంటే మాత్రం ఆడోళ్ళ గురించో అమూర్త భావాల గురించో మాట్లాడుకుంటాం. అదే ముఖ్యంగా …ఆడాళ్ళ గురించి …”
ఈ మనిషి మొహం నాకు యిప్పటికే సుపరిచితం. ముందు రోజు సాయంత్రం మేమిద్దరం ఒకే రైలు బండిలో విదేశాల నుంచి వచ్చేం. వొలోభిస్క్ దగ్గర సామాను పరీక్ష జరుగుతున్నప్పుడు అతను తనతో కలిసి ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు పర్వతంలా ఉన్న ట్రంకు పెట్టెలు,బుట్టల ముందు నిలబడి ఉన్నాడు. వాటి నిండా ఆడాళ్ళ దుస్తులున్నాయి. ఏవో సిల్కు గుడ్డల కోసం సుంకం చెల్లించాల్సి వచ్చినప్పుడు అతని మొహం వాడిపోయి దిగులుగా కనిపించింది. అతనితో ఉన్న మహిళ అభ్యంతరం చెప్తూ, ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఆ తరువాత,ఒడెస్సాకు ప్రయాణిస్తున్నప్పుడు,అతను బజ్జీలు,నారింజ పళ్ళు తీసుకుని ఆడాళ్ళ బోగీలోకి వెళ్ళడం చూసేను.
అంతా తేమగా ఉంది. పడవ కాస్త ఊగిసలాడుతోంది. ఆడాళ్ళంతా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయేరు.
ఆ చిన్ని గుండ్రని గెడ్డం మనిషి నా ప్రక్కన కూర్చుని కొనసాగించేడు:
“అవును.నలుగురు రష్యన్ లు కలిసేరంటే,ఆడాళ్ళ గురించీ,అమూర్త విషయాల గురించీ తప్ప వేరే మాట్లాడరు. మనం ఎంత గంభీరమైన మేధావులమంటే మనం ‘సత్యం’ గురించి తప్ప వేరే ఏమి మాట్లాడం. చాలా ఉన్నతమైన విషయాల గురించి మాత్రమే చర్చిస్తాం. అసలు రష్యన్ నటులకు హాస్యం అంటే తెలియదు. అతను హాస్యనాటకంలో కూడా చాలా గంభీరంగా నటిస్తాడు. మనమంతా ఒకేలా ఉంటాం. స్వల్ప విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా ఉన్నత స్థాయి నుంచి చూసి మాట్లాడతాం.దీనికి కారణం మనకు నిజాయితీ,ధైర్యం లేకపోవడమే. మనం నిరాడంబరంగా ఉండలేం. నా ఉద్దేశ్యంలో మనం తరచూ ఆడాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతామంటే ,మనం సంతృప్తిగా లేం కనుక. మనం ఆడాళ్ళ గురించి మరీ ఆదర్శంగా ఊహించుకుంటాం. జీవితం వాస్తవంగా మనకి ఏమివ్వగలదో దాని కంటె అతిగా ఆశిస్తాం.మనం అనుకున్నదానికి పూర్తిగా భిన్నమైనది మనకు దక్కుతుంది. ఫలితం అసంతృప్తి,పగిలిన కలలు,మానసిక వేదన. ఎవరైనా బాధపడుతున్నారంటే వాడు దాన్ని వ్యక్తపరిచే తీరాలి.ఈ రకమైన సంభాషణ మీకు విసుగ్గా లేదు కదా?”
“అబ్బే,ఏ మాత్రం లేదు.”
“అలా అయితే,నన్ను నేను పరిచయం చేసుకుంటాను”,అన్నాడు నా సహచరుడు తన జాగా నుంచి పైకి లేస్తూ.
“నా పేరు ఇవాన్ ఇల్విచ్ షమొహిన్. మాస్కోలో ఒక మాదిరి భూస్వామిని. మీ గురించి నాకు బాగా తెలుసును.”
అతను కూర్చుని,నా వంక అభిమానంగా చూస్తూ కొనసాగించాడు”
“మాక్స్ నోర్డు లాంటి ముదురైన తత్వవేత్త ఆడాళ్ళ గురించి ఇలా విపరీతంగా మాట్లాడటం అనేది ఒక రకమైన కామావేశం అనీ,మద పిచ్చి అనీ లేదా మనం బానిసయాజమానులం కనుక అలా మాట్లాడతామనీ చెప్పొచ్చు,దాని మీద నా అభిప్రాయం ఊర్తి భిన్నంగా ఉంటుంది.నా ఉద్దేశ్యంలో మనం ఆదర్శవాదులం కనుక మనం అసంతృప్తిగా ఉన్నాం.మననీ,మన పిల్లలనీ కనేవాళ్ళు మన కంటె, ప్రపంచమంతటి కంటె ఉన్నతంగా ఉండాలని మన భావన. చిన్న వయసులో ఉన్నప్పుడు మనం ప్రేమించిన వాళ్ళని ఆరాధిస్తాం,వారిపై కవిత్వం రాస్తాం.మనకి ప్రేమ,ఆనందం పర్యాయపదాలు. మన రష్యాలో ప్రేమ లేని వివాహాన్ని చిన్న చూపు చూస్తారు; విషయాసక్తిని వింతగానూ,వ్యగ్రతతో చూస్తారు. అందమైన,కవితాత్మకమైన,ఔన్నత్యం కల మహిళలకు సంబంధించిన గాథలే విజయం సాధిస్తాయి. రష్యన్ లు రఫేల్ గారి మడొన్నాను ఏళ్ళ తరబడి ఆరాధించినా, స్త్రీ విముక్తిని కోరుకున్నా అందులో నటన ఏమి లేదు అని నేను భరోసా యివ్వగలను. కానీ అసలు సమస్య అంతా పెళ్ళితో మొదలౌతుంది.వివాహం చేసుకున్నా లేదా ఒక మహిళతో రెండు,మూడేళ్ళు సన్నిహితంగా మెలిగినా మన భ్రమలు తొలిగిపోయి,మనం మోసపోయామని భావిస్తాం.మళ్ళీ యితరులతో సంబంధాలు పెట్టుకుంటాం-మళ్ళీ నిరాశ పడతాం -మళ్ళీ అసహ్యించుకుంటాం -అలా చివరకు ఆడాళ్ళంతా అబద్ధాల కోరులనీ,అల్పబుద్ధి కలవారనీ,జగడాలమారులనీ,అన్యాయంగా ఉంటారనీ,వారికి మానసిక పరిణతి లేదనీ,క్రూరులనీ …అసలు మగాళ్ల కంటె వారు అధికులవడం మాట దేవుడెరుగు ….చాలా,చాలా అల్పులనీ భావిస్తాం. అంచేత ఆ అసంతృప్తి,నిరాశలలో మనం ఎంత దారుణంగా మోసపోయేమని సణుక్కోవడం తప్ప మనం చెయ్యగలిగేది ఏమి లేదు.”
షమొహిన్ మాట్లాడుతున్నప్పుడు రష్యన్ భాష,మా రష్యన్ పరిసరాలు అతనికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని నేను గ్రహించేను.బహుశా చాలాకాలం నుంచి విదేశాల్లో ఉండి మాతృదేశం మీద బెంగ పెట్టుకోవడం దీనికి కారణం అయ్యుండొచ్చు. అతను రష్యన్ లను పొగుడుతూ,వాళ్ళు ఆదర్శవాదులని వాదించినా, విదేశీయుల గురించి ఎక్కడా తేలికగా మాట్లాడకపోవడం నేను గమనించేను. అతని మనసులో ఏదో వేదన ఉందనీ,అతను ఆడాళ్ళ కంటె కూడా తన గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాడనీ,కూడా అర్థమై నేను ఒక పెద్ద కథ వినడానికి సిద్ధమయ్యేను. ఒక సీసాడు వైను తెప్పించుకుని,మేమిద్దరం చెరో గ్లాసు తాగేక, అతను ఈ రకంగా కథ మొదలుపెట్టేడు.
“వెల్ట్ మాన్ గారి నవల ఒకదానిలో ఒకడు “అదీ కథ!” అనడం నాకు గుర్తుంది. ఈలోగా మరొకతను,”అబ్బే,అది కథ కాదు.అది కేవలం కథకి ఉపోద్ఘాతమే”అంటాడు. అలాగ ఇప్పటివరకు నేను చెప్పినది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే; నేను నిజంగా వాస్తవంగా మీకు చెప్పాలనుకుంటున్నది నా ప్రేమకథ. క్షమించండి,నేను మళ్ళీ అడుగుతున్నా.ఇదంతా వినడం మీకు విసుగ్గా లేదు కదా?”
ఏ మాత్రం లేదని నేను నొక్కి చెప్పేక,అతను కొనసాగించాడు.
నా కథ మాస్కో రాష్ట్రంలో ఉత్తరాదిన ఒక జిల్లాలో జరిగింది. అక్కడి ప్రాకృతిక దృశ్యం ఒక అద్భుతమే.మా యిల్లు ఉదృతంగా ప్రవహించే ఒక సెలయేటి ఎత్తైన గట్టు మీద ఉండేది. రాత్రింబవళ్ళు నీరు గల,గల పారుతూ ఉండేది. ఒక పాతకాలపు పెద్ద తోటనీ,అందులో పూల పాన్పులు ,తేనె పట్లనీ, ఒక చిన్న వంటింటి తోటనీ, క్రిందన చక్కటి నదీ,దాని ప్రక్కన ఎత్తైన విల్లో చెట్లనూ ఊహించుకోండి. ఈ విల్లో చెట్ల మీద దట్టంగా మంచు పడినప్పుడు అది జీవం లేనట్టు బూడిదరంగులో కనిపించేవి. నదికి ఆవల వైపున ఒక గడ్డి మైదానం ఉండేది. గడ్డి మైదానం దట్టమైన పైన్ అడవి ఉండేది. ఆ అడవిలో ఎర్రటి,తియ్యటి పుట్ట గొడుగులు అసంఖ్యాకంగా ఉండేవి. మూల,మూలల్లో కంజులు నివాసం ఉండేవి. నేను మరణించి,నా శవాన్ని శవపేటికలో పెట్టేక కూడా,నేను యింకా కళ్ళను బాధించే ఆ అందమైన సూర్యోదయాల గురించి కల కంటూనే ఉంటాను. లేదా కోయిలలు,కార్న్ క్రేక్ పిట్టలు తోటలో నుంచి,గానం చేస్తూ ఉంటే,తోట ఆవల ఉన్న ఊళ్ళో౦చి హార్మోనికా సంగీతం గాలిలో తేలి వస్తూ ఉండే అందమైన వసంతకాలపు సాయంత్రాల గురించి కల కంటాను. ఆ సాయంకాలాలలో ఒక ప్రక్క యింట్లోంచి పియానో సంగీతం వినపడుతుంటే,బయట సెలయేరు గలగలమని పారుతూ ఉంటే,ఆ సంగీతాన్ని వింటూ ఎవరైనా సరే ఒకేసారి పాడాలనీ,ఏడవాలనీ అనుకుంటారు.
మాకు సాగుభూమి పెద్దగా లేదు గానీ ఆపాటి,ఈపాటి పచ్చిక మైదానం ఉండేది. దానితోనూ,అటవి ఉత్పత్తులతోనూ మాకు ఏడాదికి రెండువేల రూబుళ్ళ ఆదాయం వచ్చేది. నేను మా తండ్రికి ఏకైక కుమారుడిని. మేమిద్దరం కాస్త నిరాడంబర జీవులం కావడంతో,మా నాన్నగారి పింఛను, ఈ ఆదాయంతో మాకు బ్రహ్మాండంగా జరిగిపోయేది.
యూనివర్సిటీలో నా చదువు ముగిసేక నా మొదటి మూడేళ్ళూ మా ఎస్టేటు వ్యవహారాలు చూసుకుంటూ,ఏదో ఒక స్థానిక సంస్థ పదవికి ఎన్నిక కాకపోతానా అనే ఆశతో ఎదురు చూస్తూ ఊళ్ళోనే కాలం గడిపేను. కానీ యిక్కడ అన్నిటికంటె ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఒక అపురూప సౌందర్యవతిని పిచ్చిగా ప్రేమించేను. ఆమె మా పొరుగున ఉండే కొట్లోవిచ్ గారి చెల్లెలు.ఈ కొట్లోవిచ్ ఒక చితికిపోయిన భూస్వామి. అతని ఎస్టేట్ లో అనాస పనస కాసేది, తియ్యటి పీచ్ పళ్ళుండేవి. మెరుపు వాహకాలుండేవి. ఆవరణలో ఒక చక్కని ఫౌంటెన్ ఉండేది; కానీ అతని జేబులో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. అతను ఏ పనీ చేసేవాడు కాదు. ఏ పనీ చేతనయ్యేది కాదు. అతను ఉడకబెట్టిన చిలగడదుంపతో చేసినట్టు మెత్తగా ఉండేవాడు; అతను రైతులకు హోమియో వైద్యం చేసేవాడు. భూతవైద్యాన్ని కూడా నమ్మేవాడు. అతను చాలా మృదుస్వభావి,శాంతమంతుడు అనడానికి సందేహం లేదు. మూర్ఖుడు ఏ మాత్రం కాదు. కానీ నాకెందుకో ఈ భూత,ప్రేతాలతో సంభాషిస్తూ,అద్భుత శక్తులతో రైతు మహిళలకు వైద్యం చేసే వాళ్ళంటే ఏమాత్రం గిట్టేది కాదు. అసలు మొదటగా స్వేచ్చాయుత ఆలోచనావిధానం లేని వాళ్ళ ఆలోచనలు గజిబిజిగా ఉంటాయి. అలాంటి వాళ్ళతో మాట్లాడటమే చాలా కష్టం. మరో విషయం వాళ్ళు సాధారణంగా ఎవరినీ ప్రేమించరు; ముఖ్యంగా ఆడాళ్ళ పట్ల ఎలాంటి భావాలు ఉండవు. వాళ్ళ ఈ మార్మికత సున్నిత మనస్కులకు యిబ్బందిగా ఉంటుంది. అసలు అతని రూపురేఖలని కూడా నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదు, అతను తెల్లగా,పొడవుగా,లావుగా, చిన్న తలతో, మెరిసే చిన్ని కళ్ళతో,లావాటి తెల్లటి వేళ్ళతో ఉండేవాడు. అతను ఎవరితోనూ చేతులు కలిపేవాడు కాదు; ఎవరి చేతులనైనా తన చేతులతో పిసికేసేవాడు. అంతే కాదు,అతనెప్పుడూ క్షమించమని కోరుతూ ఉండేవాడు. ఏదైనా కావాలని అడిగే ముందు, ‘క్షమించండి’,అనేవాడు. అతను మీకేమైనా యిస్తున్నా కూడా, ‘క్షమించండి’అనేవాడు.
ఇక అతని సోదరి విషయానికి వస్తే ఆమె మాత్రం వేరే నాటకంలోంచి దిగి వచ్చిన పాత్ర.నేనిక్కడ మీకో విషయం చెప్పాలి.నాకు బాల్యంలోనూ,యవ్వనారంభ దశలోనూ ఈ కొట్లోవిచ్ లతో పెద్దగా పరిచయం లేదు.ఎందుకంటే మా నాన్నగారు ఎన్ పట్టణంలో ప్రొఫెసర్ గా ఉన్న కారణంగా మేము చాలా కాలం ఊరికి దూరంగానే ఉన్నాం.నాకు వాళ్ళతో పరిచయం ఏర్పడే వేళకి,ఆ అమ్మాయికి యిరవై రెండేళ్ళు.అప్పటికే ఆమె పాఠశాల చదువు ముగించి చాలా కాలమైంది. చదువు ముగిసేక ఆమె సంపన్నురాలైన ఒక మేనత్త దగ్గర రెండు, మూడేళ్ళు ఉండి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంది. నాకు ఆమె పరిచయమై,ఆమెతో నేను మొదటిగా మాట్లాడినప్పుడు అన్నిటికంటే ఎక్కువగా నన్ను ఆకర్షించింది ఆమె పేరు-అరియడ్నె.అది ఆమెకు అద్భుతంగా నప్పింది. ఆమెవి నల్లని ఒత్తైన కురులు. ఆమె చాలా పలచగా, మృదువుగా,కోమలంగా,అతి మనోహరంగా ఉంది. ఆమె కళ్ళు కూడా మెరుస్తూ ఉండేవి.కానీ ఆమె సోదరుడి కళ్ళు పంచదార చిలకల్లాగా నిర్జీవంగా మెరిస్తే,ఈమె కళ్ళు యవ్వనంతో,గర్వంతో,అందంతో తొణికసలాడేవి. ఆమె తొలి చూపులోనే నన్ను కట్టిపడేసింది. అది జరిగి తీరాల్సిందే కూడా. ఆ తొలి ముద్ర ఎంత బలంగా పడిందంటే,ఇవాల్టికి కూడా నేను భ్రమల్లోంచి బయటకు రాలేకపోతున్నాను. ఈ అమ్మాయిని సృష్టించినప్పుడు పకృతి ఏదో అద్భుతమైన ప్రణాళిక రచించే ఉంటుందని యిప్పటికీ నా ఊహ.
అరియడ్నె గొంతు, నడక, తన టోపీ, ఆఖరికి నదీ తీరపు యిసకలో ఆమె చేప కోసం వంగుతున్నప్పుడు ఏర్పడిన పాద ముద్రలు అన్నీ, అన్నీ నాలో ఆనందాన్ని నింపేవి, జీవితం మీద తీవ్రమైన మోహాన్ని రేకెత్తించేవి. ఆమె అందమైన మొహం, సుందరమైన చిరునవ్వుల ఆధారంగా నేను ఆమె అంతరంగాన్ని అంచనా వేసేవాడిని. ఆమె ప్రతీ మాటా, ప్రతీ నవ్వూ నన్ను సమ్మోహితుడిని చేసేది, నన్ను జయించేది. ఈ బాహ్య సౌందర్యం చూసి ఆమె మానసిక సౌందర్యాన్ని నేను అంచనా వేసేవాడిని. ఆమె చాలా స్నేహపూరితంగా, కలుపుగోలుగా ఉండేది. ఆమె నడవడిక ఎంతో సాదాసీదాగా ఉండేది. ఆమె దేవుడిని కవితాత్మకంగా విశ్వసించేది. మరణం గురించి కవితాత్మకంగా పరిశీలించేది. ఆమె ఆధ్యాత్మిక స్థితిలో ఎన్ని రకాల పార్శ్వాలుండేవంటే ఆమె తప్పులు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి. ఉదాహరణకి ఆమె ఒక కొత్త గుర్రం కావాలని కోరుకుందనుకోండి. దాన్ని కొనడానికి డబ్బులు లేవనుకోండి-అయితే ఏమయింది? ఏదో ఒక వస్తువుని అమ్మేయొచ్చు లేదా తాకట్టు పెట్టేయొచ్చు. ఒకవేళ అలా ఏమీ అమ్మటానికీ, తాకట్టు పెట్టటానికీ వీలు పడదనుకోండి -అప్పుడు యింటి పైకప్పుకి ఉన్న యినప చువ్వలని పీకేసి ఫ్యాక్టరీకి అమ్మేయడమే లేదా మంచి మంచి పనుల కాలంలో పని చేసే తన పాత గుర్రాన్ని బజారుకి తరలించి అణా, కాణీకి అమ్మేయడమే. ఈ పట్టపగ్గాల్లేని కోరికల కారణంగా యింటి వాళ్ళకి నిరాశ,నిస్పృహ కలుగుతూ ఉండేవి. కానీ ఆమె ఆ కోరికలను ఎంత చక్కగా,మర్యాదగా వ్యక్తపరిచేదంటే ఆమె కోసం అందరూ ఏమైనా చేసేవారు;ఎంతటి తప్పునైనా క్షమించేవారు. ఏదో దేవతకో లేదా సీజర్ భార్యకో దొరికినట్టు ఆమెకు ఏం చెయ్యడానికైనా అనుమతి ఉండేది. నా ప్రేమ ఎంత గాఢంగా ఉండేదంటే త్వరలోనే నా ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయింది. మా నాన్న,ఇరుగుపొరుగులు,రైతులు -అంతా నా మీద సానుభూతి చూపేవాళ్ళు. నేను కూలీలకు వోడ్కా పోయించినప్పుడు వాళ్ళు వినయంగా నాతో యిలా అనేవారు:”కొల్టోవిచ్ ల ఆడబిడ్డ మీ యిల్లాలు అవ్వాలని ఆ దేవుడు దీవించాలయ్యా!”అని.
నేను తనని ప్రేమిస్తున్నానని అరియడ్నెకు కూడా తెలుసు. ఆమె అప్పుడప్పుడూ గుర్రం ఎక్కి లేదా బగ్గీలో కూర్చుని అలా మమ్మల్ని చూడవచ్చేది. రోజంతా నాతోనూ,మా నాన్నతోనూ కాలక్షేపం చేసేది. నిజం చెప్పాలంటే ఆమెకు మా నాన్నతో మాంచీ దోస్తీ కుదిరింది. అతను తనకి అత్యంత ప్రియమైన సైకిల్ తొక్కే విద్యను ఆమెకు నేర్పేడు కూడా!
ఒకనాటి సాయంత్రం ఆమె సైకిల్ పైకి ఎక్కడానికి నేను సాయం చెయ్యడం నాకు బాగా గుర్తుంది. ఆమె ఎంత మనోహరంగా ఉందంటే ఆమెను తాకినప్పుడు నా చేతులు కాలాయా అనిపించింది నాకు. నాకు పారవశ్యంతో ఒళ్ళు జలదరించింది. నా ముసలి తండ్రీ,అరియడ్నె యిద్దరూ అలా ఎంతో మనోహరంగా కనిపిస్తూ ప్రక్క,ప్రక్కనే సైకిళ్ళు తొక్కుతూ వెళుతుంటే ఎదురుగా వస్తున్న ఒక నల్లటి గుర్రం (దాని సంరక్షకుడు దాన్ని స్వారీ చేస్తున్నాడు) వీళ్ళని ఢీకొట్టబోయి ప్రక్కకు పడిపోయింది. అరియడ్నెఅందాన్ని చూసి సమ్మోహితురాలై ఆ గుర్రం కూడా పడిపోయిందా అని తోచింది నాకు. నా ప్రేమ, నా ఆరాధన అరియడ్నెమనసును తాకాయి. ఆమె మనసు కరిగింది. ఆమె కూడా అంతే ప్రేమను కురిపించాలనుకుంది. అదంతా ఒక కవితలా తోచింది.
కానీ నిజానికి ఆమెకు నా అంతగా ప్రేమించడం చేత కాదు.ఎందుకంటే ఆమె కాస్త అభావంగా ఉండేది. అంతేకాక అప్పటికే ఆమె మనసు కాస్త కలుషితం అయింది. ఆమెలో ఒక దెయ్యం ఉంది.అది నిరంతరాయంగా ఆమె మనోహరి అనీ,ఆమెను అంతా ఆరాధించాలనీ చెవినిల్లు కట్టుకుని పోరుతూ ఉండేది. తను ఎందుకు సృజించబడిందో లేక ఈ జన్మ తనకు ఎందుకు లభించిందో,దాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో అనే ఆలోచన ఆమెకు ఏమాత్రం లేదు. భవిష్యత్తు గురించిన ఆమె ఊహాలన్నీ సంపద చుట్టూ తిరిగేవి. ఆమె తనను ఒక సంపన్న,ప్రముఖ మహిళగా ఊహించుకునేది. గొప్ప,గొప్ప బాల్ నాట్యాలు,గుర్రప్పందేలు,విందులూ,వినోదాలూ,నౌఖర్లూ,చాకర్లూ,పెద్ద బంగళాలు ,తన స్వంత సెలూన్,మందీ మార్బలం, తనను ఆరాధించే రాజకుమారులు ,కళాకారులూ యిలా సాగేవి ఆమె ఊహలు.
నిరంతరాయమైన ఈ వ్యక్తిగత విజయ కాంక్ష,ఎల్లప్పుడూ ఒక రీతిలో ఉండే ఈ మానసిక స్థితి మనుషులను కటువుగా మారుస్తాయి. అరియడ్నెకూడా అంతే.నా పట్ల,ప్రకృతి పట్ల, సంగీతం పట్ల ఆమె కటువుగానే ఉండేది. కాలం గడుస్తూనే ఉంది. రాయబారులెవరూ కానరాలేదు. అరియడ్నె భూతవైద్యుడైన తన సోదరుడితోనే నివసిస్తోంది. పాపం వాళ్ళ పరిస్థితి నానాటికీ దిగజారిపోయింది. ఆమెకు టోపీలు,బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు చాలేవి కావు. తన పేదరికాన్ని దాచడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చేది.
విధిరాత అలా ఉందో ఏమో! ఆమె మాస్కోలో ఉన్నప్పుడు ఆమెకు ప్రిన్స్ మక్తుయెవ్ అనే ఒక సంపన్నుడు పరిచయం అయ్యాడు.అతను సంపన్నుడే అయినా,ఏమంత ప్రముఖుడు మాత్రం కాదు. అంచేత, అరియడ్నె అతన్ని వెంటనే తిరస్కరించింది. కానీ ప్రస్తుతం అలా అతన్ని తిరస్కరించినందుకు ఆమె పశ్చాత్తాపపడసాగింది. బొద్దింకలు పడ్డ క్వాస్ మగ్గును చూసి,మొహం చిట్లించుకుంటూనే ఆ క్వాస్ ను త్రాగే పేదరైతు మాదిరిగా ఆమె ప్రిన్స్ మక్తుయెవ్ ని తలచుకున్నప్పుడల్లా మొహం చిట్లిస్తూనే,మళ్ళీ యిలా అనేది:”నువ్వెన్నైనా చెప్పు…ఈ బిరుదులూ,పదవులు వీటిలో ఏదో అద్భుతం ఉంది”,అని.
ఆమెకు పదవులు,హోదాల పట్ల తీవ్రమైన మక్కువ ఉండేది. కానీ అదే సమయంలో ఆమెకు నన్ను వదులుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఎంతగా రాయబారుల కోసం ఎదురు చూసినా మనసన్నది ఒకటి ఉంటుంది. అది శిల కాదు…దానికి తోడు యవ్వనోద్రేకం..అంచేత అరియడ్నె కూడా ప్రేమలో పడటానికి ప్రయత్నించింది. ప్రేమిస్తున్నట్టు కనిపించే ప్రయత్నం చేసింది. ఇంకా ముందుకెళ్ళి నన్ను ప్రేమిస్తున్నానని ఒట్టేసి చెప్పింది. కానీ నేను చాలా సున్నిత మనస్కుడిని. నన్నెవరైనా ప్రేమిస్తే,అల్లంత దూరం నుంచే ఆ విషయాన్ని కనిపెట్టెయ్యగలను. దానికి ఒట్లూ,ప్రమాణాలు అవసరం లేదు. ఆమె అలా నా దగ్గరకు వచ్చి ప్రేమ ప్రకటన చేసినప్పుడు లోహపు కోకిల పాడినట్టుగా,విరసంగా తోచింది. తనలో ఏదో లోపం ఉందని అరియడ్నెకు కూడా తెలుసు. ఆమె విసిగిపోయింది.ఆమె ఏడవడం నేను చాలాసార్లు చూసేను.మరో సందర్భంలో ఏం జరిగిందో మీరస్సలు ఊహించలేరు. హఠాత్తుగా ఆమె నన్ను కౌగలించుకుని,ముద్దాడింది. అది ఒక సాయం సమయంలో నది ఒడ్డున జరిగింది. ఆమె నన్ను ప్రేమించటం లేదనీ,కేవలం యిలా చేస్తే ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తితో మాత్రమే చేస్తోందనీ ఆమె కళ్ళను చూస్తే అర్థం అయ్యింది.నాకు ఒళ్ళంతా తేళ్ళూ,జెర్రులూ ప్రాకినట్టయింది.నేను నా మీద నుంచి ఆమె చేతులను విదిలించి నిస్పృహగా యిలా అన్నాను: “ప్రేమ లేని ఈ స్పర్శ నన్ను బాధిస్తుంది.”
“అబ్బ,నువ్వె౦త వింత మనిషివి!”అందామె నొచ్చుకుని. అలా అని,అక్కడి నుండి విసవిసా నడిచి వెళ్ళిపోయింది.
మరొక ఏడాది,రెండేళ్ళు గడిచాయి. నేను ఆమెను పెళ్ళాడి ఉండాల్సింది. నా ప్రేమకథ అలా ముగిసి ఉండేది.కానీ విధి మా ప్రేమను మరోలా చిత్రించదలచింది.మా ప్రాంతాల్లోకి మరొక ప్రముఖుడు దిగబడ్డాడు.మిహాయిల్ యివనిచ్ ల్యుబకోవ్ అనే ఈ పెద్దమనిషి అరియడ్నె సోదరుడికి విశ్వవిద్యాలయంలో స్నేహితుడు. ఇతనిది మాంఛి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. నౌఖర్లు,తోలర్లూ అంతా అతన్ని ‘సరదా మనిషి’ అని పిలిచేవారు.అతనిది సుమారైన ఎత్తు.మనిషి పలచగా ఉండేవాడు. బట్టతల. మొహం మంచి మనసున్న భూస్వామి మాదిరిగా ఉండేది. చూపరులను కట్టి పడేసే మొహం కాదు.కానీ,తెల్లగా చూడగలిగేట్టుగా ఉండేది. చక్కగా దువ్విన కుదురైన గడ్డం,బాతు మెడ,పెద్దగా కనిపించే కంఠముడి…ఇదీ అతని రూపం. నల్లటి,వెడల్పాటి రిబ్బను కట్టిన కళ్ళద్దాలు ధరించేవాడతను.అతనికి కాస్త నత్తి ఉన్న కారణంగా ‘ర’, ‘ల’ పలకలేకపోయేవాడు. అతను ఎల్లప్పుడూ మంచి సరదాగా ఉండేవాడు. అన్నీ అతనికి వినోదంగానే ఉండేవి.
అతను తన 20 ఏళ్ళ వయస్సులోనే ఒక పనికిమాలిన పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళికి కట్నంగా మాస్కోలో రెండు యిళ్ళు సంపాదించాడు. వాటిని పడగొట్టి బాత్ హౌస్ (స్నానశాల)కట్టే క్రమంలో అతను నిండా మునిగిపోయాడు. ప్రస్తుతం అతని భార్య,నలుగురు పిల్లలు నిరుపేదలుగా సత్రంలో తలదాచుకుంటున్నారు.వాళ్ళని యితను పోషించాలి. అది కూడా ఇతనికి వినోదమే. ఇప్పుడతని వయసు 36 అయితే అతని భార్య వయసు 42. అది కూడా ఇతనికి వినోదమే. గర్విష్టి,కోపిష్టి అయిన అతని తల్లి తనేదో దొరసానిలా నటిస్తూ ఉండేది. ఆమెకు కోడలితో పడని కారణంగా తను తన పిల్లలు,కుక్కల పరివారంతో వేరే యింట్లో కాపురం ఉండేది. ఆమెకు యితను నెలకు డెబ్భై అయిదు రూబుళ్ళు యివ్వాల్సి ఉండేది. ఇక స్వయంగా యితను కూడా కాస్త ఖర్చుదారే. విందూ, వినోదాలకూ కాస్త భారీగానే ఖర్చయ్యేది. దానికి అతనికి చాలా సొమ్ములు అవసరం అయ్యేవి. కానీ అతని మావయ్య అతనికి ఏడాదికి రెండువేల రూబుళ్ళు మాత్రమే అందజేసేవాడు. అది అతనికి ఏ మూలకి సరిపోక,ఏడాదంతా అతను అప్పుల కోసం మాస్కో అంతా తిరుగుతూ ఉండేవాడు. అది కూడా అతనికి వినోదంగా ఉండేది. అతను తన ఈ కుటుంబ జీవితం నుంచి విరామం తీసుకుని ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవడానికి కొల్టోవిచ్ ల వద్దకు వచ్చానని చెప్పేడు. భోజనాల దగ్గర, వాహ్యాళికి వెళ్ళేటప్పుడు నిరంతరాయంగా అతను తన భార్య,తల్లి,అప్పుల వాళ్ళు వీళ్ళందరి గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. అంచేత మేం కూడా నవ్వేవాళ్ళం. అతని సమక్షంలో మేం కాస్త భిన్నంగా కాలక్షేపం చేసేవాళ్ళం. నేను కాస్త నిశ్శబ్దంగా ఉండడానికీ,ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికే ఇష్టపడతాను. నాకు చేపలు పట్టడం అన్నా, సాయంత్రం వాహ్యాళికి వెళ్ళడం అన్నా, పుట్టగొడుగులు ఏరడం అన్న యిష్టం. ల్యుబోవ్ కి పిక్నిక్ లు,వేట,బాణాసంచా కాల్చడం…ఇవన్నీ ఇష్టం. అతను వారానికి మూడుసార్లు పిక్నిక్ లకు బయల్దేరేవాడు. అరియడ్నె కూడా ఎంతో ఉత్సాహంగా, నిజాయితీగా నత్తగుల్లలు,షాంపేన్, మిఠాయిలు మొదలైన సరుకుల చిట్టా తయారు చేసి వాటిని తేవడానికి నన్ను మాస్కోకి పంపేది. కానీ నా దగ్గర వాటికి సరిపడా సొమ్ము ఉందా,లేదా అని ఎన్నడూ అడిగేది కాదు. పిక్నిక్ లలో సరదాలూ,సంతోషాలూ,మందూ,విందూ అన్నీ వుండేవి. మళ్ళీ అక్కడ కూడా అతను తన భార్య వయసు గురించీ, తన తల్లి వద్ద వున్న లావాటి కుక్కల గురించి,తన ఋణదాతల మంచితనం గురించీ యిలా ఏవో హాస్యాలాడుతూనే ఉండేవాడు.
ల్యుబోవ్ కి కూడా ప్రకృతి పట్ల యిష్టం ఉండేది. కానీ అది అతనికి ఎప్పట్నుంచో పరిచయం ఉన్నట్టూ,తన కంటె చాలా చిన్న స్థాయికి చెందినట్టూ,అది కేవలం తన ఆనందం కోసం సృష్టించబడినట్టూ భావించేవాడు. అతను ఒక్కోసారి అద్భుతంగా ఉన్న ఒక ప్రకృతి దృశ్యం ముందు అలా కదలకుండా నిలబడిపోయి ఇలా వ్యాఖ్యానించేవాడు: “ఇక్కడ టీ త్రాగితే భలే ఉంటుంది కదా!”
ఒక రోజు మా ముందు గొడుగు వేసుకుని నడుస్తున్న అరియడ్నెని చూసి,తల ఊపుతూ అతను యిలా అన్నాడు:
“ఆమె సన్నగా ఉంటుంది.అలా ఉంటేనే నాకిష్టం,నాకు లావాటి ఆడవాళ్ళు నచ్చరు.”
ఆ మాటకి నేను కాస్త నొచ్చుకున్నాను,ఆడాళ్ళ గురించి నా ముందు అలా మాట్లాడొద్దని చెప్పేను.అతను నా వంక ఆశ్చర్యంగా చూసి,ఇలా అన్నాడు:
“సన్నగా ఉన్న ఆడాళ్ళను నేను యిష్టపడటంలో,అలాగే లావాటి మహిళలు నాకు నచ్చకపోవటంలో తప్పేముంది?”
నేను జవాబివ్వలేదు. ఆ తరవాత మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు అతను యిలా అన్నాడు:
అరియడ్నె గ్రిగార్యెవ్నా నిన్ను యిష్టపడటం నేను గమనించాను. నువ్వు ఎందుకు చొరవ తీసుకోవటం లేదన్నది నాకు అర్థం కాలేదు.”
అతని మాటలు నన్ను కాస్త యిబ్బంది పెట్టేయి. కాస్త తటపటాయిస్తూనే ఆడాళ్ళ గురించీ,ప్రేమ గురించీ నా అభిప్రాయం ఏమిటో చెప్పేను.
“అదంతా నాకు తెలీదు”,అన్నాడతను నిట్టూరుస్తూ, “నా ఉద్దేశ్యంలో ఒక ఆడది ఆడదే మగాడు మగాడే. అరియడ్నె చాలా ఉన్నతంగా,కవితాత్మకంగా కనిపించొచ్చు నువ్వు చెప్పినట్టు…నిజమే…కానీ అంత మాత్రాన ఆమె ప్రకృతి నియమాలకు అతీతురాలు కాదు.నువ్వే చూస్తున్నావు కదా,యిప్పటికే ఆమె భర్త లేదా ప్రేమికుడి తోడు ఉండాల్సిన వయసుకు చేరింది,నేను కూడా నీలాగే మహిళలను గౌరవిస్తాను.కానీ నా ఉద్దేశ్యంలో …కొన్ని బంధాలకు,కవిత్వానికి సంబంధం లేదు.కవిత్వం ఒక విషయం.ప్రేమ మరొక విషయం.ఉదాహరణకి వ్యవసాయాన్నే తీసుకో.ప్రకృతి సౌందర్యం ఒక విషయం కాగా పొలాలు,తోటల నుంచి నీకు వచ్చే ఆదాయం మరో విషయం.
అరియడ్నె,నేను చేపలు పడుతూ ఉంటే మాకు దగ్గరగా యిసుక మీద పడుకుని ల్యుబోవ్ నన్ను ఆటపట్టిస్తూ ఉండేవాడు.లేదు.జీవితాన్ని ఎలా గడపాలో తెల్పుతూ నాకు ఉపన్యాసం ఇచ్చేవాడు.
“అయ్యా,తమరు ఒక్క ప్రేమ వ్యవహారం కూడా లేకుండా ఎలా జీవిస్తున్నారని నాకు ఆశ్చర్యంగా ఉంది”,అనేవాడతను.”మీరు యువకులు,అందంగా,ఆకర్షణీయంగా ఉన్నారు.మిమ్మల్ని చూసి మొహం తిప్పుకోవాల్సిన పని లేదు.అయినా కూడా మీరొక సన్యాసి మాదిరిగా జీవిస్తున్నారే.ఓహ్!28 ఏళ్ళకే ముసలాళ్ళలా ఉండే ఈ మనుషులను నేను భరించలేను బాబూ!నేను యించుమించు తమరికంటే పదేళ్ళు పెద్ద.కానీ మనిద్దరిలో ఎవరు చిన్నగా కనిపిస్తున్నారు! అరియడ్నెగ్రిగార్యెవ్నా,చెప్పు ఎవరు?”
“తప్పకుండా మీరే”, అరియడ్నె జవాబిచ్చింది.
మా మౌనంతోనూ,తదేకంగా మేం చేపల వంక చూస్తూ కూచోవడంతోను విసుగెత్తి అతను యింటికి తిరిగి వెళ్ళిపోయేక, అరియడ్నె నా వంక కోపంగా చూస్తూ ఇలా అంది:
“నువ్వసలు మగాడివి కాదు.ఉత్త మాంసపు ముద్దవి. దేవుడా,నన్ను క్షమించు!మనిషన్నాక భావావేశం ఉండాలి,ఆ ఆవేశంలో తప్పులు చెయ్యాలి,బాధ పడాలి!నీ దురుసుతనాన్నీ ,చారననీ ఒక స్త్రీ క్షమిస్తుంది.కానీ నీ తార్కికతనీ ఏ స్త్రీ ఎప్పుడూ క్షమించదు!”
ఆమెకు నిజంగానే కోపం వచ్చింది.ఆమె యింకా యిలా అంది:
“గెలవాలంటే ఒక మనిషికి ధైర్యం కావాలి,ధృఢ నిశ్చయం కావాలి.ల్యుబోవ్ నీ అంత అందగాడు కాదు,కానీ నీ కంటే ఆసక్తికరమైన మనిషి.అతను ఆడాళ్ళ విషయంలో ఎప్పుడూ గెలుస్తాడు.ఎందుకంటే అతడు నీలా కాదు…అతను మగాడు…”
ఆమె గొంతులో ఉద్రేకం ధ్వనించింది.
ఒక రోజు రాత్రి భోజనాల వద్ద ఆమె నన్ను ఉద్దేశించి కాకుండా యధాలాపంగా కొన్ని మాటలు చెప్పింది.తనే గనుక మగాడైతే ఈ పల్లెటూళ్ళో మురిగిపోకుండా యాత్రలు చేసేదాన్ననీ,చలికాలం యిటలీ లాంటి ప్రదేశాల్లో గడిపేదాన్ననీ చెప్పుకొచ్చింది. ఓహ్,యిటలీ! సరిగ్గా ఆ మాట దగ్గర మా నాన్న తెలియకుండా అగ్నికి ఆజ్యం పోసాడు.అతను యిటలీ గురించి మాకు వివరంగా చెప్పసాగేరు.అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల గురించీ,మ్యూజియంల గురించీ వివరించేడు.ఇక హఠాత్తుగా అరియడ్నెకి ఇటలీ చూడాలనే కోరిక కలిగింది.ఆమె బల్ల గుద్ది,మెరిసే కళ్ళతో “నేను వెళ్ళి తీరాలి!”అంది.
ఆ తరువాత నుంచీ రోజూ ఇటలీ గురించిన సంభాషణలు జరిగేవి; ఇటలీలో ఎంత బావుంటుంది,ఆహా,యిటలీ!ఓహో,యిటలీ!….అలా ..అరియడ్నె నా వంక ఓరచూపులు చూస్తున్నప్పుడు ఆ పంతం నిండిన ముఖకవళికలను బట్టి ఆమె అప్పటికే తన కలల్లో ఇటలీని జయించిందని నాకు అర్థమైంది. ఆమె మనసు నిండా ఆ సెలూన్ లు,విదేశీ మాంత్రికులు,ఆ భోగ భాగ్యాలు ఇవే ఉన్నాయి.ఆమె ఇక వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు.నేను కాస్త వేచి ఉండమని,తన ప్రయాణాన్ని ఒకటి,రెండేళ్ళు వాయిదా వేసుకొమ్మని,ఆమెకు సలహా ఇచ్చేను.కానీ ఆమె తిరస్కారంగా మొహం చిట్లించి,యిలా అంది:
“నువ్వొక ముసలమ్మ లాంటి వివేకివి.”
ల్యుబోవ్ కూడా ఈ ప్రయాణానికి ‘సై’అన్నాడు. అతను ఈ ప్రయాణాన్ని చాలా చవకగా ముగించొచ్చని కూడా సలహా చెప్పేడు.తను కూడా తన కుటుంబ జీవనం నుండి కాస్త విశ్రాంతి కోసం ఇటలీ వస్తానని అన్నాడు.
నేను బడిపిల్లాడంత అమాయకంగా,ఏమీ ఎరుగనట్టు ప్రవర్తించేను….ఇది నిజం.
అసూయ అని కాదు గానీ,ఏదో జరగరానిది,ఉపద్రవం జరుగుతుందేమోనన్న శంఖతో నేను వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండకుండా చూసేందుకు ప్రయత్నించాను. దానికి వాళ్ళు నన్ను ఆటపట్టించారు కూడా!ఉదాహరణకి, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్టు నటించేవారు.అలా అన్నమాట.కానీ,ఆగండాగండి! ఒక రోజు పొద్దున్నే తెల్లగా,లావుగా ఉండే ఆమె అన్న,అదే ఆ భూతవైద్యుడు నా ముందు ప్రత్యక్షమై నాతో ఒంటరిగా మాట్లాడాలనే కోరిక వ్యక్తపరిచాడు.
అతనికి తనకంటూ ఒక నియమం లేదు,అంత చదువు చదువుకున్నా,అంత విచక్షణ ఉన్నా కూడా తన ముందు బల్ల మీద యింకొకరికి చెందిన ఉత్తరం ఉంటే దాన్ని చదవకుండా ఉండలేకపోయేవాడు. ఇక యిప్పుడు అతను ల్యుబోవ్ అరియడ్నెకు రాసిన ఉత్తరాన్ని యధాలాపంగా చదివేనని ఒప్పుకున్నాడు.
“ఆ ఉత్తరం బట్టి ఆమె తొందరలోనే విదేశాలకు వెళుతోందని నాకు అర్థమైంది.ఇదుగో,మిత్రమా!నాకు చాలా ఆందోళనగా ఉంది.అసలిదంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు.కాస్త వివరించి పెడుదూ,నీకు పుణ్యం ఉంటుంది.”
అలా అంటూ అతను ఆయాసపడుతూ నా మొహం మీదకి నిశ్వసించాడు.ఉడికించిన పంది మాంసం గుప్పుమంది.
“ఈ ఉత్తరం రహస్యం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు.గానీ నువ్వు అరియడ్నెకి స్నేహితుడివి.ఆమె నిన్ను గౌరవిస్తుంది.బహుశా నీకు దీని గురించి ఏమైనా తెలిసి ఉంటుంది.ఆమె వెళ్ళిపోవాలనుకుంటోంది. గానీ,ఎవరితో?ల్యుబోవ్ ఆమెతో వెళ్ళాలనుకుంటున్నాడు.నన్ను క్షమించు.గానీ ల్యుబోవ్ వ్యవహారం చాలా వింతగా ఉంది.అతనికి పెళ్ళయ్యింది,పిలల్లూన్నారు;అయినా కూడా అతను ప్రేమ ప్రకటన చేస్తున్నాడు.అతను అరియడ్నెను ‘ప్రియతమా’అని సంబోధిస్తున్నాడు. నన్ను క్షమించు,గానీ ఇదంతా చాలా వింతగా ఉంది!”
నేను నిర్ఘాంతపోయేను.నా కాళ్ళూ,చేతులూ చల్లబడ్డాయి.గుండెలో సన్నగా నొప్పి మొదలైంది.కొట్లోవిచ్ నిస్సహాయంగా చేతులు వేలాడేసుకుని కుర్చీలో కూలబడ్డాడు.
“నేనేం చేయగలను?”అడిగాను నేను.
“ఆమెను ఒప్పించండి …ఆమె మనసును ఆకర్షించండి…ఇలా చూడండి,ల్యుబోవ్ ఆమెకు ఏమవుతాడు?అసలతను ఆమెకు జోడీయేనా?దేవుడా!ఛ,ఛ! ఎంత అసహ్యం!”అన్నాడతను తల పట్టుకుంటూ.”అసలామెకు ఎలాంటి అద్భుతమైన సంబంధాలు వచ్చేయి-ప్రిన్స్ మక్తుయెవ్ యింకా యెంతమందో!అసలు ప్రిన్స్ ఈమెను ఆరాధిస్తాడు.మొన్న పోయిన బుధవారపు సందర్భంలో మరణించిన వాళ్ళ తాతగారు యిలారియన్ అరియడ్నెప్రిన్స్ కు భార్య అవుతుందని నమ్మకంగా చెప్పేడు-సత్యంగా!వాళ్ళ తాతగారు యిలారియన్ మరణించాడు.కానీ అతను మహా మేధావి. మేం రోజూ అతని ఆత్మతో మాట్లాడతాం!”
ఈ సంభాషణ తర్వాత రాత్రంతా నేను నిద్రపోలేదు.నన్ను నేను తుపాకీతో కాల్చుకుందామనుకున్నాను.తెల్లారి లేచి,నేను అయిదు ఉత్తరాలు రాసేను కానీ వాటినన్నింటినీ చింపేసాను.ఆ తరవాత ధాన్యపు కొట్టంలో కూర్చుని ఏడ్చేను. ఆ తర్వాత నేను కూడా మా నాన్న దగ్గర కొంత సొమ్ము తీసుకుని,ఎవరికీ చెప్పపెట్టకుండా కాకస్ కి బయలుదేరేను.
నిజమే,ఆడది ఆడదే,మగాడు మగాడే! గానీ ఈ రోజుల్లో కూడా అది పూర్వకాలంలోలా అంత సాధారణ విషయమా?నవ నాగరికుడిని,అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితి కలిగిన మానవుడినైన నేను కూడా నాకు ఒక అమ్మాయి పట్ల కలిగిన ఆకర్షణని ఆమె ఒక మహిళ,నేను ఒక పురుషుడిని అనే భావాలతో వ్యక్తం చెయ్యాలా?ఛ,అదెంత భయంకరం!ప్రకృతితో జరిపే యుద్ధంలో మానవుడి మేధస్సు తన భౌతిక ప్రేమతో కూడా యుద్ధం చేయాల్సి వచ్చిందనీ,దాన్ని పూర్తిగా జయించలేకపోయినా,కనీసం దాన్ని ఒక అందమైన భావాల అల్లికగా మార్చి సోదరభావం,ప్రేమ అని భ్రాంతి కల్పించుకున్నాడని నా నమ్మకం. నా వరకు నాకు ఈ ప్రేమ అనేది కుక్కలు,కప్పల మాదిరి ఒక శారీరక వాంఛ ఎంత మాత్రం కాదు.అది ఒక నిజమైన,స్వచ్చమైన ప్రేమ.ప్రతి కౌగిలింతా ఒక ఆధ్యాత్మిక అనుభూతితోనూ, స్త్రీ పట్ల గౌరవంతోనూ నిండి ఉంటుంది. వాస్తవానికి ఈ జంతువుల మాదిరి వాంఛ పట్ల జుగుప్స అన్నది తరాల నుంచి వస్తోంది. అది నా రక్తంలోనే ఉంది. అదే నా స్వభావం. ఇక ప్రేమ గురించి కవితాత్మకంగా చెప్పాలంటే ప్రేమ అనేది మనం మన చెవులను కదపలేకపోవడం లేదా మనకి బొచ్చు లేకపోవడం అనేటంత సాధారణమైన,అవసరమైన విషయం ఎంతమాత్రం కాదు.చాలామంది నాగరికులు ప్రేమ గురించి ఇలాగే భావిస్తారని నా ఉద్దేశ్యం. అంచేతనే ప్రేమలో నైతికత,కవితాత్మకత లోపించడం అనేది ఈ రోజుల్లో ఒక విపరీతంగా,పాత కాలపు ఘటనల పునరావృతం అవడంగా భావించబడుతోంది. ఇదంతా ఒక భ్రష్టత,ఒక రకమైన పిచ్చితనం అని అంటూ ఉంటారు. ప్రేమను కవితాత్మకంగా చూసినప్పుడు మనం ప్రేమించే వాళ్ళల్లో లేని గుణాలను కూడా మనం ఉన్నట్లు భ్రమ పడతాం. దాని వలన ఎన్నో తప్పులు జరుగుతాయి. మనం ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. కానీ నా ఉద్దేశ్యంలో అది కూడా కొంత నయమే.ఏదయితేనేం ఆడది ఆడదే,మగాడు మగాడే అనుకుంటూ ఆత్మసంతృప్తి చెందే బదులు ఈ రకంగా బాధ పడటం చాలా నయం అని నా భావం.
ట్రిప్లీస్ లో ఉండగా నాకు మా నాన్న వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. అరియడ్నె గ్రిగార్యెవ్నా ఫలానా రోజు విదేశాలకు వెళ్ళిందనీ,ఆమె ఈ శీతాకాలం అంతా విదేశాల్లో గడపాలనుకుంటోందని అతను రాసేడు.ఒక నెల తరవాత నేను యింటికి తిరిగి వచ్చాను. అప్పటికే శరదృతువు ప్రారంభం అయ్యింది.ప్రతీ వారం అరియడ్నె నుంచి మా నాన్నకి ఉత్తరాలు వచ్చేవి. మంచి సువాసనలు వెదజల్లే కాగితం పైన,ఎంతో కళాత్మకంగా ఉండేవి ఆ ఉత్తరాలు. ప్రతీ మహిళా ఒక రచయిత్రి అని నా ఉద్దేశ్యం. ఒక వెయ్యి రూబుళ్ళు యివ్వడానికి తన మేనత్తని ఒప్పించడం ఎంత కష్టమయ్యిందో,అలాగే తనతో పాటు రమ్మని ఒక దూరపు చుట్టమైన ముసలామెను ఎంతగా బ్రతిమాలాడాల్సి వచ్చిందో. …యిలాంటి విషయాలన్నీ అరియడ్నె చాలా వివరంగా రాసేది.అంత వివరంగా రాయడంలో కొంత కాల్పనికత ఉందని తెలుస్తూనే ఉంది.నిజానికి ఆమెకు తోడుగా సహాయకులెవరూ లేరని నాకు అర్థం అయ్యింది.
తొందర్లోనే ఆమె నుంచి నాక్కూడా ఉత్తరం వచ్చింది. అది కూడా సువాసనలు వెదజల్లుతూ,కవితాత్మకంగా ఉంది. ఆమెకు తరచూ నేను గుర్తొస్తున్నాననీ,నా తెలివైన,అందమైన,ప్రేమ నిండిన కళ్ళే తనకు గుర్తొస్తున్నాయని రాసింది. నా యవ్వనాన్నంతా వృధా చేస్తూ,అలా పల్లెటూళ్ళో మురిగిపోతున్నందుకు నన్ను సున్నితంగా మందలించింది. నేను కూడా తనలా నారింజ చెట్ల సువాసనలు ఆస్వాదిస్తూ భూతల స్వర్గంలో ఉండాలని సూచించింది. ‘తమరు విడిచిపెట్టిన అరియడ్నె’అని సంతకం చేసింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే ధోరణిలో ఇంకో ఉత్తరం వచ్చింది. ఈసారి ‘మీరు మరచిపోయిన అరియడ్నె’అని సంతకం చేసింది. నా మనసంతా గజిబిజి అయిపోయింది.నేను ఆమెను వెర్రిగా ప్రేమించేను,ప్రతీ రాత్రీ ఆమె గురించి కలగన్నాను. మరి ఈ ‘విడిచిపెట్టిన,మరిచిపోయిన’పదాలేమిటి? అసలు దీనర్థం ఏమై ఉంటుంది? ఇదంతా దేని కోసం? సరిగ్గా అప్పుడు నీరసమైన పల్లె వాతావరణం,పెద్ద సాయంకాలాలు, ల్యుబోవ్ గురించిన దరిద్రపు ఆలోచనలు…ఆ అనిశ్చితి అన్నీ నన్ను బాధించేయి. నా రాత్రుళ్ళు, పగళ్ళు భరించరానివిగా తయారయ్యాయి. చివరకు ఆ వేదన భరించలేక,నేను విదేశాలకు వెళ్ళేను.
అరియడ్నె నన్ను అబ్బాజియాకు పిలిచింది. నన్ను అక్కడకు పిలిచే వేళకు అప్పటికే వర్షం పడి వెలిసింది. ఆ ఉదయం వెచ్చగా ఉంది. చెట్ల మీద ఇంకా వర్షపుబిందువులు మెరుస్తూనే ఉన్నాయి. అరియడ్నె,ల్యుబోవ్ లు నివశిస్తున్న బ్యారక్ లాంటి పెద్ద యింటి పైకప్పు మీద కూడా వర్షపు బిందువులు మెరుస్తూ ఉన్నాయి.
వాళ్ళిద్దరూ యింట్లో లేరు. అంచేత నేను పార్కుకి వెళ్ళేను. ఆ తరువాత కాసేపు వీధులు పట్టుకు తిరిగి,కూర్చున్నాను. ఎర్రటి చారల పంట్లాం వేసుకున్న ఆస్ట్రియా జనరల్ ఒకతను చేతులు వెనక్కి పెట్టుకుని నన్ను దాటి వెళ్ళాడు. ఒక చిన్న పిల్లని బండిలో కూర్చొబెట్టుకుని నా ప్రక్కనుంచి తీసుకువెళుతున్నారు. ఆ బండి చక్రాలు కిర్రుమంటున్నాయి. పచ్చకామెర్లతో బాధ పడుతున్న ముసలాయనొకడు ,ఆ తరువాత ఒక ఇంగ్లీషు మహిళల గుంపు,ఆ తరువాత ఒక కాథోలిక్ మతాధికారి ,ఆ తర్వాత మళ్ళీ ఆ ఆస్ట్రియా జనరల్ …ఇలా సాగుతోంది ఆ జన ప్రవాహం. తళతళ మెరుస్తున్న వాయిద్యాలతో ఉన్న ఒక మిలిటరీ బ్యాండు ఒక ప్రక్కగా నిలబడి వాయించడానికి ఉపక్రమించింది.
మీరెప్పుడైనా అబ్బాజియుకు వెళ్ళేరా?అదొక చిన్న,మురికి స్లోవిక్ గ్రామం. దాంట్లో ఉన్నది ఒకటే వీధి.అది కూడా మరుగు కంపు కొడుతుంది. వాన పడిందంటే చాలు గొలోష్ లు లేకుండా కాలు బయట పెట్టలేం. నేను ఈ భూతల స్వర్గం గురించి చాలా చదివి ఏమేమో ఊహించుకున్నాను. కానీ చివరకు నా పంట్లాం ఎత్తి పట్టుకుని ఆ మురికి వీధి గుండా నడుస్తున్నప్పుడు విసుగెత్తి ఏం చెయ్యాలో పాలుపోక ఒక ముసలామె వద్ద కాసిని గట్టి పియర్ పళ్ళు కొన్నాను. ఆమె నన్ను రష్యన్ గా గుర్తించి చెత్రి (4) ద్వాద్యత్ (20)అని పిలవడంతో నాకు ఏం చెయ్యాలో,ఎటు పోవాలో ఏమీ తోచలేదు. ఆ తరవాత నాలాగే నిరుత్సాహపడ్డ రష్యన్ లను కలుసుకున్నప్పుడు నాకు నిజంగానే సిగ్గేసింది.విసుగ్గా తోచింది. అక్కడ ఒక ప్రశాంతమైన తీరం ఉంది. తీరం వెంబడి రంగు,రంగుల తెర చాపలతో ఉన్న స్టీమర్లు,పడవలు నిలుపబడి ఉన్నాయి.అక్కడ నుంచి నాకు నీటి ప్రవాహం కనిపిస్తోంది. దూరాన ఊదా రంగు పొగ మంచుతో కప్పబడ్డ దీవులు కనిపిస్తున్నాయి. అక్కడంతా తీరం వెంబడి హోటళ్ళు,యిళ్ళు మొదలైనవి లేకుండా ఉండి ఉంటే ఆ తీర దృశ్యం మరింత మనోహరంగా ఉండి ఉండేది.ఆ కట్టడాలన్నీ గజిబిజిగా కట్టబడి ఉన్నాయి. వాటి కారణంగా ఆ ఆకుపచ్చని తీరం అంతా డబ్బు యావ కల దురాశపరుల చేతుల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. వీటన్నింటి వలన ఈ స్వర్గంలో చిన్న చిన్న కిటికీలు,పైకప్పులు ఇంకా నల్లటి దుస్తులు ధరించిన వెయిటర్లతోనూ ,టేబుళ్ళతోనూ నిండిన చిన్న,చిన్న స్క్వేర్ లూ తప్ప వేరే ఏమి కనిపించడం లేదు.విదేశాల్లో తీరం వెంట ప్రతి చోటా మనం ఇప్పుడు చూసిన పార్కులాంటిదొకటి ఉంటుంది.నిశ్చలంగా ఉన్న ఆ నల్లటి తాటి చెట్లు,వీధుల్లోని ఆ పచ్చటి మట్టి,ఆకుపచ్చటి జాగాలు,తళతళలాడే మిలిటరీ వాద్యాలు…ఇవన్నీ నాకు పది నిమిషాల్లో విసుగ్గా తోచేయి…అయినా కూడా ఏదో తెలీని కారణం చేత మనం అక్కడ పదిరోజులు,పదివారాలు గడపాల్సి వస్తుంది!
అలా తీరం వెంబడి ఒక జాగా నుంచి మరో జాగాకు కాళ్ళీడ్చుకుంటూ తిరుగుతూ ఉండగా నాకు ఈ సంపన్నులు గడిపే అనూహ్యకరమైన,నిస్సారమైన జీవితం గురించీ,వాళ్ళ పదును లేని,పస లేని ఆలోచనా విధానం గురించీ పదేపదే ఆలోచనలు రాసాగేయి. అసలు చేతిలో డబ్బులు లేకుండా,హోటళ్ళలో నివశించలేక ,ఎక్కడ పడితే అక్కడ నివశిస్తూ,పర్వతాల పైనుంచి సముద్ర దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ,పచ్చగడ్డిలో హాయిగా పడుకుంటూ,గుర్రాల మీద స్వారీ బదులు కాలి నడకన వెళ్తూ,అడవులను,పల్లెలను దగ్గర నుంచి చూస్తూ,పల్లె పద్ధతులను పాటిస్తూ,పల్లె సంగీతాన్ని వింటూ,అక్కడి మహిళలను ప్రేమిస్తూ కాలం గడిపే చిన్నా,పెద్ద యాత్రికులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది.
నేనక్కడ పార్కులో కూర్చుని ఉండగానే చీకటి పడింది. ఆ సంజె వేళలో హఠాత్తుగా అరియడ్నె నా ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఆమె హుందాగా యువరాణిలా తయారై ఉంది. ఆమె వెనుకే ల్యుబోవ్ కూడా వచ్చాడు. అతను వదులుగా ఉన్న ఒక కొత్త సూటు వేసుకుని వచ్చాడు. బహుశా వియన్నాలో కొన్నాడేమో!
“నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు ?నేనేం చేశాను?”అంటున్నాడతను.
నన్ను చూసి,ఆమె ఆనందంతో చిన్నగా అరిచింది. మేం పార్కులో లేకపోతే,నా ఒళ్ళో వాలిపోయేదేమో!ఆమె అభిమానంగా నా చేతులను నొక్కుతూ,నవ్వింది. నేను కూడా నవ్వేను. ఉద్విగ్నుడినై కన్నీళ్ళు పెట్టుకున్నాను కూడా!ఇక ప్రశ్నల వర్షం కురిసింది.మా ఊరి గురించీ,మా నాన్న గురించీ,నేను తన సోదరుడిని చూసేనా అని …యిలా. తన మొహంలోకి సూటిగా చూస్తూ మాట్లాడమని నన్ను కోరింది. నాకు ఆ చేప,మా చిలిపి తగాదాలు,పిక్నిక్ లు గుర్తున్నాయా అని అడిగింది.
“అబ్బ,ఆ సమయం ఎంత బాగుండేదో కదా!”అందామె నిట్టూరుస్తూ.”అలాగని యిక్కడ కూడా మాకు విసుగ్గా లేదు.నాకిక్కడ ఎంతోమంది స్నేహితులున్నారు,తెల్సా!రేపు నిన్ను నేను యిక్కడ ఉన్న రష్యన్ కుటుంబానికి పరిచయం చేస్తాను. కానీ దయుంచి మరో కొత్త టోపీ కొనుక్కో”,అందామె నన్ను పరీక్షగా చూసి,మొహం చిట్లిస్తూ. “అబ్బాజియా అంటే మన పల్లెటూరు కాదు. ఇక్కడ వేష,భాషలు సరిగ్గా ఉండాలి.”
అక్కడ నుంచి మేం భోజనశాలకు వెళ్ళాం. దారంతా అరియడ్నె నవ్వుతూ,అల్లరి చేస్తూనే ఉంది.తను నన్ను ‘ప్రియా’ అనీ,మంచివాడననీ,తెలివైనవాడిననీ సంబోధిస్తూనే ఉంది.అసలు నేను అక్కడ తనతో ఉన్న విషయం తను విశ్వసిస్తున్నట్టుగా లేదు. మేం అక్కడ పదకొండింటి వరకూ కూర్చుని కడుపునిండా తిని,బాగా ముచ్చట్లాడుకున్నాక వీడ్కోలు చెప్పుకున్నాం.
మరుసటి రోజు ఆ రష్యన్ కుటుంబానికి అరియడ్నె నన్నిలా పరిచయం చేసింది: “మా ఎస్టేటు ప్రక్కనే వీళ్ళ ఎస్టేటు ఉంటుంది. ఇతని తండ్రిగారు పేరు మోసిన ప్రొఫెసర్”,అని.
ఆమె ఆ కుటుంబంతో ఎస్టేటులు,పంటల గురించి తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. నన్ను కూడా మాట్లాడమని పదే,పదే కోరింది. ఆమె వాళ్ళ కళ్ళకి ఒక సంపన్న భూస్వామ్య కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనబడే ప్రయత్నం చేసింది. నిజానికి ఆ ప్రయత్నంలో విజయం సాధించింది కూడా. ఆమె వ్యవహార శైలి చూస్తే దొరసానుల మల్లె ఉంది. నిజానికి ఆమె పుట్టుకతోనే దొరసాని కదా!
“అబ్బ, మా అత్త ఎలాంటి మనిషో చూడు!”అందామె హఠాత్తుగా నా వైపు చూసి,నవ్వుతూ. “మేం కాస్త వాదులాడుకున్నామో,లేదో ,ఆమె అలిగి మెరాన్ కి వెళ్ళిపోయింది. నువ్వేమంటావు?”
ఆ తరవాత మేము పార్కులో నడుస్తూ ఉండగా,నేను ఆమెను ఇలా అడిగేను:
“నువ్వు ఇందాక ఏ అత్త గురించి మాట్లాడేవు?ఎవరామె?”
“అదా, ఊరికే నన్ను నేను కాపాడుకోవడానికి అలా అబద్ధం చెప్పేను”అందామె నవ్వుతూ. “నాకు తోడుగా ఎవరూ లేరని వాళ్ళకి తెలియకూడదు కదా!”
కాసేపు మౌనంగా ఉన్నాక,ఆమె నాకు దగ్గరగా వచ్చి,ఇలా అంది:
“ఇదిగో, మిత్రమా!కాస్త ల్యుబోవ్ తో స్నేహంగా ఉండవా?అతను చాలా అసంతృప్తిగా ఉన్నాడు.అతని భార్య ,తల్లి ఇద్దరూ భయంకరమైన మనుషులు.”
ఆమె ల్యుబోవ్ ని మర్యాదగా పిలిచేది. నిద్రించటానికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పినట్టే అతనికి కూడా ‘శుభరాత్రి’అని చెప్పేది. వాళ్ళిద్దరి గదులు వేర్వేరు అంతస్థులలో ఉండేవి. ఇదంతా చూశాక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఏమి లేదనీ,అదంతా ఉత్త అబద్ధమనీ నాకు తోచింది. దానితో అతన్ని కలిసినప్పుడు నా మనస్సు తేలికగా ఉండేది. అంచేత ఒకరోజు అతను నన్ను మూడువందల రూబుళ్ళు అప్పుగా అడిగితే,నేను ఆనందంగా ఇచ్చేను.
ప్రతిరోజూ మేం ఊరికే ఒకరితో ఒకరం సంతోషంగా గడిపేవాళ్ళం. వేరే వ్యాపకం ఏమీ లేదు. ఊరికే ఆనందిస్తూ ఉండడమే. తినడం,త్రాగడం,పార్కులో తిరగడం…అంతే. ప్రతిరోజూ ఆ రష్యన్ కుటుంబంతో మాట్లాడేవాళ్ళం. పార్కుకి వెళ్ళినప్పుడల్లా ఆ పచ్చ కామెర్ల రోగినీ,కేథలిక్ మతాధికారినీ ,ఆస్ట్రియన్ జనరల్ నీ చూడడం నాకు అలవాటైపోయింది. ఆ ఆస్ట్రియన్ జనరల్ తనతో పేకముక్కలు తెచ్చుకుని,ఒక చోట కూర్చుని ఆందోళనగా భుజాలెగరేస్తూ పేకాట ఆడేవాడు.
ఊళ్ళో ఉన్నప్పుడైతే పని దినాల్లో నేను ఖాళీగా చేపలు పడుతున్నా,లేదా పిక్నిక్ కి వెళ్ళినప్పుడైనా,రైతులెవరైనా కనిపిస్తే నాకు కాస్త సిగ్గేసేది. అలాగే యిక్కడ కూడా నౌఖర్లు,తోలర్లు,కూలీలను కలిసినప్పుడు నాకు మొహమాటంగా అనిపించేది. వాళ్ళంతా నన్ను చూసి,”పనీ,పాటలూ ఏమి లేదా ఏమిటి?”అని అడుగుతున్నట్టుగా ఉండేది నాకు. రోజూ రాత్రింబవళ్ళు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. రోజంతా వింతైన అసౌకర్యంగా ఉండేది.మూస పోసినట్టు ఒకటే జీవితం. ఒకే ఒక వైవిధ్యం ఏమిటంటే ల్యుబోవ్ వచ్చి యాభయ్యో,వందో అప్పు అడగటం. వ్యసనపరుడు నల్ల మందుని చూసి ఆనందపడ్డట్టు అతను డబ్బు చేతిలో పడగానే పొంగిపోయేవాడు. తన భార్యని,అప్పుల వాళ్ళని,తల్చుకునీ,తనను తాను చూసుకుని నవ్వుకునేవాడు.
చివరకు వానలు కురవడం ప్రారంభమై వాతావరణం బాగా చల్లగా మారింది. మేం ఇటలీకి వెళ్ళేం. నేను ఎలాగైనా సరే వీలు చేసుకుని ఎనిమిది వందల రూబుళ్ళు రోమ్ కి చేరేట్టు పంపమని,ప్రాధేయపడుతూ మా నాన్నకి తంతి పంపేను. మేం వెనిస్ లో ఉన్నాం. ఫ్లోరెన్స్ లో ఉన్నాం,బోలోగ్నాలో ఉన్నాం. ప్రతీ చోటా విలాసవంతమైన హోటళ్ళలో బస చేసేవాళ్ళం.ప్రతీ చోటా మాకు దీపాలకీ,సేవలకీ,వెచ్చదనానికీ, భోజనంలో యిచ్చే రొట్టెకీ మా అంత మేం ప్రత్యేకంగా భోజనం చెయ్యడానికీ,అన్నింటికీ వేరే రుసుము చెల్లించాల్సి వచ్చేది. మేం సుష్టుగా తినేవాళ్ళం. పొద్దున్నే వాళ్ళు మాకు కెఫే కంప్లీట్ (కాఫీతో పాటు బన్నులు మొదలైన తిళ్ళు)ఇచ్చేవారు. మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనంలో మాంసం, చేపలు,ఆమ్లెట్ లు,చీజ్,పళ్ళు,వైన్ ఉండేవి. సాయంత్రం ఆరింటికి ఎనిమిది రకాల పదార్ధాలతో కూడిన భోజనం మధ్యమధ్య విరామాలతో అలా సాగేది. విరామ సమయాల్లో మేం బీర్,వైన్ తాగుతూ ఉండేవాళ్ళం. తొమ్మిదింటికి మళ్ళీ టీ.అర్ధరాత్రి మళ్ళీ అరియడ్నె తనకి ఆకలిగా ఉడికించిన గుడ్లు,పంది మాంసం కావాలనేది. తనకి తోడు కోసం మేం కూడా మెక్కేవాళ్ళం.
భోజనానికీ,భోజనానికీ మధ్య ఉన్న విరామ సమయాల్లో మేం మ్యూజియాలు, ప్రదర్శనలు చూడటానికి పరుగులు తీసేవాళ్ళం. భోజనాల వేళకి చేరలేమేమో అనే నిరంతరాయమైన ఆందోళనతోనే పరుగులు పెట్టేవాళ్ళం. నాకు ఆ చిత్రాలు చూసీ,చూసీ విసుగెత్తింది. ఇంటి పట్టున విశ్రాంతి తీసుకుందాం అనిపించేది. ఎక్కడైనా కుర్చీ దొరికితే కూలబడదాం అని ఉండేది. ఇతరులను అనుకరిస్తూ,”అబ్బ,ఎంత అద్భుతం!ఆహా,ఏం వాతావరణం!”అని నటిస్తూ చెప్పేవాడిని. బాగా తిన్న కొండచిలువల్లా మేం కళ్ళకు ఇంపుగా కనిపించే వాటినే చూసేవాళ్ళం. దుకాణాల కిటికీలు,ద్వారాలు చూస్తే మాకు ఒళ్ళు తెలిసేది కాదు. మేం నకిలీ నగలను,అనవసరమైన చెత్తను కొంటూ ఉండేవాళ్ళం.
రోమ్ లో కూడా ఇదే తంతు నడిచింది. అక్కడ కూడా వర్షం పడింది. విపరీతమైన చలి. మధ్యాహ్నం కడుపు నిండా తిన్నాక మేం సెయింట్ పీటర్స్ చూడడానికి వెళ్ళేం. తిండి ఎక్కువైన కారణంగానో,లేక వాతావరణం బాగు లేకపోవడం వల్లనో మమ్మల్ని అది పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మేమిద్దరం పరస్పరం ఒకరినొకరు కళాత్మక దృష్టి లేని వారమని నిందించుకుంటూ,తగువులాడుకున్నాం.
సొమ్ము మా తండ్రిగారి నుంచి వచ్చేది. సొమ్ము తెచ్చుకుందికి నేను పొద్దున్నే వెళ్ళడం నాకు గుర్తుంది. ల్యుబోవ్ నాతో వచ్చేడు.
“మనకొక గతం ఏడ్చినప్పుడు మనం మన వర్తమానాన్ని పూర్తిగా ఆనందించలేము”,అన్నాడతను. “నా గతం కారణంగా నా మీద చాలా బరువు బాధ్యతలున్నాయి. కానీ డబ్బు సర్దుబాటు అయితే చాలు.అవి అంత యిబ్బందికరమైనవి కావు. కానీ డబ్బు దొరకకపోతే,నేను ఇరుక్కున్నట్టే. నీకోకటి తెలుసా?నా దగ్గర కేవలం ఎనిమిది ఫ్రాంకులే ఉన్నాయి. కానీ నేనిప్పుడు మా అమ్మకి ఒక వంద,నా భార్యకు ఒక వంద పంపించి తీరాల. ఇంకా యిక్కడ మనం బ్రతకాలి. అరియడ్నె పసిపిల్లలాంటిది. తను ఎలాంటి బాధ్యత తీసుకోదు.రాణిలాగా ఖర్చు మాత్రం పెడుతుంది. అసలు నిన్నటికి నిన్న ఆ వాచీ ఎందుకు కొన్నట్టు? ఇంకొక మాట అడుగుతాను, చెప్పు. అసలు మేం బుద్ధిమతులైన పిల్లల లాగా ఎందుకు నటించాలి?నౌఖర్లకీ,స్నేహితులకీ మా బంధం తెలియకుండా దాచడం కోసం ఎందుకు రోజుకి పది,పదిహేను ఫ్రాంకులు అదనంగా తగలెట్టి నేను వేరే గదిలో ఉండడం ఎందుకు?అసలు దీని ఉద్దేశ్యం ఏమిటి?”
నా గుండెను ఎవరో మెలిపెట్టినట్టయ్యింది. ఇప్పుడింక ఏ అనిశ్చితీ లేదు;అంతా స్పష్టం అయిపోయింది.నా ఒళ్ళు చల్లబడిపోయింది. ఇక వాళ్ళని చూడకుండా,అక్కడ నుంచి పారిపోవాలనీ, ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని అప్పటికప్పుడు నిశ్చయించుకున్నాను.
“ఆడపిల్లను లొంగదీసుకోవడం చాలా సులభం “,ల్యుబోవ్ చెప్పుకుపోతున్నాడు. “ఒక్కసారి ఆమె బట్టలూడదీస్తే చాలు. కానీ ఆ తర్వాత అదంతా ఎంత విసుగైన వ్యవహారం.ఎంత పనికిమాలిన పని!”
నాకు అందిన సొమ్ముని నేను లెక్కబెట్టుకుంటుండగా అతను అన్నాడు:
“నువ్వు గనక నాకొక వెయ్యి ఫ్రాంకులు అప్పివ్వకపోతే,నేను సర్వనాశనం అయిపోతాను.నువ్వే నాకు దిక్కు,ఆఖరి ఆధారం.”
నేను అతనికి డబ్బిచ్చాను. అతను వెంటనే సర్దుకుని,మళ్ళీ తన మామ గురించి నవ్వుతాలుగా మాట్లాడసాగాడు. అతనొక వింత మనిషనీ,తన భార్య నుంచి తన చిరునామాని ఎన్నడూ రహస్యంగా ఉంచలేడనీ అన్నాడు. హోటల్ చేరేక నేను సామాను సర్దుకుని,హోటల్ కు చెల్లించాల్సిన సొమ్మును కట్టేసేను.ఇక అరియడ్నెకి వీడ్కోలు పలకడమే మిగిలింది.
నేను తలుపు తట్టేను.
“లోపలికి రండి! “
ఆమె గది ఎప్పట్లాగే పొద్దున్న పూట గందరగోళంగా ఉంది;బల్ల మీద టీ కప్పులు,సగం తిన్న రొట్టె,పగిలిన గుడ్డు పెంకులు,గుప్పున వచ్చే సెంటు పరిమళం,మంచం అంతా అస్తవ్యస్తంగా ఉంది.మంచం మీద యిద్దరు పడుకున్న గుర్తులు కనిపిస్తున్నాయి.
నేను ఆమెకు శుభోదయం చెప్పి,పలకరించి,ఆమె తన కురులు ముడి వేసుకుంటూ ఉంటే,ఒక నిమిషం చూస్తూ మౌనంగా కూర్చుని,ఆ తరువాత నిలువెల్లా వణుకుతూ యిలా అడిగేను:
“అసలు …అసలు నన్నెందుకు ఇక్కడకు రమ్మన్నావు?”
నేనేం ఆలోచిస్తున్నానో ఆమె పసిగట్టేసింది;ఆమె నా చేతిని పట్టుకుని ఇలా అంది:
“నువ్వు ఎంతో స్వచ్చమైన మనిషివి. నువ్విక్కడ ఉండాలని నేను కోరుకున్నాను.”
నా వణుకుకి ,ఉద్వేగానికి నాకే సిగ్గేసింది. ఇంకాసేపుంటే నేను వెక్కిళ్లు పెడతానేమోనని నాకు భయం వేసింది కూడా! మరో మాట మాట్లాడకుండా నేను బయటకు వెళ్ళిపోయాను.ఇంకో గంటలో నేను రైలులో ఉన్నాను. ప్రయాణమంతా నేను అరియడ్నెని ఒక పసిబిడ్డతో ఉన్నట్లు ఊహిస్తూనే ఉన్నాను. అది నాకు చాలా రోతగా అనిపించింది.అంతే కాదు నాకు దారిలో కనిపించిన ఆడవాళ్ళంతా పడుచూ,ముసలీ అంతా పసిబిడ్డలతో ఉన్నట్లుగా అనిపించి కంపరంగా తోచింది. తన వద్ద ఉన్న బంగారు నాణేలన్నీ నకిలీవని తెలుసుకున్న పీనాసి ముసలివాడిలా ఉంది నా పరిస్థితి. ప్రేమకు సంబంధించిన నా స్వచ్చమైన ఊహలు,నా ప్రణాళికలు,నా ఆశలు,నా జ్ఞాపకాలు,మహిళల గురించీ,ప్రేమ గురించిన నా భావాలు,అన్నీ యిప్పుడు నన్ను నాలుక చాపి వెక్కిరిస్తున్నాయి.”ఆ తెలివైన,అద్భుత సౌందర్యారాశి అయిన అరియడ్నె అనే యువతి,ఒక సెనేటర్ కూతురు ల్యుబోవ్ లాంటి సాదాసీదా లుచ్చాతో వ్యవహారం పెట్టుకుంటుందా?కానీ ఆమె ల్యుబోవ్ ని ఎందుకు ప్రేమించకూడదు?”నాకు నేనే జవాబిచ్చుకున్నాను. “ల్యుబోవ్ నా కంటే ఎందులో తక్కువ?సరే,ఆమెకు నచ్చిన వాడిని ప్రేమించనీ,కానీ నాతో ఎందుకు అబద్ధం చెప్పడం?కానీ అసలామె నాతో నిజం మాత్రం ఎందుకు చెప్పాలి?”ఇలా నాలో నేను తర్జనభర్జన పడి చివరకు ఏమీ ఆలోచించలేకపోయాను.
రైలులో బాగా చలిగా ఉంది; నేను మొదటి తరగతిలో ప్రయాణిస్తున్నాను. అలా అయినా కూడా ఒకవైపు ముగ్గురేసి చొప్పున ఉన్నారు. రెండేసి కిటికీలు లేవు.బయటి తలుపు తిన్నగా బోగీలోకే తెరుచుకుంది. దీనంతటితో శిక్ష పడ్డ నిందితుడిలా అయ్యింది నా పరిస్థితి. ఒళ్ళంతా నొప్పులుగా తోచింది. కాళ్ళు తిమ్మిరెక్కాయి. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అదే సమయంలో ఆ రోజు ఉదయం వదులైన బట్టలతో ఆ జాకెట్ లో ఆమె ఎంత అద్భుతంగా ఉందో పదే,పదే గుర్తుకు వచ్చింది. దానితో తట్టుకోలేని అసూయతో నేను ఒక్కుదుటున పైకి లేవడం చూసి,తోటి ప్రయాణికులంతా కంగారు పడ్డారు.
ఇంటి వద్ద తీవ్రంగా మంచు కురుస్తోంది.నాకు శీతాకాలం అంటే ఇష్టం ఎందుకంటే బయట ఎంతగా మంచు కురుస్తున్నా,యింట్లో వెచ్చగా ఉంటుంది.బాగా మంచు కురుస్తున్నప్పుడు ఫర్ జాకెట్,ఫెల్ట్ బూట్లు ధరించి తోటలో పని చెయ్యడం,వెచ్చటి గదిలో కూర్చుని ఏదైనా చదువుకోవడం…మా నాన్నగారి స్టడీ గదిలో ఫైర్ ప్లేస్ ముందు కూర్చోవడం ,మా ఊళ్ళోని బాత్ హౌస్ లో స్నానం చేయడం ఇవన్నీ ఎంత బావుంటాయో!ఒక్కటేమంటే ఇంట్లో అమ్మ,సోదరి ,పిల్లలు ఎవరూ లేకపోతే ఆ చలికాలం సాయంత్రాలు పెద్దవిగా,నిస్సారంగా అనిపిస్తాయి. సాయంత్రం వెచ్చబడే కొద్దీ ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చేక ,ఆ శీతకాల సాయంత్రాలు చాలా పెద్దవిగా తోచేవి. నాకు చాలా దిగులుగా ఉండేది. ఎంత దిగులంటే నాకేదీ చదవబుద్ది అయ్యేది కాదు. పగటి పూట నేనేదో అటూ,యిటూ తిరిగి తోటలో పని చెయ్యడమో,పశువులకీ ,కోళ్ళకీ మేత వెయ్యడమో చేసేవాడిని. కానీ సాయంత్రాలు భరించడం నా వల్ల అయ్యేది కాదు.
పూర్వం అతిథులను నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ పస్తుతం అతిథులను చూస్తే ప్రాణం లేచొచ్చేది. ఎందుకంటే వారు తప్పక అరియడ్నె గురించి మాట్లాడతారని నాకు తెలుసు.భూతవైద్యుడు కొట్లోవిచ్ తరచూ తన సోదరి గురించి మాట్లాడటానికి వచ్చేవాడు. అతను తనతో పాటు ప్రిన్స్ మక్తు యెవ్ ను కూడా తెచ్చేవాడు.ఈ ప్రిన్స్ కూడా అరియడ్నెని నా అంత గాఢంగా ప్రేమిస్తున్నాడు. అరియడ్నె గదిలో కూర్చోవడం,ఆమె పియానో మెట్లను తడమడం,అవన్నీ ప్రిన్స్ కు అవసరమైపోయాయి.అవి చేయకుండా అతను జీవించలేడు.అతని తాత యిలారియన్ ఆత్మ యింకా యివాళో,రేపో అరియడ్నె అతని భార్య అవుతుందని జోస్యం చెప్తూనే ఉంది.ప్రిన్స్ సాధారణంగా మాతో చాలాసేపు కూర్చునేవాడు.మధ్యాహ్న భోజన సమయం నుంచి యించుమించు అర్ధరాత్రి వరకు మాటా,పలుకు లేకుండా కూర్చునేవాడు;అలా కూర్చుని రెండు,మూడు సీసాల బీరు త్రాగేవాడు.సంభాషణలో తను కూడా పాలు పంచుకుంటున్నానని చూపడానికి అతను హఠాత్తుగా, విచారంగా ,ఒక వెర్రి నవ్వు నవ్వేవాడు.ఇంటికెళ్లే ముందు ప్రతిసారీ అతను నన్ను ప్రక్కకు తీసుకెళ్ళి ,లోగొంతుకతో యిలా అడిగేవాడు: “నువ్వు చివరగా అరియడ్నెని ఎప్పుడు చూసావు?ఆమె బాగానే ఉందా?అక్కడ ఆమెకు విసుగ్గా లేదు కదా!”అని.
వసంతం వచ్చేసింది.పొలాలు దున్నాలి. జొన్న,క్లోవర్ నాట్లు వెయ్యాలి. నాకు విచారంగానే ఉంది గానీ వసంతం వలన వచ్చిన ఉత్సాహం కొంత ఉంది. తప్పనిసరి అయిన దాన్ని మనం అంగీకరించి తీరాలి. పొలాల్లో పని చేస్తూ,పక్షుల సంగీతం వింటూ నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను! “నేను ఈ వ్యక్తిగత ఆనందాన్ని పూర్తిగా విడిచిపెట్టలేనా?నేను ఈ భ్రమలోంచి బయటపడి ఒక సాదా సీదా రైతు పిల్లను పెళ్ళాడలేనా?”
అలా మేం పనిలో తలమునకలుగా ఉండగా,నాకు యిటాలియన్ తపాలా ముద్రతో ఉన్న ఒక ఉత్తరం వచ్చింది. ఇక చూస్కొండి …క్లోవర్ ,తేనెపట్లు ,ఆవు దూడలు,రైతు పిల్ల అన్నీ హుష్ కాకి అయిపోయాయి.ఈ సారి తను చాలా,చాలా విచారంగా ఉన్నట్టుగా రాసింది అరియడ్నె. నేను తనకి ఆసరాగా నిలబడనందుకు, నైతికత అనే శిఖరాల పై నుంచి ఆమెను చిన్న చూపు చూస్తున్నందుకు,ప్రమాద ఘడియలలో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు ఆమె నన్ను మందలించింది. ఇదంతా పెద్ద,పెద్ద అక్షరాలతో ,ఆందోళనగా రాసింది. ఆమె చాలా నిస్పృహతో,గాబరాగా రాసిందని తెలుస్తోంది. చివరగా ఆమె నన్ను అక్కడికి వచ్చి,తనను కాపాడమని వేడుకుంది. మళ్ళీ నేను పరుగు తీసేను. అరియడ్నె రోమ్ లో ఉంది. నేను వెళ్ళేసరికి రాత్రి పొద్దు పోయింది. నన్ను చూస్తూనే ఆమె ఏడుస్తూ,నా మీద వాలిపోయింది. ఆ శీతాకాలం ఆమెలో ఏ మార్పూ తేలేదు. ఆమె అంతే యవ్వనంతో,ఆకర్షణీయంగా ఉంది. మేం రాత్రి భోజనం చేసి,తెల్లారేవరకు రోమ్ అంతా తిరిగేం. అంతసేపూ,ఆమె తన గురించిన విషయాలు చెప్తూనే ఉంది. ల్యుబోవ్ ఎక్కడున్నాడని నేను ఆమెను అడిగేను.
“ఆ జీవి గురించి నన్ను అడగొద్దు!”అరిచిందామె. “అతడి పేరు వింటేనే నాకు కంపరం కలుగుతుంది.”
“కానీ నువ్వు అతడిని ప్రేమిస్తున్నావనుకున్నానే!”అన్నాను నేను.
“ఎన్నడూ కాదు”,అందామె. “మొదట్లో అతను నిజాయితీపరుడని భావించి జాలి పడ్డాను,అంతే. అతను చాలా మొరటు మనిషి. ఆడాళ్ళ మీదకి దూసుకువస్తాడు. అది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ యిక మనం అతని గురించి మాట్లాడొద్దు. అది నా జీవితంలో ఒక విచారకరమైన అధ్యాయం. అతను డబ్బు తెచ్చుకుందికి రష్యా వెళ్ళేడు. అతనికి తగిన శాస్తి జరిగింది.మళ్ళీ యిక్కడికి రావోద్దని చెప్పేను.”
ఆమె అప్పుడు హోటల్లో కాక,ఒక ప్రైవేటు లాడ్జిలో నివశిస్తోంది. అందులో ఉన్న రెండు గదులను ఆమె తన అభిరుచికి అనుగుణంగా అలంకరించింది. ఆ అలంకరణ చాలా విలాసవంతంగా ఉంది.
ల్యుబోవ్ వెళ్ళిపోయాక ఆమె తన పరిచయస్తుల నుంచి అయిదు వేల ఫ్రాంకులు అప్పుగా తీసుకుంది. నా రాక తప్పకుండా ఆమెకు ఊరట కలిగించే ఉంటుంది.
నేను ఆమెను ఊరికి తీసుకుపోదామని లెక్క వేసుకుంటూ వచ్చేను. కానీ నా ప్రయత్నాలు విజయవంతం అవలేదు. ఆమెకు ఊరి మీద బెంగగా ఉంది,నిజమే …కానీ అక్కడ ఆమె అనుభవించిన పేదరికం,నిత్యావసరాల గురించిన చింత,తన సోదరుడి ఇంటి తాలూకు తుప్పు పట్టిన పైకప్పు,ఇవన్నీ ఆమెకు వెన్నులో నుంచి వణుకు తెప్పించేవి. ఆమెకు వాటిని తల్చుకుంటే కంపరంగా ఉండేది. నేను ఇంటికెళ్దామని సలహా యిచ్చినప్పుడు,ఆమె నా చేతులను నొక్కుతూ ఇలా అంది:
“వద్దొద్దు. అక్కడ ఏమీ తోచక,నేను చచ్చిపోతాను.”
ఇక ఇప్పుడు నా ప్రేమ చరమాంకానికి చేరుకుంది.
“నువ్వు గతంలోలా ముద్దొచ్చేట్టుగా ఉండకూడదా? నన్ను కాస్త ప్రేమించకూడదా? “అంది అరియడ్నె నా మీదకు వంగుతూ. నువ్వెప్పుడూ చిరచిరలాడుతూ ఉంటావు. చాలా వివేకంతో ఉంటావు.ఉత్తేజం పొందవు.ప్రతీ పనికి దాని పరిణామాలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటావు. అది చాలా విసుగ్గా ఉంటుంది. ఇలా,దా,నేను నిన్ను వేడుకుంటునున్నాను. దయచేసి,నాతో మంచిగా ఉండు! నా ప్రియా,ఓ నిర్మల హృదయుడా,నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను!”
నేను ఆమె ప్రేమికుడిని అయిపోయాను. ఒక నెల్లాళ్ళు నేను ఆనంద పారవశ్యంలో పిచ్చివాడినైపోయాను. ఒక అందమైన యువతిని బాహువుల్లో బంధించడం,నిద్ర నుంచి లేచి వచ్చినప్పుడల్లా ఆమె శారీరక స్పర్శ వల్ల కలిగే వెచ్చదనంలోని సౌఖ్యాన్ని ఆనందించడం, ఆమె అక్కడ నాతోనే ఉందనే జ్ఞాపకం రావడం-ఓహ్,అద్భుతం-నా అరియడ్నె…ఆహా!దానికి అలవాటు పడటం అంత సుళువు కాదు. అయినా కూడా నేను అలవాటు పడ్డాను. ఆ తరవాత మెల్లగా నా కొత్త హోదా గూర్చి తర్కించసాగేను. మొదట నాకు అర్థం అయిన విషయం ఏమిటంటే ,అరియడ్నె నన్ను ప్రేమించటం లేదు. ఈ విషయం నాకు గతంలోనే అర్థం అయ్యింది. కానీ ఆమె నిజంగా ప్రేమించాలనుకుంది. ఆమె ఒంటరితనానికి భయపడింది. అన్నింటినీ మించి,నేను యువకుడిని,ఆరోగ్యవంతుడిని,శక్తిమంతుడిని ….ఆమెకు ఇంద్రియలాలస ఎక్కువ;అపేక్ష లేని మనుషులందరిలాగే;మేమిద్దరం పరస్పరం గాఢమైన ప్రేమలో ఐక్యం అయినట్టు కనిపించే ప్రయత్నం చేసేం. ఆ తరువాత నాకు యింకో విషయం కూడా బోధపడసాగింది.
మేం రోమ్ లో,నేపుల్స్ లో ,ఫ్లోరెన్స్ లో నివశించేo. మేం పారిస్ కు కూడా వెళ్ళేం. కానీ అక్కడ మరీ చల్లగా ఉందని ఇటలీకి తిరిగి వెళ్ళిపోయేం. మేం ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని మేం సంపన్న భూస్వాములుగానూ,భార్యా,భర్తలుగానూ పరిచయం చేసుకున్నాం.ఎక్కడికి వెళ్ళినా జనాలు మాతో పరిచయం పెంచుకునేవారు. అరియడ్నెకి సంఘంలో ఇట్టే గుర్తింపు దొరికేది. ఆమె చిత్రలేఖనం తరగతులకు వెళ్ళడంతో,కళాకారిణిగా పిలవబడేది. నిజంగా ఆమెలో ఏ కోశానా ప్రతిభ లేకపోయినా, అది ఆమెకు అతికినట్టు ఉండేది.
ఆమె రోజూ రెండు మూడు గంటల వరకు పడుకునేది. మంచం మీదే కాఫీ, మధ్యాహ్న భోజనం కానిచ్చేది.ఆమె సూప్ త్రాగేది.ఏండ్రకాయలు, చేపలు, మాంసం, అస్పరాగస్, వేట మాంసం తినేది. ఆమె నిద్రకు ఉపక్రమించేక నేను మళ్ళీ ఏదైనా తెచ్చేవాడిని. ఉదాహరణకి కాల్చిన పంది మాంసం లాంటిది. పాపం ఆమె దాన్ని కూడా విచారంగా, నిర్లక్ష్యంగా తిని పెట్టేది. మధ్య రాత్రిలో మెలకువ వస్తే ఆమె ఆపిల్ కాయలు, నారింజ పళ్ళు తినేది.
ఈ మహిళ యొక్క అతి ముఖ్యమైన లక్షణం వంచన. ప్రతీ నిమిషం నిష్కారణంగా ఆమె వంచిస్తూనే ఉండేది.బొద్దింక మీసాలు కదిపినట్టు ,పక్షి కిలకిలలాడినట్టు అతి సహజంగా,ఏదో ప్రేరణతో లాగ ఆమె కపటంతో ఉండేది. నాతో, నౌఖరుతో, పోర్టర్ తో, దుకాణదారులతో, పరిచయస్థులతో ఎవ్వరితోనైనా సరే ఒక్క సంభాషణ కూడా కపటం లేకుండా సాగేది కాదు. ఎవ్వరైనా వ్యక్తి మా గదిలోకి ప్రవేశించడమే తడవు, అది వెయిటర్ కావచ్చు లేదా బేరర్ కావచ్చు -ఆమె గొంతు,ముఖ కవళికలు అన్నీ తక్షణమే మారిపోయేవి -ఆమె ఆకృతి కూడా మారిపోయేదని చెప్పొచ్చు. అలాంటి సమయంలో ఆమెను చూస్తే ,ఇటలీలో మాకంటే సంపన్నులెవరూ లేరని మొదటి చూపులో మీరు చెప్పి ఉండేవారు. ఆమె ఏ కళాకారుడిని, సంగీతకాసమూహంలోరుడిని కలిసినా వాళ్ళల్లో ఉన్న అసాధారణ ప్రతిభ గురించి అన్ని రకాల అబద్ధాలు చెప్తూ ఉండేది.
“అబ్బ,మీలో ఎంత ప్రతిభ దాగి ఉంది!”అనేదామె తియ్యటి మాటలతో . “నాకు నిజంగా భయం వేస్తోంది. మీరు మనుషుల నిజ స్వభావాన్ని గ్రహించాలి.”
ఇదంతా కూడా కేవలం అవతలి వాళ్ళని సంతోషపెట్టడానికి ,ఆసక్తి కలిగించడానికి ,తను విజయం సాధించడానికి. అంతే!ఆమె ప్రతీ ఉదయం ‘ఆకట్టుకోవడం’అనే ఒకే ఒక ఆలోచనతో నిద్రలేచేది.అదే ఆమె జీవిత లక్ష్యం,పరమార్థం.ఫలానా వీధిలో ,ఫలానా ఇంట్లో ఉన్న వ్యక్తిని ఆమె ఆకర్షించలేకపోయిందని నేను చెప్పేననుకోండి.ఇక ఆమె వేదన వర్ణనాతీతం. ఆమె ప్రతీ దినం ,ప్రతీ క్షణం మగాళ్ళని ఆకట్టుకుని,రంజింపచేసి,పిచ్చివాళ్లను చెయ్యాలనుకునేది. నేను ఆమెకు కట్టుబడి,ఒక అనామకుడిగా ఉండడం అనేది ఆమెకు ఆటల పోటీల్లో ప్రేక్షకులకు కలిగే ఆనందం లాంటి ఆనందాన్నిచ్చేది. కేవలం నేను లొంగిపోవడం చాలదన్నట్టు,రాత్రి పూట నగ్నంగా ఆమె ఎలా ఉండేదంటే ఆడపులిలా ఉండేది. ఆమె ఎప్పుడూ చాలా మోహంతో ఉండేది. తనకి లుబ్కోవ్ రాసిన ఉత్తరాలు చదివేది;అతను ఆమెను రష్యాకి తిరిగి రమ్మని వేడుకునేవాడు. ఒకవేళ ఆమె తిరిగిరాకపోతే ఎవరినైనా హత్య చేసో,దోచుకునో ఆ డబ్బుతో ఆమె వద్దకు వస్తాననేవాడు. ఆమె అతడిని అసహ్యించుకునేది. కానీ మోహంతో,దాసుడిలా అతను రాసే ఉత్తరాలు అంటే పడి చచ్చేది. ఆమెకు తన అందం పట్ల తీవ్రమైన అతిశయం ఉండేది. ఎక్కడైనా ఒక పెద్ద సమూహంలో ,మగాళ్ళంతా ఆమె సౌందర్యాన్ని చూసి దాసులై ఉండేవారనీ,తను మొత్తం యిటలీని,సమస్త ప్రపంచాన్ని గెలిచి ఉండేదాన్ననీ ఆమె ఊహిస్తూ ఉండేది. తన ఆకృతి గురించీ,చర్మ సౌందర్యం గురించీ ఆమె పలికే అతిశయోక్తులకు నేను నొచ్చుకునేవాడిని. అది గమనించిన ఆమె నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ఉడికించడానికి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండేది. ఒక పర్యాయం మేం మా స్నేహితురాలి వేసవి విడిదిలో ఉండగా,ఈమె ఎంత దూరం వెళ్ళిందంటే:”నువ్వు ఇలా నీతులు చెప్పడం ఆపకపోతే ,నేను ఈ క్షణమే బట్టలిప్పేసి ఈ పూల మీద నగ్నంగా పడుకుంటాను”,అని.
తరచుగా ఆమె నిద్రిస్తున్నప్పుడో,పడుకున్నప్పుడో లేదా అమాయకంగా మొహం పెట్టినప్పుడో ఆమెను చూసి ఇంత అద్భుత సౌందర్యం,తెలివి దేముడు ఈమెకు ఎందుకిచ్చేడా అని నేను ఆశ్చర్యపోయేవాడిని. అది కేవలం తినడం,నిద్రించడం,పడక మీద దొర్లడం కోసమేనా?నిజంగా ఈమె తెలివైనదేనా?ఆమెకు ఒక వరుసలో మూడు క్రొవ్వొత్తులుంటే భయం,పదమూడు సంఖ్య అంటే భయం,పీడ కలలన్నా ,కనికట్టు అన్నా భయం. ఆమె స్వేచ్చ గురించీ,స్వేచ్చాయుత ప్రేమ గురించీ ఊరికే దురభిమానం కల ముసలమ్మ మాదిరిగా నోటికొచ్చినట్టు మాట్లాడేది. తుర్జెనీవ్ కంటె బొలెస్లావ్ మార్కెవిచ్ గొప్ప రచయిత అని ఊరికే వాదించేది. కానీ ఆమె నయవంచకి. నలుగురిలో ఒక మేధావిగా,ప్రగతిశీల మహిళగా ఎలా కనిపించాలో ఆమెకు బాగా తెలుసు.
అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడు కూడా ఆమె ఏ సంకోచం లేకుండా ఒక నౌఖరును అవమానించగలిగేది;లేదా ఏ మాత్రం బాధ లేకుండా ఒక పురుగును చంపగలిగేది;ఆమెకు ఎద్దుల పోట్లాటలు యిష్టం ;హత్యల గురించి చదవటం యిష్టం;ఖైదీలకు క్షమాభిక్ష పెడితే కోప్పడేది.
నేను,అరియడ్నె జీవిస్తున్న జీవితానికి మాకు చాలా డబ్బు అవసరం అయ్యేది. పాపం మా నాన్న తన పింఛను డబ్బులనీ,తనకొచ్చిన ఆదాయమునంతా నాకు పంపేవాడు. నా కోసం దొరికిన చోటంతా అప్పులు చేసేవాడు. చివరకు ఒకసారి అతను తనవద్ద యిక డబ్బులు లేవని చెప్పినప్పుడు నేను మా ఎస్టేటును తనఖా పెట్టమని అతనికి తంతి పంపాను;కొంతకాలం తరవాత రెండోసారి తనఖా పెట్టి కొంత సొమ్ము పంపమని ప్రార్థించేను. పాపం అతను మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టే చేసి ప్రతీ పైసా నాకు పంపేడు. అరియడ్నెకి జీవితంలో పనీ,పాటకూ,వ్యవహారం వంటి విషయములు గిట్టేవి కావు.అదంతా తనకు సంబంధించని వ్యవహారం అనుకునేది. తను తన వెర్రి,మొర్రి సరదాలు తీర్చుకోవడానికి వేల కొద్దీ ఫ్రాంకులు విరజిమ్ముతూ ఉన్నప్పుడూ నేను ఒక పెద్ద ముసలిచెట్టులాగా మూలుగుతూ ఉంటే తను మాత్రం సరదాగా ‘బెల్లా నెపోలి ‘అని పాడుకుంటూ ఉండేది.
క్రమంగా నాకు ఆమె వ్యవహారశైలి పట్ల ఏవగింపు కలిగింది. మా బంధం పట్ల సిగ్గేసింది కూడా.నాకు గర్భధారణ,బిడ్డలకు జన్మనివ్వడం యిట్లాంటివి పెద్దగా గిట్టేవి కావు.కానీ ఒక్కోసారి మా యిద్దరికీ కనీసం ఒక బిడ్డ పుట్టినా,మా బంధం కాస్త సమర్థనీయంగా ఉండేదే అనిపించేది. నా మీద నాకే ఏహ్యత కలగకుండా ఉండడం కోసం నేను చదవడం ప్రారంభించేను. త్రాగటం మానేసి,మితంగా తింటూ,మ్యూజియాలకూ,గేలరీలకూ తిరగసాగెను. మనని మనం నియంత్రణలో ఉంచుకున్నప్పుడు మనస్సు తేలికగా ఉంటుంది. అరియడ్నెకి కూడా నేనంటే విసుగెత్తింది. ప్రస్తుతం ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా మధ్యతరగతి మనుషులే. పూర్వంలాగ ప్రముఖులెవ్వరూ లేరు. సెలూన్ లు లేవు. వాటిన్నిటికి తగినంత సొమ్ము లేదు;దాంతో ఆమె బాధపడింది,ఏడ్చింది. చివరకు రష్యా తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమేనని నాకు చెప్పింది.
అంచేత ఇదుగో మేం ప్రయాణంలో ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఆమె తన సోదరుడితో విపరీతంగా ఉత్తర,ప్రత్యుత్తరాలు నడుపుతోంది. కచ్చితంగా ఆమెకేవో రహస్య ప్రణాళికలు ఉన్నాయి. అవేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఆమె మనసు లోతుల్లో ఉన్న ప్రణాళికలు తెలుసుకోవాలనే ఇచ్చ నాకేమాత్రము లేదు. నేను పూర్తిగా విసుగెత్తిపోయాను. కానీ ప్రస్తుతం మేం మా ఊరికి వెళ్ళటం లేదు.ముందు యాల్టాకి వెళుతున్నాం. అక్కడ నుంచి కాకస్ కి వెళ్తాం. ప్రస్తుతం ఆమె తీరప్రాంతాలలో మాత్రమే నివశించగలదు. నాకు మాత్రం ఈ తీర ప్రాంతాలంటే మొహం మొత్తింది. అసలక్కడ జీవించాలంటే నాకు సిగ్గుగా ఉంది. అబ్బ,ఇప్పుడు మా పల్లెలో ఉంటేనా? నాకు ఇప్పుడు కష్టపడి పని చెయ్యాలనీ,చెమటోడ్చి నా జీవిక నేను సంపాదించుకోవాలనీ ,నా తప్పులన్నింటినీ సరిచేసుకోవాలనీ ఎంత కోరికగా వుందో!నాలో గొప్ప శక్తి ఉందని నాకు తెలుస్తోంది. ఆ శక్తిని ఉపయోగించి పని చేస్తే ,నేను కేవలం అయిదేళ్ళలో మా ఎస్టేట్ ను తాకట్టు నుంచి విడిపించగలను.కానీ యిలా చూడండి,యిక్కడొక చిక్కు ఉంది.మేం ప్రస్తుతం పరాయి దేశంలో లేము. మన సొంత గడ్డ రష్యాలో ఉన్నాం. అంచేత మేం పద్ధతైన వివాహ బంధం గురించి ఆలోచించాలి. ఇప్పుడిక ఆకర్షణ ఏమీ మిగల్లేదనుకోండి .నా ఆ పాత ప్రేమా,గీమా మచ్చుకైనా లేవు. కానీ ఏదేమైనా,నేను ఆమెను గౌరవంగా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తన కథ చెప్తూ ఉత్తేజితుడైన షమొహిన్ నాతో కలిసి క్రిందకు వచ్చేడు. మేం ఆడాళ్ళ గురించి మాట్లాడటం కొనసాగించేం. అప్పటికే బాగా ఆలస్యమైంది.మేం ఇద్దరం ఒకే క్యాబిన్ లో ఉన్నట్టున్నా౦.
“ఏతా, వాతా చూస్తే పల్లె ప్రాంతాల్లోనే మహిళలు,పురుషుల కంటె వెనుకబడి లేరని తోస్తుంది”,అన్నాడు షమొహిన్. “అక్కడ మహిళలు కూడా పురుషుల మాదిరే ఆలోచిస్తారు,పని చేస్తారు. సంస్కృతి పేరిట మగాళ్ళలాగే ప్రకృతితో యుద్ధం చేస్తారు. ఇక పట్టణాల్లో ఈ సంపన్న,మేధావి వర్గాల మహిళలు చాలా కాలం నుంచి వెనకబడి ఆదిమ స్థితికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆమె సగం జంతువుగా మారిందని చెప్పొచ్చు. ఇక ఆమె దయ వలన యింతవరకు మానవ మేధస్సు సాధించిందంతా మళ్ళీ పోగొట్టుకుంటున్నాం. క్రమంగా మహిళ అదృశ్యమైపోయి ఆమె స్థానంలో ఒక ఆదిమ ఆడ జీవి ప్రత్యక్షం అవుతుంది. ఇలా చదువుకున్న మహిళలు వెనుకబడిపోవడం అనేది సంస్కృతికి గొడ్డలిపెట్టు; తన తిరోగమనంలో ఆమె పురుషుడిని కూడా ముందుకు వెళ్ళనియ్యకుండా,తనతో పాటు వెనక్కి లాక్కుపోతుంది.అది నిర్వివాదాంశం.”
నేను యిలా అడిగేను: “ఎందుకు సాధారణీకరణ చెయ్యడం?అరియడ్నె బట్టి అందరు మహిళలు అలాగే ఉంటారని తీర్పులివ్వడం ఎందుకు?నా ఉద్దేశ్యంలో చదువుకోసం ,లైంగిక సమానత్వం కోసం మహిళలు చేసే పోరాటం న్యాయ పోరాటం. దానికీ తిరోగమనానికి సంబంధం లేదు.”
కానీ షమొహిన్ నా మాటలు పెద్దగా వినిపించుకోకుండా అపనమ్మకంగా నవ్వేడు. అతను ఒక బలమైన,సైద్ధాంతికమైన స్త్రీ ద్వేషి. అతని నమ్మకాలను మార్చడం అసాధ్యం.
“ఛ,ఛ,అదంతా అర్థం లేని వ్యవహారం!”అతను అడ్డుపడ్డాడు. “ఒక మహిళ నాలో తనకు సమానమైన వ్యక్తినీ,పురుషుడినీ కాక ఒక మగాడిని చూసిందంటే,నన్ను ఆకర్షించడం,లొంగదీసుకోవడమే తన లక్ష్యం అయిందంటే -అప్పుడిక వాళ్ళ హక్కుల గురించి ఎలా మాట్లాడతాం?అయ్యో,వాళ్ళని అస్సలు నమ్మొద్దు. వాళ్ళు నయవంచకులు. మనం పురుషులందరం వాళ్ళ విముక్తి కోసం నానా యాగీ చేస్తూ ఉంటాం. కానీ అసలు వాళ్ళకే వాళ్ళ విముక్తి గురించి పట్టదు. కేవలం విముక్తి కావాలని నటిస్తారు,అంతే. వాళ్ళంతా మోసగత్తెలు. భయంకరమైన మోసగత్తెలు!”
నాకు ఈ చర్చ విసుగెత్తింది. నిద్ర వస్తున్నట్లుగా ఉంది. నేను గోడ వైపుకి తిరిగేను.
“అవును”,నిద్రలోకి జారుకుంటూ నేను ఈ మాటలు విన్నాను. “అసలు ఈ తప్పంతా మన విద్యావిధానానిది.మన పట్టణాల్లో మహిళలను ఆడజంతువులుగా మార్చే విధానంగా ఉంటుంది విద్యావిధానం -ఆమెను ఆకర్షణీయంగా మార్చి,మగాడిని లొంగదీసుకోవడానికి మాత్రమే తోడ్పడుతుంది. నిజంగా”, షమోహిన్ నిట్టూర్చాడు.
“ఆడపిల్లలని,మగ పిల్లలతో కలిసి మెలిసి ఉండేట్టు పెంచాలి,చదివించాలి.అప్పుడే వారు ఎల్లప్పుడూ కలిసి,మెలిసి ఉండగలుగుతారు. పురుషుల్లాగే మహిళలకు కూడా తమ తప్పొప్పులను గుర్తించే విచక్షణ కలిగి ఉండేట్టు శిక్షణ ఇవ్వాలి. అలా కాకపోతే,ఆమె ఎప్పుడూ తానే సరైనదాన్నని అనుకుంటుంది. పురుషుడంటే మాంఛి హోదా కలిగిన వాడో లేదా కేవలం తన ప్రేమికుడో కాదని అతను కూడా తనకు
సరిసమానమైన వ్యక్తి అనీ ,తన సాటి మానవుడనీ ఆడపిల్లకు ఉయ్యాలలోంచే నేర్పండి. ఆమెకు తార్కికంగా ఆలోచించడం,సాధారణీకరణ చెయ్యడం నేర్పండి.తన మెదడు పురుషుల మెదడు కంటె ఎందులోనూ తక్కువ కాదని పదే,పదే చెప్పండి. లేదంటే ఆమె విజ్ఞానశాస్త్రం పట్ల,కళల పట్ల,సంస్కృతి పట్ల విముఖురాలవుతుంది. చెప్పులు కుట్టే మనిషికో,లేదా పెయింటర్ కో సహాయం చేసే పిల్లాడి మెదడుకి ఎదిగిన మనిషి మెదడుకి ఉన్నంత పరిణతి ఉండకపోవచ్చు. అయినా,అతను కూడా పని చేస్తున్నాడు,కష్టపడుతున్నాడు. తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. మనం ఈ శరీరధర్మ విషయాలను కూడా కాస్త ప్రక్కన పెట్టాలి. గర్భధారణ,బిడ్డకి జన్మని యివ్వడం లాంటివి. ఎందుకంటే ప్రతి నెలా ఆడాళ్ళు పిల్లలను కనట్లేదు.మరో విషయం ఆడాళ్ళందరూ పిల్లలను కనటం లేదు;ఇక మూడోది ,ముఖ్యమైన విషయం ఏమంటే సాధారణ పల్లె మహిళలు బిడ్డకి జన్మనిచ్చే రోజు వరకు పొలాల్లో కాయకష్టం చేస్తున్నారు. అది వారికి ఏ రకమైన హాని చెయ్యటం లేదు. ఇక రోజు వారీ జీవితంలో కూడా పూర్తి స్థాయి సమానత్వం ఉండాలి. ఒక పురుషుడు లేచి తన కుర్చీని మహిళకు యిస్తేనో లేదా ఆమె పడేసుకున్న చేతి రుమాలు తీసి అందిస్తేనో ,ఆమె కూడా అలాగే ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి నాకు గ్లాసుతో మంచినీళ్ళు యిచ్చినా లేదా కోటు తొడుక్కోవడంలో సాయం చేసినా నాకేమి అభ్యంతరం లేదు …”
నాకు ఇంకేమీ వినిపించలేదు. నేను నిద్రలోకి జారుకున్నాను.
మరుసటిదినం మేం స్యెస్తపూల్ ని చేరుతుండగా వాతావరణం తేమగా,చిత్తడిగా ఉంది; పడవ ఊగుతోంది. షమోహిన్ ఏదో ఆలోచిస్తూ,మౌనంగా నాతో పాటు డెక్ మీద కూర్చున్నాడు. టీ కోసం గంట కొట్టగానే,కాలర్ కోట్లు ధరించిన పెద్ద మనుషులు ప్రత్యక్షం అయ్యేరు. నిద్రమత్తులో ఉన్న ఆడాళ్ళు క్రిందకి వెళ్తున్నారు. నిన్న వొల్టాఛస్క్ వద్ద కస్టమ్స్ అధికారుల మీద కస్సుబుస్సులాడిన అద్భుత సౌందర్యారాశి షమోహిన్ ముందు ఆగి,చాలా కొంటెగా ఇలా అంది:
“జీన్,నీ పిట్టకి సముద్రం పడలేదోయ్!”
ఆ తరువాత నేను యాల్టాలో ఉన్నప్పుడు ఈ సుందరే గుర్రాన్ని పరుగులెత్తిస్తూ స్వారీ చేయడం చూసేను. ఆమె వెనుకే కొందరు ఆఫీసర్లు గుర్రాల మీద వెడుతూ ఆమె వేగాన్ని అందుకోలేక అవస్థలు పడుతున్నారు. ఒక రోజు ఉదయం వదులైన కోటు,ఫ్రిజియన్ టోపీ ధరించి ఆమె సముద్ర తీరంలో ప్రత్యక్షమైంది. ఒక గుంపు ఆమె అందాన్ని దూరం నుంచి ఆరాధిస్తున్నారు. నాకు కూడా ఆమె పరిచయభాగ్యం కలిగింది. ఆమె ఎంతో అభిమానంతో నా చేతిని నొక్కి,నా రచనల ద్వారా ఆమెకు ఆనందాన్నిచ్చినందుకు ఎంతో మధురంగా కృతజ్ఞతలు తెలిపింది.
“ఆవిడ మాటలు నమ్మకు”,షమోహిన్ నా చెవిలో గుసగుసలాడేడు.”ఆవిడ వాటిలో ఒక్కముక్క కూడా చదవలేదు.”
ఆ సాయంత్రం నేను సముద్ర తీరంలో నడుస్తూ ఉంటే,షమోహిన్ నాకు ఎదురయ్యేడు. అతని చేతిలో పళ్ళు,చిరుతిళ్ళ బస్తాలున్నాయి.
“ప్రిన్స్ మక్తుయెవ్ యిక్కడికి విచ్చేశాడు!”అన్నాడతను ఆనందంగా. “అతను ఆమె సోదరుడైన భూతవైద్యుడితో కలిసి నిన్న యిక్కడికి వచ్చేడు.ఆవిడ తన అన్నకి ఏం రాస్తుందో నాకు ఇప్పటికి అర్థం అయ్యింది.దేవుడా!”అని అతను ఆకాశం వంక చూసి,ఆ బస్తాలను గుండెకు హత్తుకుని,కొనసాగించాడు: “ఆమెకు ప్రిన్స్ తో జత కుదిరితే,నాకు స్వేచ్చ దొరికినట్టే. అప్పుడు నేను మా నాన్నతో కలిసి మా ఊరికి వెళ్ళిపోవచ్చు.”
అతను పరుగెత్తాడు.
“నాకు ఆత్మల మీద నమ్మకం కుదిరింది”,అతను వెనక్కి తిరిగి అరిచేడు.
“ఇలారియన్ తాత ఆత్మ నిజమే చెప్పింది! దేవుడా ,అది నిజం కావాలి,తండ్రీ!”
ఈ కలయిక అనంతరం నేను మాల్టాని విడిచిపెట్టి వెళ్ళిపోయేను. షమోహిన్ కథ ఎలా ముగిసిందో నాకు తెలియదు మరి !
* * *