మనిషి అడుగులెమ్మటి డబ్బు
వేల కాళ్ళేసుకొని నడిచొస్తుంది
మనిషి నీడలెమ్మటి డబ్బు
ఈ.ఎమ్.ఐలుగా వెంటపడుతుంది
మనిషి ఊపిరి వెంట డబ్బు
తెల్లటి బిల్లుకాగితాలై
వెంటాడుతుంది
చివరికి చావు పాడే మీదికెక్కి
మనుషుల్ని వెక్కిరిస్తూ ఊరేగుతుంది.
ఈ మధ్య
మనుషులు మనుషులుగా కంటే
ప్రింట్ అవుట్ లోంచి బయటకొచ్చిన నోట్లలా
మెరుస్తూనే ఎక్కువ కనిపిస్తున్నారు.
ఎటు నడిస్తే అటుగా ఏ.టి.యం కార్డులు
చిన్నపిల్లల్లా నడిచొస్తున్నాయి
ఎటు కదిలిస్తే అటుగా డబ్బు
స్కానర్ లోంచి గొంతువిప్పి మాట్లాడుతుంది.
మాటకు మాటకు మధ్య
రేట్లు అడ్డుపడుతున్న కాలమిది
మనిషికి మనిషికి మధ్య
డబ్బుకట్టలే నిలబడుతున్న సందర్భాలివి!.
ఇక్కడ రూపాయ బిల్లలే
కనపడని కత్తులుగా పూతపోసుకుంటున్నాయి.
పైసలు చెట్లు ఇంట్లో కంటే
మనుషుల హృదయాల్లోనే
ఎక్కువ పెరుగుతున్నాయి!.
మనిషి డబ్బును వెతకడం కంటే
డబ్బే మనిషిని వెతకడం
నాకెందుకో భయమేస్తుంది.
ఏం చేయ్యగలను
ప్రతిదీ డబ్భై కూస్తునప్పుడూ
నాకేమో మనిషి పరిమళం ఇష్టం
ఇక్కడేమో కాగితాల వాసనకొడుతోంది.
అసలూ ఈ డబ్బు ఎద మీద నడుస్తున్న లోకానికి మనిషి ఎద చప్పుడెట్ల వినిపించను!.
నోట్లను చూసినప్పుడల్లా
మనుషులు గుర్తొచ్చేలా
ఎట్లాంటి మనిషిలోగో తయారు చెయ్యను..

ఆఖరి వాక్యం బావుంది.