అను‘రాగం’

Spread the love

చలికాలపు రాత్రి యెనిమిది గంటలకే వీధుల్లో జనం పలచబడటంతో ప్రతి యిల్లూ చీకటి సముద్రంలో వెలుతురు దీవిలాగే కనబడుతోంది. ప్రహరీ దాటి యింటి వరండాలోకి రాగానే మేడపైన్నుంచీ  వుస్తాద్ రహీంఖాన్ సాబ్ పలచటి గొంతు అలలపైన దోగాడుతూ వచ్చే వెన్నెల్లా సుర్ మండల్ తంత్రీనాదాలపైన తేలుతూ వచ్చి మూర్తి ముఖాన్ని  కమ్మేయడానికి ప్రయత్నించింది.                                    

చీకట్లో మేడ మెట్లెక్కివెళ్తున్నకొద్దీ వెల్లుల్లితో కలగలిసిన మసాలా వాసన అదరగొట్టడంతో మూర్తి రుమాలుతో తనముఖుపుటాల్ని గట్టిగా మూసుకున్నాడు.  మేడపైకెళ్ళాక హాల్లోకి తొంగి చూసినప్పుడు అది తన యిల్లు కాదేమోనన్న అనుమానం అతడ్ని ముంచిపారేసింది. బయట చలిగాలి వీస్తున్నా హాల్లో వెచ్చదనం బెరుకుగా  విస్తరిస్తోంది .  

యింటి ముందు రోడ్డు వారగా ఆగిన కారును చూశాక రాజు గారు వచ్చారని తెలిసిపోయింది కానీ, మేడపైకొచ్చి చూశాకగానీ, ఆయనప్పుడా స్థితిలో వుంటాడని మూర్తి వూహించలేక పోయాడు. పడక్కుర్చీలో పడుకున్న రాజు గారు చేతపట్టుకున్న గ్లాసులోని తేనె రంగు ద్రవం వొలికిపోతోందనిగానీ, కట్టుకున్న పట్టు పంచె వూడిపోయి వేలాడుతోందనిగానీ గమనించే స్థితిలో లేడు.

పడమటి గోడ పక్కన పరిచిన  తెల్లటి పరుపుపైన  లావైన దిండునానుకుని సుర్ మండల్ మీటుతూ వదులుగా పద్మాసనమేసుకుని కూర్చున్న రహీంఖాన్ సాబ్ దుబ్బు తల గుబురుగా పెరిగి గాలిలో అలల్లా చెలరేగుతున్న వెంట్రుకలతో అరబ్బీ గుర్రాన్ని తలపిస్తోంది. చీకాకుతోనూ విసుగుతోనూ అలజడిపడుతున్న ఆ సమయంలోనూ మూర్తికి రహీం ఖాన్ గారిని అలా చూడగానే గుర్రం తలతోవుండే తుంబురుడు జ్ఞాపకమొచ్చాడు.   ధృడమైన పెద్ద దవడలున్న ఆయన పొడవాటి ముఖంలో, అటూ యిటూ జానెడు పొడవు వేలాడుతున్న బుర్ర మీసాలకిందనుంచీ అంతటి నాజూకైన స్వరమెలా వెలువడుతూందో అర్ధంగాకపోవడంతో మూర్తి అయోమయం లోకి పడిపోయాడు. యీప్పుడాయన్నిచూసిన వాళ్ళెవరూ గత నలబయ్యేళ్లుగాదేశాన్నంతా వూపేస్తున్న హిందూస్తానీ గాయకుడాయనేనని అనుకోలేరు.

రహీం ఖాన్ సాబ్ కు అయిదారడుగుల దూరంలో జంబుకానా పైన కూర్చుని అరమోడ్పు కళ్లతో తబ్లా వాయిస్తున్న పండిట్ పాగల్ దాస్ కు  పక్కనే నేలపైనున్న తన గ్లాసునిండా వూదా రంగు ద్రవముందన్న విషయం గుర్తున్నట్టే లేదు. అతడికి మూడడుగుల దూరంలో చిరిచాప పైన కూర్చుని సారంగి వాయిస్తున్న పండిట్ రాంలాలా, శబ్ధం రాకుండా పెదవులుకలుపుతూ ఖాన్ సాబ్ తో బాటూ మనసులోనే పాడుకుంటూ, అప్పుడప్పుడూ గ్లాసులోని ద్రవాన్ని చప్పరిస్తున్నాడు. అతడికి మరికాస్త దూరంలో మరో జంబుకానా పైన కూర్చున్న వుస్తాద్ రసూల్ చేతులు రెండూ హార్మోనియంతో ఆడుకుంటున్నాయి. రహీం ఖాన్ పరుపుకు దగ్గరగా కూర్చుని తాంబూరాతో శృతి పడుతున్న  ఆయన  కొడుకు ఛోటా ఖాన్ సాబ్  ముఖంలో చిరునవ్వు చెదరకుండా నిలిచిపోయివుంది.

యెక్కడపడితే అలా విచ్చలవిడిగా పడివున్న యెంగిలితట్టల్లోని మాంసాహారాల వాసనలను యీగలు  హాల్లో విరజిమ్ముతూ తిరుగుతున్నాయి. ముక్కు గట్టిగా మూసుకుని తలుపును కాస్త గట్టిగానే కదిలించాడు మూర్తి. హాల్లోని ఆరుగురిలో యేవొక్కరూ తన పొలకువను పట్టించుకునే స్థితిలో లేరని అతడికర్ధమయ్యింది.

రెండు పెద్ద రాతిగుండ్ల మధ్యలోంచీ వూరే  కొండనీటి వూటలా, రహీంఖాన్ సాబ్ లావుపాటి బుగ్గలమధ్యలోంచీ ఆయన పాట స్వచ్ఛం గా, లేలేతగా  పుట్టుకొస్తోంది. వుస్తాద్ పాగల్ దాస్ వేళ్ళు తబ్లా పైన నాట్యం చేస్తూనే  వున్నాయి. పండిట్ రాంలాలా సారంగిలోంచీ నాదాలు బుల్లిపిట్టల్లా యెగిరి వస్తూనే వున్నాయి. వుస్తాద్ రసూల్ గారి హార్మోనియం శబ్ధాల్ని రాగాలుగా మారుస్తూ మురిసిపోతోంది. తంబూరాపైన కదులుతున్న వేళ్ళు చోటాఖాన్ సాబ్ శిల్పం కాదని చెప్తున్నాయి. చెక్కపైన శబ్ధం రాకుండా దరువేస్తున్న చేయి మాత్రమే వాలుకుర్చీలో పడుకున్న రాజుగారు స్మారకంలో వున్నాడని హెచ్చరిస్తోంది.

కామోద్ రాగాన్ని పట్టుకుని ఖయాల్ పాడుతున్న రహీం ఖాన్ సాబ్ కాలాన్ని కదలకుండా బందిష్ లోనే ఆపేసినట్టున్నాడు. నిముషం సేపు వొళ్ళుమరచిపోయిన మూర్తి అంతలోనే పొద్దుటినించీ పడుతున్న అలజడిలోకి మళ్ళీ జారీ పడ్డాడు. నడి సముద్రపు తుఫానులో తగులుకున్న పడవలా గింగిరాలు తిరుగుతున్న తాను  మామూలు పరిస్థితుల్లో నయితే ఆయన పాటకు మిగిలనవాళ్లలాగే వొళ్ళుమరచిపోయి పరవశుడ్నయి పోయివుండేవాడినని మూర్తికప్పుడు  స్పురించనేలేదు. యిప్పుడాయన పాట తనలో చీకాకును మాత్రమే చెలరేపుతోంది.

పొద్దున్నుంచీ తానిక్కడ లేని సమయంలో తన బావమరిదిక్కడికొచ్చి వెళ్ళాడేమోనన్న అనుమానం మళ్లీ వోసారి మూర్తిలో కలవరాన్ని రేపింది. యిక్కడి యీ గానాబజానాను చూసేవుంటే యిప్పటికే పెనెంపైన పడిన తన బతుకు పొయ్యిలో పడే వరకూ అతనూరుకోడు.

తన యిబ్బందిని పట్టించుకోకుండా పడక్కుర్చీలో తన్మయంగా పడుకున్న రాజు గారిని చూసి కోపంగా పళ్ళు      కొరుక్కున్నాడు మూర్తి.

“రహీం ఖాన్ లాంటి మహా గాయకుడింత  చిన్న వూరుకు రావడమే గొప్ప. ఆయనకు హైదరాబాదు రెండో యిల్లు లాంటిదైనా మనవూరికెప్పుడూ రాలేదు. యీ సారి కూడా అటే హైదరాబాదునుంచీ బొంబాయి కెళ్లిపోయేవాడే. మన  సంగీతోత్సవానికి రమ్మని ప్రాధేయపడితే నా మాట తోసేయలేక  వచ్చాడు.  యింకా వారం రోజుల తర్వాతగదా మీ సంగీతోత్సవం, అందాకా హైదరాబాదులోనే వుంటానన్నాడాయన. నేనే పట్టుబట్టి  యిక్కడికి రమ్మన్నాను. ఆయనకొక వారం పాటూ మంచి బస యేర్పాటు చేయలేకపోతామా?” అని రాజుగారు తనతో అన్నప్పుడు ఆయన మనస్సులో యింత దుర్మార్గముందని మూర్తి అనుకోలేదు.

“మీలాంటి మంచి గాయకుడికి, సంగీత పండితుడికి, హిందూస్తానీలో కూడా ప్రవేశముండడం చాలా అవసరం.  మీ  కోసమేనన్నట్టుగా రహీం ఖాన్ సాబ్  మన వూర్లో పది దినాలు మకాం చేయబోతున్నాడు. నటన, సంగీతమూ రెండింటిలోనూ అంతగా పేరుతెచ్చుకున్నవాడింకొకడు యీ భూప్రపంచంలో పుట్టలేదు. మనం సినిమా తీసేలోగా మీరు హిందూస్తానీ కూడా నేర్చుకోవడం అవసరం ,”అని రాజు గారు మరింతగా విశదీకరించి చెప్పినప్పుడుకూడా యిలాంటిదేదో జరుగుతుందని మూర్తి వూహించలేకపోయాడు.

“మా మూర్తిగారికి  కర్ణాటక సంగీతంలో పెద్ద  పేరుంది. ఆయన టాలెంటుకీ వూరు సరిపోదు. మా  తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్నా యింకా యే  వూరినీ మేము కల్చరల్ కాపిటల్ గా మార్చుకోలేక పోతున్నాము. యీవూర్లో సొంత యిల్లూ,  రేడియో లో  వుద్యోగమూ లేకుంటే మూర్తిగారెప్పుడో మదరాసు కెళ్లిపోయుండేవాడు. అక్కడైతే  సంగీతసభలూ , కచేరీలూ వూపిరితిప్పుకొనిచ్చేవి గావు. యెప్పటికైనా నేనే మూర్తి గారిని మదరాసుకు లాక్కెల్తాను. మీ రంటే మూర్తి గారి కెంత భక్తో  చెప్పలేను,” అని తనను రహీం ఖాన్ సాబ్ కు పరిచయం చేసినప్పుడు కూడా మూర్తి కీ సందేహం  రాలేదు.

యిప్పటికింకా సినిమాలు తీయలేదు గానీ  అవసరమయితే సునాయాసంగా అబద్దాలు చెప్పే సినిమావాళ్ళ బుద్ధి మాత్రం రాజుగారికి  బాగా అలవడి పోయిందని మూర్తికి తెలుసు. బెజవాడ కవతలేదో పెద్ద పేరున్న జమిందారీకి యేకైక వారసుడిగా రాజు గారికి పెద్ద ఆస్తులే వున్నాయంటారు. యాభై అరవై సంవత్సరాలకు ముందే  రాజు గారి తండ్రి వోడల్లో వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాడు. సంవత్సరంలో యెక్కువ రోజులు బొంబాయిలోనే గడిపే  రాజు గారికి  కర్ణాటక సంగీతమంటే యెంత యిష్టమో హిందూస్తానీ అంటే అంతకన్నా యెక్కువ   పిచ్చి. యిటువైపుకెప్పుడొచ్చినా యీవూర్లో  ఆగి హోటల్లో దిగేస్తాడు. వ్యారపు పనులనంతా వీలయినంత తొందరగా ముగించుకుని, కవుల్నీ, గాయకుల్నీ పిలిపించుకుని హోటళ్లలోనే భువనవిజయాలు పెట్టుకుంటాడు. రహీం ఖాన్ సాబ్ కు కూడా యేదో హోటల్లోనే మకాం యేర్పాటు చేస్తాడని మూర్తి అనుకున్నాడు.

మూర్తిని  సంగీత దర్శకుడ్ని చేయడం కోసం తానే సినిమా తెస్తానని రాజుగారు టాంటాం వేసేశాడు కానీ   ఆ సినిమా యెప్పుడు తీస్తాడో చెప్పడు. అసలు తీయడేమోననీ, తనను వొట్టిమాటలతో వూరిస్తున్నాడేమోననీ మూర్తి కి బలమైన అనుమానం కూడా లేక పోలేదు. యీలోగా తన జీవితంలో  పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిన  యీ సమయం లో,  రాజు గారు తనతో యిలా ఆడుకుంటాడని మూర్తి అనుకోలేదు.

 “ఆ హోటళ్ళల్లోవుండే సన్నటి యిరుకు గదులు రహీంఖానా సాబ్ గారికి నచ్చవు. విశాలమైన యిల్లే కావాలి,” అని రాజు గారన్నప్పుడు కూడా మూర్తి కి అనుమానం  రాలేదు.  ఆయనతో కలిసి తిరుగుతున్నప్పుడు  పిల్లలతో బాటూ తనభార్య పుట్టింటికెళ్లిందనే సంగతిని  తానే అనాలోచితంగా నోరుజారి చెప్పేశాడు

రహీం ఖాన్ గారి గొప్పతనాన్ని గురించి విన్నట్టుగానే ఆయన వింత జీవిత విధానాల్ని గురించికూడా మూర్తి చాలా కథలు విన్నాడు. స్వాతంత్రం రాకముందు యెక్కడో పాకిస్తాన్ లోని లాహోర్ దగ్గరినుంచీ మహారాష్ట్రకొచ్చి స్థిరపడిపోయిన తన తండ్రిగారే రహీం ఖాన్ గారికి తొలిగురువు కూడా. అయితే ఆయన చిన్నవయసులోనే చనిపోవడంతో రహీం ఖాన్ గారు తన పదేళ్ళ వయసులోనే నాటకాల్లో నటించి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. కమ్మని కంఠమున్న రహీం ఖాన్ గారు సంగీతప్రధానమైన ఆనాటి అన్ని పౌరాణిక నాటకాల్లోని స్త్రీ పాత్రలనంతా పోషించి వెలిగిపోయాడు. చిత్రంగా ఆయనకు కిరాణా, జైపూర్ అత్రోలి, గ్వాలియర్, పాటియాలా ఘరానాల విద్వాంసులు వొకరి తర్వాత వొకరు గురువులుగా దొరికారు. దానితో ఆయన అన్ని ఘరానాల సంగమంగా మారిపోయాడు.

ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత ఆయన భార్య పెద్ద జబ్బుచేసి అకస్మాత్తుగా చనిపోయాక ఆయనలో పెద్ద మార్పులొచ్చాయని అంటారు. చిన్నప్పటినుంచీ తాగుడు అలవాటుండేదిగానీ భార్య పోయాక అది యెక్కువయ్యిందంటారు అందరూ.  స్టేజీయెక్కేముందు గొంతులదాకా తాగిన తర్వాతే నటనలోకి దిగుతాడనీ, కచీరీలోనయినా ఆదేస్థితిలో పాడుతాడనీ అందరూ చెవులు కొరుక్కుంటారు. అయితే నటించడం మొదలెట్టాక ఆయన ఆ పాత్రే అయిపోతాడనీ, పాడ్డం మొదలెట్టాక యిక అది గంధర్వ గానమేననీ , అప్పుడాయనకు వినమ్రంగా నమస్కరించడం తప్ప మరేమీ చేయలేమనీ అంటారు. తినడం లోనూ , తాగడం లోనూ ఆయనది వొంటె లక్షణమే గావడంతో  కార్యనిర్వాహకులకాయనతో వేగడం కత్తి మీది సామలాగవుతోందన్నారు. రోజులతరబడీ మంచినీళ్లయినా తాగకుండా వుండిపోతాడనీ, యే అపరాత్రిలో ఆహారం కావాలని అడుగుతాడో తెలియదనీ, అప్పుడాయనేమి కావాలంటాడో చెప్పలేమనీ, యెంత తింటాడోకూడా వూహించలేమని వాళ్ళు మొత్తుకుంటారని మూర్తి విన్నాడు.  తనకు  హిందూస్తానీ  నేర్చుకునే మార్గమిదేనని చెప్పి, రాజుగారిలాంటి రహీం ఖాన్ గారిని ఆయన  గానా బజానాతో బాటూ  తన మేడపైకి చేర్చి యిలా వినోదం చూస్తూ కూర్చుంటాడ ని మూర్తి యెప్పుడూ అనుకోలేదు. రాజు గారు తన వూరినుంచీ వంటవాడ్ని వంటపాత్రలతోబాటూ రప్పించి యింట్లోనే విందు భోజనాలు యేర్పాటు చేసేశాడు.  వెల్లుళ్లయినా అడుగుపెట్టలేని స్తోత్రియగృహం లోకి మాంసాహారాలూ, స్కాచ్ విస్కీలూ దూరేశాయి.  తనపైన గొంతులవరకూ కోపమొచ్చి వెళ్ళిపోయిన భార్యకీ సంగతి తెలిస్తే యిక జన్మలో తన ముఖం చూడదు. పిల్లలు తననింకా యెక్కువగా యేవగించుకుంటారు. మూర్తికేమి చేయడానికీ తోచడం లేదు.  

యిప్పట్లో యీ మెహఫిల్ తెమిలేది గాదని తెలిసాక, ముంచుకొస్తున్న విసుగుని బలవంతంగా అణచుకుంటూ , “రాజు గారూ, రాజు గారూ, “ అని ఆయన చేయి పట్టుకుని పెద్దగా కదిపాడు మూర్తి.

కలలోంచీ మేలుకున్నట్టుగా రాజు గారు వులిక్కిపడి కళ్ళు తెరిచి, గ్లాసులో మిగిలిన ద్రవాన్ని చూసి అదోలా చికిలి నవ్వు నవ్వి, “ యెప్పుడొచ్చారండీ మూర్తి గారూ మీరు? వెళ్ళిన మీ అర్జెంటు రాచకార్యమేమయింది?” అన్నాడు యెగతాళి ధోరణిలో.

రహీం ఖాన్ సాబ్ ప్రసన్నంగా నవ్వి,” తుమారా బీవీ కా తబీయత్ కైసీ హై బేటా? వుస్కా ప్రసవ్ కబ్ హోగా?” అని అడిగాడు.

మూర్తి సమాధానం చెప్పకుండా నీళ్ళు నమలసాగాడు.

“నిజంగా డెలివరీకేనా? లేక మీ పైన అలిగి వెళ్లిపోయారా?” అంటూ రాజు గారు బిగ్గరగా నవ్వేశాడు. తాను రహస్యమని దాచిపెట్టుకున్న విషయాన్ని రాజు గారు పసిగట్టేసినట్టున్నాడు.

“ష్..” అంటూ అతడ్ని వారించాక “బీవీకో చోడ్ కర్ యిత్నా దిన్ రెహ్నా అచ్ఛా నహీ బేటా!” అన్నాడు రహీంఖాన్ సాబ్. ఆయన గొంతు అదోలా బొంగురుపోయి పలకడంతో మూర్తి మినకరించి చూశాడు. తాను అత్తవారింటికెళ్ళి భార్యను చూసివచ్చానన్న విషయం రహీం ఖాన్ సాబ్ లో గుబులును   రగిలించినట్టుంది. మూర్తి  కంగారుపడుతుండగానే రహీం ఖాన్ సాబ్ ఆలాపన ప్రారంభమై అది “సాజన్ గయే పరదేశ్ “ అనే విరహాన్ని పొదువుకున్న టుమ్రీ  గా పురివిప్పింది. ఆ గానం తన గుండెల్లో యెక్కడో సుడితిరగడంతో మూర్తి కదిలిపోయాడు.

•                                             *                              *

బస్సులో యేకధాటిగా యెనిమిది గంటలు ప్రయాణం చేసివచ్చిన తనను వాళ్ళు అంతగా నిరాదరణ చేస్తారని మూర్తి అనుకోలేదు.

హాల్లోకెళ్లి కూర్చున్న అరగంట తర్వాత ముసలి అత్తగారు చెంబు నీళ్లు తీసుకొచ్చి  టీపాయ్ పైన పెట్టి పలకరించకుండా గిర్రున తిరిగి వెళ్లిపోయింది. లోపలి గదుల్లో యెక్కడో తన భార్యా పిల్లలూ కావాలని తన కంటబడకుండా ముడుక్కుని వున్నారు. మరో అరగంట తర్వాత తన బావమరిదిభార్య హాల్లోకి తొంగిచూసి,            “ స్నానం చేయండన్న గారూ,” అని చెప్పింది.

సూట్కేసు తెరిచి టవలుతీసుకుని బాత్రూంలోకెళ్ళాడు మూర్తి. పెళ్ళయిన కొత్తలో రెండు వారాలు గడిపినప్పుడు  యిదే యింట్లో తనకు జరిగిన రాచమర్యాదలన్నీ మూర్తి కి గుర్తుకొచ్చాయి. చిన్న వయస్సులోనే గొప్ప గాయకుడని పేరు తెచ్చుకున్నవాడు అల్లుడుగా దొరికేసరికి అత్తగారు  మురిసిపోయారు. తన కున్న పేరు ప్రతిష్టలు జూసి బావమరిది అడుగులకు మడుగులొత్తాడు. తనకప్పుడంతగా ఆస్తిపాస్తులు లేవని కూడా యెవరూ గొణగలేదు. తల్లి తండ్రులు చిన్నప్పుడే పోవడంతో, బాబాయి యింట్లో కష్టాలుపడుతూ పెరిగి, గురువు గారి వూర్లో  వారాలు చేసుకుంటూ సంగీతం నేర్చుకున్న తనకు  పుట్టిన తర్వాత మొదటిసారిగా ప్రేమ, ఆదరణ యీ యింట్లోనే దొరికాయి. 

 పెళ్ళయిన రెండు నెలలకే తనకు రేడియో లో వుద్యోగ మొచ్చింది. డిగ్రీలు లేకపోయినా తన పాండిత్యాన్ని మెచ్చుకుని వాళ్ళే పిలిచి  వుద్యగం చేయమని కోరారు. మరో రెండు నెలల తర్వాత మూర్తి  మాతామహుడైన  తాతగారు పోయాడు. పోతూ పోతూ ఆయన శ్రీ పురం కాలనీ లో వున్న తన రెండతస్తుల యిల్లును మూర్తి కిచ్చి వెళ్లిపోయాడు. ఆయనకున్న ముగ్గురు కూతుర్లలో మూర్తి తల్లి రెండోది. పెద్ద కూతురికీ, చిన్నకూతురికీ బతికున్నప్పుడే చాలా యిచ్చాడనీ, రెండో అమ్మాయికేమీ యివ్వలేకపోయాడనీ,  అది అన్యాయమని ఆయన భార్య పోయేంతవరకూ పోరేదట! పోవడానికి కొన్ని రోజులముందు ఆయన లాయర్నిపిలిచి వీలునామా రాసిపోయాడు. కొడుకుల్లేని తనకు శ్రాద్ద కర్మలు పెట్టే భాద్యత మనవడిగా మూర్తి దేనన్నదొకటే ఆయన పెట్టి వెళ్లిన షరతు. పెళ్ళవుతూనే అలా వుద్యోగమూ, యిలాసొంత యిళ్లూ రావడం భార్య అదృష్టం వల్లే జరిగిందని బంధువులందరూ చెవులు కొరుక్కున్నారు.  పెద్ద కొడుకు పుట్టాక అత్తగారింటికొచ్చి వారం రోజులు గడిపేటప్పటికి తన హోదా పెరిగిపోవడమూ, అప్పుడిదే యింట్లో తనకు ఘనమైనమర్యాదలు జరగడమూ మూర్తి కి జ్ఞా పక మొచ్చింది.  స్నానాల గదిలో బకెట్లో  వేడినీళ్లూ, కొత్త సబ్బు బిల్లా, టవలూ అన్నీ యెవరో యేర్పాట్లన్నీ చేసేవెళ్ళారు. స్నానం చేశాక హాల్లోనే దుస్తులు మార్చుకున్నాడు. బావమరిది కూతురు, పదేళ్ళ పిల్ల, దాగుడుమూతలాడుతున్నట్టుగా “టిఫెను రెడీ, లోపలికి రమ్మంటున్నారు” అని చెప్పి పారిపోయింది.

లోపలికెళ్లి పీట పైన కూర్చున్నాడు మూర్తి. పళ్ళెంలోని యిడ్లీలను బలవంతంగా నోట్లోకి కుక్కుకున్నాక  చేతులు కడిగేసుకున్నాడు.

“అది మీకేం లోటు చేసిందని యింత ఘోరం  చేశారు?” యేడుపుతోబాటూ ముసలావిడ కోపం గడప కవతలినుంచీ విసురుకొచ్చింది.

చివాలున పైకిలేచి, “నేను దానికేమి లోటుచేశానో చెప్పమనండి,” అన్నాడతను కోపంగా. సరసరా హాల్లోకొచ్చి కూర్చుని రోషంతో రొప్పసాగాడు.

తాను మునుపెలాగున్నాడో తర్వాతా అలాగేవున్నాడు.  ప్రతి రాత్రీ యెంత ఆలస్యమైనా యింటికే  వచ్చి పడుకుంటున్నాడు. పిల్లలతో మునుపెంత సేపు గడిపేవాడో తర్వాతా అంతేసేపు గడిపేవాడు. పండుగలకూ, పూజలకూ యింట్లోనే వుంటున్నాడు. బయటి పనులు చేసుకునే సమయంలో కొంతసేపు మాత్రమే అక్కడి కెళ్తున్నాడు.  యిందులో వీళ్ళకు జరుగుతున్న అన్యాయం యేముంది?

వీళ్ళు తనని మాత్రమేగాకుండా భువనేశ్వరిని గూడా తిట్టుకుంటూవున్నారని తోచగానే మూర్తికి కోపం మండుకొచ్చింది. పాపం, ఆమె యిప్పుడేం చేస్తూందో! ఆమెకు చెప్పకుండా వచ్చేశాడు తాను. నిన్నంతా అటు వెళ్లకపోయేసరికి కళ్ళు చించుకుని యెదురు చూస్తూ వుండిపోయి వుంటుంది. నిద్ర పోయిందో,లేదో?

రేడియోలో పాడేందుకొచ్చిన కొత్త  గాయనిగా పరిచయమయినప్పుడు భువనేశ్వరి  తనకంత త్వరగా అంత చేరువవుతుందని మూర్తి అనుకోలేదు. తెలియని శక్తేదో తనను మొదటినుంచీ రకరకాల దారుల్లోకి తీసుకెళ్తోందనీ, తాను నిమిత్తమాత్రుడిగానే వుంటున్నాననీ మూర్తి చాలాసార్లు అనుకున్నాడు. భువనేశ్వరి గొంతులో కొత్త ఆకర్షణేదో వినిపించినప్పుడు కొన్ని అవకాశాల్ని యిచ్చాడు. బాగానే పాడిందిగానీ యెవరూ పట్టించుకోలేదు. ఆమె తన గానాన్ని మెచ్చుకోవడంలో అలసిపోయేదిగాదు. తనతో మాట్లాడ్డమే పెద్ద అదృష్ట మన్నట్టుగా మురిసిపోయేది. తానే ఆమెను వెదుక్కుంటూ ఆమె యింటి కెళ్ళాడు.  మూర్తి లాంటి పేరున్న సంగీతవిధ్వాంసుడు తమయింటికి రావడమే గొప్పని భువనేశ్వరి తల్లి మురిసిపోయింది.

భువనేశ్వరిది దాదాపుగా తన వయస్సే ననీ, పెళ్ళయిన మూడేళ్ళ తర్వాత ఆమె భర్త పోయాడనీ, అప్పటినుంచీ ప్రయివేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తూ బతుకుతోందనీ మూర్తికి తెలిసింది. ఆమె అన్నలిద్దరూ యెక్కడో వేరే వూర్లలో వుద్యోగాలుచేసుకుంటున్నారు. చెల్లెలినీ, తల్లినీ వాళ్ళు పట్టించుకున్నదెప్పుడూ లేదు. తనకు చిన్నప్పటినుంచీ సంగీతమంటే యిష్టమని భువనేశ్వరి చెప్పినప్పుడు ఆమె కంత పాండిత్యముందని మూర్తి వూహించలేక పోయాడు. ఆమెతో రాగాల గురించీ, కీర్తనల సాహిత్యం గురించీ మాట్లాడుతూ కాలాన్ని మరచిపోయేవాడు.   కొద్ది రోజులయ్యాక తాను సంగీత కచేరీలకెళ్తున్నప్పుడు యేయే  కీర్తనలను యేయేవరసలో పాడాలో ఆలోచించి చెప్పేది. తానా సలహాలను పాటించకపోయినా అలిగేదిగాడు. యెప్పుడూ చెరగని చిరునవ్వుతో తన సాన్నిహిత్యముంటే చాలన్నట్టుగా వుండేది.

భువనేశ్వరి పక్కనున్నప్పుడల్లా మూర్తి కి తన భార్యే గుర్తుకొచ్చేది. తానెప్పుడైనా భరించలేక విసుక్కుంటే ఆమె వారం పది దినాలు గడచినా ఆంటీ ముట్టకుండా దూరంగా తప్పుకుని తిరిగేది. అమెదే తప్పయినా తానే పట్టుదల వదలిపెట్టి దగ్గరికి తీసుకోవాల్సి వచ్చేది. తానేదైనా పాడి వినిపించి యెలాగుందని అడిగితే బాగుందని మాత్రమే చెప్పేది. కావాలని వేరేవాళ్ళ పాట పాడి వినిపించాడొకసారి. అదీ బావుందనే అంది. “యిది నాపాట కాదు లక్ష్మీ! భావానికీ రాగానికీ కుదరలేదు,” అని కసిరాడు. “అది నాకేం తెలుసు? మేరేది పాడినా బాగుందనే అనిపిస్తుంది నాకు,” అంది. ఆమె నిజం చెబుతోందో, బుకాయిస్తోందో తెలిసేది గాదు. ఆమె దగ్గరున్నప్పుడు లేని సంతోషమేదో భువనేశ్వరి పక్కనున్నప్పుడు దొరుకుతోంది.

రేడియో స్టేషనులో  డ్యూటీ ముగిశాక భువనేశ్వరి యింటికెళ్లడం కెళ్లడం, అక్కడినుంచీ ఆలస్యంగా  తన  యింటికెళ్లడం అలవాటయ్యింది మూర్తికి . రికార్డింగుల్లోనో, స్టుడియోల్లోనో ఆలస్యమయ్యిందనీ, అక్కడే భోంచేయవలసి వచ్చిందనీ భార్యకు అబద్దాలు చెప్పసాగాడు.

అయితే అలాగే రోజులు దొర్లించడం కుదరలేదు. తాను పరాయి యింటిలో చాలాసేపు గడుపుతున్నానని తన చుట్టూ వున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. తనకు పెళ్లయిందనీ, హైస్కూలు చదువుతున్న పిల్లలు ముగ్గురున్నారనీ భువనేశ్వరికి  తెలుసు. చాలా రోజులపాటూ తటపటాయించాక చివరికోనాడు “మనం పెళ్లి చేసుకుందాం,” అని తానే ఆమెనడిగేశాడు. “ వద్దొద్దు. వొక భార్య వుండగా రెండో పెళ్లి చేసుకోడానికి లా వొప్పు కోదు. మీ వుద్యోగానికే డేంజరు,” అని ఆమె వారించింది. తనకంటే ముందుగా ఆమె ఆ సంగతులన్నీ ఆలోచించిందని  మూర్తి కప్పుడే తెలిసింది.

భువనేశ్వరి విషయం తన భార్య కెలాగో తెలిసిపోయింది. స్నేహితులో, కొలీగ్సో యెవరో మోసేశారు.

మొదట్లో లక్ష్మి నమ్మినట్టు లేదు. అయితే ఆధారాల్ని చేరేసేవాళ్ళకు లోటులేదు. ఆమె అలగడమూ, గొడవపడడమూ, నిరసనలు చేయడమూ మొదలయ్యింది. తాను పట్టించుకోలేదు.

చివరికోనాడు “మీరు మారతారా , లేదా?” అని లక్ష్మి తనను నిలేసింది. “నీకిప్పుడేం తక్కువవుతోంది? నోర్మోసుకుని పడుండు,” అని తాను కోప్పడ్డాడు. ఆరోజు రాత్రి యింటికొచ్చేసరికి బీగాలు వెక్కిరిస్తూ కనిపించాయి. పనిమనిషొచ్చి అమ్మగారు తాళాలు తనకిచ్చి వెళ్లిందని చెప్పింది.  పుట్టింటికెళ్ళివుంటుందనీ, యెన్నాళ్లు సాధిస్తుందిలెమ్మనీ, అనుకున్నాడు. పిల్లల చదువులకోసమైనా నెలలోపల తిరిగొస్తుందనుకున్నాడు. కానీ ఆరు నెలలు గడచినా ఆమె దగ్గరినుంచీ వుత్తరమైనా రాలేదు.

లక్ష్మి వెళ్ళిపోయిన నెల తిరక్కముందే జరిగిందేమిటో మూర్తికి అర్ధమై పోయింది .తనదైన ప్రపంచంలోని పెద్ద భాగాన్ని తన భార్య  తీసుకెళ్లిపోయిందన్న సంగతి తెలిసాక మూర్తి  చెప్పుకోలేని బాధతో తలకిందులైపోయాడు. . యెంత ఆలస్యంగానయినా యింటి కొచ్చి తన పడక పైన పడుకుంటేగానీ తనకు పడుకున్నట్టుండదు. పడుకున్నాక ఆమె శరీరపు పరిమళం సోకితేగానీ సరైన నిద్ర పట్టదు. తాను వుదయం లేచేసరికి యింట్లో తనకు కావల్సిన పనులన్నీ జరిగిపోయివుండేవి. తనకేది యిష్టమో తెలుసుకుని చేసిపెట్టే భోజనాలుండేవి. రాత్రెంత ఆలస్యంగా వచ్చినా యేవో  కబుర్లు చెప్పడం కోసం యెదురుచూస్తూ పిల్లలుండేవాళ్లు.  అడక్కపోయినా స్కూలు ప్రోగ్రెస్ రిపోర్టులు తన ముందు కొచ్చేవి. ప్రతి రోజూ యేదోవొకటి కావాలని పిల్లలడిగేవాళ్లు. తీసుకెళ్తే మురిసిపోయేవాళ్లు. లేకపోతే అలిగే వాళ్ళు. యేదీ అడగకపోయినా, ప్రత్యేకంగా యేదో చేయమని పోరకపోయినా, యింట్లోవున్నంతసేపూ భార్య నీడలా వుండేది. వాళ్ళందరూ వెళ్లిపోయాక యిల్లు బావురుమంటూ పెద్ద తప్పు  చేసావని  తనను నిలదీయసాగింది. చిన్నవాడు పుట్టకముందు వరకూ తాను పెళ్ళాం కొంగు వదలకుండా తిరిగేవాడినని మూర్తి కి గుర్తొచ్చింది. తర్వతేమయ్యింది తనకని తనని తానే ప్రశ్నించుకోసాగాడు.

భువనేశ్వరియింట్లోనే కాలం గడపడానికి ప్రయత్నించాడు మూర్తి. రెండురోజులైనా కాకముందే  శ్రీ పురం కాలనీకి వెళ్లాలన్న కోరిక తీవ్రమయ్యింది. కానీ బోసిపోయిన యింట్లో వుండలేకపోయాడు. భార్యతోనూ, పిల్లలతోనూ తనకంత ఘాడమైన బంధముందన్న సంగతి తన కంతవరకూ తెలియదు. వాళ్ళు లేని లోకం నిస్సారంగా వుంది. వీలయినంతవరకూ సంగీతంలోకీ, మిగిలిన పనుల్లోకీ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే యే పనిలోనూ యేకాగ్రత దొరకలేదు.పనులన్నీ పాడవుతున్నాయి. యేదీ తెమలడం లేదు.  విసుగూ, చీకాకూ పెరిగిపోతున్నాయి. భువనేశ్వరిని కూడా కసర సాగాడు. ఆమె కోప్పడకుండా అనునయిస్తూంటే అది ఫ్రేమ కాదేమోననీ, జాలి మాత్రమేననీ అనిపించసాగింది. ఆమె నిస్సహాయతను వాడుకుని తానామెను మోసం చేశాననీ అనిపించేదొకసారి. తన బలహీనతనామె తెలివిగా వుపయోగించుకుందనిపించేది మరోసారి.  ముద్దాయి తానో, ఆమో తెలియక విసుక్కోసాగాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకోసాగింది.

రోజులూ, వారాలూ, నెలలూ గడచిపోసాగాయి.  తన వేదనేమిటో ముందుగా భువనేశ్వరికే తెలిసినట్టుంది. అతడ్ని పట్టుకుని యేడుపు నాపుకోడానికి ప్రయత్నిస్తూ, “యిలా యెన్నాళ్లు? మీరేవెళ్ళి తీసుకురండి,” అంది. అప్పటికిగానీ తన కర్తవ్యమేమిటో తనకు తోచలేదు. కానీ వెళ్లడానికి భయమేసింది. భువనేశ్వరిని వదిలిపెట్టడం తప్పని పిస్తోంది.  మూర్తి కేమిచేయడానికీ పాలుపోలేదు.

రికార్డింగ్ థియేటరులో వుండగా తన బావమరిది స్నేహితుడొకడు వెతుక్కుంటూ వచ్చాడు. అదీ యిదీ మాట్లాడాక వెళ్లిపోతూ, పోయిన నెలలో తన బావమరిదిని బస్టాండులో చూశాననీ,  తన చెల్లెలి కొడుకునెవరినో ఆస్పత్రిలో చేర్పించి వెళ్తున్నానని అతను చెప్పాడనీ, బాంబొకటి పేల్చి పోయాడు.

తన కొడుకును హాస్పిటల్లో చేర్పించాల్సినంత యిబ్బందేమివచ్చిందోనని మూర్తి బెంబేలెత్తిపోయాడు. వెంటనే బయల్దేరేశాడు.

తీరా తానింత  దూరమిలా కష్టపడి వస్తే పిల్లలుగానీ, భార్యగానీ తన ముఖమైనా చూడకుండా దాక్కుంటారనుకోలేదు మూర్తి. హాల్లో వొంటరిగా వేగాక ద్వీపాంతర వాసమంటే యెలాగుంటుందో అనుభవానికొచ్చింది. చాలా సేపటి తర్వాత కాఫీ తీసుకొచ్చిన బావమరిది కూతురు చేతిని గట్టిగాపట్టుకుని          “ రామూ యెక్కడ?” అని అడిగాడు.

“తెలియదు. బయటికెళ్ళాడు,” అందాపిల్ల బెదురు చూపులు చూస్తూ.

తన కొడుక్కి పెద్ద ప్రమాదమేమీ లేదని మూర్తి కి అర్ధమయింది.

“మీ నాన్న?”

“వూరెళ్లారని  చెప్పమన్నారు.”

“యేవూరు? యెప్పుడెళ్ళాడు?”

“తెలియదు.”

“పద్దూ..చిన్నూ…”

“లేరు. బయిటికెళ్లారు.”

తన బావమరిదికి బయటూరి కెళ్ళాల్సిన పనులేవీ వుండవని మూర్తికి బాగా తెలుసు. బహుశా అతను తనను కలవడం కోసమే, అమీ తుమీ తేల్చుకోడానికే వెళ్ళుంటాడు. ఆ అమ్మాయి చేయి వదలిపెడుతూ “నేను వెళ్తున్నానని చెప్పు,” అన్నాడు.

ఆ పిల్ల లోపలికెళ్ళాకగూడా యెవరూ బయటికి రాలేదు. మూర్తి కి కోపం తన్నుకొచ్చింది. సూట్కేసు తీసుకుని గబ గబా బయటికొచ్చేశాడు.

•                                                    *                                    *

బాగా రాత్రి కావడంతో వీధంతా నిశ్శబ్ధంగా, నిర్మానుష్యంగా వుంది. సూట్కేసును యింట్లో పడేసి మేడపై కొచ్చాడు మూర్తి.

హాల్లోని మనుషులు  లేత బంగారు రంగు ద్రవంలో యీదులాడుతున్నారో, రహీం ఖాన్ సాబ్ గానంలో మునిగిపోయివున్నారో తెలియడం లేదు. వాళ్లందరినీ చంటిపిల్లల్లా పైకెత్తుకుని ఆడిస్తున్న సంగీతపు అలలు తననెందుకు దూరంగా విసిరి కొడుతున్నాయో తెలుసుకునే స్థితిలో అతను లేడు. ఖాన్ సాబ్ ఆపకుండా పాటనంతసేపెందుకు లాగుతున్నాడని మనస్సులోనే విసుక్కోసాగాడు.

చివరికి రహీం ఖాన్ సాబ్ ఖయ్యాల్ ను ముగింపుకు తీసుకొచ్చాక, రాజుగారి దగ్గరికెళ్లి, ఆయన చేయిపట్టుకుని లాగి, “ రాజు గారూ! మా బావమరిది …వస్తున్నాడు,” అని ఆక్రోశించాడు మూర్తి.  స్మారకం వచ్చీ రాని  స్థితిలో రాజుగారు కళ్ళు తెరిచి , మూర్తి కేసి తిరిగైనాచూడకుండా ఖాన్ సాబ్ కేసి చూసి పరవశంగా నవ్వి, “ కృష్ణుడికోసం విరహంలో పాడుతుంటే మీరు రాధే అయిపోయారు ఖాన్ సాబ్,” అన్నాడు అంగవస్త్రంతో కళ్ళకున్న తడిని తుడుచుకుంటూ.

“గాయన్ కో స్త్రీ పురుష్ కా ఫరక్ నహీ హోతా రాజా సాబ్!” అన్నాడు రహీం ఖాన్ సాబ్  సుర్ మండల్ మీటడం ఆపకుండా. “రాధా కా వియోగ్ జీతనా హో , కన్హయ్యాకా ప్యార్బీ వుతనా హోగా .”

తబ్లాకు విరామమివ్వడం కోసం వెనక్కు వాలిన పాగల్ దాస్ అరమోడ్పు కళ్ళతో తలను శృతి బద్దంగా వూపుతున్నాడు. వొడిలో పడుకోబెట్టుకున్న సారంగి తంత్రుల్ని తాకకుండా , గాల్లో లయబద్దంగా వేళ్ళు కదుపుతున్న రామ్ లాలా యేవో రాగాలను ఆవాహన చేస్తున్నట్టున్నాడు. హార్మోనియంను వదిలేసినా రసూల్ సాబ్ చేతులు గాలి మెట్లను మీటుతున్నట్టుగా ఆడుతున్నాయి. ఛోటా ఖాన్ ముఖంలో చిరునవ్వుగా విచ్చుకున్న పెదవులు, రెక్కలల్లార్చకుండా వాలిన బుల్లిపిట్ట లాగున్నాయి.

రాజు గారి చెవి దగ్గరికి వంగి, “ మా బావమరిది నిష్టలో విశ్వామిత్రుడు. హోమాలూ, పూజలూ, యజ్ఞాలూ యెక్కడుంటే అక్కడుంటాడు. యిలా మాంసాహారాలు తినే యింట్లోకి అడుగుకూడా పెట్టడు. మైకెత్తుకుని నా     మానం కడిగేస్తాడు,” అని అంగలార్చాడు మూర్తి.

రాజుగారు తలాడించి “అలాగే, అల్లాగే “ అన్నాడు. తన మాటలు ఆయన చెవికెక్కక పోవడం తో  మూర్తి నీరసంగా కూలబడిపోయాడు.

యింతలో రహీం ఖానా సాబ్ మరో ఆలాపననందుకున్నాడు. అదో రాగంగా మారగానే, “ శభాష్! రాగ్ హంసధ్వని,” అని రాజుగారు కేరింతలు కొట్టాడు.

మూర్తి కి నిముషాలు యుగాలుగా దొర్లసాగాయి. కానీ రహీం ఖాన్ సాబ్ పాడ్డం ఆపగానే, “ అప్పుడే అయిపోయిందా? అంతర ను మరికాస్సేపు వినాలనిపించింది,” అని రాజుగారు వాపోయాడు.

“రాగ్ కో కీంచ్ కర్ గానేసే సుర్ నహీ మిల్తా రాజా సాబ్!  రాగ్ గహరా  హోనా! దిల్ కో చూనా! సవాల్ సమయ్ నహీ, సవాల్ గహరాకా ,” అంటూ బడే ఖాన్ సాబ్ బుగ్గల పైన్నుంచీ కిందికి జారుతున్న బుంగ మీసాల్ని వేళ్ళకోసల్తో పైకెత్తుకున్నాడు. 

“మీ పాటలో ప్రేమా, విరహం రెండూ భలే పలుకుతున్నాయి ఖాన్ సాబ్!” అంటూ రాజు గారు పడక్కుర్చీలోనే నడుమెత్తుకుని కూర్చుని, “ మీ లాంటి కళాకారుడికి ప్రేమా, శృంగారమూ యెక్కువేనంటారు. మీ బీవీ పోయినప్పుడు మీ వయస్సు ముప్పయ్యి కి మించలేదని విన్నాను. అంత చిన్న వయసులో మీకంత కష్టం రాకూడదు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదా మీకు? మీ తల్లితండ్రులు పెళ్లి చేసుకోమని బలవంత పెట్టలేదా?” అని అడిగాడు.

రహీం ఖాన్  సాబ్ కాస్సేపు కళ్ళు మూసుకుని వుండిపోయాడు. ఆయన సుర్ మండల్ కూడా కాస్సేపు మూగబోయింది. హాల్లో నిశ్శబ్దం కాసేపు బరువుగా ఘనీభవించింది.

తర్వాత అప్పుడే విచ్చుకున్న  సీతాకొక చిలుక రెక్కల్లా, రహీం  ఖాన్ సాబ్ వేళ్ళు సుర్ మండల్ పైన మృదువుగా వాలాయి. వుదయపు మేఘాలపైకి పాకే సూర్య కిరణాల్లా సుర్ మండల్ నుంచీ సవ్వడులు చుట్టూ  పరుచుకోసాగాయి. తంత్రుల శృతిలో కలిసేటట్టుగా, “ రాగ్ కితనా ప్రఘాడ్ సే నికలా, వో దిల్ హీ జాన్ తా రాజా సాబ్! యే దిల్ కా మామ్లా హై. “ అన్నాడు రహీం ఖాన్   సాబ్.  తర్వాత  సుర్ మండల్లోంచీ చిత్రమైన శృతి ని లాగి, కాస్సేపు వాయించాక ఆపి  “ మేరా బీవీ మేరా పాస్ దస్ బరస్ రహా. మగర్ వుస్కా రాగ్ దస్ జనమ్ కోభీ జారీ హోగా “ అన్నాడు. విచారమూ, ఆనందమూ రెండూ ధ్వనించని ఆయన మాటల్ని వింటూ మూర్తి కళ్ళార్పడం సైతం మరచిపోయి చూడసాగాడు.

తనలోకి తొంగి చూసుకుంటున్నట్టుగా రహీం ఖాన్ సాబ్ ఆలాపన మళ్ళీ మొదలై, క్రమంగా అది “ క్యా కరూ సజనీ, ఆయే నా బాలమ్” అనే టుమ్రీ గా జాల్వారి, విరహపు కెరటాల్ని ప్రేమ సాగరం దాకా లాక్కెల్లింది.

పాట  బరువునిక మోయలేనన్నట్టుగా,  రహీం ఖాన్ సాబ్ స్వరమండల్ ను, పసిబిడ్డను వొడిలోంచీ తీసి వూయల్లో పడుకోబెట్టినంత సున్నితంగా, పరుపు పైకి చేర్చాడు. తల పైకెత్తకుండా , “ గాయక్ కా  వ్యక్తిత్వ ఆచ్ఛారెహనా రాజా సాబ్. వో సుశీల్ రెహనా, బ్రహ్మచర్య నిభానా,” అన్నాడు.

తర్వాత నీళ్ళల్లో తడిసిన నెమలి లా మెడ గుండ్రంగా తిప్పుతూ వొళ్లు విరుచుకుని, “అబ్ బహుత్ బూక్ లగ్తీ హై,” అన్నాడు. హాల్లోని వాళ్ళందరూ ముఖాలు చూసుకున్నారు. అర్ధరాత్రిని దాటిన రాత్రి కిటికీలోంచీ నిద్రకళ్లేసుకుని చూస్తోంది. వంటవాళ్ళు శుభ్రంగా కడిగిపెట్టేసి వెళ్ళిన పాత్రలు  ఘాటు మసాలా వాసనలతో యింకా హాలును   మోతెస్తున్నాయి. కాస్సేపు అందరినీ గమనించాక , “  అబ్  మై పఖాతా. పరోటా, బిర్యానీ, ముర్గీ, అబ్ ఖుశామత్  మేరీ బారీ హై,” అంటూ జూబ్బా చేతుల్ని పైకి మడుచుకోసాగాడు. “ డేగిశామే క్యా హై రే చో టూ? ఆటా కో లావో  రాంలాలాజీ. మసాలా కిదర్ హై రసూల్ బాయ్? కుమాసీ మే   కోయాలా డాలో పాగల్ జీ ,” అంటూ రహీం ఖాన్ తన పక్క వాయిద్యకారుల్ని తన వంటకు కూడా సహాయకులుగా  మార్చుకో సాగాడు.   

హాల్లోని వాళ్ళందరూ తమ పనుల్లో మునిగిపోయి తనను పట్టించుకోవడం లేదని మూర్తి గమనించేశాడు. తన యింట్లో తానే చొరబాటుదారుడయినట్టుంది. పొద్దున అత్తవారింట్లోనూ తనకిలాంటి సన్మానమే జరిగింది. గుబులూ, కోపామూ , చీకాకూ ముప్పిరిగొనడంతో మూర్తి మేడ పైన్నుంచీ కిందికి దిగి వచ్చేశాడు.

గుడ్డి వీధి దీపాల వెలుతురులో జోగుతున్న రోడ్డు అర్ధ రాత్రి దాటిపోయిందని చెప్తోంది. దీపాలార్పుకున్న యిండ్లు ముసుగులు కప్పుకుని నిద్రపోతున్న రోగుల్లాగున్నాయి. చాలా రోజులుగా మనుషులు నడయాడకపోవడంతో కిందిల్లు ధుమ్ము గొట్టుకుపోయివుంది. దుప్పటిని విదిలించి పడక పైన పడుకున్నాడు. కడుపులో పేగులు అరుస్తున్నాయి. కాళ్ళు ముడుచుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. యెంత సేపయినా నిద్ర రాలేదు. నిముషాలు గంటలై వేధించ సాగాయి.వంటింటిలో కొళాయి తిప్పితే నీళ్ళు యెర్రగా వచ్చాయి. సోఫా పైన కూర్చుని కళ్లుమూసుకున్నాడు. ఆ రోజతనికి రెండోసారి యేడుపు తన్నుకొచ్చింది. కాస్సేపు పచార్లు చేశాక నీరసంగా మిద్దె మెట్లెక్కాడు.

రాజుగారు స్టూలుపైనున్న గిన్నెలోని పదార్థాన్ని నెమరేస్తున్నట్టుగా నెమ్మదిగా తింటున్నాడు. రామ్ లాలా, పాగల్ దాస్, రసూల్ సాబ్ డబరా చుట్టూ కూర్చుని కుర్మాలో పరోటాలు ముంచుకుని తింటున్నారు. ఛోటా ఖాన్ సాబ్ యెడమచేత్తో అందరికీ వడ్డిస్తూ కుడిచేత్తో తింటున్నాడు. రహీం ఖాన్ సాబ్ ముందున్న గంగాళంలో దొంతరలావున్న పరోటాలు డజనైనా అయుంటాయి. అప్పటికి ఆయనెన్ని తిన్నాడో తెలియదు. పక్కనున్న డేగిసాలో గుమ్మడికాయంత పెద్దవైన కోడి శరీరపు శకలాలున్నాయి. మూర్తి కి కడుపులో దేవినట్టయింది.

“ఖాన్ సాబ్ చేయి పడితే చికెనుకు కూడా సంగీతమొస్తోంది మూర్తి గారూ.  రాత్రి యెనిమిది గంటలప్పుడు నేనయితే ముక్కులదాకా తిన్నాను. అయినా ఖాన్ సాబ్ వండింది రుచి చూడగానీ మళ్ళీ మా అందరికీ ఆకలి ముంచుకొచ్చేసింది. కానీ యేమిలాభం? మీ బ్రాహ్మణులకింత పసందైన భోజనం తినేందుకు రాసిపెట్టలేదు,” అంటూ రాజు గారు లొట్టలేశాడు. ఘాటు వాసనలు వీచగానే మూర్తి కి కడుపులో తిప్పసాగింది. గిరుక్కున వెనుదిరిగి మేడ దిగివచ్చేశాడు. కడుపుపైకి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. చాలాసేపు మూల్గుతూ వుండిపోయి చివరకెప్పుడో స్మారకం తప్పినట్టుగా నిద్రలోకి సోలిపోయాడు.

తెల్లవారి జామున మెలకువ రాగానే చన్నీళ్లతో గబ గబా స్నానం చేసి, దేవుడిముందో దీపం వెలిగించి, అరకిలోమీటరు దూరంలో వున్న వుడిపీ హోటలుకు పరిగెత్తుకొచ్చేశాడు మూర్తి. మొదటి కస్టమరుగా దొరికిన పలహారాన్ని ఆవురావురుమని తిని, కళ్ళల్లోంచీ వుబుకుతున్న కన్నీటిని అంగవస్త్రంతో తుడుచుకున్నాడు. కోదండరాముడి గుడి పుష్కరిణి దగ్గరికెళ్లి నీడలో మెట్లపైన కూర్చున్నాడు. తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు. బాగా యెండొచ్చిపడ్డాకగానీ మెలకువ రాలేదు. అప్పటికి రోడ్డుపైన వాహనాల రొద పెరిగిపోయివుంది. మళ్ళీ వుడిపీ హోటలుకొచ్చి, కాఫీ తాగి, కాళ్లీడ్చుకుంటూ యింటి కొచ్చాడు.

కిందింటి తాళమైనా తీయకుండా మేడపైకొచ్చాడు. అక్కడ వుదయపు పలహారాల విందు చివరిదశకొస్తోంది.

“అప్సరా నుంచీ వెజ్జూ,అలంకార్ నుంచీ నాన్ వెజ్జూ తెప్పించాను. మీ  భాగాన్ని మేమెవరూ తాకలేదు. మీరు నిర్భయంగా తినచ్చు,” అన్నాడు రాజుగారు అరిటాకులోని పొంగల్ ను యెర్రటి ద్రవంలో ముంచుకు తింటూ. రహీం ఖాన్ సాబ్ పరుపు ముందు  యెంగిలి గిన్నెలూ, ఖాళీ అయిన అరిటాకులూ చిన్న గుట్టలా పడివున్నాయి. అవతలిగదిలోకెళ్లి చేయి కడుక్కుని వచ్చిన రహీం ఖాన్ సాబ్ కిటికీ దగ్గర ఆగి బయటికి ఆసక్తిగా చూస్తున్నాడు.

రాజుగారు కుతూహలంగా పైకి లేచి కిటికీలోంచీ తొంగి చూశాడు. రోడ్డుపైన నీలిరంగు చీర కట్టుకున్న పడుచు పిల్లొకతి  వయ్యారంగా నడుస్తోంది. రెండు నిముషాలలాగే చూశాక, “భలే అందంగా వుంది గదా?” అంటూ రాజు గారు నవ్వేశాడు. రహీం ఖాన్ సాబ్ కూడా పెద్దగా పెదవుల్ని సాగదీసి నవ్వి, “తారే జైసే హై,” అన్నాడు.

ఆ అమ్మాయి రోడ్డు దాటి మాయమై పోయాక, “ బలవంతపు బ్రహ్మచర్యాన్ని గొప్పని పొగిడేవాళ్లు పరాయి ఆడదాన్ని అలా తినేసేలా చూడకూడదు ఖాన్ సాబ్,” అని రాజు గారు చిలిపిగా పరాచికమాడాడు.

రహీం ఖాన్  సాబ్  చిరునవ్వు నవ్వుతూనే పరుపుపైకొచ్చి కూర్చున్నాక, “ కిత్ నా ఖూబ్ సూరత్ హైనా వో నవ్ జవాన్ అవురత్! కిత్ నా అచ్ఛా చీజ్ బనాయా అల్లా నే! కిత్ నా హుందా హై! వుస్ కా చాలన్ బీ బడా నాజూక్ హైనా!” అన్నాడు. కాస్సేపు కళ్ళు మూసుకున్నాక, “  బాతో మే  బోల్నా ముషికిల్ హై. యే సునో,” అంటూ స్వర మండల్ మీటుతూ ఆలాపన మొదలెట్టాడు. అది కాసేపయ్యాక “చంద్ దే మోరా,” అంటూ ఖయాల్ గా వికసించింది. ఆయన పక్క వాయిద్యాలు పాలలో కలిసే తేనె లా అల్లుకున్నాయి.

రహీం ఖాన్ సాబ్ గొంతులోంచీ పుడుతున్న కామోద్ రాగం నాజూకుగా మొగ్గల్ని విప్పుకుంటూ, హొయలుగా అందాల్ని పరిమళిస్తూ, సొగసుగా శ్రోతల గొండెల్లోకి పాకి పోతోంది. పాటలొంచీ వుబుకుతున్న భావాలు మంచులా కమ్మి, కొండగాలిలా ముసురుకుని, మనసుల్ని జల్లుమనిపిస్తున్నాయి.

పడక్కుర్చీలోకి వాలడం మరచిపోయి నీలుక్కుని వుండిపోయిన రాజు గారు, ఖయాల్ ముగిశాకగూడా చాలాసేపు మౌనంగా వుండిపోయాడు. తర్వాత మత్తులోనే మునిగినవున్నవాడిలా ,” మీరేం పాడారో చెప్పలేనుగానీ మీరేం చెప్పదలచుకున్నారో అది మాత్రం నా కందినట్టే వుంది ఖాన్ సాబ్. యిప్పుడా అమ్మాయిని తలచుకుంటే అల్లాయే గుర్తుకొస్తున్నాడు,” అన్నాడు.

ఆయనకు సమాధానం చెప్పడానికి బదులుగా రహీం ఖాన్  సాబ్ ఆలాపనను ఆపినచోటే ఆరంభించి “ యాద్ పియా కె ఆయీ,” అంటూ మరో టుమ్రీ నందుకున్నాడు. తర్వాత “మహాదేవ మహేశ్వర ప్రభురంగా చీనీ” అంటూభూపాలి రాగం లో ఖయాల్ ను పట్టుకుని భక్తిలోకి దూకేసాడు.

“ యీ తీపిని  తట్టుకోలేను ఖాన్ సాబ్! మరో టుమ్రీ తో సేదదీరాల్సిందే,” అన్నాడు రాజుగారు తల వేగంగా తిప్పుతూ. ఆయన మాటలకు ప్రతిధ్వనిస్తున్నట్టుగా రహీం ఖాన్ సాబ్  “తోరి తిరిచీ నజారియాకి బాణ్ కరెజివా మే లాగే కటార్,” అంటూ మరో టు మ్రీ ని లాలించాడు. తర్వాత, “ బినతీ కా  కరియే,” అని జయ జయవంతి లో ఆ తరువాత “మందిర్ దేఖ్ డరే సుధామా,” అంటూ మాల్ కౌన్స్ లో ఖయ్యాల్లు కొనసాగించాడు.

ప్రేమా, విరహమూ, బాధా, కోపామూ, ఆర్ద్రతా, ఆపేక్షా, భక్తీ, అన్నీ కలగలసి, యేడు రంగులు కలసిన నిసర్గం గా మారి హృదయాల చుట్టూ కెరటాల్ని మోహరించింది. లేత తీగలా యెటువంచితే అటు వంగుతున్న రహీం ఖాన్ సాబ్ స్వరం వూహించకముందే రాగాల్ని పెనవేసుకుని వేగంగా తాన్ లను విసురుతూ భావ తీవ్రతల్ని రేకెత్తసాగింది.

కాలాన్నలా తనకిష్టం  వచ్చినంత సేపు ఆపేశాక, సుర్ మండల్ కు విశ్రాంతి నివ్వడం కోసమన్నట్టుగా ఖాన్ సాబ్ కాస్సేపు తలగడపైకి వొరిగాడు.

హాల్లోకొచ్చిన పిల్లిపిల్ల గిన్నెల్ని కదిలించడంతో మూర్తి వులిక్కిపడ్డాడు. రోడ్డుపైన వెళ్తున్న లారీ బిగ్గరగా హారను మోగించింది. కిటికీ బయట నడినెత్తిపైకి వచ్చిన యెండ ధగ ధగ లాడుతోంది.  

తన బావమరిది యింటి దాకా వచ్చి, మసాలా వాసనలు తగలగానే, అటే తిరిగి వెళ్ళిపోయాడేమోనన్న ఆలోచన రాగానే మూర్తి గబాలున లేచి  నిల్చున్నాడు. అదే గనుక జరిగుంటే అతగాడు వెళ్తూనే అగ్గిలా మండుతున్న భార్య కోపంలోకి బిందెడు నెయ్యి కుమ్మరించివుంటాడు. యీ జన్మలో తన భార్యా పిల్లలు తన కంట బడకుండా అడ్డుగోడలు కట్టేస్తాడు.

అప్పుడప్పుడూ కిందికెళ్లి యెవరైనా వచ్చారేమో చూసిరావడం క్షేమమని అనుకుంటూ హాల్లోనుంచీ బయటికొచ్చి కిందికేళ్లే మెట్ల దగ్గరికొచ్చాడు మూర్తి . మూడు మెట్ల కింది మెట్టు పైన వెనక్కుతిరిగి కూర్చున్నవ్యక్తిని చూడగానే చటుక్కున ఆగిపోయాడు. అతడి గుండె దడ దడా కొట్టుకోసాగింది.ముందుకేసిన అడుగును వెనక్కు లాక్కుని వొక దూకుతో హాల్లోకొచ్చి గోడకు చేరగిల బడ్డాడు. గుప్పున చెమటలు పోయడం తో మూర్తి నిలువెల్లా తడిసిపోయాడు.

రహీం ఖాన్ సాబ్ కు అలసటన్నదే వున్నట్టు లేదు. తోడినకొద్దీ వూరే చలిచెలమలా ఆయన గొంతులోంచీ ఖయ్యాళ్లూ  బందిష్ లూ, టుమ్రీ లూ వొకదాని వెనక  వొకటిగా , ఆగకుండా  పుట్టుకొస్తూనే వున్నాయి.

శరీరాన్ని లుంగలు చుట్టుకుని పొంగుకొస్తున్న బాధనణచుకోడానికి మూర్తి సతమతమవ సాగాడు. తన భార్య యెంతసేపటి క్రితం యింటికొచ్చిందో, యెంతసేపటినుంచీ ఆ మెట్టు పైన కూర్చుని యెదురు చూస్తూందో తెలియదు. యింటి తాళాలు ఆమె దగ్గారా వుండొచ్చు నని తెలుసుగానీ ,యిలా ఆకస్మికంగా వస్తుందని అనుకోలేదు. పిల్లలు యింటిలోపలున్నారో లేదో? యీసారి శాశ్వతంగా తెగతెంపులు చేసుకుపోయేటందుకు వచ్చిందేమో!  యీ వాసనలను తట్టుకోలేక అక్కడే ఆగిపోయిందేమో! ఆ కూర్చున్నతీరు ఆమెకెంత జుగుప్సగావుందో చెప్పేస్తోంది. యింతవరకూ అందరికీ తెలిసీ తెలియకుండా వున్న విషయాలు మరికాస్సేపటిలో తుఫానులా  చెలరేగ బోతున్నాయి. తన జీవితంలో మర్యాదగా బతికిన చివరి రోజిదే గావచ్చు. తన సంగతి తెలిస్తే రాజు గారు   వేళాకోళంచేసి, వెక్కిరించి వెళ్ళిపోతాడు. రహీం ఖాన్ సాబ్ జీవితంలో తనను మన్నించడు.  యిక తాను బతికినా, చచ్చినా వొకటే! మూర్తి కళ్ళలోంచీ నీళ్ళు ధారగా కారసాగాయి.

“నైనా మోరే తరస్ గయే ఆజా బాలం పరదేశ్,” “తుమ్రీ నైనా మోరీ తబస్ రహే” “బాజూ బంద్ ఖుల్ ఖుల్”…  రహీం ఖాన్  సాబ్ పాటలవరద ఆగడం లేదు. “దేహతా శరణాగతా,” “ దిల్ రుబా మధురహా” , నారాయణ నారాయణ నామ తుఝే అతి పావన” అంటూ ఆయన తన నాట్య గీతాలనూ పాడసాగాడు. ఆయన గానం లో పవలూ, రాత్రీ, వుదయమూ లాంటి తేడాలేమీ లేని కాలమొకటి అంతటా పరుచుకోసాగింది.  సారంగి, తబ్లా , హార్మోనియం, తంబురా వాయిస్తున్నవాళ్ళకు  వాయించేకొద్దీ శక్తి పెరుగుతున్నట్టే వుంది. అలలు విసిరికొడితే వొడ్డుపైకొచ్చిపడి విల విలా కొట్టుకుంటున్న చేపపిల్లలా మూర్తి కొట్టుమిట్టాడ సాగాడు. నిద్రకూ, మెలకువకూ చెందని స్థితిలో కూరుకు పోయాడు.

హాల్లోని రాగ ప్రపంచంలో శృతి మారినట్టు తెలియగానే, మూర్తి గబుక్కున కళ్ళు తెరిచాడు. పడకకుర్చీలో రాజు గారు విల్లులా వెనక్కు తిరిగి చూస్తున్నాడు. ఛోటా ఖాన్ సాబ్ హాలు ద్వారం దగ్గర నిలబడి, చేతులూపుతూ సైగలు చేస్తున్నాడు. తల్లి పిలుపు వినగానే లేచి పరిగెత్తే  గోవులా రహీం ఖాన్ సాబ్ పైకి లేచి ద్వారం దాటి అవతలి కెళ్తున్నాడు.

అంతా అయిపోయింది, తన కథ ముగింపు కొచ్చేసిందనుకున్నాడు మూర్తి. సందేహిస్తూ కాస్సేపు కదలకుండా వుండిపోయాడు. తరువాతెవరో తరిమినట్టుగా సుడిగాలిలా గుమ్మం దాటి మెట్ల దగ్గరికొచ్చాడు.

రహీం  ఖాన్ సాబ్ అప్పటికి మూడు మెట్లు కిందికి దిగేసి వున్నాడు. ఆ మెట్టు కింది మెట్టు పైన కూర్చున్న లక్ష్మి  అలాగే వొంగి ఆయన పాదాల ముందు మోకరిల్లుతోంది.

“తుమ్ కబ్ అయీ బేటీ! యహా కైకో రుక్ గయీ  ?” అంటూ రహీం  ఖాన్ సాబ్ ఆమె భుజాన్ని పట్టి పైకి లేపాడు.

రహీం ఖాన్ సాబ్ కనబడగానే లక్ష్మి అలా ఆయన పాదాలపైకి వాలుతుందని గానీ, చూడగానే ఆయన లక్ష్మిని తన భార్యఅని అంత సులభంగా గుర్తు పట్టేస్తాడనిగానీ, మూర్తి వూహించలేకపోయాడు. కిందింటిలోంచీ బయటి కొచ్చిన ముగ్గురు పిల్లలు మెట్లకిందే ఆగిపోయారు. “బచ్చే బీ ఆగయా. వుస్సే బీ మిల్నే దో,” అంటూ రహీం ఖాన్ సాబ్ చక చకా మెట్లు దిగ సాగాడు.ఆయన వెంటే లక్ష్మీ, ఆమె వెంట ఛోటా ఖాన్ సాబ్, రామ్ లాలా, రసూల్, పాగల్ దాస్ కదిలారు.

వాళ్ళందరూ కింది యింట్లోకెళ్లిపోయాక మూర్తి   స్తంభం లా నిలబడి అవాక్కయిపోయి వుండిపోయాడు. కాస్సేపయ్యాక కిందేమి జరుగుతూందోనని కంగారూ పడుతూ గబ గబా మెట్లు దిగి , బెంబేలు పడుతూ హాల్లోకి తొంగి చూశాడు.

ముగ్గురు కూర్చునే సోఫా పైన యిద్దరి చోటు నాక్రమించుకుని కూర్చున్న రహీం ఖాన్ సాబ్ ముగ్గురు పిల్లల  భుజాలపైన రెండుచేతుల్ని సాచి పట్టుకుని పాదుషాలా కొలువు తీరి వున్నాడు. నలుగురు పక్కవాయిద్యకారులు ఆయన సైనికుల్లా చుట్టూ నిలబడి వున్నారు.

లోపలినుంచీ లక్ష్మి పెద్ద తట్టలో అరిసెలు తీసుకొచ్చి టీపాయ్ పైన పెట్టింది. క్షణంలో వొక అరిసెను తినేశాక  “బహుత్ అచ్చా హై బేటీ!” అంటూ రహీం ఖాన్ సాబ్ పళ్ళాన్ని మిగిలిన వాళ్ళ వైపు జరిపాడు. వాళ్ళు   సందేహిస్తూ వొకదాన్ని తినేలోపల వొకదానివెంట వొకటిగా అరచేయి వెడల్పున్న అరిసె లన్నింటినీ నమిలీ నమలకుండా బొక్కేశాడు. లక్ష్మి లోపలికెళ్లి మరికొన్ని తెచ్చి పళ్ళెంలో పెట్టింది.                                                                                                                                     

తన భీముడి భాగాన్ని తినేశాక, చెంబుడు మజ్జిగ తాగి బ్రేవుమని త్రేంచుతూ “ బహుత్  స్వాద్ హై బేటీ! జుగ్ జుగ్ జియో,” అన్నాడు రహీం ఖాన్ సాబ్.  మూర్తి కేసి తిరిగి బుగ్గలు సాగేలా నవ్వి, “ ఖానా బనానా మే బీ శృతి హోతా బేటా! తుం బహుత్ కిస్మత్ వాలా! “ అని మెచ్చుకున్నాడు.

తరువాత పైకి లేచి , లక్ష్మినీ మూర్తినీ మార్చి మార్చి చూసి,” దేఖో, తుమ్ దోనో కితనా  బీమార్ హో!” అన్నాక కాస్సేపాగి, “ బేటీ బహుత్ దిన్ కె బాద్ ఆయీ హైనా? తుం యిదరీచ్ రహో. హమ్ జాతే,” అని పిల్లలు ముగ్గురి తలల పైన అరిచేయి పెట్టి “జుగ్  జుగ్  జియో,” అని ఆశీర్వదించాడు.    

రహీం ఖాన్ సాబ్ తో బాటూ ఆయన పరివారమూ చప్పుడు చేయకుండా మేడపైకెళ్లిపోయారు                                                                                                             

మూర్తి భార్యా పిల్లలకేసి బితుకు బితుకుమని చూస్తూ సోఫాదగ్గరికెళ్లి వొదిగొదిగి కూర్చున్నాడు. అతడ్ని బయంగా చూస్తూ పిల్లలు లోపలికి జారుకున్నారు. లక్ష్మి పళ్ళెం లో ఫలహారం తీసుకొచ్చి అతడి ముందు టీపాయ్ పైనుంచింది.

మూర్తి యెద పైకివాలిపోయిన తలను పైకెత్తలేకపోయాడు. “తప్పు చేశాను. తప్పు జరిగిపోయింది,” అతడి గొణుగుడు అతడి గొంతు దాటి బయటికి రాలేక పోతోంది.

“తప్పు నాదే,”  లక్ష్మి మాటలు మాత్రం స్పష్టంగా వెలువడ్డాయి. “ ఆయన పాట నన్ను నిలదీశాక గానీ నాకు తెలియలేదు.”

మూర్తి చివ్వున తల పైకెత్తి, “ ఆయనది హిందూస్తానీ. అది ఖయ్యాల్. టుమ్రీ .బందిష్. రాగ్ కామోద్. మల్హార్,” అని ఆశ్చర్యంగా పలవరించాడు.

“యేమో! యేది కర్ణాటకో, యేది హిందుస్తానీనో, నాకేం తెలుసు?… యీ యింటికొచ్చాక కొంతలో కొంతయినా  నేను నేర్చుకున్నది సంగీతాన్ని వినడమే గదా!  ఆపాటలో పలుకుతోంది ఆడో, మగో, అదీ తెలియదు… అయితే వాళ్ళు పడుతున్న బాధలో, ఆ పరవశం లో వున్నదేదో నాలో లేదని మాత్రం తెలిసింది… ఆ   కొరతేదో నాలోవున్నందుకే… యిలా …”

లక్ష్మి అంత స్పష్టంగా మాట్లాడగలదని తనకు తెలియదు. ఆమె వల్ల కొరతుందనే తాను మరో వ్యక్తికి చేరువయ్యాడా? మరి తన వల్ల కొరతుంటే ఆమేం చెయ్యాలి? తన వల్ల భువనేశ్వరికి మాత్రం కొరతుండదా? కొరతన్నది యెవరిలో యెంతుంది?

“ఆ మాంసాలూ,  ఆ  తాగుడూ లేకుండా ఆయనకు పూట గడవదు.అందుకే ఆయన్ని యిక్కడికి రానివ్వకుండా వేరే యెక్కడైనా బస యేర్పాటు చేయడానికి శతవిధాలా ప్రయత్నించాను. కానీ యీ రాజు గారు,…” మూర్తి గొంతులోని యేడుపు జీర చెదరని సుర్ మండల్ శృతినాదంలా పలుకుతోంది.

“ అక్కడినుంచీ మీరొచ్చేశాకే తాడో పేడో తేల్చుకోక తప్పదని తెలిసింది… చివరి సారిగా నిలదీసి అడగి వెళ్లాలనే వచ్చాను… ఆ వాసన తగలగానే కోపంతో జాడించి పారేయాలనే పైకొచ్చాను… అయితే రెండు మెట్లెక్కగానే…ఆ గొంతు… ఆ పాట నన్ను నిలేసింది. నా ముక్కుల్ని నా చెవులు నొక్కేసాయి. ఆ స్వరం… ఆ గానం… ఆయనకే అంత అందంగా… యెలావచ్చాయి? ఆయన..మామూలు మనిషి కాడు… ఆయన మన యింటి గడప తొక్కడమే మన భాగ్యం..”

మూర్తి ఆమెను కళ్ళార్పకుండా చూడ సాగాడు. లక్ష్మి అరమోడ్పు కళ్లతో కలలో పలవరిస్తున్నటుగా మాట్లాడుతోంది.

మేడపైన్నుంచీ రహీం  ఖాన్ సాబ్ గొంతు  చల్లగా , మృదువుగా దర్బారీ కానడ రాగాన్ని చిలుకుతోంది. మాటలకూ, శబ్దాలకూ  మించినదేదో పన్నీరులా చిలకరించ బడుతోంది.

యింట్లోకి భార్యా పిల్లలు వచ్చాక రహీం  ఖాన్ సాబ్ పాట హాయిగా తనలోకి ప్రవహిస్తున్నట్టుగా మూర్తి కనిపించ సాగింది.

మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కథా రచయిత. కుంభ మేళా, అస్తిత్వానికి అటూ ఇటూ, వెదురు పువ్వు,, రెండేళ్ల పధ్నాలుగు మొదలైన కథా సంకలనాలతో పాటు 'కొండకింద కొత్తూరు', 'భూచక్రం', మనోధర్మ పరాగం వంటి నవలలు వెలువరించారు. 'మనోధర్మ పరాగం' నవలకి 'ఆటా' బహుమతి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *